కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితంలో మీ సంకల్పమేమిటి?

జీవితంలో మీ సంకల్పమేమిటి?

జీవితంలో మీ సంకల్పమేమిటి?

కె న్నీ ఒక కమీషన్‌ వ్యాపార సంస్థలో ఉద్యోగి, ఆయన ఖరీదైన విదేశీ కారులో తిరుగుతాడు, పెద్ద నగరంలోని సంపన్నుల కాలనీలో ఆయనకు ఒక అపార్ట్‌మెంట్‌ కూడా ఉంది. అనుభవజ్ఞుడైన స్కైడైవర్‌గా ఆకాశంలో వేల అడుగుల ఎత్తునుండి కిందకు దూకే అనుభూతిని పొందడమంటే ఆయనకు మహాసరదా. అయితే ఇవన్నీ ఆయనకు సంతృప్తికరమైన జీవితాన్నిచ్చాయా? ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రకారం, ఆయనిలా అన్నాడు: “నాకిప్పుడు 45 సంవత్సరాలు, అయినా భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉంది . . . నా జీవితం శూన్యంగా ఉంది.”

ఎలన్‌ మంచి నైపుణ్యంగల ఐస్‌ స్కేటర్‌ అవడానికి ఎంతో సాధన చేసింది. చివరికామె మంచి ఐస్‌ స్కేటర్‌ అని పేరు తెచ్చుకుంది. ఎలన్‌ తాను కోరుకున్న పేరుప్రతిష్టలు సంపాదించుకుంది. “కానీ నాకు దక్కాల్సిన ఆ సంతోషమంతా ఏమైంది? నేను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించాను. చివరకు నేను ముసలిదాన్నైపోతాను, నాకు ఆర్థిక భద్రతవున్నా, జీవితంలో ఉన్నదంతా నిజంగా ఇదే అయితే జీవితం శూన్యమే” అని ఆమె బాధపడింది.

వర్ణచిత్రాలు వేయడంలో ఆరితేరిన హీడియో, కళాఖండాలను సృష్టించేందుకే తన జీవితాన్ని ధారపోశాడు. ఆయన తన కళాఖండాలను అమ్మలేదు; అలాచేస్తే తన కళా ప్రమాణాలను, సూత్రాలను తగ్గించుకున్నట్లే అవుతుందని భావించాడు. ఆయన తన 98 సంవత్సరాల జీవిత చరమాంకంలో తన కళాఖండాల్లో చాలావాటిని ఒక వస్తుప్రదర్శనశాలకు ఇచ్చేశాడు. ఆయన కళాఖండాలను సృష్టించడానికే తన జీవితాన్ని అంకితం చేశాడు. అయినా ఆయన, తన కళలో ఎన్నటికీ పరిపూర్ణతను సాధించలేననే ఆలోచనతో అసంతృప్తికి లోనయ్యాడు.

ఇతరులకు సహాయం చేయడానికి కొంతమంది ఎంతో కృషి చేస్తారు. హాలీవుడ్‌లోని ఒక కార్యనిర్వాహకుడి ఉదాహరణనే తీసుకోండి. అమెరికాలోని ఓ పెద్ద సినిమా కంపెనీలో ఉపాధ్యక్షునిగా ఆయనెప్పుడూ సినీ ప్రముఖులతో ఉంటూ, ఖరీదైన, విలాసవంతమైన భవంతులున్న ప్రాంతంలో నివసించేవాడు. సెలవుల్లో ఆయనొకసారి కంబోడియాకు వెళ్లాడు. ఆయన ఫోనామ్‌ ఫెన్‌లోని ఒక హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్లినప్పుడు ఒకమ్మాయి డబ్బులు అడుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన ఆ అమ్మాయికి ఒక డాలరిచ్చి, కూల్‌ డ్రింక్‌ కొనిచ్చాడు. ఆ అమ్మాయి చాలా సంతోషించింది. కానీ మరుసటి రోజు రాత్రి ఆ అమ్మాయి ఇంకా అక్కడే అడుక్కుంటూ ఉండడం కనిపించింది. పైపై సహాయం మాత్రమే సరిపోదని ఆయన గ్రహించాడు.

ఒక సంవత్సరం తర్వాత ఈ కార్యనిర్వాహకుడు, సినీ పరిశ్రమలో పనిచేయకుండా, కంబోడియాలోని పేదవారికి సహాయం చేసేందుకు తన వృత్తినే మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వసతి, ఆహారం, విద్య మొదలైన అవసరాలను తీర్చే ఒక పాఠశాలను ప్రారంభించాడు. అయితే, ఆయన భిన్నావేశాల మధ్య నిరంతరం నలిగిపోతున్నాడు, అంటే ఆయనకు ఒకవైపు తాను సాధిస్తున్నవాటినిబట్టి సంతోషం, సంతృప్తి కలుగుతున్నాయి, మరోవైపు తాను వ్యవహరించాల్సిన సమస్యలు అంతకంతకూ అధికమౌతున్న కారణంగా నిరాశా, నిస్పృహలతో సతమతమౌతున్నాడు.

ఇప్పుడు ప్రస్తావించబడిన ఈ నలుగురూ, తాము దేనికోసం జీవిస్తున్నామో తమకు తెలుసనుకున్నారు. అయితే, ఎంతో కష్టపడి తామనుకున్నది సాధించినా, అది సంతృప్తినివ్వడం లేదని వారికనిపించింది. మరి మీరు దేనికోసం జీవిస్తున్నారు? జీవితంలో మీకు ప్రాముఖ్యమైనది ఏమిటి? మీరిప్పుడు జీవిస్తున్న పద్ధతినిబట్టి ఆ తర్వాత బాధపడరని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?