కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లూకా ప్రియమైన జతపనివాడు

లూకా ప్రియమైన జతపనివాడు

లూకా ప్రియమైన జతపనివాడు

అపొస్తలుడైన పౌలు సా.శ. 65వ సంవత్సరంలో తన విశ్వాసం కారణంగా రోమ్‌ నగరంలో న్యాయవిచారణ చేయబడుతున్నాడు. తాను పౌలు స్నేహితుణ్ణని చెప్పుకోవడం ప్రమాదకరమని లూకాకు తెలుసు. పౌలుకు మరణశిక్ష పడే అవకాశముంది. అయినా ఆ అపాయకరమైన సమయంలో లూకా మాత్రమే అపొస్తలుడైన పౌలుతో ఉన్నాడు.—2 తిమోతి 4:6, 11.

బైబిలు పాఠకులకు లూకా సుపరిచితుడు, ఎందుకంటే ఆయన రాసిన సువార్త పుస్తకం ఆయన పేరుమీదే ఉంది. లూకా పౌలుతో సుదూర ప్రయాణాలు చేశాడు, పౌలు ఆయనను “ప్రియుడైన వైద్యుడు” అనీ, ‘జతపనివాడు’ అనీ పిలిచాడు. (కొలొస్సయులు 4:14; ఫిలేమోను 23, 24) లూకా గురించి లేఖనాల్లో ఎక్కువ వివరాలు లేవు, ఆయన పేరు కేవలం మూడుసార్లే పేర్కొనబడింది. లూకా గురించిన పరిశోధనలో వెలుగులోకి వచ్చిన వివరాలను మీరు పరిశీలిస్తుండగా, విశ్వాసపాత్రుడైన ఈ క్రైస్తవునిపట్ల మీ మనసులో కూడా పౌలుకున్నలాంటి గౌరవభావమే ఏర్పడుతుంది.

రచయిత, మిషనరీ

లూకా సువార్తలాగే అపొస్తలుల కార్యముల పుస్తకం కూడా థెయొఫిలను ఉద్దేశించే రాయబడింది కాబట్టి, దైవ ప్రేరేపితమైన ఆ రెండింటినీ లూకాయే రాశాడనే నిర్ధారణకు రావచ్చు. (లూకా 1:1-3; అపొస్తలుల కార్యములు 1:1) యేసుక్రీస్తు పరిచర్యను తాను ప్రత్యక్షంగా చూశానని లూకా చెప్పుకోలేదు. బదులుగా, తాను ప్రత్యక్ష సాక్షుల నుండి వివరాలను సేకరించాననీ, ‘మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొన్నాననీ’ ఆయన చెప్పాడు. (లూకా 1:1-3) కాబట్టి లూకా బహుశా సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత క్రీస్తు అనుచరుడై ఉండవచ్చు.

లూకా సిరియాలోని అంతియొకయవాడని కొందరు అనుకుంటారు. అక్కడ జరిగిన విషయాల గురించి అపొస్తలుల కార్యములలో రాయబడిందనీ, “మంచిపేరు పొందిన యేడుగురు” వ్యక్తుల్లో ఆరుగురు నివసించే నగరాల గురించి ఏమీ రాయబడకపోయినా ఒకరి గురించి మాత్రం “మతప్రవిష్టుడును అంతియొకయవాడును” అని ప్రత్యేకంగా పేర్కొనబడింది అనీ వారు అంటారు. అయితే, అంతియొకయ ప్రత్యేకంగా పేర్కొనబడింది కాబట్టి, అది లూకా సొంత ఊరని చెప్పడానికి వీల్లేదు.—అపొస్తలుల కార్యములు 6:3-6.

అపొస్తలుల కార్యములలో ఎక్కడా లూకా పేరు కనిపించకపోయినా కొన్ని వచనాల్లో ఉపయోగించబడిన “మేము” “మా” “మనము” అనే సర్వనామాలు, ఆ పుస్తకంలో వర్ణించబడిన కొన్ని సంఘటనల్లో ఆయన పాల్గొన్నాడని చూపిస్తున్నాయి. పౌలు, ఆయన సహచరులు ఆసియా మైనరుగుండా వెళ్లిన దారి గురించి చెబుతున్నప్పుడు లూకా ఇలా అన్నాడు: “వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.” అక్కడే పౌలు ఒక దర్శనాన్ని చూశాడు, అందులో మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి ఆయనను ఇలా వేడుకున్నాడు: “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుము.” ఆ వృత్తాంతాన్ని లూకా ఇలా కొనసాగిస్తున్నాడు: “అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు . . . మేము . . . వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి.” (అపొస్తలుల కార్యములు 16:8-10) “వారు” అనే పదాన్ని కాక “మేము” అనే పదాన్ని ఉపయోగించడాన్నిబట్టి, లూకా త్రోయలో పౌలును, ఆయన తోటివారిని కలుసుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత లూకా తాను కూడా వారితోపాటు ప్రకటనాపనిలో భాగం వహించానని సూచిస్తూ ఫిలిప్పీలో జరిగిన ప్రకటనాపనిని ఉత్తమ పురుషలో వర్ణించాడు. “విశ్రాంతిదినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి” అని ఆయన రాశాడు. తత్ఫలితంగా లూదియ, ఆమె ఇంటివారందరూ సువార్తను అంగీకరించి, బాప్తిస్మం తీసుకున్నారు.—అపొస్తలుల కార్యములు 16:11-15.

ఫిలిప్పీలో పౌలు, “(పుతోను అను) దయ్యము” ప్రభావంతో సోదె చెబుతున్న ఒక పనిపిల్లను బాగుచేయడంతో వారికక్కడ వ్యతిరేకత ఎదురయ్యింది. తమకు లాభం తెచ్చిపెట్టే మార్గం ఇకలేదని యజమానులు గ్రహించినప్పుడు వారు పౌలును, సీలను పట్టుకుని కొట్టి చెరసాలలో వేయించారు. లూకా బహుశా బంధించబడలేదు అనిపిస్తోంది ఎందుకంటే తన సహచరులు విచారించబడడాన్ని తాను చూసినట్లుగా రాశాడు గానీ తాను కూడా విచారించబడుతున్నట్లుగా రాయలేదు. వారు విడుదల చేయబడిన తర్వాత ‘వారు [పౌలు, సీల] సహోదరులను ఆదరించి బయలుదేరి పోయిరి.’ పౌలు కొంతకాలానికి ఫిలిప్పీకి తిరిగి వచ్చిన తర్వాతే లూకా మళ్లీ ఉత్తమ పురుషలో రాయడం మొదలుపెట్టాడు. (అపొస్తలుల కార్యములు 16:16-40; 20:5, 6) ఫిలిప్పీలో పనిని పర్యవేక్షించడానికి లూకా బహుశా అక్కడే ఉండిపోయుంటాడు.

వివరాలను సేకరించడం

లూకా తన సువార్త పుస్తకం కోసం, అపొస్తలుల కార్యముల పుస్తకం కోసం వివరాలను ఎలా సేకరించాడు? అపొస్తలుల కార్యములలో లూకా తాను ప్రత్యక్షంగా చూసి, పాల్గొన్న విషయాలు రాసిన భాగాల నుండి, ఆయన పౌలుతో ఫిలిప్పీ నుండి యెరూషలేముకు వెళ్లాడని మనం తెలుసుకుంటాం. అక్కడే పౌలు మళ్లీ బంధించబడ్డాడు. మధ్యదారిలో పౌలు, ఆయనతోటివారు కైసరయలోవున్న సువార్తికుడైన ఫిలిప్పు ఇంట్లో ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 20:6; 21:1-17) లూకా తన వృత్తాంతం కోసం సమరయలో జరిగిన తొలి మిషనరీ కార్యాకలాపాల గురించి, అక్కడి ప్రచార పనిని ముందుకు సాగించిన ఫిలిప్పును అడిగి తెలుసుకుని ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 8:4-25) కానీ లూకా ఇంకా ఎవరి దగ్గరినుండి సమాచారాన్ని సేకరించి ఉండవచ్చు?

పౌలు కైసరయలో ఖైదీగా గడిపిన రెండు సంవత్సరాల్లో లూకాకు తన సువార్త కోసం పరిశోధనచేసే అవకాశం లభించివుండవచ్చు. యెరూషలేము అక్కడికి దగ్గర్లోనే ఉంది కాబట్టి ఆయన యేసు వంశావళుల వివరాలను సేకరించవచ్చు. యేసు జీవితానికి, పరిచర్యకు సంబంధించి లూకా రాసిన అనేక సంఘటనలు లూకా సువార్తలో తప్ప మిగతా సువార్తల్లో కనిపించవు. ఒక విద్వాంసుడు అలాంటివాటిని కనీసం 82 పేర్కొన్నాడు.

బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టుక గురించి ఆయన బహుశా యోహాను తల్లి ఎలీజబెతును అడిగి తెలుసుకుని ఉండవచ్చు. యేసు పుట్టుక గురించిన, బాల్యం గురించిన వివరాలను బహుశా యేసు తల్లియైన మరియ నుండి సేకరించివుండవచ్చు. (లూకా 1:5-80) అద్భుతంగా చేపలు పట్టిన ఉదంతం గురించి లూకాకు బహుశా పేతురు, యాకోబు లేదా యోహాను చెప్పివుండవచ్చు. (లూకా 5:4-10) కేవలం లూకా సువార్తలోనే మనం యేసు చెప్పిన మంచి సమరయుడు, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడడం, పోగొట్టుకున్న నాణెము, తప్పిపోయిన కుమారుడు, ధనవంతుడు మరియు లాజరు లాంటి కొన్ని ఉపమానాల గురించి తెలుసుకుంటాము.—లూకా 10:29-37; 13:23, 24; 15:8-32; 16:19-31.

లూకా ప్రజలపట్ల ఎంతో శ్రద్ధ కనబరిచాడు. మరియ శుద్ధీకరణ కోసం చేసిన అర్పణ గురించి, ఒక విధవరాలి కొడుకు పునరుత్థానం గురించి, యేసు పాదాలపై ఒక స్త్రీ అత్తరు పోయడం గురించి ఆయన రాశాడు. క్రీస్తుకు పరిచారము చేసిన స్త్రీల పేర్లను, మార్త మరియలు ఆయనకు ఆతిథ్యం ఇచ్చేవారని లూకా ప్రస్తావించాడు. నడుము వంగిపోయిన స్త్రీని, జలోదర రోగమున్న ఒక వ్యక్తిని, పదిమంది కుష్ఠురోగులను బాగుచేయడం గురించి లూకా సువార్త చెబుతోంది. యేసును చక్కగా చూడడానికని చెట్టుపైకి ఎక్కిన పొట్టివాడైన జక్కయ్య గురించి, క్రీస్తు పక్కనే వ్రేలాడదీయబడిన నేరస్థుడు చూపించిన పశ్చాత్తప్త వైఖరి గురించి లూకానే వివరించాడు.—లూకా 2:24; 7:11-17, 36-50; 8:2, 3; 10:38-42; 13:10-17; 14:1-6; 17:11-19; 19:1-10; 23:39-43.

యేసు ఉపమానంలోని మంచి సమరయుడు దెబ్బలను నయం చేయడానికి కట్టుకట్టడాన్ని గురించి లూకా సువార్త ప్రస్తావించడం గమనార్హం. బహుశా ఇలాంటి విషయాలపట్ల ఒక వైద్యునికుండే ఆసక్తివల్లనే, పుండు కుళ్లకుండా ద్రాక్షారసాన్ని, ఉపశమనాన్ని కలుగజేసే నూనెను పోసి కట్టుకట్టి చేసిన వైద్యం గురించి యేసు వివరించడాన్ని లూకా రాశాడు.—లూకా 10:30-37.

ఒక ఖైదీకి తోడుగా ఉండడం

లూకాకు అపొస్తలుడైన పౌలుపట్ల ఎంతో శ్రద్ధ ఉండేది. పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నప్పుడు రోమా అధిపతియైన ఫేలిక్సు, “[పౌలుకు] పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని” ఆజ్ఞాపించాడు. (అపొస్తలుల కార్యములు 24:23) ఆ సమయంలో బహుశా లూకా కూడా పౌలుకు సేవచేసివుంటాడు. పౌలుకు ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు కాబట్టి, ఈ “ప్రియుడైన వైద్యుడు” ఆయనకు సేవ చేయడంలో భాగంగా ఆయన ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకుని ఉండవచ్చు.—కొలొస్సయులు 4:14; గలతీయులు 4:13.

పౌలు కైసరు ఎదుటే తన గురించి చెప్పుకుంటానని అన్నప్పుడు రోమా అధిపతియైన ఫేస్తు ఆయనను రోముకు పంపాడు. లూకా కూడా నమ్మకంగా పౌలుతోపాటు ఇటలీకి వెళ్లేందుకు ఆ సుదూర ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణ సమయంలోనే వారి ఓడ బ్రద్దలైన వైనాన్ని గురించి ఆయన వివరంగా రాశాడు. (అపొస్తలుల కార్యములు 24:27; 25:9-12; 27:1, 9-44) పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పుడు దైవ ప్రేరణతో అనేక పత్రికలు రాశాడు, వాటిలోని రెండింటిలో ఆయన లూకా గురించి ప్రస్తావించాడు. (అపొస్తలుల కార్యములు 28:30; కొలొస్సయులు 4:14; ఫిలేమోను 23, 24) బహుశా ఆ రెండు సంవత్సరాల కాలంలోనే లూకా అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని రాసివుండవచ్చు.

రోములో పౌలు ఖైదీగా ఉన్న ఇంటిలో ఆధ్యాత్మిక కార్యకలాపాలు చురుగ్గా సాగి ఉండవచ్చు. లూకా అక్కడే పౌలు ఇతర తోటిపనివారైన తుకికు, అరిస్తార్కు, మార్కు, యూస్తు, ఎపఫ్రా, ఒనేసిము లాంటి కొందరిని కలుసుకుంటూ ఉండివుండవచ్చు.—కొలొస్సయులు 4:7-14.

పౌలు రెండవసారి ఖైదు చేయబడి, తానిక కొంతకాలమే బ్రతికుంటానని ఆయనకు అనిపించినప్పుడు, ఇతరులు ఆయనను వదిలి వెళ్ళిపోయినా నమ్మకమైనవాడు, ధైర్యవంతుడు అయిన లూకా మాత్రం పౌలుతోనే ఉన్నాడు. తన స్వేచ్ఛను పోగొట్టుకునే ప్రమాదమున్నా, లూకా ఆయనతోనే ఉన్నాడు. బహుశా పౌలు కోసం లేఖికునిగా పనిచేసిన లూకా ఆయన మాటలను ఇలా రాశాడు: “లూకా మాత్రమే నాయొద్ద ఉన్నాడు.” ఆ తర్వాత కొద్దికాలానికే పౌలు శిరచ్ఛేదం చేయబడ్డాడని విశ్వసించబడుతోంది.—2 తిమోతి 4:6-8, 11, 16.

లూకా స్వయంత్యాగ స్ఫూర్తి, నమ్రత గల వ్యక్తి. ఆయన తనకున్న పరిజ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోలేదు లేక పేరుప్రఖ్యాతుల కోసం ఆరాటపడలేదు. ఆయన వైద్యాన్ని వృత్తిగా చేసుకుని ఉండవచ్చు కానీ ఆయన రాజ్య సంబంధ విషయాలకు తోడ్పడాలని కోరుకున్నాడు. లూకాలాగే మనం కూడా రాజ్య సువార్తను ప్రకటించడానికి, యెహోవాకు మహిమ కలిగేలా వినయంగా సేవచేయడానికి నిస్వార్థంగా పనిచేద్దాం.—లూకా 12:31.

[19వ పేజీలోని బాక్సు]

థెయొఫిల ఎవరు?

లూకా సువార్త పుస్తకాన్ని, అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని థెయొఫిలకు రాశాడు. లూకా సువార్తలో ఆ థెయొఫిల “ఘనతవహించిన థెయొఫిల” అని వర్ణించబడ్డాడు. (లూకా 1:1-3) “ఘనతవహించిన” అనే పదం గొప్ప ఐశ్వర్యం ఉన్నవారిని, రోమా ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారిని సంబోధించడానికి ఉపయోగించేవారు. యూదయపై అధికారంగల రోమా అధిపతియైన ఫేస్తు అపొస్తలుడైన పౌలు అలాగే సంబోధించాడు.—అపొస్తలుల కార్యములు 6:15.

థెయొఫిల బహుశా యేసు గురించిన సందేశాన్ని విని, దానిపట్ల ఆసక్తి చూపించివుండవచ్చు. అందుకే, “[ఆయనకు] ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని [ఆయన] తెలిసికొనుటకు” తన సువార్త సహాయం చేస్తుందని లూకా అనుకున్నాడు.—లూకా 1:1-4.

గ్రీకు విద్వాంసుడైన రిచర్డ్‌ లెన్స్‌కీ అభిప్రాయం ప్రకారం, లూకా థెయొఫిలను “ఘనతవహించిన” అని సంబోధించినప్పుడు ఆయన బహుశా విశ్వాసిగా మారివుండకపోవచ్చు ఎందుకంటే “క్రైస్తవ సాహిత్యంలో ఎక్కడా . . . ఒక సహోదరుడు అలాంటి లోక సంబంధమైన బిరుదులతో సంబోధించబడలేదు.” లూకా ఆ తర్వాత అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని రాసినప్పుడు, అందులో “ఘనతవహించిన” అనే గౌరవసూచకాన్ని ఉపయోగించకుండా సరళంగా “ఓ థెయొఫిలా” అని మాత్రమే రాశాడు. (అపొస్తలుల కార్యములు 1:1) లెన్స్‌కీ ఈ మాటలతో ముగించాడు: “లూకా సువార్తను థెయొఫిల పేరున రాసే సమయానికి ఈ ప్రముఖుడు ఇంకా క్రైస్తవునిగా మారలేదు కానీ క్రైస్తవత్వానికి సంబంధించిన విషయాలపట్ల ఆయనకు అపరిమితమైన ఆసక్తి ఉండేది; కానీ లూకా అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని ఆయనకు పంపే సమయానికి థెయొఫిల క్రైస్తవునిగా మారిపోయాడు.”