శిష్యులను చేయడంలో అత్యంత సమర్థుడైన వ్యక్తిని అనుకరించండి
శిష్యులను చేయడంలో అత్యంత సమర్థుడైన వ్యక్తిని అనుకరించండి
“మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి.”—లూకా 8:18.
“మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి” అని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పినప్పుడు ఆయన శిష్యులను చేయడంలో సమర్థుడైన వ్యక్తిగా, గొప్ప బోధకునిగా తన పాత్ర పోషిస్తున్నాడు. (లూకా 8:16-18) క్రైస్తవులుగా మీరు చేస్తున్న పరిచర్యకు ఆ సూత్రం అన్వయిస్తుంది. మీరు ఆధ్యాత్మిక ఉపదేశాన్ని వింటే మీరు దాన్ని అన్వయించుకొని సమర్థులైన రాజ్య ప్రచారకులౌతారు. నిజమే, నేడు మీరు యేసు స్వరాన్ని వినలేరు కానీ ఆయన బోధల గురించి, కార్యాల గురించి లేఖనాల్లో తెలియజేయబడివాటిని చదవచ్చు. ఆయన తన పరిచర్యలో ప్రజలతో వ్యవహరించిన విధానం గురించి అవి ఏమి తెలియజేస్తున్నాయి?
2 యేసు సువార్తను చక్కగా ప్రకటించాడు, లేఖనాల్లోని సత్యాన్ని సమర్థంగా బోధించాడు. (లూకా 8:1; యోహాను 8:28) శిష్యులను చేసే పనిలో ప్రకటనా పనితోపాటు బోధనాపని కూడా ఇమిడివుంది, అయినా ప్రకటనా పనిలో సమర్థులైన కొంతమంది క్రైస్తవ ప్రచారకులకు, ప్రజలకు సమర్థంగా బోధించడం కష్టమనిపిస్తుంది. ప్రకటనా పనిలో సందేశం ప్రకటించాల్సివుంటుంది, అయితే యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి ప్రజలకు బోధించడానికి శిష్యులను చేసే వ్యక్తి వారితో అనుబంధం ఏర్పరచుకోవాల్సివుంటుంది. (మత్తయి 28:19, 20) గొప్ప బోధకుడు, శిష్యులను చేయడంలో సమర్థుడైన యేసుక్రీస్తును అనుకరించడం ద్వారా అలా అనుబంధం ఏర్పరచుకోవచ్చు.—యోహాను 13:13.
3 మీరు యేసు బోధనా పద్ధతులను అనుకరిస్తే, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహాను అనుసరిస్తారు: “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:5, 6) శిష్యులను చేసే పనిలో యేసును అనుకరించేందుకు కృషి అవసరం. అయితే అలా అనుకరించడంవల్ల మీరు సమర్థంగా బోధించగలుగుతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరి వ్యక్తిగత అవసరాన్నిబట్టి ‘ప్రతి మనుష్యునికి ప్రత్యుత్తరమివ్వడానికి’ అది మీకు సహాయం చేస్తుంది.
తమ అభిప్రాయాలను తెలియజేయమని యేసు ఇతరులను ప్రోత్సహించాడు
4 ప్రజలు చెప్పేదానిని విని తమ అభిప్రాయాలను తెలియజేయమని వారిని ప్రోత్సహించే అలవాటు యేసుకు బాల్యం నుండి ఉంది. ఉదాహరణకు, ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు, ఆయన ఆలయంలో బోధకుల మధ్య కూర్చొని ‘వారి మాటల్ని ఆలకిస్తూ వారిని ప్రశ్నలడగుతూ ఉండడాన్ని’ ఆయన తల్లిదండ్రులు చూశారు. (లూకా 2:46) యేసు తన జ్ఞానంతో బోధకులను కలవరపెట్టేందుకు ఆలయానికి వెళ్లలేదు. తాను కూడా వారిని ప్రశ్నలు అడిగినా, వారు చెప్పేది వినడానికే ఆయన అక్కడికి వెళ్లాడు. ఆయనకున్న శ్రద్ధగా వినే గుణమే ఆయన దేవుని దయను, మనుష్యుల దయను పొందేలా చేసివుండవచ్చు.—లూకా 2:52.
5 యేసు బాప్తిస్మం తీసుకొని మెస్సీయగా అభిషిక్తుడైన తర్వాత కూడా ఆయన ప్రజలు చెప్పేదానిని వినడానికి ఇష్టపడ్డాడు. తన బోధలను వినడానికి వచ్చిన శ్రోతలు చెప్పాలనుకున్నవి పట్టించుకోంతగా ఆయన తాను బోధిస్తున్నవాటిలో తలమునకలుకాలేదు. ఆయన తరచూ ఆగి, వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకునేవాడు. (మత్తయి 16:13-15) ఉదాహరణకు, మార్త సహోదరుడైన లాజరు మరణం తర్వాత యేసు ఆమెతో ఇలా అన్నాడు: “బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.” ఆ తర్వాత ఆమెను, “ఈ మాట నమ్ముచున్నావా?” అని అడిగాడు. మార్త, “అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను” అని జవాబిస్తున్నప్పుడు యేసు తప్పక విని ఉండవచ్చు. (యోహాను 11:26, 27) అలా మార్త తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడాన్ని వినడం ఆయనకు ఎంత సంతృప్తినిచ్చివుంటుందో కదా!
6 అనేకమంది శిష్యులు యేసును విడిచివెళ్లినప్పుడు, ఆయన తన అపొస్తలుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే, ఆయన ఇలా అడిగాడు: “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” దానికి సీమోను పేతురు, “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము” అని జవాబిచ్చాడు. (యోహాను 6:66-69) యేసు ఆ మాటలు విని ఎంత సంతోషించివుండవచ్చో కదా! ఒక బైబిలు విద్యార్థి తన విశ్వాసాన్ని అలా వ్యక్తంచేసినప్పుడు మీరు తప్పక సంతోషిస్తారు.
యేసు గౌరవంతో విన్నాడు
7 ప్రజలపట్ల శ్రద్ధ కనబరుస్తూ వారు చెప్పేది గౌరవ భావంతో వినడం కూడా శిష్యులను చేయడంలో యేసు విజయం సాధించడానికి మరో కారణం. ఉదాహరణకు, ఒక సందర్భంలో యేసు, సుఖారు అనే ఊరిలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీకి సాక్ష్యమిచ్చాడు. ఆ చర్చలో యేసే అంతా మాట్లాడలేదు, ఆమె అభిప్రాయాన్ని కూడా ఆయన విన్నాడు. ఆమె అభిప్రాయాన్ని వింటున్నప్పుడు ఆమెకు ఆరాధనపట్ల ఆసక్తి ఉందని గమనించి, దేవుడు తనను ఆత్మతో సత్యంతో ఆరాధించేవారి కోసం చూస్తున్నాడని ఆమెతో అన్నాడు. ఆ స్త్రీపట్ల యేసు గౌరవాన్ని, శ్రద్ధను కనబరిచాడు కాబట్టే, ఆమె ఆయన గురించి ఇతరులకు చెప్పింది, ఆ “స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.”—యోహాను 4:5-29, 39-42.
8 సాధారణంగా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు, ప్రాచీన ఏథెన్సువాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి, ఏదైనా కొత్త విషయాన్ని వినడానికి ఇష్టపడేవారు. అపొస్తలుడైన పౌలు ఆ పట్టణంలోని అరేయొపగు అనే సభలో సమర్థవంతంగా ప్రసంగం ఇవ్వడానికి అది దారితీసింది. (అపొస్తలుల కార్యములు 17:18-34) నేడు మీ పరిచర్యలో గృహస్థులతో సంభాషణ ప్రారంభిస్తున్నప్పుడు మీరిలా చెప్పవచ్చు: “[ఫలానా విషయం] గురించి మీ అభిప్రాయమేమిటో తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం.” ఆ వ్యక్తి అభిప్రాయాన్ని విని, దానిపై వ్యాఖ్యానించండి, లేక దాని గురించి ఒక ప్రశ్న వేయండి. ఆ తర్వాత ఆ విషయం గురించి బైబిలు ఏమి చెబుతుందో స్నేహపూర్వకంగా వివరించండి.
ఏమి చెప్పాలో యేసుకు తెలుసు
9 ఏమి చెప్పాలో పాలుపోని పరిస్థితి యేసుకు ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆయన శ్రద్ధగా వినడమే కాక తరచూ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో గుర్తించేవాడు, వారికి ఖచ్చితంగా ఏమి చెప్పాలో కూడా ఆయనకు తెలిసేది. (మత్తయి 9:4; 12:22-30; లూకా 9:46, 47) ఉదాహరణకు, యేసు పునరుత్థానం చేయబడిన కొంతకాలం తర్వాత, ఆయన ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయుకు నడుస్తూ వెళ్తున్నారు. ఆ సంఘటన గురించి లూకా సువార్త ఇలా వివరిస్తోంది: “వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితో కూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. ఆయన—మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయొపా అనువాడు—యెరూషలేములో బసచేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను. ఆయన—అవి ఏవని వారిని అడిగెను.” నజరేయుడైన యేసు ప్రజలకు బోధించి, అద్భుతాలు చేశాడని, ఆయన చంపబడ్డాడని వారు వివరిస్తున్నప్పుడు ఆ గొప్ప బోధకుడు విన్నాడు. ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడని కొందరు అంటున్నారని వారు చెప్పారు. యేసు క్లెయొపాను, ఆయన సహచరుణ్ణి తమ అభిప్రాయాలు వ్యక్తం చేయమన్నాడు. ఆ తర్వాత వారేమి తెలుసుకోవాలో వివరించి వారికి ‘లేఖనాలు బోధపడేలా’ చేశాడు.—లూకా 24:13-27, 32.
10 మతసంబంధమైన విషయాల్లో గృహస్థుని అభిప్రాయం గురించి మీకు ఏమీ తెలిసుండకపోవచ్చు. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి, మీరు ప్రార్థన విషయంలో ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ఇష్టపడుతున్నట్లు చెప్పవచ్చు. ఆ తర్వాత మీరిలా అడగవచ్చు, “ప్రార్థనలను ఎవరైనా నిజంగా వింటారా, మీ అభిప్రాయమేమిటి?” ఆ వ్యక్తి ఇచ్చే సమాధానం, ఆయన అభిప్రాయం గురించి, మతం గురించి ఎంతో తెలియజేయవచ్చు. ఆయనకు మతసంబంధ విషయాల్లో ఆసక్తి ఉంటే, ఇలా అడగడం ద్వారా ఆయన అభిప్రాయాన్ని మీరు మరింత తెలుసుకోవచ్చు, “ప్రార్థనలన్నింటినీ దేవుడు వింటాడని మీరు అనుకుంటున్నారా, లేక ఆయన అంగీకరించని ప్రార్థనలు కూడా కొన్ని ఉండొచ్చని మీకనిపిస్తోందా?” అలాంటి ప్రశ్నలు సహజ సంభాషణకు దారితీయగలవు. ఆ విషయం గురించి బైబిలు ఏమి చెబుతుందో చూపించడం సరైనప్పుడు మీరు ఆ వ్యక్తి నమ్మకాలను కించపర్చకుండా యుక్తిగా దానిని చూపించవచ్చు. మీరు చెబుతున్న విషయాలను వినడానికి ఆయన ఇష్టపడితే, మిమ్మల్ని తిరిగి కలుసుకునేందుకు కూడా ఆయన ఇష్టపడవచ్చు. మీరు జవాబు చెప్పలేని ప్రశ్న ఆయన అడిగితే అప్పుడేమిటి? మీరు కొంత పరిశోధన చేసి ‘మీలో ఉన్న నిరీక్షణ’ గురించి వివరించడానికి సిద్ధపడి తిరిగివెళ్లవచ్చు. అయితే మీరు వారికి ‘సాత్వికంతో, భయంతో [‘ప్రగాఢమైన గౌరవంతో,’ NW] సమాధానమివ్వాలి’.—1 పేతురు 3:15.
యేసు యోగ్యులైనవారికి బోధించాడు
11 బోధించబడడానికి ఎవరు యోగ్యులో గుర్తించడానికి సహాయం చేసే వివేచన, పరిపూర్ణ మానవుడైన యేసుకు ఉండేది. ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల’ వారిని కనుగొనడం మనకు ఎంతో కష్టమనిపించవచ్చు. (అపొస్తలుల కార్యములు 13:48, NW) అపొస్తలులకు కూడా కష్టమనిపించింది, యేసు వారికిలా ఆజ్ఞాపించాడు: “మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేయుడి.” (మత్తయి 10:11) యేసు అపొస్తలుల్లాగే మీరూ బైబిల్లోని సత్యాన్ని వినడానికి, బోధించబడడానికి ఇష్టపడేవారిని విచారణచేయాలి లేదా కనుగొనాలి. మీ పరిచర్యలో మీరు కలుసుకునే ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను శ్రద్ధగా విని, వారి మనోవైఖరిని గమనించడం ద్వారా మీరు యోగ్యులైనవారిని కనుగొనవచ్చు.
12 రాజ్య సందేశంపట్ల కొంత ఆసక్తి చూపించిన వ్యక్తిని కలుసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక అవసరాల గురించి ఆలోచిస్తూ ఉండడం మంచిది. సువార్త గురించి ఒకరితో మాట్లాడిన తర్వాత మీరు తెలుసుకున్న విషయాలను రాసుకుంటే ఆ వ్యక్తికి ఆధ్యాత్మికంగా సహాయం చేస్తూ ఉండడానికి అది మీకు దోహదపడుతుంది. ఆ వ్యక్తి నమ్మకాలు, దృక్పథం, పరిస్థితుల గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు ఆయన చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి.
13 దేవుని వాక్యం గురించి తమకున్న అభిప్రాయాలను మీకు తెలియజేయమని మీరు ప్రజలనెలా ప్రోత్సహించవచ్చు? కొన్ని ప్రాంతాల్లో ఇలా అడగడం చక్కని ఫలితాలనిస్తుంది, “బైబిలును అర్థం చేసుకోవడం మీకు కష్టమనిపించిందా?” ఆ ప్రశ్నకు ఆయనిచ్చే జవాబు సాధారణంగా, ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆ వ్యక్తికున్న దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఒక లేఖనాన్ని చదివి, “ఈ లేఖనం మీకెలా అనిపిస్తుంది?” అని అడగడం మరో విధానం. సరైన ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా యేసులాగే మీరు కూడా మీ పరిచర్యలో ఎంతో సాధించవచ్చు. అయితే ఒక విషయంలో జాగ్రత్త వహించాలి.
యేసు సమర్థంగా ప్రశ్నలను ఉపయోగించాడు
14 ఇతరులను కలవరపెట్టకుండా వారి అభిప్రాయాలపట్ల శ్రద్ధ చూపించండి. యేసు ఉపయోగించిన పద్ధతిని అనుసరించండి. ఆయన విచక్షణలేని అధికారిలా ప్రశ్నలు వేయలేదుగానీ ఆలోచన రేకెత్తించే ప్రశ్నలను ఉపయోగించాడు. యథార్థవంతులకు విశ్రాంతినిచ్చి, వారు సేదదీర్పు పొందేందుకు దోహదపడిన యేసు, ఇతరులు చెప్పేవాటిని కూడా దయతో విన్నాడు. (మత్తయి 11:28) అన్ని వర్గాలవారు తమ సమస్యలను ఆయనకు చెప్పుకునేందుకు సంకోచించలేదు. (మార్కు 1:40; 5:35, 36; 10:13, 17, 46, 47) ప్రజలు బైబిలు గురించి, దాని బోధల గురించి తమ అభిప్రాయాలను మీతో నిస్సంకోచంగా చెప్పాలంటే మీరు వారిని అధికారిలా ప్రశ్నించకూడదు.
15 ప్రశ్నలను సమర్థంగా అడగడంతోపాటు ఆసక్తికరమైన ఏదో ఒక విషయాన్ని చెప్పి వారి ప్రత్యుత్తరాన్ని వినడం ద్వారా సంభాషించేందుకు వారిని ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు, యేసు నీకొదేముతో ఇలా అన్నాడు: “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు.” (యోహాను 3:3) ఆ మాటలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయంటే నీకొదేము ప్రతిస్పందించకుండా, యేసు చెప్పేది వినకుండా ఉండలేకపోయాడు. (యోహాను 3:4-20) అలాగే, ప్రజలు సంభాషణలో పాల్గొనేలా మీరూ ప్రోత్సహించవచ్చు.
16 నేడు, ఆఫ్రికా, తూర్పు ఐరోపా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో, కొత్త మతాలు పుట్టుకురావడం చర్చనీయాంశంగా మారింది. అలాంటి ప్రాంతాల్లో మీరు ఇలా చెప్పడం ద్వారా సాధారణంగా సంభాషణను ప్రారంభించవచ్చు: “అనేక మతాలు ఉండడం నన్ను కలవరపెడుతోంది. అయితే, త్వరలో అన్ని దేశాల ప్రజలు సత్యారాధనలో ఐక్యమౌతారని నేను అనుకుంటున్నాను. అలా జరగడం మీకు ఇష్టమేనా?” మీ నిరీక్షణ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పడం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసేలా మీరు చేయవచ్చు. రెండు జవాబులు ఉండగల ప్రశ్నలకు జవాబు చెప్పడం సులభం. (మత్తయి 17:25) మీరడిగిన ప్రశ్నకు గృహస్థులు ప్రత్యుత్తరమిచ్చిన తర్వాత ఒకటి రెండు లేఖనాలను ఉపయోగిస్తూ మీ జవాబు చెప్పండి. (యెషయా 11:9; జెఫన్యా 3:9) గృహస్థులు చెప్పేది శ్రద్ధగా విని, వారి ప్రతిస్పందనను గమనించడం ద్వారా వారిని తిరిగి కలుసుకున్నప్పుడు ఏమి చర్చించాలో మీరు నిర్ణయించుకోవచ్చు.
యేసు పిల్లల అభిప్రాయాలను విన్నాడు
17 యేసు వయోజనులపట్ల మాత్రమే కాక పిల్లలపట్ల కూడా శ్రద్ధ చూపించాడు. పిల్లలు ఆడుకునే ఆటలు, వారు లూకా 7:31, 32; 18:15-17) యేసు బోధలను విన్న జనసమూహాల్లో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు మెస్సీయను బిగ్గరగా స్తుతించినప్పుడు, యేసు దానిని గమనించి లేఖనాలు దాని గురించి ప్రవచించాయని చెప్పాడు. (మత్తయి 14:21; 15:38; 21:15, 16) నేడు అనేకమంది పిల్లలు యేసు శిష్యులౌతున్నారు. కాబట్టి, మీరు వారికి ఎలా సహాయం చేయవచ్చు?
చెప్పే మాటల గురించి ఆయనకు తెలుసు. కొన్నిసార్లు, తన దగ్గరికి రమ్మని ఆయన పిల్లలను పిలిచాడు. (18 మీ పిల్లలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి, మీరు వారి అభిప్రాయాలను వినాలి. వారి అభిప్రాయాల్లో ఏవి యెహోవా తలంపులకు విరుద్ధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలు ఏమి చెప్పినా, వారిని మొదట మెచ్చుకోవడం జ్ఞానయుక్తం! ఆ తర్వాత ఆ విషయంలో యెహోవా దృక్పథమేమిటో తెలుసుకునేందుకు వారికి సహాయం చేయడానికి సముచితమైన లేఖనాలను ఉపయోగించవచ్చు.
19 పిల్లల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రశ్నలు మీకు సహాయం చేస్తాయి. వయోజనుల్లాగే పిల్లలు కూడా ఇతరులు తమను అధికారిలా ప్రశ్నించడాన్ని ఇష్టపడరు. కష్టమైన అనేక ప్రశ్నలకు జవాబిచ్చే భారాన్ని మీ పిల్లలమీద మోపే బదులు, మీ గురించి మీరే క్లుప్తంగా ఎందుకు వివరించకూడదు? (మత్తయి 13:51, 52) చర్చిస్తున్న విషయాన్నిబట్టి మీరు ఫలానా విధంగా అనుకునేవారని చెప్పి అలా ఎందుకు అనుకునేవారో వివరించండి. తర్వాత, మీరు వారినిలా అడగవచ్చు, “నీకూ అలాగే అనిపిస్తోందా?” మీ పిల్లల ప్రతిస్పందన సహాయకరమైన, ప్రోత్సాహకరమైన లేఖనాధారిత చర్చకు దారితీయవచ్చు.
శిష్యులను చేయడంలో సమర్థుడైన వ్యక్తిని అనుకరిస్తూ ఉండండి
20 మీరు ఏదైనా ఒక విషయాన్ని మీ పిల్లలతో లేక మరెవరితోనైనా చర్చిస్తున్నట్లయితే శ్రద్ధగా వినడం చాలా ప్రాముఖ్యం. అలా వినడం ద్వారా మనం వారిపట్ల ప్రేమను కనబరుస్తాం. వినడం ద్వారా మీరు వినయంతో ప్రవర్తించడమే కాక మాట్లాడుతున్న వ్యక్తిపట్ల గౌరవాన్ని, ప్రేమపూర్వక దయను కూడా కనబరుస్తారు. నిజమే, వినాలంటే వ్యక్తి అభిప్రాయాలకు మీరు అవధానమివ్వాలి.
21 మీరు క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు, గృహస్థుల అభిప్రాయాలను జాగ్రత్తగా వినండి. వారి అభిప్రాయాలను మీరు శ్రద్ధగా వింటే బైబిలు సత్యానికి సంబంధించిన ఏ అంశాలను వారు బాగా ఇష్టపడతారో గుర్తించవచ్చు. ఆ తర్వాత, యేసు ఉపయోగించిన వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించడం ద్వారా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. అలా చేయడం ద్వారా మీరు శిష్యులను చేయడంలో సమర్థుడైన వ్యక్తిని అనుకరిస్తారు కాబట్టి మీకు ఆనందం, సంతృప్తి కలుగుతాయి.
మీరెలా జవాబిస్తారు?
• తమ అభిప్రాయాలను తెలియజేయమని యేసు ఇతరులను ఎలా ప్రోత్సహించాడు?
• తాను బోధించినవారి అభిప్రాయాలను యేసు ఎందుకు విన్నాడు?
• మీ పరిచర్యలో మీరు ప్రశ్నలను ఎలా ఉపయోగించవచ్చు?
• పిల్లలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి మీరేమి చేయవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. యేసు తన పరిచర్యలో ప్రజలతో ఎలా వ్యవహరించాడనే దానిమీద మీరు ఎందుకు అవధానం నిలపాలి?
3. యేసును అనుకరించడం శిష్యులను చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను ఎలా ప్రభావితం చేయగలదు?
4. యేసు శ్రద్ధగా వినేవాడని ఎందుకు చెప్పవచ్చు?
5, 6. తాను బోధించినవారి అభిప్రాయాలను యేసు విన్నాడని మనకు ఎలా తెలుసు?
7. అనేకమంది సమరయులు యేసును ఎందుకు విశ్వసించడం మొదలుపెట్టారు?
8. ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పడానికి ఇష్టపడడం పరిచర్యలో సంభాషణలను ప్రారంభించడానికి మీకెలా సహాయం చేయవచ్చు?
9. క్లెయొపాకు, ఆయన సహచరునికి ‘లేఖనాలు బోధపడేలా’ చేసే ముందు యేసు ఏమి చేశాడు?
10. మీరు పరిచర్యలో కలుసుకునే వ్యక్తికి మతసంబంధ విషయాల్లో ఉన్న అభిప్రాయాన్ని మీరెలా తెలుసుకోవచ్చు?
11. బోధించబడడానికి యోగ్యులైనవారిని కనుగొనేందుకు మీకు ఏది సహాయం చేస్తుంది?
12. ఆసక్తిగల ఒక వ్యక్తికి మీరు ఎలా సహాయం చేస్తూ ఉండవచ్చు?
13. బైబిలు గురించి ఒక వ్యక్తికున్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు మీకు ఏది సహాయం చేయవచ్చు?
14. ప్రజలను అధికారిలా ప్రశ్నించకుండా వారి అభిప్రాయాలపట్ల మీరెలా శ్రద్ధ కనబర్చవచ్చు?
15, 16. మత సంబంధ విషయాల గురించిన సంభాషణల్లో పాల్గొనేలా ప్రజలను మీరెలా ప్రోత్సహించవచ్చు?
17. యేసుకు పిల్లలపట్ల శ్రద్ధవుందని ఏది చూపిస్తోంది?
18, 19. మీ పిల్లలకు ఆధ్యాత్మికంగా మీరెలా సహాయం చేయవచ్చు?
20, 21. శిష్యులను చేసే పనిలో పాల్గొంటున్నప్పుడు మీరెందుకు శ్రద్ధగా వినాలి?
[28వ పేజీలోని చిత్రం]
ప్రకటిస్తున్నప్పుడు, తప్పక వినండి
[30వ పేజీలోని చిత్రం]
పిల్లలకు ఆధ్యాత్మికంగా సహాయం చేసినప్పుడు మనం యేసును అనుకరిస్తాం