కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యులను చేసేందుకు దోహదపడగల లక్షణాలను పెంపొందించుకోండి

శిష్యులను చేసేందుకు దోహదపడగల లక్షణాలను పెంపొందించుకోండి

శిష్యులను చేసేందుకు దోహదపడగల లక్షణాలను పెంపొందించుకోండి

“మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.”—మత్తయి 28:19.

యెహోవా సేవకులు కొన్నిసార్లు, ఆయన చిత్తాన్ని చేయడానికి దోహదపడే నైపుణ్యాలను, దృక్పథాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, దేవుని ఆజ్ఞనుబట్టి, అబ్రాహాము, శారా వర్ధిల్లుతున్న ఊరు పట్టణాన్ని విడిచిపెట్టి చివరికి, గుడారంలో నివసించేవారికి కావాల్సిన లక్షణాలను, సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సి వచ్చింది. (హెబ్రీయులు 11:8, 9, 15) ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించడానికి యెహోషువకు ధైర్యం, యెహోవాపట్ల నమ్మకం, ఆయన ధర్మశాస్త్రం గురించిన జ్ఞానం అవసరమయ్యాయి. (యెహోషువ 1:7-9) బెసలేలు, అహోలీయాబు ఆలయ గుడార నిర్మాణం, దానికి సంబంధించిన పనిలో విజయవంతంగా భాగం వహించి, దాన్ని పర్యవేక్షించగలిగేలా దేవుని ఆత్మ వారికి అప్పటికే ఉన్న నైపుణ్యాలను ఖచ్చితంగా మెరుగుపర్చింది.—నిర్గమకాండము 31:1-11.

2 శతాబ్దాల తర్వాత, యేసుక్రీస్తు తన అనుచరులను ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) ఇంత విస్తారమైన సేవ చేసే ఆధిక్యత గతంలో ఎవరికీ ఇవ్వబడలేదు. శిష్యులను చేసే పనిలో భాగం వహించడానికి ఎలాంటి లక్షణాలు అవసరం? అలాంటి లక్షణాలను మనమెలా పెంపొందించుకోవచ్చు?

దేవునిపట్ల ప్రగాఢమైన ప్రేమను కనబరచండి

3 ప్రజల దగ్గరికి వెళ్లి సత్యదేవుడైన యెహోవాను ఆరాధించేలా వారిని ఒప్పింపజేయడానికి కృషి చేసేందుకు మనకు ఆయనపట్ల ప్రగాఢమైన ప్రేమ ఉండాలి. ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు పూర్ణహృదయంతో లోబడుతూ, ఆమోదయోగ్యమైన బలులు అర్పిస్తూ, కీర్తనలతో ఆయనను స్తుతిస్తూ దేవునిపట్ల తమకున్న ప్రేమను కనబరచవచ్చు. (ద్వితీయోపదేశకాండము 10:12, 13; 30:19, 20; కీర్తన 21:13; 96:1, 2; 138:5) శిష్యులను చేసేవారిగా మనం కూడా దేవుని నియమాలను పాటించడమే కాక, యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి ఇతరులకు చెప్పడం ద్వారా ఆయనపట్ల మనకున్న ప్రేమను సహితం కనబరుస్తాం. దేవుడు మనకిచ్చిన నిరీక్షణ విషయంలో మనకున్న యథార్థ భావాలను వ్యక్తం చేయడానికి మనం సరైన పదాలను ఉపయోగిస్తూ దృఢవిశ్వాసంతో మాట్లాడాలి.—1 థెస్సలొనీకయులు 1:4; 1 పేతురు 3:15.

4 యెహోవాపట్ల యేసుకు ప్రగాఢమైన ప్రేమవుంది కాబట్టే, ఆయన దేవుని సంకల్పాల గురించి, రాజ్యం గురించి, సత్యారాధన గురించి మాట్లాడేందుకు ఎంతో ఇష్టపడ్డాడు. (లూకా 8:1; యోహాను 4:23, 24, 31) నిజానికి, ఆయన ఇలా చెప్పాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) కీర్తనకర్త చెప్పిన ఈ మాటలు యేసుకు వర్తిస్తాయి: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతిసువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది.”—కీర్తన 40:8, 9; హెబ్రీయులు 10:7-10.

5 ఇటీవల బైబిలు సత్యాన్ని తెలుసుకున్న క్రొత్తవారు యెహోవా దేవునిపట్ల ప్రేమచేత పురికొల్పబడి ఆయన గురించి, రాజ్యం గురించి కొన్నిసార్లు ఎంత దృఢవిశ్వాసంతో మాట్లాడతారంటే లేఖనాలను పరిశీలించేలా వారు ఇతరులను ఎంతో సమర్థవంతంగా ఒప్పించగలుగుతారు. (యోహాను 1:41) దేవునిపట్ల ఉన్న ప్రేమే శిష్యులను చేసే పనిలో పాల్గొనేందుకు మనల్ని ముఖ్యంగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి, ఆయన వాక్యాన్ని క్రమంగా చదువుతూ, దానిని ధ్యానించడం ద్వారా మనమా ప్రేమను కాపాడుకుందాం.—1 తిమోతి 4:6, 15; ప్రకటన 2:4.

6 యెహోవాపట్ల ఉన్న ప్రేమే నిస్సందేహంగా యేసుక్రీస్తును ఉత్సాహవంతుడైన బోధకుణ్ణి చేసింది. అయితే, రాజ్య ప్రచారకునిగా ఆయన సత్ఫలితాలు సాధించడానికి అదొక్కటే కారణం కాదు. అలాంటప్పుడు, శిష్యులను చేసే పనిలో యేసు విజయం సాధించడానికి దోహదపడిన మరో లక్షణమేమిటి?

ప్రజలపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ కనబరచండి

7 యేసు ప్రజలపట్ల శ్రద్ధచూపిస్తూ వారిపట్ల ఎంతో ఆసక్తి కనబరిచాడు. ఆయన దేవుని ‘ప్రధానశిల్పిగా’ మానవపూర్వ ఉనికిలో ఉన్నప్పుడు కూడా మానవజాతికి సంబంధించిన విషయాలను ఇష్టపడ్డాడు. (సామెతలు 8:30, 31) యేసు భూమ్మీద మానవునిగా ఉన్నప్పుడు ప్రజలపట్ల కనికరం కనబరుస్తూ తన దగ్గరికి వచ్చేవారికి విశ్రాంతినిచ్చాడు. (మత్తయి 11:28-30) యెహోవా చూపించిన ప్రేమను, కనికరాన్ని యేసు ప్రతిబింబించాడు, అది అద్వితీయ సత్యదేవుని ఆరాధనవైపు ప్రజలను ఆకర్షించింది. యేసు అన్నిరకాల ప్రజలపట్ల, వారి పరిస్థితులపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ కనబరిచాడు కాబట్టే, వారాయన బోధను విన్నారు.—లూకా 7:36-50; 18:15-17; 19:1-10.

8 నిత్యజీవాన్ని పొందడానికి తాను ఏమి చేయాలని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ‘యేసు అతని చూచి అతనిని ప్రేమించాడు.’ (మార్కు 10:17-21) బేతనియలో యేసు బోధించిన కొందరి గురించి మనమిలా చదువుతాం: “యేసు మార్తను ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను.” (యోహాను 11:1, 5) ప్రజలపట్ల యేసు ఎంత శ్రద్ధ కనబరిచాడంటే, ఆయన తనకవసరమైన విశ్రాంతిని కూడా తీసుకోకుండా వారికి బోధించాడు. (మార్కు 6:30-34) యేసు తోటిమానవులపట్ల అలాంటి ప్రగాఢమైన, ప్రేమపూర్వకమైన శ్రద్ధ కనబరిచాడు కాబట్టే ఆయన ఇతరులకన్నా సమర్థంగా ప్రజలను సత్యారాధనవైపు ఆకర్షించగలిగాడు.

9 అపొస్తలుడైన పౌలు కూడా తాను ప్రకటించిన ప్రజలపట్ల ఎంతో శ్రద్ధ కనబరిచాడు. ఉదాహరణకు, థెస్సలొనీకలో క్రైస్తవులుగా మారిన వారితో ఆయనిలా అన్నాడు: “మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.” పౌలు ప్రేమపూర్వక ప్రయత్నాల కారణంగా థెస్సలొనీకలో కొందరు ‘విగ్రహములను విడిచిపెట్టి, జీవముగల దేవునికి దాసులయ్యారు.’ (1 థెస్సలొనీకయులు 1:9; 2:8) యేసుకు, పౌలుకు ఉన్నట్లే మనకూ ప్రజలపట్ల నిజమైన శ్రద్ధవుంటే, ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగలవారి’ హృదయాలను సువార్త పురికొల్పడాన్ని చూసి ఆనందించే అవకాశం మనకూ లభించవచ్చు.—అపొస్తలుల కార్యములు 13:48, NW.

స్వయంత్యాగ స్ఫూర్తిని కనబరచండి

10 శిష్యులను చేసే పనిలో సమర్థులైనవారికి స్వయంత్యాగ స్ఫూర్తి ఉంటుంది. వారు ఐశ్వర్య సంపాదనకు అధిక ప్రాధాన్యత ఇవ్వరు. వాస్తవానికి యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.” శిష్యులు ఆ మాట విని ఆశ్చర్యపోయినా, యేసు ఇంకా ఇలా చెప్పాడు: “పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.” (మార్కు 10:23-25) శిష్యులను చేసే పనికి ప్రాధాన్యతనిచ్చేలా నిరాడంబరమైన జీవితాన్ని గడపమని యేసు తన శిష్యులకు సలహా ఇచ్చాడు. (మత్తయి 6:22-24, 33) శిష్యులను చేసే పనిలో స్వయంత్యాగ స్ఫూర్తి మనకు ఎందుకు సహాయం చేస్తుంది?

11 యేసు ఆజ్ఞాపించినవాటన్నిటినీ బోధించడానికి ఎంతో కృషి అవసరం. శిష్యులను చేసే వ్యక్తి సాధారణంగా, ఆసక్తిగల వ్యక్తితో ప్రతీవారం బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడానికి కృషి చేస్తాడు. యథార్థవంతులైన వ్యక్తులను ఎక్కువగా కనుగొనేందుకు కొంతమంది రాజ్యప్రచారకులు పూర్తికాల ఉద్యోగాలు మానేసి పార్ట్‌టైం ఉద్యోగాలు చేపట్టారు. తమ ప్రాంతంలో నివసిస్తున్న కొన్ని జాతులవారికి ప్రకటించడానికి వేలాదిమంది క్రైస్తవులు మరోభాషను నేర్చుకున్నారు. మరికొందరు కోతపనిలో మరింత ఎక్కువగా పాల్గొనడానికి తమ స్వస్థలాలను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి లేక దేశానికి వెళ్లారు. (మత్తయి 9:37, 38) ఇవన్నీ చేయడానికి స్వయంత్యాగ స్ఫూర్తి అవసరం. అయితే శిష్యులను చేసే పనిలో సమర్థులుగా ఉండడానికి అది మాత్రమే సరిపోదు.

సమయాన్ని వృథాచేసుకోకుండా ఓర్పు కనబరచండి

12 శిష్యులను చేయడానికి సహాయం చేసే మరో లక్షణం, ఓర్పు. క్రైస్తవ సందేశం అత్యవసర చర్య తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నా, శిష్యులను చేయడానికి తరచూ ఎంతో సమయం పడుతుంది, దానికి ఓర్పు కూడా అవసరం. (1 కొరింథీయులు 7:29) యేసు తన సహోదరుడైన యాకోబు విషయంలో అసహనాన్ని కనబరచలేదు. యేసు ప్రకటనా కార్యకలాపాల గురించి యాకోబుకు బాగా తెలుసని స్పష్టమవుతున్నా, ఏదో కారణాన్నిబట్టి ఆయన కొంతకాలంవరకు శిష్యునిగా మారలేదు. (యోహాను 7:5) అయితే, క్రీస్తు మరణానికీ, సా.శ. 33 పెంతెకొస్తుకూ మధ్యనున్న కొద్దికాలంలో యాకోబు శిష్యుడయ్యాడు, ఎందుకంటే ఆయన ప్రార్థించడానికి వాళ్ల అమ్మతో, తన సహోదరులతో, అపొస్తలులతోపాటు ఉన్నట్లు లేఖనాలు సూచిస్తున్నాయి. (అపొస్తలుల కార్యములు 1:13, 14) యాకోబు చక్కని ఆధ్యాత్మిక ప్రగతి సాధించి కొంతకాలానికి క్రైస్తవ సంఘంలో బరువైన బాధ్యతలను చేపట్టాడు.—అపొస్తలుల కార్యములు 15:13; 1 కొరింథీయులు 15:7.

13 వ్యవసాయదారుల్లాగే క్రైస్తవులు కూడా నిదానంగా వృద్ధయ్యేవాటిని అంటే దేవుని వాక్య అవగాహనను, యెహోవాపట్ల ప్రేమను, క్రీస్తులాంటి స్వభావాన్ని పెంపొందింపజేస్తున్నారు. వాటిని పెంపొందింపజేయడానికి ఓపిక అవసరం. యాకోబు ఇలా రాశాడు: “సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.” (యాకోబు 5:7, 8) ‘ప్రభువు రాకడవరకు ఓపిక కనబరచమని’ యాకోబు తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు. శిష్యులకు ఏదైనా అర్థంకాకపోతే, యేసు వాటిని ఓపికతో వివరించాడు లేక ఉపమానాలతో విశదీకరించాడు. (మత్తయి 13:10-23; లూకా 19:11; 21:7; అపొస్తలుల కార్యములు 1:6-8) మనం ప్రభువు ప్రత్యక్షతాకాలంలో జీవిస్తున్నాం కాబట్టి, శిష్యులను చేయడానికి మనం కృషి చేస్తుండగా అలాంటి ఓపికనే కనబర్చాలి. మన కాలంలో యేసు అనుచరులయ్యేవారికి మనం ఓపికతో ఉపదేశించాలి.—యోహాను 14:9.

14 మనం ఓపికతో వ్యవహరించినా, మనం బైబిలు అధ్యయనం ప్రారంభించే అనేకమందిలో వాక్యం ఫలించదు. (మత్తయి 13:18-23) కాబట్టి, వారికి సహాయం చేయడానికి సాధ్యమైనంత కృషి చేసిన తర్వాత మనం జ్ఞానయుక్తంగా, అలాంటి వ్యక్తులతో సమయం వృథాచేసుకోకుండా బైబిలు సత్యాన్ని అమూల్యమైనదిగా ఎంచే అవకాశం మరింతగా ఉన్నవారిని కనుగొనడానికి ప్రయత్నిస్తాం. (ప్రసంగి 3:1, 6) నిజమే, బైబిలు సత్యాన్ని అమూల్యమైనదిగా ఎంచేవారికి కూడా తమ అభిప్రాయాలను, దృక్పథాలను, జీవిత ప్రాధమ్యాలను మార్చుకునేందుకు ఎంతోకాలం సహాయం అవసరంకావచ్చు. అందుకే, సరైన వైఖరిని పెంపొందించుకోవడానికి ఎంతోకాలం తీసుకున్న శిష్యులపట్ల యేసు ఓపికను కనబరిచినట్లే మనం కూడా వారిపట్ల ఓపికను కనబరుస్తాం.—మార్కు 9:33-37; 10:35-45.

బోధనాకళను పెంపొందించుకోండి

15 దేవునిపట్ల ప్రేమ, ప్రజలపట్ల శ్రద్ధ, స్వయంత్యాగ స్ఫూర్తి, ఓపిక వంటి ప్రాముఖ్యమైన అంశాలు శిష్యులను చేసే పనిలో విజయం సాధించడానికి అవసరం. విషయాలను స్పష్టంగా, సరళమైన రీతిలో వివరించడానికి బోధనా నైపుణ్యాలు మనకు దోహదపడతాయి కాబట్టి వాటిని కూడా మనం పెంపొందించుకోవాలి. ఉదాహరణకు, గొప్ప బోధకుడైన యేసుక్రీస్తు చెప్పిన అనేక మాటలు సరళంగా ఉన్నాయి కాబట్టే అవి ఎంతో శక్తివంతమైనవి. యేసు చెప్పిన ఈ మాటలు బహుశా మీకు గుర్తుకురావచ్చు: “పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి.” “పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి.” “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందును.” “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.” (మత్తయి 6:20; 7:6; 11:19; 22:21) నిజమే, యేసు కేవలం చిన్నచిన్న వాక్యాలనే చెప్పలేదు. ఆయన స్పష్టంగా బోధించి, సముచితమైనప్పుడే విషయాలను వివరించాడు. మనం యేసు బోధనా శైలిని ఎలా అనుకరించవచ్చు?

16 మనం సరళంగా, స్పష్టంగా బోధించడానికి జాగ్రత్తగా సిద్ధపడడం ప్రాముఖ్యం. అధ్యయనాన్ని సిద్ధపడని ప్రచారకుడు సాధారణంగా ఎక్కువగా మాట్లాడతాడు. ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఆ అంశం గురించి తనకు తెలిసినదంతా చెప్పి ముఖ్యాంశాలను మరుగునపడేయవచ్చు. దానికి భిన్నంగా, చక్కగా సిద్ధపడిన ప్రచారకుడు తాను ఉపదేశిస్తున్న వ్యక్తి గురించి ఆలోచించి, అధ్యయన అంశం గురించి ధ్యానించి, అవసరమైనదానినే స్పష్టంగా వివరిస్తాడు. (సామెతలు 15:28; 1 కొరింథీయులు 2:1, 2) విద్యార్థికి అప్పటికే ఎంతవరకు తెలుసో, అధ్యయనంలో నొక్కిచెప్పాల్సిన అంశాలేమిటో ఆయన గుర్తుంచుకుంటాడు. ఆ ప్రచారకునికి ఆ అంశంమీద ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసినా, అనవసరమైన సమాచారాన్ని ప్రస్తావించకుండా ఆయన స్పష్టంగా బోధించగలుగుతాడు.

17 యేసు కేవలం వాస్తవాలను వివరించే బదులు తర్కబద్ధంగా ఆలోచించేందుకు కూడా ప్రజలకు సహాయం చేశాడు. ఉదాహరణకు, ఒక సందర్భంలో ఆయనిలా అడిగాడు: “సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా?” (మత్తయి 17:25) మనం బైబిలును వివరించడానికి ఎంతో ఇష్టపడుతుండవచ్చు, అందువల్ల గృహబైబిలు అధ్యయనం జరుగుతున్నప్పుడు విద్యార్థి ఒక విషయం గురించి తన అభిప్రాయం చెప్పడానికి లేదా ఒక విషయాన్ని వివరించడానికి అవకాశమిచ్చేందుకు మనం ఆశానిగ్రహాన్ని ప్రదర్శించడం అవసరం కావచ్చు. నిజమే, మనం ప్రజలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయకూడదు. బదులుగా, మనం నేర్పుతో, చక్కని ఉపమానాలతో, దయతోకూడిన ప్రశ్నలతో మన బైబిలు ఆధారిత ప్రచురణల్లో ఉన్న లేఖనాధార అంశాలను వారు అర్థం చేసుకునేలా సహాయం చేయవచ్చు.

18 లేఖనాలు “బోధనా కళ” గురించి వివరిస్తున్నాయి. (2 తిమోతి 4:2, NW; తీతు 1:9, NW) అలాంటి బోధనా సామర్థ్యంలో, వాస్తవాలను గుర్తుపెట్టుకునేందుకు ఒక వ్యక్తికి సహాయం చేయడంకన్నా ఎక్కువే ఇమిడివుంది. బైబిలు విద్యార్థి సత్యానికీ అబద్ధానికీ, మంచిచెడులకూ, వివేకానికీ మూర్ఖత్వానికీ మధ్యవున్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి మనం సహాయం చేసేందుకు ప్రయత్నించాలి. మనం వీటిని చేస్తూ ఆ వ్యక్తి హృదయంలో యెహోవాపట్ల ప్రేమను పెంపొందించడానికి ప్రయత్నిస్తే యెహోవాకు తానెందుకు లోబడాలో ఆయన గ్రహించవచ్చు.

శిష్యులను చేసే పనిలో ఉత్సాహంగా పాల్గొనండి

19 క్రైస్తవ సంఘం శిష్యులను చేసే సంస్థ. ఒక కొత్త వ్యక్తి శిష్యుడైనప్పుడు, ఆయనను కనుగొని బైబిలు బోధిస్తున్నదానిని తెలుసుకునేందుకు ఆయనకు సహాయం చేసిన యెహోవాసాక్షి మాత్రమే సంతోషించడు. తప్పిపోయిన పిల్లవాణ్ణి వెదికేందుకు ఏర్పాటు చేయబడిన బృందంలో ఒకే ఒక వ్యక్తి ఆ పిల్లవాణ్ణి కనుగొనవచ్చు. అయితే ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి చేరుకున్నప్పుడు వెదకడంలో భాగం వహించినవారందరూ సంతోషిస్తారు. (లూకా 15:6, 7) అలాగే, శిష్యులను చేసే పనిలో సంఘమంతా భాగం వహిస్తుంది. యేసు శిష్యులయ్యే అవకాశం ఉన్నవారిని వెదకడంలో క్రైస్తవులందరూ భాగం వహిస్తారు. ఒక కొత్త వ్యక్తి రాజ్య మందిరంలో కూటాలకు హాజరుకావడం మొదలుపెట్టినప్పుడు సత్యారాధనపట్ల ఆ వ్యక్తికున్న గౌరవాన్ని పెంచడానికి అక్కడున్న ప్రతీ క్రైస్తవుడు దోహదపడతాడు. (1 కొరింథీయులు 14:24, 25) కాబట్టి, ప్రతీ ఏడాది లక్షలాదిమంది కొత్త శిష్యులు తయారౌతుండడాన్నిబట్టి క్రైస్తవులందరూ సంతోషించవచ్చు.

20 ఇతరులకు యెహోవా గురించి, సత్యారాధన గురించి బోధించడానికి చాలామంది నమ్మకమైన క్రైస్తవులు సంతోషిస్తారు. అయితే, వారు ఎంత చక్కగా కృషిచేసినా, వారు అలా బోధించలేకపోయి ఉండవచ్చు. మీ పరిస్థితి కూడా అలా ఉంటే, యెహోవాపట్ల మీకున్న ప్రేమను నిరంతరం బలపర్చుకుంటూ, ప్రజలపట్ల శ్రద్ధ కనబరచండి, స్వయంత్యాగాన్ని, ఓపికను కనబరుస్తూ, మీ బోధనా నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, సత్యం గురించి బోధించాలనే మీ కోరిక గురించి ప్రార్థించండి. (ప్రసంగి 11:1) యెహోవా సేవలో మీరు చేసే ప్రతీదీ, దేవుణ్ణి ఘనపర్చే శిష్యులను తయారుచేసే పనికి దోహదపడుతుందని తెలుసుకొని ఆదరణ పొందండి.

మీరు వివరించగలరా?

• శిష్యులను చేసే పని దేవునిపట్ల మనకున్న ప్రేమను ఎందుకు పరీక్షిస్తుంది?

• శిష్యులను చేసేవారికి ఏ లక్షణాలు అవసరం?

• “బోధనా కళ”లో ఏమి ఇమిడివుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. గతంలో కొంతమంది దేవుని సేవకులకు ఎలాంటి నైపుణ్యాలు, దృక్పథాలు అవసరమయ్యాయి?

2. శిష్యులను చేసే పనికి సంబంధించి మనమే ప్రశ్నలను చర్చించనున్నాం?

3. శిష్యులను చేయుడనే ఆజ్ఞ మనకు ఏ అవకాశాన్నిస్తుంది?

4. యెహోవా గురించి ప్రజలకు బోధించడానికి యేసు ఎందుకు ఇష్టపడ్డాడు?

5, 6. శిష్యులను చేసేవారికి ప్రాముఖ్యంగా ఏ లక్షణం అవసరం?

7, 8. ప్రజలను యేసు ఎలా దృష్టించాడు?

9. శిష్యులను చేసే వ్యక్తిగా పౌలు ఎలాంటి దృక్పథాన్ని కనబరిచాడు?

10, 11. శిష్యులను చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్వయంత్యాగ స్ఫూర్తి ఎందుకు అవసరం?

12, 13. శిష్యులను చేయడానికి ఓపిక ఎందుకు చాలా ప్రాముఖ్యం?

14. మనం ఓపికతో వ్యవహరించినా, శిష్యులను చేసేవారిగా మనం మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించవచ్చు?

15, 16. మనం శిష్యులను చేస్తున్నప్పుడు సరళంగా బోధించడం, చక్కగా సిద్ధపడడం ఎందుకు ప్రాముఖ్యం?

17. లేఖనాలను తర్కబద్ధంగా ఆలోచించేందుకు ప్రజలకు మనమెలా సహాయం చేయవచ్చు?

18. “బోధనా కళ”ను పెంపొందించుకోవడంలో ఏమి ఇమిడివుంది?

19. శిష్యులను చేసే పనిలో క్రైస్తవులందరూ ఎలా పాల్గొంటారు?

20. బైబిలు సత్యాన్ని మీరు ఇతరులకు బోధించాలనుకుంటే మీరేమి చేయాలి?

[21వ పేజీలోని చిత్రం]

శిష్యులను చేయడం ద్వారా క్రైస్తవులు దేవునిపట్ల తమకున్న ప్రగాఢమైన ప్రేమను కనబరుస్తారు

[23వ పేజీలోని చిత్రం]

శిష్యులను చేసేవారు ఇతరులపట్ల ఎందుకు శ్రద్ధ కనబరచాలి?

[24వ పేజీలోని చిత్రం]

శిష్యులను చేసేవారికి ఉండాల్సిన కొన్ని లక్షణాలేమిటి?

[25వ పేజీలోని చిత్రం]

శిష్యులను చేసే పనిలో వస్తున్న సత్ఫలితాలనుబట్టి క్రైస్తవులందరూ పులకిస్తారు