కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొత్తలోకంవైపు పయనం

కొత్తలోకంవైపు పయనం

జీవిత కథ

కొత్తలోకంవైపు పయనం

జాక్‌ ప్రామ్‌బర్గ్‌ చెప్పినది

మధ్య స్వీడన్‌లోని అర్బూగా అనే అందమైన పట్టణ శివార్లలో యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఉంది. అందులో 80 కంటే ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులున్నారు. నేను, నా భార్య క్యారిన్‌ ఇక్కడే నివసిస్తున్నాం, సేవచేస్తున్నాం. ఇంతకీ మేమిక్కడికి ఎలా వచ్చాం?

పంతొమ్మిదవ శతాబ్దాంతంలో, స్వీడన్‌కు చెందిన పదిహేను సంవత్సరాల ఒక అమ్మాయి అమెరికాకు వలసవెళ్ళింది, న్యూయార్క్‌ నగరంలో వలసదారుల ఆశ్రయం దగ్గర, స్వీడన్‌కు చెందిన ఒక నావికుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్ళికి దారితీసింది. కొంతకాలానికి అంటే 1916వ సంవత్సరంలో, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాలోని న్యూయార్క్‌లోవున్న బ్రాంక్స్‌ అనే ప్రాంతంలో నేను వాళ్లకు పుట్టాను.

ఆ తర్వాత కొంతకాలానికి మేము బ్రూక్లిన్‌కి తరలివెళ్ళి, బ్రూక్లిన్‌ హైట్స్‌ అనే రెసిడెన్షియల్‌ బ్లాక్‌లకు కొద్ది దూరంలో ఉండేవాళ్ళం. ఒకసారి నేను, మా నాన్న బ్రూక్లిన్‌ బ్రిడ్జ్‌ దగ్గర బొమ్మ పడవను నడిపామని ఆ తర్వాత నాన్న నాకు చెప్పారు, అక్కడికి దగ్గర్లోనే యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో జరుగుతున్న పనులు నన్నెంతగా ప్రభావితం చేస్తాయో అప్పుడు నాకు తెలీదు.

1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. దాంతో యూరప్‌లో జరుగుతున్న అర్థంపర్థంలేని మారణకాండకు కొంతకాలం తెరపడింది. సైనికులు నిరుద్యోగం, కరువు అనే మరో కొత్త రకమైన సమస్యను ఎదుర్కోవడానికి వాళ్ళ ఇళ్ళకు తిరిగి వెళ్లిపోయారు. స్వీడన్‌కి వెళ్ళిపోవడమే మంచిదని నాన్నకు అనిపించడంతో, మేమందరం 1923వ సంవత్సరంలో స్వీడన్‌కు తిరిగివెళ్ళాం. అక్కడ మేము ఎరిక్‌స్టాడ్‌లో నివసించాం. అది డాల్స్‌లాండ్‌ ప్రాంతంలోవున్న ఒక రైల్వేస్టేషన్‌కి దగ్గర్లోవున్న చిన్న గ్రామం. అక్కడ నాన్న ఇంజనీరింగ్‌ వర్క్‌షాపు పెట్టారు, నేను పెరిగిందీ, చదువుకున్నదీ అక్కడే.

విత్తనం నాటబడింది

నాన్న చేస్తున్న వ్యాపారం అంతబాగా సాగలేదు. అందుకే ఆయన 1930ల తొలిభాగంలో మళ్ళీ నావికుడయ్యారు. ఎన్నో చింతలతో అమ్మ, వర్క్‌షాపు చూసుకుంటూ నేను ఒంటరిగా మిగిలిపోయాము. ఇలా ఉండగా ఒకరోజు, అమ్మ యూహాన్‌ ఇంటికెళ్ళింది, ఆయన అమ్మవాళ్ల అక్క భర్త, నాకు పెద్దనాన్న అవుతారు. లోక పరిస్థితుల్ని చూసి ఆమెంతో బాధపడుతూ, “లోక పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా యూహాన్‌” అని అడిగింది.

దానికి ఆయన, “ఎప్పటికీ అలాగే ఉండవు, రూత్‌” అని అన్నారు. అంతేగాక దుష్టత్వాన్ని నిర్మూలించి, యేసుక్రీస్తు రాజుగా ఉండే రాజ్యం ద్వారా భూమ్మీద నీతియుక్తమైన పరిపాలనను తీసుకువస్తానని దేవుడు చేసిన వాగ్దానం గురించి ఆయన వివరించారు. (యెషయా 9:6, 7; దానియేలు 2:44) ఆ రాజ్యం గురించి ప్రార్థించడాన్నే యేసుక్రీస్తు మనకు నేర్పాడనీ, అది భూమిని పరదైసుగా మార్చబోయే నీతియుక్తమైన పరిపాలన లేదా ప్రభుత్వమని ఆయన వివరించారు.—మత్తయి 6:9, 10; ప్రకటన 21:3, 4.

ఆ బైబిలు వాగ్దానాలు అమ్మనెంతో ఆకర్షించాయి. ఇంటికి వెళ్తూ దారిపొడవునా దేవునికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంది. అమ్మ అలా మతాసక్తి చూపించడం నాన్నకు గానీ, నాకు గానీ నచ్చలేదు. ఈ సమయంలో అంటే, 1930ల మధ్యభాగంలో పశ్చిమ స్వీడన్‌లోని ట్రోల్‌హెట్టన్‌లో పెద్ద వర్క్‌షాపులో నాకు ఉద్యోగం రావడంతో నేను అక్కడికి వెళ్ళిపోయాను. కొంతకాలానికే అమ్మానాన్న నేనుంటున్న ప్రదేశానికి వచ్చారు, అలా రావడానికి కాస్త ముందే నాన్న తను చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగి వచ్చారు. దానితో మళ్ళీ మా కుటుంబం ఒకటైంది.

అమ్మ దేవుని గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే కోరికతో, యెహోవాసాక్షులు ఆ ప్రాంతంలో ఎక్కడున్నారో కనుక్కుంది. ఆ రోజుల్లో కూటాలు, తొలిక్రైస్తవులు జరుపుకున్నట్లుగానే ఇళ్ళలో జరిగేవి. (ఫిలేమోను 1, 2) ఒకరోజు, కూటం కోసం ఇంటినిచ్చే వంతు అమ్మకొచ్చింది. ఎంతో ఆత్రంగా, అమ్మ తన స్నేహితులను ఇంటికి పిలవొచ్చా అని నాన్ననడిగింది. దానికి నాన్న, “నీకు స్నేహితులైతే, నాకూ స్నేహితులే” అన్నారు.

అంతే ప్రజలు మా ఇంటికి రావడం మొదలుపెట్టారు. వారు ఇంట్లోకి వచ్చీరావడంతోనే నేను బయటకు వెళ్ళిపోయేవాణ్ణి. అయితే, వారు కూటాలకు వచ్చినప్పుడు నేను కూడా ఉండాలని ఆ తర్వాత కొద్ది కాలానికే నిశ్చయించుకున్నాను. సాక్షుల స్నేహస్వభావం, వాస్తవమైన, సరళమైన వారి తర్కం నాలోని అపోహలను తొలగించాయి. భవిష్యత్తు నిరీక్షణపై ఒక ఆశ నా మనసులో చిగురించనారంభించింది.

నావికుణ్ణి కావడం

మా నాన్న నుండి వారసత్వంగా పొందినందుకు అనుకుంటా, నేను కూడా నావికుణ్ణయ్యాను. అయినప్పటికీ దేవునికి సన్నిహితంగా ఉండవలసిన అవసరముందనే విషయాన్ని మర్చిపోలేదు. ఓడ, రేవు దగ్గర ఆగినప్పుడల్లా యెహోవాసాక్షులను కలుసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. వారెక్కడున్నారో తెలుసుకోవడానికి నేను హాలెండ్‌లోవున్న (ఇప్పుడిది నెదర్లాండ్స్‌ అని పిలవబడుతుంది) ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక పోస్టాఫీసుకు వెళ్ళాను. అక్కడ వాళ్ళలో వాళ్ళు కొంచెంసేపు చర్చించుకున్న తర్వాత నాకొక అడ్రస్‌ ఇచ్చారు దాన్ని తీసుకొని వెంటనే ఆ ఇంటికి వెళ్ళాను. పదిసంవత్సరాల అమ్మాయి నన్ను సాదరంగా ఆహ్వానించింది. నేనెవరో వారికి తెలియకపోయినప్పటికీ కొద్దిసేపట్లోనే ఆ అమ్మాయితో, ఆమె కుటుంబంతో ఎనలేని బంధం ఏర్పడినట్లు నాకనిపించింది. అద్భుతమైన అంతర్జాతీయ సహోదరత్వపు రుచిని నేను ఆస్వాదించాను!

మా భాషలు వేరైనా ఆ కుటుంబంలోని వారు క్యాలెండర్‌, రైల్వే షెడ్యూల్‌ పుస్తకం తీసి మ్యాప్‌ వేయడం ప్రారంభించడంతో అక్కడికి దగ్గర్లోవున్న హార్లీమ్‌ అనే పట్టణంలో అసెంబ్లీ జరగబోతోందన్న విషయం నాకు అర్థమయ్యింది. నాకు ఒక్కముక్క కూడా అర్థంకాలేదు, అయినా నాకు అసెంబ్లీ చాలా బాగా నచ్చింది. ఆదివారం జరగబోయే బహిరంగ ప్రసంగానికి సాక్షులు ఆహ్వానప్రతులు ఇస్తుండడం చూసి నాకు కూడా ఇవ్వాలనిపించింది. ప్రజలు తీసుకుని కిందపారేసిన ఆహ్వానప్రతులను నేను ఏరుకొని వాటిని వేరేవారికిచ్చాను.

ఒకసారి మేము అర్జెంటీనాలోని బ్యూనోస్‌ ఐర్స్‌లో ఆగాం. అక్కడ యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక ఆఫీసు, స్టోర్‌రూము ఉన్నాయి. టేబుల్‌ దగ్గర ఒకావిడ కూర్చుని ఏదో అల్లికపని చేసుకుంటుంది, ఆమె పక్కనే ఒక చిన్నమ్మాయి, ఆమె కూతురనుకుంటాను బొమ్మతో ఆడుకుంటోంది. అప్పటికే చాలా రాత్రయింది, ఒకాయన షెల్ఫులో నుండి స్వీడిష్‌ భాషలోవున్న సృష్టికర్త అనే పుస్తకాన్ని దాంతోపాటు మరికొన్ని పుస్తకాలను తీసుకుంటున్నారు. అక్కడున్న వారి ముఖాల్లో కనబడుతున్న ఆనందాన్ని, ఆహ్లాదాన్ని చూసినప్పటి నుండి నాకు కూడా వారిలో ఒకడినవ్వాలని అనిపించింది.

మేము తిరిగి వెళ్తున్నప్పుడు, న్యూ ఫౌండ్‌ లాండ్‌ తీరానికి సమీపంలో కెనడాకు చెందిన సైనిక విమానం కూలిపోవడంతో, దానిలోని సిబ్బందిని మా ఓడలోకి ఎక్కించుకున్నాం. కొన్నిరోజుల తర్వాత మేము స్కాట్లండ్‌కు చేరుకుంటుండగా, ఇంగ్లాండ్‌కు చెందిన నావిక దళంవారు మమ్మల్ని అరెస్ట్‌ చేశారు. విచారణ కోసం మమ్మల్ని ఆర్క్‌నీ ద్వీపాల్లోవున్న కిర్క్‌వాల్‌కు తీసుకెళ్ళారు. ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది, హిట్లర్‌ నాజీ బృందం 1939లో పోలండ్‌ను ముట్టడించింది. కొన్నిరోజుల తర్వాత, మేము విడుదలై ఏ సమస్యా లేకుండా స్వీడన్‌కు తిరిగొచ్చాం.

నేను ఇంటికి తిరిగి రావడమే కాక, దేవునితో నా సంబంధానికి ఎక్కువ అవధానం ఇవ్వగలిగాను. నేను దేవుని ప్రజలతోనే ఉండాలని, వారితో సహవసించడం మానకూడదని మనసారా కోరుకున్నాను. (హెబ్రీయులు 10:24, 25) నావికుడిగా ఉంటూ తోటి నావికులకు ఎప్పుడూ సాక్ష్యమిచ్చేవాణ్ణి, వారిలో ఒకరు సాక్షిగా మారారని కూడా నాకు తెలిసింది, వాటిని గుర్తుతెచ్చుకున్నప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది.

ప్రత్యేక సేవ

1940వ సంవత్సరంలోని తొలిభాగంలో స్టాక్‌హోమ్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించాను. యోహాన్‌ హెచ్‌. ఇనెరోట్‌ నన్ను సాదరంగా ఆహ్వానించారు, ఆయన అప్పట్లో స్వీడన్‌లో జరుగుతున్న ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్నారు. పూర్తికాల పయినీరు పరిచారకుడిగా ప్రకటనా పనిలో పాల్గొనాలనుందని నేనాయనతో చెప్పినప్పుడు, ఆయన నా వైపు తదేకంగా చూసి, “ఇది దేవుని సంస్థని నమ్ముతున్నావా” అని అడిగారు.

దానికి నేను “అవును” అని సమాధానమిచ్చాను. అలా నేను 1940 జూన్‌ 22న బాప్తిస్మం తీసుకొని, ఆహ్లాదకరమైన వాతావరణంలో, మాదిరికరమైన తోటి పనివారి మధ్య బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడం ప్రారంభించాను. వారాంతాలు మేము పరిచర్యలో గడిపేవాళ్ళం. వేసవికాలంలో, సుదూర క్షేత్రాలకు సైకిళ్ల మీద వెళ్ళి, శని ఆదివారాలు ప్రకటిస్తూ రాత్రులు అక్కడే గడ్డివాముల్లో నిద్రపోయేవాళ్ళం.

మేము స్టాక్‌హోమ్‌లోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇంటింటి పరిచర్య చేసేవాళ్ళం. ఒకసారి ఒకాయన బేస్‌మెంట్‌లో తన బాయిలర్‌ని కంగారుగా, గబగబా బాగుచేసుకుంటుండడం గమనించాను. నేను వెళ్ళి ఆయనకు సహాయం చేశాను. అది కారడం ఆగిన తర్వాత, ఆయన నా వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ, “మీరేదో పనిమీద వచ్చినట్టున్నారనుకుంటాను. పైకి రండి, చేతులు కడుక్కుని కాఫీ తాగుదురుగానీ” అన్నాడు. పైకి వెళ్ళి కాఫీ తాగుతూ ఆయనకు సాక్ష్యమిచ్చాను. కొంతకాలానికి ఆయన తోటి క్రైస్తవుడయ్యాడు.

యుద్ధంలో ఎవరి పక్షమూ వహించనని స్వీడన్‌ చెప్పుకున్నా దాని ప్రజలు మాత్రం యుద్ధంవల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో మగవారిని సైన్యంలో చేరమని ఆదేశించారు, వారిలో నేను కూడా ఉన్నాను. నేను మిలటరీ కవాతు చేయనన్నందుకు వాళ్ళు నన్ను కొంతకాలం జైల్లో ఉంచారు. ఆ తర్వాత నాకు వర్క్‌ క్యాంపులో పనిచేసే శిక్ష విధించారు. యౌవన సాక్షులను తరచూ జడ్జి ముందు హాజరుపర్చేవారు, అప్పుడు మేము దేవుని రాజ్యం గురించి సాక్ష్యమిచ్చేవాళ్ళం. ఇది “వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు” అని యేసు చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చింది.—మత్తయి 10:18.

నా జీవితం మారడం

1945లో యూరప్‌లో యుద్ధం ముగిసింది. ఆ సంవత్సరంలోనే, అప్పట్లో ప్రపంచవ్యాప్త పనికి నాయకత్వం వహిస్తున్న నేథన్‌ హెచ్‌. నార్‌ తన సెక్రటరీ మిల్టన్‌ హెన్షెల్‌తో కలిసి బ్రూక్లిన్‌ నుండి మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వారి సందర్శనం వ్యక్తిగతంగా నాకు, స్వీడన్‌లో జరుగుతున్న ప్రకటనా పని పునఃసంస్థీకరించడానికి ఎంతగానో తోడ్పడింది. వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరయ్యే అవకాశం ఉందని విన్న వెంటనే దరఖాస్తు పెట్టాను.

మరుసటి సంవత్సరమే నేను ఆ స్కూల్‌కి హాజరయ్యాను. అప్పట్లో అది న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌కి దగ్గర్లోవుంది. ఐదు నెలల శిక్షణా సమయంలో నేను పొందిన శిక్షణ బైబిలుపట్ల, దేవుని సంస్థపట్ల నా మెప్పుదలను మరింత ఎక్కువ చేసింది. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి నాయకత్వం వహిస్తున్నవారు స్నేహశీలురు, దయార్దహృదయులని నేను తెలుసుకున్నాను. వారు మాతోపాటు ఎంతో కష్టపడి పనిచేసేవారు. (మత్తయి 24:14) ఇదంతా నాకు ఆశ్చర్యమనిపించలేదుగానీ, నేను అదంతా కళ్ళారా చూడడం సంతోషమనిపించింది.

గిలియడ్‌ స్కూల్‌ యొక్క ఎనిమిదవ తరగతి వారు పట్టభద్రులయ్యే రోజు చాలా త్వరగా వచ్చేసింది, అది 1947 ఫిబ్రవరి 9న జరిగింది. సహోదరుడైన నార్‌, విద్యార్థులమైన మేము ఏయే దేశాలకు పంపించబడుతున్నామో ప్రకటించారు. నా వంతు వచ్చినప్పుడు ఆయన, “బ్రదర్‌ ప్రామ్‌బర్గ్‌ తన సహోదరులకు సేవచేయడానికి తిరిగి స్వీడన్‌కు వెళ్తున్నారు” అని చెప్పాడు. ఇంటికి తిరిగివెళ్తున్నందుకు నాకంత ఉత్సాహమేమీ అనిపించలేదని నేను ఒప్పుకోవలసిందే.

కష్టమైన నియామకాన్ని చేపట్టడం

స్వీడన్‌కు తిరిగివచ్చినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రారంభించబడిన ఒక కొత్త నియామకం గురించి అంటే జిల్లా సేవ గురించి తెలిసింది. స్వీడన్‌లో మొట్టమొదటి జిల్లా పైవిచారణకర్తగా సేవచేయడానికి నేను నియమించబడ్డాను, నా నియామకమేమిటంటే దేశమంతటా జరుగుతున్న పనిని పర్యవేక్షించడం. స్వీడన్‌ అంతటావున్న నగరాల్లో, పట్టణాల్లో ప్రాంతీయ సమావేశాలు అని పిలవబడే వాటిని ఏర్పాటుచేసి, వాటిని పర్యవేక్షించాను. ఈ ఏర్పాటు పూర్తిగా కొత్తదవడంతో నాకు ఎక్కువ ఆదేశాలు ఇవ్వబడలేదు. సహోదరుడైన ఇనెరోట్‌, నేను కూర్చొని మేము చేయగలిగినంత చక్కగా ఒక కార్యక్రమాన్ని తయారుచేశాం. నాకు ఈ పని అప్పగించబడినప్పుడు నేనెంతో కంగారుపడ్డాను, ఎన్నోసార్లు యెహోవాకు ప్రార్థన చేసుకున్నాను. 15 సంవత్సరాలు జిల్లా పైవిచారణకర్తగా సేవచేసే ఆధిక్యత నాకు లభించింది.

ఆ రోజుల్లో సమావేశాలు జరుపుకోవడానికి అనువైన స్థలాలు దొరకడం చాలా కష్టంగా ఉండేది. వేడి ఉత్పత్తి చేసే సౌకర్యాలు సరిగా లేని, అంతగా శుభ్రంగా లేని డాన్సు హాళ్ళను, ఇతర హాళ్ళను మేము ఉపయోగించుకోవాల్సి వచ్చేది. ఫిన్‌లాండ్‌లోని రోక్యోలో జరిగిన సమావేశమే దానికి నిదర్శనం. సమావేశం జరిగిన హాలు పాత కమ్యూనిటీ సెంటర్‌, దాన్ని కొన్ని రోజులుగా ఎవరూ ఉపయోగించడంలేదు. మంచు తుఫాను వచ్చింది, వాతావరణం మైనస్‌ 20 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోయింది. అందుకని మేము వేడి ఉత్పత్తిచేయడానికి, నూనె డ్రమ్ములతో చేయబడిన రెండు పెద్ద స్టవ్‌లను వెలిగించాము. అయితే పొగగొట్టంలో పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయన్న సంగతి మాకు తెలీదు. దాంతో హాలంతా పొగతో నిండిపోయింది! అయినా అక్కడున్న ప్రతీఒక్కరూ కోట్లు వేసుకుని, ఒకవైపు కళ్ళు మండుతున్నా అలాగే కూర్చునివున్నారు. అలా ఆ అసెంబ్లీ నాకు ప్రత్యేకంగా గుర్తుండిపోయింది.

మూడు రోజులు జరిగే ఈ ప్రాంతీయ సమావేశాల సంస్థీకరణ కోసం ఇచ్చిన ఆదేశాల్లో ఒకటేమిటంటే సమావేశానికి హాజరయ్యేవారికోసం ఆహారాన్ని ఏర్పాటు చేయడం. దానికి మా దగ్గర వంటసామాగ్రి లేకపోగా అలాంటి పని మేము ఇంతకుముందెప్పుడూ చేయలేదు. అయితే మా దగ్గరున్న అనుభవం గల సహోదర సహోదరీలు ఆ పని చేయడానికి సంతోషంగా ముందుకొచ్చారు. అసెంబ్లీ జరగబోయే ముందురోజు పెద్ద గిన్నెలోవున్న బంగాళాదుంపల పొట్టు తీస్తూ ఒకరితో ఒకరు అనుభవాలు పంచుకుంటూ సంతోషంగా సమయం గడిపేవారు. అలాంటి సందర్భాల్లోనే, సహోదర సహోదరీలు కష్టించి పనిచేస్తున్నప్పుడు శాశ్వతంగా నిలిచిపోయే స్నేహాలు ఎన్నో చిగురించాయి.

అప్పట్లో ప్రాంతీయ సమావేశాల గురించి తెలియజేసే ప్లకార్డులతో నడుస్తూ ప్రచారం చేయడం మా పనిలో మరో అంశం. బహిరంగ ప్రసంగానికి ప్రజలను ఆహ్వానించడానికి పట్టణంగుండా, గ్రామంగుండా గుంపుగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ప్రజలు సాధారణంగా చాలావరకు దయగలవారు, మర్యాదస్థులు. ఒకసారి ఫిన్‌స్పాంగ్‌ అనే నగరంలో ఒక ఫ్యాక్టరీలో నుండి పనివాళ్ళు గుంపులుగా బయటకొస్తున్నారు. ఉన్నట్టుండి వారిలో ఒకాయన గట్టిగా ఇలా అరిచాడు, “అదిగో అటు చూడండి, హిట్లర్‌ లోబర్చుకోలేకపోయిన గుంపు!”

నా జీవితంలో ఒక విశేషమైన సంఘటన

క్యారిన్‌ అనే అందమైన అమ్మాయి పరిచయమైన తర్వాత, ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేస్తున్న నా జీవితం మారింది. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో 1953 జూలైలో జరిగిన యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి మేమిద్దరం ఆహ్వానించబడ్డాం. అక్కడే, సోమవారం 20న జరిగిన కార్యక్రమం మధ్యలో అంటే విరామసమయంలో మిల్టన్‌ హెన్షెల్‌ మా వివాహాన్ని జరిపించారు. అది బేస్‌బాల్‌ స్టేడియంగా ప్రఖ్యాతిగాంచిన స్టేడియంలో జరిగిన అరుదైన సంఘటన. 1962 వరకు ప్రయాణ పనిలో కలిసి సేవచేసిన తర్వాత, క్యారిన్‌, నేను స్వీడన్‌ బెతెల్‌లో సేవచేసేందుకు ఆహ్వానించబడ్డాం. మొదట్లో నేను పత్రికా విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత మెకానిక్‌గా నాకున్న అనుభవాన్నిబట్టి ప్రింటింగ్‌ పనిని అలాగే బ్రాంచిలోని ఇతర యంత్రాలను చూసుకునే పనిని అప్పగించారు. క్యారిన్‌ లాండ్రీ విభాగంలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఇప్పటికి ఎన్నో సంవత్సరాలుగా ఫ్రూఫ్‌రీడింగ్‌ విభాగంలో సేవచేస్తోంది.

దంపతులుగా మేమిద్దరం 54 కన్నా ఎక్కువ సంవత్సరాలు కలిసి యెహోవాను సేవించాం. ఈ సంవత్సరాలన్నింటిలో, ప్రాముఖ్యమైన, ఉత్తేజకరమైన సంఘటనలతో అర్థవంతమైన, సంతోషకరమైన జీవితం మా సొంతమైంది! ప్రేమగల, కష్టపడి పనిచేసే సేవకులతో యెహోవా తన సంస్థను ఆశీర్వదించాడు. 1940లో బ్రాంచిలో నేను సేవచేయడం మొదలుపెట్టినప్పుడు స్వీడన్‌లో కేవలం 1,500 మంది సాక్షులున్నారు. ఇప్పుడక్కడ 22,000 కన్నా ఎక్కువమంది సాక్షులున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతోంది. అందుకే ఇప్పుడు మనం భూవ్యాప్తంగా అరవై ఐదు లక్షలకన్నా ఎక్కువకు చేరుకున్నాం.

ఓడ తెరచాపను గాలి నెడుతున్నట్లుగానే యెహోవా ఆత్మ మన పనిని నిర్దేశిస్తోంది. మనం మన విశ్వాస నేత్రాలతో అస్థిరమైన మానవజాతి అనే సముద్రాన్ని తేరిచూచినప్పుడు మనం చలించము. మన కళ్ల ఎదుట దేవుని నూతనలోకం స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడు చూపించిన మంచితనానికి క్యారిన్‌, నేను ఎంతో కృతజ్ఞులం. మేమిద్దరం మా యథార్థతను కాపాడుకోవాలని, మా లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే దేవుని ఆమోదాన్ని, నిత్యజీవాన్ని పొందాలని ప్రతీరోజు ప్రార్థిస్తున్నాం.—మత్తయి 24:13.

[12వ పేజీలోని చిత్రం]

అమ్మ ఒడిలో

[13వ పేజీలోని చిత్రం]

1920ల ప్రారంభంలో నాన్న, నేను బొమ్మ పడవను నడిపిన స్థలం

[15వ పేజీలోని చిత్రం]

మిల్టన్‌ నాన్నగారైన హెర్మెన్‌ హెన్షెల్‌తో 1946లో గిలియడ్‌ దగ్గర

[16వ పేజీలోని చిత్రాలు]

1953 జూలై 20న యాంకీ స్టేడియంలో మా వివాహమైంది