కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐక్యమవుతున్నారు—ఎలా?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐక్యమవుతున్నారు—ఎలా?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐక్యమవుతున్నారు—ఎలా?

మీరు “ఐక్యతను” ఎలా నిర్వచిస్తారు? కొందరు, ఆ పదానికి పోరాటంలేకుండా ఉండడం అనే సాధారణ అర్థాన్నిస్తారు. ఉదాహరణకు, రెండు లేక అంతకంటే ఎక్కువ దేశాలు శాంతి ఒప్పందంమీద సంతకాలు చేసి, దాని షరతులకు ఒప్పుకుంటే, అవి ఐక్యమైవున్నాయని చెప్పవచ్చు. అయితే, నిజంగా అలా జరుగుతుందా? జరగకపోవచ్చు.

చరిత్రంతటిలో, వేలాది శాంతి ఒప్పందాలు కుదుర్చుకోబడ్డాయి, ఉల్లంఘించబడ్డాయి కూడా. ఎందుకు? ఎందుకంటే, తరచూ ప్రపంచ నాయకులు శాంతి లేదా ఐక్యత తీసుకురావడంకన్నా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే, కొన్ని దేశాలు, సైనిక బలంలో తాము ఇతర దేశాలకన్నా వెనుకబడితే ఏమౌతుందోనని కూడా భయపడుతున్నాయి.

అందువల్ల, రెండు దేశాల మధ్య యుద్ధం లేదంటే ఆ రెండు దేశాలు శాంతితో ఐక్యంగా ఉన్నాయని కాదు. నిజానికి, ఇద్దరు వ్యక్తులు తుపాకీలను ఒకరివైపు ఒకరు గురిపెట్టి ఎవరూ తుపాకీని పేల్చనంత మాత్రాన వారిరువురు శాంతిగా ఉన్నారనుకోవచ్చా? అలా అనుకోవడం అవివేకం. కానీ, అనేక దేశాల్లో నేడు అలాంటి పరిస్థితే ఉంది. ప్రజల్లో అపనమ్మకం పెరగడం వల్ల, ఏదో ఒకరోజు ఆయుధాలు ప్రయోగించబడతాయనే భయం ఎక్కువవుతోంది. అలాంటి విపత్తును ఆపుచేయడానికి ఏమిచేయడం జరిగింది?

అణ్వస్త్ర భయాలు—ఐక్యతకు ప్రమాదకరం

అనేకమంది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి) వైపు నిరీక్షణతో చూస్తున్నారు. 1968వ సంవత్సరంలో ఆమోదించబడిన ఈ ఒప్పందం, అణ్వాయుధాలు లేని దేశాలు వాటిని తయారు చేసుకోవడాన్ని, అణ్వాయుధాలు ఉన్న దేశాలు వాటిని అధికం చేసుకోవడాన్ని నిరోధిస్తుంది. అయితే, ప్రస్తుతం 180 కన్నా ఎక్కువ దేశాలు ఆమోదిస్తున్న ఎన్‌పిటి అంతిమ లక్ష్యం పూర్తి నిరాయుధీకరణే.

అయితే ఈ లక్ష్యం ఎంతో ప్రశంసనీయమైనదన్నట్లుగానే అనిపించినా, కొంతమంది విమర్శకులు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అంటే, కొన్ని దేశాలను “న్యూక్లియర్‌ క్లబ్బు”లో భాగం కాకుండా చేయాలన్న ప్రయత్నం, అంటే ఆయుధాలు లేని దేశాలు వాటిని తయారు చేసుకోకుండా ఆపాలన్న ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదని భావిస్తారు. అందుకే, శాంతి ఒప్పందంమీద సంతకాలు పెట్టిన దేశాల్లో కొన్ని పునరాలోచిస్తాయేమోననే భయం కలుగుతోంది. నిజానికి, ఆయుధాలను తయారు చేసుకోవడాన్ని నిషేధించడం చాలా అన్యాయమని కొన్ని దేశాలు భావిస్తున్నాయి ఎందుకంటే ఆయుధాలుంటే తమనుతాము రక్షించుకోగలమన్నది వాటి అభిప్రాయం.

అణు శక్తి తయారు చేసుకోకుండా ఏ దేశమూ నిషేధించబడలేదన్న వాస్తవం, వివాదాన్ని సంక్లిష్టం చేయడమే కాక, బహుశా ప్రమాదం జరిగే అవకాశాన్ని కూడా ఎక్కువచేస్తోంది. ఇది, అణు శక్తిని శాంతియుత ఉద్దేశాల కోసమే ఉపయోగించుకుంటున్నామని చెప్పుకుంటున్న దేశాలు అణ్వాయుధాలను రహస్యంగా వృద్ధిచేసుకుంటున్నాయేమో అనే భయాన్ని కొందరిలో పుట్టిస్తోంది.

ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా ఎన్‌పిటిని నిర్లక్ష్యం చేయవచ్చు. అణ్వాయుధాలు విస్తారంగా ఉన్న దేశాలు తమకున్న ఆయుధాలను లేకుండా చేస్తాయని లేదా తమదగ్గర ఉన్న స్టాకును తగ్గిస్తాయని ఎదురుచూడడం మూర్ఖత్వమే అవుతుందని విమర్శకులు చెబుతున్నారు. ఒక పుస్తకం ప్రకారం, “అది సాధ్యమవ్వాలంటే, . . . ప్రస్తుతం ఒకదాన్నొకటి వ్యతిరేకించుకుంటున్న దేశాల మధ్య ఎంతో గట్టి స్నేహబంధం, నమ్మకం ఏర్పడాలి. అలా ఎప్పటికైనా జరుగుతుందని [నమ్మడం కష్టం].”

ఐక్యతను సాధించడానికి మానవులు యథార్థంగా ఎంత కృషిచేసినా, అదంతా నిష్ప్రయోజనమేనని రుజువైంది. ఇది బైబిలు విద్యార్థులకు ఆశ్చర్యం కల్గించదు, ఎందుకంటే దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లే[దు].” (యిర్మీయా 10:23) బైబిలు స్పష్టంగా ఇంకా ఇలా చెబుతోంది: “ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.” (సామెతలు 16:25) ఐక్యతను తీసుకురావడానికి మానవ ప్రభుత్వాలు చేసే కృషి పరిమితమైనది. అయినప్పటికీ, మనకు నిరీక్షణ లేకపోలేదు.

నిజమైన ఐక్యతకు మూలం

ప్రపంచం ఐక్యమౌతుంది అనే దేవుని వాగ్దానం బైబిల్లో ఉంది అయితే అది మానవ కృషివల్ల మాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా మానవులంతా సమాధానంగా జీవించాలని సంకల్పించిన సృష్టికర్త, మానవులు సాధించలేని దానిని సాధిస్తాడు. దీన్ని నమ్మడం కొంతమందికి కష్టంగా ఉండవచ్చు. అయినప్పటికీ, మానవజాతి శాంతి సామరస్యాలతో జీవించాలన్నదే దేవుని ఆది సంకల్పం. * మానవజాతిని ఐక్యపరచాలన్నదే ఇప్పటికీ దేవుని సంకల్పమని బైబిల్లోని అనేక లేఖనాలు సూచిస్తున్నాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి:

“యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు [‘అద్భుత కార్యములు,’ NW] కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”—కీర్తన 46:8, 9.

“నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు; సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.”—యెషయా 11:9.

“మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.”—యెషయా 25:8.

“మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”—2 పేతురు 3:13.

[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:4.

ఈ వాగ్దానాలు నమ్మదగినవి. ఎందుకు? ఎందుకంటే, సృష్టికర్తగా యెహోవా దేవునికి మానవజాతి మధ్య ఐక్యతను తీసుకువచ్చే శక్తిసామర్థ్యాలున్నాయి. (లూకా 18:27) అలా తేవాలని ఆయన కోరుకుంటున్నాడు కూడా. వాస్తవానికి, ‘పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనన్నది’ దేవుని ‘దయాసంకల్పము’ అని బైబిలు చెబుతోంది.—ఎఫెసీయులు 1:8-10.

దేవుడు వాగ్దానం చేసిన ‘నీతి నివసించే క్రొత్త భూమి’ కేవలం ఊహాజనిత కోరిక కాదు. (2 పేతురు 3:13) యెహోవా తాను వాగ్దానం చేసిన దాని గురించి ఇలా చెబుతున్నాడు: “నిష్ఫలముగా నాయొద్దకు మరలక, అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:10, 11.

దేవుని వాక్యంచేత ఐక్యమయ్యారు

ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన ప్రకారం, మానవజాతిని ఐక్యం చేయడానికి బదులు విభజించడంలో మతం తరచూ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ విషయాన్ని గంభీరంగా పరిగణించాలి ఎందుకంటే సృష్టికర్త ఉన్నాడని మనం అంగీకరిస్తే, ఆయనను ఆరాధించేవారు ఒకరితో ఒకరు సమాధానంగా ఐక్యంగా ఉండాలని ఎదురుచూడడం సహేతుకం కాదా? సహేతుకమే!

మానవజాతి మధ్య మతం కలిగిస్తున్న విభజనలకు యెహోవా దేవుణ్ణిగానీ ఆయన వాక్యాన్నిగానీ నిందించకూడదు. వాస్తవానికి, మతాలు దేవుని సంకల్పాన్ని సమర్థించే బదులు ఐక్యత కోసం మానవనిర్మిత పథకాలను ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి అవి నిందార్హమైనవి. తన కాలంనాటి మతనాయకులను యేసు “వేషధారులారా” అని పిలుస్తూ వారితో ఇలా చెప్పాడు: “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే.”—మత్తయి 15:7-9.

దానికి భిన్నంగా, సత్యారాధన ప్రజలపై ఐక్యపరచే ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రవక్తయైన యెషయా ఇలా ప్రవచించాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పుతీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:2, 4.

యెహోవాసాక్షులు నేడు 230కన్నా ఎక్కువ దేశాల్లో, ఐక్యత సాధించే విషయంలో యెహోవా దేవుడు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారు. వారి ఐక్యతకు పునాది ఏమిటి? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొస్సయులు 3:14) ‘బంధం’ అనే పదానికి పౌలు ఉపయోగించిన ఆదిమ భాషాపదం, మానవ శరీరంలోని స్నాయుబంధాన్ని సూచిస్తుండవచ్చు. ఆ స్నాయుబంధాలు తాడులా గట్టిగా ఉండి, ముఖ్యంగా రెండు పనులు చేస్తాయి. శరీరంలోని అవయవాలను వాటి వాటి స్థానంలో ఉంచుతాయి, ఎముకలను స్థిరంగా కలిపి కడతాయి.

ప్రేమ కూడా అంతే. ఈ లక్షణం కేవలం ఒకరినొకరు చంపుకోకుండా ఆపడంకన్నా ఎక్కువే చేస్తుంది. విభిన్న నేపథ్యాల వ్యక్తులు సమాధానంగా కలిసిమెలసి ఉండడానికి క్రీస్తులాంటి ప్రేమ సహాయం చేస్తుంది. ఉదాహరణకు, బంగారు సూత్రమని తరచూ పిలవబడే దాని ప్రకారం జీవించడానికి ప్రజలకు ఇది సహాయపడుతుంది. మత్తయి 7:12లో నమోదుచేయబడిన ఆ బంగారు సూత్రాన్ని యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” ఈ నిర్దేశాన్ని అనుసరించడం వల్ల అనేకమంది దురభిమానాన్ని అధిగమించగలిగారు.

‘ఒకరియెడల ఒకరు ప్రేమగలవారై’ ఉండండి

యెహోవాసాక్షులు, యేసుక్రీస్తు చెప్పిన దానిని చేయడం ద్వారా తమనుతాము ఆయన శిష్యులుగా నిరూపించుకొనే దృఢసంకల్పంతో ఉన్నారు. ఆయన ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:35) జాతుల మధ్య ఘర్షణలు, రాజకీయ సంక్షోభాల సమయంలో అలాంటి ప్రేమ అసాధారణమైన రీతిలో కనపరచబడింది. ఉదాహరణకు, 1994లో రువాండాలో జాతి నిర్మూలనం జరిగినప్పుడు, యెహోవాసాక్షులు ఒకరిపట్ల ఒకరు తమకున్న ప్రేమను ప్రదర్శించారు. హుటు తెగకు చెందిన సాక్షులు, టుట్సీ తెగకు చెందిన తమ సహోదరులను రక్షించడానికి తమ జీవితాలనే పణంగా పెట్టారు!

నిజమే ప్రపంచ దేశాలు, ప్రపంచ ఐక్యత సాధ్యమయ్యేంతగా తమ పొరుగు దేశాలపట్ల ప్రేమను వృద్ధి చేసుకోవాలని ఆశించడం సహేతుకం కాదు. బైబిలు ప్రకారం అది తగినకాలంలో దేవుని ద్వారా సాధించబడుతుంది. అయితే, ఇప్పుడు కూడా ప్రజలు పరస్పరం ప్రేమ చూపించుకుంటూ ఐక్యతను సాధించవచ్చు.

యెహోవాసాక్షులు గత సంవత్సరంలో, బైబిలు గురించి, ఆధునిక జీవితంలో దాని విలువ గురించి ప్రజలకు తెలియజెప్పడానికి వంద కోట్లకన్నా ఎక్కువ గంటలు వెచ్చించారు. దేవుని వాక్యపు ఖచ్చితమైన జ్ఞానం లక్షలాదిమందిని ఐక్యం చేసింది, వారిలో కొందరు ఒకప్పుడు ఒకరినొకరు ద్వేషించుకున్నవారే. ఉదాహరణకు అరబ్‌లకు యూదులకు మధ్య, అర్మేనియన్‌లకు టర్కిష్‌వాళ్ళకు మధ్య, జర్మనీవాళ్ళకు రష్యావాళ్ళకు మధ్య అలాంటి ద్వేషం ఉండేది.

దేవుని వాక్యమైన బైబిలు చూపించగల ఐక్యపరచే ప్రభావం గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్థానికంగా ఉన్న యెహోవాసాక్షులను దయచేసి సంప్రదించండి లేక 2వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకనుకూలమైన దానికి వ్రాయండి.

[అధస్సూచి]

^ పేరా 12 మానవజాతిపట్ల దేవుని సంకల్పం గురించి ఎక్కువ సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 3వ అధ్యాయాన్ని చూడండి.

[4వ పేజీలోని బ్లర్బ్‌]

వేలాది శాంతి ఒప్పందాలు కుదుర్చుకోబడ్డాయి, ఉల్లంఘించబడ్డాయి

[7వ పేజీలోని బ్లర్బ్‌]

మానవ ప్రభుత్వాలు సాధించలేని దానిని, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా సాధించడం జరిగింది

[5వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యం నిజమైన ఐక్యతకు మూలమేమిటో తెలియజేస్తుంది

[7వ పేజీలోని చిత్రం]

హుటు టుట్సీ తెగలకు చెందిన యెహోవాసాక్షులు కలిసి ఆరాధనా స్థలాన్ని నిర్మించుకోవడం