కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తారా?

మీరు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తారా?

మీరు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తారా?

“యెహోవా రాజ్యము చేయుచున్నాడు. . . . ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి.”—కీర్తన 96:10.

సా.శ. 29 దాదాపు అక్టోబరులో భూమ్మీద క్రితమెన్నడూ జరగని ఓ అద్భుత సంఘటన జరిగింది. సువార్త రచయిత మత్తయి ఇలా నివేదిస్తున్నాడు: “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన [యేసు] మీదికి వచ్చుట [బాప్తిస్మమిచ్చు యోహాను] చూచెను. మరియు—ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” సువార్త రచయితలు నలుగురూ నివేదించిన కొన్ని సంఘటనల్లో ఇదొకటి.—మత్తయి 3:16, 17; మార్కు 1:9-11; లూకా 3:21, 22; యోహాను 1:32-34.

2 బహిరంగంగా యేసుపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం ఆయనను అభిషిక్తునిగా గుర్తించింది. అభిషిక్తుడనే మాటకు అర్థం మెస్సీయ లేదా క్రీస్తు. (యోహాను 1:33) చివరకు, వాగ్దత్త “సంతానము” ఎవరో వెల్లడైంది! బాప్తిస్మమిచ్చు యోహాను ఎదుట నిలబడిన వ్యక్తి మడిమెమీదే సాతాను కొడతాడు, మడిమెమీద కొట్టబడిన ఆ వ్యక్తే యెహోవాకు, ఆయన సర్వాధిపత్యానికి ప్రధాన శత్రువైన అపవాది తలమీద కొడతాడు. (ఆదికాండము 3:15) అప్పటినుండి, యేసు తాను యెహోవా సర్వాధిపత్యానికి, రాజ్యానికి సంబంధించిన యెహోవా సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషిచేయాలన్న విషయాన్ని పూర్తిగా గ్రహించాడు.

3 తనకు అప్పగించబడిన నియామకానికి సిద్ధపడేందుకు “యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునది నుండి తిరిగి వచ్చి . . . ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను.” (లూకా 4:1; మార్కు 1:12) అక్కడ యేసుకు 40 రోజులపాటు, సర్వాధిపత్యం విషయంలో సాతాను లేవదీసిన వివాదం గురించి, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేందుకు తాను చేపట్టవలసిన విధానం గురించి లోతుగా ధ్యానించడానికి సమయం లభించింది. ఆ వివాదంలో అటు పరలోకంలో ఇటు భూమిపైవున్న బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరూ ఇమిడివున్నారు. కాబట్టి యేసు విశ్వాస్యతా విధానాన్ని ధ్యానిస్తూ, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేందుకు మనమూ ఇష్టపడుతున్నామని చూపించేందుకు ఏమిచేయాలో ఆలోచించాలి.—యోబు 1:6-12; 2:2-6.

సర్వాధిపత్యం బహిరంగంగా సవాలు చేయబడింది

4 నిజమే, పైన ప్రస్తావించబడిన సంఘటనలేవీ సాతాను గమనించకుండా ఉండలేదు. వాడిక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేవుని “స్త్రీ” ముఖ్య ‘సంతానంపై’ దాడికి దిగాడు. (ఆదికాండము 3:15) తండ్రి చేయమని చెప్పినవి కాకుండా యేసు తనకు లాభదాయకంగా అనిపించే వాటినే చేయాలని ప్రతిపాదిస్తూ సాతాను ఆయనను మూడుసార్లు శోధించాడు. ప్రత్యేకంగా మూడవ శోధన సర్వాధిపత్యపు వివాదాంశాన్ని వెల్లడిచేసింది. సాతాను, యేసుకు ‘ఈ లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపిస్తూ’ సూటిగా ఆయనతో ఇలా అన్నాడు: “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదను.” “యీ లోకరాజ్యములన్ని” నిజంగా అపవాది అధీనంలో ఉన్నాయని పూర్తిగా తెలిసిన యేసు, “సాతానా, పొమ్ము—ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని” జవాబిస్తూ సర్వాధిపత్యపు వివాదాంశంలో తాను ఎవరి పక్షానవున్నాడో చూపించాడు.—మత్తయి 4:8-10.

5 యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడమే యేసు ప్రధాన లక్ష్యమని ఆయన జీవితం స్పష్టంగా చూపించింది. సర్వాధిపత్యానికి సంబంధించిన హక్కు దేవునికి మాత్రమేవుందని నిరూపించేందుకు, స్త్రీ “సంతానము” మడిమెమీద కొట్టబడుతుందని ప్రవచించబడినట్లు, సాతాను మూలంగా మరణించేంత వరకు తాను నమ్మకంగా ఉండాలని యేసుకు తెలుసు. (మత్తయి 16:21; 17:12) సాతానును ఓడించి, సృష్టియంతటా శాంతిభద్రతల్ని నెలకొల్పడానికి యెహోవా అధికారమిచ్చిన ఉపకరణమే దేవుని రాజ్యమనే వాస్తవం గురించి కూడా ఆయన సాక్ష్యమివ్వాలి. (మత్తయి 6:9, 10) ఈ కష్టభరిత కర్తవ్యాన్ని యేసు ఎలా నెరవేర్చాడు?

“దేవునిరాజ్యము సమీపించియున్నది”

6 యేసు తన పనిని ఆరంభించి, ‘కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు’ వెళ్లాడు. (మార్కు 1:14, 15) నిజానికి ఆయన, “దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని” చెప్పాడు. (లూకా 4:18-21, 43) యేసు “దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు” ఆ దేశమంతటా విస్తృతంగా ప్రయాణించాడు. (లూకా 8:1) అలాగే ఆయన ప్రజలకు ఆహారమివ్వడం, వాతావరణ పరిస్థితులను అదుపుచేయడం, రోగులను బాగుచేయడం, చనిపోయినవారిని పునరుత్థానం చేయడం వంటి అద్భుతాలు కూడా విస్తారంగా చేశాడు. ఈ అద్భుతాల ద్వారా యేసు, ఏదెనులో జరిగిన తిరుగుబాటువల్ల కలిగిన నష్టాన్నంతటినీ, బాధనంతటినీ దేవుడు తీసివేసి, ‘అపవాది క్రియలను లయపర్చగలడని’ నిరూపించాడు.—1 యోహాను 3:8.

7 సాధ్యమైనంత విస్తృతంగా రాజ్యసువార్త ప్రకటించబడేలా చూసేందుకు యేసు నమ్మకమైన అనుచరులను సమకూర్చి, ఆ పనిలో వారికి శిక్షణనిచ్చాడు. ఆయన మొదట తన 12 మంది అపొస్తలులకు బాధ్యతను అప్పగిస్తూ, “దేవుని రాజ్యమును ప్రకటించుటకు” వారిని పంపించాడు. (లూకా 9:1, 2) ఆ తర్వాత ఆయన 70 మందిని, “దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నది” అనే సందేశాన్ని ప్రకటించడానికి పంపించాడు. (లూకా 10:1, 8, 9) శిష్యులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి రాజ్య ప్రకటనా పనిలో తమకు కలిగిన సత్ఫలితాల గురించి చెప్పినప్పుడు ఆయనిలా స్పందించాడు: “సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని.”—లూకా 10:17, 18.

8 రాజ్యం గురించి సాక్ష్యమిచ్చే పనిలో యేసు పూర్తిగా నిమగ్నమౌతూ, తనకు లభించిన ఏ అవకాశాన్నీ చేజార్చుకోలేదు. తన జీవితంలోని కనీస సుఖాలను కూడా త్యజిస్తూ ఆయన రాత్రింబగళ్లు అవిశ్రాంతంగా పనిచేశాడు. “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని” ఆయనన్నాడు. (లూకా 9:58; మార్కు 6:31; యోహాను 4:31-34) యేసు తాను చనిపోవడానికి కొన్నిగంటల ముందు పొంతి పిలాతుతో నిర్భయంగా ఇలా అన్నాడు: ‘సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకే నేను ఈ లోకమునకు వచ్చితిని.’ (యోహాను 18:37) యేసు కేవలం గొప్ప బోధకునిగా ఉండడానికి లేదా అద్భుతాలుచేసే వ్యక్తిగా లేక త్యాగపూరిత రక్షకునిగా ఉండడానికి కాదుగానీ, సర్వాధిపతియైన యెహోవా చిత్తాన్ని సమర్థిస్తూ, రాజ్యం ద్వారా ఆ చిత్తాన్ని నెరవేర్చే దేవుని సామర్థ్యాన్ని గురించి సాక్ష్యమిచ్చేందుకే వచ్చాడని ఆయన యావత్‌ జీవన విధానం చూపించింది.—యోహాను 14:6.

“సమాప్తమైనది”

9 రాజ్యానికి సంబంధించి యేసు చేసిన వాటన్నిటినిబట్టి శత్రువు, అపవాదియగు సాతాను సంతోషించలేదు. సాతాను తన “సంతానము”లోని భూసంబంధ భాగాలైన రాజకీయాల ద్వారా, మతం ద్వారా దేవుని స్త్రీ “సంతానము” యొక్క నోరు నొక్కేయాలని ప్రయత్నించాడు. సాతాను అతని అనుయాయులు యేసు పుట్టిన దగ్గరనుండి ఆయన భూజీవిత చివరి క్షణంవరకు ఆయనను గురిగా పెట్టుకున్నారు. చివరకు, సా.శ. 33 వసంత రుతువులో మనుష్యకుమారుడు మడిమెమీద కొట్టబడేలా శత్రువుకు అప్పగించబడే సమయం వచ్చింది. (మత్తయి 20:18, 19; లూకా 18:31-33) యేసుపై నేరారోపణచేసి, ఆయన హింసాకొయ్యపై తీవ్ర బాధననుభవిస్తూ మరణించేలా చేయడానికి సాతాను ఇస్కరియోతు యూదా మొదలుకొని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, రోమన్ల వరకు మనుష్యులను ఎలా ఉపయోగించుకున్నాడో సువార్త వృత్తాంతాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.—అపొస్తలుల కార్యములు 2:22, 23.

10 యేసు హింసాకొయ్యపై తీవ్ర బాధననుభవిస్తూ మరణించడం గురించి ఆలోచించినప్పుడు మీకేమి గుర్తొస్తుంది? పాపులైన మానవులకోసం యేసు విమోచన క్రయధన బలిని నిస్వార్థంగా అర్పించడం బహుశా మీకు గుర్తురావచ్చు. (మత్తయి 20:28; యోహాను 15:13) ఆ బలిని అర్పించడంలో యెహోవా చూపించిన గొప్ప ప్రేమనుబట్టి మీరెంతో ఆశ్చర్యపోవచ్చు. (యోహాను 3:16) “నిజముగా ఈయన దేవుని కుమారుడని” చెప్పేందుకు పురికొల్పబడ్డ రోమన్‌ శతాధిపతిలాగే మీరూ పురికొల్పబడొచ్చు. (మత్తయి 27:54) ఇవన్నీ ఖచ్చితంగా సరైన ప్రతిస్పందనలే. అయితే హింసాకొయ్యపై యేసు పలికిన ఈ చివరి మాటలను గుర్తుచేసుకోండి: “సమాప్తమైనది.” (యోహాను 19:30) ఏమి సమాప్తమైంది లేదా నెరవేర్చబడింది? యేసు తన జీవితం, మరణం ద్వారా ఎన్నో సాధించినా, ఆయన భూమ్మీదికి వచ్చింది ప్రాథమికంగా యెహోవా సర్వాధిపత్యపు వివాదాంశాన్ని పరిష్కరించడానికే కాదా? యెహోవా నామంపై మోపబడిన నిందనంతా తొలగించేందుకు ఆయన ఆ ‘సంతానముగా’ సాతానువల్ల తీవ్ర పరీక్షను అనుభవిస్తాడని ప్రవచించబడలేదా? (యెషయా 53:3-7) అవి బరువైన బాధ్యతలైనా, యేసు వాటన్నిటినీ పూర్తిగా నెరవేర్చాడు. అదెంత గొప్ప కార్యసాధనో కదా!

11 యేసు తాను చూపించిన యథార్థత, విశ్వాస్యత కారణంగా మానవునిగా కాదుగానీ ‘జీవింపజేయు ఆత్మగా’ పునరుత్థానం చేయబడ్డాడు. (1 కొరింథీయులు 15:45; 1 పేతురు 3:18) మహిమపర్చబడిన తన కుమారునికి యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.” (కీర్తన 110:1) ఆ ‘శత్రువుల్లో’ ముఖ్య దోషియైన సాతాను, అతని ‘సంతానంలో’ భాగమైన వారందరూ ఉన్నారు. యెహోవా మెస్సీయ రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తు అటు పరలోకంలో, ఇటు భూమిపై తిరుగుబాటు చేసినవారందరినీ నాశనం చేయడంలో సారథ్యం వహిస్తాడు. (ప్రకటన 12:7-9; 19:11-16; 20:1-3, 10) అప్పుడు ఆదికాండము 3:15లోని ప్రవచనమే కాక, “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రార్థన కూడా సంపూర్ణంగా నెరవేరుతుంది.—మత్తయి 6:10; ఫిలిప్పీయులు 2:8-11.

అనుసరించదగ్గ మాదిరి

12 యేసు ప్రవచించినట్లే నేడు రాజ్యసువార్త అనేక దేశాల్లో ప్రకటించబడుతోంది. (మత్తయి 24:14) ఫలితంగా, లక్షలాదిమంది దేవునికి తమ జీవితాల్ని సమర్పించుకున్నారు. ఆ రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాలు అనుభవించే విషయంలో వారెంతో ఉత్సాహంతో ఉన్నారు. వారు పరదైసు భూమిపై శాంతిభద్రతలతో నిత్యం జీవించేందుకు ఎదురుచూస్తూ, తమ నిరీక్షణ గురించి ఆనందంగా ఇతరులకు చెబుతున్నారు. (కీర్తన 37:11; 2 పేతురు 3:13) ఈ రాజ్యప్రచారకుల్లో మీరు ఒకరా? అలాగైతే మిమ్మల్ని మెచ్చుకోవాలి. అయితే మనలో ప్రతీ ఒక్కరూ పరిశీలించాల్సిన విషయమొకటి ఉంది.

13 అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:21) ఈ సందర్భంలో పేతురు, యేసు చూపిన ప్రచారాసక్తిని లేదా ఆయన బోధనా నైపుణ్యాన్ని కాదుగానీ ఆయన అనుభవించిన బాధను గురించి మాట్లాడుతున్నాడని గమనించండి. యేసు, యెహోవా సర్వాధిపత్యానికి లోబడడానికి, సాతాను అబద్ధికుడని నిరూపించడానికి ఎంతమేరకు బాధననుభవించేందుకు సిద్ధపడ్డాడో కళ్లారా చూసిన పేతురుకు బాగా తెలుసు. కాబట్టి మనం ఏయేవిధాలుగా యేసు అడుగుజాడల్లో నడుచుకోవచ్చు? మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘యెహోవా సర్వాధిపత్యానికి మద్దతునివ్వడానికి, దానిని ఘనపర్చడానికి నేనెంతమేరకు బాధననుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను? యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడమే నాకు అత్యంత ప్రధానమని నేను నా జీవన విధానం ద్వారా, పరిచర్యలో నేను చూపించే ఆసక్తి ద్వారా కనబరుస్తున్నానా?’—కొలొస్సయులు 3:17.

14 ప్రతీరోజు మనం చిన్నాపెద్ద పరీక్షల్ని ఎదుర్కోవడమే కాక, చిన్నాపెద్ద నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటాం. ఏ విధంగా స్పందించాలో మనం దేని ఆధారంగా నిర్ణయించుకోవాలి? ఉదాహరణకు, మన క్రైస్తవ స్థానాన్ని ప్రమాదంలో పడేసేదేదైనా చేయాలనే శోధన ఎదురైనప్పుడు మనమెలా స్పందిస్తాం? పేతురు, నీకది దూరమవును గాక అని యేసుతో అన్నప్పుడు ఆయనెలా స్పందించాడు? యేసు గట్టిగా “సాతానా, నా వెనుకకు పొమ్ము . . . నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని” అన్నాడు. (మత్తయి 16:21-23) మన ఆధ్యాత్మిక సంక్షేమాన్ని ప్రభావితం చేయగల రీతిలో మన ఆర్థిక స్థితిని మెరుగుపర్చే లేదా పదోన్నతికి సంబంధించిన అవకాశాలు ప్రతిపాదించబడినప్పుడు, యేసులాగే మనమూ స్పందిస్తామా? తన అద్భుత క్రియలను చూసినవారు తనను ‘రాజుగా చేయడానికి తనను బలవంతంగా పట్టుకోబోతున్నారని’ గ్రహించిన వెంటనే, యేసు అక్కడనుండి వెళ్లిపోయాడు.—యోహాను 6:15.

15 ఈ సందర్భాల్లో మరితర సందర్భాల్లో యేసు ఎందుకంత స్థిరంగా స్పందించాడు? ఎందుకంటే ఆయన తన వ్యక్తిగత భద్రతకన్నా లేదా ప్రయోజనంకన్నా మరింత ప్రాముఖ్యమైనది వేరే ఉందని స్పష్టంగా గ్రహించాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన తండ్రి చిత్తం చేయాలని, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాలని కోరుకున్నాడు. (మత్తయి 26:50-54) కాబట్టి యేసులాగే మనం కూడా యెహోవా సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశాన్ని ప్రతీక్షణం గుర్తుంచుకోకపోతే, మనం రాజీపడే లేదా సరైంది చేయకుండా ఉండే ప్రమాదం సదా పొంచివుంటుంది. ఎందుకు? ఎందుకంటే, హవ్వను శోధించినప్పుడు చేసినట్లే, సరికానిది ఎంతో కోరదగినదిగా కనిపించేటట్లు చేయడంలో నేర్పరియైన సాతాను తంత్రాలకు మనం సులభంగా బలైపోయే అవకాశముంది.—2 కొరింథీయులు 11:14; 1 తిమోతి 2:14.

16 మన పరిచర్యలో, ప్రజలు చింతించే విషయాల గురించి వారితో మాట్లాడి, వాటికి బైబిలు ఇస్తున్న జవాబులను వారికి చూపించేందుకు మనం కృషిచేస్తాం. బైబిలు అధ్యయనం చేసేలా వారిలో ఆసక్తిని రేకెత్తించేందుకు ఇదో సమర్థవంతమైన విధానం. అయితే, బైబిలు చెబుతున్నదేమిటో లేదా దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాలేమిటో ప్రజలు తెలుసుకునేలా వారికి సహాయం చేయడమే మన చివరి లక్ష్యం కాదు. అసలు వివాదాంశాన్ని గ్రహించేలా మనం వారికి సహాయం చేయాలి. వారు నిజక్రైస్తవులై తమ “సిలువను” లేదా హింసాకొయ్యను ఎత్తుకొని, రాజ్యం కోసం బాధననుభవించేందుకు సుముఖంగా ఉన్నారా? (మార్కు 8:34) వారు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేవారిలో ఒకరై ఉంటూ, సాతాను అబద్ధికుడని, అపవాది అని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? (సామెతలు 27:11) యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేవారిగా ఉండడమే కాక, ఇతరులూ అలా యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేలా వారికి సహాయం చేయగలగడం మనకు లభించిన ఆధిక్యత!—1 తిమోతి 4:16.

‘దేవుడు సర్వములో సర్వమగు’ సమయం

17 మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడమే మన ప్రాథమిక బాధ్యతని మన ప్రవర్తన ద్వారా, మన పరిచర్య ద్వారా చూపించేందుకు మనమిప్పుడు శాయశక్తులా కృషిచేస్తూ, యేసుక్రీస్తు “తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగిం[చే]” సమయం కోసం ఎదురుచూడవచ్చు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది? అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి . . . తన శత్రువులనందరిని [దేవుడు] తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. . . . [అప్పుడు] దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.”—1 కొరింథీయులు 15:24, 25, 28.

18 దేవుడు ‘సర్వములో సర్వమైనప్పుడు,’ ఉండే ఆ కాలమెంత అద్భుతంగా ఉంటుందో కదా! ఆ సమయానికి రాజ్యం దాని ఉద్దేశాన్ని నెరవేర్చినదై ఉంటుంది. యెహోవా సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించేవారందరూ నిర్మూలించబడి ఉంటారు. విశ్వమంతటా శాంతిభద్రతలు పునరుద్ధరించబడివుంటాయి. కీర్తనకర్త మాటల్లో సృష్టియావత్తు ఇలా పాడుతుంది: “యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి . . . యెహోవా రాజ్యము చేయుచున్నాడు. . . . ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి.”—కీర్తన 96:8, 10.

మీరు జవాబివ్వగలరా?

• దేవుని సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశాన్ని యేసు ఎలా ఒక ప్రధానాంశంగా చేసుకున్నాడు?

• యేసు తన పరిచర్య ద్వారా, మరణం ద్వారా ప్రాముఖ్యంగా ఏమి నెరవేర్చాడు?

• యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామని చూపించడంలో ఏయే విధాలుగా మనం యేసు మాదిరిని అనుసరించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) సామాన్య శకము 29 దాదాపు అక్టోబరులో ఏ అద్భుత సంఘటన జరిగింది? (బి) ఆ సంఘటన తర్వాత యేసు ఏ విషయాన్ని గ్రహించాడు?

3. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడంలో తాను పోషించే పాత్ర కోసం యేసు ఎలా సిద్ధపడ్డాడు?

4. సర్వాధిపత్యపు వివాదాంశాన్ని వెల్లడిచేసిన ఏ పనిని సాతాను చేశాడు?

5. యేసు ఏ కష్టభరితమైన కర్తవ్యాన్ని నెరవేర్చాలి?

6. ‘అపవాది క్రియల్ని లయపర్చడానికి’ దేవుడు ఉపయోగించే ఉపకరణం రాజ్యమేనని యేసు ఎలా తెలియజేశాడు?

7. యేసు తన అనుచరులకు ఏమి చేయమని ఉపదేశించాడు, దాని ఫలితమేమిటి?

8. యేసు జీవన విధానం దేనిని స్పష్టంగా చూపించింది?

9. దేవుని స్త్రీ “సంతానము” మడిమెమీద కొట్టడంలో సాతాను చివరికి ఎలా నెగ్గాడు?

10. హింసాకొయ్యపై మరణించడం ద్వారా యేసు ప్రాథమికంగా ఏమి సాధించాడు?

11. ఏదెనులో చెప్పబడిన ప్రవచనాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి యేసు ఏమిచేస్తాడు?

12, 13. (ఎ) రాజ్యసువార్తకు నేడెలాంటి ప్రతిస్పందనను చూస్తున్నాం? (బి) క్రీస్తు అడుగుజాడల్లో నడవాలంటే మనమేమని ప్రశ్నించుకోవాలి?

14, 15. (ఎ) తప్పుదారి పట్టించే సలహాలకు, ప్రతిపాదనలకు యేసు ఎలా స్పందించాడు, ఎందుకలా స్పందించాడు? (బి) ఏ వివాదాంశాన్ని మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి? (“యెహోవా పక్షాన నిలబడండి” అనే బాక్సులోని వ్యాఖ్యానాలను చేర్చండి.)

16. ఇతరులకు సహాయం చేయడంలో మన చివరి లక్ష్యం ఏమైవుండాలి?

17, 18. యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించేవారమని చూపించినప్పుడు, మనమే అద్భుతమైన కాలంకోసం ఎదురుచూడవచ్చు?

[29వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

యెహోవా పక్షాన నిలబడండి

కొరియాలోని మరితర ప్రాంతాల్లోని చాలామంది సహోదరుల్లాగే క్రైస్తవులు తీవ్ర పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు అవి తమకెందుకు కలుగుతున్నాయనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవడం వారికి సహాయకరంగా ఉంటుంది.

ఒకప్పటి సోవియట్‌ పరిపాలనలో ఖైదుచేయబడ్డ ఒక యెహోవాసాక్షి ఇలా అన్నాడు: “మేము సహించడానికి, ఏదెనులో లేవదీయబడిన వివాదాంశాన్ని అంటే దేవుని పరిపాలనా హక్కుకు సంబంధించిన వివాదాంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం సహాయం చేసింది. . . . యెహోవా పరిపాలనను సమర్థించే అవకాశం మాకు దొరికిందని మాకు తెలుసు. . . . ఇది మమ్మల్ని బలపర్చడమే కాక, మా యథార్థతను కాపాడుకునేందుకు కూడా దోహదపడింది.”

మరో సాక్షి, తనకు, తోటిసాక్షులకు లేబర్‌ క్యాంపులో ఏది సహాయపడిందో ఇలా వివరిస్తున్నాడు: “యెహోవాయే మాకు బలాన్నిచ్చాడు. పరిస్థితులు కష్టభరితంగావున్నా మేము ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉన్నాం. విశ్వ సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశం విషయంలో యెహోవా పక్షాన నిలబడ్డామనే విషయాన్ని పరస్పరం గుర్తుచేసుకుంటూ ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉన్నాం.”

[26వ పేజీలోని చిత్రం]

సాతానుచేత శోధించబడినప్పుడు యేసు ఎలా యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాడు?

[28వ పేజీలోని చిత్రం]

యేసు మరణంద్వారా ఏమి సాధించబడింది?