కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు సమాధానంగా ఉండడాన్ని నేర్పించండి

మీ పిల్లలకు సమాధానంగా ఉండడాన్ని నేర్పించండి

మీ పిల్లలకు సమాధానంగా ఉండడాన్ని నేర్పించండి

ఎనిమిది సంవత్సరాల నికోల్‌ తన కుటుంబంతో దూరదేశం వెళ్ళిపోతోంది, దానికి సంబంధించిన వివరాలన్నీ ఆమె తన సన్నిహిత స్నేహితురాలైన గాబ్రియేల్లాకు ఎప్పటికప్పుడు ఎంతో ఉత్సాహంతో చెప్పేది. ఒకరోజు, గాబ్రియేల్లా ఉన్నట్లుండి నికోల్‌ను కసురుకుంటూ ఇక ఆ వివరాలేవీ నాకు చెప్పకు అంది. దానికి నికోల్‌ ఎంతో బాధపడి, కోపంగా వాళ్ళమ్మతో ఇలా అంది, “ఇంకెప్పుడూ గాబ్రియేల్లాతో మాట్లాడనే మాట్లాడను!”

నికోల్‌కు, గాబ్రియేల్లాకు మధ్య వచ్చినలాంటి చిన్నతనంలోని తగవులను పరిష్కరించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయాలి, వారిని అనునయించడం మాత్రమేకాక అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి నేర్పించాలి. సహజంగానే పిల్లలు, ‘పిల్లల్లా’ ప్రవర్తిస్తారు, తాము చేసే పనులవల్ల, మాట్లాడే మాటలవల్ల జరిగే హాని గురించి వారికి తెలీదు. (1 కొరింథీయులు 13:11) కాబట్టి, పిల్లలు ఇటు ఇంట్లోవాళ్ళతో, అటు బయటివాళ్ళతో సమాధానంగా ఉండేందుకు తోడ్పడే లక్షణాలను వృద్ధిచేసుకోవడానికి వారికి సహాయం చేయాలి.

క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు “సమాధానమును వెదకి దాని వెంటాడ[డానికి]” వారికి తర్ఫీదునివ్వాలని కోరుకుంటారు. (1 పేతురు 3:11) అనుమానం, నిరాశ, పగ వంటి భావాలను తొలగించుకోవడానికి చేసే కృషికి తగిన ప్రతిఫలమే సమాధానపరులుగా ఉండడంవల్ల లభించే సంతోషం. మీరొకవేళ తల్లిదండ్రులైతే, సమాధానపరులుగా ఉండడాన్ని మీరు మీ పిల్లలకు ఎలా నేర్పించవచ్చు?

‘సమాధానకర్తయైన దేవుణ్ణి’ సంతోషపర్చాలనే కోరికను వారిలో పెంపొందించండి

యెహోవా ‘సమాధానకర్తయైన దేవుడు’ అని పిలవబడ్డాడు. (రోమీయులు 15:33; ఫిలిప్పీయులు 4:9) దేవుణ్ణి సంతోషపర్చాలనే, ఆయన లక్షణాలను అలవర్చుకోవాలనే కోరికను తమ పిల్లల్లో చిగురింపజేయడానికి తెలివైన తల్లిదండ్రులు దేవుని వాక్యమైన బైబిలును నైపుణ్యవంతంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, అపొస్తలుడైన యోహాను ఒక విశేషమైన దర్శనంలో చూసిన, యెహోవా సింహాసనం చుట్టూ ఆకుపచ్చరంగులో ఉన్న దివ్యాతిదివ్యమైన ఇంద్రధనుస్సును మీ పిల్లలు ఊహించుకునేలా వారికి సహాయం చేయండి. * (ప్రకటన 4:2, 3) ఈ ఇంద్రధనుస్సు యెహోవా చుట్టూ ఉండే సమాధానానికి, ప్రశాంతతకు ప్రతీకగా ఉందని, ఆయనకు విధేయులైన వారందరికీ అలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయని వివరించండి.

“సమాధానకర్తయగు అధిపతి” అని పిలువబడుతున్న తన కుమారుడైన యేసుద్వారా కూడా యెహోవా నిర్దేశాన్నిస్తాడు. (యెషయా 9:6, 7) కాబట్టి, గొడవల జోలికి వెళ్ళకుండా ఉండడం గురించి, వాదనలకు దిగకుండా ఉండడం గురించి యేసు బోధించిన విలువైన పాఠాలున్న బైబిలు వృత్తాంతాలను మీ పిల్లలకు చదివి వినిపించి, వాటిని చర్చించండి. (మత్తయి 26:51-56; మార్కు 9:33-35) ఒకప్పుడు “హానికరు[డిగా]” ఉన్న పౌలు ఆ తర్వాత ఎందుకు తన మార్గాలను మార్చుకుని, ‘ప్రభువుయొక్క దాసుడు జగడమాడక అందరి యెడల సాధువుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను’ అని రాశాడో వివరించండి. (1 తిమోతి 1:12, 13; 2 తిమోతి 2:24-26) మీ పిల్లవాడు మీరు అనుకున్నదానికన్నా మంచిగానే ప్రతిస్పందించే అవకాశముంది.

ఈవన్‌ తనకు ఏడేండ్లున్నప్పుడు ఒకరోజు స్కూలు బస్సులో ఒకబ్బాయి తనను ఏడిపించడాన్ని గుర్తుచేసుకుంటున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు, “ఆ అబ్బాయి మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నంత కోపమొచ్చింది! కానీ కయ్యానికి కాలుదువ్వేవారి గురించి ఇంట్లో నేను నేర్చుకున్న పాఠం గుర్తొచ్చింది. నేను ‘కీడుకు ప్రతి కీడెవరికి చెయ్యకూడదని, అందరితో సమాధానంగా ఉండాలని’ యెహోవా కోరుకుంటున్నాడని నాకు తెలుసు.” (రోమీయులు 12:17, 18) అప్పుడు, గొడవ జరిగేలావున్న ఆ పరిస్థితిని మృదువుగా మాట్లాడడం ద్వారా గొడవ జరగకుండా ఆపడానికి కావలసిన బలం, ధైర్యం ఈవన్‌కు వచ్చాయి. ఈవన్‌ సమాధానకర్తయైన దేవుణ్ణి సంతోషపర్చాలని కోరుకున్నాడు.

సమాధానంగల తల్లిదండ్రులుగా ఉండండి

మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉందా? అలాగైతే, మీరు ఒక్కమాట చెప్పకపోయినా మీ పిల్లలు సమాధానం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. మీరు మీ పిల్లలకు సమాధానంగా ఉండమని సమర్థవంతంగా బోధించడం, మీరెంత వరకు దేవుని, క్రీస్తు సమాధానకరమైన మార్గాలను అనుసరిస్తున్నారనే దానిపై ఎక్కువగా ఆధారపడివుంటుంది.—రోమీయులు 2:21.

రెస్‌, సిండీలు, తమ పిల్లలను ఎవరైనా విసిగిస్తే వారితో ప్రేమపూర్వకంగా వ్యవహరించేలా పిల్లలకు శిక్షణనిచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు. సిండీ ఇలా అంటోంది, “రెస్‌, నేను సమస్యలొచ్చినప్పుడు మా పిల్లలతో, ఇతరులతో స్పందించే తీరు, అలాంటి పరిస్థితులే మా పిల్లలకు ఎదురైతే వారెలా స్పందిస్తారనే విషయంలో పెద్ద పాత్రే పోషిస్తుంది.”

ఏ తల్లిదండ్రులైనా తప్పులు చేస్తారు కాబట్టి మీరొకవేళ ఏదైనా తప్పుచేసినా అలాంటి సందర్భాలను కూడా పిల్లలకు విలువైన పాఠాలు నేర్పించడానికి ఉపయోగించుకోవచ్చు. స్టీవెన్‌ ఇలా చెబుతున్నాడు: “నిజానిజాలు తెలుసుకోకుండా నేను, మా ఆవిడ టెరి పిల్లలపై అతిగా కోప్పడుతూ వాళ్ళను క్రమశిక్షణలో పెట్టిన సందర్భాలున్నాయి, అయితే అలాంటి సందర్భాల్లో మేము వారిని క్షమాపణ అడిగేవాళ్ళం.” “మేము కూడా అపరిపూర్ణులమేనని, మేమూ తప్పులు చేస్తామని మా పిల్లలు అర్థంచేసుకునేలా చూశాం. ఇది మా కుటుంబం సమాధానంగా ఉండడానికి సహాయపడడమే కాకుండా, మా పిల్లలు ఎలా సమాధానంగా ఉండాలో నేర్చుకోవడానికి కూడా సహాయం చేసిందని మాకనిపిస్తుంది” అని టెరి అంటోంది.

సమాధానంగా ఎలా ఉండాలనే విషయాన్ని మీ పిల్లలు మీరు వారితో ప్రవర్తించే తీరునుబట్టి నేర్చుకుంటున్నారా? యేసు ఇలా ఉద్భోదించాడు: “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) మీరెలాంటి తప్పులు చేసినా మీ పిల్లలపట్ల మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత మంచి ఫలితాలను తీసుకొస్తాయనే నమ్మకాన్ని కలిగివుండండి. ప్రేమపూర్వకంగా చెబితే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు.

కోపగించడానికి నిదానించండి

సామెతలు 19:11లో ఇలా ఉంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును.” మీ పిల్లలు అలాంటి సుబుద్ధిని అంటే లోతైన అవగాహనను పెంపొందించుకోవడానికి మీరు వారికెలా సహాయం చేయవచ్చు? తమ కొడుకుపై, కూతురిపై చక్కగా పనిచేస్తుందని తనకు, తన భార్య మరియన్‌కు అనిపించిన ఆచరణాత్మకమైన ఒక పద్ధతి గురించి డేవిడ్‌ చెప్తున్నాడు, “మా పిల్లల్ని ఎవరైనా ఏదైనా అన్నా, బాధపెట్టే పనులేవైనా చేసినా, అలా చేసిన వారితో దయగా ఉండాలని మేము వారికి నేర్పిస్తాం. వాళ్ళని ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలడుగుతాం: ‘ఈ రోజు ఆ అబ్బాయి ఏమైనా విసిగిపోయున్నాడా? నువ్వంటే అసూయపడుతున్నాడా? లేకపోతే అతన్ని ఎవరైనా బాధపెట్టారా?’” మరియన్‌ కూడా ఏమంటుందంటే, “ఇలా చేయడం, పిల్లలు దాని గురించే ఆలోచించకుండా ఉండడానికి, తప్పొప్పులు ఎవరివని కీచులాడుకోకుండా ఉండడానికి సహాయం చేస్తుంది.”

అలాంటి శిక్షణ చక్కటి ఫలితాలనివ్వవచ్చు. ఈ ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించబడిన నికోల్‌కు, వాళ్ళమ్మ మిషేల్‌ సహాయం చేసింది, ఆ సహాయం నికోల్‌కు గాబ్రియేల్లాకు మధ్యవున్న అగాధాన్ని పూడ్చడంకన్నా ఎక్కువే చేసింది. మిషేల్‌ ఇలా చెబుతోంది, “నేను, నికోల్‌ కలిసి గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి * (ఆంగ్లం) అనే పుస్తకంలోని 14వ అధ్యాయాన్ని చదివాం, ఆ తర్వాత, మనం ఒకరిని ‘ఏడుమారులమట్టుకు’ క్షమించాలని యేసు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశమేమిటో వివరించాను. నికోల్‌ తన మనసులోని మాటలను చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విని ఆ తర్వాత, తన మంచి స్నేహితురాలు తనను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నందుకు గాబ్రియేల్లాకెంత బాధ, దుఃఖం కలుగుతున్నాయో అర్థంచేసుకోమని ప్పాను.”—మత్తయి 18:21, 22.

గాబ్రియేల్లా ఎందుకలా కోపాన్ని వెళ్ళగక్కి ఉంటుందనే విషయం గురించి కొత్తగా తానుపొందిన అవగాహన నికోల్‌పై ఎంత చక్కగా పనిచేసిందంటే, ఆమె సాటిమనిషిగా గాబ్రియేల్లా భావాలను అర్థంచేసుకోగలిగింది, గాబ్రియేల్లాకు ఫోన్‌ చేసి క్షమాపణ కూడా అడిగింది. మిషేల్‌ ఇలా చెబుతోంది: “ఇక అప్పటినుండి నికోల్‌ ఇతరుల భావాలను అర్థంచేసుకుంటుంది, వారిని సంతోషపెట్టే మంచి పనులు చేస్తూవుంటుంది.”—ఫిలిప్పీయులు 2:3, 4.

పొరపాట్లవల్ల, అపార్థాలవల్ల మీ పిల్లలు బాధపడకుండా ఉండేందుకు వారికి సహాయం చేయండి. అలా చేసినప్పుడు మీ చిన్నారులు ఇతరులతో దయగా, ప్రేమగా మెలగడం చూసి మీరు మురిసిపోతారు.—రోమీయులు 12:10; 1 కొరింథీయులు 12:24, 25.

క్షమించడంలోవున్న ఘనతను తెలియజేయండి

సామెతలు 19:11లో ఇలా ఉంది: “తప్పులు క్షమించుట . . . ఘనతనిచ్చును.” యేసు తీవ్రమైన బాధననుభవిస్తున్న క్షణంలో కూడా తన తండ్రిలాగే క్షమాగుణాన్ని కనబర్చాడు. (లూకా 23:34) మీరు క్షమించడాన్ని మీ పిల్లలు స్వయంగా చూసినప్పుడు వారు కూడా క్షమించడంలోవున్న ఘనతను గురించి నేర్చుకుంటారు.

ఉదాహరణకు, ఐదు సంవత్సరాల విల్లీకి, వాళ్ళ అమ్మమ్మతో కలిసి రంగు పెన్సిళ్ళతో బొమ్మలకు రంగులు వేయడమంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళ అమ్మమ్మ రంగులు వేసేది హఠాత్తుగా ఆపి విల్లీని తిట్టేసి అక్కడినుండి వెళ్ళిపోయింది. విల్లీకి ఎంతో బాధేసింది. “వాళ్ళ అమ్మమ్మ అల్జీమర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆ విషయాన్ని మేము వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాం” అని వాళ్ళ నాన్న సామ్‌ చెబుతున్నాడు. ఎన్నో సందర్భాల్లో విల్లీ చేసిన తప్పులకు క్షమాపణ దొరికింది కాబట్టి ఇప్పుడు తను ఇతరుల తప్పులను క్షమించాలని గుర్తుచేశాం. ఆ తర్వాత విల్లీ ప్రవర్తించిన తీరుకు సామ్‌ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. సామ్‌ ఇలా అంటున్నాడు: “మా చిన్న బాబు 80 సంవత్సరాల వాళ్ళ అమ్మమ్మ దగ్గరకెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పి, ఆమె చెయ్యి పట్టుకుని మళ్లీ టేబుల్‌ దగ్గరకు తీసుకురావడం చూసి నేను, నా భార్య ఎంత సంతోషించామో మీరూహించగలరా?”

పిల్లలు ఇతరుల తప్పులను, పొరపాట్లను ‘సహిస్తూ’ ఉండడాన్ని, క్షమించడాన్ని నేర్చుకుంటే నిజానికది వారికి ఘనతను తీసుకొస్తుంది. (కొలొస్సయులు 3:13) ఇతరులు కావాలని బాధపర్చేలా ప్రవర్తించినా మీరు సమాధానంగా ఉంటే మంచి ఫలితాలుంటాయని చెప్పండి, ఎందుకంటే “ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.”—సామెతలు 16:7.

సమాధానంగా ఉండేలా మీ పిల్లలకు సహాయం చేస్తూనే ఉండండి

తల్లిదండ్రులు “సమాధానము చేయువారి[గా]” ఉంటూ తమ పిల్లలకు ‘సమాధానకరమైన’ పరిస్థితుల్లో బోధించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించినప్పుడు వారు తమ పిల్లలకు నిజంగా మేలుచేసినవారౌతారు. (యాకోబు 3:18) అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలు గొడవల్ని పరిష్కరించుకొనేలా, సమాధానంగా ఉండేలా వారికి అవసరమైన వాటితో వారిని సంసిద్ధుల్ని చేస్తున్నారు. ఇది వారు జీవితమంతా సంతోషంగా, సంతృప్తిగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది.

డాన్‌, క్యాథీలకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి, వీళ్ళంతా ఇప్పుడు యెహోవా సేవ చేస్తున్నారు. డాన్‌ ఇలా అంటున్నాడు, “వాళ్ళను పెంచేటప్పుడు మాకు ఇబ్బందులెదురైనా, ఇప్పుడు మా పిల్లలు యెహోవాను ఆరాధించడాన్ని చూడడం మాకెంతో సంతోషంగా ఉంది. వాళ్ళు ఇతరులతో ఇప్పుడు చక్కగా మెలుగుతున్నారు, మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉందనిపించినప్పుడు వారు ఇతరులను వెంటనే క్షమిస్తారు.” “సమాధానం దేవుని ఆత్మఫలంలో భాగం కాబట్టి మా పిల్లలు దాన్ని అలవర్చుకోవడం చూసి మాకెంతో సంతోషమనిపిస్తుంది” అని క్యాథీ చెబుతోంది.—గలతీయులు 5:22, 23.

కాబట్టి మంచి కారణంతోనే, క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు సమాధానంగా ఉండమని మీ పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు దాన్ని నేర్చుకోవడానికి మొదట్లో పిల్లలకు కాస్త ఎక్కువ సమయం పట్టినా, ‘విసుక్కోకుండా,’ ‘అలసిపోకుండా’ వారికి నేర్పించండి. మీరు చేసే ఈ ప్రయత్నంలో ‘సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుంటాడు’ అని గుర్తుంచుకోండి.—గలతీయులు 6:9; 2 కొరింథీయులు 13:11.

[అధస్సూచీలు]

^ పేరా 6 యెహోవాసాక్షులు ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకం, 75వ పేజీలోని చిత్రాన్ని చూడండి.

^ పేరా 16 యెహోవాసాక్షులు ప్రచురించారు.

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

మంచి ప్రభావమేనా?

“వినోదంలో ఉన్న హింస” అనే పేరుతో మీడియా అవేర్‌నెస్‌ నెట్‌వర్క్‌వాళ్ళు ఒక వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఇలా ఉంది: “హీరోలు, విలన్లు సమస్యను పరిష్కరించుకోవడానికి తరచూ ఖచ్చితంగా ఉపయోగించేది హింసనే అని మీడియా చూపిస్తుంది.” విశ్లేషించబడిన వాటిలో కేవలం 10 శాతం టీవీ కార్యక్రమాలు, సినిమాలు, మ్యూజిక్‌ వీడియోలు మాత్రమే హింసవల్ల చెడు పర్యవసానాలుంటాయని చూపించాయి. దానికి భిన్నంగా, ఆ వ్యాసం ఇలా పేర్కొంటుంది: “హింస సమర్థనీయమైనదని, అది ఒక మామూలు విషయమని, అది ఖచ్చితంగా ఉండాల్సిందేనని అంటే సమస్యను పరిష్కరించుకోవడానికి అదే ఏకైక మార్గమని చూపించబడింది.”

మీ ఇంట్లో టీవీ చూసే విషయంలో సవరణలు చేసుకోవాల్సిన అవసరముందని మీరు గ్రహిస్తున్నారా? సమాధానంగా ఉండమని మీ పిల్లలకు నేర్పించాలనే మీ ప్రయత్నాలను వినోద కార్యక్రమాలు నీరుగార్చేలా చేయనివ్వకండి.

[17వ పేజీలోని చిత్రం]

‘సమాధానకర్తయగు’ దేవుణ్ణి సంతోషపర్చాలనే కోరికను మీ పిల్లల్లో చిగురింపజేయండి

[18వ పేజీలోని చిత్రం]

కోపం తెప్పించే మాటలేవైనా అన్నా, అలాంటి పనులేవైనా చేసినా వాటిని సరిదిద్దడానికి సమయం తీసుకోండి

[19వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలు క్షమాపణ అడగడాన్ని, క్షమించడాన్ని నేర్చుకోవాలి