కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హగ్గయి, జెకర్యా పుస్తకాల్లోని ముఖ్యాంశాలు

హగ్గయి, జెకర్యా పుస్తకాల్లోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

హగ్గయి, జెకర్యా పుస్తకాల్లోని ముఖ్యాంశాలు

అది సా.శ.పూ. 520వ సంవత్సరం. బబులోను చెరనుండి తిరిగివచ్చిన యూదులు యెరూషలేములో యెహోవా ఆలయానికి పునాదివేసి అప్పటికి 16 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు, నిర్మాణ పని నిషేధించబడింది. యెహోవా తన వాక్కును తెలియజేయడానికి ప్రవక్తయైన హగ్గయిని, ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ప్రవక్తయైన జెకర్యాను నియమించాడు.

హగ్గయి, జెకర్యాల లక్ష్యం ఒకటే: ఆలయ పునర్నిర్మాణ పని తిరిగి ప్రారంభించమని ప్రజల్ని ప్రోత్సహించడమే. ఈ ప్రవక్తల ప్రయత్నాలు ఫలించి, ఐదు సంవత్సరాల తర్వాత ఆలయ నిర్మాణం పూర్తయింది. హగ్గయి, జెకర్యా ప్రకటించినది వారి పేర్లతో ఉన్న బైబిలు పుస్తకాల్లో నమోదు చేయబడి ఉంది. హగ్గయి పుస్తకం సా.శ.పూ. 520లో పూర్తయ్యింది, జెకర్యా పుస్తకం సా.శ.పూ. 518లో పూర్తయ్యింది. ఆ ప్రవక్తల్లాగే మనకు కూడా దేవుడిచ్చిన పని ఒకటి ఉంది, అది ప్రస్తుత విధానం అంతంకాకముందే పూర్తి చేయబడాలి. అదే రాజ్యం గురించి ప్రకటించే, శిష్యులను చేసే పని. హగ్గయి, జెకర్యా పుస్తకాలనుండి మనమెలాంటి ప్రోత్సాహాన్ని పొందవచ్చో చూద్దాం.

“మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి”

(హగ్గయి 1:1–2:23)

హగ్గయి 112 రోజుల్లో నాలుగు ప్రేరణాత్మక సందేశాలను ప్రకటించాడు. మొదటిది: “మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసికొనివచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (హగ్గయి 1:7, 8) ప్రజలు సానుకూలంగా స్పందించారు. రెండవ సందేశంలో “నేను [యెహోవా] ఈ మందిరమును మహిమతో నింపుదును” అనే వాగ్దానం ఉంది.—హగ్గయి 2:7.

మూడవ సందేశం ప్రకారం, పునర్నిర్మాణ పనిని అశ్రద్ధ చేయడం వల్ల “జనులు” యెహోవా దృష్టికి అపవిత్రులయ్యారు, “వారు చేయు క్రియలన్నియు” అపవిత్రములయ్యాయి. అయితే, మరమ్మతులు చేయడం ప్రారంభించిన రోజునుండి యెహోవా వారిని ‘ఆశీర్వదించాడు.’ నాల్గవ సందేశంలో తెలియజేయబడినట్లుగా యెహోవా, “అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చే[సి]” అధిపతియైన జెరుబ్బాబెలును ‘ముద్ర ఉంగరముగా చేశాడు.’—హగ్గయి 2:14, 19, 22, 23.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:6—“పానము చేయుచున్నను దాహము తీరకయున్నది [‘మత్తెక్కడం లేదు,’ NW]” అనే మాటల అర్థమేమిటి? ఆ మాటలు, ద్రాక్షారసం తక్కువగా దొరకడాన్ని సూచిస్తున్నాయి. యెహోవా ఆశీర్వాదం లేకపోవడంవల్ల, ద్రాక్షారసం పరిమితంగా ఉంటుంది అంటే మత్తెక్కేలా త్రాగేంత సమృద్ధిగా ఉండదు.

2:6, 7, 21, 22—కదిలిస్తున్నది ఎవరు లేదా ఏమిటి, దాని ఫలితమేమిటి? ప్రపంచవ్యాప్తంగా రాజ్య సందేశాన్ని ప్రకటింపజేయడం ద్వారా యెహోవా ‘అన్యజనులందరిని కదిలిస్తున్నాడు.’ ప్రకటనా పని ఫలితంగా కూడా “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” యెహోవా మందిరంలోకి తేబడుతున్నాయి, ఆ విధంగా యెహోవా మందిరం మహిమతో నింపబడుతోంది. కొంతకాలానికి “సైన్యములకు అధిపతియగు యెహోవా” “ఆకాశమును భూమిని సముద్రమును నేలను” కదిలిస్తాడు అంటే ప్రస్తుత దుష్టవిధానమంతా ఉనికిలో లేకుండా నాశనం చేస్తాడు.—హెబ్రీయులు 12:26, 27.

2:9—ఏయే విధాలుగా “కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించి” ఉంటుంది? ఇది కనీసం మూడు విషయాల్లో మించి ఉంటుంది: ఆలయం ఉనికిలో ఉన్న సంవత్సరాలు, అక్కడ బోధించినవారు, యెహోవాను ఆరాధించడానికి అక్కడికి వచ్చినవారు. సొలొమోను కట్టించిన మహిమాన్విత ఆలయం 420 సంవత్సరాలు అంటే సా.శ.పూ. 1027 నుండి సా.శ.పూ. 607 వరకు నిలిచివుంది, “కడవరి మందిరము” దాని నిర్మాణం పూర్తైన సా.శ.పూ. 515 నుండి సా.శ. 70లో నాశనమయ్యేంత వరకూ అంటే 580 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఉపయోగించబడింది. మెస్సీయ అయిన యేసుక్రీస్తు, “కడవరి మందిరము[లో]” బోధించాడు, దేవుణ్ణి ఆరాధించడానికి “మునుపటి” మందిరానికి వచ్చినవారికంటే ఎక్కువమంది కడపటి మందిరానికి వచ్చారు.—అపొస్తలుల కార్యములు 2:1-11.

మనకు పాఠాలు:

1:2-4. ప్రకటనా పనిలో మనకెదురయ్యే ఆటంకాలు, ‘రాజ్యాన్ని మొదట వెదకడానికి’ కాక మన వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యతనిచ్చేలా చేయకూడదు.—మత్తయి 6:33.

1:5, 7. మనం, ‘మన ప్రవర్తననుగూర్చి ఆలోచించుకోవడం,’ మనం జీవించే విధానం దేవునితో మనకున్న సంబంధంపై ఎలా ప్రభావం చూపిస్తుందో గంభీరంగా అలోచించుకోవడం జ్ఞానయుక్తం.

1:6, 9-11; 2:14-17. హగ్గయి కాలాల్లోని యూదులు వ్యక్తిగత లక్ష్యాల కోసం పాటుపడ్డారు గానీ వారి కష్టానికి ప్రతిఫలం లభించలేదు. వారు ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి వారికి దేవుని ఆశీర్వాదం లభించలేదు. వస్తుపరంగా మనకు ఎంత ఎక్కువగా ఉన్నా ఎంత తక్కువగా ఉన్నా “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును” అని గుర్తుంచుకొని మనం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అవధానమిస్తూ దేవుణ్ణి పూర్ణాత్మతో సేవించాలి.—సామెతలు 10:22.

2:15, 18. కట్టనారంభించినది మొదలుకొని ఆ తర్వాత జరిగిన దాని గురించి అంటే వారు గతంలో కనబరచిన నిర్లక్ష్యం గురించి కాదుగానీ పునర్నిర్మాణ పని గురించి ఆలోచించుకోమని యెహోవా యూదులను కోరాడు. అలాగే మనం కూడా మన దేవుణ్ణి ఆరాధించడంలో ముందుకు సాగడానికి కృషిచేయాలి.

‘బలముచేతకాక నా ఆత్మచేతనే జరుగును’

(జెకర్యా 1:1–14:21)

‘యెహోవా తట్టు తిరగండి’ అని యూదులను ఆహ్వానిస్తూ జెకర్యా తన ప్రవచన కార్యాన్ని మొదలుపెట్టాడు. (జెకర్యా 1:3) ఆలయాన్ని పునర్నిర్మించే పనికి దైవిక నడిపింపు ఉందని తర్వాత ఇవ్వబడిన ఎనిమిది దర్శనాలు చూపిస్తున్నాయి. (“జెకర్యా పొందిన ఎనిమిది సూచనార్థక దర్శనాలు” అనే బాక్సు చూడండి.) నిర్మాణ పనులు “శక్తిచేతనైనను బలముచేతనైననుకాక [యెహోవా] ఆత్మచేతనే” ముగింపుకు వచ్చాయి. (జెకర్యా 4:6) చిగురు అనబడే వ్యక్తి ‘యెహోవా ఆలయాన్ని కడతాడు,’ ‘సింహాసనాసీనుడై, యాజకత్వము చేస్తాడు.’—జెకర్యా 6:12, 13.

యెరూషలేము నాశనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసే ఉపవాసం గురించి యాజకులతో మనవి చేయడానికి బేతేలువారు ప్రతినిధులను పంపించారు. యెరూషలేముపైకి వచ్చిన విపత్తును జ్ఞాపకం చేసుకుంటూ వారు నాలుగుసార్లు ఉపవాసం ఉండి రోధించిన సందర్భాలు ఇక “వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును” అని యెహోవా జెకర్యాతో చెప్పాడు. (జెకర్యా 7:1-3; 8:19) ఆ తర్వాతి రెండు దేవోక్తుల్లో జనాంగాలకూ అబద్ధ ప్రవక్తలకూ వ్యతిరేకంగా ఇవ్వబడిన తీర్పు సందేశాలు, మెస్సీయ సంబంధిత ప్రవచనాలు, దేవుని ప్రజలు పునరుద్ధరించబడడం గురించిన సందేశం ఉన్నాయి.—జెకర్యా 9:1; 12:1.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:1—ఒక వ్యక్తి కొలనూలుతో యెరూషలేమును ఎందుకు కొలుస్తున్నాడు? పట్టణంచుట్టూ రక్షణ గోడను నిర్మించడం కోసం కొలవడాన్ని ఇది సూచిస్తుండవచ్చు. దూత, ఆ వ్యక్తితో యెరూషలేము విస్తరింపజేయబడుతుందనీ దానిపై యెహోవా కాపుదల ఉంటుందనీ చెప్పాడు.—జెకర్యా 2:3-5.

6:11-13—ప్రధానయాజకుడైన యెహోషువకు కిరీటాన్ని ఇవ్వడం ఆయనను రాజుగాను, యాజకునిగాను చేసిందా? లేదు, యెహోషువ దావీదు రాజవంశం నుండి రాలేదు. అయినా, ఆయనకు కిరీటాన్నివ్వడం, ఆయనను మెస్సీయకు పూర్వఛాయగా చేసింది. (హెబ్రీయులు 6:20) “చిగురు”కు సంబంధించిన ప్రవచనం పరలోక రాజు యాజకుడైన యేసుక్రీస్తు విషయంలో నెరవేరింది. (యిర్మీయా 23:5) పునర్నిర్మించబడిన ఆలయంలో, తిరిగివచ్చిన యూదులకు యెహోషువ ప్రధానయాజకునిగా సేవచేసినట్లే యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో సత్యారాధనకు యేసుక్రీస్తు ప్రధానయాజకునిగా ఉన్నాడు.

8:1-23ఈ వచనాల్లో తెలుపబడిన పది దేవోక్తులు ఎప్పుడు నెరవేరాయి? ప్రతీ దేవోక్తి “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా” అనే మాటలతో ప్రారంభమవుతుంది, అలాగే ప్రతీ దేవోక్తి దేవుడు తన ప్రజలకు శాంతి లభిస్తుందని చేసిన ఒక వాగ్దానం. ఈ దేవోక్తుల్లో కొన్ని సా.శ.పూ. 6వ శతాబ్దంలో నెరవేరాయి గానీ ఆ దేవోక్తులన్నీ సా.శ. 1919 నుండి నెరవేరి ఉండవచ్చు లేదా ఇప్పుడు నెరవేరుతున్నాయి. *

8:3—యెరూషలేము “సత్యమును అనుసరించు పురమని” ఎందుకు పిలవబడుతుంది? దాని నాశనానికి ముందు అంటే సా.శ.పూ. 607కు ముందు యెరూషలేము ‘అన్యాయము చేసే పట్టణంగా’ భ్రష్ట ప్రవక్తలతో, భ్రష్ట యాజకులతో, అవిశ్వాస ప్రజలతో నిండివుంది. (జెఫన్యా 3:1; యిర్మీయా 6:13; 7:29-34) అయితే ఆలయం పునర్నిర్మించబడి, యెహోవాను ఆరాధిస్తామని ప్రజలు ఒప్పుకోవడం వల్ల అక్కడ స్వచ్ఛారాధనకు సంబంధించిన సత్యాలే మాట్లాడబడేవి, అందుకే యెరూషలేము “సత్యమును అనుసరించు పురమని” పిలువబడింది.

11:7-14—“సౌందర్యము (‘కటాక్షము,’ అధస్సూచి),” “బంధము” అనబడే కట్టెలను జెకర్యా విరవడం దేన్ని సూచిస్తుంది? జెకర్యా, ‘వధకేర్పడిన గొఱ్ఱెలను మేపడానికి’ అంటే తమ నాయకులచేత మోసగించబడుతున్న గొఱ్ఱెలాంటి ప్రజలను మేపడానికి పంపబడినట్లు వర్ణించబడ్డాడు. కాపరి పాత్రలో ఉన్న జెకర్యా, దేవుని నిబంధనా ప్రజల దగ్గరకు పంపించబడి వారిచేత తృణీకరించబడిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ‘కటాక్షము’ అనే కట్టెను విరవడం, దేవుడు యూదులతో చేసిన ధర్మశాస్త్ర నిబంధనను సమాప్తిచేసి వారిపట్ల ఆయన కటాక్షముతో వ్యవహరించడం మానుకుంటాడని సూచిస్తోంది. “బంధము” అనే కట్టెను విరవడం అంటే యూదాకు, ఇశ్రాయేలుకు మధ్య ఉన్న దైవపరిపాలనా సహోదరబంధాన్ని నాశనం చేయడమని అర్థం.

12:11—“మెగిద్దోనులోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము” అంటే ఏమిటి? యూదారాజైన యోషీయా ఐగుప్తురాజైన నెకోతో “మెగిద్దోనులోయలో” చేసిన యుద్ధంలో మరణించాడు, తర్వాతి సంవత్సరాల్లో ప్రజలు ఆయన మరణం విషయమై ‘ప్రలాపిస్తూ’ దుఃఖించేవారు. (2 దినవృత్తాంతములు 35:25) కాబట్టి, “హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము” యోషీయా మరణం విషయమై ప్రలాపించడాన్ని సూచిస్తుండవచ్చు.

మనకు పాఠాలు:

1:2-6; 7:11-14. పశ్చాత్తాపంతో గద్దింపును స్వీకరించి, పూర్ణాత్మతో యెహోవాను ఆరాధిస్తూ ఆయనవైపు తిరిగేవారినిబట్టి ఆయన సంతోషించి తాను కూడా వారి తట్టు తిరుగుతాడు. మరోవైపు, ఆయన సందేశాన్ని ‘ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనేవారు’ సహాయం అర్థిస్తూ చేసే ప్రార్థనలకు ఆయన జవాబివ్వడు.

4:6, 7. ఆలయ పునర్నిర్మాణ పనిని విజయవంతంగా ముగించడానికి ఎదురైన ఏ ఆటంకమూ యెహోవా ఆత్మ అధిగమించలేనంత పెద్దదిగా నిరూపించబడలేదు. దేవుని సేవలో మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా వాటిని యెహోవాపై విశ్వాసముంచడం ద్వారా అధిగమించవచ్చు.—మత్తయి 17:20.

4:10. యెహోవా నిశిత పరిశీలన క్రింద, జెరుబ్బాబెలు అయన ప్రజలు దేవుని ఉన్నత ప్రమాణాల ప్రకారం ఆలయ నిర్మాణాన్ని ముగించారు. యెహోవా కోరేవాటికి అనుగుణంగా జీవించడం అపరిపూర్ణ మానవులకు మరీ అంత కష్టమేమీ కాదు.

7:8-10; 8:16, 17. యెహోవా అనుగ్రహం పొందాలంటే మనం సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి, కరుణావాత్సల్యములు కనబరచాలి, పొరుగువారితో సత్యమే మాట్లాడాలి.

8:9-13. యెహోవా మనకు అప్పగించిన పనిని ‘మనం ధైర్యంగా’ చేస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాల్లో శాంతి, భద్రత, ఆధ్యాత్మిక పురోగతి వంటివి ఉన్నాయి.

12:6. యెహోవా ప్రజల్లో పైవిచారణకర్తలుగా ఉన్నవారు ‘దివిటీలుగా’ ఉండాలి, అంటే విశేషమైన ఆసక్తిని కనబరచాలి.

13:3. సత్యదేవునిపట్ల ఆయన సంస్థపట్ల మనం చూపించే యథార్థత, మనం ఏ మానవులపట్ల అంటే వారెంత దగ్గరి బంధువులైనా సరే, వారిపట్ల చూపించే యథార్థతను మించినదై ఉండాలి.

13:8, 9. యెహోవా తృణీకరించిన ఆ అబద్ధ ప్రవక్తలు గొప్ప సంఖ్యలో అంటే దేశమంతటావున్న జనులలో రెండు భాగాలు ఉన్నారు. మూడవ భాగము మాత్రమే అగ్నిలో శుద్ధిచేయబడింది. మనకాలంలో, క్రైస్తవులమని చెప్పుకునేవారే అధికంగా ఉన్న క్రైస్తవమత సామ్రాజ్యాన్ని యెహోవా తృణీకరించాడు. కేవలం కొద్దిమందే అంటే అభిషిక్త క్రైస్తవులు ‘యెహోవా నామమునుబట్టి మొఱ్ఱపెట్టి,’ శుద్ధీకరణ ప్రక్రియకు తమనుతాము లోబరుచుకున్నారు. వారు, వారి తోటివిశ్వాసులు పేరుకు మాత్రం కాకుండా ఎన్నో విధాలుగా నిజమైన యెహోవాసాక్షులమని నిరూపించుకున్నారు.

ఆసక్తితో పనిచేయడానికి ప్రేరేపించబడాలి

హగ్గయి, జెకర్యా ప్రవచనాలు మనపై నేడు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఆలయ పునర్నిర్మాణ పనికి తమ అవధానమివ్వాలన్న వారి సందేశం యూదులను ఎలా ప్రేరేపించిందో మనం ఆలోచించినప్పుడు రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో మనం చురుకుగా పాల్గొనాలని ప్రేరేపించబడడం లేదా?

మెస్సీయ ‘గాడిద పిల్లను ఎక్కి వస్తాడనీ,’ ఆయన ‘ముప్పది తులముల వెండికి’ అమ్మివేయబడతాడనీ, ఆయన కొట్టబడతాడనీ, ‘గొఱ్ఱెలు చెదరగొట్టబడతాయనీ,’ జెకర్యా ప్రవచించాడు. (జెకర్యా 9:9; 11:12; 13:7) జెకర్యాలో ఉన్న ఆ మెస్సీయ సంబంధిత ప్రవచనాల నెరవేర్పులను ధ్యానించడం మన విశ్వాసంపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో కదా! (మత్తయి 21:1-9; 26:31, 56; 27:3-10) యెహోవా వాక్యంపై, మన రక్షణార్థమై ఆయన చేసిన ఏర్పాట్లపై మన నమ్మకం బలపర్చబడుతుంది.—హెబ్రీయులు 4:12.

[అధస్సూచి]

^ పేరా 25 కావలికోట జనవరి 1, 1996 సంచికలో 9-22 పేజీలు చూడండి.

[11వ పేజీలోని బాక్సు]

జెకర్యా పొందిన ఎనిమిది సూచనార్థక దర్శనాలు

1:8-17: ఆలయం పూర్తౌతుందని హామీ ఇచ్చి, యెరూషలేము, యూదాలోని ఇతర నగరాలు ఆశీర్వదించబడతాయని చూపిస్తుంది.

1:18-21: ‘యూదావారిని చెదరగొట్టిన నాలుగు కొమ్ములు’ అంటే యెహోవా ఆరాధనను వ్యతిరేకించిన ప్రభుత్వాలన్నీ అంతమౌతాయని వాగ్దానం చేస్తుంది.

2:1-13: యెరూషలేము విస్తరిస్తుందని, యెహోవా “దానిచుట్టూ అగ్ని ప్రాకారముగా” అంటే కాపుదలగా ఉంటాడని సూచిస్తుంది.

3:1-10: ఆలయ నిర్మాణ పనికి అవరోధాలు తీసుకురావడంలో సాతాను హస్తం ఉందని, ప్రధానయాజకుడైన యెహోషువ విడిపించబడి అతని దోషము పరిహరించబడిందని చూపిస్తుంది.

4:1-14: పర్వతాల్లాంటి అడ్డంకులు చదునుచేయబడతాయని, అధిపతియగు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాడని హామీనిస్తుంది.

5:1-4: శిక్షించబడని దుష్టప్రజలపై శాపం ప్రకటిస్తుంది.

5:5-11: దుష్టత్వం నిర్మూలించబడుతుందని ప్రవచిస్తుంది.

6:1-8: దేవదూతల పర్యవేక్షణ, రక్షణ ఖాయమని వాగ్దానం చేస్తుంది.

[8వ పేజీలోని చిత్రం]

హగ్గయి, జెకర్యా ఇచ్చిన సందేశాల లక్ష్యమేమిటి?

[10వ పేజీలోని చిత్రం]

పైవిచారణకర్తలు ‘దివిటీలుగా’ ఎలా ఉన్నారు?