కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్యమత పండుగను క్రైస్తవ పండుగగా చేసుకోవచ్చా?

అన్యమత పండుగను క్రైస్తవ పండుగగా చేసుకోవచ్చా?

అన్యమత పండుగను క్రైస్తవ పండుగగా చేసుకోవచ్చా?

రెండువేల నాల్గవ సంవత్సరం, శీతాకాలం, ఇటలీలో క్రిస్మస్‌ జరుపుకుంటున్న కాలంలో ఉత్సాహకరమైన ఒక చర్చ జరిగింది. క్రిస్మస్‌ ఆచారాల గురించిన ప్రస్తావనలను సాధ్యమైనంతవరకు తగ్గించాలని లేదా అసలు ప్రస్తావించకుండా ఉండాలనే వాదనను కొందరు విద్యావేత్తలు, బోధకులు సమర్థించారు. వారి స్కూళ్లకు హాజరయ్యే పిల్లల్లో ఎక్కువమంది అటు క్యాథలిక్కులూ కాదు ఇటు ప్రొటస్టెంట్‌లూ కాదు కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకునే వారలా సమర్థించారు. అయితే, ఇతర వృత్తులవారు, మరితర విద్యావేత్తలు ఈ ఆచారాలను గౌరవించాలని, వాటిని ఆచరించడం ఎప్పటికీ మానకూడదని పట్టుబట్టారు.

ఈ వివాదాంశాన్ని అలా ఉంచితే, అసలు క్రిస్మస్‌కు సంబంధించిన అనేక ఆచారాలు ఉనికిలోకి ఎలా వచ్చాయి? ఆ చర్చ ఓ కొలిక్కి చేరుకుంటుండగా, వాటికన్‌ వార్తాపత్రిక లోసేర్వాటోనే రోమానో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిచేసింది.

ఆ క్యాథలిక్‌ వార్తాపత్రిక, క్రిస్మస్‌ ఆచరించబడే తేదీ గురించి రాస్తూ, “చారిత్రక వివరాల ప్రకారం అసలు యేసు ఏ రోజున పుట్టాడో సరిగా తెలీదు ఎందుకంటే అప్పటి జనాభా లెక్కలుగానీ, రోమా సామ్రాజ్య చరిత్రగానీ ఆ తర్వాతి శతాబ్దాల్లో చేసిన పరిశోధన గానీ దాని గురించి ఏమీ తెలియజేయడంలేదు. . . . నాల్గవ శతాబ్దంలో చర్చ్‌ ఆఫ్‌ రోమ్‌వారే డిసెంబరు 25ను క్రీస్తు జన్మదినంగా ఎంపికచేశారని సర్వత్రా నమ్మబడుతోంది. అన్యమతాలు ప్రబలంగావున్న రోములో డిసెంబరు 25న సూర్యదేవుని పండుగ చేసుకునేవారు. . . . కాన్‌స్టంటైన్‌ చేసిన శానసంవల్ల రోములో క్రైస్తవత్వం అప్పటికే అంగీకరించబడింది. అయితే సాధారణ ప్రజానీకం మధ్య, ప్రాముఖ్యంగా చాలామంది సైనికుల మధ్య సూర్యదేవుని . . . కాల్పనిక కథ ప్రాచుర్యంలో ఉండేది. . . . డిసెంబరు 25న జరిగే పండుగలు ప్రజాదరణ పొందిన సంప్రదాయాల నుండి వచ్చినవే. అది తెలిసిన చర్చ్‌ ఆఫ్‌ రోమ్‌వారికి, సూర్యదేవునికి బదులు నిజమైన ధర్మసూర్యుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడానికి ఆ రోజును ఎంపికచేసుకోవడం ద్వారా దానికి క్రైస్తవమత ప్రాముఖ్యతను ఆపాదించాలనే ఆలోచన వచ్చింది.”

నేడు క్యాథలిక్‌ ఆచారాల్లో భాగంగా ఉన్న క్రిస్మస్‌ చెట్టు పుట్టుపూర్వోత్తరాల మాటేమిటి?

ఆ క్యాథలిక్‌ వార్తాపత్రికలోని శీర్షిక, పూర్వకాలాల్లో సతతహరిత ‘దేవదారు వృక్షజాతుల చెట్ల లాంటి అనేక ఇతర చెట్లకు మంత్ర, వైద్య శక్తులు, ఔషధ గుణాలు ఉండేవని నమ్మేవారు’ అని పేర్కొంది. అంతేకాదు, “క్రిస్మస్‌కు ముందు రోజున అంటే డిసెంబరు 24వ తేదీ సాయంత్రం భూపరదైసులోని చెట్టు గురించిన అత్యంత ప్రఖ్యాతిగాంచిన కథను చెప్పుకోవడం ద్వారా వారు ఆదాము హవ్వలను గుర్తుచేసుకునేవారు . . . అసలైతే వారు ఆపిల్‌ చెట్టును పెట్టుకోవాలి కానీ శీతాకాలంలో దాన్ని పెట్టుకోవడం సముచితంకాదు కాబట్టి ఒక వేదికపై ఫర్‌ చెట్టును పెట్టి దాని కొమ్మలపై కొన్ని ఆపిల్‌ పళ్లను తగిలించేవారు. భవిష్యత్తులో రాబోయే రక్షణకు సూచనగా వారు ప్రత్యేక అచ్చుపాత్రల్లో బిస్కెట్‌ పొడితో తయారుచేసిన రొట్టెముక్కలను తగిలించేవారు, అవి ప్రభురాత్రి భోజనంలో యేసు శరీరానికి చిహ్నంగా ఉపయోగించబడ్డాయి. పిల్లల కోసం మిఠాయిలు, బహుమతులు కూడా తగిలించేవారు.” ఆ తర్వాత కాలాల్లోని ఆచారాల మాటేమిటి?

క్రిస్మస్‌ చెట్టును పెట్టుకునే ఆచారం ముందుగా 16వ శతాబ్దంలో జర్మనీలో ప్రారంభమైందని పేర్కొంటూ లోసేర్వాటోరే రోమానో ఇలా వ్యాఖ్యానించింది: “ఇటలీ క్రిస్మస్‌ చెట్టు పెట్టుకునే ఆచారాన్ని చివరిగా అంగీకరించిన దేశాల్లో ఒకటి. ఆ ఆచారం ప్రొటస్టెంట్‌లది అనే పుకారు సర్వత్రా ఉండేది కాబట్టి దానికి బదులు పశువుల తొట్టిని [యేసు జనన దృశ్యాన్ని] పెట్టాలని అనుకోవడం అలా ఆలస్యంగా అంగీకరించడానికి ఒకింత కారణం కావచ్చు.” ఆరవ పోప్‌ పౌల్‌, యేసు జనన దృశ్యాన్ని ఏర్పాటు చేసిన స్థలానికి దగ్గర్లోనే “[సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌, రోమ్‌లో] పెద్ద క్రిస్మస్‌ చెట్టును పెట్టే ఆచారాన్ని” ప్రారంభించాడు.

ఒక మతనాయకుడు ప్రాచీన అన్యమత ఆచారాలకు సంబంధించిన సంఘటనలను, చిహ్నాలను క్రైస్తవ పండుగగా చిత్రీకరించడాన్ని మీరు ఆమోదిస్తారా? సరైనదేదో చెబుతూ లేఖనాలు నిజ క్రైస్తవులను ఇలా ఉపదేశిస్తున్నాయి: “నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?”—2 కొరింథీయులు 6:14-17.

[8, 9వ పేజీలోని చిత్రాలు]

క్రిస్మస్‌ చెట్టు (పక్క పేజీలో), వాటికన్‌ చర్చీ దగ్గర యేసు జనన దృశ్యం

[చిత్రసౌజన్యం]

© 2003 BiblePlaces.com

[9వ పేజీలోని చిత్రం]

సూర్యదేవుడు

[చిత్రసౌజన్యం]

Museum Wiesbaden