కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“కరుణాచిత్తులై” ఉండండి

“కరుణాచిత్తులై” ఉండండి

“కరుణాచిత్తులై” ఉండండి

ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడు మన తోటి మానవుల్లో చాలామంది కరువు, అనారోగ్యం, బీదరికం, నేరం, అంతర్యుద్ధం, ప్రకృతి విపత్తులు వంటి వాటిని ఎదుర్కొంటూ కరుణాపూర్వక సహాయం కోసం ఎంతగానో పరితపిస్తున్నారు. కరుణ అంటే ఇతరుల బాధను లేదా విపత్తును సానుభూతితో గ్రహించి, దానిని తీసివేయడానికి ఏదైనా చేయాలనే కోరిక కలిగి ఉండడం అని అర్థం. వెచ్చని సూర్యకిరణాల్లానే కరుణ కూడా బాధల్లో ఉన్నవారికి ఓదార్పునిచ్చి, నొప్పిని తగ్గించి, ఆందోళనలో ఉన్నవారికి ప్రోత్సాహాన్నిస్తుంది.

మన క్రియలద్వారా, మాటల ద్వారా మనం కరుణ చూపించవచ్చు, అంటే ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం, మన అవసరం వారికున్నప్పుడు వారికి అందుబాటులో ఉండడం ద్వారా అలా చూపించవచ్చు. కరుణ చూపించడాన్ని మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, పరిచయస్థులకు మాత్రమే పరిమితం చేయకపోవడం మంచిది. మనకు తెలియని ప్రజలపట్ల కూడా మనం కరుణ చూపించాలి. యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో ఇలా అడిగాడు: “మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును?” కరుణాభరితుడైన ఆ వ్యక్తి ఇంకా ఇలా చెప్పాడు: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్తయి 5:46, 47; 7:12.

పరిశుద్ధ లేఖనాల్లో ఈ మాటలను మీరు చదవవచ్చు, అదే బంగారు సూత్రం అని పిలువబడుతోంది. కరుణ చూపించడంలో బైబిలు సర్వశ్రేష్ఠమైన మార్గదర్శిని అని చాలామంది ఒప్పుకుంటారు. ఎలాంటి కారణం చేతనైనా, తమకుతాము సహాయం చేసుకోలేనివారికి సహాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని లేఖనాలు పదేపదే చెబుతున్నాయి. బైబిలు, దాని గ్రంథకర్త, మన సృష్టికర్త అయిన యెహోవా దేవుణ్ణి కరుణాభరితునిగా చూపిస్తుంది.

ఉదాహరణకు, “[దేవుడు] అనాథల, విధవరాండ్ర హక్కులను పరిరక్షిస్తాడు. విదేశీయుల గురించి శ్రద్ధ తీసుకుని వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు” అని మనం చదువుతాం. (ద్వితీయోపదేశకాండము 10:18, కాంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌) ‘బాధపరచబడువారికి న్యాయము తీర్చేవానిగా, ఆకలిగొనినవారికి ఆహారము దయచేయువానిగా’ యెహోవా దేవుడు వర్ణించబడ్డాడు. (కీర్తన 146:7) నిస్సహాయులైన శరణార్థుల విషయంలో యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను”—లేవీయకాండము 19:34.

అయితే, కరుణ చూపించడం ఎల్లవేళలా అంత సులభం కాదు. కొలొస్సయిలోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొ[నుడి]. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును . . . ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:9, 10, 12.

కాబట్టి కరుణాభరిత దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి కృషి అవసరం. క్రైస్తవులు ధరించుకోవాలని కోరబడుతున్న “నవీనస్వభావము[లో]” ఆ దృక్పథం భాగమైవుంది. పౌలు క్రూరమైన ప్రాచీన రోమ్‌ ప్రపంచంలో జీవించాడు. తోటి విశ్వాసులు మరింత సానుభూతి గలవారిగా, మరింత కరుణ గలవారిగా తయారవడానికి వారి వ్యక్తిత్వంలో గమనార్హమైన మార్పులు చేసుకోవాలని ఆయన వారిని ప్రోత్సహించాడు.

కరుణకున్న శక్తి

కరుణ చూపించేవారిని కొంతమంది బలహీనులుగా, దుర్బలులుగా దృష్టిస్తారు. ఆ తలంపు సరైనదేనా?

ఎంతమాత్రం సరికాదు! యథార్థమైన కరుణ చూపించడాన్ని ప్రభావితం చేసేది ప్రగాఢమైన ప్రేమే, అది పరిపూర్ణ ప్రేమ చూపించడంలో అత్యుత్తమ మాదిరిగా ఉన్న దేవుని నుండి ఉద్భవిస్తుంది. “దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు.” (1 యోహాను 4:16) యెహోవా “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని సరిగానే పిలవబడ్డాడు. (2 కొరింథీయులు 1:3) “కనికరము” అని అనువదించబడిన పదానికి ప్రాథమిక అర్థమేమిటంటే, “జాలి చూపించడం, ఇతరుల బాధల్లో కరుణ చూపించడం.” అంతెందుకు, యెహోవా “కృతజ్ఞత లేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.”—లూకా 6:35.

మనం కూడా కరుణవంటి దయాపూర్వక లక్షణాలను చూపించాలని మన సృష్టికర్త కోరుతున్నాడు. మీకా 6:8లో మనమిలా చదువుతాం: “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు . . . ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” సామెతలు 19:22లో మనమిలా చదువుతాం: “కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును.” తన తండ్రి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించిన, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన అనుచరులకు అదే తెలియజేశాడు: “మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.” (లూకా 6:36) ద జెరూసలేం బైబిల్‌లో ఆ ఉద్బోధ ఇలా ఉంది: “మీరు కూడా మీ తండ్రివలే కరుణ గలవారై ఉండండి.”

మనం కరుణ చూపించడానికి మంచి కారణమే ఉంది, ఎందుకంటే కరుణ చూపిస్తే మెండైన ఆశీర్వాదాలు లభిస్తాయి. “దయగలవాడు తనకే మేలు చేసికొనును” అని చెబుతున్న సామెతలు 11:17లోని మాటల సత్యాన్ని మనం తరచూ చూస్తాము. అవసరంలో ఉన్నవారికి మనం కరుణ చూపించినప్పుడు దేవుడు దానిని తనకు చేయబడిన సహాయంగా పరిగణిస్తాడు. తన ఆరాధకులు చూపించే ఎలాంటి కరుణకైనా, తిరిగి వారిపట్ల దయచూపించే బాధ్యతను ఆయన తీసుకుంటాడు. “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును” అని రాజైన సొలొమోను దైవ ప్రేరేపణతో చెప్పాడు. (సామెతలు 19:17) పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు [యెహోవా]వలన పొందునని మీరెరుగుదురు.”—ఎఫెసీయులు 6:8.

సామరస్యం కలిగివుండడానికి, విబేధాలను పరిష్కరించుకోవడానికి దోహదపడే శక్తి కరుణకు ఉంది. అది అపార్థాలను తొలగించుకొనేందుకు సహాయంచేసి, క్షమాపణకు మార్గం సుగమం చేస్తుంది. మనం అనుకున్నంత బాగా మన తలంపులను, భావాలను వ్యక్తం చేయలేకపోవడం మూలంగా లేదా ఇతరులు మన క్రియలను తప్పుగా అర్థం చేసుకోవడం మూలంగా అపార్థాలు తలెత్తవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కరుణ సమస్యను పరిష్కరించి, శాంతిని కాపాడుకొనేందుకు సహాయం చేస్తుంది. కరుణ చూపించేవ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తిని క్షమించడం సులభం. పౌలు క్రైస్తవులకు ఇచ్చిన ఈ సలహాకు అనుగుణంగా నడుచుకోవడానికి కరుణ మనకు సహాయం చేస్తుంది: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.”—కొలొస్సయులు 3:13.

కరుణ అంటే సానుభూతిని క్రియల్లో చూపించడం

ప్రాముఖ్యంగా కరుణకు బాధనుండి ఉపశమనాన్నిచ్చే శక్తి ఉంది. మనం గమనించినట్లుగా, అది దుఃఖంలోవున్న వారిపట్ల సానుభూతి చూపించేలా, అలాగే బాధపడేవారిపట్ల తదనుభూతి కలిగివుండేలా చేస్తుంది. కరుణ చూపించడమంటే కష్టాల్లోవున్న వ్యక్తులపట్ల దయార్ధ్ర భావాలు కలిగివుండి, అలాంటి వారికి సహాయం చేయడానికి ఆచరణాత్మక చర్య గైకొనడం.

సానుభూతి కలిగివుండడం ద్వారా క్రైస్తవులు యేసును అనుకరిస్తారు. ఇతరులకు ఆధ్యాత్మికంగానూ, వస్తుపరంగానూ సహాయం చేయలేనంతగా ఆయన ఎన్నడూ ఇతర పనుల్లో నిమగ్నమైవుండలేదు. ఇతరులు అవసరంలో ఉన్నారని గ్రహించినప్పుడు, ఆయన వారికి కరుణతో సహాయం చేసేవాడు.

ఆధ్యాత్మికంగా నిరుపేదలుగావున్న జనసమూహాలను చూసినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడో పరిశీలించండి: “ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరప[డెను].” (మత్తయి 9:36) ఇక్కడ ‘కనికరపడ్డాడు’ అని అనువదించబడిన పదం, “ఒక వ్యక్తి అంతరంగ భావాలను ప్రేరేపించే భావావేశాన్ని” సూచిస్తుందని ఒక బైబిలు విద్వాంసుడు చెబుతున్నాడు. వాస్తవానికి ఈ పదం, గ్రీకులో కరుణను సూచించడానికి ఉపయోగించే అత్యంత శక్తిమంతమైన పదాల్లో ఒకటని పిలువబడుతుంది.

అదే విధంగా కరుణగల క్రైస్తవులు ఇతరుల ఆధ్యాత్మిక, వస్తుపర అవసరాలకు వెంటనే ప్రతిస్పందిస్తారు. అపొస్తలుడైన పేతురు, ‘మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులునైయుండుడి’ అని వ్రాశాడు. (1 పేతురు 3:8) ఉదాహరణకు, ఒక బీద క్రైస్తవ కుటుంబం ఆరోగ్య కారణాల నిమిత్తం మరో ప్రదేశానికి వెళ్ళాల్సివచ్చినప్పుడు, అక్కడున్న తోటి విశ్వాసులు ఆరు నెలలపాటు ఎలాంటి అద్దె తీసుకోకుండా వారికొక ఇల్లు ఇచ్చారు. ఆ భర్త ఇలా చెబుతున్నాడు: “వారు మేమెలా ఉన్నామో చూడడానికి ప్రతీరోజు వచ్చేవారు, వారి ప్రోత్సాహకరమైన మాటలు మమ్మల్నెంతో ఆదరించాయి.”

నిజ క్రైస్తవులు అపరిచితుల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. వారు తమకు తెలియనివారికి సహాయం చేయడానికి సంతోషంగా తమ సమయాన్ని, శక్తిని, వస్తుపరమైన వనరులను వెచ్చిస్తారు. పూర్తి అపరిచితులకు సహాయం చేసినట్లు ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన స్వచ్ఛంద సేవకులు యెహోవాసాక్షులు.

అలా క్రైస్తవ సంఘంలో కరుణ, దయ వెల్లివిరుస్తాయి. ప్రేమతో పురికొల్పబడి, సంఘ సభ్యులందరూ ఇతరులకు వివిధ రకాలుగా సేవచేయడానికి బలం పొందుతారు. సంఘంలోని అనాథలకు, విధవరాండ్రకు ఉన్న అనేక వ్యక్తిగత సమస్యలవల్ల వారికి మీ శ్రద్ధ, తదనుభూతి అవసరమౌతుండవచ్చు. అలాంటి వారికి బీదరికం, పరిమితమైన వైద్య సంరక్షణ, సరైన గృహ వసతి లేకపోవడం, ఇతర వ్యక్తిగత కష్టాలను తాళుకోవడానికి మీరు సహాయం చేయగలరా?

గ్రీసులోవున్న ఒక జంట విషయమే తీసుకోండి. భర్తకు అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. భార్యాభర్తలిద్దరినీ వందలాది మైళ్ళ దూరంలోవున్న హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. అయితే కాపు కాసిన కమలా పండ్లను కోసి వాటిని అమ్మితే లభించే డబ్బే వారికొచ్చే కొద్దిపాటి రాబడి. వారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆ పని ఎవరు చేస్తారు? స్థానిక సంఘం చేసింది. వారు కమలా పండ్లుకోసి, వాటిని అమ్మి, అవసరంలోవున్న ఆ జంటకు డబ్బు వచ్చేలా చేయడమే కాక వారికి మనశ్శాంతి లభించేలా చేశారు.

కరుణను చాలా విధాలుగా చూపించవచ్చు. ఉదాహరణకు కొన్నిసార్లు, బాధలోవున్న కొందరు కోరుకునేదల్లా సానుభూతితో విని, తదనుభూతి చూపించి, లేఖనాధారిత ఓదార్పునిచ్చే వారు దయాపూర్వకంగా తమను సందర్శించడమేనని కరుణగల క్రైస్తవులు గ్రహిస్తారు.—రోమీయులు 12:15, 16.

కరుణాభరిత వాతావరణాన్ని ఆస్వాదించండి

శాంతి, ఓదార్పులకు నెళవైన ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంలో అందరూ పరస్పరం కరుణ, దయ చూపించుకుంటారు. కరుణ ఆకర్షిస్తుందని, క్రూరత్వం వికర్షిస్తుందని నిజ క్రైస్తవులు గ్రహిస్తారు. అలా వారు తమ పరలోక తండ్రిని అనుకరిస్తూ, ఆచరణాత్మక మార్గాల్లో “కరుణాచిత్తులై” ఉండడానికి పాటుపడతారు.

యెహోవాసాక్షులు, తమ క్రైస్తవ సమాజమంతటా వ్యాపించివున్న కరుణ, ప్రేమ, శ్రద్ధగల వాతావరణాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అక్కడ మీకు తప్పకుండా ఆదరాభిమానాలు లభిస్తాయని వారు నమ్ముతున్నారు.—రోమీయులు 15:7.

[5వ పేజీలోని చిత్రం]

జాలిగల మనస్సును ధరించుకొనమని పౌలు కొలొస్సయిలోవున్న క్రైస్తవులను ప్రోత్సహించాడు

[7వ పేజీలోని చిత్రాలు]

ఇతరులు అవసరంలో ఉన్నారని గ్రహించినప్పుడు యేసు వారికి కరుణతో సహాయం చేశాడు