మీకు ఒక ఆధ్యాత్మిక ఉపదేశకుడు ఉన్నాడా?
మీకు ఒక ఆధ్యాత్మిక ఉపదేశకుడు ఉన్నాడా?
ఉజ్జియా పదహారేళ్ల లేతప్రాయంలోనే యూదా దక్షిణ రాజ్యానికి రాజయ్యాడు. ఆయన సా.శ.పూ. 829 నుండి సా.శ.పూ. 778 వరకు అంటే 50 కన్నా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు. ఉజ్జియా చిన్నతనం నుండే ‘యెహోవా దృష్టికి యథార్థంగా’ ప్రవర్తించాడు. ఆయన అలా మంచి దారిలో నడిచేలా ఆయనను ఎవరు ప్రభావితం చేశారు? చారిత్రక వృత్తాంతం దానికిలా జవాబిస్తోంది: “దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను.”—2 దినవృత్తాంతములు 26:1, 4, 5.
రాజుకు సలహాదారునిగా పనిచేసిన జెకర్యా గురించిన వివరాలు బైబిలంతటిలో కేవలం ఈ వృత్తాంతంలోనే కనిపిస్తాయి. “దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన” ఉపదేశకుడైన జెకర్యా ఆ యువరాజు సన్మార్గంలో నడిచేలా అతనిపై మంచి ప్రభావం చూపించాడు. “[జెకర్యాకు] మంచి లేఖన పరిజ్ఞానంతోపాటు, ఆధ్యాత్మిక విషయాలపై మంచి అవగాహన, తనకున్న జ్ఞానాన్ని బోధించగల సామర్థ్యం” ఉండేవని ది ఎక్స్‌పోసిటర్స్ బైబిల్ జెకర్యా గురించి వ్యాఖ్యానించింది. జెకర్యాకు “ప్రవచనాల గురించిన లోతైన జ్ఞానం ఉంది . . . ఆయన తెలివైనవాడు, భక్తిపరుడు, నీతిమంతుడు. ఆయన ఉజ్జియాను ఎంతో ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది” అని ఒక బైబిలు విద్వాంసుడు చెబుతున్నాడు.
ఉజ్జియా నమ్మకంగా ఉండడంవల్ల యెహోవా ఆయనను ఎన్నో విధాలుగా ఆశీర్వదించాడు. “దేవుడు అతనికి సహాయము” చేశాడు కాబట్టి “అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను.” అవును, “జెకర్యా దినములలో” ఉజ్జియా దైవిక మార్గంలో నడిచాడు కాబట్టే లౌకిక విషయాల్లో విజయం సాధించగలిగాడు. (2 దినవృత్తాంతములు 26:6-8) అయితే, ఉజ్జియా వర్ధిల్లిన తర్వాత తన ఉపదేశకుడైన జెకర్యా బోధించిన మాటలను పాటించడం మానేశాడు. ఉజ్జియా “మనస్సున గర్వించి చెడిపోయెను . . . తన దేవుడైన యెహోవామీద ద్రోహము చే[సెను]” అని బైబిలు చెబుతోంది. అతను ఎంతో భక్తిహీనమైన పని చేయడంతో అతనికి అసహ్యకరమైన చర్మవ్యాధి సోకింది. దాంతో అతడు అశక్తుడై రాజుగా తనకున్న బాధ్యతలన్నిటినీ నిర్వర్తించలేకపోయాడు.—2 దినవృత్తాంతములు 26:16-21.
‘దేవుని ఆశ్రయించేందుకు’ మిమ్మల్ని ప్రోత్సహించే ఉపదేశకుడు ఎవరైనా మీకు కూడా ఉన్నారా? మీరు చిన్నవారైనా, పెద్దవారైనా, స్త్రీలైనా, పురుషులైనా మీకు కూడా ఒక ఉపదేశకుడు ఉండవచ్చు. అలాంటి ఉపదేశకులను విలువైనవారిగా ఎంచండి ఎందుకంటే మీరు యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉండేలా ఆయన లేక ఆమె సలహా మీకు సహాయం చేయగలదు. పరిణతి చెందిన ఆ ఉపదేశకుల మాటలు విని వారిచ్చే సలహాను శ్రద్ధగా వినండి. “దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన” అలాంటి ఉపదేశకులు చెప్పే జ్ఞానయుక్తమైన మాటలను మీరెన్నడూ అలక్ష్యము చేయకుందురు గాక!—సామెతలు 1:5; 12:15; 19:20.