కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు

మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు

మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు

“నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు.”—యెషయా 54:17.

ఆగ్నేయ ఐరోపాలోవున్న ఒక చిన్న పర్వత దేశంలో దశాబ్దాల క్రితం ధైర్యవంతులైన క్రైస్తవులున్నారు. నాస్తికవాద కమ్యూనిస్టు ప్రభుత్వం వారిని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ హింస, లేబర్‌ క్యాంపులు, తప్పుడు ప్రచారాలు వారిని నిర్మూలించలేకపోయాయి. వారెవరు? అల్బేనియాలోని యెహోవాసాక్షులు. కూటాలకు సమకూడడం, ప్రకటించడం ఎంతో కష్టంగావున్నా, దశాబ్దాలుగా వారు చూపించిన దృఢనిశ్చయత క్రైస్తవత్వాన్ని ఉన్నతపర్చి, ఘనపర్చడమే కాక యెహోవా నామాన్ని మహిమపర్చింది. పోయిన సంవత్సరం తమ కొత్త బ్రాంచి వసతుల ప్రతిష్ఠాపనా కార్యక్రమమప్పుడు ఎంతోకాలంగా నమ్మకమైన సాక్షిగావున్న ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “సాతాను ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అతడు ఓడిపోతూనే ఉంటాడు, యెహోవా గెలుస్తూనే ఉంటాడు!”

2 ఇదంతా, యెషయా 54:17లో రాయబడివున్నట్లుగా, దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దాన సత్యత్వానికి సజీవ సాక్ష్యంగా ఉంది. ఆ వచనమిలా ఉంది: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు, న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు.” సాతాను లోకం చేయగలిగినదేదీ యెహోవా దేవుని సమర్పిత సేవకులు ఆయనకుచేసే ఆరాధనను ఎన్నటికీ ఆపలేదని చరిత్ర ధృవీకరిస్తోంది.

సాతాను విఫల ప్రయత్నాలు

3 సత్యారాధకులకు విరుద్ధంగా ఉపయోగించబడిన ఆయుధాల్లో నిషేధాలు, అల్లరిమూకల దౌర్జన్యం, చెరసాలలు, ‘కట్టడవలన కీడు కల్పించడం’ వంటివి ఉన్నాయి. (కీర్తన 94:20) వాస్తవానికి, కొన్ని దేశాల్లో, యెహోవాసాక్షులు ఈ ఆర్టికల్‌ అధ్యయనం చేస్తున్న ఈ సమయంలో కూడా ఈ నిజ క్రైస్తవులు దేవునిపట్ల తమ యథార్థతకు సంబంధించి ‘శోధించబడుతున్నారు.’—ప్రకటన 2:10.

4 ఉదాహరణకు, దేవుని సేవకులు పరిచర్యలో ఉండగా భౌతికంగా వారిపై దాడిచేయబడిన సందర్భాలు కేవలం ఒక్క సంవత్సరంలోనే 32 ఉన్నాయని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఒకటి నివేదించింది. అంతేకాక పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా సాక్షులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భాలు 59 ఉన్నాయి. కొందరి వేలిముద్రలు తీసుకుని, ఫొటోలు తీసి, వారిని నేరస్థుల్లా జైల్లో పెట్టారు. శారీరక హాని కలిగిస్తామని మరికొందరిని బెదిరించారు. మరో దేశంలో, యెహోవాసాక్షులను బంధించిన, జరిమానా విధించిన లేదా కొట్టడానికి సంబంధించిన లిఖిత కేసులు ఇప్పుడు 1,100కు పైగావున్నాయి. వాటిలో 200కన్నా ఎక్కువ కేసులు వారు యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు సమకూడుకున్న రోజునే నమోదు చేయబడ్డాయి! అయినప్పటికీ, ఈ దేశాల్లోనూ మరితర దేశాల్లోనూ తీవ్ర అననుకూల పరిస్థితులున్నా తన ప్రజలు కాపాడబడేలా యెహోవా ఆత్మ వారికి సహాయం చేసింది. (జెకర్యా 4:6) శత్రువు కోపతాపాలు యెహోవాను స్తుతించేవారిని అడ్డుకోలేవు. అవును, దేవుని సంకల్పాన్ని ఏ ఆయుధమూ జయించలేదనే నమ్మకం మనకుంది.

దోషారోపణలు తప్పని నిరూపించబడ్డాయి

5 దేవుని ప్రజలు తమకు విరుద్ధంగా ఎలాంటి దోషారోపణ చేయబడినా వారు దానిపై నేరస్థాపన చేస్తారని, అంటే దాన్ని తప్పని నిరూపిస్తారని యెషయా ప్రవక్త ప్రవచించాడు. మొదటి శతాబ్దంలో, క్రైస్తవులు తరచూ దోషారోపణ చేయబడి, కీడుచేయువారిగా చిత్రీకరించబడ్డారు. అపొస్తలుల కార్యములు 16:20, 21లో కనబడే ఈ పదాలు అలాంటి నిందారోపణలకు అద్దం పడుతున్నాయి: “ఈ మనుష్యులు . . . రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారు.” మరో సందర్భంలో, మత వ్యతిరేకులు ఇలా కేకలు వేస్తూ, క్రీస్తు అనుచరులకు విరుద్ధంగా పట్టణ అధికారులను ఉసిగొల్పేందుకు ప్రయత్నించారు: “భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు . . . [వీరు] కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు.” (అపొస్తలుల కార్యములు 17:6, 7) అపొస్తలుడైన పౌలు ‘పీడవంటివాడనీ,’ “భూలోకమంతటా” తిరుగుబాటు రేపుతున్న మతభేదానికి నాయకుడనీ ముద్రవేయబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 24:2-5.

6 అదే విధంగా, నేడు నిజ క్రైస్తవులు తీవ్ర దోషారోపణలను, ద్వేషపూరిత అపవాదును, అబద్ధ ప్రచారాల్ని ఎదుర్కోవడం మనల్ని ఆశ్చర్యపర్చదు. మనం అలాంటి మౌఖిక దాడులు తప్పని నిరూపిస్తామని ఎందుకు చెప్పవచ్చు?—యెషయా 54:17.

7 తరచూ అలాంటి ఆరోపణలను, ప్రచారాన్ని యెహోవాసాక్షుల సత్ప్రవర్తన తిప్పికొడుతుంది. (1 పేతురు 2:12) క్రైస్తవులు తాము చట్టానికి లోబడే పౌరులమని, తోటి మానవుల సంక్షేమంపట్ల నిజమైన శ్రద్ధచూపించే నైతిక ప్రజలమని నిరూపించుకున్నప్పుడు, వారికి విరుద్ధంగా చేయబడిన ఆరోపణలు అబద్ధాలని వెల్లడవుతాయి. మన సత్ప్రవర్తనే మన యథార్థతకు నిదర్శనం. మనం దృఢనిశ్చయతతో సత్క్రియలు చేయడాన్ని గమనించినవారు తరచూ మన పరలోక తండ్రిని మహిమపర్చేందుకు, ఆయన సేవకుల ఉదాత్త జీవనశైలిని కొనియాడేందుకు కదిలించబడతారు.—యెషయా 60:14; మత్తయి 5:14-16.

8 మన భక్తిపూర్వక ప్రవర్తనకు తోడుగా మనం కొన్నిసార్లు, మన లేఖనాధార వైఖరిని ధైర్యంగా సమర్థించుకోవాల్సిన అవసరముంది. రక్షణ కోసం ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు విన్నవించుకోవడం ఒక విధానం. (ఎస్తేరు 8:3; అపొస్తలుల కార్యములు 22:25-29; 25:10-12) యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన తన విమర్శకులతో బాహాటంగా వాదించి వారి అబద్ధారోపణలను తిప్పికొట్టాడు. (మత్తయి 12:34-37; 15:1-11) యేసును అనుకరిస్తూ మనం, మన హృదయపూర్వక నమ్మకాల గురించి ఇతరులకు స్పష్టమైన వివరణనిచ్చే అవకాశాన్ని విడిచిపెట్టం. (1 పేతురు 3:15) పాఠశాలలో, ఉద్యోగ స్థలంలో లేదా అవిశ్వాసులైన బంధువుల నుండి ఎదురయ్యే అపహాస్యం, దేవునివాక్య సత్యాన్ని ప్రకటించకుండా మనల్ని ఆపేందుకు ఎన్నటికీ అనుమతించకుండా ఉందాం.—2 పేతురు 3:3, 4.

యెరూషలేము—ఒక “బరువైన రాయి”

9 జనులు నిజ క్రైస్తవులను వ్యతిరేకించడానికి గల కారణాన్ని జెకర్యా ప్రవచనం వెల్లడిస్తుంది. జెకర్యా 12:3 చెబుతున్న ఈ విషయాన్ని గమనించండి: “ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును.” ఈ ప్రవచనం ఏ యెరూషలేమును సూచిస్తోంది? యెరూషలేమును గురించిన జెకర్యా ప్రవచనం అభిషిక్త క్రైస్తవులు పిలవబడిన పరలోక రాజ్యమైన “పరలోకపు యెరూషలేమునకు” అన్వయిస్తుంది. (హెబ్రీయులు 12:22) మెస్సీయ రాజ్యానికి చెందిన ఈ వారసులు కొద్దిమంది ఇంకా భూమ్మీదే ఉన్నారు. వారు తమ సహవాసులైన “వేరేగొఱ్ఱెల”తో కలిసి, ఇంకా సమయముండగానే దేవుని రాజ్యంవైపు తిరగాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. (యోహాను 10:16; ప్రకటన 11:15) జనులు ఈ ఆహ్వానానికి ఎలా స్పందించారు? నేడు సత్యారాధకులకు యెహోవా ఎలాంటి మద్దతు ఇస్తున్నాడు? ఈ విషయాన్ని మనం జెకర్యా 12వ అధ్యాయపు అర్థాన్ని మరింతగా పరిశీలిస్తుండగా తెలుసుకుందాం. అలా తెలుసుకోవడం ద్వారా మనం దేవుని అభిషిక్తులకు, వారి సమర్పిత సహవాసులకు విరుద్ధంగా ‘ఏ ఆయుధమూ వర్ధిల్లదనే’ హామీని పొందవచ్చు.

10 జనులు “మిక్కిలి గాయపడుదురు” అని జెకర్యా 12:3 సూచిస్తోంది. ఇదెలా జరుగుతుంది? రాజ్యసువార్త నిశ్చయంగా ప్రకటించబడాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రకటించే బాధ్యతను యెహోవాసాక్షులు గంభీరంగా తీసుకుంటారు. అయితే ఆ రాజ్యమే మానవాళికున్న ఏకైక నిరీక్షణ అని ప్రకటించడం జనులకు ‘బరువైన రాయిగా’ తయారైంది. రాజ్య ప్రచారకుల పనిలో జోక్యం చేసుకోవడం ద్వారా వారు దాన్ని అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించడంలో ఆ జనములు చాలాచోట్ల దెబ్బలు తగిలి ‘మిక్కిలి గాయపడ్డారు.’ అవమానకరమైన వైఫల్యాలు ఎదురైనందుకు వారి పేరుప్రతిష్టలు కూడా దెబ్బతిన్నాయి. వారు ఈ విధానాంతానికి ముందు దేవుని మెస్సీయ రాజ్యాన్ని గురించిన ‘నిత్యసువార్త’ ప్రకటించే ఆధిక్యతను ఆనందించే సత్యారాధకుల నోరు నొక్కేయలేరు. (ప్రకటన 14:6) ఆఫ్రికాలోని ఒక దేశంలో, యెహోవా సేవకులపై చేయబడిన దౌర్జన్యాన్ని చూసిన ఒక చెరసాల కాపలాదారుడు నిజానికి ఇలా అన్నాడు: ‘ఈ ప్రజల్ని హింసించడంలో మీరు సమయం వృధా చేసుకుంటున్నారు. వారెన్నడూ రాజీపడరు. వారు వృద్ధి చెందుతూనే ఉంటారు.’

11జెకర్యా 12:4 చదవండి. ధైర్యవంతులైన తన రాజ్య ప్రచారకులకు విరుద్ధంగా పోరాడేవారికి సూచనార్థకంగా అంధత్వాన్ని కలిగిస్తానని, “బెదురు” పుట్టిస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు. ఉదాహరణకు, సత్యారాధన నిషేధించబడిన ఒక దేశంలో వ్యతిరేకులు దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారం అందకుండా చేయలేకపోయారు. ఆ దేశంలోకి బైబిలు ప్రచురణల్ని తెచ్చుకునేందుకు యెహోవాసాక్షులు గాలిబుడగల్ని ఉపయోగిస్తున్నారని కూడా ఒక వార్తాపత్రిక పేర్కొంది! దేవుడు తన యథార్థ సేవకులతో, “నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును” అని చేసిన వాగ్దానం నిజమని రుజువైంది. కోపోద్రేకంతో కళ్లుమూసుకుపోయిన రాజ్య వ్యతిరేకులకు ఏమిచేయాలో దిక్కతోచదు. అయితే యెహోవా తన ప్రజలను ఒక గుంపుగా కాపాడతాడని వారి సంక్షేమంపట్ల శ్రద్ధవహిస్తాడని మనం గట్టిగా నమ్ముతున్నాం.—2 రాజులు 6:15-19.

12జెకర్యా 12:5, 6 చదవండి. “యూదా అధికారులు” దేవుని ప్రజలను పర్యవేక్షించేవారిని సూచిస్తున్నారు. యెహోవా తన రాజ్య భూసంబంధ విషయాలపట్ల వారిలో ఉత్సాహ జ్వాలను నింపుతాడు. ఒక సందర్భంలో యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “నేను భూమిమీద అగ్ని వేయ వచ్చితిని.” (లూకా 12:49) నిజంగానే ఆయన అగ్ని రగిలించాడు. యేసు తన ఉత్సాహభరిత ప్రకటనా కార్యక్రమం ద్వారా ప్రజల ఎదుట దేవుని రాజ్యాన్ని సర్వోత్కృష్టమైన అంశంగా నిలబెట్టాడు. ఇది ఆ యూదా జనాంగమంతటా తీవ్ర వివాదాన్ని రగిలించింది. (మత్తయి 4:17, 25; 10:5-7, 17-20) అదే విధంగా, మనకాలంలో క్రీస్తు సన్నిహిత అనుచరులు అలంకారిక భావంలో ‘కట్టెల క్రింది నిప్పులుగా పనల క్రింది దివిటీలుగా’ అగ్ని రగిలించారు. 1917లో ప్రచురించబడిన మర్మము సమాప్తమాయెను * (ఆంగ్లం) అనే పుస్తకం క్రైస్తవమత సామ్రాజ్యపు వేషధారణను పూర్తిగా బయటపెట్టింది. అది మతనాయకుల నుండి ప్రతికూల ప్రతిస్పందనను తీసుకువచ్చింది. ఇటీవలి కాలంలో, “మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?” అనే రాజ్యవార్త నం. 37 చాలామంది దేవుని రాజ్యంవైపో దానికి విరుద్ధంగానో నిలబడేలా చేసింది.

“యూదావారి గుడారములు” రక్షించబడ్డాయి

13జెకర్యా 12:7, 8 చదవండి. నూతనలోక అనువాదము ప్రకారం 7వ వచనం చివరి భాగంలో, “యెహోవా యూదావారి గుడారములను మొదట రక్షించును” అని ఉంది. ప్రాచీన ఇశ్రాయేలులో గుడారాలు ఆ దేశపు ప్రత్యేక అంశంగా ఉండేవి, కొన్ని సమయాల్లో గొర్రెలకాపరులు, వ్యవసాయ కూలీలు వాటిలో నివసించేవారు. శత్రు జనాంగాలు యెరూషలేము పట్టణంపై దాడిచేయడానికి వచ్చినప్పుడు అలా గుడారాల్లో నివసించేవారే మొదట దాడికి గురయ్యే, కాపుదల అవసరమయ్యే స్థితిలో ఉండేవారు. “యూదావారి గుడారములు” అనే పదబంధం, సూచనార్థకంగా చెప్పాలంటే, మన కాలంలోని అభిషిక్త శేషం దుర్భేద్యమైన పట్టణాల్లో కాదుగానీ ఆరుబయట ఉన్నారని సూచిస్తుంది. అక్కడ వారు నిర్భయంగా మెస్సీయ రాజ్యసంబంధ విషయాలపట్ల శ్రద్ధచూపిస్తున్నారు. వారు సాతాను నేరుగా దాడిచేయగల పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, సైన్యములకధిపతియైన యెహోవా “యూదావారి గుడారములను మొదట” రక్షిస్తాడు.

14 ఆరుబయట తమ ‘గుడారాల్లో’ ఉన్న రాజ్య సంబంధులైన ఈ అభిషిక్త రాయబారులను యెహోవా రక్షిస్తున్నాడని చారిత్రక నివేదికలు రుజువుచేస్తున్నాయి. * ఆయన వారిని “శక్తిహీనులు” కానివ్వడు అంటే ఆయన వారిని యుద్ధశూరుడైన దావీదురాజులా బలంగలవారిగా, ధైర్యంగలవారిగా చేస్తాడు.

15జెకర్యా 12:9 చదవండి. యెహోవా ఎందుకు ‘అన్యజనులందరిని నశింపజేయ పూనుకుంటాడు’? ఎందుకంటే వారు మూర్ఖంగా మెస్సీయ రాజ్యాన్ని ఎదిరిస్తారు. దేవుని ప్రజల్ని పీడిస్తూ, హింసిస్తున్నందుకు వారు ఖండించబడ్డారు. త్వరలోనే సాతాను భూసంబంధ ప్రతినిధులు దేవుని సత్యారాధకులపై చివరిదాడి చేస్తారు, అది బైబిల్లో హార్‌మెగిద్దోను అని వర్ణించబడిన ప్రపంచ పరిస్థితికి దారితీస్తుంది. (ప్రకటన 16:13-16) ఆ దాడికి స్పందిస్తూ సర్వోన్నత న్యాయాధిపతి తన సేవకులను రక్షించి, అన్యజనుల ఎదుట తన నామాన్ని పరిశుద్ధపర్చుకుంటాడు.—యెహెజ్కేలు 38:14-18, 22, 23.

16 ప్రపంచవ్యాప్తంగావున్న దేవుని ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చే లేదా వారి ఉత్సాహాన్ని అణగార్చే ఏ ఆయుధమూ సాతాను దగ్గర లేదు. యెహోవా రక్షణ శక్తివల్ల మనకు లభించే ఆధ్యాత్మిక సమాధానం ‘యెహోవా సేవకుల స్వాస్థ్యము.’ (యెషయా 54:17) మన సమాధానాన్ని, ఆధ్యాత్మిక సమృద్ధిని ఎవరూ బలవంతంగా మననుండి తొలగించలేరు. (కీర్తన 118:6) సాతాను, వ్యతిరేకతకు ఆజ్యంపోస్తూనే హింస రగిలించేందుకు ప్రయత్నిస్తాడు. నిందారోపణలను విశ్వసనీయంగా సహించడం దేవుని ఆత్మ మనకు అండగావుందనడానికి నిదర్శనం. (1 పేతురు 4:14) యెహోవా స్థాపిత రాజ్యాన్ని గురించిన సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతోంది. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఉపయోగించే ఆయుధాల్లా, వ్యతిరేకతకు సంబంధించిన అనేక సూచనార్థక “వడిసెలరాళ్లు” దేవుని ప్రజలమీదికి విసరబడుతున్నాయి. అయితే యెహోవా సహాయంతో ఆయన సేవకులు అలాంటి రాళ్ల ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తూ వాటిని తాళుకుంటున్నారు. (జెకర్యా 9:15) అభిషిక్త శేషమును వారి విశ్వసనీయ సహవాసులను ఆపడం అసాధ్యం!

17 అపవాది దాడులన్నింటి నుండి రక్షించబడేందుకు మనం ఎదురుచూస్తున్నాం. ‘మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదని, న్యాయవిమర్శలో మనపై దోషారోపణచేయు ప్రతివానికి మనం నేరస్థాపన చేస్తామని’ ఇవ్వబడిన హామీనిబట్టి మనకు ఎంతటి ఓదార్పు లభిస్తోందో కదా!

[అధస్సూచీలు]

^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించినది, ఇప్పుడది ముద్రించబడడం లేదు.

^ పేరా 20 మరిన్ని వివరాల కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకం 675-6 పేజీలు చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• సాతాను ఆయుధాలు విఫలమయ్యాయని ఏది చూపిస్తోంది?

• పరలోక యెరూషలేము ఎలా “బరువైన రాయిగా” తయారైంది?

• యెహోవా “యూదా గుడారములను” ఎలా రక్షిస్తాడు?

• హార్‌మెగిద్దోను సమీపిస్తుండగా మీరు ఏ విషయంలో నమ్మకం కలిగివున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. అల్బేనియాలోని యెహోవాసాక్షుల అనుభవాలు యెషయా 54:17లోని మాటల సత్యత్వాన్ని ఎలా ఉదాహరిస్తున్నాయి?

3, 4. (ఎ) సాతాను ఆయుధాల్లో ఏమేమి ఉన్నాయి? (బి) అపవాది ఆయుధాలు ఏయే విధాలుగా విఫలమైనట్లు రుజువైంది?

5. మొదటి శతాబ్దంలో యెహోవా సేవకులపై ఎలాంటి అబద్ధారోపణలు చేయబడ్డాయి?

6, 7. తమకు విరుద్ధంగా చేయబడిన మౌఖిక దాడులను నిజ క్రైస్తవులు ఖండించే ఒక విధానమేమిటి?

8. (ఎ) మన లేఖనాధార స్థానాన్ని సమర్థించుకునేందుకు కొన్నిసార్లు ఏమి అవసరం కావచ్చు? (బి) క్రీస్తును అనుకరిస్తూ, మనల్ని వ్యతిరేకించేవారు తప్పని మనమెలా నిరూపిస్తాం?

9. జెకర్యా 12:3లో ప్రస్తావించబడిన “బరువైన రాయి” ఏ యెరూషలేమును సూచిస్తుంది, భూమ్మీద దానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

10. (ఎ) దేవుని ప్రజలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి? (బి) ‘బరువైన రాయిని’ అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించేవారికి ఏమి జరిగింది?

11. జెకర్యా 12:4లో రాయబడివున్న వాగ్దానాన్ని దేవుడెలా నిలబెట్టుకున్నాడు?

12. (ఎ) యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఏ భావంలో అగ్ని రగిలించాడు? (బి) అలంకారిక భావంలో అభిషిక్తులు ఎలా అగ్ని రగిలించారు, దాని ఫలితమేమిటి?

13. “యూదావారి గుడారములు” అనే పదబంధం దేనిని సూచిస్తుంది, దాడికి గురయ్యేవారిని యెహోవా ఎందుకు రక్షిస్తాడు?

14. “యూదావారి గుడారములలో” ఉన్న వారిని యెహోవా ఎలా రక్షిస్తాడు, వారినెలా శక్తిహీనులు కానివ్వడు?

15. యెహోవా ఎందుకు ‘అన్యజనులందరిని నశింపజేయ పూనుకుంటాడు,’ ఆయన ఎప్పుడు అలా చేస్తాడు?

16, 17. (ఎ) ‘యెహోవా సేవకుల స్వాస్థ్యము’ ఏమిటి? (బి) మనం సాతాను దాడులను సహించడం దేనికి నిదర్శనం?

[21వ పేజీలోని చిత్రాలు]

అల్బేనియాలోని యెహోవా ప్రజలు సాతాను దాడులను సహిస్తూ నమ్మకంగా ఉన్నారు

[23వ పేజీలోని చిత్రం]

యేసు అబద్ధారోపణలను తప్పని నిరూపించాడు

[24వ పేజీలోని చిత్రాలు]

సువార్త ప్రకటించేవారికి విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు