కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవా దినం కోసం సిద్ధంగావున్నారా?

మీరు యెహోవా దినం కోసం సిద్ధంగావున్నారా?

మీరు యెహోవా దినం కోసం సిద్ధంగావున్నారా?

“యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.”—జెఫన్యా 1:14.

యెహోవా మహా దినం అనేది 24 గంటల రోజుకాదు. అదింకా ఎక్కువ నిడివిగల కాలం, ఆ కాలంలో ఆయన దుష్టులపై తన తీర్పును అమలుచేస్తాడు. అంధకారం, ఉగ్రత, ప్రచండ కోపం, శ్రమ, ఉపద్రవం నిండివుండే ఆ దినమంటే భక్తిహీనులు భయపడడానికి తగిన కారణమే ఉంది. (యెషయా 13:9; ఆమోసు 5:18-20; జెఫన్యా 1:15) “ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును” అని యోవేలు ప్రవచించాడు. (యోవేలు 1:15) అయితే ఆ మహా దినం సమయంలో దేవుడు “యథార్థ హృదయులను” రక్షిస్తాడు.—కీర్తన 7:10.

2 “యెహోవా దినము” అనే మాట వివిధకాలాల్లో దేవుడు అమలుచేసిన తీర్పుకు అన్వయిస్తుంది. ఉదాహరణకు, సా.శ.పూ. 607లో బబులోనీయుల ద్వారా యెరూషలేము నివాసులపైకి “యెహోవా దినము” వచ్చింది. (జెఫన్యా 1:4-7) దీనికి పోలికగావున్న దేవుని తీర్పు సా.శ. 70లో వచ్చింది. అప్పుడు దేవుడు, తన కుమారుణ్ణి తిరస్కరించిన యూదా జనాంగంపై తన తీర్పును అమలుచేసేందుకు రోమన్లను ఉపయోగించుకున్నాడు. (దానియేలు 9:24-27; యోహాను 19:15) ఆయన ‘అన్యజనులందరిపై యుద్ధంచేసే’ “యెహోవా దినము” గురించి కూడా బైబిలు ప్రవచిస్తోంది. (జెకర్యా 14:1-3) దైవ ప్రేరణతో అపొస్తలుడైన పౌలు ఆ దినాన్ని క్రీస్తు ప్రత్యక్షతకు ముడిపెట్టాడు, ఇది 1914లో యేసు పరలోక రాజుగా సింహాసనాసీనుడైనప్పుడు ఆరంభమైంది. (2 థెస్సలొనీకయులు 2:1, 2) యెహోవా దినం వేగంగా సమీపిస్తున్న కారణాన్నిబట్టి, యెహోవాసాక్షుల 2007 కొరకైన వార్షిక వచనం సముచితంగా ఉంది. జెఫన్యా 1:14 నుండి తీసుకోబడిన ఆ వచనంలో ఇలావుంది: “యెహోవా మహా దినము సమీపమాయెను.”

3 దేవుని మహా దినం సమీపమైంది కాబట్టి, మీరు సిద్ధంగా ఉండాల్సిన సమయమిదే. ఆ దినంకోసం మీరెలా సిద్ధపడవచ్చు? యెహోవా దినంకోసం సిద్ధపడేందుకు మీరు అదనపు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా?

సిద్ధంగా ఉండండి

4 యుగసమాప్తి గురించి ప్రవచిస్తూ యేసుక్రీస్తు తన శిష్యులకిలా చెప్పాడు: ‘మీరు సిద్ధముగా ఉండండి.’ (మత్తయి 24:44) యేసు ఆ మాట చెప్పినప్పుడు, తాను తీవ్ర పరీక్షకు సిద్ధంగా ఉన్నాడు, అంటే విమోచన క్రయధన బలిగా మరణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. (మత్తయి 20:28) యేసు సిద్ధపడిన తీరునుండి మనమేమి నేర్చుకోవచ్చు?

5 యెహోవాపట్ల ఆయన నీతియుక్త ప్రమాణాలపట్ల యేసుకు ప్రగాఢ ప్రేమవుంది. యేసు గురించి హెబ్రీయులు 1:9 ఇలా చెబుతోంది: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.” యేసు తన పరలోక తండ్రిని ప్రేమించాడు కాబట్టే, తన యథార్థతను కాపాడుకున్నాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ప్రమాణాలకు అనుగుణంగా జీవించినప్పుడు ఆయన మనల్ని కాపాడతాడు. (కీర్తన 31:23) అలాంటి ప్రేమ, విధేయత యెహోవా మహా దినంకోసం సిద్ధంగా ఉండేందుకు మనకు సహాయం చేస్తాయి.

6 యేసు వ్యక్తిత్వంలో ప్రజలపట్ల ప్రేమ ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. నిజానికి, “ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరప[డ్డాడు].” (మత్తయి 9:36) అందువల్ల, పొరుగువారికి రాజ్యసందేశాన్ని ప్రకటించేలా ప్రేమ మనల్ని పురికొల్పినట్లే యేసు ప్రజలకు సువార్త ప్రకటించాడు. దేవునిపట్ల, మన పొరుగువారిపట్ల మనకున్న ప్రేమ క్రైస్తవ పరిచారకులముగా మనల్ని చురుగ్గా ఉంచి, తద్వారా యెహోవా మహా దినంకోసం మనం సిద్ధంగా ఉండేందుకు సహాయం చేస్తుంది.—మత్తయి 22:37-39.

7 యెహోవా చిత్తం చేయడంలో యేసు సంతోషించాడు. (కీర్తన 40:8) మనకు కూడా అలాంటి దృక్పథమే ఉంటే, దేవునికి పవిత్ర సేవచేయడంలో మనమూ సంతోషిస్తాం. యేసులాగే మనం కూడా నిస్వార్థ దాతలుగా ఉంటాం, ఇది మనకు నిజమైన సంతోషాన్నిస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:35) ‘యెహోవాయందు ఆనందించుటవలన మనం బలం పొందుతాం.’ ఆ ఆనందంతో మనం దేవుని మహా దినంకోసం మరింత సిద్ధపడివుంటాం.—నెహెమ్యా 8:10.

8 దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించడం యేసు విశ్వాస పరీక్షలకు సిద్ధపడేందుకు సహాయం చేసింది. తనకు యోహాను బాప్తిస్మం ఇస్తుండగా ఆయన ప్రార్థించాడు. అపొస్తలులను ఎన్నుకోవడానికి ముందు యేసు ఒక రాత్రంతా ప్రార్థించాడు. (లూకా 6:12-16) యేసు భూజీవితంలోని చివరిరాత్రి ఆయనచేసిన హృదయపూర్వక ప్రార్థనలనుబట్టి ఏ బైబిలు పాఠకుడు ముగ్ధుడు కాకుండా ఉంటాడు? (మార్కు 14:32-42; యోహాను 17:1-26) యేసులాగే మీరు కూడా ప్రార్థనాపరులుగా ఉన్నారా? తరచూ యెహోవాకు ప్రార్థించండి, హడావిడిగా ప్రార్థించకండి, పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని వేడుకోండి, ఆ నిర్దేశం స్పష్టమైనప్పుడు దానిని సత్వరమే అంగీకరించండి. దేవుని మహా దినం వేగంగా సమీపిస్తున్న ఈ అపాయకరమైన కాలంలో మన పరలోకపు తండ్రితో బలమైన సంబంధం చాలా ప్రాముఖ్యం. కాబట్టి, ప్రార్థనలో యెహోవాకు మరింత సన్నిహితమయ్యేందుకు వెనకాడకండి.—యాకోబు 4:8.

9 యెహోవా పరిశుద్ధ నామం పరిశుద్ధపర్చబడాలనే ఆసక్తికూడా తానెదుర్కొన్న పరీక్షలకు సిద్ధంగా ఉండేందుకు యేసుకు సహాయం చేసింది. నిజానికి ఆయన, తన అనుచరులు దేవునికి చేసే ప్రార్థనల్లో, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనే విన్నపం ఉండాలని బోధించాడు. (మత్తయి 6:9) యెహోవా నామం పరిశుద్ధపర్చబడాలని లేదా పవిత్రంగా ఉండాలని మనం ప్రగాఢంగా కోరుకుంటే, దానిపైకి నింద తీసుకొచ్చేదేదీ చేయకుండా ఉండేందుకు కృషిచేస్తాం. ఫలితంగా మనం యెహోవా మహా దినంకోసం మరింతగా సిద్ధపడివుంటాం.

మీరు కొన్ని మార్పులు చేసుకోవాలా?

10 ఒకవేళ యెహోవా దినం రేపే వస్తే, మీరు దానికోసం నిజంగా సిద్ధంగా ఉంటారా? మనలో ప్రతీ ఒక్కరం సర్దుబాటు చేసుకోవలసిన క్రియలు లేదా దృక్పథాలు ఏమైనావున్నాయా అని మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. మానవుల ప్రస్తుత అల్పకాల జీవితం, అనిశ్చిత పరిస్థితి దృష్ట్యా మనందరం ప్రతీరోజు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలి. (ప్రసంగి 9:11, 12; యాకోబు 4:13-15) కాబట్టి మన జీవితాల్లో అవధానమివ్వాల్సిన కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం.

11 ఒక ప్రాముఖ్యమైన అంశం, ప్రతీరోజు బైబిలు చదవమని ‘నమ్మకమైన దాసుడు’ ఇస్తున్న హెచ్చరిక. (మత్తయి 24:45) ప్రతీ సంవత్సరం ఆదికాండము నుండి ప్రకటన వరకు లేఖనాల్ని ధ్యానిస్తూ చదవడాన్ని మీ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. రోజుకు దాదాపు నాలుగు అధ్యాయాల చొప్పున చదవడం ద్వారా ఒక సంవత్సరంలో మీరు బైబిల్లోవున్న మొత్తం 1,189 అధ్యాయాలను చదవవచ్చు. ఇశ్రాయేలు రాజుల్లో ప్రతీ ఒక్కరు యెహోవా ధర్మశాస్త్రాన్ని “తాను బ్రదుకు దినములన్నిటను” చదవాలి. యెహోషువ దాదాపు అలాగే చేశాడని స్పష్టమౌతోంది. (ద్వితీయోపదేశకాండము 17:14-20; యెహోషువ 1:7, 8) ఆధ్యాత్మిక కాపరులు దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదవడం ఎంతో ప్రాముఖ్యం, ఎందుకంటే “హితబోధకు” అనుకూలమైనవి బోధించడానికి ఇది వారికి సహాయం చేస్తుంది.—తీతు 2:1.

12 యెహోవా దినం సమీపించడం, మీరు క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరయ్యేలా, సాధ్యమైనంత ఎక్కువగా వాటిలో భాగం వహించేలా మిమ్మల్ని పురికొల్పాలి. (హెబ్రీయులు 10:24-25) అలా చేయడం, నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరి గలవారిని కనుగొని, వారికి సహాయం చేసేందుకు ప్రయత్నించే రాజ్యప్రచారకునిగా మీ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సహాయం చేస్తుంది. (అపొస్తలుల కార్యములు 13:48, NW) వృద్ధులకు సహాయం చేయడం, యువతను ప్రోత్సహించడం వంటివి చేయడం ద్వారా మీరు సంఘంలో ఇతరవిధాలుగా కూడా మరింత చురుకుగా భాగం వహించవచ్చు. ఈ కార్యకలాపాలు ఎంత సంతృప్తినిస్తాయో కదా!

ఇతరులతో మీ సంబంధాలు

13 యెహోవా దినం త్వరలోనే రాబోతోంది కాబట్టి, మీరు “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును” ధరించుకోవడానికి మరింతగా ప్రయత్నించాల్సిన అవసరముందా? (ఎఫెసీయులు 4:20-24) మీరు దైవిక లక్షణాలను అలవర్చుకుంటుండగా, మీరు ‘దేవుని ఆత్మానుసారముగా నడుచుకోవడాన్ని,’ ఆత్మఫలాన్ని కనబర్చడాన్ని ఇతరులు గమనించవచ్చు. (గలతీయులు 5:16, 22-25) మీరు, మీ కుటుంబం నూతన స్వభావం ధరించుకున్నారని చూపించే ప్రత్యేకమైన క్రియలను మీరు సూచించగలరా? (కొలొస్సయులు 3:9-10) ఉదాహరణకు, మీరు తోటి విశ్వాసులపట్ల, ఇతరులపట్ల దయాపూర్వక పనులు చేసేవారని అందరికీ తెలుసా? (గలతీయులు 6:10) లేఖనాలను క్రమంగా అధ్యయనం చేయడం యెహోవా దినంకోసం మిమ్మల్ని సిద్ధపర్చే దైవిక లక్షణాలు అలవర్చుకునేందుకు మీకు సహాయం చేస్తుంది.

14 మీరు ముక్కోపి అనీ మీకు మరింత ఆశానిగ్రహం అవసరమనీ గ్రహిస్తే అప్పుడేమిటి? ఆత్మఫలంలో భాగమైన ఆ లక్షణాన్ని దేవుని పరిశుద్ధాత్మ మీలో కలిగించగలదు. కాబట్టి యేసు పలికిన ఈ మాటలకు అనుగుణంగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి: “అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. . . . మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.”—లూకా 11:9-13.

15 ఉదాహరణకు, మీకు మీ తోటి విశ్వాసికి సత్సంబంధాలు లేవనుకోండి. అలాంటప్పుడు, పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నించండి, ఆ విధంగా సంఘంలో సమాధానాన్ని, ఐక్యతను ప్రోత్సహించండి. (కీర్తన 133:1-3) మత్తయి 5:23, 24లో లేదా మత్తయి 18:15-17లో రాయబడివున్న యేసు ఉపదేశాన్ని అన్వయించుకోండి. సూర్యుడు అస్తమిస్తున్నా మీ కోపం అలాగే నిలిచివుంటే, సత్వరమే మీరు ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. క్షమించడానికి సుముఖంగా ఉండడమే తరచూ దానికి పరిష్కారం. పౌలు ఇలా రాశాడు: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫెసీయులు 4:25, 26, 32.

16 వివాహబంధంలో దంపతులిద్దరూ కరుణను, కొన్నిసార్లు క్షమాగుణాన్ని ప్రదర్శించాలి. మీ జతపట్ల మీరు మరింత ప్రేమను, కరుణను ప్రదర్శించాల్సిన అవసరముంటే, దేవుని సహాయంతో, ఆయన వాక్య సహాయంతో ఈ ఉద్దేశసాధనకు కృషిచేయండి. ఒత్తిడిని తగ్గించుకుని, అవిశ్వాస్యతకు దూరంగా ఉండేందుకు 1 కొరింథీయులు 7:1-5కు అనుగుణంగా ఉండేందుకు మీరు మెరుగుపర్చుకోవాల్సినది ఏదైనావుందా? ఇది నిశ్చయంగా జీవితంలో భర్త లేదా భార్య “కరుణ” చూపించాల్సిన ఒక రంగం.

17 మీరు ఏదైనా గంభీరమైన పాపంచేస్తే అప్పుడేమిటి? సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చర్యలు తీసుకోండి. క్రైస్తవ పెద్దల సహాయాన్ని తప్పకుండా అర్థించండి. వారి ప్రార్థనలు, ఉపదేశం మీ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి స్వస్థత చేకూరేలా సహాయం చేస్తాయి. (యాకోబు 5:13-16) పశ్చాత్తప్త దృక్పథంతో యెహోవాకు ప్రార్థించండి. అలా ప్రార్థించకపోతే మీలో అపరాధభావం కలుగుతుంది, మీ మనస్సాక్షి కలతపడుతుంది. దావీదు అలాంటి పరిస్థితిని అనుభవించాడు, అయితే యెహోవా యెదుట తప్పు ఒప్పుకున్న తర్వాత ఎంతటి ఉపశమనాన్ని పొందాడోకదా! ఆయన ఇలా రాశాడు: “తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు, ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.” (కీర్తన 32:1-5) పాపంచేసినప్పటికీ యథార్థంగా పశ్చాత్తాపపడేవారిని యెహోవా క్షమిస్తాడు.—కీర్తన 103:8-14; సామెతలు 28:13.

లోకసంబంధులు కాకండి

18 మీరు, మన పరలోక తండ్రి వాగ్దానంచేసిన అద్భుతమైన నూతనలోకం కోసం ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు. అలాంటప్పుడు, దేవునికి దూరమైన అనీతియుక్త మానవ సమాజపు లోకాన్ని మీరెలా దృష్టిస్తారు? “ఈ లోకాధికారి” అయిన సాతానుతో యేసుక్రీస్తుకు సంబంధమేమీ లేదు. (యోహాను 12:31; 14:30) అపవాది సంబంధులుగా, అతని లోక సంబంధులుగా ఉండాలని మీరు నిశ్చయంగా కోరుకోరు, కాబట్టి అపొస్తలుడైన యోహాను పలికిన ఈ మాటలను లక్ష్యపెట్టండి: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి.” ఇలా చేయడం జ్ఞానయుక్తం, ఎందుకంటే “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:15-17.

19 మీరు మీ పిల్లలకు ‘ఇహలోక మాలిన్యము అంటకుండా తమను కాపాడుకునేలా’ సహాయం చేస్తున్నారా? (యాకోబు 1:27) జాలరి గాలంవేసి చేపను పట్టుకున్నట్లే, సాతాను మీ పిల్లలకు గాలంవేసి పట్టుకోవాలని చూస్తాడు. యౌవనులు సాతాను లోకంలో ఇమిడిపోయేలా చేసేందుకు వివిధ క్లబ్బులు, ఇతర సంస్థలు రూపొందించబడ్డాయి. అయితే యెహోవా సేవకులు, ఈ దుష్ట విధానాంతం నుండి తప్పించబడే ఏకైక సంస్థలో భాగమైవున్నారు. కాబట్టి క్రైస్తవ యౌవనులు “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉండేలా వారిని ప్రోత్సహించాలి. (1 కొరింథీయులు 15:58) తమ పిల్లలు, దేవుణ్ణి మహిమపరుస్తూ, యెహోవా దినంకోసం సిద్ధపడేందుకు వారికి సహాయపడే సంతోషభరితమైన, ప్రతిఫలదాయకమైన జీవితాన్నిచ్చే లక్ష్యాలు పెట్టుకునేలా దైవభక్తిగల తల్లిదండ్రులు వారికి తోడ్పడాలి.

యెహోవా మహా దినం తర్వాతి భవిష్యత్తును చూడండి

20 మీరు నిత్యజీవాన్ని దృష్టిలో ఉంచుకుంటే యెహోవా దినంకోసం మీరు ప్రశాంతంగా వేచి ఉండగల్గుతారు. (యూదా 20, 21) పరదైసులో నిత్యజీవం కోసం మీరు ఎదురుచూస్తున్నారు కాబట్టి, మీరు తిరిగి యౌవనబలం పుంజుకుంటారని, ప్రయోజనాత్మక లక్ష్యసాధనకు, యెహోవా గురించి మరింత తెలుసుకునేందుకు మీకు అపరిమితమైన సమయం ఉంటుందని నిరీక్షిస్తున్నారు. నేడు మానవులకు దేవుని “కార్యములలో స్వల్పము” మాత్రమే తెలుసు కాబట్టి ఆయన గురించి మీరు నిరంతరం నేర్చుకుంటూనే ఉండవచ్చు. (యోబు 26:14) ఎంత ఉత్తేజకరమైన భావినిరీక్షణో కదా!

21 పరదైసులో, పునరుత్థానం చేయబడేవారు గతానికి సంబంధించి మనకు తెలియని కొంత సమాచారాన్ని ఇవ్వగల్గుతారు. హనోకు, భక్తిహీన ప్రజలకు యెహోవా సందేశాన్ని ప్రకటించేందుకు తానెలా ధైర్యం తెచ్చుకున్నాడో మనకు వివరించడానికి అక్కడ ఉంటాడు. (యూదా 14, 15) ఓడను ఎలా నిర్మించాడో నోవహు మనకు తప్పకుండా వివరిస్తాడు. ఊరులోని సుఖాలను విడిచిపెట్టి గుడారాల్లో జీవించడం గురించి తామెలా భావించారో అబ్రాహాము, శారా వెల్లడిచేయగల్గుతారు. ఎస్తేరు, తన ప్రజల పక్షాన నిలబడి వారికి వ్యతిరేకంగా హామాను పన్నిన కుట్రను ఎలా భగ్నంచేసిందో వివరించడం గురించి ఆలోచించండి. (ఎస్తేరు 7:1-6) పెద్ద చేప కడుపులో మూడు రోజులు ఉండడం గురించి యోనా చెప్పడం, బాప్తిస్మమిచ్చు యోహాను, యేసుకు బాప్తిస్మమిచ్చినప్పుడు తన భావాలెలావున్నాయో వివరించడం ఊహించుకోండి. (లూకా 3:21, 22; 7:28) మనం తెలుసుకోవడానికి ఎన్ని ఆసక్తికరమైన విషయాలుంటాయో కదా!

22 క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో, “దేవుని గూర్చిన విజ్ఞానము” పొందేలా పునరుత్థానం చేయబడినవారికి సహాయంచేసే ఆధిక్యత మీకుంటుంది. (సామెతలు 2:1-6) నేడు, ప్రజలు యెహోవా దేవుని గురించిన జ్ఞానంపొంది దానికి అనుగుణంగా ప్రవర్తించడాన్ని చూడడం ఎంతో సంతోషాన్ని తీసుకొస్తుంది. అలాగే పూర్వమెప్పుడో జీవించిన ప్రజలకు ఉపదేశించే మీ ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించే, వారు కృతజ్ఞతాపూర్వకంగా స్పందించే భవిష్యత్కాలపు ఆనందం గురించి కూడా ఆలోచించండి!

23 యెహోవా ప్రజలముగా మనమిప్పుడు అనుభవిస్తున్న ప్రయోజనాలు అపరిపూర్ణులముగా మనం లెక్కబెట్టడానికి, విలువకట్టడానికి మించివున్నాయి. (కీర్తన 40:5) ప్రత్యేకంగా మనకు దేవుని ఆధ్యాత్మిక ఏర్పాట్లపట్ల కృతజ్ఞతవుంది. (యెషయా 48:17, 18) మన పరిస్థితులెలావున్నా, యెహోవా మహా దినంకోసం వేచిచూస్తూ హృదయపూర్వకంగా మనం పవిత్రసేవలో కొనసాగుదాం.

మీరెలా జవాబిస్తారు?

• “యెహోవా దినము” అంటే ఏమిటి?

• యెహోవా దినంకోసం సిద్ధంగావున్నట్లు మీరెలా నిరూపించుకోవచ్చు?

• దేవుని మహా దినం అత్యంత సమీపంగావున్న దృష్ట్యా, మనమెలాంటి మార్పులు చేసుకోవలసి ఉంటుంది?

• యెహోవా దినం ముగిసిన తర్వాత మీరు దేనికోసం ఎదురుచూడవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1-3. (ఎ) యెహోవా దినం గురించి బైబిలు ఏమిచెబుతోంది? (బి) ఏ ‘యెహోవా దినాన్ని’ మనమెదుర్కొంటాం?

4. ఏ తీవ్ర పరీక్షకు యేసు సిద్ధపడ్డాడు?

5, 6. (ఎ) దేవునిపట్ల, ప్రజలపట్ల మనకున్న ప్రేమ యెహోవా దినంకోసం సంసిద్ధంగా ఉండేందుకు మనకెలా సహాయం చేస్తుంది? (బి) పొరుగువారిపట్ల ప్రేమ విషయంలో యేసు ఎలాంటి మాదిరినుంచాడు?

7. యెహోవా దినంకోసం వేచిచూస్తూ మనమెందుకు ఆనందంగా ఉండవచ్చు?

8. మనమెందుకు ప్రార్థనలో యెహోవాకు సన్నిహితమవ్వాలి?

9. యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడం గురించిన ఆసక్తి ఎంత ప్రాముఖ్యం?

10. మన జీవితాన్ని పరిశీలించుకోవడం ఎందుకు సముచితం?

11. బైబిలు చదివే విషయంలో మీ లక్ష్యమేమిటి?

12. యెహోవా దినం సమీపించడం మిమ్మల్ని ఏమి చేయడానికి పురికొల్పాలి?

13. నూతన స్వభావం ధరించుకోవడం గురించి మనమే ప్రశ్నలు వేసుకోవచ్చు?

14. ఆశానిగ్రహాన్ని అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కోసం ఎందుకు ప్రార్థించాలి?

15. మీకు, మీ తోటి విశ్వాసికి సత్సంబంధాలు లేకపోతే ఏమిచేయాలి?

16. వివాహంలో ఏయే విధాలుగా కరుణ అవసరం?

17. ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసినప్పుడు ఏ చర్యలు తీసుకోవాలి?

18. మీరు లోకాన్ని ఎలా దృష్టించాలి?

19. క్రైస్తవ యౌవనులు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకునేందుకు ప్రోత్సహించబడుతున్నారు?

20. మనమెందుకు నిత్యజీవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి?

21, 22. పునరుత్థానం చేయబడినవారు, మీరు ఎలాంటి సమాచారాన్ని పరస్పరం పంచుకోవచ్చు?

23. మనమేమి చేసేందుకు తీర్మానించుకోవాలి?

[12వ పేజీలోని చిత్రం]

యేసు పరీక్షలకు సిద్ధపడివున్నట్లు నిరూపించుకున్నాడు

[15వ పేజీలోని చిత్రం]

యెహోవా గురించిన జ్ఞానం పొందేందుకు పునరుత్థానం చేయబడినవారికి సహాయం చేయడం ఎంత చక్కని ఆధిక్యతో కదా!