కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడండి’

‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడండి’

‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడండి’

“యెహోవా నా పక్షమున నున్నాడు; నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు?”—కీర్తన 118:6.

నేడు మానవజాతి క్రితమెన్నడూ అనుభవించనంతటి విపత్కరమైన సంఘటనల్ని ఎదుర్కోబోతోంది. మన కాలం గురించి ప్రవచిస్తూ యేసు తన అనుచరులనిలా హెచ్చరించాడు: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.”—మత్తయి 24:21, 22.

2 మానవులకు కనిపించకపోయినా, పరలోక సైన్యాలు ఇప్పుడు ఆ శ్రమను నిలిపివుంచాయి. దీనికి కారణమేమిటో, యేసు ద్వారా ఇవ్వబడిన దర్శనంలో అపొస్తలుడైన యోహాను చూశాడు. ఆ వృద్ధ అపొస్తలుడు దానినిలా వర్ణిస్తున్నాడు: “భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి . . . గాలి వీచకుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. . . . ఆ నలుగురు దూతలతో ఈ దూత—మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.”—ప్రకటన 7:1-3.

3 “దేవుని” అభిషిక్త “దాసులను” ముద్రించడం పూర్తికావొస్తోంది. నాశనకరమైన ఆ వాయువులను విడిచిపెట్టేందుకు నలుగురు దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. వారలా విడిచిపెట్టినప్పుడు మొదట ఏమి సంభవిస్తుంది? వేరొక దేవదూత దానికిలా జవాబిస్తున్నాడు: “మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.” (ప్రకటన 18:21) ఇలా జరిగినప్పుడు అంటే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం నాశనం చేయబడినప్పుడు పరలోకంలో ఎంత సంతోషం కలుగుతుందో కదా!—ప్రకటన 19:1, 2.

4 అప్పటికే భూమ్మీది జనాంగాలన్నీ యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా చేతులు కలిపివుంటాయి. ఆ నమ్మకమైన క్రైస్తవులను తుడిచిపెట్టడంలో జనాంగాలు విజయం సాధిస్తాయా? అవి అలా చేయగలవన్నట్లు అనిపిస్తుంది. అయితే క్రీస్తుయేసుతోపాటు వస్తున్న పరలోక సైన్యాలు ఈ మానవ శక్తులను ధ్వంసం చేస్తాయి. (ప్రకటన 19:19-21) చివరకు, అపవాది అతని దూతలు క్రియాశూన్య అగాధంలోకి నెట్టివేయబడతారు. వారు వెయ్యిసంవత్సరాలు అలా బంధించబడతారు కాబట్టి, వారిక ఏ మాత్రం మానవులను మోసగించలేరు. రక్షించబడే గొప్పసమూహానికి అదెంతటి ఉపశమనాన్నిస్తుందో కదా!—ప్రకటన 7:9, 10, 14; 20:1-3.

5 ఈ అద్భుతమైన, భక్తిపూర్వక భయాన్ని కలిగించే సంఘటనల్ని మనం త్వరలోనే ఎదుర్కోబోతున్నాము. అవన్నీ యెహోవా పరిపాలనా హక్కు, ఆయన విశ్వ సర్వాధిపత్యం సరైనవని నిరూపించడానికి సంబంధించినవి. దీనిగురించి ఆలోచించండి: మనం యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉంటే, ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థిస్తే, యెహోవా నామం పరిశుద్ధపర్చబడడంలో, ఆయన సంకల్ప నెరవేర్పులో భాగంవహించే అవకాశం మనకుంటుంది. అదెంత అమూల్యమైన ఆనందంగా ఉంటుందో కదా!

6 మనమా విశేష సంఘటనలకు సిద్ధపడివున్నామా? యెహోవా రక్షణశక్తిలో మనకు విశ్వాసముందా? సరైన సమయంలో, ఉత్తమరీతిలో ఆయన మనకు సహాయం చేస్తాడని మనం నమ్ముతున్నామా? అలాంటి వ్యక్తిగత ప్రశ్నలకు జవాబివ్వడంలో మనం, అపొస్తలుడైన పౌలు రోములోవున్న తన తోటి క్రైస్తవులకు చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం: “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమీయులు 15:4) మనకు ఆదరణను, నిరీక్షణను ఇస్తూ మనకు బోధ కలగడం కోసం రాయబడినవాటిలో ఐగుప్తు క్రూరపాలకుల కఠిన బానిసత్వం నుండి యెహోవా ఇశ్రాయేలీయులను విడిపించిన సందర్భానికి సంబంధించిన నివేదిక ఉంది. వేగంగా సమీపిస్తున్న మహాశ్రమ కోసం మనం ఎదురుచూస్తుండగా, ఇశ్రాయేలీయులకు రక్షణ తీసుకొచ్చేందుకు యెహోవా నిర్దేశించిన ఆ ఉత్తేజకరమైన సంఘటనల్ని నిశితంగా పరిశీలించడం మనల్నెంతో ప్రోత్సహించాలి.

యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు

7 అది సా.శ.పూ. 1513వ సంవత్సరం. యెహోవా అప్పటికే ఐగుప్తీయులపై తొమ్మిది తెగుళ్లు రప్పించాడు. చివరి తెగులు తర్వాత, ఫరో మోషేను తక్షణమే పంపివేస్తూ “నా యెదుటనుండి పొమ్ము! భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని” అన్నాడు. అందుకు మోషే, “నీవన్నది సరి. నేనికను నీ ముఖము చూడనని” జవాబిచ్చాడు.—నిర్గమకాండము 10:28, 29.

8 యెహోవా అప్పుడు ఫరోకు, ఐగుప్తీయులందరికి చివరగా మరో తెగులు సంభవిస్తుందని మోషేకు వెల్లడిచేశాడు. అబీబు (నీసాను) నెల 14వ రోజున సమస్త ఐగుప్తీయుల, పశువుల తొలి సంతానం చనిపోనుంది. అయితే మోషేకు దేవుడిచ్చిన ఆదేశాల్ని ఇశ్రాయేలు కుటుంబాలు జాగ్రత్తగా పాటిస్తే అవి రక్షించబడే అవకాశముంది. వారు గొర్రెపిల్ల రక్తాన్ని కొంచెం తమ ఇళ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ములపై, పైకమ్మిపై చల్లి, ఇళ్లలోనే ఉండాలి. ఆ రాత్రి ఏమిజరిగింది? మోషే మనకిలా చెబుతున్నాడు: “అర్ధరాత్రివేళ . . . ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.” ఫరో తక్షణమే ప్రతిస్పందించాడు. మోషేను, అహరోనును పిలిపించి వారితో ఇలా చెప్పాడు, “లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.” ఆ వెంటనే ముప్పైలక్షలకన్నా ఎక్కువమంది ఇశ్రాయేలీయులు, వారితోపాటు అసంఖ్యాక ఇశ్రాయేలేతర “సమూహము” బయలుదేరింది.—నిర్గమకాండము 12:1-7, 29, 31, 37, 38.

9 ఇశ్రాయేలీయులు వెళ్లగల అత్యంత సమీప మార్గం మధ్యధరా సముద్ర తీరం వెంబడి ముందుకుసాగి ఫిలిష్తీయుల దేశంగుండా వెళ్తుంది. అయితే అది శత్రుప్రాంతం. కాబట్టి, బహుశా తన ప్రజలను యుద్ధంలో పాల్గొనకుండా కాపాడేందుకు కావచ్చు యెహోవా వారిని ఎర్రసముద్రపు అరణ్యంగుండా నడిపించాడు. అలావెళ్లేవారు లక్షల సంఖ్యలోవున్నా, వారు గలిబిలి జనసమూహంగా లేరు. బైబిలు నివేదిక ఇలా చెబుతోంది: “ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.”—నిర్గమకాండము 13:17, 18.

‘యెహోవా కలుగజేసే రక్షణను చూడండి’

10 ఆ తర్వాత, ఆశ్చర్యకరమైన సంఘటనలు సంభవించాయి. యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెను.” ఆ గొప్ప జనసమూహం ఈ సూచనలను అనుసరిస్తూ వెళ్లి అటు పర్వతాలకు ఇటు ఎర్రసముద్రపు శాఖకు మధ్య చిక్కుకుంది. ఎటూ వెళ్లడానికి వీలులేదన్నట్లు అనిపించింది. అయితే తానేమి చేస్తున్నాడో యెహోవాకు తెలుసు. ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురు.”—నిర్గమకాండము 14:1-4.

11 ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచివెళ్లేందుకు అనుమతించడంలో తప్పుచేశానని భావించిన ఫరో, శ్రేష్ఠమైన 600 యుద్ధ రథాలతో వారిని తరిమి పట్టుకునేందుకు బయలుదేరాడు. ఐగుప్తీయుల సైన్యం కనుచూపుమేరలోకి వచ్చేసరికి, ఇశ్రాయేలీయులు భయకంపితులై మోషేతో బిగ్గరగా, “ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా?” అన్నారు. యెహోవా దయచేసే రక్షణపై నమ్మకంతో మోషే వారికిలా జవాబిచ్చాడు: ‘భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా మీకు నేడు కలుగజేసే రక్షణను చూడండి. . . . యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. మీరు ఊరకనే ఉంటారు.’—నిర్గమకాండము 14:5-14, NW.

12 ఇశ్రాయేలీయుల పక్షాన యెహోవా స్వయంగా యుద్ధం చేస్తాడని మోషే చెప్పినట్లే, యెహోవా మద్దతుతో దేవదూతలు రంగంలోకి దిగారు. ఇశ్రాయేలీయులకు ముందు నడుస్తున్న మేఘస్తంభాన్ని యెహోవా దేవదూత అద్భుతరీతిలో పాళెము వెనుకకు తీసుకెళ్లాడు. అది ఐగుప్తీయులకు చీకటిని కలిగిస్తూ, అదే సమయంలో ఇశ్రాయేలీయులకు వెలుగునిచ్చింది. (నిర్గమకాండము 13:21, 22; 14:19, 20) దేవుని ఆజ్ఞకు లోబడి మోషే ఇప్పుడు తన చెయ్యి ముందుకు చాచాడు. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.” ఐగుప్తీయులు వారిని తరుముకుంటూ వెళ్లారు, అయితే యెహోవా తన ప్రజల పక్షాన ఉన్నాడు. ఆయన ఐగుప్తీయుల దండును కలవరపరచి, ఆ తర్వాత మోషేతో, “ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమని” చెప్పాడు. ఫరో సైన్యాలు ఎంత ఘోరంగా నాశనమయ్యాయంటే కనీసం ఒక్క సైనికుడు కూడా ప్రాణాలతో బయటపడలేదు!—నిర్గమకాండము 14:21-28; కీర్తన 136:15.

ఇశ్రాయేలీయుల రక్షణనుండి నేర్చుకోండి

13 ఈ అద్భుతమైన విడుదల రక్షించబడినవారిపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఇక చెప్పేదేముంది, మోషే, ఇశ్రాయేలీయులు ఒక్కసారిగా ఎలుగెత్తి యెహోవాను స్తుతిస్తూ కీర్తన పాడారు. వారిలా పాడారు: “యెహోవాను గూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను. . . . యెహోవా నిరంతరమును ఏలువాడు.” (నిర్గమకాండము 15:1, 18) అవును, దేవుణ్ణి స్తుతించడం గురించే వారు మొదట ఆలోచించారు. ఆ సందర్భంలో యెహోవా సర్వాధిపత్యం ప్రదర్శించబడింది.

14 ఈ ఉత్కంఠభరిత సంఘటనల నుండి మనమెలాంటి ఉపదేశాన్ని, ఆదరణను, నిరీక్షణను పొందవచ్చు? తన ప్రజలు ఎదుర్కొనే ఎలాంటి పరీక్షతోనైనా వ్యవహరించగల సామర్థ్యం యెహోవాకు ఉందని మనం చూడవచ్చు. వారు ఎదుర్కొనే ఎలాంటి పరిస్థితినైనా ఆయన పరిష్కరించగలడు. ఆయన ఆ బలమైన తూర్పుగాలి వీచేటట్లు చేసినప్పుడు ఇశ్రాయేలీయులకు ఎర్రసముద్రం అడ్డుకాలేదు. ఆయన ఆ ఎర్రసముద్రాన్నే ఫరో సైన్యాలను జలసమాధి చేసేందుకు ఉపయోగించాడు. ఆ సంఘటన గురించి ధ్యానిస్తూ, కీర్తనకర్త పలికిన ఈ మాటలనే మనమూ పునరుద్ఘాటించవచ్చు: “యెహోవా నా పక్షమున నున్నాడు; నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు?” (కీర్తన 118:6) రోమీయులు 8:31లో పౌలు రాసిన ఈ మాటల నుండి కూడా మనం ఆదరణ పొందవచ్చు: “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?” ఈ ప్రేరేపిత వ్యాఖ్యలు మనకెంత నమ్మకాన్నిస్తున్నాయో కదా! అవి మనలో ఏవైనా భయాలు, సందేహాలు ఉంటే వాటిని తొలగించి, మనలో నిరీక్షణను నింపగలవు. కాబట్టి 2008వ సంవత్సరానికి, ‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడండి’ అనే మన వార్షిక వచనమెంత సముచితమో కదా!—నిర్గమకాండము 14:13, NW.

15 ఐగుప్తునుండి ఇశ్రాయేలీయుల నిర్గమనం నుండి మనమింకా ఏమి తెలుసుకోవచ్చు? యెహోవా మనమేమి చేయాలని అడిగినా మనం దానికి తప్పక లోబడాలని తెలుసుకోవచ్చు. పస్కాకు సిద్ధపడేందుకు సవివరంగా చేయాల్సిన పనులన్నీ ఇశ్రాయేలీయులు విధేయతతో చేశారు. వారు విధేయతతో నీసాను 14వ తేదీ రాత్రి ఇళ్లలోనే గడిపారు. చివరకు వారు ఐగుప్తునుండి వెడలినప్పుడు “యుద్ధ సన్నద్ధులై” బయలుదేరారు. (నిర్గమకాండము 13:18) నేడు మనకు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా అందజేయబడుతున్న నిర్దేశాన్ని అనుసరించడం ఎంతో ప్రాముఖ్యం. (మత్తయి 24:45) “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని” మన వెనుకనుండి చెబుతున్న దేవునివాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. (యెషయా 30:21) మహాశ్రమ విరుచుకుపడే సమయం దగ్గరౌతున్నకొద్దీ, మనకు కొన్ని సవివరమైన ఆదేశాలు లభించే అవకాశముంది. శ్రమదినాల్లో మన సురక్షితమైన ప్రయాణం విశ్వసనీయులైన ఇతర యెహోవా సేవకులతోపాటు ముందుకు సాగడంపైనే ఆధారపడివుంటుంది.

16 అలాగే, ఇశ్రాయేలీయులు పర్వతాలకు, ఎర్రసముద్రానికి మధ్య చిక్కుబడినట్లు కనిపించే పరిస్థితిలోకి యెహోవా వారిని నడిపించాడని కూడా గుర్తుంచుకోండి. అది నిశ్చయంగా సరైన నిర్దేశంలా అనిపించలేదు. కానీ సమస్తం యెహోవా అధీనంలోనేవుండి ఆయన స్తుతికీ, ఆయన ప్రజల రక్షణకూ ఉపకరించాయి. నేడు, కొన్ని సంస్థాగత విషయాలతో ఫలానా విధంగా ఎందుకు వ్యవహరించబడుతోందో మనం స్పష్టంగా చూడలేకపోవచ్చు, అయినా యెహోవా తన నమ్మకమైన సమాచార మాధ్యమం ద్వారా ఇస్తున్న నిర్దేశాన్ని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. కొన్నిసార్లు, మన శత్రువులదే పైచేయిగా ఉన్నట్లు అనిపించవచ్చు. మనకున్న పరిమిత అవగాహననుబట్టి ఇమిడివున్న అన్ని విషయాలను మనం చూడలేకపోవచ్చు. అయితే గతంలో ఇశ్రాయేలీయుల విషయంలో చేసినట్లే సరైన సమయంలో పరిస్థితుల్ని నిర్దేశించగల సామర్థ్యం యెహోవాకు ఉంది.—సామెతలు 3:5.

యెహోవాపై నమ్మకముంచండి

17 పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను నిలిచిన వైనాన్ని ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారి మదిలో మెదలిన నమ్మకాన్ని మీరు ఊహించుకోగలరా? అది వారి ప్రయాణాన్ని ఒక “దేవదూత” నడిపించాడనే రుజువునిచ్చింది. (నిర్గమకాండము 13:21, 22; 14:19) నేడు, తన ప్రజలను నడిపించేందుకు, కాపాడేందుకు, విడిపించేందుకు యెహోవా వారితో ఉన్నాడని మనం నమ్మవచ్చు. మనమీ వాగ్దానాన్ని జ్ఞాపకముంచుకోవచ్చు: “[యెహోవా] తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు.” (కీర్తన 37:28) నేడు దేవుని సేవకులకు సహాయం చేస్తున్న ఈ బలమైన దేవదూతల సైన్యాన్ని మనమెన్నటికీ మరచిపోకుండా ఉందాం. వారి సహాయంతో మనం ‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడగలుగుతాం.’—నిర్గమకాండము 14:13, NW.

18 మనమందరం సత్యమార్గంలో ‘స్థిరంగా నిలబడేందుకు’ మనకేది సహాయం చేస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు వర్ణించిన ఆధ్యాత్మిక కవచాన్ని ధరించడం మనకు సహాయం చేస్తుంది. “దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి” అని అపొస్తలుడు మనకు చెబుతున్నాడని గమనించండి. ఈ ఆధ్యాత్మిక కవచంలోని భాగాలన్నింటినీ మనం ధరిస్తున్నామా? రాబోయే సంవత్సరంలో ప్రతీ ఒక్కరం ఆ కవచంలోని ప్రతీ భాగాన్ని సరైనవిధంగా ధరించామో లేదో పరీక్షించుకోవడం జ్ఞానయుక్తం. మన శత్రువైన అపవాదియగు సాతానుకు మన బలహీనతలు తెలుసు, కాబట్టి మనం ఆదమరచి ఉన్నప్పుడు చేజిక్కుంచుకునేందుకు లేదా మన బలహీనతపై దాడిచేసేందుకు ప్రయత్నిస్తాడు. మనం దురాత్మల సమూహాలతో “పోరాడుచున్నాము.” అయినా యెహోవా బలంతో విజయం సాధించగలం!—ఎఫెసీయులు 6:11-18; సామెతలు 27:11.

19 యేసు తన అనుచరులకిలా చెప్పాడు: “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.” (లూకా 21:19) ఏ కష్టమెదురైనా నమ్మకంగా ఓర్పు కనబరుస్తూ దేవుని అపారమైన కృపనుబట్టి ‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను’ చూసే ఆధిక్యతగలవారిగా ఉందాం.

మీరెలా జవాబిస్తారు?

• త్వరలోనే ఎలాంటి ఉత్కంఠభరిత సంఘటనలు జరుగనున్నాయి?

• సా.శ.పూ. 1513లో యెహోవా తన రక్షణశక్తిని ఎలా ప్రదర్శించాడు?

• భవిష్యత్తులో ఏమి చేయడానికి మీరు నిశ్చయించుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1. భవిష్యత్తులో మానవజాతి ఎలాంటి విషమ సంఘటనల్ని ఎదుర్కొంటుంది?

2. మహాశ్రమ విరుచుకుపడడం ఏ కారణంచేత ఆగింది?

3. మహాశ్రమ ఆరంభమైనప్పుడు మొదట ఏమి జరుగుతుంది?

4. ఇంకా ఏ సంఘటనలు జరగనైయున్నాయి?

5. యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉండేవారికి ఎలాంటి ఆనందం కలుగుతుంది?

6. జరగబోయే సంఘటనల దృష్ట్యా మనమేమి పరిశీలిస్తాం?

7. సా.శ.పూ. 1513లో ఐగుప్తులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది?

8. రక్షణకోసం ఇశ్రాయేలీయులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబడ్డాయి, దాని ఫలితమేమిటి?

9. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తునుండి ఏ మార్గంగుండా నడిపించాడు, ఎందుకు?

10. పీహహీరోతు ఎదుట దిగాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్పాడు?

11. (ఎ) ఫరో ఏమిచేయడానికి బయలుదేరాడు, ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు? (బి) ఇశ్రాయేలీయుల ఫిర్యాదులకు మోషే ఎలా స్పందించాడు?

12. యెహోవా తన ప్రజలను ఎలా కాపాడాడు?

13. ఇశ్రాయేలీయులు తమ విడుదలనుబట్టి ఎలా స్పందించారు?

14. (ఎ) ఇశ్రాయేలీయుల అనుభవాన్నుండి యెహోవాను గురించి మనమేమి తెలుసుకోవచ్చు? (బి) 2008 కొరకు వార్షిక వచనమేమిటి?

15. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదలపొందే విషయంలో విధేయత ఎంత ప్రాముఖ్యత వహించింది, అది నేడెంత ప్రాముఖ్యం?

16. ఇశ్రాయేలీయులను విడిపించడంలో యెహోవా నడిపించిన తీరునుండి మనమేమి తెలుసుకోవచ్చు?

17. యెహోవా నడిపింపును మనమెందుకు నిశ్చయంగా నమ్మవచ్చు?

18. “దేవుడిచ్చు సర్వాంగకవచమును” మనమెందుకు ధరించుకోవాలి?

19. మనం ఓర్పు కనబరిస్తే, ఏమిచేసే ఆధిక్యత మనకుంటుంది?

[20వ పేజీలోని బ్లర్బ్‌]

2008 కొరకు వార్షిక వచనం: ‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడండి.’—నిర్గమకాండము 14:13, NW.

[17వ పేజీలోని చిత్రం]

“పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి”

[18వ పేజీలోని చిత్రం]

ఫరో మొండితనం ఐగుప్తుకు నాశనాన్ని తెచ్చింది

[19వ పేజీలోని చిత్రం]

యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నింటిని చేసినప్పుడు ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు