కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవజలముల దగ్గరికి నడిపించబడడానికి యోగ్యులుగా ఎంచబడడం

జీవజలముల దగ్గరికి నడిపించబడడానికి యోగ్యులుగా ఎంచబడడం

జీవజలముల దగ్గరికి నడిపించబడడానికి యోగ్యులుగా ఎంచబడడం

“గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకును వారిని నడిపించును.”​—⁠ప్రక. 7:​17.

భూమ్మీద క్రీస్తు యావదాస్తిని చూసుకుంటున్న అభిషిక్త క్రైస్తవులే “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అని దేవుని వాక్యం సూచిస్తోంది. క్రీస్తు ఆ ‘దాసుణ్ణి’ 1918లో పరీక్షించినప్పుడు, భూమ్మీదున్న ఆ అభిషిక్త క్రైస్తవులు నమ్మకంగా “తగిన వేళ” ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నట్లు ఆయన గమనించాడు. అందుకే యజమానియైన యేసు, ఆ తర్వాత “తన యావదాస్తిమీద” వారిని నియమించడం యుక్తమని భావించాడు. (మత్తయి 24:​45-47 చదవండి.) ఇలా పరలోక స్వాస్థ్యాన్ని పొందేముందు అభిషిక్త క్రైస్తవులు భూమ్మీదున్న యెహోవా ఇతర ఆరాధకులకు సేవచేస్తారు.

2 ఒక యజమానికి తన ఆస్తులమీద, లేదా సంపదలమీద అధికారముంటుంది, ఆయన వాటిని తనకు నచ్చిన రీతిలో ఉపయోగించుకోవచ్చు. యెహోవా నియమిత రాజైన యేసుక్రీస్తుకు ఉన్న ఆస్తుల్లో భూమ్మీదున్న రాజ్య సంబంధ విషయాలన్నీ ఉన్నాయి. ఆ ఆస్తుల్లో, అపొస్తలుడైన యోహాను చూసిన దర్శనంలో “గొప్పసమూహము” కూడా ఉంది. యోహాను ఆ గొప్పసమూహాన్ని ఇలా వర్ణించాడు: “ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబ[డ్డారు].”​—⁠ప్రక. 7:⁠9.

3 యేసు ఆ గొప్పసమూహంలోని సభ్యులను తనకు చెందిన “వేరే గొఱ్ఱెలు” అని పేర్కొన్నాడు. (యోహా. 10:​16) వారికి పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉంది. యేసు ‘జీవజలముల బుగ్గలయొద్దకు తమను నడిపించడమే’ కాక, ‘దేవుడే తమ కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును’ అనే నమ్మకం వారికుంది. ఆ నిరీక్షణనుబట్టి “వారు గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” (ప్రక. 7:​14, 17) వారు యేసు బలిమీద విశ్వాసం కనబరుస్తారు కాబట్టి దేవుని దృష్టిలో వారు ‘తెల్లని వస్త్రాలు’ ధరించుకొని ఉన్నారు. వారు అబ్రాహాములాగే దేవుని స్నేహితులుగా నీతిమంతులని తీర్చబడ్డారు.

4 అంతేకాక, అంతకంతకూ పెరుగుతున్న వేరేగొర్రెలైన గొప్పసమూహపువారిని దేవుడు నీతిమంతులుగా దృష్టిస్తున్నాడు కాబట్టి, మహాశ్రమల సమయంలో ఈ విధానపు నాశనాన్ని తాము తప్పించుకోగలమని వారు ఆశించవచ్చు. (యాకో. 2:​23-26) యెహోవాకు సన్నిహితులై, ఒక గుంపుగా హార్‌మెగిద్దోనును తప్పించుకునే అద్భుతమైన అవకాశం వారికుంది. (యాకో. 4:⁠8; ప్రక. 7:​15) వారు స్వతంత్రంగా పనిచేయరు గానీ పరలోక రాజు నిర్దేశంలో, భూమ్మీదున్న ఆయన అభిషిక్త సహోదరుల నిర్దేశంలో సేవచేయడానికి ఇష్టపడతారు.

5 అభిషిక్త క్రైస్తవులు సాతాను లోకం నుండి తీవ్రమైన వ్యతిరేకతను గతంలో ఎదుర్కొన్నారు, భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటారు. అయినా, వారు తమ సహచరులైన గొప్పసమూహపువారి మద్దతు తీసుకోవచ్చు. అభిషిక్త క్రైస్తవులు ఇప్పుడు కొద్దిమందే ఉన్నా, ప్రతీ సంవత్సరం గొప్పసమూహపువారి సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. అభిషిక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,00,000 క్రైస్తవ సంఘాల్లో ప్రతీదానిని వ్యక్తిగతంగా పర్యవేక్షించలేకపోతున్నారు. కాబట్టి, అభిషిక్త క్రైస్తవులకు వేరేగొర్రెలకు చెందినవారు సహకారాన్ని అందించే మార్గాల్లో ఒకటి, గొప్పసమూహానికి చెందిన అర్హతగల పురుషులు సంఘ పెద్దలుగా సేవచేయడమే. ఇప్పుడు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ అప్పగించబడిన లక్షలాదిమందిపట్ల శ్రద్ధ వహించేందుకు సహాయం చేస్తున్నారు.

6 అభిషిక్త క్రైస్తవులకు వారి సహచరులైన వేరే గొర్రెలు ఇష్టపూర్వకంగా మద్దతు ఇస్తారని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆయన ఇలా రాశాడు: “యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు​—⁠ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురు వారు నీవెంట వచ్చెదరు.” (యెష. 45:​14) సూచనార్థకంగా, భూనిరీక్షణగల క్రైస్తవులు నేడు అభిషిక్తులైన దాసుని తరగతి, దాని పరిపాలక సభ నిర్దేశాన్ని అనుసరిస్తూ వారి వెంట నడుస్తున్నారు. క్రీస్తు భూమ్మీది అభిషిక్త అనుచరులకు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే బాధ్యతను అప్పగించాడు. తమ “కష్టార్జితమును” ఇచ్చేవారిగా వేరేగొర్రెలు ఆ పనిలో అభిషిక్తులకు మద్దతునిచ్చేందుకు ఇష్టపూర్వకంగా, పూర్ణహృదయంతో తమ శక్తిని, తమ వనరులను వెచ్చిస్తున్నారు.​—⁠అపొ. 1:⁠8; ప్రక. 12:​17.

7 గొప్ప సమూహానికి చెందినవారు తమ అభిషిక్త సహోదరులకు మద్దతునిస్తుండగా హార్‌మెగిద్దోను తర్వాత ఉనికిలోవుండే నూతన మానవ సమాజానికి పునాదిగా ఉండేందుకు అభిషిక్త క్రైస్తవులు వారికి శిక్షణ ఇస్తున్నారు. ఆ పునాది బలంగా, స్థిరంగా ఉండడమే కాక దాని సభ్యులు యజమాని మార్గనిర్దేశాన్ని పాటించడానికి ఇష్టపడాలి, పాటించగలగాలి. రాజైన క్రీస్తుయేసు తనను ఉపయోగించుకోవచ్చని నిరూపించుకునే అవకాశం ప్రతీ క్రైస్తవునికి ఇవ్వబడుతోంది. ప్రతీ ఒక్కరూ ఇప్పుడు విశ్వాసాన్ని, విశ్వసనీయతను కనబరచడం ద్వారా నూతన లోకంలో రాజు తనకు ఇచ్చే నిర్దేశాలకు తాను ఇష్టపూర్వకంగా ప్రతిస్పందిస్తానని చూపిస్తాడు.

గొప్ప సమూహపువారు తమ విశ్వాసాన్ని నిరూపించుకుంటున్నారు

8 అభిషిక్త క్రైస్తవ సంఘపు సహచరులైన వేరే గొర్రెలు తమ విశ్వాసాన్ని వివిధ రీతుల్లో నిరూపించుకుంటున్నారు. మొదటిగా, వారు దేవుని రాజ్యసువార్తను ప్రకటించడానికి అభిషిక్తులకు మద్దుతునిస్తున్నారు. (మత్త. 24:​14; 28:​19, 20) రెండవదిగా, వారు పరిపాలక సభ ఇస్తున్న నిర్దేశాలకు ఇష్టపూర్వకంగా లోబడుతున్నారు.​—⁠హెబ్రీ. 13:​17; జెకర్యా 8:​23 చదవండి.

9 మూడవదిగా, యెహోవా నీతియుక్త సూత్రాలకు అనుగుణంగా జీవించడం ద్వారా గొప్పసమూహపువారు తమ అభిషిక్త సహోదరులకు మద్దతునిస్తున్నారు. వారు “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి కృషిచేస్తున్నారు. (గల. 5:​22, 23) ‘శరీరకార్యాలను’ కనబర్చే బదులు ఆత్మఫలాలను కనబర్చడానికి నేడు చాలామంది ఇష్టపడరు. అయినా గొప్పసమూహపువారు “జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైన” వాటికి దూరంగా ఉండాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.​—⁠గల. 5:​19-21.

10 మనం అపరిపూర్ణులం కాబట్టి, ఆత్మ ఫలాలను ఫలించడం, శరీర కార్యాలకు దూరంగా ఉండడం సాతాను లోకం నుండి వచ్చే ఒత్తిళ్లను ఎదిరించడం కష్టంగా ఉంటుంది. అయినా, వ్యక్తిగత బలహీనతలవల్ల, తాత్కాలిక వైఫల్యాలవల్ల, లేదా శారీరక పరిమితులవల్ల కలిగే నిరుత్సాహం మన విశ్వాసానికున్న బలాన్ని ప్రభావితం చేయడానికి లేక యెహోవాపట్ల మనకున్న ప్రేమను తగ్గించడానికి అనుమతించకూడదనే కృతనిశ్చయంతో మనం ఉన్నాం. తాను వాగ్దానం చేసినట్లే యెహోవా మహాశ్రమల నుండి గొప్పసమూహాన్ని రక్షిస్తాడని మనకు తెలుసు.

11 అయినా, మన అసలు శత్రువు అపవాదనీ, వాడు అంత సులువుగా ఓటమి ఒప్పుకోడనీ మనకు తెలుసు, కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటాం. (1 పేతురు 5:⁠8 చదవండి.) మనం అనుసరించే బోధలు తప్పని మనల్ని నమ్మించేందుకు వాడు మతభ్రష్టులను, మరితరులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ పన్నాగం సాధారణంగా విఫలమైంది. అలాగే, హింసవల్ల కొన్నిసార్లు ప్రకటనాపని కుంటుపడినా, అది తరచూ హింసించబడేవారి విశ్వాసాన్ని బలపర్చేందుకే దోహదపడింది. అందువల్ల, మన విశ్వాసాన్ని మరింత సమర్థవంతంగా బలహీనపర్చగలదని తాను అనుకునే ఒక విధానాన్ని సాతాను అంతకంతకు ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఆయన నిరుత్సాహ భావాలను ఉపయోగించుకుంటాడు. ఈ ప్రమాదం గురించి మొదటి శతాబ్దపు క్రైస్తవులు హెచ్చరించబడ్డారు. “పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను [క్రీస్తును] తలంచుకొనుడి” అని వారికి చెప్పబడింది. ఎందుకు? ఎందుకంటే, వారు ‘అలసట పడక తమ ప్రాణములు విసుకక ఉండేందుకే.’​—⁠హెబ్రీ. 12:⁠3.

12 యిహోవాను సేవించడం మానేయాలని మీకెప్పుడైనా అనిపించిందా? మీరు జీవితంలో విఫలమయ్యారని మీకెప్పుడైనా అనిపిస్తోందా? అలాగనిపిస్తే, మీరు యెహోవాను సేవించకుండా ఉండేలా ఆ భావాలను ఉపయోగించుకునేందుకు సాతానుకు చోటివ్వకండి. లోతుగా బైబిలు అధ్యయనం చేయడం, పట్టుదలతో ప్రార్థించడం, కూటాలకు క్రమంగా హాజరుకావడం, తోటి క్రైస్తవులతో సహవసించడం వంటివి మిమ్మల్ని బలపర్చి మీ ‘ప్రాణములు విసుకక ఉండునట్లు’ చేస్తాయి. తనను సేవిస్తున్నవారు నూతన బలం పొందేలా సహాయం చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దానం విఫలం కాదు. (యెషయా 40:​30, 31 చదవండి.) మీ దృష్టిని రాజ్యసేవమీద కేంద్రీకరించండి. కాలాన్ని హరించే ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఇతరులకు సహాయం చేయడంపై దృష్టినిలపండి. అప్పుడు మీకు నిరుత్సాహం కలిగినప్పటికీ దానిని ఎదుర్కొనేందుకు మీరు బలపర్చబడతారు.​—⁠గల. 6:​1, 2.

శ్రమల నుండి రక్షించబడి నూతనలోకంలోకి

13 హర్‌మెగిద్దోను తర్వాత, పునరుత్థానం చేయబడిన అనేకమంది అనీతిమంతులకు యెహోవా మార్గాల్లోని ఉపదేశం అవసరమౌతుంది. (అపొ. 24:​14) వారు యేసు విమోచన క్రయధన బలి గురించి తెలుసుకోవాలి, అంతకన్నా ప్రాముఖ్యంగా వారు ఆ బలి నుండి ప్రయోజనాలను పొందేలా విశ్వాసముంచడానికి బోధించబడాలి. గతంలో తమకున్న అబద్ధమత నమ్మకాలను త్యజించి, తమ గత జీవిత విధానాన్ని విడిచిపెట్టాలి. నిజక్రైస్తవులకు గుర్తింపుగా ఉండే నూతన వ్యక్తిత్వాన్ని ధరించడం వారు నేర్చుకోవాలి. (ఎఫె. 4:​22-24; కొలొ. 3:​9, 10) హర్‌మెగిద్దోనును తప్పించుకునే వేరేగొర్రెలు ఎంతో పని చేయాల్సివుంటుంది. ప్రస్తుత దుష్టలోకంలో ఉన్న ఒత్తిళ్లు, పరధ్యానంలో పడవేసే అంశాల బెడద లేకుండా యెహోవాకు అలాంటి సేవచేయడం ఎంత ఆనందాన్నిస్తుందో కదా!

14 ఆ సమయంలో యేసు భూపరిచర్యకు ముందు మరణించిన యెహోవా నమ్మకమైన సేవకులు కూడా ఎంతో నేర్చుకోవాల్సివుంటుంది. తాము చూడాలనుకున్నా ఎన్నడూ చూడలేకపోయిన వాగ్దాత్త మెస్సీయ ఎవరో వారు తెలుసుకుంటారు. యెహోవాచేత ఉపదేశించబడడం తమకు ఇష్టమని వారు తమ గత జీవితాల్లోనే చూపించారు. వారికి సహాయం చేయడం ఎంత ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. ఉదాహరణకు, తాను ప్రవచనాలను రాసినా వాటిని అర్థం చేసుకోలేకపోయిన దానియేలుకు ఆ ప్రవచనాల నెరవేర్పు గురించి వివరించడం మనకెంత ఆనందాన్నిస్తుందో కదా!​—⁠దాని. 12:​8, 9.

15 పునరుత్థానం చేయబడినవారు మననుండి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నా, మనం కూడా వారిని ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటాం. బైబిల్లో రాయబడినా, సవివరంగా వివరించబడని సంఘటనల గురించి వారు మనకు తెలియజేయవచ్చు. యేసు వ్యక్తిగత వివరాలను ఆయన బంధువైన బాప్తిస్మమిచ్చు యోహాను నుండి తెలుసుకోవడం ఎంత పులకరించేదిగా ఉంటుందో ఊహించండి! అలాంటి నమ్మకమైన సాక్షుల నుండి మనం నేర్చుకునే విషయాలు నిస్సందేహంగా దేవునివాక్యంపట్ల ప్రస్తుతం మనకున్న అవగాహన కన్నా మరింత అవగాహన అందిస్తాయి. మరణించిన యెహోవా నమ్మకమైన సేవకులతోపాటు యుగాంతంలో మరణించిన గొప్పసమూహపువారు ‘శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని’ పొందుతారు. సాతాను అధీనంలోవున్న లోకంలో వారు యెహోవాను సేవించడం మొదలుపెట్టారు. నూతనలోకంలో మరింత అనుకూలమైన పరిస్థితుల్లో తమ సేవను కొనసాగించడం వారికెంత ఆనందాన్నిస్తుందో కదా!​—⁠హెబ్రీ. 11:​35; 1 యోహా. 5:​19.

16 విమర్శదినంలోని ఏదో ఒక సమయంలో, గ్రంథాలు విప్పబడతాయి. బైబిలుతోపాటు ఆ గ్రంథాల ఆధారంగా, సజీవంగా ఉన్నవారు నిత్యజీవాన్ని పొందేందుకు అర్హులో కాదో తీర్పుతీర్చబడతారు. (ప్రకటన 20:12, 13 చదవండి.) విమర్శదినం ముగింపులో, ప్రతీ వ్యక్తికి విశ్వ సర్వాధిపత్యపు వివాదాంశంలో తన మనోవైఖరి ఏమిటో చూపించేందుకు తగిన అవకాశం ఇవ్వబడుతుంది. ఆయన దేవుని రాజ్యానికి లోబడి, తనను గొర్రెపిల్ల “జీవజలముల బుగ్గలయొద్దకు” నడిపించేందుకు అనుమతిస్తాడా? లేక ఆయన దేవుని రాజ్యాన్ని ఎదిరించి దానికి లోబడివుండేందుకు నిరాకరిస్తాడా? (ప్రక. 7:​17; యెష. 65:​20) అప్పటికి, భూమ్మీదున్న వారందరూ వారసత్వంగా వచ్చిన పాపం నుండి లేక దుష్ట వాతావరణం నుండి ఎలాంటి ఆటంకం లేకుండా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. యెహోవా చివరి తీర్పులోని న్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. దుష్టులే శాశ్వతంగా నాశనం చేయబడతారు.​—⁠ప్రక. 20:​14, 15.

17 రాజ్యాన్ని పొందేందుకు అర్హులుగా తీర్చబడిన అభిషిక్త క్రైస్తవులు విమర్శదినంలో పరిపాలించేందుకు నేడు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వారికది ఎంత గొప్ప ఆధిక్యతో కదా! మొదటి శతాబ్దపు సహోదరులకు పేతురు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరించేందుకు ఆ ఉత్తరాపేక్ష వారిని ప్రేరేపిస్తుంది: “మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.”​—⁠2 పేతు. 1:​10, 11.

18 తమ అభిషిక్త సహోదరులకు అలాంటి ఆధిక్యత ఉన్నందుకు వేరే గొర్రెలు సంతోషిస్తారు. అభిషిక్త సహోదరులకు మద్దతునివ్వాలనే కృతనిశ్చయంతో వారున్నారు. నేడు దేవుని స్నేహితులుగా వారు దేవుని సేవలో శాయశక్తులా కృషిచేయడానికి ప్రోత్సహించబడుతున్నారు. విమర్శదినంలో యేసు తమను జీవజలముల బుగ్గల దగ్గరికి నడిపిస్తుండగా దేవుని ఏర్పాట్లకు పూర్ణహృదయంతో మద్దతునిచ్చేందుకు వారు సంతోషిస్తారు. చివరికి వారు నిత్యమూ యెహోవా భూసంబంధ సేవకులుగా ఉండేందుకు అర్హులుగా ఎంచబడతారు!​—⁠రోమా. 8:​20, 21; ప్రక. 21:​1-7.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యేసు ఆస్తిలో ఏమేమి ఉన్నాయి?

• గొప్పసమూహపువారు తమ అభిషిక్త సహోదరులకు ఎలా మద్దతునిస్తారు?

• గొప్పసమూహపువారికి ఏ ఆధిక్యతలు, భావినిరీక్షణ ఉంది?

• విమర్శదినాన్ని మీరెలా దృష్టిస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

1. అభిషిక్త క్రైస్తవులు ఎవరని దేవుని వాక్యం సూచిస్తోంది, వారికి యేసు ఎలాంటి బాధ్యత అప్పగించాడు?

2. యేసు ఆస్తులను వివరించండి.

3, 4. గొప్పసమూహపువారికి ఎలాంటి గొప్ప ఆధిక్యత ఉంది?

5. గొప్పసమూహపువారు క్రీస్తు అభిషిక్త సహోదరులకు ఎలా మద్దతునిస్తున్నారు?

6. అభిషిక్త క్రైస్తవులకు తమ సహచరులైన వేరే గొర్రెలు మద్దతు ఇస్తారని ఎలా ప్రవచించబడింది?

7. గొప్ప సమూహానికి దేనికోసం శిక్షణ ఇవ్వబడుతోంది?

8, 9. గొప్ప సమూహపువారు తమ విశ్వాసాన్ని ఎలా నిరూపించుకుంటున్నారు?

10. గొప్పసమూహపువారు ఏ కృతనిశ్చయంతో ఉన్నారు?

11. క్రైస్తవుల విశ్వాసాన్ని బలహీనపర్చడానికి చేసే ప్రయత్నాల్లో సాతాను ఏ పన్నాగాలను ఉపయోగించాడు?

12. నిరుత్సాహపడినవారిని బైబిలు ఉపదేశం ఎలా బలపరుస్తుంది?

13. హర్‌మెగిద్దోనును తప్పించుకునేవారు ఏ పని చేయాల్సివుంటుంది?

14, 15. మహాశ్రమలను తప్పించుకున్నవారికీ, పునరుత్థానం చేయబడిన నీతిమంతులకూ మధ్య జరిగే సంభాషణ గురించి వివరించండి.

16. ప్రవచనం ప్రకారం, విమర్శదినంలో ఏమి జరుగుతుంది?

17, 18. అభిషిక్త క్రైస్తవులు, వేరేగొర్రెలు ఏ విధమైన ఆనందంతో విమర్శదినం కోసం ఎదురుచూస్తున్నారు?

[25వ పేజీలోని చిత్రం]

గొప్పసమూహపువారు తమ వస్త్రములను ఉదుకుకొని గొర్రెపిల్ల రక్తంలో వాటిని తెలుపుచేసుకున్నారు

[27వ పేజీలోని చిత్రం]

పునరుత్థానం చేయబడే విశ్వాసుల నుండి మీరేమి తెలుసుకోవాలనుకుంటున్నారు?