కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ‘బోధనాకళకు’ అవధానమివ్వండి

మీ ‘బోధనాకళకు’ అవధానమివ్వండి

మీ ‘బోధనాకళకు’ అవధానమివ్వండి

‘సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, బోధనాకళతో వాక్యమును ప్రకటించుము, ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.’​—⁠2 తిమో. 4:⁠2, NW.

యేసు తన భూపరిచర్యలో అద్భుతరీతిలో స్వస్థతా కార్యాలు చేసినా, ఆయన స్వస్థత చేసేవానిగా కాక బోధకునిగానే పేరుపొందాడు. (మార్కు 12:​19; 13:⁠1) దేవుని రాజ్యసువార్తను ప్రకటించడానికే యేసు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు, నేటి ఆయన అనుచరులు కూడా దానికి అంతే ప్రాముఖ్యతనివ్వాలి. యేసు ఆజ్ఞాపించిన వాటన్నింటిని గైకొనాలని ప్రజలకు బోధించడం ద్వారా శిష్యులను చేసే పనిలో కొనసాగాలనే ఆజ్ఞ క్రైస్తవులకు ఇవ్వబడింది.​—⁠మత్త. 28:​19, 20.

2 శిష్యులను చేయమని మనకివ్వబడిన ఆజ్ఞను పాటించేలా మన బోధనా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు మనమెల్లప్పుడూ ప్రయత్నిస్తాం. ప్రకటనాపనిలో తన సహచరుడైన తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ సామర్థ్యానికున్న ప్రాముఖ్యతను నొక్కిచెప్పాడు. “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు” అని ఆయన అన్నాడు. (1 తిమో. 4:​16) బోధ గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు కేవలం జ్ఞానం అందించడం మాత్రమే ఆయన మనసులో లేదు. సమర్థులైన క్రైస్తవ ప్రచారకులు, బైబిలు సత్యం ప్రజల హృదయాలను స్పర్శించి వారు తమ జీవితాల్లో మార్పులు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. అది ఒక కళ. కాబట్టి, దేవుని రాజ్యసువార్తను ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు మనమీ ‘బోధనాకళను’ ఎలా వృద్ధిచేసుకోవచ్చు?​—⁠2 తిమో. 4:⁠2, NW.

‘బోధనాకళను’ వృద్ధిచేసుకోవడం

3 ఒక నిఘంటువు (art) “కళ”ను “అధ్యయనం, అభ్యాసం లేక గమనించడంవల్ల సంపాదించుకునే నైపుణ్యం” అని నిర్వచిస్తోంది. మనం సమర్థులైన సువార్త బోధకులవ్వాలంటే మనం ఈ మూడు అంశాల్లో ప్రతిదానికి అవధానమివ్వాలి. మనం ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేయడం ద్వారానే బోధించే అంశంమీద ఖచ్చితమైన అవగాహనను సంపాదించుకోవచ్చు. (కీర్తన 119:​27, 34 చదవండి.) సమర్థులైన ప్రచారకులు బోధిస్తున్నప్పుడు వారిని గమనించడం ద్వారా వారి బోధనా పద్ధతులను నేర్చుకొని వారిని అనుకరించగలుగుతాం. మనం తెలుసుకున్న విషయాలను అభ్యసించేందుకు ఎల్లప్పుడూ కృషిచేయడంవల్ల మన సామర్థ్యాలను మెరుగుపర్చుకోగలుగుతాం.​—⁠లూకా 6:​40; 1 తిమో. 4:​13-15.

4 యెహోవా మన మహోపదేశకుడు. ఆయన తన సంస్థయొక్క దృశ్య భాగం ద్వారా ప్రకటనా పనిని ఎలా నిర్వర్తించాలనే విషయంలో భూమ్మీది తన సేవకులకు నిర్దేశాన్ని ఇస్తున్నాడు. (కీర్త. 119:​102) అందుకే, సంఘాలన్నీ ప్రతీవారం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహిస్తాయి. వాటిలో భాగం వహించేవారందరూ దేవుని రాజ్య సువార్తను సమర్థంగా ప్రకటించేవారయ్యేలా సహాయం చేసేందుకు అది రూపొందించబడింది. ఈ పాఠశాలకు ముఖ్య పాఠ్యపుస్తకం బైబిలే. మనం ఏమి బోధించాలో యెహోవా ప్రేరేపిత వాక్యం మనకు తెలియజేస్తుంది. అంతేకాక, అది ఏ బోధనా పద్ధతులు సమర్థవంతంగా, సముచితంగా ఉంటాయో తెలియజేస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని బోధిస్తే, ప్రశ్నలను సమర్థంగా ఉపయోగిస్తే, సరళంగా బోధిస్తే, ఇతరులపట్ల నిజమైన శ్రద్ధ చూపిస్తే మనం మరింత నైపుణ్యంగల బోధకులమౌతామని దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మనకు క్రమంగా గుర్తుచేస్తుంది. మనం ఈ అంశాల్లో ప్రతీదానిని వేర్వేరుగా పరిశీలిద్దాం. ఆ తర్వాత విద్యార్థి హృదయాన్ని ఎలా స్పర్శించవచ్చో మనం చర్చిద్దాం.

దేవుని వాక్యానుసారంగా బోధించండి

5 మానవ బోధకులందరిలో అత్యంత గొప్ప బోధకుడైన యేసు లేఖనానుసారంగా బోధించాడు. (మత్త. 21:​13; యోహా. 6:​45; 8:​17) ఆయన తన సొంత అధికారంతో కాదు గానీ తనను పంపిన దేవుని బోధనే బోధించాడు. (యోహా. 7:​16-18) మనం ఆ మాదిరినే అనుసరించాలి. కాబట్టి, మనం ఇంటింటి పరిచర్యలో లేదా గృహ బైబిలు అధ్యయనాల్లో దేవుని వాక్యానుసారంగానే బోధించాలి. (2 తిమో. 3:​16, 17) మనం ఎంత తెలివిగా తర్కించినా అది ప్రేరేపిత లేఖనాల సామర్థ్యంతో, శక్తితో ఎన్నటికీ సరితూగలేదు. బైబిలుకెంతో శక్తి ఉంది. విద్యార్థి గ్రహించేలా సహాయం చేయడానికి మనం ప్రయత్నించే అంశమేదైనాసరే, దానిగురించి లేఖనాలేమి చెబుతున్నాయో చూసేందుకు వాటిని అతనితో లేదా ఆమెతో చదివించడమే అత్యుత్తమ విధానం.​—⁠హెబ్రీయులు 4:​12 చదవండి.

6 ఒక క్రైస్తవ బోధకుడు బైబిలు అధ్యయనానికి సిద్ధపడకూడదని దానర్థం కాదు. బదులుగా, అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు బోధకుడు లేదా విద్యార్థి ఉదాహరించబడిన లేఖనాల్లో వేటిని చదవాలో ముందుగానే జాగ్రత్తగా ఆలోచించాలి. సాధారణంగా, మన నమ్మకాలను సమర్థించే లేఖనాలను చదవడం మంచిది. అలాగే విద్యార్థి చదివే ప్రతీ లేఖనాన్ని ఆయన అర్థం చేసుకునేలా సహాయం చేయడం కూడా అవసరం.​—⁠1 కొరిం. 14:​8, 9.

సమర్థవంతమైన ప్రశ్నలను ఉపయోగించండి

7 ప్రశ్నలను నైపుణ్యంగా ఉపయోగిస్తే అది విద్యార్థిని ఆలోచింపజేసి, బోధకుడు విద్యార్థి హృదయాన్ని స్పర్శించేందుకు సహాయం చేస్తుంది. కాబట్టి, లేఖనాలను మీరు మీ విద్యార్థికి వివరించే బదులు ఆయనను వివరించమనండి. మీ విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకునేలా సహాయం చేయడానికి మీరు కొన్నిసార్లు అదనంగా మరో ప్రశ్నను లేక వరుసగా ప్రశ్నలను ఉపయోగించాల్సిరావచ్చు. విద్యార్థికి బోధించేందుకు మీరు ఈ విధంగా ప్రశ్నలను ఉపయోగించినప్పుడు, ఓ నిర్ధారణకు రావడానికిగల కారణాలను అర్థం చేసుకోవడానికి మీరు ఆయనకు సహాయం చేయడమే కాక, ఆ నిర్ధారణ విషయంలో వ్యక్తిగతంగా ఒప్పించబడేలా కూడా మీరు ఆయనకు సహాయం చేసినవారౌతారు.​—⁠మత్త. 17:​24-26; లూకా 10:​36, 37.

8 మనం మన ప్రచురణలను ప్రశ్నా జవాబుల రూపంలో అధ్యయనం చేస్తాం. నిస్సందేహంగా, మనం అధ్యయనం చేసేవారిలో చాలామంది సంబంధిత పేరాల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి ముద్రిత ప్రశ్నలకు వెంటనే జవాబు ఇవ్వగలుగుతారు. అయినా, వివేచనగల బోధకుడు కేవలం సరైన జవాబులతోనే తృప్తి చెందడు. ఉదాహరణకు, ఒక విద్యార్థి జారత్వం గురించి బైబిలు ఏమి చెబుతుందో సరిగ్గానే వివరించవచ్చు. (1 కొరిం. 6:​18) అయితే, అభిప్రాయాలను నేర్పుగా రాబట్టే ప్రశ్నలు, ఆ విద్యార్థి తాను నేర్చుకుంటున్నవాటి గురించి నిజంగా ఏమనుకుంటున్నాడో తెలియజేయవచ్చు. అందువల్ల బోధకుడు ఇలా అడగవచ్చు: “వివాహేతర లైంగిక సంబంధాలను బైబిలు ఎందుకు ఖండిస్తోంది? దేవుడు విధించిన ఈ నిషేధం గురించి మీరేమి అనుకుంటున్నారు? దేవుని నైతిక ప్రమాణాల ప్రకారం జీవించడంవల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా?” అలాంటి ప్రశ్నలకు విద్యార్థి ఇచ్చే జవాబు ఆయన హృదయంలో ఏముందో తెలియజేయవచ్చు.​—⁠మత్తయి 16:​13-17 చదవండి.

సరళమైన రీతిలో వివరించండి

9 దేవుని వాక్యంలోవున్న అనేక సత్యాలు సరళంగా ఉన్నాయి. అయితే, మనం బైబిలు అధ్యయనం చేసే వ్యక్తులు అబద్ధమత సిద్ధాంతాల కారణంగా గందరగోళానికి గురైవుండవచ్చు. బోధకులుగా మన బాధ్యత, బైబిలును సులభంగా అర్థం చేసుకునేలా వారికి సహాయం చేయడమే. సమర్థులైన బోధకులు సమాచారాన్ని సరళంగా, స్పష్టంగా, సత్యానికి అనుగుణంగా వివరిస్తారు. మనం ఈ మార్గనిర్దేశాన్ని అనుసరిస్తే, సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయంగా అనిపించేలా చేయం. అనవసరమైన వివరాల్లోకి వెళ్లకండి. మనం చదివే లేఖనంలోని ప్రతీ అంశంమీద వ్యాఖ్యానించాల్సిన అవసరంలేదు. చర్చించబడుతున్న సమాచారాన్ని స్పష్టం చేయడానికి అవసరమైన అంశాన్ని మాత్రమే వివరించండి. విద్యార్థి తన అవగహనను పెంచుకునే కొద్దీ, లోతైన లేఖన సత్యాలను క్రమంగా అర్థం చేసుకుంటాడు.​—⁠హెబ్రీ. 5:​13, 14.

10 అధ్యయనం నిర్వహిస్తున్న ప్రతీసారి ఎంత సమాచారాన్ని చర్చించాలి? ఎంత సమాచారం చర్చించాలో నిర్ణయించుకునేందుకు వివేచన అవసరం. విద్యార్థి, బోధకుని సామర్థ్యాలు, పరిస్థితులు ఒకేలా ఉండవు, అయితే మన విద్యార్థి బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేయడమే బోధకులుగా మన లక్ష్యమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి, దేవుని వాక్యంలో బోధించబడిన సత్యాలను చదివి, అర్థంచేసుకొని అంగీకరించేందుకు మనం ఆయనకు తగినంత సమయం ఇవ్వాలి. ఆయన అర్థం చేసుకోగల సమాచారం కన్నా ఎక్కువ సమాచారాన్ని మనం అధ్యయనం చేయకూడదు. అదే సమయంలో అధ్యయనం ముందుకుసాగేలా చూస్తాం. మన విద్యార్థి ఒక విషయాన్ని అర్థంచేసుకున్న తర్వాత, మనం తర్వాతి అంశాన్ని చర్చిస్తాం.​—⁠కొలొ. 2:​6, 7.

11 అపొస్తలుడైన పౌలు కొత్తవారికి సులభంగా అర్థమయ్యే విధంగా సువార్తను ప్రకటించాడు. ఆయన ఎంతో విద్యావంతుడైనప్పటికీ మేధావుల భాషను ఉపయోగించలేదు. (1 కొరింథీయులు 2:​1, 2 చదవండి.) లేఖన సత్యంలోని సరళత యథార్థవంతులను ఆకర్షించి వారిని తృప్తిపరుస్తుంది. దానిని అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి మేధావే కానవసరంలేదు.​—⁠మత్త. 11:​25; అపొ. 4:​13; 1 కొరిం. 1:​26, 27.

విద్యార్థులు తాము నేర్చుకుంటున్నవాటిని విలువైనవిగా ఎంచేలా సహాయం చేయండి

12 మన బోధకు చక్కని ఫలితాలు రావాలంటే అది మన విద్యార్థి హృదయాన్ని స్పర్శించాలి. విద్యార్థి సమాచారం తనకు వ్యక్తిగతంగా ఎలా అన్వయిస్తుందో అర్థంచేసుకోవడంతోపాటు అది తనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో, లేఖన నిర్దేశాన్ని పాటిస్తే తన జీవితం ఎలా మెరుగుపడుతుందో కూడా అర్థం చేసుకోవాలి.​—⁠యెష. 48:​17, 18.

13 ఉదాహరణకు, మనం హెబ్రీయులు 10:​24, 25ను చర్చిస్తుండవచ్చు. లేఖనసంబంధ ప్రోత్సాహం కోసం, ప్రేమపూర్వక సహవాసం కోసం తోటి విశ్వాసులతో సమకూడమని అది క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థి సంఘ కూటాలకు ఇంకా హజరవుతూ ఉండకపోతే, కూటాలు ఎలా నిర్వహించబడతాయో, వాటిలో ఏమి చర్చించబడతాయో మనం ఆయనకు క్లుప్తంగా వివరించవచ్చు. సంఘ కూటాలు మన ఆరాధనలో భాగమని పేర్కొని, అవి మనకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఆ తర్వాత కూటాలకు హాజరవమని మనం విద్యార్థిని ఆహ్వానించవచ్చు. యెహోవాకు లోబడాలనే కోరికతోనే ఆయన లేఖన సంబంధ ఆదేశాలను పాటించాలి గానీ తనతో అధ్యయనం చేస్తున్న వ్యక్తిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో కాదు.​—⁠గల. 6:​4, 5.

14 విద్యార్థులు బైబిలును అధ్యయనం చేసి, దాని సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా పొందే ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, వారు యెహోవా గురించి తెలుసుకొని ఆయనను ఒక వ్యక్తిగా ప్రేమించడం మొదలుపెడతారు. (యెష. 42:⁠8) ఆయన ప్రేమగల తండ్రి, సృష్టికర్త, విశ్వానికి యజమాని మాత్రమే కాక, ఆయన తనను ప్రేమించి, సేవిస్తున్నవారికి తన వ్యక్తిత్వం గురించి, సామర్థ్యాల గురించి కూడా తెలియజేస్తున్నాడు. (నిర్గమకాండము 34:​6, 7 చదవండి.) ఐగుప్తు దాసత్వం నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి మోషే నాయకత్వం వహించనున్న సమయంలో యెహోవా తన గురించి ఇలా చెప్పాడు: “నేను ఎలా కావాలంటే అలా అవుతాను.” (నిర్గ. 3:​13-15, NW) యెహోవా తాను ఎంపిక చేసుకున్న ప్రజలకు సంబంధించిన తన సంకల్పాలను నెరవేర్చడానికి తానెలా కావాలనుకుంటే అలా అవుతాడని ఆ మాటలు సూచిస్తున్నాయి. ఆ విధంగా, ఇశ్రాయేలీయులు యెహోవాను తమ రక్షకునిగా, యోధునిగా, పోషకునిగా, వాగ్దానాలను నెరవేర్చేవానిగా, మరితర పాత్రలు నిర్వహించే వ్యక్తిగా తెలుసుకున్నారు.​—⁠నిర్గ. 15:​2, 3; 16:​2-5; యెహో. 23:​14.

15 మోషే యెహోవా నుండి అద్భుతమైన సహాయం పొందినట్లుగా మన విద్యార్థులు తమ జీవితాల్లో పొందకపోవచ్చు. అయినా, మన విద్యార్థులు తాము తెలుసుకుంటున్న విషయాలపట్ల విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచుకొని, వాటిని అన్వయించుకుంటున్నకొద్దీ వారు ధైర్యం, జ్ఞానం, మార్గనిర్దేశం కోసం యెహోవామీద ఆధారపడాల్సిన అవసరాన్ని నిస్సందేహంగా గ్రహిస్తారు. అలా గ్రహించేకొద్దీ వారు కూడా యెహోవాను జ్ఞానయుక్తమైన, నమ్మదగిన సలహాదారునిగా, రక్షకునిగా, తమ అవసరాలన్నీ తీర్చే ఉదారస్వభావంగల పోషకునిగా తెలుసుకుంటారు.​—⁠కీర్త. 55:​22; 63:⁠7; సామె. 3:​5, 6.

ప్రేమపూర్వక శ్రద్ధ చూపించండి

16 మీరు కోరుకునే విధంగా మీరు నైపుణ్యంగా బోధించలేరని మీకనిపిస్తే నిరుత్సాహపడకండి. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విద్యా కార్యక్రమాన్ని యెహోవా, యేసు పర్యవేక్షిస్తున్నారు. (అపొ. 1:​7, 8; ప్రక. 14:⁠6) మన మాటలు యథార్థహృదయంగల వ్యక్తిమీద చక్కని ప్రభావం చూపించేలా వారు మన ప్రయత్నాలను ఆశీర్వదించగలరు. (యోహా. 6:⁠44) ఒక బోధకునికి సహజ సామర్థ్యం లేకున్నా ఆయనకు తన విద్యార్థిపట్ల ఉండే నిజమైన ప్రేమ ఆ లోపాన్ని పూరిస్తుంది. అపొస్తలుడైన పౌలు తాను బోధిస్తున్నవారిని ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో గ్రహించానని వివరించాడు.​—⁠1 థెస్సలొనీకయులు 2:​7, 8 చదవండి.

17 అలాగే, ప్రతీ బైబిలు విద్యార్థి గురించి తెలుసుకోవడానికి సమయం తీసుకోవడం ద్వారా వారిపట్ల మనం నిజమైన శ్రద్ధ చూపించవచ్చు. ఆయనతో మనం లేఖనసూత్రాలను చర్చిస్తుండగా ఆయన స్థితిగతులు మనకు తెలుస్తాయి. ఆయన బైబిలు నుండి నేర్చుకున్న అంశాల్లో కొన్నింటిని అప్పటికే తన జీవితంలో అన్వయించుకున్నట్లు మనం గమనించవచ్చు. ఇతర రంగాల్లో, ఆయన ఇంకా మార్పులు చేసుకోవాల్సి ఉండవచ్చు. బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు అందించబడుతున్న సమాచారం ఆయనకు వ్యక్తిగతంగా ఎలా అన్వయిస్తుందో గ్రహించడానికి విద్యార్థికి సహాయం చేయడం ద్వారా ఆయన క్రీస్తు నిజమైన శిష్యునిగా తయారవడానికి మనం ప్రేమపూర్వకంగా సహాయం చేయవచ్చు.

18 అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, మనం మన విద్యార్థితో ప్రార్థిస్తూ, ఆయన గురించి ప్రార్థనలో ప్రస్తావించవచ్చు. విద్యార్థి తన సృష్టికర్తను గురించి మరింతగా తెలుసుకొని, ఆయనకు సన్నిహితమై, ఆయన నిర్దేశం నుండి ప్రయోజనం పొందడానికి సహాయం చేయడమే మన లక్ష్యమని విద్యార్థి స్పష్టంగా గ్రహించాలి. (కీర్తన 25:​4, 5 చదవండి.) విద్యార్థి తాను తెలుసుకుంటున్న విషయాలను అన్వయించుకోవడానికి చేస్తున్న కృషిని ఆశీర్వదించమని మనం యెహోవాకు ప్రార్థించినప్పుడు తాను ‘వాక్యప్రకారము ప్రవర్తించేవారిగా’ తయారుకావడం ఎంత ప్రాముఖ్యమో ఆ విద్యార్థి గ్రహిస్తాడు. (యాకో. 1:​22) అంతేకాక, ఆ విద్యార్థి మన యథార్థ ప్రార్థనలను వినేకొద్దీ ఆయన కూడా ఎలా ప్రార్థించాలో నేర్చుకుంటాడు. యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి బైబిలు విద్యార్థులకు సహాయం చేయడంవల్ల ఎంత ఆనందం కలుగుతుందో కదా!

19 యథార్థహృదయులు యేసు ఆజ్ఞాపించినవన్నిటినీ పాటించేలా సహాయం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు లక్షల కన్నా ఎక్కువమంది “బోధనాకళను” పెంపొందించుకునేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలుసుకోవడం మనకెంతో ప్రోత్సాహాన్నిస్తోంది. మన ప్రకటనా పనికి ఎలాంటి ఫలితాలు లభిస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• క్రైస్తవులు “బోధనాకళను” ఎందుకు వృద్ధిచేసుకోవాలి?

• మనం మరింత సమర్థంగా బోధించడానికి ఏ పద్ధతులను ఉపయోగించవచ్చు?

• మనకు బోధించే సహజ సామర్థ్యం లేకపోయినా ఏది దానిని పూరించగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన ఏ మాదిరిని ఉంచాడు?

2. మన ప్రకటనా పనిని నిర్వర్తించడానికి మనం ఏమి చేయాలి?

3, 4. (ఎ) మనం ‘బోధనాకళను’ ఎలా వృద్ధిచేసుకోవచ్చు? (బి) మనం సమర్థులైన బోధకులయ్యేందుకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మనకెలా సహాయం చేస్తుంది?

5. మనం దేని ఆధారంగా బోధించాలి, ఎందుకు?

6. చర్చిస్తున్న అంశాన్ని విద్యార్థి నిజంగా అర్థం చేసుకునేలా ఒక బోధకుడు ఎలా చూడవచ్చు?

7. ప్రశ్నలు ఉపయోగించడం ఎందుకు ఒక చక్కని బోధనా పద్ధతి?

8. విద్యార్థి హృదయంలో ఏముందో మనమెలా తెలుసుకోవచ్చు?

9. లేఖన సంబంధ విషయాన్ని వివరిస్తున్నప్పుడు మనమేమి గుర్తుంచుకోవాలి?

10. బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు ఎంత సమాచారం చర్చించాలో నిర్ణయించుకునేందుకు ఏ అంశాలు దోహదపడతాయి?

11. బోధించే విషయంలో అపొస్తలుడైన పౌలు నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

12, 13. ఒక విద్యార్థిని తాను నేర్చుకుంటున్నదాని ప్రకారంగా నడుచుకోవడానికి ఏది ప్రోత్సహించవచ్చు? ఉదాహరించండి.

14, 15. (ఎ) యెహోవా గురించి ఒక బైబిలు విద్యార్థి ఏమి తెలుసుకోవచ్చు? (బి) దేవుని వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడంవల్ల ఒక బైబిలు విద్యార్థి ఎలా ప్రయోజనం పొందవచ్చు?

16. ఒక బోధకునిగా మనం విజయం సాధించడానికి సహజ సామర్థ్యమే ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైన అంశంకాదు?

17. ప్రతీ బైబిలు విద్యార్థిపట్ల మనం నిజమైన శ్రద్ధను ఎలా చూపించవచ్చు?

18. మన విద్యార్థితో ప్రార్థించడం, ఆయన కోసం ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యం?

19. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[9వ పేజీలోని చిత్రం]

మీరు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పాల్గొంటున్నారా?

[10వ పేజీలోని చిత్రం]

బైబిలు నుండి చదవమని మీ విద్యార్థిని ప్రోత్సహించడం ఎందుకు ప్రాముఖ్యం?

[12వ పేజీలోని చిత్రం]

మీ విద్యార్థితో ప్రార్థించడమే కాక, ఆయన కోసం కూడా ప్రార్థించండి