కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు తమ జీవితాలను మరింత అర్థవంతం చేసుకున్నారు మీరూ అలాగే చేసుకోగలరా?

వారు తమ జీవితాలను మరింత అర్థవంతం చేసుకున్నారు మీరూ అలాగే చేసుకోగలరా?

వారు తమ జీవితాలను మరింత అర్థవంతం చేసుకున్నారు మీరూ అలాగే చేసుకోగలరా?

కెనడాకు చెందిన మార్క్‌ అనే సహోదరుడు, అంతరిక్ష సంస్థలు ఉపయోగించే అత్యాధునిక రోబోటిక్‌ వ్యవస్థలను నిర్మించే ఒక కంపెనీలో పనిచేసేవాడు. ఆయన అక్కడ పార్ట్‌టైమ్‌ పనిచేస్తూ క్రమ పయినీరు సేవ చేసేవాడు. అలా ఉండగా, మార్క్‌ సూపర్‌వైజర్‌ ఆయనకు పదోన్నతి ఇవ్వజూపాడు, దానిని అంగీకరిస్తే ఆయన పూర్తిసమయం పనిచేయాల్సిన ఉంటుంది, జీతం కూడా ఎక్కువగానే లభిస్తుంది. మార్క్‌ ఏమిచేశాడు?

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆమీ అనే సహోదరి తన చదువు పూర్తిచేస్తూనే క్రమ పయినీరుగా కూడా సేవచేసింది. పట్టభద్రురాలైన తర్వాత ఆమెకు ఒక ఉద్యోగావకాశం వచ్చింది. దానిలో చేరితే జీతం బాగానే వస్తుంది కానీ ఆమె తన సమయాన్నంతా ఉద్యోగంలోనే గడపాల్సి వస్తుంది. ఆమీ ఏ నిర్ణయం తీసుకుంది?

మార్క్‌, ఆమీ వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారు. వారి నిర్ణయాలకు లభించిన ఫలితాలు, ప్రాచీన కొరింథులోని క్రైస్తవులకు ఇవ్వబడిన ఉపదేశమెంత జ్ఞానయుక్తమైనదో తెలియజేస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు వారికి, “ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను” అని రాశాడు.​—⁠1 కొరిం. 7:​29-31.

లోకాన్ని అనుభవించండి, కానీ అమితంగా కాదు!

మార్క్‌, ఆమీకు ఏమైందో తెలుసుకునే ముందు మనం పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఉపయోగించిన “లోకము” (లేక గ్రీకులో కాస్మోస్‌) అనే పదానికున్న భావమేమిటో క్లుప్తంగా పరిశీలిద్దాం. ఆ బైబిలు లేఖనంలో ఉపయోగించబడిన కాస్మోస్‌ అనే పదం మనమిప్పుడు నివసిస్తున్న లోకవిధానాన్ని అంటే మానవ సమాజమంతటినీ సూచిస్తుంది, దానిలో మన దైనందిన జీవితాల్లో భాగంగా ఉన్న ఇల్లు, ఆహారం, వస్త్రాల వంటి సాధారణ విషయాలు ఇమిడివున్నాయి. * అలాంటి దైనందిన అవసరాలను తీర్చుకోవడం కోసం మనలో చాలామంది ఉద్యోగం చేయాలి. నిజానికి మనల్ని మనం పోషించుకోవడమే కాక, మన కుటుంబాన్ని కూడా పోషించాలనే లేఖనాధారిత బాధ్యతను నెరవేర్చడానికి మనం లోకాన్ని అనుభవించక తప్పదు. (1 తిమో. 5:⁠8) అయితే, అదే సమయంలో ఈ ‘లోకము గతించిపోతోంది’ అని మనం గ్రహిస్తాం. (1 యోహా. 2:​17) కాబట్టి, మనం ఈ లోకాన్ని అవసరమైనంత మట్టుకే గానీ “అమితముగా” అనుభవించం.​—⁠1 కొరిం. 7:​31.

లోకాన్ని సాధ్యమైనంత మితంగా అనుభవించాలన్న బైబిలు ఉపదేశం నుండి ప్రేరణ పొందిన అనేకమంది సహోదర సహోదరీలు తమ స్థితిగతులను పునఃపరిశీలించుకుని, ఉద్యోగంలో గడిపే సమయాన్ని తగ్గించుకుని, తమ జీవనశైలిని నిరాడంబరంగా మార్చుకున్నారు. అలా చేసిన తర్వాత తమ జీవితం అర్థవంతంగా మారిందని వారు త్వరలోనే గ్రహించారు. ఎందుకంటే వారు తమ కుటుంబాలతోనే కాక, యెహోవా సేవలో కూడా ఎక్కువ సమయం గడపగలుగుతున్నారు. అంతేకాక తమ జీవితాన్ని నిరాడంబరంగా మార్చుకున్నారు కాబట్టి వారు లోకంమీద అంతగా ఆధారపడక యెహోవామీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. యెహోవాను సంతోషపెట్టే పనులను చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించేలా మీరు కూడా మీ జీవితాన్ని నిరాడంబరంగా మార్చుకోగలరా?​—⁠మత్త. 6:​19-24, 33.

“ముందెన్నడూ లేనంతగా యెహోవాకు సన్నిహితమైనట్లు అనిపిస్తోంది”

ప్రారంభంలో ప్రస్తావించబడిన మార్క్‌, ఈ లోకాన్ని అమితంగా అనుభవించకూడదనే బైబిలు ఉపదేశాన్ని లక్ష్యపెట్టాడు. తనకు ఇవ్వజూపిన లాభదాయకమైన పదోన్నతిని ఆయన తిరిస్కరించాడు. కొన్ని రోజుల తర్వాత, మార్క్‌ను ఒప్పించడానికి వాళ్ల సూపర్‌వైజర్‌ మరింత ఎక్కువ జీతం ఇవ్వజూపాడు. “అదొక పరీక్షలా అనిపించింది, కానీ నేను మళ్లీ ఆ ప్రతిపాదనను నిరాకరించాను” అని మార్క్‌ చెబుతున్నాడు. దానికి కారణమేమిటో చెబుతూ, “నేనూ, నా భార్య పౌలా శాయశక్తులా యెహోవా సేవ చేసేందుకు మా జీవితాలను అంకితం చేసుకోవాలని కోరుకున్నాం. కాబట్టి మా జీవితాన్ని నిరాడంబరంగా మార్చుకోవాలని నిశ్చయించుకున్నాం. మా లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన జ్ఞానం ఇవ్వమని మేము యెహోవాకు ప్రార్థించి, ఏ తేదీ నుండి యెహోవా సేవలో ఎక్కువ సమయం గడపాలో మేము నిర్ణయించుకున్నాం” అని అన్నాడు.

పౌలా ఇలా చెబుతోంది: “నేను వారంలో మూడు రోజులు ఒక ఆస్పత్రిలో సెక్రటరీగా పనిచేసేదాన్ని. నాకు మంచి జీతం దొరికేది. నేను క్రమ పయినీరుగా కూడా సేవచేశాను. అయితే, మార్క్‌లాగే నేను కూడా రాజ్య ప్రచారకులు అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి యెహోవా సేవచేయాలని అనుకున్నాను. అయితే, నేను నా రాజీనామా పత్రాన్ని ఇచ్చినప్పుడు అప్పుడే ఖాళీ అయిన ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ పదవికి నాకు అర్హతలున్నాయని మా సూపర్‌వైజర్‌ చెప్పింది. ఆ ఆస్పత్రిలోని సెక్రటరీ ఉద్యోగాల్లో ఆ పదవికే ఎక్కువ జీతం దొరకుతుంది, అయితే రాజీనామా చేయాలనే నా నిర్ణయానికి కట్టుబడ్డాను. నేను ఆ పదవికి ఎందుకు దరఖాస్తు వేయడంలేదో మా సూపర్‌వైజర్‌కు వివరించినప్పుడు ఆమె నా విశ్వాసాన్ని మెచ్చుకుంది.”

ఆ తర్వాత కొంతకాలానికే మార్క్‌, పౌలాకు కెనడాలోని ఒక సుదూర ప్రాంతంలో ఉన్న చిన్న సంఘంలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేసే నియామకం లభించింది. వారు అక్కడికి వెళ్లడంవల్ల ఏమి జరిగింది? మార్క్‌ ఇలా చెబుతున్నాడు: “నా జీవితంలోని దాదాపు సగభాగం ఆర్థిక భద్రతను ఇచ్చిన ఉద్యోగం చేశాను, దాన్ని వదిలేసిన తర్వాత నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందాను కానీ యెహోవా మా పరిచర్యను ఆశీర్వదించాడు. ఇతరులు దేవుణ్ణి సేవించేలా వారికి సహాయం చేసినప్పుడు కలిగే గొప్ప ఆనందాన్ని మేము చవిచూశాం. పూర్తికాల సేవ చేయడంవల్ల మా వివాహ బంధం కూడా బలపడింది. మేము ఎంతో ప్రాముఖ్యమైన విషయాలనే అంటే ఆధ్యాత్మిక విషయాలనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ముందెన్నడూ లేనంతగా మేమిప్పుడు యెహోవాకు సన్నిహితమయ్యామని అనిపిస్తోంది.” (అపొ. 20:​35) పౌలా కూడా ఇలా చెబుతోంది: “మనం ఉద్యోగంతోపాటు, అలవాటుపడిన ఇల్లు వంటి సౌకర్యాలను వదిలిపెట్టినప్పుడు, మనం యెహోవామీద పూర్తి నమ్మకముంచాలి. మేమలా చేశాం, యెహోవా మమ్మల్ని ఆశీర్వదించాడు. మా కొత్త సంఘంలోని ప్రియమైన సహోదర సహోదరీలు మా పట్ల ఎంతో ప్రేమ చూపించి, మమ్మల్ని ఆప్తులుగా చూసుకుంటున్నారు. నేను ముందు ఉద్యోగంలో ఉపయోగించిన నా శక్తిని ప్రజలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. ఈ నియామకంలో సేవ చేసే అవకాశం లభించినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను.”

‘ఆర్థికంగా ఏ సమస్యా లేదు, కానీ సంతోషం కరవయ్యింది’

ప్రారంభంలో ప్రస్తావించబడిన ఆమీ ఇంకోవిధంగా నిర్ణయం తీసుకుంది. లాభదాయకమైన పూర్తిసమయ ఉద్యోగాన్ని ఆమె స్వీకరించింది. “మొదటి సంవత్సరం నేను పరిచర్యలో చురుగ్గానే పాల్గొన్నాను కానీ నేను మెల్లమెల్లగా యెహోవా సేవకు ప్రాధాన్యతనిచ్చే బదులు నా వృత్తిలో పైకి ఎదిగేందుకే ప్రాధాన్యతనిస్తున్నట్లు గ్రహించాను. నా వృత్తిలో ఇంకా పైకెదిగే ఆకర్షణీయమైన అవకాశాలు నాకు రావడంతో ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి నా శక్తిని ధారపోయడం మొదలుపెట్టాను. నా ఉద్యోగ బాధ్యతలు పెరిగేకొద్దీ పరిచర్యలో నేను గడిపే సమయాన్ని తగ్గించుకుంటూ వచ్చాను. చివరకు నేను ప్రకటనా పనికి వెళ్లడమే మానేశాను” అని ఆమీ చెప్పింది.

ఆ సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఆమీ ఇలా చెబుతోంది, “అప్పట్లో నాకు ఆర్థికంగా ఏ సమస్యా లేదు. నేను ఎన్నో ఊళ్లు తిరిగేదాన్ని, నా హోదా కారణంగా నాకు లభించిన గౌరవాన్ని ఆస్వాదించాను. కానీ సంతోషం మాత్రం కరువయ్యింది. డబ్బు ఉన్నా నాకు ఎన్నో సమస్యలు ఉండేవి. ఎక్కడ పొరపాటు జరిగిందా అని నేను ఆలోచించాను. ఈ లోకంలో ఉద్యోగం చేయడంవల్ల నేను దాదాపు ‘విశ్వాసమునుండి తొలగిపోయాను’ అని నేను చివరకు గుర్తించాను. కాబట్టి, దేవుని వాక్యం చెబుతున్నట్లే, నేను ‘నానాబాధలతో’ సతమతమయ్యాను.”​—⁠1 తిమో. 6:​10.

ఆమీ ఏమి చేసింది? “నేను తిరిగి ఆధ్యాత్మికంగా కోలుకుని, కూటాలకు హాజరయ్యేలా సహాయం చేయమని పెద్దలను కోరాను. ఒక రోజు కూటంలో పాట పాడుతున్నప్పుడు నేను ఏడ్వడం మొదలుపెట్టాను. నేను పయినీరుగా ప్రకటనా పనిలో పాల్గొన్న ఐదు సంవత్సరాలు నా ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోయినా ఎంతో సంతోషంగా ఉండేదాన్నని గుర్తుచేసుకున్నాను. నేను డబ్బు సంపాదన కోసం సమయాన్ని వృథాచేయడం మానేసి యెహోవా సేవకు ప్రాధాన్యతనివ్వాలని గ్రహించాను. గతంలో నాకు లభించిన జీతంలో సగం మాత్రమే దొరికే క్రిందిస్థాయి పదవిలోకి చేరి మళ్లీ ప్రకటనా పనిలో భాగం వహించడం మొదలుపెట్టాను” అని ఆమె చెప్పింది. ఆమీ సంతోషంగా ఇలా చెబుతోంది: “కొన్ని సంవత్సరాలు పయినీరు సేవ చేసే మంచి ఆశీర్వాదం లభించింది. నేను ఈ లోకంలోని ఉద్యోగానికే ఎక్కువ సమయం గడుపుతున్న కాలంలో ఎన్నడూ చవిచూడని సంతృప్తిని ఇప్పుడు చవిచూస్తున్నాను.”

మీరు మీ పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకుని, మీ జీవితాన్ని నిరాడంబరంగా మార్చుకోలరా? మీకు దొరికినంత సమయాన్ని దేవుని సేవను ఎక్కువగా చేయడానికి ఉపయోగిస్తే మీరు కూడా మీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుంటారు.​—⁠సామెతలు 10:​22.

[అధస్సూచి]

^ పేరా 6 లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), 2వ సంపుటిలో 1207-8 పేజీలు చూడండి.

[19వ పేజీలోని బ్లర్బ్‌]

మీరు కూడా మీ పరిస్థితుల్లో సర్దుబాట్లు చేసుకుని, మీ జీవితాన్ని నిరాడంబరం చేసుకోగలరా?

[19వ పేజీలోని బాక్సు/చిత్రం]

“నేను దానిని ఇప్పటికే ఆస్వాదిస్తున్నాను!”

అమెరికాలో ఉంటున్న క్రైస్తవ పెద్ద అయిన డేవిడ్‌ తన భార్యా పిల్లలతోపాటు పూర్తికాల సేవ చేయాలనుకున్నాడు. ఆయన తాను పనిచేస్తున్న కంపెనీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసేలా ఏర్పాట్లు చేసుకొని క్రమ పయినీరు సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆ మార్పు ఆయన జీవితాన్ని అర్థవంతంగా చేసిందా? కొన్ని నెలల తర్వాత డేవిడ్‌ తన స్నేహితునికి రాసిన ఉత్తరంలో, “కుటుంబంతోపాటు యెహోవాకు పూర్తికాల సేవ చేయడంలో ఉన్న సంతృప్తి వేరే దేనిలోనూ లేదు. పయినీరు సేవకు అలవాటుపడడానికి నాకు కొంత సమయం పడుతుందేమో అనుకున్నాను కానీ నేను దానిని ఇప్పటికే ఆస్వాదిస్తున్నాను! అది ఎంతో ఉత్తేజాన్నిస్తోంది” అని రాశాడు.

[18వ పేజీలోని చిత్రం]

పరిచర్యలో మార్క్‌, పౌలా