కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సరైన మనోవైఖరిగలవారు’ స్పందిస్తున్నారు

‘సరైన మనోవైఖరిగలవారు’ స్పందిస్తున్నారు

‘సరైన మనోవైఖరిగలవారు’ స్పందిస్తున్నారు

‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల వారందరూ విశ్వాసులయ్యారు.’​—⁠అపొ. 13:​48, NW.

రాజ్యసువార్త లోకమందంతట ప్రకటించబడును అని యేసు చెప్పిన ప్రవచనానికి తొలిక్రైస్తవులు స్పందించిన తీరు గురించిన ఉత్తేజకరమైన వృత్తాంతం అపొస్తలుల కార్యముల పుస్తకంలో భద్రపరచబడింది. (మత్త. 24:​14) నిజానికి ఆ ఉత్సాహవంతులైన ప్రచారకులు, తమను అనుసరించేవారందరికీ ఒక మాదిరినుంచారు. యేసు శిష్యులు యెరూషలేములో ఉత్సాహంగా ప్రకటించడంవల్ల ‘యాజకులలో అనేకులతో’పాటు వేలాదిమంది మొదటి శతాబ్దపు సంఘంలోకి వచ్చారు.​—⁠అపొ. 2:​41; 4:⁠4; 6:⁠7.

2 క్రైస్తవత్వాన్ని అంగీకరించేలా తొలిశతాబ్దపు మిషనరీలు చాలామందికి సహాయం చేశారు. ఉదాహరణకు, ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్లాడు, అక్కడి జనసమూహం ఆయన చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నారు. (అపొ. 8:​5-8) పౌలు వివిధ సహచరులతో విస్తృతంగా ప్రయాణించి క్రైస్తవ సందేశాన్ని కుప్రలో, ఆసియా మైనరులోని వివిధ ప్రాంతాల్లో, మాసిదోనియలో, గ్రీసులో, ఇటలీలో ప్రకటించాడు. ఆయన ప్రకటించిన పట్టణాల్లో చాలామంది యూదులు, గ్రీకు దేశస్థులు విశ్వాసులయ్యారు. (అపొ. 14:⁠1; 16:⁠5; 17:⁠4) తీతు, క్రేతులో పరిచర్య చేశాడు. (తీతు 1:⁠5) పేతురు బబులోనులో నిర్విరామంగా సేవచేశాడు. దాదాపు సా.శ. 62-64 మధ్యకాలంలో, ఆయన తన మొదటి పత్రిక రాసే నాటికి క్రైస్తవుల ప్రకటనాపని పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ వంటి ప్రాంతాల్లో పేరుగాంచింది. (1 పేతు. 1:⁠1; 5:​13) అవి ఎంత ఉత్తేజభరితమైన కాలాలో కదా! ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవ ప్రచారకులు ఎంత ఉత్సాహంతో ప్రకటించారంటే వారు ‘భూలోకమును తలక్రిందులు చేశారు’ అని వారి శత్రువులు ఆరోపించారు.​—⁠అపొ. 17:⁠6; 28:​22.

3 ఆధునిక కాలాల్లో కూడా క్రైస్తవ సంఘం ఎంతో అభివృద్ధిని చవిచూసింది. మీరు యెహోవాసాక్షుల వార్షిక నివేదిక చదివి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఫలితాలను చూసినప్పుడు మీలో ఉత్తేజం కలగడంలేదా? 2007వ సేవా సంవత్సరంలో రాజ్య ప్రచారకులు 60 లక్షలకన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించారని తెలుసుకొని మీరు సంతోషించడం లేదా? అంతేకాక, యెహోవాసాక్షులుకాని దాదాపు కోటిమంది, యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేంతగా సువార్తపట్ల ఆసక్తి చూపించారని గత సంవత్సరం ఈ ప్రాముఖ్య ఆచరణకు హాజరైనవారి సంఖ్య తెలియజేస్తోంది. చేయాల్సిన పని ఇంకా ఎంతో ఉందని అది సూచిస్తోంది.

4 మొదటి శతాబ్దంలోలాగే నేడు, ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల వారందరూ’ సత్యంయొక్క సందేశానికి స్పందిస్తున్నారు. (అపొ. 13:​48, NW) యెహోవా అలాంటివారిని తన సంస్థలోకి ఆకర్షిస్తున్నాడు. (హగ్గయి 2:⁠7 చదవండి.) ఈ సమకూర్చే పనికి పూర్తిగా సహకరించడానికి మనం క్రైస్తవ పరిచర్యపట్ల ఎలాంటి మనోవైఖరిని కాపాడుకోవాలి?

నిష్పక్షపాతంగా ప్రకటించండి

5 “దేవుడు పక్షపాతి కాడని . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని మొదటి శతాబ్దపు క్రైస్తవులు గ్రహించారు. (అపొ. 10:​34, 35) యెహోవాతో సత్సంబంధాన్ని కోరుకునే వ్యక్తి యేసు విమోచన క్రయధన బలిమీద విశ్వాసముంచాలి. (యోహా. 3:​16, 36) అలాగే, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలని యెహోవా కోరుతున్నాడు.​—⁠1 తిమో. 2:​3, 4.

6 సువార్త ప్రచారకులు ప్రజల జాతి, సామాజిక హోదా, రూపం, మత నేపథ్యం, లేక మరితర విలక్షణ స్వభావాన్నిబట్టి వారి విషయంలో ముందే ఒక నిర్ధారణకు రావడం సరైనది కాదు. ఒక్క క్షణం ఆలోచించండి: లేఖన సత్యాల గురించి మీతో మొదట మాట్లాడిన వ్యక్తి మీపట్ల వివక్ష చూపించనందుకు మీరు కృతజ్ఞులు కారా? అలాగైతే, జీవదాయక సందేశాన్ని వినే అవకాశమున్న వ్యక్తికి ఆ సందేశాన్ని చెప్పేందుకు ఎందుకు వెనకాడాలి?​—⁠మత్తయి 7:​12 చదవండి.

7 యెహోవా, యేసును న్యాయాధిపతిగా నియమించాడు కాబట్టి, ఇతరులకు తీర్పుతీర్చే హక్కు మనకు లేదు. నిజానికి మనకు ఆ హక్కులేదు, ఎందుకంటే యేసులా కాక మనం “కంటి చూపునుబట్టి” లేక ‘మనం విన్నదాన్నిబట్టి’ మాత్రమే తీర్పుతీరుస్తాం, అయితే యేసు హృదయ అంతర్గత భావాలను, ఆలోచనలు తెలుసుకోగలడు.​—⁠యెష. 11:​1-5; 2 తిమో. 4:⁠1.

8 దాదాపు అన్ని నేపథ్యాల ప్రజలు యెహోవా సేవకులయ్యారు. వారిలో అత్యుత్తమ మాదిరి తార్సువాడైన సౌలు, ఆయన ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా పేరుగాంచాడు. పరిసయ్యుడైన సౌలు క్రైస్తవులను తీవ్రంగా వ్యతిరేకించాడు. క్రైస్తవులు నిజమైన యెహోవా ఆరాధకులు కాదని ఆయన నిష్కపటంగా నమ్మాడు కాబట్టి, క్రైస్తవ సంఘాన్ని హింసించాడు. (గల. 1:​13) మానవ దృక్కోణంలో చూస్తే, ఆయన క్రైస్తవుడయ్యే అవకాశం లేనేలేదన్నట్లు అనిపించ​వచ్చు. అయితే, యేసు సౌలు హృదయంలో ఏదో మంచి లక్షణాన్ని గమనించి ప్రత్యేక పనిని నిర్వర్తించేందుకు ఆయనను ఎంపికచేసుకున్నాడు. దానివల్ల, సౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోని అత్యంత క్రియాశీలంగా పనిచేసిన, ఉత్సాహాన్ని చూపించిన సభ్యుల్లో ఒకడయ్యాడు.

9 అపొస్తలుడైన పౌలు అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మన ప్రాంతంలో, మనం ప్రకటిస్తున్న సందేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించే ప్రజల గుంపులు ఉండవచ్చు. వారిలో ఎవరూ నిజక్రైస్తవులయ్యే అవకాశం లేదని అనిపించినా, మనం వారితో చర్చించేందుకు చేసే ప్రయత్నాలను మానుకోకూడదు. కొన్నిసార్లు వినే అవకాశమే లేదన్నట్లు అనిపించినవారు కూడా మనం ప్రకటించే సందేశాన్ని వినవచ్చు. అందరికీ “మానక” ప్రకటిస్తూ ఉండడమే మన బాధ్యత.​—⁠అపొస్తలుల కార్యములు 5:​42 చదవండి.

“మానక” ప్రకటించేవారికి ఆశీర్వాదాలు వేచివున్నాయి

10 బాహ్య రూపం మనల్ని మోసగించగలదు. ఉదాహరణకు, ఇగ్నేషియో * దక్షిణ అమెరికా దేశంలోని ఒక జైల్లో ఉన్నప్పుడు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించాడు. ఆయన హింసాయుత ప్రవృత్తినిబట్టి ప్రజలు ఆయనకు భయపడేవారు. కాబట్టి, ఖైదీలు తాము తయారుచేసి తోటి ఖైదీలకు అమ్మిన వస్తువులకు డబ్బులు చెల్లించడానికి తాత్సారం చేసేవారి దగ్గరనుండి డబ్బు వసూలుచేయడానికి ఇగ్నేషియోను వాడుకునేవారు. అయితే ఒకప్పుడు దౌర్జన్యపరునిగా, రౌడీగావున్న ఇగ్నేషియో ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ తాను నేర్చుకుంటున్న అంశాలను అన్వయించుకుని దయగల వ్యక్తిగా మారాడు. ఇప్పుడు అప్పులు వసూలుచేయడానికి ఎవరూ ఆయనను ఉపయోగించుకోవడం లేదు, అయినా బైబిలు సత్యాలు, దేవుని ఆత్మ తన వ్యక్తిత్వాన్ని మార్చాయని ఇగ్నేషియో సంతోషిస్తున్నాడు. రాజ్య ప్రచారకులు నిష్పక్షపాతంగా తనతో అధ్యయనం చేయడానికి కృషి చేసినందుకు కూడా ఆయన కృతజ్ఞతతో ఉన్నాడు.

11 రాజ్య సువార్త గురించి మనం ఇప్పటికే ప్రకటించినవారి పరిస్థితులు, వైఖరులు మారవచ్చు, నిజానికి అవి మారతాయి కూడా. అందువల్లే మనం పదేపదే వారి దగ్గరికి తిరిగి వెళతాం. మనం గతంలో వారిని సందర్శించి వెళ్లిపోయిన తర్వాత, వారిలో కొందరు తీవ్ర అనారోగ్యానికి గురైవుండవచ్చు, ఉద్యోగం పోగొట్టుకొనివుండవచ్చు, లేక తమ ప్రియమైనవారిని కోల్పోయివుండవచ్చు. (ప్రసంగి 9:​11 చదవండి.) ప్రపంచ సంఘటనలనుబట్టి, ప్రజలు తమ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు. అలాంటి పరిణామాలు గతంలో ఉదాసీనతను వ్యక్తపరచిన లేదా చివరకు వ్యతిరేకించిన వ్యక్తి కూడా సానుకూలంగా స్పందించేలా చేయవచ్చు. కాబట్టి, అనుకూలమైన అన్ని సందర్భాల్లో ఇతరులకు సువార్త ప్రకటించడానికి మనం వెనుకాడకూడదు.

12 ఇతరులను వర్గీకరించి, వారికి తీర్పుతీర్చే స్వభావం మానవులకుంది. అయితే, యెహోవా ప్రజలను ఆయావ్యక్తులుగా చూస్తాడు. ఆయన ప్రతీ వ్యక్తిలోవున్న మంచి గుణాలను చూస్తాడు. (1 సమూయేలు 16:⁠7 చదవండి.) మనం కూడా మన పరిచర్యలో అలా చూసేందుకే కృషిచేయాలి. మనం ప్రకటించేవారందరిపట్ల సరైన అభిప్రాయాన్ని కలిగివుండడంవల్ల సత్ఫలితాలు వస్తాయని అనేక అనుభవాలు చూపిస్తున్నాయి.

13 కరీబియన్‌లోని ఒక ద్వీపంలో సాండ్రా అనే పయినీరు సహోదరి ఇంటింటి పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు, ​కార్నివల్‌ (నృత్యం, సంగీతంతో ఉండే) వేడుకలను ఉత్సాహంగా జరుపుకొనే రూత్‌ను కలుసుకుంది. రూత్‌ రెండుసార్లు జాతీయ కార్నివల్‌ రాణిగా కిరీటం అందుకుంది. ఆమె సాండ్రా చెబుతున్న విషయాలపట్ల చక్కని ఆసక్తి చూపించింది, అందువల్ల ఆమెతో బైబిలు అధ్యయనం చేసేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. సాండ్రా ఇలా గుర్తుచేసుకుంటోంది: “నేను రూత్‌ ఇంట్లోకి ప్రవేశిస్తుండగా, ఆడంబరమైన కార్నివల్‌ అలంకరణతో ఉన్న ఆమె పెద్ద ఫొటోతోపాటు, ఆమె గెలుచుకున్న ట్రోఫీలు నాకు కనబడ్డాయి. అంతగా పేరుప్రఖ్యాతులు పొంది, కార్నివల్‌ వేడుకలను ఉత్సాహంగా జరుపుకునే వ్యక్తి సత్యంపట్ల ఆసక్తి చూపించకపోవచ్చని నేను పొరబడ్డాను. కాబట్టి ఆమె ఇంటికి వెళ్లడం మానేశాను.”

14 కొంతకాలం తర్వాత రూత్‌ రాజ్యమందిరానికి వచ్చింది, కూటం ముగిసిన తర్వాత ఆమె సాండ్రాను కలిసి, “మీరు నాతో అధ్యయనం చేయడం ఎందుకు మానేశారు?” అని అడిగింది. సాండ్రా క్షమాపణ అడిగి, అధ్యయనాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రూత్‌ త్వరితగతిన ప్రగతిసాధించి, తన కార్నివల్‌ చిత్రాలను తీసివేసింది, ఆమె సంఘ కార్యకలాపాల్లో పాల్గొనడం మొదలుపెట్టి యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకుంది. సాండ్రా తన మొదటి ప్రతిస్పందన తప్పని తర్వాత గుర్తించింది.

15 అవిశ్వాసులైన కుటుంబ సభ్యులకు, చివరకు అనుకూలంగా ప్రతిస్పందించనివారిగా కనిపించే వారికి సాక్ష్యమిచ్చిన అనేకమంది చక్కని ఫలితాలను చవిచూశారు. ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఓ క్రైస్తవ సహోదరియైన జోయిస్‌ ఉదాహరణనే తీసుకోండి. ఆమె మరిది యౌవనస్థునిగా ఉన్నప్పటి నుండి పదేపదే జైలుకు వెళ్తూ వస్తుండేవాడు. జోయిస్‌ ఇలా చెబుతోంది: “ఆయన మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, వాటితోపాటు ఇంకా ఎన్నో చెడ్డపనులు చేసేవాడు కాబట్టి, ఆయన జీవితానికి ఏ మాత్రం విలువలేదని ప్రజలు అనేవారు. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నేను 37 సంవత్సరాలు ఆయనతో బైబిలు సత్యాలను పంచుకున్నాను.” ఆయన చివరకు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టి, తన జీవితంలో మార్పులు చేసుకున్నప్పుడు తన బంధువుకు సహాయం చేయడానికి ఆమె ఓపికతో చేసిన ప్రయత్నాలకు చక్కని ప్రతిఫలం లభించింది. ఇటీవల 50 ఏళ్ల వయసులో, జోయిస్‌ మరిది, అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఒక జిల్లా సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాడు. జోయిస్‌ ఇలా అంటోంది: “నేను ఆనందబాష్పాలు రాల్చాను. నేను ఆయనకు మానక బోధించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

16 కొంతమంది బంధువులకున్న నేపథ్యాలనుబట్టి వారితో బైబిలు సత్యాల గురించి మాట్లాడడానికి మీరు సంకోచించవచ్చు. అయితే, జోయిస్‌ తన మరిదితో మాట్లాడడానికి వెనుకాడలేదు. అసలు ఇతరుల హృదయంలో ఏముందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి మతసంబంధ సత్యం కోసం నిజాయితీగా పరిశోధిస్తుండవచ్చు. కాబట్టి, ఆయనకు లేక ఆమెకు దానిని కనుగొనే అవకాశాన్ని ఇవ్వడానికి వెనుకాడకండి.​—⁠సామెతలు 3:⁠27 చదవండి.

చక్కని బైబిలు అధ్యయన ఉపకరణం

17 చాలామంది యథార్థహృదయలు బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే బైబిలు అధ్యయన ఉపకరణానికి చక్కగా స్పందిస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నివేదికలు చూపిస్తున్నాయి. అమెరికాకు చెందిన పెన్నీ అనే పయినీరు సహోదరి ఈ ప్రచురణను ఉపయోగించి అనేక అధ్యయనాలను ప్రారంభించింది. వారిలో ఇద్దరు వృద్ధులు ఉన్నారు, వారు నిష్ఠగల చర్చి సభ్యులు. బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని లేఖన సత్యాలకు వారెలా స్పందిస్తారో అని పెన్నీ ముందు సందేహించింది. అయితే ఆమె ఇలా రాసింది: “ఈ పుస్తకంలోని సమాచారం స్పష్టంగా, హేతుబద్ధంగా, సంక్షిప్తంగా ఉన్నందువల్ల వారు వాదించకుండా, మానసిక గందరగోళానికి గురికాకుండా తాము నేర్చుకుంటున్నది సత్యమని వెంటనే అంగీకరించారు.”

18 బ్రిటన్‌కు చెందిన ప్యాట్‌ అనే ప్రచారకురాలు, ఆసియాలోని ఒక దేశం నుండి శరణార్థిగా వచ్చిన ఓ స్త్రీతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించింది. తిరుగుబాటు దళాలు తన భర్తను, అబ్బాయిలను తీసుకెళ్లిన తర్వాత ఆమె తన దేశం నుండి పారిపోవాల్సివచ్చింది, ఆమె తనవారిని మళ్లీ చూడలేదు. ఆమెను బెదిరించి, ఆమె ఇంటిని తగలబెట్టడమే కాక ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా జరిగిన తర్వాత తాను జీవించడం ఇక వ్యర్థమని తలంచి ఆత్మహత్య చేసుకోవాలని అనేకసార్లు అనుకుంది. అయితే బైబిలు అధ్యయనం ఆమెకు నిరీక్షణను ఇచ్చింది. “బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని సరళమైన వివరణలు, ఉదాహరణలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి” అని ప్యాట్‌ రాసింది. ఆ విద్యార్థి త్వరితగతిన ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకోని ప్రచారకురాలయ్యేందుకు అర్హురాలైంది. ఆమె తర్వాతి సమావేశంలో బాప్తిస్మం తీసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసింది. లేఖనాలు ఇస్తున్న నిరీక్షణను అర్థం చేసుకొని దానిపట్ల కృతజ్ఞత పెంపొందించుకునేందుకు యథార్థహృదయులకు సహాయం చేయడం ఎంత ఆనందాన్నిస్తుందో కదా!

“మనము మేలుచేయుట యందు విసుకక యుందము”

19 రోజులు గడుస్తున్నకొద్దీ, సువార్త ప్రకటించి, శిష్యులను చేయమని మనకివ్వబడిన పనికున్న అత్యవసర భావం మరింత పెరుగుతోంది. ప్రతీ ఏడాది, దేవుని గురించి తెలుసుకోవాలనుకునే వేలాదిమంది మన ప్రకటనా పనికి స్పందిస్తున్నారు. అయితే, ‘యెహోవా మహా దినము సమీపమైంది, అంటే ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవారు “నాశమునందు పడుటకు జోగుచున్నా[రు]” అని దానర్థం.​—⁠జెఫ. 1:​14; సామె. 24:​11.

20 అలాంటివారికి మనం ఇప్పటికీ సహాయం చేయవచ్చు. అయితే మనం అలా సహాయం చేయాలంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులను అనుకరించాలి, వారు “ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొ. 5:​42) కష్టాలు ఎదురైనా పట్టుదలతో ప్రకటించడం ద్వారా, మీ ‘బోధనాకళకు’ శ్రద్ధనివ్వడం ద్వారా, నిష్పక్షపాతంగా అందరికీ ప్రకటించడం ద్వారా వారి మాదిరిని అనుసరించండి! “మనము మేలుచేయుట యందు విసుకక యుందము,” ఎందుకంటే మనం పట్టుదలతో ప్రకటిస్తే దైవ అనుగ్రహానికి సంబంధించిన ఎన్నో ఆశీర్వాదాలను ప్రతిఫలంగా పొందుతాం.​—⁠2 తిమో. 4:⁠2; గలతీయులు 6:⁠9 చదవండి.

[అధస్సూచి]

^ పేరా 14 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

మీరెలా జవాబిస్తారు?

• సువార్తకు ఎవరు స్పందిస్తున్నారు?

• మనం ప్రకటించేవారి విషయంలో ముందుగానే ఒక నిర్ధారణకు ఎందుకు రాకూడదు?

• బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంవల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2 సువార్త లోకమందంతట ప్రకటించబడును అని యేసు చెప్పిన ప్రవచనానికి తొలి క్రైస్తవులు ఎలా స్పందించారు?

3. ప్రకటనా పనుల్లో నేడు రాజ్య ప్రచారకులు ఎలాంటి ఫలితాలను సాధిస్తున్నారు, అవి మీలో ఎలాంటి భావాలు కలిగిస్తున్నాయి?

4. రాజ్య సందేశానికి ఎవరు స్పందిస్తున్నారు?

5. ఎలాంటి ప్రజలు యెహోవా అనుగ్రహాన్ని పొందుతారు?

6. రాజ్య ప్రచారకులు ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఎందుకు?

7. మనం ప్రకటించే ప్రజలకు ఎందుకు తీర్పుతీర్చకూడదు?

8, 9. (ఎ) సౌలు క్రైస్తవునిగా మారక ముందు ఆయనెలాంటి వ్యక్తిగా ఉన్నాడు? (బి) అపొస్తలుడైన పౌలు అనుభవం నుండి మనమేమి నేర్చుకోవాలి?

10. భయపెట్టేవారిగా కనబడేవారికి ప్రకటించడానికి మనం ఎందుకు వెనుకాడకూడదు? స్థానిక అనుభవాలు చెప్పండి.

11. మనం పదేపదే ప్రజల దగ్గరికి ఎందుకు తిరిగి వెళతాం?

12. మనం ప్రకటించేవారిని ఎలా చూడాలి, ఎందుకు?

13, 14. (ఎ) పరిచర్యలో కలుసుకున్న ఒక స్త్రీపట్ల ఒక పయినీరు సహోదరి ఎందుకు అంతగా శ్రద్ధ చూపించలేదు? (బి) ఈ అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15, 16. (ఎ) ఒక ప్రచారకుడు తన బంధువుకు సాక్ష్యమివ్వడంవల్ల ఏమి జరిగింది? (బి) ఒక బంధువుకున్న నేపథ్యాన్నిబట్టి మనం ఆయనకు లేక ఆమెకు సాక్ష్యమివ్వడానికి ఎందుకు వెనుకాడకూడదు?

17, 18. (ఎ) బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకానికున్న విలువ గురించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నివేదికలు ఏమి తెలియజేస్తున్నాయి? (బి) ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీకు ఎలాంటి ప్రోత్సాహకరమైన అనుభవాలు ఎదురయ్యాయి?

19. ప్రకటనా పని ఎందుకు అత్యవసరమైనది?

20. మనలో ప్రతీ ఒక్కరం ఏమిచేయాలనే నిశ్చయతతో ఉండాలి?

[13వ పేజీలోని చిత్రాలు]

యథార్థహృదయులు వేల సంఖ్యలో స్పందిస్తున్నారు

[15వ పేజీలోని చిత్రాలు]

అపొస్తలుడైన పౌలు చేసుకున్న మార్పుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

[16వ పేజీలోని చిత్రం]

సువార్త ప్రచారకులు ప్రజల విషయంలో ముందుగానే ఒక నిర్ధారణకు రారు