కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇశ్రాయేలీయులు చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోండి

ఇశ్రాయేలీయులు చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోండి

ఇశ్రాయేలీయులు చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోండి

ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తుండగా, యెహోవా వారినుండి ఏమి ఆశిస్తున్నాడో వారికి తెలుసు. మోషే ద్వారా దేవుడు వారినిలా ఆదేశించాడు: “ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచే[యవలెను].”​—⁠సంఖ్యా. 33:⁠52.

ఇశ్రాయేలీయులు ఆ దేశంలోని వారితో ఎలాంటి నిబంధనలు చేసుకోకూడదు లేదా వారిలో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు. (ద్వితీ. 7:​2, 3) నిజానికి దేవుడు ఎంచుకున్న ప్రజలు ఇలా హెచ్చరించబడ్డారు: “నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును.” (నిర్గ. 34:​12) అయినా ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై ఉరిలో చిక్కుకున్నారు. వారి పతనానికి కారణమేమిటి? తత్ఫలితంగా వారికి కలిగినదాని నుండి మనమెలాంటి గుణపాఠాలు నేర్చుకోవచ్చు?​—⁠1 కొరిం. 10:​11.

అన్యజనులతో సన్నిహితంగా మెలిగి విగ్రహారాధనకు పాల్పడడం

వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇశ్రాయేలీయులు తొలుత ఆ దేశనివాసులపై ఎన్నో విజయాలు సాధించారు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు పూర్తిగా లోబడలేదు. వారు శత్రువులను వెళ్లగొట్టలేదు. (న్యాయా. 1:1-2:​10) బదులుగా వారు ఆ దేశంలోవున్న “ఏడు జనముల” మధ్య నివసిస్తూ వారితో కలిసిమెలిసి ఉండడం చివరికి వారితో స్నేహం చేసేందుకు దారితీసింది. (ద్వితీ. 7:⁠1) అది ఇశ్రాయేలీయులపై ఎలాంటి ప్రభావం చూపించింది? వారు “వారి కుమార్తెలను పెండ్లిచేసికొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెల నిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి” అని బైబిలు చెబుతోంది. (న్యాయా. 3:​5-7) ఇశ్రాయేలీయులు ఆ దేశస్థులతో సన్నిహితంగా మెలగడం మతాంతర వివాహాలకు, విగ్రహారాధనకు దారితీసింది. వివాహ సంబంధాలు ఏర్పడడంతో ఇశ్రాయేలీయులు వారిని దేశంనుండి వెళ్లగొట్టే అవకాశాలు సన్నగిల్లాయి. సత్యారాధన కలుషితమై, ఇశ్రాయేలీయులు అబద్ధ దేవతలను ఆరాధించడం ప్రారంభించారు.

వాగ్దాన దేశపు నివాసులు ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నప్పటికన్నా వారి స్నేహితులుగా మారిన తర్వాత ఇశ్రాయేలీయుల ఆలోచనా విధానాన్ని, దేవునితో వారికున్న సంబంధాన్ని పాడుచేసే పెద్ద ప్రమాదంగా తయారయ్యారు. సత్యారాధన కలుషితమయ్యేందుకు కారణమైన మరో విధానాన్ని పరిశీలించండి.

వ్యవసాయం నుండి బయలు ఆరాధనకు

వాగ్దాత్త దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయులు దేశసంచారులుగా ఉండడం మానేశారు, వారిలో చాలామంది వ్యవసాయదారులుగా మారారు. వారు తమకన్నా ముందు ఆ దేశంలో నివసించిన ప్రజలు ఉపయోగించిన వ్యవసాయ పద్ధతుల్నే ఉపయోగించివుండవచ్చు. వారి పనివిధానపు మార్పు కేవలం కనానీయుల వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి మాత్రమే పరిమితం కాలేదనేది​ స్పష్టం. ఇశ్రాయేలీయులు స్థానికులతో సహవసించడం వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో స్థానికుల నమ్మకాలను అంగీకరించేలా వారిని ప్రలోభపెట్టింది.

కనానీయుల్లో చాలామంది బయలు దేవతలను ఆరాధించే​వారు. ఆ దేవతలు పొలాలను సారవంతం చేస్తారని వారు నమ్మేవారు. ఇశ్రాయేలీయులు పొలాలను సాగుచేసి, పంటలు పండించడమేకాక, నెమ్మదిగా కనానీయుల దేవతలు ఫలసమృద్ధి ఇచ్చేవారని నమ్ముతూ వారిని ఆరాధించడం మొదలుపెట్టారు. అలా ఇశ్రాయేలులో చాలామంది పైకి యెహోవాను ఆరాధిస్తున్నట్లు నటించారు గానీ నిజానికి వారు పూర్తిగా మతభ్రష్టత్వంలో మునిగిపోయారు.

నేడు మనకొక గట్టి హెచ్చరిక

ఇశ్రాయేలీయులు మొదటిసారి వాగ్దాన దేశంలోని ప్రజలను కలిసినప్పుడు బయలు ఆరాధనలో, దాని దుర్నీతి క్రియల్లో వారితోపాటు భాగం వహించాలని ఏ మాత్రం తలంచివుండరు. కానీ వారితో సహవసించడం ఖచ్చితంగా అలాగే జరగడానికి దారితీసింది. మనతో స్నేహపూర్వకంగా ఉన్నా మన క్రైస్తవ నమ్మకాలను, నైతిక ప్రమాణాలను, సూత్రాలను గౌరవించని వారితో సన్నిహితంగావుంటే అలాంటి హానికరమైన పర్యవసానాలే ఎదురౌతాయని మనం భావించవద్దా? నిజమే, మన ఉద్యోగస్థలంలో, పాఠశాలలో లేదా మన ఇంటిలో సహితం అవిశ్వాసులతో మెలగాల్సి ఉంటుంది. అయితే, అలాంటి వారితో స్నేహం చేయడం సమస్యలను కొనితెచ్చుకోవడమే అవుతుందని ఇశ్రాయేలీయుల ఉదాహరణ చూపిస్తోంది. బైబిలు ఈ తిరుగులేని నిజాన్ని పేర్కొంటోంది: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”​—⁠1 కొరిం. 15:​33.

నేడు మనం కూడా ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నలాంటి సవాళ్లనే ఎన్నో ఎదుర్కొంటున్నాం. నేటి సమాజంలో పూజించబడే దేవతలకు కొదువ లేదు. అలాంటి దేవతల్లో డబ్బు, సినీతారలు, క్రీడాతారలు, రాజకీయ వ్యవస్థలు, కొంతమంది మత నాయకులు, కుటుంబ సభ్యులు సహితం ఉండవచ్చు. వీరిలో ఎవరైనా, వీటిలో ఏదైనా మన జీవితంలో అధిక ప్రాముఖ్యతను సంతరించుకోవచ్చు. యెహోవాను ప్రేమించని వారితో సన్నిహితత్వాన్ని పెంచుకోవడం మన ఆధ్యాత్మిక వినాశనానికి దారితీయవచ్చు.

చాలామంది ఇశ్రాయేలీయులను ఆకర్షించి, ప్రలోభపెట్టిన బయలు ఆరాధనలో అనైతిక లైంగిక కార్యకలాపాలు ప్రముఖ భాగంగా ఉండేవి. దేవుని ప్రజల్లో నేడు చాలామంది అలాంటి ఉరుల్లోనే చిక్కుకుంటున్నారు. ఉదాహరణకు, కుతూహలపడే లేదా అజాగ్రత్తపరుడైన ఒక వ్యక్తి తన మంచి మనస్సాక్షిని పాడుచేసుకునేందుకు ఏకాంతంగా తన ఇంట్లోనే కంప్యూటర్‌ మౌస్‌ను ఒక్కసారి క్లిక్‌ చేస్తే చాలు. ఒక క్రైస్తవుడు ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాల ప్రలోభానికి గురికావడం ఎంత విచారకరం!

‘ఆయన శాసనములను గైకొనువారు ధన్యులు’

మనం సహవాసులను ఎన్నుకొనే విషయంలో యెహోవా నిర్దేశాలకు లోబడతామా లేదా అనేది మన వ్యక్తిగత నిర్ణయం. (ద్వితీ. 30:​19, 20) కాబట్టి మనమిలా ప్రశ్నించు​కోవాలి: ‘నేను సరదాగా సమయం గడపాలనుకుంటే ఎవరితో కలిసి సమయం గడుపుతాను? వారి నైతిక విలువలు, ప్రమాణాలు ఏమిటి? వారు యెహోవాను ఆరాధించే​వారేనా? వారితో సమయం గడపడంవల్ల నేను మరింత మెరుగైన క్రైస్తవునిగా తయారౌతానా?’

“యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు” అని కీర్తనకర్త అన్నాడు. (కీర్త. 119:​1, 2) అవును, “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.” (కీర్త. 128:⁠1) సహవాసులను ఎన్నుకునే విషయంలో మనం ఇశ్రాయేలీయులు చేసిన తప్పులు చేయకుండా, యెహోవాకు పూర్తిగా లోబడదాం.​—⁠సామె. 13:​20.

[26వ పేజీలోని చిత్రం]

యెహోవాను ప్రేమించనివారితో సన్నిహితంగా మెలగడంవల్ల మనం విగ్రహారాధనకు పాల్పడే అవకాశముంది