కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు ప్రత్యక్షత—మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?

క్రీస్తు ప్రత్యక్షత—మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?

క్రీస్తు ప్రత్యక్షత​—⁠మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?

“నీ రాకడకును [‘ప్రత్యక్షతకును,’ NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి?”​—⁠మత్త. 24:⁠3.

దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం, యేసు అపొస్తలులు నలుగురు ఒలీవ కొండపై తమ ప్రభువుతో ఏకాంతంగా మాట్లాడుతూ ఆయనను ఈ ప్రశ్నలు అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును [‘ప్రత్యక్షతకును,’ NW]ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్త. 24:⁠3) ఆ ప్రశ్నల్లో అపొస్తలులు, ‘నీ ప్రత్యక్షతకు,’ “ఈ యుగసమాప్తికి” అనే ఆసక్తికరమైన రెండు పదాలను ఉపయోగించారు. ఈ పదాలు దేనిని సూచిస్తున్నాయి?

2 మనం మొదటిగా రెండవ పదమైన “సమాప్తి”ని ​పరిశీలిద్దాం. ఇది సింటేలియా అనే గ్రీకుపదం నుండి అనువదించబడింది. తెలుగు బైబిల్లో ఈ పదం “సమాప్తి” అని అనువదించబడింది, అయితే దాని సంబంధిత గ్రీకు పదం టేలోస్‌ “అంతం” అని అనువదించ​బడింది. ఈ రెండు పదాల్లోని తారతమ్యాన్ని, రాజ్యమందిరంలో ఇవ్వబడే ప్రసంగంతో ఉదాహరించవచ్చు. ప్రసంగపు చివరిభాగాన్ని సమాప్తి లేదా ముగింపు అంటారు, ఈ భాగమప్పుడు ప్రసంగీకుడు అంతకుముందు తాను శ్రోతలకు వివరించిన అంశాలను గుర్తుచేసేందుకు కొంత సమయం తీసుకుని ప్రసంగంలోని సమాచారం వారికి ఎలా అన్వయిస్తుందో వివరిస్తాడు. ప్రసంగీకుడు వేదికమీది నుండి వెళ్లిపోవడంతో ప్రసంగం అంతమౌతుంది లేదా అయిపోతుంది. అదేవిధంగా, బైబిలు ప్రకారం “యుగసమాప్తి” అనేది అంతానికి దారితీసే కాలవ్యవధినీ, అంతాన్నీ సూచిస్తుంది.

3 అపొస్తలులు అడిగిన “రాకడ” లేదా ‘ప్రత్యక్షత’ విషయమేమిటి? ఇది పరోసీయ అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది. * క్రీస్తు పరోసీయ లేదా ప్రత్యక్షత యేసు పరలోకంలో 1914లో రాజుగా నియమించ​బడడంతో ఆరంభమయ్యింది, అది ఆయన దుష్టులను నాశనంచేసే ‘మహాశ్రమల’ కాలం పూర్తయ్యేవరకు కొనసాగుతుంది. (మత్త. 24:​21) ఈ దుష్టవిధానపు “అంత్య​దినములు,” ఏర్పర్చబడినవారు సమకూర్చబడడం, వారు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడడం వంటి వాటితోసహా వివిధ సంఘటనలు యేసు ప్రత్యక్షతా కాలంలో జరుగుతాయి. (2 తిమో. 3:⁠1; 1 కొరిం. 15:​23; 1 థెస్స. 4:​15-17; 2 థెస్స. 2:⁠1) “యుగసమాప్తి” (సింటేలియా) అనేది, క్రీస్తు ప్రత్యక్షత (పరోసీయ) అని పిలవబడేది ఒకే కాలంలో జరిగేవని చెప్పవచ్చు.

సుదీర్ఘమైన కాలవ్యవధి

4పరోసీయ అనేమాట దీర్ఘకాలాన్ని సూచిస్తుందనే విషయం యేసు తన ప్రత్యక్షత గురించి చెప్పిన​దానికి పొందికగా ఉంది. (మత్తయి 24:​37-39 చదవండి.) యేసు తన ప్రత్యక్షతను, నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తక్కువ కాలవ్యవధితో పోల్చలేదని గమనించండి. బదులుగా ఆయన తన ప్రత్యక్షతను జలప్రళయానికి దారితీసిన సుదీర్ఘమైన కాలవ్యవధితో పోల్చాడు. ఆ కాలవ్యవధిలోనే నోవహు ఓడను నిర్మించడం, ప్రకటించడం జరిగాయి, ఆ ప్రకటనా పని చివరకు జల​ప్రళయం వచ్చేంతవరకు కొనసాగింది. ఆ రెండు సంఘటనలు అనేక దశాబ్దాల కాలంలో జరిగాయి. అదేవిధంగా, క్రీస్తు ప్రత్యక్షతలో మహాశ్రమలకు నడిపించే సంఘటనలూ, ఆ మహాశ్రమలు చేరివుంటాయి.​—⁠2 థెస్స. 1:​6-9.

5 క్రీస్తు ప్రత్యక్షత, ఆయన కేవలం దుష్టులను నాశనం చేయడానికి వచ్చే స్వల్పసమయాన్ని కాదుగానీ సుదీర్ఘమైన కాలవ్యవధిని సూచిస్తుందని ఇతర బైబిలు ప్రవచనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రకటన గ్రంథం, యేసు తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నాడనీ, ఆయనకు కిరీటం ఇవ్వబడిందనీ వివరిస్తోంది. (ప్రకటన 6:​1-8 చదవండి.) యేసు 1914లో రాజుగా కిరీటధారియైన తర్వాత “జయించుచు, జయించుటకు బయలు​[దేరినట్లు]” వర్ణించబడ్డాడు. ఆ తర్వాత వివిధ రంగుల గుర్రాలపై స్వారీచేస్తున్న రౌతులు ఆయనను అనుసరిస్తున్నట్లు ఆ వృత్తాంతం చూపిస్తోంది. ఈ గుర్రాలు ప్రవచనార్థకంగా యుద్ధాన్ని, కరవులను, తెగుళ్లను సూచిస్తున్నాయి, ఇవన్నీ “అంత్యదినములు” అని పేర్కొనబడిన సుదీర్ఘమైన కాలవ్యవధిలో సంభవించాయి. ఈ ప్రవచన నెరవేర్పును మనం మన జీవితకాలంలో చూస్తున్నాం.

6 పరలోకంలో దేవుని రాజ్య స్థాపన గురించి ప్రకటన 12వ అధ్యాయం మరిన్ని వివరాలను అందిస్తోంది. మనమక్కడ పరలోకంలో యుద్ధం జరగడం గురించి చదువుతాం. మిఖాయేలు, అంటే పరలోకంలో రాజుగావున్న యేసుక్రీస్తు, ఆయన దూతలు అపవాదితో అతని దూతలతో యుద్ధంచేశారు. ఆ యుద్ధంలో ఓడిపోయిన అపవాదియగు సాతాను, అతని దూతలు భూమ్మీదికి పడద్రోయబడ్డారు. ఆ సమయంలో అపవాది “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని” బహు క్రోధముగలవాడయ్యాడని ఆ వృత్తాంతం మనకు చెబుతోంది. (ప్రకటన 12:​7-12 చదవండి.) కాబట్టి, పరలోకంలో క్రీస్తు రాజ్యం స్థాపించ​బడిన తర్వాతి కాలవ్యవధిలో గుర్తింపదగిన రీతిలో భూమికి, దాని నివాసులకు “శ్రమ” ఎక్కువౌతుంది.

7 అలాగే రెండవ కీర్తన పరలోక సియోనుపై యేసు రాజుగా నియమించబడడం గురించి ప్రవచనార్థకంగా మాట్లాడుతోంది. (కీర్తన 2:​5-9; 110:​1, 2 చదవండి.) అంతేగాక ఈ కీర్తన భూరాజులకు, వారి ప్రజలకు క్రీస్తు పరిపాలనకు లోబడే అవకాశం ఇవ్వబడే కాలం ఉంటుందని కూడా సూచిస్తోంది. వారు “వివేకులై” ఉండాలని, ‘బోధనొందేందుకు’ అంగీకరించాలని వారికి చెప్పబడింది. అవును, ఆ కాలంలో యెహోవాను, ఆయన నియమించిన రాజును సేవించడం ద్వారా “ఆయనను [దేవుణ్ణి] ఆశ్రయించువారందరు ధన్యు[లై]” ఉంటారు. కాబట్టి యేసు రాజ్యాధికార ప్రత్యక్షతా కాలంలో, అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం అందరికీ ఇవ్వబడుతుంది.​—⁠కీర్త. 2:​10-12.

సూచనను గుర్తించడం

8 పరిసయ్యులు రాజ్యమెప్పుడు వస్తుందని అడిగినప్పుడు, అది వారు అనుకున్నట్లు “అందరికీ కనిపించేలా రాదు” అని యేసు జవాబిచ్చాడు. (లూకా 17:​20, 21, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అవిశ్వాసులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరు. అయినా అది వారికెలా అర్థమౌతుంది? వారు యేసును తమ భావిరాజుగా కూడా గుర్తించలేదు. మరయితే ఎవరు క్రీస్తు ప్రత్యక్షతా సూచనను గుర్తించి, దాని విశేషతను అర్థం చేసుకుంటారు?

9 ‘ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, మరియొక దిక్కున కేలాగు ప్రకాశించడం’ చూస్తారో అంత స్పష్టంగా తన శిష్యులు సూచనను చూస్తారని యేసు చెప్పాడు. (లూకా 17:​24-29 చదవండి.) గమనించాల్సిన ఆసక్తికరమైన అంశమేమిటంటే, మత్తయి 24:​23-27లోని వృత్తాంతం ఈ సంఘటనను క్రీస్తు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనతో నేరుగా ముడిపెడుతోంది.

ఆ సూచనను చూసే తరం

10 గతంలో ఈ కావలికోట పత్రిక, మత్తయి 24:​34లో​ పేర్కొనబడిన “ఈ తరము” మొదటి శతాబ్దంలో “అవిశ్వాసులైన యూదుల సమాకాలీకుల తరము” అని వివరించింది. * ఆ వివరణ సముచితంగానే అనిపించింది, ఎందుకంటే యేసు “తరము” అనే పదాన్ని ఉపయోగించిన ఇతర సందర్భాలన్నిటిలోనూ ఆయన దానిని ప్రతికూల భావంలో ఉపయోగించాడు, అంతేగాక చాలా సందర్భాల్లో యేసు ఆ తరాన్ని వర్ణించడానికి ‘చెడ్డది’ అనే ప్రతికూల విశేషణాన్ని ఉపయోగించాడు. (మత్త. 12:​39; 17:​17; మార్కు 8:​38) కాబట్టి, ఆధునికదిన నెరవేర్పులో, యేసు ఇటు ‘యుగసమాప్తికి’ (సింటేలియా), అటు విధానాంతానికి (టేలోస్‌) సూచనగా ఉండే అంశాలను చూసే అవిశ్వాసుల చెడ్డ “తరము” గురించి మాట్లాడుతున్నాడని భావించడం జరిగింది.

11 యేసు “తరము” అనే పదాన్ని ప్రతికూల భావంలో ఉపయోగించినప్పుడు, ఆయన తన కాలంలోని చెడ్డ ప్రజలతో లేదా వారి గురించి మాట్లాడాడు అన్నది నిజమే. అయితే మత్తయి 24:​34లో రాయబడివున్నట్లుగా, ఆయన “తరము” అనే మాటను అదే భావంలో ఉపయోగించాడని అనుకోవడం సబబేనా? యేసు శిష్యుల్లో నలుగురు ఆయన దగ్గరకు “ఏకాంతముగా” వెళ్లారని గుర్తుచేసుకోండి. (మత్త. 24:⁠3) యేసు వారితో “ఈ తరము” గురించి మాట్లాడేటప్పుడు ప్రతికూల విశేషణాలను ఉపయోగించలేదు కాబట్టి, “ఇవన్నియు జరుగువరకు” గతించని “తరము”లో తాము, తమ తోటి శిష్యులు భాగమై ఉంటారని ఆ అపొస్తలులు నిస్సందేహంగా అర్థం చేసుకొనివుంటారు.

12 దేని ఆధారంగా మనమా నిర్ధారణకు రావచ్చు? సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారానే. మత్తయి 24:​32, 33లో రాయబడి ఉన్నట్లుగా, యేసు ఇలా అన్నాడు: “అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతు​లన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.” (మార్కు 13:​28-30; లూకా 21:​30-32 పోల్చండి.) ఆ తర్వాత మత్తయి 24:​34లో మనమిలా చదువుతాం: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”

13మత్తయి 24:⁠33లో పేర్కొనబడినట్లు, ‘ఈ సంగతులన్నియు’ జరగడం చూసినప్పుడు, విషయాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవలసిందీ త్వరలోనే పరిశుద్ధాత్మతో అభిషేకించబడబోయేదీ, తన శిష్యులేనని యేసు చెప్పాడు. కాబట్టి, “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని” చెప్పినప్పుడు యేసు తన శిష్యులనే ఉద్దేశించి చెప్పివుండవచ్చు.

14 అవిశ్వాసుల్లా కాక, యేసు శిష్యులు కేవలం సూచనను చూడడమే కాదు దాని విశేషతను కూడా అర్థం చేసుకుంటారు. ఆ సూచనకు సంబంధించిన అంశాల నుండి ‘నేర్చుకొని,’ వాటి నిజ అర్థాన్ని ‘తెలుసుకుంటారు.’ “ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని” వారు పూర్తిగా గ్రహిస్తారు. మొదటి శతాబ్దంలో యేసు మాటల పరిమిత నెరవేర్పును అటు అవిశ్వాసులైన యూదులు, ఇటు నమ్మకస్థులైన అభిషిక్త క్రైస్తవులు చూశారనేది వాస్తవమైనా, ఆ కాలంలోని ఆయన అభిషిక్త అనుచరులు మాత్రమే ఆ సంఘటనల నుండి తెలుసుకోగలిగారు అంటే తాముచూసిన సంఘటనల నిజ అర్థాన్ని గ్రహించగలిగారు.

15 నేడు అధ్యాత్మిక అవగాహన లేనివారు, యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచన విషయంలో “అందరికీ కనిపించేలా” ఏదీ జరగలేదని అనుకున్నారు. అన్నీ గతంలోలాగే కొనసాగుతున్నాయని వారు వాదిస్తారు. (2 పేతు. 3:⁠4) కానీ నమ్మకస్థులైన క్రీస్తు అభిషిక్త సహోదరులు, నేటి యోహాను తరగతివారు మెరుపును గుర్తించినంత స్పష్టంగా ఆ సూచనను గుర్తించి, దాని నిజమైన భావాన్ని అర్థం చేసుకున్నారు. ‘ఇవన్నియు జరుగువరకు గతింపని’ నేటి సమకాలీకుల “తరము,” ఒక తరగతిగా ఈ అభిషిక్తులకు చెందినదే. * ప్రవచించబడిన మహా​శ్రమలు ఆరంభమైనప్పుడు క్రీస్తు అభిషిక్త సహోదరుల్లో కొందరు ఇంకా భూమ్మీద సజీవంగా ఉంటారని ఇది సూచిస్తోంది.

“మెలకువగా నుండుడి”

16 అయితే సూచనను గుర్తించడం మాత్రమే సరిపోదు. యేసు ఇంకా ఇలా అన్నాడు: “నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా​ నుండుడి.” (మార్కు 13:​37) మనం అభిషిక్తులమైనా లేక గొప్పసమూహపు సభ్యులమైనా మనమందరం మెలకువగా ఉండడం నేడు అత్యంత ప్రాముఖ్యం. యేసు పరలోకంలో 1914లో రాజుగా నియమించబడి ఇప్పటికి తొమ్మిది దశాబ్దాలు గడిచిపోయాయి. ఎంత కష్టమైనాసరే మనం సిద్ధంగా, ఎల్లప్పుడూ మెలకువగా ఉన్నామని నిరూపించుకోవాలి. అలా చేసేందుకు, యేసు అదృశ్యముగా రాజ్య పరిపాలన చేస్తున్నాడని అర్థం చేసుకోవడం మనకు సహాయం చేస్తుంది. అలాగే అది, ఆయన తన శత్రువులను నాశనం చేయడానికి త్వరలోనే, “[మనం] అనుకొనని గడియలో” వస్తాడనే వాస్తవం విషయంలో మనలను మెలకువగా ఉంచుతుంది.​—⁠లూకా 12:​40.

17 క్రీస్తు ప్రత్యక్షత యొక్క అర్థాన్ని మనం గ్రహించడం, మన అత్యవసర భావాన్ని తీవ్రతరం చేసుకునేందుకు సహాయం చేస్తుంది. యేసు ప్రత్యక్షత ఇప్పటికే ప్రారంభమయ్యిందని, 1914 నుండి ఆయన పరలోకంలో రాజుగా అదృశ్యంగా పరి​పాలిస్తున్నాడని మనకు తెలుసు. త్వరలోనే ఆయన దుష్టులను నాశనం చేయడానికి వచ్చి, ఈ భూమియంతటిపై పెద్ద మార్పులు తీసుకొస్తాడు. కాబట్టి, యేసు ప్రవచించిన పనిలో మనం క్రితమెన్నటికన్నా మరెంతో క్రీయాశీలంగా భాగం వహించేందుకు నిశ్చయించు​కోవాలి. ఆయనిలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింప​బడును; అటు తరువాత అంతము [టేలోస్‌] వచ్చును.”​—⁠మత్త. 24:​14.

[అధస్సూచీలు]

^ పేరా 5 సవివర చర్చకోసం లేఖనాలపై అంతర్దృష్టి సంపుటి 2, 676-9 పేజీలు చూడండి.

^ పేరా 15 కావలికోట, నవంబరు 1, 1995, 11-15, 19, 30, 31 పేజీలు చూడండి.

^ పేరా 20 “ఈ తరము”వారు జీవించే కాలం, ప్రకటన గ్రంథములోని మొదటి దర్శన నెరవేర్పు కాలం ఒకటే అనిపిస్తోంది. (ప్రక. 1:10-3:​22) ప్రభువు దినమునకు సంబంధించిన ఈ అంశం 1914 నుండి నమ్మకమైన అభిషిక్తుల్లో చివరి వ్యక్తి మరణించి పునరుత్థాం చేయబడేవరకు కొనసాగుతుంది.​—⁠ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలో 24వ పేజీ, 4వ పేరా చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• యేసు ప్రత్యక్షత సుదీర్ఘ కాలవ్యవధిని సూచిస్తుందని మనకెలా తెలుసు?

• ఎవరు యేసు ప్రత్యక్షతను గుర్తించి, దాని అర్థాన్ని గ్రహిస్తారు?

మత్తయి 24:​34లో పేర్కొనబడిన ఆధునికదిన తరముకు చెందినవారు ఎవరు?

• “ఈ తరము” కాలనిడివి ఖచ్చితంగా ఎంత అనేది మనమెందుకు లెక్కించలేకపోతున్నాము?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు అపొస్తలులు ఏ ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు?

2. “సమాప్తి” అనే పదానికి అంతర్లీనంగా ఎలాంటి అర్థముంది?

3. యేసు ప్రత్యక్షతా కాలంలో జరిగే కొన్ని సంఘటనలు ఏవి?

4. యేసు ప్రత్యక్షతకు, నోవహు కాలంనాటి సంఘటనలకు ఏమి పోలికవుంది?

5. యేసు ప్రత్యక్షత సుదీర్ఘ కాలవ్యవధిని సూచిస్తుందని ప్రకటన 6వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఎలా తెలియజేస్తున్నాయి?

6. క్రీస్తు ప్రత్యక్షత గురించి ఏ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రకటన 12వ అధ్యాయం మనకు సహాయం చేస్తుంది?

7. రెండవ కీర్తన దేనిగురించి మాట్లాడుతోంది, అక్కడ ఏ అవకాశం గురించి చెప్పబడింది?

8, 9. ఎవరు క్రీస్తు ప్రత్యక్షతను గుర్తించి, దాని భావాన్ని అర్థం చేసుకుంటారు?

10, 11. (ఎ) మత్తయి 24:34లో పేర్కొనబడిన “తరము” గురించి గతంలో ఏ వివరణ ఇవ్వబడింది? (బి) ఆ “తరము”లో ఎవరు భాగమైవుంటారని యేసు శిష్యులు తప్పక అర్థం చేసుకునివుంటారు?

12. యేసు “తరము” అనే మాటను ఉపయోగించినప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడనే దానిగురించి సందర్భం ఏమి వెల్లడిచేస్తోంది?

13, 14. యేసు “తరము” అనే మాటను తప్పకుండా తన శిష్యులను ఉద్దేశించే చెప్పివుంటాడని మనమెందుకు చెప్పవచ్చు?

15. (ఎ) యేసు పేర్కొన్న ఆధునిక “తరము”కు చెందినవారు ఎవరు? (బి) “ఈ తరము” కాలనిడివి ఖచ్చితంగా ఎంత అనేది మనమెందుకు లెక్కించలేకపోతున్నాము? (25వ పేజీలోని బాక్సు చూడండి.)

16. క్రీస్తు శిష్యులందరూ ఏమిచేయాలి?

17. ఈ అవగాహన మనమెలా భావించేలా చేయాలి, మనమేమి చేసేందుకు నిశ్చయించుకోవాలి?

[25వ పేజీలోని బాక్సు]

“ఈ తరము” కాలనిడివి ఎంతో మనం లెక్కించగలమా?

“తరము” అనే మాట సాధారణంగా ఒకానొక కాలంలో లేదా సంఘటనా సమయంలో జీవించే వివిధ వయసుల ప్రజలను సూచిస్తుంది. ఉదాహరణకు, నిర్గమకాండము 1:⁠6 మనకిలా చెబుతోంది: “యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి.” యోసేపు ఆయన అన్నదమ్ముల వయసులో తేడావుంది, అయినా వారందరూ ఒకే కాలంలో ఒకే విధమైన పరిస్థితిని అనుభవించారు. “ఆ తరము”లో యోసేపుకు ముందు జన్మించిన ఆయన సహోదరుల్లో కొంతమంది కూడా ఉన్నారు. వీరిలో కొందరు యోసేపుకన్నా ఎక్కువకాలం జీవించారు. (ఆది. 50:​24) యోసేపు తర్వాత జన్మించిన బెన్యామీను వంటి “ఆ తరము”కు చెందిన ఇతరులు, ఆయన చనిపోయిన తర్వాత కూడా జీవించివుండ​వచ్చు.

కాబట్టి ఫలానీ కాలంలో జీవించిన ప్రజలను సూచిస్తూ “తరము” అనే పదం ఉపయోగించబడినప్పుడు అది ఖచ్చితంగా ఇంతకాలం ఉంటుందని చెప్పడం కుదరదు, అయితే అది మరీ ఎక్కువకాలం ఉండదు కానీ దానికొక ముగింపు ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. అందువల్ల, మత్తయి 24:⁠34లో రాయబడివున్నట్లుగా, “ఈ తరము” అనే మాటను ఉపయోగించడం ద్వారా యేసు, “అంత్యదినములు” ఎప్పుడు ముగుస్తాయనేది నిర్ధారించుకోవడానికి సహాయం చేసే సూత్రాన్ని తన శిష్యులకు ఇవ్వలేదు. బదులుగా యేసు, “ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు” వారు తెలుసుకోలేరని నొక్కిచెప్పాడు.​—⁠2 తిమో. 3:⁠1; మత్త. 24:​36.

[22, 23వ పేజీలోని చిత్రం]

యేసు 1914లో రాజుగా కిరీటం ధరించిన తర్వాత ఆయన “జయించుచు” ఉన్నట్లు వర్ణించబడ్డాడు

[24వ పేజీలోని చిత్రం]

“ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు”