కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్కు పుస్తకం నుండి ముఖ్యాంశాలు

మార్కు పుస్తకం నుండి ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

మార్కు పుస్తకం నుండి ముఖ్యాంశాలు

నాలుగు సువార్త పుస్తకాల్లో మార్కు సువార్త అన్నింటికన్నా చిన్నది. యేసుక్రీస్తు మరణించి పునరుత్థానం చేయబడిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత, యోహాను అనే మారుపేరుగల మార్కు ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ సువార్త, యేసు మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలంలో జరిగిన ఉత్కంఠభరిత సంఘటనలను వివరిస్తుంది.

యూదేతరుల కోసం, ప్రత్యేకంగా రోమీయుల కోసం రాయబడిన ఈ పుస్తకం, యేసును ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొంటూ అద్భుతాలు చేసే దేవుని కుమారునిగా వర్ణిస్తోంది. ఈ పుస్తకంలో యేసు బోధించిన విషయాలకన్నా ఆయన చేసిన పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. మార్కు సువార్తను శ్రద్ధగా చదవడం మెస్సీయపై మన విశ్వాసాన్ని బలపర్చి, క్రైస్తవ పరిచర్యలో దేవుని సందేశాన్ని ఉత్సాహంగా ప్రకటించేలా మనల్ని పురికొల్పుతుంది.​—⁠హెబ్రీ. 4:​12.

గలిలయలో చేసిన గొప్ప ప్రకటనాపని

(మార్కు 1:⁠1–9:​50)

మార్కు, బాప్తిస్మమిచ్చు యోహాను కార్యకలాపాల గురించి, యేసు అరణ్యంలో 40 రోజులు గడపడం గురించి కేవలం 14 వచనాల్లో వివరించిన తర్వాత, గలిలయలో యేసు చేసిన పరిచర్య గురించి ఉత్తేజకరంగా రాయడం ఆరంభించాడు. ఆయన “వెంటనే” అనే పదాన్ని పదేపదే వాడడాన్నిబట్టి ఆ వృత్తాంతంలో అత్యవసర భావం నొక్కిచెప్పబడినట్లు తెలుస్తోంది.​—⁠మార్కు 1:​10, 12.

మూడుకన్నా తక్కువ సంవత్సరాల్లోనే యేసు గలిలయలో మూడుసార్లు విస్తృతంగా ప్రకటించాడు. మార్కు విషయాలను ఎక్కువగా కాలక్రమానుసారంగా రాశాడు. యేసు ఇచ్చిన అనేక పెద్దపెద్ద ప్రసంగాలను రాయకుండా వదిలేసినట్లే కొండమీది ప్రసంగాన్నీ ఆయన తన సువార్తలో రాయలేదు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​15​—⁠ఏ విషయంలో “కాలము” సంపూర్ణమయ్యింది? యేసు తన పరిచర్యను ఆరంభించేందుకు కాలం సంపూర్ణమయ్యిందని లేదా నిర్ణయకాలం వచ్చిందని చెబుతున్నాడు. నియమిత రాజుగావున్న ఆయన వారి మధ్యే ఉన్నాడు కాబట్టి, దేవుని రాజ్యం సమీపించింది. అలా సరైన మనో​వైఖరి గలవారు ఆయన ప్రకటనాపనికి స్పందించి, దేవుని ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవచ్చు.

1:​43-44; 3:​12; 7:⁠36​—⁠యేసు తానుచేసిన అద్భుతాల గురించి ఇతరులకు చెప్పవద్దని ఎందుకు కోరాడు? సంచలన వార్తలను లేదా అతిగాచేసి చెప్పబడినమాటలను విని అభిప్రాయాలు ఏర్పర్చుకునే బదులు ప్రజలు తాను క్రీస్తుననే రుజువును ప్రత్యక్షంగా చూసి వ్యక్తిగతంగా ఓ నిర్ధారణకు రావాలని యేసు కోరుకున్నాడు. (యెష. 42:​1-4; మత్త. 8:⁠4; 9:​30; 12:​15-21; 16:​20; లూకా 5:​14) కానీ, గెరాసేనుల దేశంలో యేసు బాగుచేసిన దయ్యము పట్టినవాని విషయంలో మాత్రం ఆయన తన గురించి చెప్పవద్దని అనలేదు. యేసు అతణ్ణి, తన ఇంటికి వెళ్లి బంధువులకు తాను బాగుపడిన విషయం తెలియజేయమని చెప్పాడు. అక్కడి ప్రజలు ఆ ప్రాంతము విడిచివెళ్లమని యేసును బ్రతిమాలుకున్నారు కాబట్టి, అక్కడి ప్రజలను ఆయన కలుసుకునే అవకాశాలు దరిదాపుగా లేవు. పందులు చావడం గురించి ఎలాంటి విమర్శైనా తలెత్తితే, అది తాను జాలిపడి సహాయం చేసిన వ్యక్తి అక్కడ ఉండి వారికి యేసు గురించి సాక్ష్యమివ్వడం వల్ల సమసిపోయే అవకాశం ఉంది.​—⁠మార్కు 5:​1-20; లూకా 8:​26-39.

2:​28​—⁠యేసు “విశ్రాంతిదినమునకును ప్రభువు” అని ఎందుకు పిలువబడ్డాడు? “ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలది” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (హెబ్రీ. 10:⁠1) ఆరు పనిదినాల తర్వాత వచ్చేది విశ్రాంతి దినమని ధర్మశాస్త్రం పేర్కొంది, యేసు ఆ రోజునే స్వస్థపర్చే కార్యాలు అనేకం చేశాడు. ఇది సాతాను క్రూర పరిపాలన ముగిసిన తర్వాత, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో మానవజాతి అనుభవించే శాంతియుతమైన విశ్రాంతికి, ఇతర ఆశీర్వాదాలకు పూర్వఛాయగా ఉంది. అందుకే ఆ రాజ్యానికి రాజైన యేసు, “విశ్రాంతి దినమునకు ప్రభువు” అని పిలువబడ్డాడు.​—⁠మత్త. 12:⁠8; లూకా 6:⁠5.

3:⁠5; 7:​34; 8:⁠12​—⁠మార్కుకు యేసు మనోభావాల గురించి ఎలా తెలిసివుంటుంది? మార్కు, యేసు 12 మంది అపొస్తలుల్లో ఒకడు కాదు, కనీసం యేసు సన్నిహిత సహచరుడు కూడా కాదు. ప్రాచీన పారంపర్యగాథల ప్రకారం, మార్కుకు అత్యంత సన్నిహిత సహవాసియైన అపొస్తలుడైన పేతురే ఆయనకు ఎక్కువమేరకు సమాచారాన్ని అందజేశాడు.​—⁠1 పేతు. 5:​13.

6:​51, 52​—⁠శిష్యులు గ్రహించలేకపోయిన “రొట్టెలనుగూర్చిన సంగతి” ఏమిటి? ఈ వచనాల్లో పేర్కొనబడిన సంఘటనకు కొన్ని గంటల ముందే యేసు కేవలం ఐదు రొట్టెలు, రెండు చేపలతో 5,000 మంది పురుషులకేకాక, స్త్రీలకు పిల్లలకు ఆహారం పెట్టాడు. ఆ సంఘటన నుండి వారు గ్రహించి ఉండాల్సిన “రొట్టెలనుగూర్చిన సంగతి” ఏమిటంటే, యేసు అద్భుతాలు చేసేందుకు యెహోవా దేవుడు ఆయనకు శక్తినిచ్చాడు అనేదే. (మార్కు 6:​41-44) యేసుకు ఇవ్వబడిన ఆ గొప్పశక్తిని వారు గ్రహించివుంటే, ఆయన అద్భుతరీతిగా నీళ్లపై నడిచినప్పుడు వారంతగా ఆశ్చర్యపోయుండేవారు కాదు.

8:​22-26​—⁠యేసు గుడ్డివాని కన్నులను ఎందుకు రెండు దశల్లో బాగుచేశాడు? ఆ వ్యక్తిపట్ల యేసుకున్న కనికరాన్నిబట్టి అలా చేసివుంటాడు. ఎంతోకాలంగా చీకటికి అలవాటుపడిన గుడ్డివానిని రెండుదశల్లో బాగుచేయడం, ఆయన కన్నులు సూర్యుని ప్రకాశవంతమైన వెలుగుకు నెమ్మదిగా అలవాటుపడేందుకు సహాయం చేసివుంటుంది.

మనకు పాఠాలు:

2:​18; 7:​11-12; 12:​18; 13:⁠3. మార్కు యూదేతర పాఠకులకు తెలియని ఆచారాలు, పదాలు, నమ్మకాలు, స్థలాలను వివరించాడు. పరిసయ్యులు “ఉపవాసము” చేసేవారని, కొర్బాను అంటే “దేవార్పితమని,” సద్దూకయ్యులు “పునరుత్థానము లేదని” చెబుతారని, “ఒలీవల కొండమీద” నుండి “దేవాలయము” కనబడేదని ఆయన స్పష్టం చేశాడు. మెస్సీయ వంశావళి​పట్ల ప్రధానంగా యూదులకే ఆసక్తి ఉంటుంది కాబట్టి, ఆయన దానిని రాయకుండా వదిలేశాడు. ఈ విషయంలో మార్కు మనకు మాదిరినుంచాడు. మనం క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు లేదా సంఘ కూటాల్లో ప్రసంగాలు ఇస్తున్నప్పుడు, మన శ్రోతల నేపథ్యాన్ని దృష్టిలోపెట్టుకోవాలి.

3:​21. యేసు బంధువులు అవిశ్వాసులు. కాబట్టి తమ విశ్వాసం కారణంగా అవిశ్వాసులైన తమ కుటుంబ సభ్యులనుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న లేదా అపహసించ​బడుతున్న వ్యక్తులపట్ల యేసుకు సహానుభూతి ఉంది.

3:​31-35. యేసు తన బాప్తిస్మం సమయంలో దేవుని ఆత్మసంబంధ కుమారుడయ్యాడు, “పైనున్న యెరూషలేము” ఆయన తల్లి. (గల. 4:​26) అప్పటినుండి యేసు భూమిపై ఉన్న తన కుటుంబం కన్నా తన శిష్యులకే మరింతగా చేరువయ్యాడు. ఇది మన జీవితాల్లో సత్యారాధనా సంబంధిత విషయాలకే ప్రథమ స్థానమివ్వాలని ఉపదేశిస్తోంది.​—⁠మత్త. 12:​46-50; లూకా 8:​19-21.

8:​32-34. మనం త్యాగపూరితంగా ఉండనవసరం లేదని ఎవరైనా మనల్ని పురికొల్పితే, వెంటనే మనమా పురికొల్పు వెనుకున్న ఉద్దేశాన్ని పసిగట్టి దానిని త్రోసిపుచ్చాలి. క్రీస్తు అనుచరుడు ‘తన్నుతాను ఉపేక్షించుకోవడానికి’ అంటే తన స్వార్థపూరిత కోరికల్ని, లక్ష్యాలను త్యజించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆయన ‘తన హింసాకొయ్యను ఎత్తుకోవడానికి’ అంటే క్రైస్తవునిగా ఉన్నందుకు అవసరమైతే అవమానాలను లేదా హింసను ఎదుర్కొనడానికి లేదా మరణించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. యేసు ఉంచిన మాదిరికి అనుగుణంగా జీవిస్తూ ఆయనను ‘వెంబడిస్తూనే’ ఉండాలి. మనం శిష్యులుగా ఉండాలంటే క్రీస్తుయేసు చూపించిన స్వయంత్యాగ స్వభావాన్ని అలవర్చుకుని, దానిని కాపాడుకోవాలి.​—⁠మత్త. 16:​21-25, NW; లూకా 9:​22, 23, NW.

9:​24. మన విశ్వాసం గురించి ఇతరులకు చెప్పడానికిగాని, ఆ విశ్వాసాన్ని వృద్ధిచేయమని ప్రార్థించడానికిగాని సిగ్గుపడకూడదు.​—⁠లూకా 17:⁠5.

ఆఖరి నెల

(మార్కు 10:1–16:⁠8)

సా.శ. 32వ సంవత్సరం చివరలో యేసు “యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికి” వెళ్లినప్పుడు, ఆయనను చూడడానికి ప్రజలు మళ్ళీ గుంపులు గుంపులుగా వచ్చారు. (మార్కు 10:⁠1) అక్కడ ప్రకటనాపనిని ముగించుకుని ఆయన యెరూషలేముకు బయలుదేరాడు.

నీసాను నెల 8వ తేదీన యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన ఒక ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక స్త్రీ వచ్చి ఆయన తలపై పరిమళభరితమైన తైలాన్ని వేసింది. యేసు విజయోత్సాహంతో యెరూషలేములోకి ప్రవేశించడం దగ్గరి నుండి ఆయన పునరుత్థానం చేయబడేంత వరకు జరిగిన సంఘటనలు కాలక్రమానుసారంగా రాయబడ్డాయి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

10:​17, 18​—⁠యేసు తనను “సద్బోధకుడా” అని సంబోధించిన వ్యక్తిని ఎందుకు సరిదిద్దాడు? అంత గౌరవప్రదమైన పదాన్ని తిరస్కరించడం ద్వారా యేసు యెహోవాకే ఘనత చెందాలని, సద్విషయాలన్నింటికీ సత్యదేవుడే మూలా​ధారమని చూపించాడు. అంతేకాక, సమస్తాన్ని సృష్టించిన యెహోవా దేవునికే మంచి చెడుల విషయంలో ప్రమాణాలను నెలకొల్పే హక్కు ఉందనే ప్రాథమిక సత్యాన్ని కూడా యేసు స్పష్టం చేశాడు.​—⁠మత్త. 19:​16, 17; లూకా 18:​18, 19.

14:⁠25​—⁠యేసు తన నమ్మకమైన అపొస్తలులతో, “నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అన్నప్పుడు ఆయన మాటల భావమేమిటి? పరలోకంలో అక్షరార్థంగా ద్రాక్షారసం ఉందని యేసు చెప్పడంలేదు. అయితే కొన్నిసార్లు ద్రాక్షారసం అనే పదాన్ని సంతోషాన్ని సూచించడానికి వాడతారు కాబట్టి, యేసు పునరుత్థానం చేయబడిన తన అభిషిక్త అనుచరులతో రాజ్యంలో కలిసివుండడంలోని సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు.​—⁠కీర్త. 104:​15; మత్త. 26:​29.

14:​51, 52​—⁠“దిగంబరుడై పారిపోయిన” యౌవనుడు ఎవరు? మార్కు ఒక్కడే ఈ సంఘటనను ప్రస్తావించాడు కాబట్టి, ఆయన తన గురించే మాట్లాడుతున్నాడని చెప్పడం సహేతుకం.

15:​34​—⁠యేసు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి” అని అనడం ఆయన విశ్వాసరాహిత్యాన్ని చూపిస్తోందా? లేదు. యేసు ఆ మాటలు ఎందుకు అన్నాడో మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా, తన కుమారుని యథార్థత పూర్తిగా పరీక్షించబడేలా యెహోవా తన కాపుదలను తీసేసినట్లు యేసుకు తెలిసిందని ఆయన మాటలనుబట్టి అర్థమౌతోంది. అదేకాక, కీర్తన 22:⁠1లో తన గురించి ప్రవచించబడిన మాటలను నెరవేర్చడం కోసం కూడా యేసు ఆ మాటలను పలికి ఉండవచ్చు.​—⁠మత్త. 27:​46.

మనకు పాఠాలు:

10:​6-9. భార్యాభర్తలు కలిసివుండాలనేది దేవుని సంకల్పం. కాబట్టి, భార్యాభర్తలు తొందరపడి విడాకులు తీసుకునే బదులు, తమ వివాహంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవడానికి బైబిల్లోని సూత్రాలను అన్వయించుకోవడానికి కృషిచేయాలి.​—⁠మత్త. 19:​4-6.

12:​41-44. సత్యారాధనకు మద్దతిచ్చే విషయంలో మనం నిస్వార్థంగా ఉండాలని బీద విధవరాలి ఉదాహరణ మనకు ఉపదేశిస్తోంది.

[29వ పేజీలోని చిత్రం]

తానెలా బాగయ్యాడో వెళ్ళి తన బంధువులకు చెప్పమని యేసు ఇతనికి ఎందుకు చెప్పాడు?