కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా త్రోవల్లో నడవండి

యెహోవా త్రోవల్లో నడవండి

యెహోవా త్రోవల్లో నడవండి

“యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.”​—⁠కీర్త. 128:⁠1.

అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించినంత మాత్రాన మనం సంతోషంగా ఉన్నామని దానర్థం కాదని మీరు నిస్సందేహంగా అంగీకరిస్తారు.

2 అయితే, సంతోషంగా ఉండడం సాధ్యమే. “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు” అని కీర్తన 128:⁠1 చెబుతోంది. దేవుణ్ణి ఆరాధించడమే కాక, ఆయన చిత్తంచేస్తూ ఆయన మార్గాల్లో నడవడంవల్ల మనం సంతోషంగా ఉంటాం. మన ప్రవర్తనమీద, మనం కనబరిచే లక్షణాలమీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపించగలదు?

నమ్మకస్థులుగా ఉండండి

3యెహోవాపట్ల భయభక్తులుగలవారు ఆయనలాగే నమ్మదగినవారు. యెహోవా, ప్రాచీన ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాడు. (1 రాజు. 8:​56) మనం చేసిన వాగ్దానాల్లో దేవునికి మనం చేసుకున్న సమర్పణ ప్రాముఖ్యమైనది, మనం పదేపదే ప్రార్థించడం ద్వారా ఆ వాగ్దానాన్ని నిలుపుకోగలుగుతాం. మనం కీర్తనకర్త దావీదులాగే ఇలా ప్రార్థించవచ్చు: “దేవా, నీవు నా మొక్కుబడుల నంగీకరించి యున్నావు. . . . దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.” (కీర్త. 61:​5, 8; ప్రసం. 5:​4-6) మనం దేవుని స్నేహితులుగా ఉండాలంటే నమ్మకస్థులుగా ఉండాలి.​—⁠కీర్త. 15:​1, 4.

4 ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో, యెఫ్తా యెహోవా తనకు అమ్మోనీయులమీద విజయాన్నిస్తే, తాను యుద్ధభూమి నుండి తిరిగివస్తుండగా తనకు మొదట ఎదురైన దానిని “దహనబలిగా” అర్పిస్తానని మొక్కుకున్నాడు. ఆయన ఒక్కగానొక్క కూతురే ఆయనకు ఎదురైంది. యెహోవాపట్ల విశ్వాసంతో యెఫ్తా, ఆయన అవివాహిత కుమార్తె ఆ మొక్కుబడి చెల్లించారు. ఇశ్రాయేలీయులు వివాహాన్ని, పిల్లలు కనడాన్ని గొప్ప గౌరవంగా పరిగణించినా, యెఫ్తా కుమార్తె ఇష్టపూర్వకంగా అవివాహితగా ఉంటూ, యెహోవా ఆలయ గుడారంలో పవిత్రసేవ చేసే అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.​—⁠న్యాయా. 11:​28-40.

5 దైవభక్తిగల హన్నా తాను నమ్మకస్థురాలని నిరూపించుకుంది. ఆమె లేవీయుడైన తన భర్త ఎల్కానాతో, ఆయన రెండో భార్య అయిన పెనిన్నాతో ఎఫ్రాయిములోని పర్వత ప్రాంతంలో నివసించింది. పెనిన్నా అనేకమంది పిల్లలను కన్నది కాబట్టి గొడ్రాలైన హన్నాను మాటలతో ఎత్తిపొడిచేది, ప్రాముఖ్యంగా వాళ్ల కుటుంబం ఆలయ గుడారానికి వెళ్లినప్పుడు ఆమె అలా చేసేది. అలాంటి ఒక సందర్భంలో, హన్నా తానొక కుమారుణ్ణి కంటే అతణ్ణి యెహోవాకు ఇస్తానని మొక్కుకుంది. కొంతకాలానికి ఆమె గర్భవతియై ఒక బాలుణ్ణి కన్నది, ఆమె ఆ బాలునికి సమూయేలు అనే పేరు పెట్టింది. సమూయేలు పాలువిడిచినప్పుడు ఆయన “బ్రదుకు దినము లన్నిటను” యెహోవాను సేవించేలా హన్నా షిలోహులోని ఆలయ గుడారంలో దేవునికి ఆయనను సమర్పించింది. (1 సమూ. 1:​11) కొంతకాలానికి తనకు మరికొంతమంది పిల్లలు పుడతారని తెలియకపోయినా ఆమె తన మొక్కుబడిని చెల్లించింది.​—⁠1 సమూ. 2:​20, 21.

6 మొదటి శతాబ్దపు క్రైస్తవుడైన తుకికు నమ్మకస్థుడు, “నమ్మకమైన పరిచారకుడు.” (కొలొ. 4:⁠7) తుకికు అపొస్తలుడైన పౌలుతోపాటు మాసిదోనియ మీదుగా గ్రీసు నుండి ఆసియా మైనరుకు ప్రయాణించి బహుశా యెరూషలేముకు వెళ్లివుండవచ్చు. (అపొ. 20:​2-4) యూదాలోని అవసరంలోవున్న తోటి విశ్వాసుల కోసం విరాళం సేకరించే పనిలో తీతుకు సహాయం చేసిన ‘సహోదరుడు’ ఆయనే కావచ్చు. (2 కొరిం. 8:​18, 19; 12:​18) పౌలు రోములో మొదటి​సారిగా చెరసాలలో వేయబడినప్పుడు తాను రాసిన పత్రికలను, నమ్మదగిన ప్రతినిధి అయిన తుకికు ద్వారా ఎఫెసు, కొలొస్సయిలోని తోటి విశ్వాసులకు చేరవేశాడు. (ఎఫె. 6:​21, 22; కొలొ. 4:​8, 9) పౌలు రోములో రెండవసారి చెరసాలలో వేయబడినప్పుడు ఆయన తుకికును ఎఫెసుకు పంపించాడు. (2 తిమో. 4:​12) మనం నమ్మకస్థులుగా ఉంటే, మనం కూడా యెహోవా సేవలో ఆశీర్వాదాలను చవిచూస్తాం.

7మనం నమ్మదగిన స్నేహితులుగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. (సామె. 17:​17) సౌలు రాజు కుమారుడైన యోనాతాను దావీదుకు స్నేహితుడయ్యాడు. దావీదు గొల్యాతును చంపాడని యోనాతాను తెలుసుకున్నప్పుడు “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.” (1 సమూ. 18:​1, 3) సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు దాని గురించి దావీదును​ ఆయన హెచ్చరించాడు కూడా. దావీదు పారిపోయిన తర్వాత, యోనాతాను ఆయనను కలుసుకొని ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాడు. దావీదు గురించి సౌలుతో మాట్లాడడంవల్ల యోనాతానుకు దాదాపు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది, అయినా ఆ ఇద్దరు స్నేహితులు మళ్లీ కలుసుకొని తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. (1 సమూ. 20:​24-41) వారు చివరిసారిగా కలుసుకున్నప్పుడు యోనాతాను “దేవునిబట్టి” దావీదును బలపర్చాడు.​—⁠1 సమూ. 23:​16-18.

8 యోనాతాను ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో మరణించాడు. (1 సమూ. 31:⁠6) దావీదు ఒక విలాపగీతంలో ఇలా పాడాడు: “నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతి​మనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.” (2 సమూ. 1:​26) వారి మధ్య ఉన్న ప్రేమ స్నేహితుల మధ్య ఉండే ఆప్యాయతే కానీ దుర్నీతికర ఉద్దేశాలతో కూడుకున్నది కాదు. దావీదు, యోనాతానులు ప్రాణ స్నేహితులు.

ఎల్లప్పుడూ “వినయమనస్కులు”గా ఉండండి

9దేవుని స్నేహితులుగా ఉండాలంటే, మనం “వినయమనస్కులు”గా ఉండాలి. (1 పేతు. 3:⁠8; కీర్త. 138:⁠6) వినయాన్ని కనబరచడం ఎంత ప్రాముఖ్యమో న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో చూపించబడింది. గిద్యోను కుమారుడైన యోతాము ఇలా చెప్పాడు: “చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సుకలిగి బయలుదే​[రాయి].” ఆ స్థానానికి ఒలీవ, అంజూరపు చెట్ల పేర్లతోపాటు, ద్రాక్షావల్లి పేరు కూడా ప్రస్తావించబడింది. తోటి ఇశ్రాయేలీయులను పరిపాలించేందుకు అర్హులైనా అలా పరిపాలించేందుకు ఇష్ట​పడనివారిని అవి సూచిస్తున్నాయి. అయితే వంటచెరుకుగా మాత్రమే పనికొచ్చే ముండ్ల పొద ఇతరులమీద ఆధిపత్యం చెలాయించడానికి ఇష్టపడింది, ఆ ముండ్ల పొద గర్విష్ఠియైన అభీమెలెకు రాజ్యాధికారాన్ని సూచిస్తుంది. అతడు ‘మూడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులమీద ఏలికగా’ ఉన్నా, అకాలమరణాన్ని అనుభవించాడు. (న్యాయా. 9:​8-15, 22, 50-54)​ “వినయమనస్కులు”గా ఉండడం ఎంత మంచిదో కదా!

10 సా.శ. మొదటి శతాబ్దంలో గర్విష్ఠియైన యూదయ రాజైన హేరోదు అగ్రిప్పకూ, తూరు సీదోనువాసులకూ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంత​వాసులు ఆయనతో సమాధానపడాలని అనుకున్నారు. ఒక సందర్భంలో హేరోదు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారు, “ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని” కేకలు​వేశారు. హేరోదు అలాంటి స్తుతిని తిరస్కరించలేదు. అతడు “దేవుని మహిమపరచనందున” యెహోవా దూత అతణ్ణి మొత్తాడు. దానివల్ల అతడు ఘోరంగా మరణించాడు. (అపొ. 12:​20-23) మనం బైబిలు సత్యాలను కొంతమట్టుకు నైపుణ్యంగా ఇచ్చే ప్రసంగీకులమైతే లేక బోధకులమైతే అప్పుడేమిటి? అలాంటప్పుడు మనకు ఆ అవకాశాలను అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతిద్దాం.​—⁠1 కొరిం. 4:​6, 7; యాకో. 4:⁠6.

నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి

11మనం వినయంతో యెహోవా మార్గాల్లో నడిస్తే ఆయన మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాడు. (ద్వితీ. 31:​6-8, 23) ఆదాము మొదలుకొని ఏడవవాడైన హనోకు దుష్టులైన తన సమకాలీనుల మధ్య నీతియుక్తంగా ప్రవర్తించడం ద్వారా ధైర్యంగా దేవునితో నడిచాడు. (ఆది. 5:​21-24) వారు భక్తిహీనంగా మాట్లాడారు, భక్తిహీనంగా ప్రవర్తించారు కాబట్టి వారికి శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వడానికి యెహోవా హనోకును బలపర్చాడు. (యూదా 14, 15 చదవండి.) దేవుని తీర్పులను ప్రకటించడానికి కావాల్సిన ధైర్యం మీకుందా?

12 యెహోవా, నోవహు కాలంలో భూవ్యాప్తంగా తీసుకొచ్చిన జలప్రళయంలో భక్తిహీనులకు తీర్పుతీర్చాడు. అయితే, మన కాలంలోని భక్తిహీనులను వేవేలుగావున్న దేవుని పరిశుద్ధులు త్వరలో నాశనం చేయనున్నారు కాబట్టి, హనోకు ప్రవచనం మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. (ప్రక. 16:​14-16; 19:​11-16) మన ప్రార్థనలకు జవాబుగా యెహోవా తన సందేశాన్ని ప్రకటించడానికి మనకు ధైర్యాన్నిస్తాడు, ఆ సందేశం తన తీర్పులకు సంబంధించినదైనా లేక రాజ్య పరిపాలనలోని ఆశీర్వాదాలకు సంబంధించినదైనా ​ఆయనలా చేస్తాడు.

13 మానసిక కృంగుదలకు గురిచేసే సమస్యలను ఎదుర్కోవడానికి మనకు దేవుడిచ్చే ధైర్యం, బలం అవసరం. ఏశావు ఇద్దరు హిత్తీయ స్త్రీలను పెండ్లి చేసుకున్నప్పుడు, “వీరు [ఆయన తల్లిదండ్రులైన] ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.” రిబ్కా చివరకు, “హేతు కుమార్తెల​వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని [మన కుమారుడైన] యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనం?” అని కూడా ఫిర్యాదుచేసింది. (ఆది. 26:​34, 35; 27:​46) ఆ విషయంలో ఇస్సాకు చర్య తీసుకొని యెహోవా ఆరాధకుల్లో భార్యను కనుగొనడానికి యాకోబును పంపించాడు. ఇస్సాకు రిబ్కాలు ఏశావు చేసిన​దానిని మార్చలేకపోయినా, వారు తనకు నమ్మకంగా ఉండేలా దేవుడు వారికి జ్ఞానాన్ని, ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహించాడు. మనకు కావాల్సిన సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తే ఆయన మనకు కూడా వాటిని అనుగ్రహిస్తాడు.​—⁠కీర్త. 118:⁠5.

14 శతాబ్దాలు గడిచిన తర్వాత, ఇశ్రాయేలీయ చిన్న బాలికను సిరియనుల దండు చెరగా తీసుకొనివెళ్లారు, ఆ బాలిక కుష్ఠరోగమున్న సిరియనుల సైన్యాధిపతి అయిన నయమాను ఇంట్లో దాసురాలైంది. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన అద్భుతాల గురించి విన్న ఆ బాలిక ధైర్యంగా ​నయమాను భార్యతో, ‘నా యేలినవాడు ఇశ్రాయేలు దేశానికి వెళ్తే యెహోవా ప్రవక్త ఆయన కుష్ఠరోగమును బాగుచేస్తాడు’ అని తెలియజేసింది. ఆ బాలిక చెప్పినట్లే నయమాను ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి, అద్భుతరీతిలో స్వస్థపరచబడ్డాడు. (2 రాజు. 5:​1-3) ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు, మరితరులకు సాక్ష్యమివ్వడానికి కావాల్సిన ధైర్యం కోసం యెహోవామీద ఆధారపడే యౌవనస్థులకు ఆ బాలిక ఎంత చక్కని మాదిరో కదా!

15 దేవుడిచ్చే ధైర్యంవల్ల మనం హింసను సహించగలుగుతాం. అహాబు గృహనిర్వాహకుడు, ప్రవక్త అయిన ఏలియా సమకాలీనుడైన ఓబద్యా విషయాన్ని పరిశీలించండి. యెజెబెలు రాణి దేవుని ప్రవక్తలను చంపమని ఆజ్ఞాపించినప్పుడు, ఆయన నూరుమంది ప్రవక్తలను “గుహకు ఏబదేసి మంది చొప్పున” దాచివుంచాడు. (1 రాజు. 18:​13; 19:​18) ఓబద్యా యెహోవా ప్రవక్తలకు సహాయం చేసినట్లే మీరు హింసననుభవిస్తున్న తోటి క్రైస్తవులకు ధైర్యంగా సహాయం చేయగలరా?

16 మనం హింసించబడితే, యెహోవా మనతో ఉంటాడనే ధైర్యంతో మనం ఉండవచ్చు. (రోమా. 8:​35-39) ఎఫెసు​లోని నాటకశాలలో పౌలు తోటి పనివారైన అరిస్తర్కు, గాయిలు బహుశా వేల సంఖ్యలో ఉన్న అల్లరిమూకను ఎదుర్కొన్నారు. దేమేత్రియ అనే కంసాలి ఆ గందరగోళాన్ని సృష్టించాడు. ఆయనతోపాటు ఇతర కంసాలులు అర్తెమిదేవి వెండి గుళ్లను నిర్మించేవారు. పౌలు ప్రకటనా పనివల్ల ఆ పట్టణ​వాసుల్లో చాలామంది విగ్రహారాధనను విడిచిపెట్టారు కాబట్టి లాభసాటియైన వారి వ్యాపారం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఆ అల్లరిమూక అరిస్తర్కు, గాయిలను నాటక​శాలలోకి ఈడ్చుకెళ్లి “ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి” అని రౌద్రంతో కేకలు వేశారు. అరిస్తర్కు, గాయులు తమకు మరణం తప్పదనుకున్నారు, అయితే కరణము ఆ సమూహాన్ని సముదాయించాడు.​—⁠అపొ. 19:​23-41.

17 మీకు అలాంటి అనుభవమే ఎదురైతే, మీరు అంతగా కష్టాలులేని జీవితాన్ని గడపడానికి ప్రయత్నించేవారా? అరిస్తర్కు లేక గాయి ధైర్యాన్ని కోల్పోయారని ఎక్కడా రాయబడలేదు. అరిస్తర్కు థెస్సలొనీకవాసుడు కాబట్టి, సువార్త ప్రకటించడంవల్ల హింస ఎదురుకావచ్చని ఆయనకు తెలుసు. కొంతకాలం క్రితం, పౌలు ఆ ప్రాంతంలో ప్రకటించినప్పుడు అలజడి చెలరేగింది. (అపొ. 17:⁠5; 20:⁠4) అరిస్తర్కు, గాయిలు యెహోవా మార్గాల్లో నడిచారు కాబట్టి, హింసను సహించడానికి దేవుడు వారికి బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాడు.

ఇతరుల కార్యాలపట్ల శ్రద్ధ కనబరచడం

18మనమిప్పుడు హింసించబడుతున్నా లేక హింసించబడకున్నా, మనం తోటి విశ్వాసులపట్ల శ్రద్ధ కనబరచాలి. ప్రిస్కిల్లా, అకులాలు ఇతరుల ‘కార్యాలను చూశారు’ లేదా వారి కార్యాలపట్ల శ్రద్ధ కనబరిచారు. (ఫిలిప్పీయులకు 2:⁠4 చదవండి.) ఆదర్శవంతులైన ఆ దంపతులు ఎఫెసులోని తమ ఇంట్లో పౌలుకు బస ఏర్పాటు చేసివుండవచ్చు, ఆ పట్టణంలో ముందు ప్రస్తావించబడిన గందరగోళాన్ని దేమేత్రియ అనే కంసాలి సృష్టించాడు. దానివల్ల ప్రిస్కిల్లా, అకులాలు పౌలు కోసం ‘తమ ప్రాణాలను ఇవ్వడానికి తెగించాల్సిన’ పరిస్థితి ఏర్పడివుండవచ్చు. (రోమా. 16:​3, 4; 2 కొరిం. 1:⁠8) నేడు, హింసించబడుతున్న మన సహోదరుల​పట్ల మనకు శ్రద్ధ ఉంది కాబట్టి, మనం “పాములవలె వివేకులు”గా ఉంటాం. (మత్త. 10:​16-18) మనం మన పనిని జాగ్రత్తగా చేస్తాం, అంతేకాక మన సహోదరుల పేర్లు లేక ఇతర సమాచారం హింసించేవారికి వెల్లడిచేసి వారికి నమ్మక​ద్రోహం చేయం.

19 మనం ఇతరుల కార్యాలపట్ల శ్రద్ధ కనబరచేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొంతమంది క్రైస్తవులకు కొన్ని అవసరాలు ఉండవచ్చు, వాటిని మనం తీర్చవచ్చు. (ఎఫె. 4:​27-28; యాకో. 2:​14-17) యొప్పేలోని మొదటి శతాబ్దపు సంఘంలో, ఉదార స్వభావంగల దొర్కా అనే స్త్రీ ఉండేది. (అపొస్తలుల కార్యములు 9:​36-42 చదవండి.) దొర్కా “సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి​యుండెను.” ఆమె బహుశా, అవసరంలోవున్న విధవరాండ్రకు వస్త్రాలు కుట్టడం వంటి మంచి పనులు చేసివుండవచ్చు. సా.శ. 36లో ఆమె మరణించినప్పుడు విధవరాండ్రు ఎంతో బాధపడ్డారు. దొర్కాను పునరుత్థానం చేయడానికి దేవుడు అపొస్తలుడైన పేతురును ఉపయోగించాడు, బహుశా ఆమె భూమ్మీద తన శేషజీవితాన్ని సువార్త ప్రకటిస్తూ, ఇతరుల కోసం సత్క్రియలు చేస్తూ ఆనందంగా గడిపివుండవచ్చు. అలాంటి నిస్వార్థ క్రైస్తవ స్త్రీలు మన మధ్య ఉన్నందుకు మనమెంత ఆనందిస్తామో కదా!

20ఇతరులను ప్రోత్సహించడం ద్వారా మనం వారి కార్యాలపట్ల శ్రద్ధ కనబరుస్తాం. (రోమా. 1:​11, 12) పౌలు తోటి పనివాడైన సీల ఇతరులను ప్రోత్సహించాడు. దాదాపు సా.శ. 49 నాటికి సున్నతి వివాదాంశం గురించి నిర్ణయించబడిన తర్వాత యెరూషలేములోని పరిపాలక సభ ఇతర ప్రాంతాల్లోని విశ్వాసులకు ఒక పత్రిక చేరవేయడానికి ప్రతినిధులను పంపించింది. సీల, యూదా, బర్నబా, పౌలు ఆ పత్రికను అంతియొకయకు తీసుకువెళ్లారు. అక్కడ సీల, యూదాలు “పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.”​—⁠అపొ. 15:​32.

21 ఆ తర్వాత, పౌలు, సీల ఫిలిప్పీలో ఉన్నప్పుడు చెరసాలలో వేయబడ్డారు, కానీ భూకంపంవల్ల వారు బంధవిముక్తులయ్యారు. చెరసాల నాయకునికి సాక్ష్యమిచ్చిన తర్వాత ఆయనతోపాటు ఆయన ఇంటివారు విశ్వాసులుగా మారడాన్ని చూసినప్పుడు వారు ఎంతగా సంతోషించివుంటారో కదా! ఆ పట్టణాన్ని విడిచివెళ్లే ముందు పౌలు, సీల అక్కడున్న సహోదరులను ప్రోత్సహించారు. (అపొ. 16:​12, 40) పౌలు, సీలల్లాగే మీరు మీ వ్యాఖ్యానాల ద్వారా, ప్రసంగాల ద్వారా, క్షేత్ర సేవలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా ఇతరులను ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. మీ దగ్గర “బోధవాక్యము” లేక ప్రోత్సాహాన్నిచ్చే మాట ఉన్నట్లయితే, దానిని ‘చెప్పడానికి’ వెనుకాడకండి.​—⁠అపొ. 13:​15.

యెహోవా మార్గాల్లో నడుస్తూ ఉండండి

22 “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అయిన యెహోవా వాక్యంలో నమోదుచేయబడిన నిజ జీవిత వృత్తాంతాల విషయంలో మనమెంత కృతజ్ఞత కనబరచాలో కదా! (2 కొరిం. 1:⁠3) మనం ఈ అనుభవాల నుండి ప్రయోజనం పొందాలంటే, బైబిల్లోని పాఠాలను మన జీవితాల్లో అన్వయించుకొని దేవుని పరిశుద్ధాత్మ మనల్ని నడిపించనివ్వాలి.​—⁠గల. 5:​22-25.

23 బైబిలు వృత్తాంతాలను ధ్యానించడం ద్వారా మనం దైవిక లక్షణాలను కనబరచగలుగుతాం. అది “జ్ఞానమును తెలివిని ఆనందమును” అనుగ్రహించే యెహోవాతో మన సంబంధాన్ని బలపరుస్తుంది. (ప్రసం. 2:​26) దానివల్ల మనం దేవుని ప్రియమైన హృదయాన్ని సంతోషపరచవచ్చు. (సామె. 27:​11) యెహోవా మార్గాల్లో నడుస్తూ ఉండడం ద్వారా ఆయన హృదయాన్ని సంతోషపరచాలనే కృతనిశ్చయాన్ని మనం కలిగివుందాం.

మీరెలా జవాబిస్తారు?

• మీరు నమ్మకస్థులుగా ఎలా ఉండవచ్చు?

• మనం “వినయమనస్కులు”గా ఎందుకు ఉండాలి?

• ధైర్యంగా ఉండేందుకు బైబిలు వృత్తాంతాలు మనకెలా సహాయం చేయగలవు?

• మనం ఏయే విధాలుగా ఇతరుల కార్యములపట్ల శ్రద్ధ కనబరచవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. సంతోషంగా ఉండడం సాధ్యమని మనమెందుకు నమ్మవచ్చు?

3. నమ్మకస్థులుగా ఉండడానికీ దేవునికి మనం చేసుకున్న సమర్పణకూ మధ్య ఎలాంటి సంబంధం ఉంది?

4. యెఫ్తా యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని ఆయన, ఆయన కుమార్తె ఎలా దృష్టించారు?

5. హన్నా తాను నమ్మకస్థురాలినని ఎలా నిరూపించుకుంది?

6. తుకికు నమ్మకస్థుడని ఎలా చూపించబడింది?

7, 8. దావీదు, యోనాతానులు ప్రాణ స్నేహితులని మనమెందుకు చెప్పవచ్చు?

9. వినయానికున్న ప్రాముఖ్యత న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఎలా చూపించబడింది?

10. హేరోదు ‘దేవుణ్ణి మహిమపరచని’ సంఘటన నుండి మీరేమి నేర్చుకున్నారు?

11, 12. యెహోవా తన సేవకులకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాడని హనోకు అనుభవం ఎలా చూపిస్తోంది?

13. మనోవేదన కలిగించే సమస్యలను ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన ధైర్యాన్ని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనమెందుకు నమ్మవచ్చు?

14. ఇశ్రాయేలీయ చిన్న బాలిక ధైర్యాన్ని ఎలా కనబరిచింది?

15. అహాబు గృహనిర్వాహకుడైన ఓబద్యా ధైర్యంగా ఏ చర్య తీసుకున్నాడు?

16, 17. హింస ఎదురైనప్పుడు అరిస్తర్కు, గాయి ఎలా స్పందించారు?

18. ప్రిస్కిల్లా, అకులాలు ఎలా ఇతరుల ‘కార్యాలపట్ల’ శ్రద్ధ కనబరిచారు?

19. దొర్కా ఇతరుల కోసం ఎలాంటి సత్క్రియలు చేసింది?

20, 21 (ఎ) ప్రోత్సహించడానికీ ఇతరుల కార్యాలపట్ల శ్రద్ధ కనబరచడానికీ మధ్య ఎలాంటి సంబంధముంది? (బి) ఇతరులను ప్రోత్సహించేవారిగా ఉండేందుకు మీరేమి చేయవచ్చు?

22, 23. బైబిలు వృత్తాంతాల నుండి మనం నిజంగా ఎలా ప్రయోజనం పొందవచ్చు?

[8వ పేజీలోని చిత్రం]

యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని చెల్లించడం కష్టమైనా నమ్మకస్థుడైన యెఫ్తా, ఆయన కుమార్తె దానిని చెల్లించారు

[10వ పేజీలోని చిత్రం]

యౌవనస్థులారా, ఇశ్రాయేలీయ బాలిక నుండి మీరేమి నేర్చుకున్నారు?

[11వ పేజీలోని చిత్రం]

దొర్కా తోటి విశ్వాసుల అవసరాలను ఎలా తీర్చింది?