కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు —సర్వోత్తమ మిషనరీ

యేసుక్రీస్తు —సర్వోత్తమ మిషనరీ

యేసుక్రీస్తు—⁠సర్వోత్తమ మిషనరీ

“నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను.”​—⁠యోహా. 7:​29.

“మిషనరీ” అనే మాట విన్నప్పుడు మీకేమి గుర్తొస్తుంది? కొందరికి క్రైస్తవమత మిషనరీలు గుర్తొస్తారు. వారిలో చాలామంది తామున్న దేశాల రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో తలదూరుస్తుంటారు. కానీ ఒక యెహోవాసాక్షిగా మీకు లోకవ్యాప్తంగా వివిధ దేశాల్లో సువార్త ప్రకటించేందుకు పరిపాలక సభ పంపించిన మిషనరీలు​ గుర్తురావచ్చు. (మత్త. 24:​14)​ ఈ మిషనరీలు, యెహోవా దేవునికి సన్నిహితులై ఆయనతో విలువైన సంబంధాన్ని కలిగివుండేలా ప్రజలకు తోడ్పడే ఉదాత్తమైన సేవకోసం తమ సమయాన్ని, శక్తిని ధారపోస్తున్నారు.​—⁠యాకో. 4:⁠8.

2 “మిషనరీ,” “మిషనరీలు” అనే పదాలు తెలుగు బైబిల్లో కనిపించవు. అయితే ఎఫెసీయులు 4:13లో “సువార్తికులు” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదాన్ని “మిషనరీలు” అని కూడా అనువదించవచ్చు. యెహోవాను సర్వోత్తమ సువార్తికుడు అనవచ్చు గానీ ఆయనను సర్వోత్తమ మిషనరీ అనలేం, ఎందుకంటే ఆయనెన్నడూ ఎవరిచేత పంపించబడలేదు. అయితే యేసుక్రీస్తు తన పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతూ, “నేను ఆయన యొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను” అని చెప్పాడు. (యోహా. 7:​29) మానవులపట్ల ప్రగాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తూ యెహోవా తన అద్వితీయ కుమారుణ్ణి భూమికి పంపించాడు. (యోహా. 3:​16) “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు” యేసు భూమికి పంపించబడిన కారణాన్నిబట్టి ఆయనను సర్వోత్తమ మిషనరీ అని, అత్యుత్తమ మిషనరీ అని పిలవచ్చు. (యోహా. 18:​37) ఆయన రాజ్య సువార్తను ప్రకటించడంలో పూర్తి విజయాన్ని సాధించాడు, ఆయన సేవవల్ల చేకూరే ప్రయోజనాలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, మనం మిషనరీలుగా నియమించబడినా, నియమించబడక​పోయినా ఆయన బోధనా పద్ధతులను మన పరిచర్యలో అన్వయించుకోవచ్చు.

3 రాజ్య ప్రచారకునిగా యేసు పోషించిన పాత్ర మన మదిలోకి ఈ విధమైన ప్రశ్నలను తీసుకొస్తుంది: యేసు భూమిపై ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఆయన బోధ ఎందుకు సమర్థవంతంగా ఉంది? ఆయన పరిచర్యను ఏది విజయవంతం చేసింది?

కొత్త పరిస్థితుల్లో ప్రకటించడానికి సుముఖత చూపాలి

4 రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న ప్రాంతాలకు తరలివెళ్లే నేటి మిషనరీలు, కొందరు క్రైస్తవులు, అల్పస్థాయి జీవన ప్రమాణాలున్న పరిస్థితులకు అలవాటుపడాల్సి ఉంటుంది. కానీ, యేసు పరలోకంలో స్వచ్ఛమైన ఉద్దేశాలతో యెహోవాను సేవించే దేవదూతల మధ్య తన తండ్రితో నివసిస్తుండగా అనుభవించిన పరిస్థితులకు, ఆయన భూమ్మీద ఉన్నప్పుడు అనుభవించిన పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను మనం ఏ మాత్రం ఊహించలేం. (యోబు 38:7) భ్రష్టలోకంలో పాపులైన మానవులమధ్య జీవించడం ఎంత భిన్నంగా ఉండిందో కదా! (మార్కు 7:​20-23) యేసు తన సన్నిహిత శిష్యులమధ్య తలెత్తిన పోటీతత్వాన్ని కూడా సహించాల్సివచ్చింది. (లూకా 20:​46; 22:​24) అయితే ఆయన భూమ్మీద తానెదుర్కొన్న పరిస్థితులన్నింటితో లోపరహితంగా వ్యవహరించాడు.

5 యేసు అద్భుతరీతిలో మానవ భాష మాట్లాడడం ఆరంభించలేదు, ఆయన శిశువుగా ఉన్నప్పటి నుండి దానిని నేర్చుకోవడం ఆరంభించాడు. పరలోకంలో దేవ​దూతలను ఆజ్ఞాపించే స్థానంలో ఉండడానికీ, దీనికీ ఎంత తేడా! భూమ్మీద యేసు ‘మనుష్యుల భాషల్లో’ కనీసం ఒక భాషను ఉపయోగించాడు. అది ‘దేవదూతల భాషలకు’ పూర్తిగా భిన్నమైనది. (1 కొరిం. 13:⁠1) అయితే దయగల మాటల విషయానికొచ్చినప్పుడు, ఏ వ్యక్తీ యేసులా మాట్లాడ​లేదు.​—⁠లూకా 4:​22.

6 దేవుని కుమారుడు భూమ్మీదికి వచ్చినప్పుడు పరిస్థితులు ఇంకా ఏయే విధాలుగా మారాయో పరిశీలించండి. ఆదాము నుండి సంక్రమించిన పాపం యేసులో లేదు. అయినా, ఆయన ఆ తర్వాత తన “సహోదరులు” లేదా అభిషిక్త అనుచరులయ్యే వారిలా ఒక మనిషిగా జీవించాడు. (హెబ్రీయులు 2:​17, 18 చదవండి.) యేసు తన భూ జీవితపు చివరిరాత్రి “పండ్రెండు సేనా వ్యూహముల​కంటె ఎక్కువమంది దూతలను” పంపమని తన పరలోకపు తండ్రిని వేడుకోవడానికి నిరాకరించాడు. అయితే ప్రధానదూతయైన మిఖాయేలుగా ఆయనకు దేవదూతలపైవున్న అధికారం గురించి ఒక్కసారి ఆలోచించండి! (మత్త. 26:53; యూదా 9) నిజమే యేసు అద్భుతాలు చేశాడు, అయినా ఆయన భూమ్మీద ఉన్నప్పుడు చేసిన​వాటిని ఆయన పరలోకంలోవుండి చేయగలిగేవాటితో పోలిస్తే అవి తీసికట్టుగా ఉంటాయి.

7 ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించిన దేవుని ప్రతినిధి, తన మానవపూర్వ జీవితంలో ‘వాక్యముగా’ ఉన్న యేసే కావచ్చు. (యోహా. 1:⁠1; నిర్గ. 23:​20-23) అయితే వారు ‘దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును పొందిరిగాని దానిని గైకొనలేదు.’ (అపొ. 7:​53; హెబ్రీ. 2:​2, 3) నిజానికి, మొదటి శతాబ్దపు యూదా మతనాయకులు ధర్మశాస్త్రం యొక్క అసలు అర్థాన్ని గ్రహించలేదు. ఉదాహరణకు, సబ్బాతు నియమాన్నే పరిశీలించండి. (మార్కు 3:​4-6 చదవండి.) శాస్త్రులు, పరిసయ్యులు ‘ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు.’ (మత్త. 23:​23) అయినా యేసు వారిమీద ఆశ వదులుకొని సత్యాన్ని ప్రకటించకుండా ఉండలేదు.

8 యేసు ఇష్టపూర్వకంగా ప్రకటించాడు. ప్రజలమీదున్న ప్రేమనుబట్టి ఆయన వారికి సహాయం చేయాలని ప్రగాఢంగా కోరుకున్నాడు. సువార్త ప్రకటించాలన్న ఆసక్తిని ఆయనెన్నడూ కోల్పోలేదు. యేసు, భూమ్మీద ఉన్నప్పుడు యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉన్నాడు కాబట్టే, ఆయన “తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.” అంతేకాక, ఆయన “తాను శోధింపబడి శ్రమపొందెను గనుక [మనలాంటి] శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.”​—⁠హెబ్రీ. 2:​18; 5:​8, 9.

బోధకునిగా చక్కని శిక్షణపొందాడు

9 నేటి క్రైస్తవులను మిషనరీలుగా పంపించడానికి ముందు పరిపాలక సభ వారికి శిక్షణనిచ్చే ఏర్పాటుచేస్తుంది. యేసుక్రీస్తు శిక్షణపొందాడా? పొందాడు, అయితే ఆయన మెస్సీయగా అభిషేకించబడడానికి ముందు రబ్బీల పాఠశాలలకు వెళ్లలేదు, లేక ప్రముఖ మతనాయకుల దగ్గర ఆయన నేర్చుకోలేదు. (యోహా. 7:​15; అపొస్తలుల కార్యములు 22:⁠3 పోల్చండి.) అయినా యేసు బోధించడానికి ఎందుకు అంతలా అర్హుడయ్యాడు?

10 యేసుకు ఆయన తల్లియైన మరియ, పెంచిన తండ్రియైన యోసేపు ఏమి నేర్పించినా, పరిచర్య విషయంలో ఆయనకు ప్రధానంగా సర్వోన్నత శిక్షకుడైన యెహోవాయే శిక్షణనిచ్చాడు. దీనిగురించి యేసు ఇలా చెప్పాడు: “నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.” (యోహా. 12:​49) ఏమి బోధించాలో కుమారునికి నిర్దిష్టమైన ఉపదేశమివ్వ​బడిందని గమనించండి. భూమ్మీదికి రాకముందు యేసు తన తండ్రియిచ్చే ఉపదేశాన్ని వినడానికి నిస్సందేహంగా ఎంతో సమయం వెచ్చించాడు. ఆయన అంతకన్నా శ్రేష్ఠమైన శిక్షణ ఇంకేమి పొందగలడు?

11 సృష్టించబడిన మరుక్షణం నుండే ఆ కుమారుడు తన తండ్రితో సన్నిహిత సంబంధం కలిగివున్నాడు. యేసు తన మానవపూర్వ జీవితంలో యెహోవా మానవులతో వ్యవహరించిన విధానాన్ని గమనించడం ద్వారా వారిపట్ల దేవుని మనోవైఖరి ఏమిటో గ్రహించాడు. మానవులపట్ల దేవునికున్న ప్రేమను కుమారుడు ఎంతగా ప్రతిబింబించాడంటే, జ్ఞానస్వరూపిగా ఆయనిలా చెప్పగలిగాడు: “నరులను చూచి ఆనందించుచునుంటిని.”​—⁠సామె. 8:​22, 31.

12 కుమారుడు పొందిన శిక్షణలో క్లిష్ట పరిస్థితులతో తండ్రి ఎలా వ్యవహరించాడో గమనించడం కూడా ఉంది. ఉదాహరణకు, అవిధేయులైన ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహరించిన విధానాన్ని పరిశీలించండి. నెహెమ్యా 9:​28 ఇలా చెబుతోంది: “వారు నెమ్మదిపొందిన తరువాత నీ [యెహోవా] యెదుట మరల ద్రోహులుకాగా నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి; వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి.” యెహోవాతో కలిసిపని చేయడం ద్వారా, ఆయనను గమనించడం ద్వారా యేసు కూడా తన క్షేత్రంలోని ప్రజలపట్ల అలాంటి కనికరాన్నే కనబర్చాడు.​—⁠యోహా. 5:​19.

13 యేసు తన శిష్యులతో కనికరంతో వ్యవహరిస్తూ తాను పొందిన శిక్షణను ఆచరణలో పెట్టాడు. ఆయన మరణించక ముందు అంటే చివరి రాత్రి, ఆయనెంతో ప్రేమించిన అపొస్తలులందరూ ‘ఆయనను విడిచి పారిపోయారు.’ (మత్త. 26:​56; యోహా. 13:⁠1) అపొస్తలుడైన పేతురు ఏకంగా మూడుసార్లు ఆయనెవరో తనకు తెలియదన్నాడు! అయినాసరే, యేసు తన అపొస్తలులు తనదగ్గరకు తిరిగివచ్చేందుకు అవకాశం లేకుండా చేయలేదు. ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము.” (లూకా 22:​32) ‘అపొస్తలుల ప్రవక్తల’ పునాదిపై ఆధ్యాత్మిక ఇశ్రాయేలు విజయ​వంతంగా నిర్మించబడగా, ఆ నూతన యెరూషలేము ప్రాకారపు పునాది రాళ్లపై గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు 12 మంది నమ్మకమైన అపొస్తలుల పేర్లున్నాయి. నేటికీ, అభిషిక్త క్రైస్తవులు తమ సమర్పిత సహవాసులైన “వేరే గొఱ్ఱెల”తోపాటు దేవుని బలమైన హస్తం క్రింద, ఆయన ప్రియకుమారుని సారథ్యంలో రాజ్య ప్రకటనా సంస్థగా వర్ధిల్లుతున్నారు.​—⁠ఎఫె. 2:​20; యోహా. 10:​16; ప్రక. 21:​14.

యేసు బోధించిన విధానం

14 యేసు తాను పొందిన శిక్షణను తన అనుచరులకు బోధించడంలో ఎలా ఆచరణలో పెట్టాడు? మనం యేసు ఉపదేశాన్ని యూదా మతనాయకుల ఉపదేశంతో పోల్చినప్పుడు, యేసు బోధనా విధానపు ఔన్నత్యాన్ని మనం స్పష్టంగా చూస్తాం. శాస్త్రులు, పరిసయ్యులు ‘తమ పారంపర్యాచారము నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేశారు.’ దానికి భిన్నంగా యేసు తన సొంత అభిప్రాయాలు చెప్పలేదు, ఆయన దేవుని వాక్యానికి లేదా సందేశానికి కట్టుబడ్డాడు. (మత్త. 15:⁠6; యోహా. 14:​10) మనం కూడా అలాగే చేయాలి.

15 మరో అంశం కూడా యేసును మతనాయకుల నుండి పూర్తి భిన్నంగా ఉంచింది. శాస్త్రుల, పరిసయ్యుల గురించి ఆయనిలా చెప్పాడు: “వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పన చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” (మత్త. 23:⁠3) యేసు తాను బోధించిన దానిని ఆచరించాడు. ఇది నిజమని నిరూపించే ఒక ఉదాహరణను మనం పరిశీలిద్దాం.

16 యేసు “పరలోకమందు . . . ధనమును కూర్చు​కొనుడి” అని తన శిష్యులను ప్రోత్సహించాడు. (మత్తయి 6:​19-21 చదవండి.) యేసు స్వయంగా ఆ ఉపదేశానికి అనుగుణంగా జీవించాడా? జీవించాడు, ఎందుకంటే ఆయన తనగురించి యథార్థంగా ఇలా చెప్పగలిగాడు: “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదు.” (లూకా 9:​58) యేసు నిరాడంబరంగా జీవించాడు. ఆయన ప్రాథమికంగా రాజ్య సువార్త ప్రకటించడంలో నిమగ్నమై, భూమ్మీద ధనం కూర్చుకోవడంవల్ల కలిగే చింతలకు దూరంగా ఉండడమెలా ఉంటుందో నిరూపించాడు. ఎక్కడ ‘చిమ్మెటయైనను, తుప్పైనను తినివేయదో, దొంగలు కన్నమువేసి దొంగిలించరో’ ఆ పరలోకంలో ధనము కూర్చుకోవడమెంత ఉత్తమమో యేసు చూపించాడు. పరలోకంలో ధనము కూర్చుకొనుడని యేసు ఇచ్చిన ఉపదేశాన్ని మీరు అనుసరిస్తున్నారా?

యేసును ప్రజలకు ఆప్తునిగాచేసిన లక్షణాలు

17 ఏ లక్షణాలు యేసును అసాధారణ సువార్తికుణ్ణి చేశాయి? ఒకటి తాను సహాయంచేసిన ప్రజలపట్ల ఆయనకున్న మనోవైఖరి. యేసు ప్రతిబింబించిన యెహోవా చక్కని లక్షణాల్లో వినయం, ప్రేమ, కనికరం ఉన్నాయి. ఈ లక్షణాలు చాలామందిని యేసువైపు ఎలా ఆకర్షించాయో ​గమనించండి.

18 భూమికి వెళ్లాలనే నియామకాన్ని అందుకున్న యేసు, “మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” (ఫిలి. 2:⁠7) అది వినయంతో చేసినపని. అంతేకాక, యేసు ప్రజలను చిన్నచూపు చూడలేదు. ‘నేను పరలోకం నుండి వచ్చాను కాబట్టి మీరు నా మాట వినాలి’ అని ఎప్పుడూ అనలేదు. మెస్సీయలమని చెప్పుకున్న​వారికి భిన్నంగా, యేసు నిజమైన మెస్సీయగా తన పాత్ర గురించి డంబంగా ప్రచారం చేసుకోలేదు. కొన్నిసార్లు తానెవరో లేదా తానుచేసిన వాటిగురించి ఇతరులకు చెప్పవద్దని ప్రజలకు చెప్పాడు. (మత్త. 12:​15-21) ప్రజలు తాము గమనించిన దానినిబట్టి తనను అనుసరించడం విషయంలో వారే సొంతగా నిర్ణయించుకోవాలని యేసు కోరుకున్నాడు. తమ ప్రభువు, తాను పరలోకంలో సహవసించిన పరిపూర్ణ దేవదూతల్లా తాము కూడా ఉండాలని ఆశించనందుకు ఆయన శిష్యులెంత ప్రోత్సహించబడ్డారో కదా!

19 యేసుక్రీస్తు తన పరలోకపు తండ్రి ప్రధాన లక్షణమైన ప్రేమను కూడా కనబర్చాడు. (1 యోహా. 4:⁠8) యేసు ప్రేమతో తన ప్రేక్షకులకు బోధించాడు. ఉదాహరణకు, ఓ యువ అధికారిపట్ల ఆయన మనోభావాన్ని పరిశీలించండి. (మార్కు 10:​17-22 చదవండి.) యేసు ఆయనను “ప్రేమించి” ఆయనకు సహాయం చేయాలనుకున్నాడు, కానీ ఆ యువ అధికారి క్రీస్తు అను​చరుడయ్యేందుకు తన ఆస్తిని వదులుకోలేదు.

20 యేసుకున్న ఆకర్షణీయమైన లక్షణాల్లో కనికరం కూడావుంది. అపరిపూర్ణ మానవులందరిలాగే ఆయన బోధకు స్పందించినవారు కూడా సమస్యలతో కృంగినవారే. ఈ విషయం అర్థం చేసుకున్న యేసు వారిపై కనికరంతో, జాలితో బోధించాడు. ఉదాహరణకు, ఒక సందర్భంలో యేసు ఆయన అపొస్తలులు ఎంతగా పనిలో మునిగిపోయారంటే, భోజనం చేయడానికి సహితం వారికి తీరికలేకపోయింది. అయినప్పటికీ, సమకూడిన ప్రజల్ని యేసు చూసినప్పుడు ఆయన స్పందన ఎలావుంది? “వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింప​సాగెను.” (మార్కు 6:​34) యేసు తన క్షేత్రంలోని ప్రజల దీన పరిస్థితిని గమనించి వారికి బోధించేందుకు, వారికోసం అద్భుతాలు చేసేందుకు తన శక్తిని ధారపోశాడు. ఆయన చక్కని లక్షణాలనుబట్టి ఆకర్షితులైన కొందరు, ఆయన మాటలకు చలించి ఆయన శిష్యులయ్యారు.

21 తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తున్నట్లుగా యేసు భూసంబంధ పరిచర్య గురించి మనం నేర్చుకోగల విషయాలెన్నో ఉన్నాయి. ఇంకా ఏయే విధాలుగా మనం సర్వోత్తమ మిషనరీ అయిన యేసుక్రీస్తును అనుకరించవచ్చు?

మీరెలా జవాబిస్తారు?

భూమ్మీదికి రాకముందు యేసు ఎలాంటి శిక్షణ అందుకున్నాడు?

యేసు బోధనా విధానం ఏ విధంగా శాస్త్రుల, పరిసయ్యుల బోధకన్నా ఉన్నతంగా ఉంది?

ఏ లక్షణాలు యేసును ప్రజలకు ఆప్తునిగా చేశాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మిషనరీ సేవ అంటే ఏమిటి, సర్వోత్తమ మిషనరీ అని ఎవరిని పిలవచ్చు?

3. మనమే ప్రశ్నలను పరిశీలించనున్నాం?

4-6. భూమికి పంపించబడినప్పుడు యేసు ఎదుర్కొన్న కొన్ని మార్పులు ఏమిటి?

7. ధర్మశాస్త్రం విషయంలో యూదులెలా ప్రవర్తించారు?

8. యేసు మనకెందుకు సహాయం చేయగలడు?

9, 10. భూమ్మీదికి పంపించబడక ముందు యేసు ఎలాంటి శిక్షణ పొందాడు?

11. మానవులపట్ల యేసు ఎంతమేరకు తన తండ్రి మనోవైఖరిని ప్రతిబింబించాడు?

12, 13. (ఎ) ఇశ్రాయేలీయులతో తన తండ్రి వ్యవహరించిన విధానాన్ని గమనించడం ద్వారా యేసు ఎలా నేర్చుకున్నాడు? (బి) యేసు తానుపొందిన శిక్షణను ఎలా ఉపయోగించాడు?

14, 15. యేసు బోధ ఏయే విధాలుగా శాస్త్రుల, పరిసయ్యుల బోధకు భిన్నంగా ఉంది?

16. యేసు మత్తయి 6:​19-21లో రాయబడిన తన మాటలకు అనుగుణంగా జీవించాడని మీరెందుకు చెబుతారు?

17. ఏ లక్షణాలు యేసును అసాధారణ సువార్తికుణ్ణి చేశాయి?

18. యేసు వినయస్థుడని ఎందుకు చెప్ప​వచ్చు?

19, 20. ప్రజలకు సహాయం చేసేందుకు ప్రేమ, కనికరం యేసును ఎలా పురికొల్పాయి?

21. తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

[15వ పేజీలోని చిత్రం]

యేసు జనసమూహాలకు ఎలా బోధించాడు?