కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సదాకాలము యెహోవామీద గురి నిలుపుకోండి

సదాకాలము యెహోవామీద గురి నిలుపుకోండి

సదాకాలము యెహోవామీద గురి నిలుపుకోండి

“సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.”​—⁠కీర్త. 16:⁠8.

దేవుడు మానవులతో వ్యవహరించిన తీరు గురించిన అద్భుతమైన వృత్తాంతం యెహోవా లిఖిత వాక్యంలో ఉంది. దేవుని సంకల్ప నెరవేర్పులో భాగం వహించిన అనేకమంది గురించి దానిలో పేర్కొనబడింది. మనం చదివి ఆనందించేలా వారి మాటలు, చేతలు బైబిల్లో కేవలం కథల రూపంలో రాయబడలేదు. బదులుగా ఆ వృత్తాంతాలు దేవునికి మనం సన్నిహితమయ్యేలా చేయగలవు.​—⁠యాకో. 4:⁠8.

2 బైబిల్లో మనకు పరిచయమున్న అబ్రాహాము, శారా, మోషే, రూతు, దావీదు, ఎస్తేరు, అపొస్తలుడైన పౌలు, మరితరుల అనుభవాల నుండి మనమందరం ఎంతో నేర్చు​కోవచ్చు. అయితే, అంతగా ప్రఖ్యాతిగాంచనివారి వృత్తాంతాల నుండి కూడా మనం ప్రయోజనం పొందవచ్చు. బైబిలు వృత్తాంతాలను ధ్యానించడంవల్ల మనం కీర్తనకర్త చెప్పిన ఈ మాటలకు అనుగుణంగా ప్రవర్తించగలుగుతాం: “సదా​కాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.” (కీర్త. 16:⁠8) మనం ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?

3 సాధారణంగా ఒక సైనికుని కుడిచేతిలో ఖడ్గం, ఎడమ​చేతిలో డాలు ఉంటాయి. కాబట్టి ఆయనకు కుడివైపున రక్షణ లభించదు. అయితే, ఆయన స్నేహితుడు కుడివైపున ఉండి పోరులో పాల్గొంటే ఆయనకు రక్షణ లభిస్తుంది. మనం యెహోవాను మనసులో ఉంచుకొని ఆయన చిత్తాన్ని చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. మనం బైబిలు వృత్తాంతాలను పరిశీలించడంవల్ల ‘సదాకాలము యెహోవామీద మన గురి నిలుపుకొనేలా’ మన విశ్వాసం ఎలా బలపరచబడుతుందో చూద్దాం.

యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడు

4మనం యెహోవామీద మన గురి నిలుపుకుంటే ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. (కీర్త. 65:⁠2; 66:​19) ఈ విషయంలో అబ్రాహాము దగ్గర ఎంతోకాలం పనిచేసిన సేవకుని ఉదాహరణ ఉంది, బహుశా ఆ సేవకుడు ఎలీయెజెరు కావచ్చు. దేవునిపట్ల భయభక్తులుగల భార్యను ఇస్సాకు కోసం కనుగొనడానికి అబ్రాహాము ఆయనను మెసొపొతమియాకు పంపించాడు. ఈ విషయంలో ఆయన దైవ నిర్దేశం కోసం ప్రార్థించాడు. రిబ్కా తన ఒంటెలకు నీళ్లు పోసినప్పుడు దేవుని నిర్దేశం తనకుందన్న విషయాన్ని ఆయన గుర్తించాడు. ఎలీయెజెరు హృదయపూర్వకంగా ప్రార్థించాడు కాబట్టే, ​ఇస్సాకుకు కాబోయే ప్రియమైన భార్యను ఆయన కనుగొన్నాడు. (ఆది. 24:​12-14, 67) నిజమే, అబ్రాహాము సేవకుడు ప్రత్యేకమైన పనిమీద అక్కడికి వెళ్లాడు. అయితే, యెహోవా మన ప్రార్థనలను ఆలకిస్తాడని ఆయనలాగే మనం కూడా నమ్మకం ఉంచవద్దా?

5 కొన్నిసార్లు, మనం దేవుని సహాయం కోసం తక్షణమే ప్రార్థించాల్సిరావచ్చు. ఒక సందర్భంలో, పారసీక రాజైన అర్తహషస్త, తన పానదాయకుడైన నెహెమ్యా విచారంగా ఉన్నట్లు గమనిస్తాడు. ఆ రాజు, “ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు” అని అడిగాడు. నెహెమ్యా ‘[తక్షణమే] ఆకాశ​మందలి దేవునికి ప్రార్థన చేశాడు.’ బహుశా నిశ్శబ్దంగా చేసిన ఆ ప్రార్థనను ఆయన క్లుప్తంగా చేసివుంటాడు. అయినా, దేవుడు దానికి జవాబిచ్చాడు. అందుకే, యెరూషలేము​ గోడలను పునర్నిర్మించేలా నెహెమ్యాకు రాజు సహకరించాడు. (నెహెమ్యా 2:​1-8 చదవండి.) అవును క్లుప్తంగా, నిశ్శబ్దంగా చేసే ప్రార్థన కూడా ఫలితాలను ఇవ్వగలదు.

6 అలాంటి ప్రార్థనలకు యెహోవా జవాబిస్తున్నాడని తెలియజేసే రుజువు ఎల్లప్పుడూ మనకు వెంటనే కనబడక​పోయినా మనం “ఒకనికొరకు ఒకడు ప్రార్థన” చేయాలని ప్రోత్సహించబడ్డాం. (యాకో. 5:​16) “నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు” అయిన ఎపఫ్రా తన తోటి విశ్వాసుల కోసం హృదయ​పూర్వకంగా ప్రార్థించాడు. రోము నుండి రాస్తూ పౌలు ఇలా అన్నాడు: “మీలో [కొలొస్సయులలో] ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత​గలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరాపొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.”​—⁠కొలొ. 1:​7, 8; 4:​12, 13.

7 ఆసియా మైనరులో ఒకే ప్రాంతంలో కొలొస్సయి, లవొదికయ, హియెరాపొలి అనే పట్టణాలు ఉన్నాయి. ​హియెరాపొలిలోని క్రైస్తవులు సైబల్‌ దేవత ఆరాధకుల మధ్య, లవొదికయ క్రైస్తవులు ధనాశగల ప్రజల మధ్య జీవించారు, కొలొస్సయిలోని క్రైస్తవులకు మానవ తత్వజ్ఞానం నుండి ప్రమాదం పొంచివుండేది. (కొలొ. 2:⁠8) కాబట్టి, కొలొస్సయిలో ఉన్న ఎపఫ్రా, ఆ పట్టణంలోని విశ్వాసుల కోసం ‘ప్రార్థనలలో పోరాడడంలో’ ఆశ్చర్యంలేదు! ఎపఫ్రా ప్రార్థనలకు ఎలా జవాబివ్వబడిందో బైబిలు తెలియజేయడంలేదు గానీ ఆయన తోటి విశ్వాసుల కోసం ప్రార్థించడం మాత్రం మానుకోలేదు. అలాగే మనమూ మన సహోదరుల కోసం ప్రార్థించడం మానుకోకూడదు. మనం ‘పరుల​జోలికి పోయేవారం’ కాకపోయినా, తీవ్రమైన విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న ఒకానొక కుటుంబ సభ్యుని గురించి లేక స్నేహితుని గురించి బహుశా మనకు తెలిసివుండవచ్చు. (1 పేతు. 4:​15) ఆయన కోసం వ్యక్తిగతంగా ప్రార్థించడం ఎంత సముచితమో కదా! ఇతరుల ప్రార్థనల నుండి పౌలు ప్రయోజనం పొందాడు, మన ప్రార్థనలు కూడా ఇతరులకు ఎంతో మేలు చేయగలవు.​—⁠2 కొరిం. 1:​10, 11.

8 ప్రార్థించే ఆధిక్యత విషయంలో కృతజ్ఞతగలవారిగా, తరచూ ప్రార్థించేవారిగా ఇతరులు మనల్ని దృష్టిస్తున్నారా? పౌలు ఎఫెసులోని పెద్దలను కలుసుకున్న తర్వాత, “మోకాళ్లూని వారందరితో ప్రార్థన చే[శాడు].” అప్పుడు “వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టు[కున్నారు].” (అపొ. 20:​36-38) ఆ పెద్దలందరి పేర్లు మనకు తెలియదు, అయితే ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో వారు గ్రహించారని మాత్రం స్పష్టమౌతోంది. నిస్సందేహంగా మనం కూడా దేవునికి ప్రార్థించే విషయంలో మనకున్న ఆధిక్యతను విలువైనదిగా ఎంచుతూ మన పరలోక తండ్రి మనకు జవాబిస్తాడనే విశ్వాసంతో “పవిత్రమైన చేతులెత్తి” ప్రార్థించాలి.​—⁠1 తిమో. 2:⁠8.

దేవునికి సంపూర్ణంగా లోబడండి

9యెహోవాను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుంటే మనమాయనకు లోబడడమే కాక, దానివల్ల ఆశీర్వాదాలనూ పొందగలుగుతాం. (ద్వితీ. 28:​13, 14; 1 సమూ. 15:​22) అలా ఆశీర్వదించబడాలంటే మనమాయనకు లోబడేందుకు సిద్ధంగా ఉండాలి. మోషే కాలంలో జీవించిన ఐదుగురు అక్కాచెల్లెళ్లైన సెలోపెహాదు కుమార్తెల మనోవైఖరి గురించి ఆలోచించండి. ఇశ్రాయేలీయుల్లో, సాధారణంగా కుమారులు తమ తండ్రుల నుండి స్వాస్థాన్ని పొందేవారు. సెలోపెహాదు కుమారులను కనకుండానే మరణించాడు కాబట్టి ఆయన స్వాస్థ్యమంతా ఈ ఐదుగురికి చెందాలని నిర్దేశిస్తూ యెహోవా వారికొక షరతుపెట్టాడు. ఆ షరతు ప్రకారం, ఆ స్వాస్థ్యం మనష్షే గోత్రంలోనే నిలిచివుండేలా వారు మనష్షే గోత్రంలోనివారినే వివాహం చేసుకోవాలి.​—⁠సంఖ్యా. 27:​1-8; 36:​6-8.

10 సెలోపెహాదు కుమార్తెలు, దేవునికి లోబడితే తమకు మేలు జరుగుతుందని నమ్మారు. “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి” అని బైబిలు చెబుతోంది. “సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లిచేసికొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షేయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను.” (సంఖ్యా. 36:​10-12) విధేయులైన ఆ స్త్రీలు యెహోవా ఆజ్ఞాపించినట్లే చేశారు. (యెహో. 17:​3, 4) ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన అవివాహిత క్రైస్తవులు అలాంటి విశ్వాసంతోనే ‘ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసుకోవడం’ ద్వారా దేవునికి లోబడతారు.​—⁠1 కొరిం. 7:⁠39.

11 ఇశ్రాయేలీయుడైన కాలేబులాగే మనం యెహోవాకు పూర్తిగా లోబడాలి. (ద్వితీ. 1:​36) సా.శ.పూ. 16వ శతాబ్దంలో, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు విడుదల చేయబడిన తర్వాత, మోషే కనాను దేశాన్ని వేగుచూసేందుకు 12 మందిని పంపిస్తే వారిలో ఇద్దరు మాత్రమే అంటే కాలేబు, యెహోషువలు మాత్రమే దేవునిపట్ల పూర్తి నమ్మకముంచి ఆ దేశంలో ప్రవేశించమని ప్రజలను ప్రోత్సహించారు. (సంఖ్యా. 14:​6-9) దాదాపు నాలుగు దశాబ్దాలైన తర్వాత కూడా, యెహోషువ, కాలేబులు సజీవంగా ఉండి యెహోవాను సంపూర్ణంగా అనుసరించారు. అంతేకాక, ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించేందుకు దేవుడు యెహోషువను ఉపయోగించుకున్నాడు. అయితే విశ్వాసం ప్రదర్శించని ఆ పదిమంది వేగులవారు ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాల్లో మరణించి ఉంటారు.​—⁠సంఖ్యా. 14:​31-34.

12 ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరించిన కాలమంతటిలో సజీవునిగా ఉన్న కాలేబు, యెహోషువ దగ్గరికి వెళ్లి “నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని” అని చెప్పగలిగాడు. (యెహోషువ 14:​6-9 చదవండి.) ఎనభైఐదు సంవత్సరాల కాలేబు, దేవుడు తనకు ఇస్తానని వాగ్దానం చేసిన కొండ ప్రదేశాన్ని తనకిమ్మని యెహోషువను కోరాడు, ఆ ప్రదేశంలోని ప్రాకారంగల గొప్ప పట్టణాల్లో శత్రువులు నివసిస్తున్నా ఆయన ఆ ప్రదేశాన్నే కోరుకున్నాడు.​—⁠యెహో. 14:​10-15.

13 ‘యెహోవాను నిండుమనసుతో అనుసరిస్తే’ నమ్మకస్థుడు, విధేయుడైన కాలేబుకు లభించినట్లే మనకూ దైవిక మద్దతు లభిస్తుంది. మనకు పెద్ద సమస్యలెదురైనా, మనం ‘యెహోవాను నిండుమనసుతో అనుసరిస్తుండగా’ ఆయన సహాయం లభిస్తుంది. అయితే కాలేబులా జీవితాంతం యెహోవాను నిండుమనసుతో అనుసరించడం కష్టమనిపించవచ్చు. సొలొమోను రాజు తన పరిపాలన ప్రారంభంలో యెహోవాను అనుసరించినా, వృద్ధాప్యంలో ఆయన భార్యలు ఆయన హృదయాన్ని అబద్ధ దేవతలతట్టు త్రిప్పినప్పుడు ఆయన “తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.” (1 రాజు. 11:​4-6) మనం ఎలాంటి పరీక్షలను ఎదుర్కోవాల్సివచ్చినా సంపూర్ణంగా యెహోవాకు లోబడుతూ ఆయనమీద మన గురి నిలుపుకుందాం.

ఎల్లప్పుడూ యెహోవామీద నమ్మకముంచండి

14మన భవిష్యత్తు నిరాశపూరితంగా కనిపించడాన్నిబట్టి మనం మానసిక కృంగుదలకు గురైనప్పుడు దేవునిమీద ఎక్కువగా నమ్మకముంచాలి. వృద్ధురాలైన నయోమి విషయమే తీసుకోండి, మరణమనే శత్రువు ఆమె భర్తను, ఇద్దరు కుమారులను పొట్టనబెట్టుకుంది. మోయాబు నుండి యూదాకు తిరిగివచ్చినప్పుడు ఆమె, “సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి [‘మధురము,’ అధస్సూచి] అనక మారా [‘చేదు,’ అధస్సూచి] అనుడి. నేను సమృద్ధిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను” అని విలపించింది.​—⁠రూతు 1:​20, 21.

15 నయోమి మానసిక కృంగుదలకు గురైనా, యెహోవాపట్ల తనకున్న నమ్మకాన్ని కాపాడుకుందని మనం రూతు పుస్తకాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా తెలుసుకుంటాం. దానివల్ల ఆమె పరిస్థితులు ఎంతగా మారిపోయాయో కదా! విధవరాలిగా ఉన్న నయోమి కోడలైన రూతు, బోయజుకు భార్యయై ఒక కుమారుణ్ణి కన్నది. నయోమి ఆ కుమారునికి దాది అయింది, అంతేకాక ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “ఆమె పొరుగు స్త్రీలు​—⁠నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి.” (రూతు 4:​14-17) నయోమి భూమ్మీద జీవించేందుకు పునరుత్థానం చేయబడినప్పుడు రూతు కూడా ఉంటుంది, అప్పుడామె మెస్సీయ అయిన యేసుకు రూతు పూర్వికురాలైందని తెలుసుకుంటుంది. (మత్త. 1:​5, 6, 16) నయోమిలాగే ప్రతికూల పరిస్థితులు ఎలా మారతాయో మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని సామెతలు 3:​5, 6లో ఉపదేశించబడినట్లుగా మనమెల్లప్పుడూ యెహోవామీద నమ్మకముంచుదాం.

పరిశుద్ధాత్మమీద ఆధారపడండి

16మనం ఎల్లప్పుడూ యెహోవామీద గురి నిలుపుకుంటే ఆయన మనల్ని తన పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు. (గల. 5:​16-18) ఇశ్రాయేలీయుల ‘భారాన్ని మోయడంలో’ మోషేకు సహాయం చేయడానికి ఎంపిక చేయబడ్డ 70 మంది పెద్దలమీద దేవుని ఆత్మవుంది. వారిలో ఎల్దాదు, మేదాదుల పేర్లు మాత్రమే బైబిల్లో పేర్కొనబడినా తమ విధులను నిర్వర్తించడానికి వారందరికీ పరిశుద్ధాత్మ సహాయం చేసింది. (సంఖ్యా. 11:​13-29) నిస్సందేహంగా, ముందు ఎంపిక​చేయబడిన వారిలాగే వీరు కూడా సమర్థులు, దైవభక్తిగలవారు, నమ్మదగినవారు, నిజాయితీపరులు. (నిర్గ. 18:​21) నేడు అలాంటి లక్షణాలనే క్రైస్తవ పెద్దలు కనబరుస్తున్నారు.

17 అరణ్యంలో ఆలయ గుడార నిర్మాణపు పనిలో యెహోవా పరిశుద్ధాత్మ ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. యెహోవా, బెసలేలును ముఖ్య శిల్పకళాకారునిగా, నిర్మాణకునిగా నియమించి “జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా” చేస్తానని వాగ్దానం చేశాడు. (నిర్గ. 31:​3-5)​ ఆ అద్భుతమైన పనిని బెసలేలు, ఆయన సహాయకుడైన అహోలీయాబుతోపాటు “జ్ఞాన హృదయులందరు” చేశారు. అంతేకాక, బుద్ధిపుట్టిన ప్రజలు ఉదారంగా విరాళాలు ఇచ్చేందుకు యెహోవా ఆత్మ వారిని ప్రేరేపించింది. (నిర్గ. 31:⁠6; 35:​5, 30-34) దేవుని ప్రస్తుత దిన సేవకులు దేవుని రాజ్యాన్ని మొదట వెదకేలా శాయశక్తుల కృషిచేసేందుకు అదే అత్మ ప్రోత్సహిస్తోంది. (మత్త. 6:​33) మనకు కొన్ని నైపుణ్యాలు ఉండవచ్చు. అయితే మన కాలంలో యెహోవా తన ప్రజలకు అప్పగించిన పనిని మనం నిర్వర్తించాలంటే పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థిస్తూ అది మనల్ని నిర్దేశించనివ్వాలి.​—⁠లూకా 11:​13.

సైన్యములకధిపతియగు యెహోవాపట్ల ఎల్లప్పుడూ భక్తిభావాన్ని కనబరచండి

18యెహోవామీద మన గురి ఎల్లప్పుడూ నిలుపుకునేలా పరిశుద్ధాత్మ మనలో భక్తిభావాన్ని కలిగిస్తుంది. దేవుని ప్రాచీన ప్రజలకు ఇలా చెప్పబడింది: “సేనల ప్రభువు యెహోవానే పవిత్రుడుగా గౌరవించాలి.” (యెష. 8:​13, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) మొదటి శతాబ్దపు యెరూషలేములో సుమెయోను, అన్న అనే ఇద్దరు వృద్ధులు యెహోవాపట్ల భక్తిభావాన్ని కనబర్చారు. (లూకా 2:​25-38 చదవండి.) సుమెయోను, మెస్సీయ సంబంధిత ప్రవచనాలపట్ల విశ్వాసముంచి ‘ఇశ్రాయేలు యొక్క ఆదరణ​కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు.’ దేవుడు సుమెయోనుమీద పరిశుద్ధాత్మ కుమ్మరించి, ఆయన తన మరణానికి ముందు మెస్సీయను చూస్తాడనే హామీ ఇచ్చాడు. హామీ ఇవ్వబడినట్లే ఆయన మెస్సీయను చూశాడు. సా.శ.పూ. 2వ సంవత్సరంలోని ఒక రోజున, శిశువుగా ఉన్న యేసును ఆయన తల్లియైన మరియ, ఆయనను పెంచిన తండ్రియైన యోసేపు దేవాలయానికి తీసుకువచ్చారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ​సుమెయోను మెస్సీయ గురించిన ప్రవచనాత్మక మాటలను చెప్పి మరియ దుఃఖక్రాంతురాలౌతుందని ప్రవచించాడు. హింసాకొయ్యమీద యేసును వేలాడదీసినప్పుడు ఆమె ఆ దుఃఖాన్ని అనుభవించింది. అయితే, సుమెయోను “ప్రభువుయొక్క క్రీస్తును” ఎత్తుకొన్నప్పుడు ఆయనకు కలిగిన గొప్ప ఆనందాన్ని ఊహించండి! యెహోవాపట్ల భక్తిభావాన్ని కనబర్చే విషయంలో నేడు దేవుని సేవకులకు సుమెయోను ఎంత చక్కని మాదిరివుంచాడో కదా!

19 భక్తిపరురాలైన 84 ఏళ్ల విధవరాలైన అన్న ‘దేవాలయములో విడువక’ సేవచేసింది. ఆమె “ఉపవాస ప్రార్థనలతో” రేయింబగళ్లు యెహోవాకు పవిత్రసేవ చేసింది. శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకువచ్చిన్నప్పుడు అన్న కూడా అక్కడే ఉంది. ఆమె భవిష్యత్తు మెస్సీయను చూసి ఎంత కృతజ్ఞతను కనబరచివుండవచ్చో కదా! నిజానికి, ఆమె “దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడు​చుండెను.” ఆమె ఈ సువార్తను ఇతరులకు తెలియజేయకుండా ఉండలేకపోయింది! సుమెయోను, అన్నలాగే నేడు వృద్ధ క్రైస్తవులు తాము ఎంత వృద్ధులైనా యెహోవాకు సేవచేయవచ్చని తెలుసుకొని ఎంతో సంతోషిస్తారు.

20 మనకు ఎంత వయసున్నా, మనం ఎల్లప్పుడూ ​యెహోవామీద మన గురిని నిలుపుకోవాలి. అప్పుడాయన తన రాజ్యాధికారం గురించి, తన అద్భుతమైన కార్యాల గురించి ఇతరులకు చెప్పడానికి మనం చేసే వినమ్ర ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు. (కీర్త. 71:​17, 18; 145:​10-13) అయితే మనం యెహోవాను గౌరవించాలంటే దైవిక లక్షణాలను కనబరచాలి. మరిన్ని బైబిలు వృత్తాంతాలను పరిశీలించడం ద్వారా అలాంటి లక్షణాల గురించి మనమేమి నేర్చుకోవచ్చు?

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా ప్రార్థనలను ఆలకిస్తాడని మనకెలా తెలుసు?

• మనం దేవునికి పూర్తిగా ఎందుకు లోబడాలి?

• మనం మానసిక కృంగుదలకు గురైనా ఎల్లప్పుడూ యెహోవామీద ఎందుకు నమ్మకముంచాలి?

• దేవుని పరిశుద్ధాత్మ తన ప్రజలకు ఎలా సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. బైబిలు వృత్తాంతాలు మనల్ని ఎలా ప్రభావితం చేయగలవు?

2, 3. కీర్తనలు 16:8లోని మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి?

4. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడని చూపించే లేఖన ఉదాహరణను ఇవ్వండి.

5. యెహోవాకు క్లుప్తంగా, నిశ్శబ్దంగా చేసే ప్రార్థన కూడా ఫలితాలను ఇవ్వగలదని మనమెందుకు చెప్పవచ్చు?

6, 7. (ఎ) ప్రార్థన విషయంలో ఎపఫ్రా ఏ మాదిరినుంచాడు? (బి) మనం ఇతరుల కోసం ఎందుకు ప్రార్థించాలి?

8. (ఎ) ఎఫెసులోని పెద్దలు ప్రార్థనకున్న ప్రాముఖ్యతను గ్రహించారని మనకెలా తెలుసు? (బి) దేవునికి ప్రార్థించే విషయంలో మనకు ఏ దృక్పథం ఉండాలి?

9, 10. (ఎ) సెలోపెహాదు కుమార్తెలు ఎలాంటి మాదిరినుంచారు? (బి) సెలోపెహాదు కుమార్తెలు చూపించిన విధేయత, వివాహం విషయంలో ఒక అవివాహిత క్రైస్తవుని మనోవైఖరిని ఎలా ప్రభావితం చేయవచ్చు?

11, 12. దేవునిపట్ల తనకు నమ్మకముందని కాలేబు ఎలా చూపించాడు?

13. మనకు పరీక్షలు ఎదురైనా, ఏమి చేస్తే మనకు దైవిక మద్దతు లభిస్తుంది?

14, 15. యెహోవామీద నమ్మకముంచాల్సిన అవసరం గురించి నయోమి అనుభవాల నుండి మీరేమి నేర్చుకున్నారు?

16. ప్రాచీన ఇశ్రాయేలులోని కొంతమంది పెద్దలకు దేవుని పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేసింది?

17. ఆలయ గుడార నిర్మాణంలో యెహోవా పరిశుద్ధాత్మ ఏ పాత్ర పోషించింది?

18, 19. (ఎ) దేవుని పరిశుద్ధాత్మ మనలో ఎలాంటి మనోభావాన్ని కలిగిస్తుంది? (బి) సుమెయోను, అన్నల మాదిరి నుండి మీరేమి నేర్చుకున్నారు?

20. మనకు ఎంత వయసున్నా మనమేమి చేయాలి, ఎందుకు అలా చేయాలి?

[4వ పేజీలోని చిత్రం]

నెహెమ్యా యెహోవాకు చేసిన ప్రార్థనకు ఫలితం లభించింది

[5వ పేజీలోని చిత్రం]

నయోమి పొందిన ఆశీర్వాదాలను గుర్తుచేసుకోవడం యెహోవాను నమ్మేందుకు మనకు సహాయం చేస్తుంది