కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సర్వోత్తమ మిషనరీని అనుకరించండి

సర్వోత్తమ మిషనరీని అనుకరించండి

సర్వోత్తమ మిషనరీని అనుకరించండి

“నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” ​—⁠1 కొరిం. 11:⁠1.

అపొస్తలుడైన పౌలు సర్వోత్తమ మిషనరీయైన యేసుక్రీస్తును అనుకరించాడు. అలాగే పౌలు, “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 కొరిం. 11:⁠1) యేసు తన అపొస్తలుల కాళ్లు​కడిగి వినయాన్ని గురించిన పాఠాన్ని నేర్పించిన తర్వాత, వారితో ఇలా అన్నాడు: “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.” (యోహా. 13:​12-15) ప్రస్తుత దిన క్రైస్తవులుగా మన మాటల్లో, క్రియల్లో, లక్షణాల్లో యేసుక్రీస్తును అనుకరించాల్సిన బాధ్యత మనపై ఉంది.​—⁠1 పేతు. 2:​21.

2 ముందరి ఆర్టికల్‌లో మనం సువార్తికునిగా పంపించబడిన వ్యక్తి అంటే ఇతరులకు సువార్త ప్రకటించేవాడు మిషనరీ అని తెలుసుకున్నాం. దీనికి సంబంధించి పౌలు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేశాడు. (రోమీయులు 10:​11-15 చదవండి.) అపొస్తలుడు, “ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” అని అడిగాడని గమనించండి. ఆ పిమ్మట ఆయన యెషయా ప్రవచనంలోని ఈ మాటలు ఉల్లేఖించాడు: “ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి.” (యెష. 52:⁠7) మీరు మిషనరీగా నియమించబడి వేరే దేశానికి పంపించ​బడకపోయినా, ఉత్సాహంగా సువార్త ప్రకటించిన యేసును అనుకరిస్తూ మీరు కూడా ఉత్సాహభరిత సువార్తికుని స్ఫూర్తిని పెంపొందించుకోవచ్చు. పోయిన సంవత్సరం 69,57,852 మంది రాజ్య ప్రచారకులు, 236 దేశాల్లో ‘సువార్తికులుగా పనిచేశారు.’​—⁠2 తిమో. 4:⁠5.

“మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి”

3 భూమ్మీద తనకు అప్పగించబడిన పనిని నెరవేర్చేందుకు యేసు, తన పరలోక జీవాన్నీ మహిమనూ విడిచిపెట్టి “దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” (ఫిలి. 2:⁠7) క్రీస్తును అనుకరిస్తూ మనమేమి చేసినా భూమ్మీదికి రావడంలో యేసు చేసిన​దానికి సాటిరాదు. అయితే ఆయన అనుచరులుగా మనం, సాతాను లోకంలో ఒకప్పుడు మనకున్న వాటిని ఆశించకుండా స్థిరంగా నిలబడివుండగలం.​—⁠1 యోహా. 5:​19.

4 ఒక సందర్భంలో అపొస్తలుడైన పేతురు యేసుతో, “ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకును” అని అడిగాడు. (మత్త. 19:​27) యేసును అనుసరించేందుకు ఆహ్వానించ​బడినప్పుడు పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహానులు సత్వరమే తమ వలలు విడిచివెళ్లారు. వారు తమ జాలరి వృత్తిని విడిచిపెట్టి పరిచర్యను తమ ప్రధాన పనిగా చేపట్టారు. లూకా సువార్త వృత్తాంతం ప్రకారం, పేతురు ఇలా అన్నాడు: “ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి.” (లూకా 18:​28) యేసును అనుసరించేందుకు మనలో చాలామందిమి ‘మనకు కలిగినవి’ అన్నీ విడిచిపెట్టాల్సిన అవసరం కలగలేదు. అయితే, క్రీస్తు అనుచరులుగా యెహోవాకు పూర్ణహృదయంతో సేవచేసేందుకు మనల్ని మనం ‘ఉపేక్షించుకున్నాం.’ (మత్త. 16:​24) అలా చేయడం మనకెన్నో ఆశీర్వాదాలను తీసుకొచ్చింది. (మత్తయి 19:​29 చదవండి.) సువార్త ప్రకటించే విషయంలో క్రీస్తులాంటి మనోవైఖరిని కలిగివుండడం మన హృదయానికి ఆనందం కలిగిస్తుంది, ప్రత్యేకంగా ఒక వ్యక్తి దేవునికి ఆయన ప్రియకుమారునికి సన్నిహితమయ్యేలా ఏ కాస్త సహాయం చేసినా మనకెంతో ఆనందం కలుగుతుంది.

5 సురినామ్‌లో నివసిస్తున్న బ్రెజిల్‌ దేశస్థుడైన వాల్మీర్‌ బంగారు గనిలో పనిచేసే కార్మికుడు. ఆయనొక త్రాగుబోతు, దుర్నీతికరమైన జీవితం గడిపేవాడు. ఆయనొకసారి ఒక నగరానికి వెళ్లినప్పుడు యెహోవాసాక్షులు ఆయనతో బైబిలు అధ్యయనం ఆరంభించారు. ఆయన ప్రతీరోజు అధ్యయనంచేసి, అనేక మార్పులు చేసుకొని త్వరలోనే బాప్తిస్మం తీసుకున్నాడు. తన ఉద్యోగాన్నిబట్టి బైబిలు బోధలకు అనుగుణంగా జీవించడం కష్టమని అనిపించినప్పుడు, ఆయన మంచి జీతమొచ్చే తన ఉద్యోగాన్ని వదిలేసి, సత్యం తెలుసుకునేలా తన కుటుంబానికి సహాయం చేయడానికి తిరిగి బ్రెజిల్‌కు వెళ్లిపోయాడు. బైబిలు సత్యం తెలుసుకున్న తర్వాత సంపన్న దేశాల్లో పరదేశులుగా నివసిస్తున్న చాలామంది తమ ఉద్యోగాలు వదిలేసి తమ బంధువులకు, ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో స్వదేశాలకు తిరిగి వెళ్తున్నారు. అలాంటి రాజ్య ప్రచారకులు సిసలైన సువార్తికుని స్ఫూర్తిని కన​బరుస్తున్నారు.

6 సాక్షుల్లో చాలామంది రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న ప్రాంతాలకు తరలివెళ్లగలిగారు. కొందరు పరాయి దేశాలకు సహితం వెళ్లారు. వ్యక్తిగతంగా ​మనమలా తరలివెళ్లే స్థితిలో లేకపోవచ్చు, అయితే పరిచర్యలో శాయశక్తులా కృషిచేయడం ద్వారా మనమన్ని సందర్భాల్లోనూ యేసును అనుకరించవచ్చు.

అవసరమైన శిక్షణను యెహోవా ఇస్తాడు

7 యేసు తన తండ్రినుండి శిక్షణ అందుకున్నట్లే, యెహోవా ఇప్పుడు అందిస్తున్న విద్యనుండి మనం ప్రయోజనం పొందవచ్చు. “వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది” అని యేసు చెప్పాడు. (యోహా. 6:​45; యెష. 54:​13) నేడు, మనల్ని రాజ్య ప్రచారకులుగా సన్నద్ధం చేసేందుకు రూపొందించబడిన పాఠశాలలున్నాయి. నిస్సందేహంగా మనమందరం ఏదొక రీతిలో మన స్థానిక సంఘాల్లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందాం. పయినీరు సేవా పాఠశాలకు హాజరయ్యే ప్రత్యేక అవకాశం పయినీర్లకు ఉంది. ఎంతోకాలంగా పయినీర్లుగా ఉన్న చాలామంది ఆ పాఠశాలకు రెండవసారి హాజరయ్యే సదవకాశాన్ని పొందారు. పెద్దలు, పరిచర్య సేవకులు తమ బోధనా సామర్థ్యాన్ని, తోటి విశ్వాసులకు తాముచేసే సేవను మెరుగుపర్చుకునేందుకు రాజ్య పరిచర్య పాఠశాలకు హాజరయ్యారు. ఎంతోమంది అవివాహిత పెద్దలు, పరిచర్య సేవకులు ప్రకటనా పనిలో ఇతరులకు సహాయపడేందుకు తమను సన్నద్ధం చేసిన పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యారు. విదేశాల్లో మిషనరీ నియామకం పొందిన అనేకమంది సహోదర సహోదరీలు వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌లో శిక్షణ పొందారు.

8 ఈ పాఠశాలలకు హాజరయ్యేందుకు చాలామంది యెహోవాసాక్షులు సర్దుబాట్లు చేసుకున్నారు. కెనడాలో పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యేందుకు యూగూ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు, ఎందుకంటే ఆయన యజమాని ఆయనకు సెలవు ఇవ్వలేదు. “నాకెలాంటి విచారమూ లేదు. వారు ఒకవేళ నాకేదో మేలు చేస్తున్నట్లు సెలవు ఇచ్చివుంటే, నేను విశ్వసనీయంగా ఎప్పటికీ ఆ కంపెనీకే కట్టుబడి ఉండాలని వారు ఆశించవచ్చు. అయితే నేనిప్పుడు యెహోవా నాకిచ్చే ఎలాంటి నియామకాన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అని యూగూ చెబుతున్నాడు. దేవుడిచ్చే శిక్షణనుండి ప్రయోజనం పొందడానికి చాలామంది తామొకప్పుడు అత్యంత విలువైనవిగా ఎంచినవాటిని సంతోషంగా త్యాగం చేశారు.​—⁠లూకా 5:​28.

9 లేఖనాధార బోధ, మనఃపూర్వక కృషి గమనార్హ మైన అభివృద్ధికి దోహదపడుతుంది. (2 తిమో. 3:​16-17) గ్వాటిమాలలో నివసిస్తున్న సౌలో విషయమే తీసుకోండి. ఆయన కొద్దిపాటి మానసిక వైకల్యంతో పుట్టాడు. ఆయన టీచరు, చదవడం నేర్చుకోవాలని ఆ పిల్లవాణ్ణి బలవంతపెట్టొద్దనీ అలా బలవంతపెట్టడం ఆ పిల్లవాడికి చికాకు కలిగిస్తుందనీ ఆయన తల్లికి చెప్పింది. చదవడం నేర్చుకోకుండానే​ సౌలో బడి మానేశాడు. అయితే ఒక సాక్షి, చదవడం మరియు వ్రాయడం మీద శ్రద్ధవహించండి (ఆంగ్లం) బ్రోషూరును ఉపయోగించి సౌలోకు చదవడం నేర్పించాడు. చివరకు, సౌలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగాలు ఇచ్చేంతగా అభివృద్ధి సాధించాడు. సౌలో తల్లి ఆ తర్వాత ఇంటింటి పరిచర్యలో ఆయన టీచరును కలుసుకుంది. సౌలో చదవడం నేర్చుకున్నాడని తెలుసుకున్న ఆ టీచరు మరుసటి వారం తనతోకూడా ఆయనను తీసుకురమ్మని అడిగింది. ఆ మరుసటి వారం టీచరు సౌలోను, “నువ్వు నాకేమి బోధించబోతున్నావు?” అని అడిగింది. అప్పుడు సౌలో బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం నుండి ఓ పేరా చదవడం ఆరంభించాడు. “ఇప్పుడు నువ్వు నాకు బోధిస్తున్నావనేది నేను నమ్మలేకపోతున్నాను” అంటూ ఆ టీచరు ఆనంద బాష్పాలతో సౌలోను కౌగలించుకుంది.

హృదయాన్ని కదిలించే బోధన

10 యెహోవా తనకు నేరుగా నేర్పించినవాటిని, దేవుని లిఖిత వాక్యంలోని ఉపదేశాన్ని ఆధారం చేసుకొని యేసు బోధించాడు. (లూకా 4:​16-21; యోహా. 8:​28) యేసు ఉపదేశాన్ని అన్వయించుకుంటూ, లేఖనాల ఆధారంగా బోధించడం ద్వారా మనం యేసును అనుకరిస్తాం. అందువల్లే మనమందరం ఏకభావంతో మాట్లాడతాం, ఆలోచిస్తాం, ఇది మన ఐక్యతకు దోహదపడుతుంది. (1 కొరిం. 1:​10) మన బోధలో ఏకతను కాపాడుకుంటూ, సువార్తికులుగా మన పనిని నెరవేర్చేందుకు మనకు తోడ్పడే బైబిలు ఆధారిత ప్రచురణలను అందిస్తున్నందుకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని”పట్ల మనమెంత కృతజ్ఞత కలిగివున్నామో కదా! (మత్త. 24:​45; 28:​19, 20) ఈ ప్రచురణల్లో​ బైబిలు బోధిస్తోంది పుస్తకం ఒకటి. ఇప్పుడది 179 భాషల్లో అందుబాటులో ఉంది.

11బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగిస్తూ లేఖనాలను అధ్యయనం చేయడం మనల్ని వ్యతిరేకించేవారి హృదయాలను సహితం మార్చగలదు. ఇతియోపియాలో ఒకసారి లూలా అనే పయినీరు సహోదరి బైబిలు అధ్యయనం నిర్వహిస్తుండగా, ఆ విద్యార్థి బంధువు దురుసుగా ఇంట్లోకి దూసుకొచ్చి అధ్యయనం చేయనవసరం లేదని అరిచింది. లూలా బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 15వ అధ్యాయంలో నకిలీ నోట్ల గురించిన ఉదాహరణను ఉపయోగిస్తూ ఆ బంధువుతో ప్రశాంతంగా, తర్కసహితంగా మాట్లాడింది. దానితో ఆ స్త్రీ శాంతించి వారు తిరిగి అధ్యయనం కొనసాగించేందుకు అనుమతించింది. నిజానికి ఆ స్త్రీ తర్వాతి అధ్యయనానికి రావడమే కాక, తనకూ బైబిలు అధ్యయనం నిర్వహించమని అడిగి, దానికోసం డబ్బు చెల్లిస్తానని కూడా చెప్పింది. ఆమె కొద్ది​రోజుల్లోనే వారానికి మూడుసార్లు అధ్యయనం చేస్తూ, చక్కని ఆధ్యాత్మిక ప్రగతి సాధించింది.

12 పిల్లలు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగిస్తూ ఇతరులకు సహాయం చేయవచ్చు. హవాయ్‌లో కీనూ అనే 11 సంవత్సరాల పిల్లవాడు పాఠశాలలో ఈ పుస్తకం చదువు​తుండగా, తోటివిద్యార్థి ఆ పిల్లవాణ్ణి ఇలా అడిగాడు: “మీరు సెలవుదినాలను ఎందుకు ఆచరించరు?” దాని జవాబును కీనూ ఆ పుస్తకపు అనుబంధంలో “మనం సెలవుదినాలను ఆచరించాలా?” అనే అంశంలో నుండి నేరుగా చదివాడు. ఆ తర్వాత ఆయన పుస్తకంలోని విషయసూచికకు త్రిప్పి, ఆ అబ్బాయికి ఏ విషయం బాగా నచ్చిందో చెప్పమని అడిగాడు. బైబిలు అధ్యయనం ఆరంభించబడింది. గత సేవా సంవత్సరంలో యెహోవాసాక్షులు 65,61,426 బైబిలు అధ్యయనాలు నిర్వహించారు, వాటిలో అధికశాతం బైబిలు బోధిస్తోంది పుస్తకం నుండే నిర్వహించబడ్డాయి. బైబిలు అధ్యయనాల్లో మీరు ఈ ఉపకరణాన్ని ఉపయోగిస్తున్నారా?

13బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించి లేఖనాలను అధ్యయనం చేయడం దేవుని చిత్తం చేసేందుకు ఇష్టపడేవారిపై బలమైన ప్రభావం చూపించగలదు. నార్వేలో ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్న దంపతులు జాంబియా నుండి వచ్చిన ఓ కుటుంబంతో బైబిలు అధ్యయనం ఆరంభించారు. ఆ జాంబియా దంపతులకు అప్పటికే ముగ్గురు అమ్మాయిలుండడంతో వారు మరో బిడ్డ వద్దనుకున్నారు. ఆమె గర్భం ధరించినప్పుడు ఆ బిడ్డను గర్భస్రావం ద్వారా తొలగించుకోవాలని ఆ దంపతులు అనుకున్నారు. వైద్యునితో సంప్రదించడానికి కొన్నిరోజుల ముందు వారు “జీవం విషయంలో దేవుని దృక్కోణం” అనే అధ్యాయాన్ని చర్చించారు. ఆ అధ్యాయంలో ఇవ్వబడిన గర్భస్థ శిశువు బొమ్మ ఆ దంపతులను ఎంతగా ప్రభావితం చేసిందంటే, గర్భస్రావం ద్వారా ఆ బిడ్డను తొలగించుకోవద్దని నిర్ణయించుకున్నారు. వారు చక్కని ఆధ్యాత్మిక ప్రగతి సాధించి, తమకు జన్మించిన కుమారునికి ఆ అధ్యయనం నిర్వహించిన సహోదరుని పేరు పెట్టుకున్నారు.

14 యేసు బోధనలోని ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆయన తాను బోధించినదానికి అనుగుణంగా జీవించాడు. ఈ విషయంలో యేసును అనుకరిస్తున్న యెహోవాసాక్షుల సత్‌ప్రవర్తనను బట్టి చాలామంది ముగ్ధులౌతున్నారు. న్యూజీలాండ్‌లో ఓ వ్యాపారి కారులోనుండి, ఎవరో ఆయన బ్రీఫ్‌కేసును కొట్టేశారు. ఆయన ఈ విషయాన్ని పోలీసు కానిస్టేబుల్‌కు చెబితే ఆయనిలా అన్నాడు: “మీ బ్రీఫ్‌కేసు ఒకవేళ ఒక యెహోవాసాక్షి కంటబడితేనే అది మీకు తిరిగి దొరికే అవకాశం ఉంది.” వార్తాపత్రికలు సరఫరాచేసే ఒక సాక్షికి ఆ బ్రీఫ్‌కేసు దొరికింది. ఈ విషయం తెలుసుకొన్న ఆ వ్యాపారి ఆ సహోదరి ఇంటికి వచ్చాడు. ఆయనకెంతో విలువైన ఒక దస్తావేజు అందులోనే ఉండడం చూసి ఆయన హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. “ఒక యెహోవాసాక్షిగా నేను ఆ బ్రీఫ్‌కేసును దానిలోవున్న వస్తువుల్ని మీకు తిరిగి అప్పగించడమే భావ్యం” అని ఆ సహోదరి ఆయనతో అంది. ఆ రోజు ఉదయమే పోలీసు కానిస్టేబుల్‌ తనతో అన్న మాటల్ని గుర్తుచేసుకుని ఆ వ్యాపారి ఆశ్చర్య​పోయాడు. అవును, నిజ క్రైస్తవులు యేసును అనుకరిస్తూ బైబిల్లోని బోధలకు అనుగుణంగా జీవిస్తున్నారు.​—⁠హెబ్రీ. 13:​18.

ప్రజలపట్ల యేసుకున్న దృక్పథాన్ని అనుకరించండి

15 ప్రజలపట్ల యేసుకున్న దృక్పథం వారిని ఆయన సందేశంవైపు ఆకర్షించింది. ఉదాహరణకు, ఆయన ప్రేమ, వినయం దీనులను ఆయన దగ్గరకు చేర్చాయి. ఆయన తన దగ్గరకొచ్చినవారిపై కనికరపడి, దయాపూర్వక మాటలతో వారిని ఓదార్చి, చాలామందిని స్వస్థపర్చాడు. (మార్కు 2:​1-5 చదవండి.) మనం అద్భుతాలు చేయలేం కానీ ప్రేమను, వినయాన్ని, కనికరాన్ని చూపించగలం, ఈ లక్షణాలే ప్రజలు సత్యంవైపు ఆకర్షించబడేలా చేస్తాయి.

16 టారియూవ అనే ప్రత్యేక పయినీరు దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రములో ఉన్న కిరిబాటి దీవుల్లోని ఒక సుదూర ద్వీపంలో నివసిస్తున్న బీరే అనే వృద్ధుని ఇంటికి వెళ్లినప్పుడు ఆమె కనబర్చిన కనికరం సత్ఫలితాలు తీసుకొచ్చింది. తనకు వినడం ఇష్టం లేదని ఆ వృద్ధుడు చెప్పినా, ఆయనకు పాక్షికంగా పక్షవాతం సోకినట్లు గమనించిన టారియూవ ఆయనపై కనికరం చూపించింది. “రోగులకు, వృద్ధులకు దేవుడేమి వాగ్దానం చేస్తున్నాడో మీరు విన్నారా?” అని ఆమె అడిగింది. ఆ తర్వాత ఆమె యెషయా ప్రవచనంలోని కొంత భాగాన్ని ఆయనకు చదివి వినిపించింది. (యెషయా 35:​5, 6 చదవండి.) ఆశ్చర్యచకితుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు: “నేను ఎన్నో ఏళ్లుగా బైబిలు చదువుతున్నాను, చాలా సంవత్సరాలుగా మా మతానికి చెందిన మిషనరీ నా దగ్గరకు వస్తున్నాడు, కానీ నేనెన్నడూ ఈ మాటల్ని బైబిల్లో చూడలేదు.” బీరేతో బైబిలు అధ్యయనం ఆరంభించబడింది, ఆయన చక్కని ఆధ్యాత్మిక ప్రగతి సాధించాడు. ఆయనకు తీవ్ర అశక్తతవున్నా, ఆయనిప్పుడు బాప్తిస్మం తీసుకుని ఒక ఐసొలేటెడ్‌ గుంపుకు సారథ్యం వహిస్తున్నాడు, అలాగే ఆయన సువార్త ప్రకటిస్తూ ఆ ద్వీపమంతటా నడవగలుగుతున్నాడు.

ఎడతెగక క్రీస్తును అనుకరించండి

17 పరిచర్యలో ఎదురయ్యే ఆనందకరమైన అనుభవాలు పదేపదే చూపిస్తున్నట్లుగా, యేసు కనబర్చిన లక్షణాలను అలవర్చుకొని, వాటిని మన జీవితాల్లో చూపిస్తే మనం సమర్థవంతమైన సువార్తికులుగా ఉండగలం. కాబట్టి మనం ఉత్సాహభరిత సువార్తికుల్లా క్రీస్తును అనుకరించడమెంత సముచితమో కదా!

18 మొదటి శతాబ్దంలో కొందరు యేసు శిష్యులైనప్పుడు, “మాకేమి దొరకును” అని పేతురు అడిగాడు. దానికి యేసు, “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును” అని జవాబిచ్చాడు. (మత్త. 19:​27-29)​ సర్వోత్తమ మిషనరీ అయిన యేసుక్రీస్తును మనం ఎడతెగక అనుకరిస్తే మనకు నిశ్చయంగా అలాంటి అనుభవమే ఎదురౌతుంది.

మీరెలా జవాబిస్తారు?

• సువార్తికులుగా ఉండేందుకు యెహోవా మనకెలా శిక్షణనిస్తున్నాడు?

• బైబిలు బోధిస్తోంది పుస్తకం మన పరిచర్యలో ఎందుకు సమర్థవంతంగా ఉంది?

• ప్రజలపట్ల మన దృక్పథంలో మనమెలా యేసును అనుకరించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనమెందుకు యేసుక్రీస్తును అనుకరించాలి?

2. పరిపాలక సభ మిమ్మల్ని మిషనరీగా నియమించకపోయినా మీరెలాంటి దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు?

3, 4. యేసు పరలోకంలో ఏమి విడిచిపెట్టి వచ్చాడు, ఆయన అనుచరులుగా ఉండేందుకు మనమేమిచేయాలి?

5. బైబిలు సత్యం తెలుసుకున్న తర్వాత, పరదేశిగా నివసిస్తున్న వ్యక్తి ఏమిచేయడానికి నిర్ణయించుకోవచ్చో ఉదాహరించడానికి ఒక అనుభవాన్ని వివరించండి.

6. రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న ప్రాంతాలకు మనం తరలివెళ్లలేకపోతే మనమేమి చేయవచ్చు?

7. రాజ్య ప్రచారకులుగా తమ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఇష్టపడేవారికి శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి?

8. యెహోవా ఇచ్చే శిక్షణను కొందరు సహోదరులు ఎంత విలువైనదిగా పరిగణిస్తున్నారు?

9. లేఖనాధార బోధకు తోడుగా మనఃపూర్వకంగా చేసే కృషికి చక్కని ఫలితాలు లభిస్తాయని వివరించే ఒక ఉదాహరణ చెప్పండి.

10. బైబిలు సత్యాన్ని బోధించేందుకు ఏ అద్భుతమైన ఉపకరణం మనకు అందుబాటులో ఉంది?

11. ఇతియోపియాలో ఒక సహోదరి బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించి వ్యతిరేకతను ఎలా అధిగమించింది?

12. పిల్లలు బైబిలు సత్యాలను సమర్థవంతంగా ఎలా బోధించవచ్చో చూపించే ఒక ఉదాహరణ చెప్పండి.

13. బైబిలు అధ్యయనం చేయడం ఏ విధంగా ప్రజలపై బలమైన ప్రభావం చూపించగలదు?

14. మనం బోధించేదానికి అనుగుణంగా జీవించడమెలా సత్ఫలితాలు సాధిస్తుందో ఉదాహరించండి.

15, 16. మనం ప్రకటించే సందేశంవైపు ప్రజలను ఎలా ఆకర్షించ​వచ్చు?

17, 18. (ఎ) మీరెలా సమర్థులైన సువార్తికులు కాగలరు? (బి) తమ పరిచర్యను గంభీరంగా తీసుకునేవారికి ఏమి లభిస్తుంది?

[17వ పేజీలోని చిత్రం]

యేసు తనను అనుసరించమని పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహానులను పిలిచినప్పుడు, వారు వెంటనే స్పందించారు

[19వ పేజీలోని చిత్రం]

“బైబిలు బోధిస్తోంది” వంటి ప్రచురణలు మన బోధలో ఏకత్వాన్ని కలిగివుండేందుకు సహాయం చేస్తాయి