కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం

ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం

ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం

మేము మొత్తం 18 మందిమి మురికి నేలపై పడుకుని ఉన్నాం. మా స్లీపింగ్‌ బ్యాగ్‌లలో పడుకుని చలికి వణికిపోతూ రేకుల షెడ్డుపై వర్షపు చినుకులు జోరుగా పడుతుంటే వింటున్నాం. ఆ షెడ్డు పరిస్థితి చూస్తుంటే మాకంటే ముందు ఇక్కడ ఎవరైనా ఉండేవారా అని అనుకున్నాం.

అసలు అలాంటి చోటుకి మేము ఎందుకు వెళ్లాం? “భూదిగంతముల వరకు” సువార్తను ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించాలని కోరుకుంటున్నాం కాబట్టే మేము అక్కడికి వెళ్లాం. (అపొ. 1:⁠8; మత్త. 24:​14) మేమంతా కలిసి బొలీవియాలోని ఆండీస్‌ పర్వత ప్రాంతాల్లో ఉన్న మారుమూల ఊళ్లలో ప్రకటించడానికి వెళ్లాం.

అక్కడికి చేరుకోవడానికి పడిన పాట్లు

ముందు అక్కడికి చేరుకోవడమే మాకో పెద్ద సమస్య అయ్యింది. అలాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఒక సమయమంటూ లేదని తెలిసింది. చివరకు బస్సు వచ్చింది కానీ మేము అనుకున్నదానికన్నా అది చిన్నది కావడంతో మాలో కొందరికి సీట్లు దొరకలేదు. చివరకు, మేమందరం మా గమ్యాన్ని చేరుకున్నాం.

బొలీవియాలోని ఆండీస్‌ పర్వతాలపై ఉన్న గ్రామాలకు వెళ్లి ప్రకటించాలన్నదే మా లక్ష్యం. బస్సునుండి దిగిన తర్వాత మేమందరం మా సామగ్రిని మోసుకుంటూ ఒకొక్కరం ఏటవాలుగా ఉన్న ఆ కొండలపైకి ఎక్కాం.

ఆ గ్రామాలు చిన్నవిగానే కనిపించినా ఇళ్లు మాత్రం విసిరేసినట్లు అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి కాబట్టి, ప్రతీ గ్రామంలో ప్రకటించడానికి మాకు ఎన్నో గంటలు పట్టింది. మేమెంత దూరం నడిచినా అల్లంత దూరాన ఇంకో ఇల్లు కనిపించేది. తరచూ మేము పొలాల్లోని తికమకపెట్టే వంకర​టింకర దారుల్లో తప్పిపోయేవాళ్లం.

“మీరు ముందే ఎందుకు రాలేదు?”

మేము ఎంతో దూరం నడిచి వచ్చామని తెలుసుకున్న ఒక స్త్రీ ఎంతగా ముగ్ధురాలు అయ్యిందంటే, మేము మధ్యాహ్నం వంట వండుకోవడానికి వాళ్ల వంటగదిని, కట్టెలను వాడుకోనిచ్చింది. చనిపోయిన​వారికి ఏమవుతుందనే విషయం గురించి బైబిలు ఏమి బోధిస్తుందో తెలుసుకున్న ఒక వ్యక్తి, “మీరు ముందే ఎందుకు రాలేదు” అని అడిగాడు. ఆయనకు ఎంత ఆసక్తి ఉందంటే, మేము ఊరు విడిచి వెళ్తుంటే దారిలో ప్రశ్నలు అడగవచ్చనే ఉద్దేశంతో మా వెంటే వచ్చాడు. అసలు యెహోవాసాక్షుల గురించే ఎప్పుడూ వినని ఇంకో వ్యక్తి మన ప్రచురణలపట్ల చాలా ఆసక్తి చూపించాడు. మేము అక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పి మేము రాత్రిపూట పండుకోవడానికి తన షెడ్డు తాళంచెవిని ఇచ్చాడు.

ఒక రోజు రాత్రి, ఎంత చీకటి కమ్ముకుందంటే మేము తెలీకుండా చీమలదండు ఉన్న చోట మా గుడారాలు వేసుకున్నాం. వాటికి వెంటనే కోపం వచ్చి మమ్మల్ని తెగకుట్టాయి. కదిలే ఓపిక లేక అక్కడే ఉండిపోయాం, కాసేపయ్యాక ఆ చీమలు కూడా మేమున్నామన్న సంగతి మరిచిపోయినట్లున్నాయి.

నేలపై పడుకోవడంవల్ల మా నడుములు, పక్క​టెముకలు ముందు నొప్పిపెట్టినా రాత్రి గడిచేకొద్దీ అలవాటైపోయింది. ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన లోయలు, మెల్లగా కదిలే మబ్బులు, దూరాన కనబడే అద్భుతమైన మంచు పర్వతాలను చూసేసరికి మా నొప్పులను మరచిపోయాం. సెలయేరు హోరు, పక్షుల కిలకిలరావాలు మాత్రమే ఆ ప్రశాంతతకు భంగం కలిగించాయి.

వాగులో స్నానాలు కానిచ్చాక మేమందరం కలిసి దినవచనాన్ని పరిశీలించాం. ఫలహారం చేసి దూరాన ఉన్న ఇతర ఊళ్లకు వెళ్లడానికి మెల్లగా పర్వతాలు ఎక్కడం ప్రారంభించాం. మేము పడిన కష్టానికి తగ్గ ఫలితాలు దొరికాయి. బైబిల్లో దేవుని నామమైన యెహోవా ఉందని తెలుసుకున్న ఒక వృద్ధ స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు ఆమె తన ప్రార్థనల్లో దేవుని పేరును ఉపయోగించవచ్చు అని తెలుసుకొని భావోద్వేగాలకు లోనైంది.

ఒక వృద్ధుడైతే తనను దేవుడు గుర్తుచేసుకున్నాడు అని చెప్పి దూతలే మమ్మల్ని వాళ్లింటికి పంపారనే పాటను వెంటనే పాడడం మొదలుపెట్టాడు. ఇంట్లోనుండి కదల్లేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇంకో వ్యక్తి, తన ఊళ్లో ఎవ్వరూ కనీసం తనను చూడడానికైనా రాలేదని మాతో చెప్పాడు. మేము ఎంతో దూరానున్న లాపాజ్‌ నుండి వచ్చామని తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయాడు. మరో వ్యక్తి, ఇతర చర్చీలవారు గంటలు మ్రోగించి ప్రజల్ని పిలిస్తే, యెహోవాసాక్షులు ప్రజల ఇళ్లకు వెళ్తారని తెలుసుకుని ఎంతో ముగ్ధుడయ్యాడు.

ఆ ప్రాంతంలో ఏ ఇంట్లోనూ కరెంటు లేదు కాబట్టి ప్రజలు చీకటిపడగానే నిద్రకుపక్రమించి తెల్లవారుజామునే లేస్తారు. కాబట్టి, ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడు కలుసుకోవాలంటే మేము పొద్దున ఆరు గంటలకే ప్రకటించడం మొదలుపెట్టాలి లేకపోతే చాలామంది పొలం పనులకు వెళ్లి​పోతారు. ఆ తర్వాత, పనిచేసుకునేవారి దగ్గరకు వెళితే వారు తాము చేసేపనిని ఆపి, నాగటి లాగుతున్న తమ ఎద్దులకు కొంత విశ్రాంతినిచ్చి, దేవుని వాక్యం నుండి మేము చెప్పే విషయాలను వినేవారు. మేము వెళ్లినప్పుడు ఇళ్లలో ఉండే చాలామంది మేము కూర్చోవడానికి గొర్రె తోళ్లు పరచి, మేము చెప్పేది వినడానికి రమ్మని కుటుంబ సభ్యులనందరినీ పిలిచేవారు. కొంతమంది రైతులు మేమిచ్చిన బైబిలు సాహిత్యంపట్ల కృతజ్ఞతతో పెద్దపెద్ద సంచుల్లో జొన్నలు ఇచ్చేవారు.

“మీరు నన్ను మరిచిపోలేదు”

ప్రజలు బైబిలు జ్ఞానాన్ని పెంచుకోవాలంటే మేము ఒక్కసారి వెళ్తే సరిపోదు. అందుకే మేము తిరిగివచ్చి వారికి మరింత నేర్పించాలని వారిలో చాలామంది బ్రతిమిలాడేవారు. కాబట్టి, మేము బొలీవియాలోని ఈ ప్రాంతానికి చాలాసార్లు వచ్చాం.

ఆ ప్రాంతానికి మరోసారి వెళ్లినప్పుడు ఒక వృద్ధ స్త్రీ మేము వచ్చినందుకు సంతోషిస్తూ, “మీరు నా పిల్లల్లాంటివాళ్లు. మీరు నన్ను మరిచిపోలేదు” అని అంది. ఒక వ్యక్తి మేము చేస్తున్న పనిపట్ల కృతజ్ఞతతో, మేము మళ్లీ వచ్చినప్పుడు తన ఇంట్లో ఉండమని చెప్పాడు. మేము గతంలో కలిసిన ఒక స్త్రీ ఇప్పుడు పట్టణానికి తరలివెళ్లి అక్కడ సువార్త ప్రకటిస్తోందని వినడమే బహుశా మేము పడిన పాట్లకు దొరికిన అత్యంత గొప్ప ప్రతిఫలం.

మేము మొదటిసారి వచ్చినప్పుడు, మా పొయ్యి కోసం తెచ్చుకున్న కిరోసిను వెళ్లిపోయే రోజున అయిపోయింది. వంటసామాను కూడా కాస్తే మిగిలింది. కట్టెల పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు ఏరి, వండుకుని తిన్న తర్వాత కాలినడకన బయలుదేరాం. బస్‌స్టాండు ఊరికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరేసరికి చీకటిపడింది.

తిరుగు ప్రయాణం

మేము ఎక్కిన బస్సు ఫెయిలు అవడంతో తిరుగు ప్రయాణంలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. కొంత​సేపటికి, జనంతో కిక్కిరిసిపోయిన ఒక ట్రక్కులో ఎక్కగలిగాం. మేము ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చామా అని మమ్మల్ని తోటి ప్రయాణికులు కుతూహలంతో చూశారు, దానితో వారికి ప్రకటించే అవకాశం మాకు దొరికింది. వారు సహజంగా బిడియస్తులే అయినా ప్రేమగలవాళ్లు, స్నేహశీలురు.

ఆ ట్రక్కులో తొమ్మిది గంటలు ప్రయాణించాక, తడిసి ముద్దైపోయిన బట్టలతో, గజగజ వణికిపోతూ ఇంటికి చేరాం. కానీ మేము పడిన కష్టం వ్యర్థం కాలేదు. ఆ ట్రక్కులో మాకు పట్టణంలో నివసిస్తున్న ఒక స్త్రీ కలిసింది, ఆమె కోసం మేము బైబిలు అధ్యయనాన్ని ఏర్పాటు చేయగలిగాం.

అలాంటి మారుమూల ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం నిజంగా ఓ గొప్ప ఆధిక్యత. మేము నాలుగు ఊళ్లలో, అనేక కుగ్రామాల్లో ప్రకటించాం. ఇప్పుడు మాకు ఈ మాటలే గుర్తుకొస్తున్నాయి: “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు . . . పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.”​—⁠యెష. 52:⁠7; రోమా. 10:​15.

[17వ పేజీలోని చిత్రం]

ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం