ఇతరులను మీరు యెహోవా చూసినట్లే చూస్తారా?
ఇతరులను మీరు యెహోవా చూసినట్లే చూస్తారా?
‘శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించుకోవాలి.’—1 కొరిం. 12:24, 25.
మనం దుష్టలోకం నుండి బయటకొచ్చి యెహోవా ప్రజలతో సహవసించడం ఆరంభించినప్పుడు, వారిమధ్యవున్న స్నేహపూర్వక ప్రేమను, శ్రద్ధను చవిచూసి మనమెంతో ఆనందించాం. సాతాను అధీనంలోవున్న క్రూరమైన, ద్వేషపూరితమైన, కలహప్రియులైన ప్రజలకు వీరు ఎంత భిన్నమో కదా! మనం సమాధానం, ఐక్యత నిండివున్న ఆధ్యాత్మిక పరదైసులో ప్రవేశించాం.—యెష. 48:17, 18; 60:18; 65:25.
2 కాలం గడుస్తుండగా, మనం మన అపరిపూర్ణతనుబట్టి మన సహోదరులను మరో విధంగా దృష్టించడం ఆరంభించవచ్చు. అపరిపూర్ణతవల్ల మనం స్థూలంగా మన సహోదరుల మంచి లక్షణాలను చూడడానికి బదులు వారి తప్పులను కొండంతలుగాచేసి చూడవచ్చు. నిజానికి, మనం వారిని యెహోవా చూసినట్లే చూడాలనేది మర్చిపోతాం. మనకదే జరుగుతుంటే, మన దృక్కోణాన్ని పరిశీలించుకొని, యెహోవా స్పష్టమైన దృక్కోణానికి అనుగుణంగా దానిని తీర్చిదిద్దుకోవాలి.—నిర్గ. 33:13.
యెహోవా మన సహోదరులను ఎలా దృష్టిస్తాడు?
3మొదటి కొరింథీయులు 12:2-26లో రాయబడినట్లుగా, అపొస్తలుడైన పౌలు అభిషిక్త క్రైస్తవుల సంఘాన్ని “అనేకమైన అవయవములు” కలిగివున్న శరీరముతో పోల్చాడు. శరీరావయవములు వివిధ రకాలుగా ఉన్నట్లే, సంఘ సభ్యులు కూడా తమ లక్షణాల్లో, సామర్థ్యాల్లో ఎంతో భిన్నంగా ఉంటారు. అయినా, యెహోవా ఈ వైవిధ్యాన్ని అంగీకరిస్తున్నాడు. ఆయన ప్రతీ సభ్యుణ్ణి ప్రేమిస్తున్నాడు, వారిని అమూల్యమైన వ్యక్తులుగా పరిగణిస్తున్నాడు. కాబట్టి, పౌలు కూడా, సంఘ సభ్యులు ‘ఒకరినొకరు పరామర్శించుకోవాలి’ అని మనకు చెబుతున్నాడు. ఇతరుల వ్యక్తిత్వం మన వ్యక్తిత్వానికి భిన్నంగా ఉంటుంది కాబట్టి, అలా చేయడం కష్టంగా ఉండవచ్చు.
4 మన సహోదరుల బలహీనతల మీదే దృష్టి నిలిపేందుకు సహితం మనం ఇష్టపడవచ్చు. అలాంటప్పుడు, మనం చిత్రపటంలోని ఒక భాగాన్నే ప్రత్యేకంగా గమనిస్తుండవచ్చు. అయితే యెహోవా దృష్టి చిత్రపటాన్ని మొత్తం చూసేంత విశాలంగా ఉంటుంది. మనకు నచ్చని లక్షణం మీదే దృష్టి నిలిపేందుకు మనం మొగ్గు చూపించవచ్చు, కానీ యెహోవా ఒకవ్యక్తి మంచి లక్షణాలన్నింటితోపాటు ఆయనను మొత్తం చూస్తాడు. యెహోవాలా ఉండేందుకు మనమెంత ఎక్కువగా కృషిచేస్తే, అంత ఎక్కువగా సంఘంలో ప్రేమ, ఐక్యతల స్ఫూర్తికి తోడ్పడవచ్చు.—ఎఫె. 4:1-3; 5:1, 2.
5 అపరిపూర్ణ మానవులకు ఇతరులను విమర్శించే స్వభావం ఉంటుందనే విషయం యేసుకు బాగా తెలుసు. ఆయనిలా హెచ్చరించాడు: “తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.” (మత్త. 7:1) ఆదిమ భాషలో యేసు, “తీర్పు తీర్చకుడి” అని తెలుగు బైబిల్లో ఉన్నట్లు అనలేదు గానీ “తీర్పు తీర్చడం మానండి” అన్నాడు. ఎందుకంటే, తన శ్రోతల్లో చాలామందికి అప్పటికే ఇతరులను విమర్శించే అలవాటు ఉందని ఆయనకు తెలుసు. మనకూ అలాంటి అలవాటు ఉందా? మనం ఇతరులను విమర్శించేవారిగా ఉంటే, మనల్ని మనం మార్చుకునేందుకు తీవ్రంగా కృషిచేయాలి, లేకపోతే మనం కఠినమైన తీర్పును ఎదుర్కొంటాం. నియమిత స్థానంలో యెహోవా ఉపయోగించుకుంటున్న వ్యక్తిని విమర్శించడానికి లేదా ఆ వ్యక్తి సంఘంలో ఉండకూడదని చెప్పడానికి మనమెవరం? ఒక సహోదరునిలో బలహీనతలు ఉండవచ్చు, కానీ యెహోవా ఆయనను అంగీకరిస్తుంటే, మనమాయనను తిరస్కరించడం సరైనదిగా ఉంటుందా? (యోహా. 6:44) తన ప్రజల సంఘాన్ని యెహోవా నడిపిస్తున్నాడని, ఏవైనా సర్దుబాట్లు అవసరమైతే తగిన సమయంలో ఆయన చర్య తీసుకుంటాడని మనం నిజంగా నమ్ముతున్నామా?—రోమీయులు 14:1-4 చదవండి.
6 యెహోవా విషయంలో ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఆయా క్రైస్తవులు నూతనలోకంలో పరిపూర్ణతకు చేరుకున్నప్పుడు వారు ఎలాంటివారిగా తయారయ్యే సామర్థ్యం వారిలో ఉందో ఆయన చూడగలడు. వారిప్పటికే సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి ఆయనకు తెలుసు. కాబట్టి, శరీర సంబంధమైన ప్రతీ బలహీనతపై దృష్టినిలపాల్సిన అవసరం ఆయనకు లేదు. కీర్తన 103:12లో మనమిలా చదువుతాం: “పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు.” అందుకు, వ్యక్తిగతంగా మనమెంత కృతజ్ఞత కలిగివుండాలో కదా!—కీర్త. 130:3.
7 ఒక వ్యక్తిలోని మంచిని చూసే అసాధారణ సామర్థ్యం యెహోవాకు ఉందనే రుజువును మనం లేఖనాల్లో గమనిస్తాం. దేవుడు దావీదును, “నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు” అని వర్ణించాడు. (1 రాజు. 14:8) అయితే దావీదు కొన్ని తప్పులు చేశాడని మనకు తెలుసు. అయినప్పటికీ యెహోవా, దావీదు మంచి లక్షణాలనే చూసేందుకు ఎంచుకున్నాడు, ఎందుకంటే దావీదుకు యథార్థ హృదయముందని ఆయనకు తెలుసు.—1 దిన. 29:17.
మీ సహోదరులను యెహోవా చూసినట్లే చూడండి
8 యెహోవా హృదయాలను చదవగలడు, మనమలా చదవలేం. మనం విమర్శించకుండా ఉండేందుకు ఇదొక మంచి కారణమే. అవతలి వ్యక్తి ఉద్దేశాలన్నీ మనకు తెలియవు. చివరకు సమసిపోయే మానవ అపరిపూర్ణతలపై దృష్టి నిలపకుండా ఉండడం ద్వారా యెహోవాను అనుకరించేందుకు మనం ప్రయత్నించాలి. ఈ విషయంలో ఆయనలా ఉండడం చక్కని లక్ష్యంగా ఉండదా? ఆయనలా ఉండడం మన సహోదర సహోదరీలతో సమాధానకర సంబంధాలు కలిగివుండేందుకు దోహదపడుతుంది.—ఎఫె. 4:23, 24.
9 ఉదాహరణకు, పాడైపోయిన ఒక ఇంటిని గురించి ఆలోచించండి. ఆ ఇంటి గోడలు బాగా పాడైపోయాయి, కిటికీలు విరిగిపోయాయి, ఇంటికప్పు కారుతుంది. ఆ ఇల్లు చూడ్డానికి అసహ్యంగా ఉంది కాబట్టి, దానిని కూలగొట్టడమే మంచిదని చాలామంది అనుకుంటారు. అయితే ఒక వ్యక్తి విభిన్నమైన దృక్కోణంతో ఆ ఇంటిని చూడవచ్చు. ఆయన పైపైన కనిపించే సమస్యలను కాక, ఆ ఇంటి నిర్మాణం బలంగా ఉన్నట్లు, దానిని తిరిగి పునరుద్ధరించవచ్చు అన్నట్లు చూడవచ్చు. అయితే, ఆయన ఆ ఇంటిని కొని పైపైన కనిపించే లోపాలకు మరమ్మతుచేసి దాని రూపాన్ని మెరుగుపర్చవచ్చు. ఆ తర్వాత, ఆ దారినపోయేవారు దానిని చూసి ఇల్లు ఎంత బాగుందో అనవచ్చు. మనం, ఇంటికి మరమ్మతుచేసి, దానిని పునరుద్ధరించిన వ్యక్తిలా ఉండగలమా? మనం మన సహోదరుల్లో ఉన్న బయటకు కనిపించే లోపాలపై దృష్టి నిలిపే బదులు, వారి మంచి లక్షణాలను, వారు సాధించగల ఆధ్యాత్మిక ప్రగతిని గ్రహించగలమా? మనమలా గ్రహించినప్పుడు, యెహోవాలాగే మనం కూడా మన సహోదరుల ఆధ్యాత్మిక సౌందర్యాన్నిబట్టి వారిని ప్రేమిస్తాం.—హెబ్రీయులు 6:10 చదవండి.
10 సంఘంలోని వారందరితో మనకున్న సంబంధాల్లో మనకు సహాయం చేయగల సలహాను అపొస్తలుడైన పౌలు మనకిస్తున్నాడు. క్రైస్తవులను ఆయనిలా ప్రోత్సహించాడు: “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” (ఫిలి. 2:3, 4) ఇతరులపట్ల సరైన దృక్కోణాన్ని కలిగివుండేందుకు వినయం మనకు సహాయం చేస్తుంది. ఇతరులపట్ల వ్యక్తిగత శ్రద్ధ కనబర్చడం, వారిలోని సద్విషయాలను చూడడం కూడా వారిని యెహోవా చూసినట్లే మనమూ చూసేందుకు సహాయం చేస్తుంది.
11 ఇటీవలి కాలాల్లో, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజల్లో విస్తారమైన మార్పులు తీసుకొచ్చాయి. కొన్ని నగరాల్లో ఇప్పుడు వివిధ ప్రాంతాల ప్రజలు నివాసముంటున్నారు. మన ప్రాంతానికి తరలివచ్చిన కొందరు బైబిలు సత్యంపట్ల ఆసక్తి చూపించి, వారిప్పుడు మనతోపాటు యెహోవాను ఆరాధిస్తున్నారు. వీరు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండి” వచ్చారు. (ప్రక. 7:9) ఫలితంగా, మన సంఘాల్లో అనేకం ఒకవిధంగా అంతర్జాతీయ సంఘాలయ్యాయి.
12 మన సంఘంలో మనం ఒకరి పట్ల ఒకరం సరైన దృక్కోణాన్ని కాపాడుకునేందుకు మరింత శ్రద్ధ చూపించాల్సి ఉండవచ్చు. ఇది మనం, “నిష్కపటమైన సహోదరప్రేమను” కనబరుస్తూ, ‘ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించాలని’ అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఉపదేశం గురించి శ్రద్ధగా ఆలోచించాలని మనకు గుర్తుచేస్తోంది. (1 పేతు. 1:22) వివిధజాతుల ప్రజలున్న సంఘాల్లో యథార్థమైన ప్రేమను, అనురాగాన్ని అలవర్చుకోవడం కష్టంగా ఉండవచ్చు. విద్యకు, ఆర్థిక పరిస్థితికి, జాతి నేపథ్యానికి సంబంధించి మన తోటి ఆరాధకుల సంస్కృతి మన సంస్కృతికి చాలా భిన్నంగా ఉండవచ్చు. కొందరి ఆలోచనను లేదా ప్రతిస్పందనల్ని అర్థం చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తోందా? మీ విషయంలో వారికి కూడా అలాగే అనిపిస్తుండవచ్చు. ఏదేమైనప్పటికీ, మనందరికీ ఇలా ఉపదేశించబడింది: “సహోదరులను ప్రేమించుడి.”—1 పేతు. 2:17.
2 కొరింథీయులు 6:12, 13 చదవండి.) “నాకేమీ వివక్షలేదు, కానీ . . .” అని అంటూనే, ఆ తర్వాత ఫలానా జాతివాళ్ళలో ఇవి మామూలే అని మనమనుకునే లక్షణాలను గుర్తుచేసుకుంటున్నామా? అలాంటి భావాలు, మన అంతరంగాల్లో ఇంకా నిలిచివున్న వివక్షను తొలగించుకోవలసిన అవసరతను వెల్లడి చేయవచ్చు. మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నా సంస్కృతికి భిన్న సంస్కృతిగల ప్రజలను తెలుసుకునేందుకు నేను క్రమంగా ప్రయత్నిస్తున్నానా?’ అలాంటి ఆత్మపరిశీలన మన అంతర్జాతీయ సహోదరత్వాన్ని అంగీకరించి, అమూల్యంగా పరిగణించేందుకు మనకు సహాయం చేయవచ్చు.
13 మన సహోదరులందరి విషయంలో మన హృదయాలను విశాలపర్చుకునేందుకు మన ఆలోచనా విధానంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. (14 అలా సర్దుబాటు చేసుకున్నవారి చక్కని ఉదాహరణలను బైబిలు మనకిస్తోంది, వారిలో ఒకరు అపొస్తలుడైన పేతురు. ఒక యూదునిగా పేతురు అన్యుల ఇళ్లకు వెళ్లకుండా ఉండవచ్చు. అయితే సున్నతిపొందని అన్యుడైన కొర్నేలీ ఇంటికి వెళ్ళమని చెప్పబడినప్పుడు ఆయనెలా భావించివుంటాడో ఒక్కసారి ఊహించుకోండి! అన్ని జనాంగాల ప్రజలు క్రైస్తవ సంఘంలో భాగమై ఉండడం దేవుని చిత్తమని గ్రహించినప్పుడు, పేతురు సర్దుబాట్లు చేసుకున్నాడు. (అపొ. 10:9-35) ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు మార్పులు చేసుకొని, వివక్షను విసర్జించాడు. “పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు . . . దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము” చేసేంతగా క్రైస్తవులను ద్వేషించానని ఆయన అంగీకరించాడు. అయినా, ప్రభువైన యేసు పౌలును సరిదిద్దినప్పుడు, ఆయన ఎన్నో మార్పులు చేసుకోవడమే కాక, తాను అంతకుముందు హింసించినవారి నిర్దేశాన్ని అంగీకరించడం ఆరంభించాడు.—గల. 1:13-20.
15 యెహోవా ఆత్మ సహాయంతో మన దృక్పథంలో సర్దుబాట్లు చేసుకోవచ్చనే విషయంలో సందేహమే లేదు. మనలో వివక్షకు సంబంధించిన ఛాయలు ఉన్నట్లు మనకు తెలిస్తే వాటిని రూపుమాపి, “సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు” కృషిచేద్దాం. (ఎఫె. 4:1-6) “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.—కొలొ. 3:14.
మన పరిచర్యలో యెహోవాను అనుకరించడం
16 “దేవునికి పక్షపాతములేదు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమా. 2:11) సకల జనాంగాల ప్రజలు తనను ఆరాధించాలనేదే యెహోవా సంకల్పం. (1 తిమోతి 2:3, 4 చదవండి.) ఆ సంకల్ప నెరవేర్పుకై ఆయన, “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును,” “నిత్యసువార్త” ప్రకటించబడేలా ఏర్పాటు చేశాడు. (ప్రక. 14:6) యేసు ఇలా అన్నాడు: “పొలము లోకము.” (మత్త. 13:38) అది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంత ప్రాముఖ్యమైన భావాన్నిస్తోంది?
17 ఇతరులకు రాజ్య సందేశాన్ని ప్రకటించేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, ప్రపంచ నలుమూలల నుండి వచ్చి మన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో మనమీ సందేశాన్ని పంచుకోవచ్చు. మనమనేక సంవత్సరాల నుండి ప్రకటిస్తున్నవారికే కాక, అన్నిరకాల ప్రజలకు సాక్ష్యమిచ్చే అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? సమగ్ర సాక్ష్యం పొందని ఇతరులకు ప్రకటించడానికి మీరెందుకు దృఢ సంకల్పం చేసుకోకూడదు?—రోమా. 15:20, 21.
18 అందరికీ సహాయం చేయాల్సిన అవసరతను యేసు చూశాడు. ఆయన కేవలం ఒక ప్రాంతంలోనే ప్రకటించలేదు. ఆయన “సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారముచేసెను” అని ఒక బైబిలు వృత్తాంతం మనకు చెబుతోంది. ఆ తర్వాత ‘ఆయన సమూహములను చూచి, వారిమీద కనికరపడి’ వారికి సహాయం అవసరమని చెప్పాడు.—మత్త. 9:35-37.
19 మీరు కూడా అలాంటి దృక్పథాన్నే కనబర్చగల కొన్ని మార్గాలేమిటి? కొందరు తాము తరచూ సేవచేయని క్షేత్రంలోని అన్ని భాగాల్లో సాక్ష్యమివ్వడానికి కృషిచేశారు. అలాంటి భాగాల్లో వ్యాపార ప్రాంతాలు, ఉద్యానవనాలు, ప్రజారవాణా ప్రాంగణాలు లేదా సులభంగా ప్రవేశించడానికి వీలుకాని నివాసిత భవనాల ముందు సాక్ష్యమివ్వడం వంటివి ఉన్నాయి. కొందరు తమ ప్రాంతంలో నివసిస్తున్న ఫలానా జాతి ప్రజలకు లేదా గతంలో తరచూ సాక్ష్యమివ్వని గుంపులకు ప్రకటించేందుకు కొత్తభాషను నేర్చుకునేందుకు ప్రయత్నించారు. ప్రజల మాతృభాషలో పలకరించడాన్ని నేర్చుకోవడం అలాంటి ప్రజల సంక్షేమంపట్ల మీకెంతో ఆసక్తివుందని చూపిస్తుంది. మనం మరో భాష నేర్చుకునే స్థితిలో లేనట్లయితే, అలా నేర్చుకుంటున్నవారిని మనం ప్రోత్సహించగలమా? వేరే దేశంనుండి వచ్చిన ప్రజలకు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్న వారిపట్ల ప్రతికూలంగా ఉండడం లేదా వారెందుకలా ప్రకటిస్తున్నారని మనం ప్రశ్నించాలనుకోం. దేవుని దృష్టిలో ప్రతీ ఒక్కరి ప్రాణం అమూల్యమైనది, మనమూ అలాగే దృష్టించాలని కోరుకుంటాం.—కొలొ. 3:10, 11.
20 ప్రజలపట్ల దేవుని దృక్కోణాన్ని కలిగివుండడమంటే, వారెలాంటి పరిస్థితుల్లోవున్నా అందరికీ ప్రకటించడమనే అర్థం. కొందరికి ఇళ్లు లేకపోవచ్చు, అపరిశుభ్రంగా ఉండవచ్చు లేదా దుర్నీతికరమైన జీవితం జీవిస్తుండవచ్చు. ఎవరైనా మనపట్ల నిర్దయగా ప్రవర్తిస్తే, ఆ కారణంగా మనం వారి జాతీయతపట్ల లేదా తెగపట్ల ప్రతికూల అభిప్రాయాలను ఏర్పర్చుకోకూడదు. పౌలుపట్ల కొందరు దురుసుగా ప్రవర్తించారు, అయితే ఆయన ఆ కారణాన్నిబట్టి ఆ నేపథ్య ప్రజలకు ప్రకటించకుండా ఉండలేదు. (అపొ. 14:5-7, 19-22) వారిలో కొందరు కృతజ్ఞతాపూర్వకంగా స్పందిస్తారని ఆయన నమ్మాడు.
21 స్థానికంగా ఉన్న మన సహోదరులతో, విదేశాలకు చెందిన మన సహోదరులతో, క్షేత్రంలోని ప్రజలతో వ్యవహరించేటప్పడు సరైన దృక్కోణాన్ని అంటే యెహోవా దృక్కోణాన్ని కలిగివుండాలని మనకిప్పుడు స్పష్టమైంది. మనమెంత ఎక్కువగా యెహోవా దృక్కోణాన్ని ప్రతిబింబిస్తామో, అంత ఎక్కువగా మనం సమాధానాన్ని, ఐక్యతను పెంపొందిస్తాం. అలాగే మనం, ప్రజలపట్ల “పక్షపాతము” కాదుగానీ ‘తాను నిర్మించిన వారందరిపట్ల’ ప్రేమపూర్వక శ్రద్ధచూపించే యెహోవా దేవుణ్ణి ప్రేమించేలా ఇతరులకు సహాయం చేసేందుకు మరింత మంచి స్థానంలో ఉంటాం.—యోబు 34:19.
మీరు జవాబివ్వగలరా?
• మన సహోదరులపట్ల ఎలాంటి దృక్కోణాన్ని విసర్జించేందుకు మనం కృషిచేయాలి?
• మన సహోదరులను దృష్టించే విషయంలో మనమెలా యెహోవాను అనుకరించవచ్చు?
• విదేశాలకు చెందిన సహోదరులను దృష్టించే విషయంలో మీరు ఏ పాఠాలు నేర్చుకున్నారు?
• మనం పరిచర్య చేస్తుండగా ప్రజలపట్ల యెహోవా దృక్కోణాన్ని ఎలా అనుకరించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1. మీరు మొదటిసారిగా ఆధ్యాత్మిక పరదైసులోకి ప్రవేశించినప్పుడు ఎలా భావించారు?
2. (ఎ) ఇతరులను మనం చూసే విధానాన్ని ఏది ప్రభావితం చేయవచ్చు? (బి) మనమేమి చేయాల్సి ఉంటుంది?
3. బైబిలు క్రైస్తవ సంఘాన్ని దేనితో పోలుస్తోంది?
4. మన సహోదరుల గురించిన మన దృక్కోణంలో మనమెందుకు సర్దుబాటు చేసుకోవాలి?
5. ఇతరులకు తీర్పు తీర్చడం ఎందుకు అనుచితం?
6. యెహోవా తన సేవకులనెలా దృష్టిస్తాడు?
7. యెహోవా దావీదును దృష్టించిన తీరునుండి మనమేమి తెలుసుకుంటాం?
8, 9. (ఎ) మనం ఏ విధంగా యెహోవాలాగే ఉండవచ్చు? (బి) దీనినెలా ఉదాహరించవచ్చు, దానిలో మనకే పాఠముంది?
10. ఫిలిప్పీయులు 2:3, 4లోని సలహా మనకెలా సహాయం చేయవచ్చు?
11. కొన్ని సంఘాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి?
12. మనం ఒకరిపట్ల ఒకరం ఏ దృక్కోణాన్ని కాపాడుకోవాలి, కొన్నిసార్లు ఇదెందుకు కష్టంగా ఉండవచ్చు?
13. మన ఆలోచనా విధానంలో మనమెలాంటి సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉండవచ్చు?
14, 15. (ఎ) ఇతరుల విషయంలో తమ దృక్కోణాన్ని మార్చుకున్నవారి ఉదాహరణలు చెప్పండి. (బి) వారిని మనమెలా అనుకరించవచ్చు?
16. ప్రజల విషయంలో దేవుని చిత్తమేమిటి?
17. అన్నిరకాల ప్రజలకు మనమెలా సహాయం చేయవచ్చు?
18. ప్రజలపట్ల యేసు ఎలాంటి శ్రద్ధను కనబర్చాడు?
19, 20. ప్రజలందరి పట్ల యెహోవాకు, యేసుక్రీస్తుకు ఉన్న శ్రద్ధను మనం ప్రతిబింబించగల కొన్నిమార్గాలు ఏమిటి?
21. ఇతరులపట్ల యెహోవా దృక్కోణాన్ని కలిగివుండడం మీకెలా సహాయం చేస్తుంది?
[26వ పేజీలోని చిత్రం]
ఇతర సంస్కృతుల ప్రజలను మీరెలా తెలుసుకోవచ్చు?
[28వ పేజీలోని చిత్రాలు]
ఇంకా ఎక్కువమందికి మీరు ఏయే మార్గాల్లో సువార్త ప్రకటించవచ్చు?