కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు?”

“మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు?”

“మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు?”

“మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్యప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.”​—⁠యాకో. 3:​13.

నిజంగా ఎవరు జ్ఞానవంతులని మీరనుకుంటున్నారు? బహుశా మీ తల్లిదండ్రులా, పెద్దవయసుగల వ్యక్తా లేక మీ కళాశాల ప్రొఫెసరా? ఎవరు జ్ఞానవంతులు అనే విషయంలో మీ దృక్కోణంపై మీ జీవన నేపథ్యం, పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి. కానీ దేవుని సేవకులు మాత్రం ప్రాథమికంగా దేవుడెలా దృష్టిస్తాడనే విషయంపై ఆసక్తి చూపిస్తారు.

2 జ్ఞానవంతులని లోకం పరిగణించే వారందరూ దేవుని దృష్టిలో నిజంగా జ్ఞానవంతులు కారు. ఉదాహరణకు, తాము జ్ఞానులమని తలంచినవారితో యోబు మాట్లాడాడు, అయితే ఆయన చివరికిలా అన్నాడు: “మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు.” (యోబు 17:​10) దేవుని జ్ఞానాన్ని తిరస్కరించిన కొందరి గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.” (రోమా. 1:​22) యెషయా ప్రవక్త ద్వారా యెహోవాయే ఇలా నొక్కిచెప్పాడు: “తమ దృష్టికి తాము జ్ఞానులని . . . తలంచుకొనువారికి శ్రమ.”​—⁠యెష. 5:​21.

3 కాబట్టి, ఒక వ్యక్తిని నిజంగా జ్ఞానవంతుణ్ణి చేసి, తత్ఫలితంగా దేవుని అనుగ్రహాన్ని పొందేలా చేసేదేమిటో మనం ధృవీకరించుకోవాలి. సామెతలు 9:⁠10 మనకిలా చెబుతోంది: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.” జ్ఞానవంతులకు దేవుని గురించిన సరైన భయం, ఆయన ప్రమాణాలపట్ల గౌరవం ఉండాలి. అయితే దేవుడు ఉన్నాడని, ఆయనకు ప్రమాణాలున్నాయని గుర్తించడం మాత్రమే సరిపోదు. ఈ విషయంలో శిష్యుడైన యాకోబు మన ఆలోచనకు పదును పెడుతున్నాడు. (యాకోబు 3:⁠13 చదవండి.) ఆ వ్యక్తి “తన యోగ్యప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను” అనే మాటలను గమనించండి. నిజమైన జ్ఞానం ప్రతీరోజు మీ మాటల్లో, చేతల్లో కనబడాలి.

4 నిజమైన జ్ఞానంలో చక్కని విచక్షణ చూపించడం, పరిజ్ఞానాన్ని విజయవంతంగా ఉపయోగించడం, ఏది సరైనదో అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవించడం వంటివి ఇమిడివున్నాయి. అలాంటి జ్ఞానం మనకుందని ఎలాంటి క్రియలు వెల్లడిచేస్తాయి? జ్ఞానవంతుల క్రియల్లో స్పష్టంగా కనిపించే అనేక సంగతులను యాకోబు పేర్కొంటున్నాడు. * తోటి విశ్వాసులతోనే కాక, సంఘం వెలుపటి​వారితో కూడా సత్సంబంధాలు కలిగివుండేందుకు మనకు సహాయపడగల దేని గురించి ఆయన చెప్పాడు?

నిజమైన జ్ఞానవంతులెవరో వారి క్రియల ద్వారా తెలుస్తుంది

5 యాకోబు జ్ఞానాన్ని చక్కని ప్రవర్తనకు ముడిపెట్టాడని మళ్లీ ఒకసారి చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. యెహోవా భయము జ్ఞానానికి మూలము కాబట్టి, జ్ఞానవంతుడు దేవుని మార్గాలకు, ప్రమాణాలకు అనుగుణంగా ప్రవర్తించేందుకు కృషిచేస్తాడు. మనం దైవిక జ్ఞానంతో జన్మించలేదు. అయినా క్రమమైన బైబిలు అధ్యయనం, ధ్యానం మూలంగా మనమా జ్ఞానాన్ని పొందవచ్చు. బైబిలు అధ్యయనం, ధ్యానం ఎఫెసీయులు 5:⁠1 ఉపదేశిస్తున్నట్లుగా, ‘దేవునిపోలి నడుచుకొనేందుకు’ మనకు సహాయం చేస్తాయి. యెహోవా వ్యక్తిత్వానికి అనుగుణంగా మనమెంత ఎక్కువగా ప్రవర్తిస్తామో, మన క్రియల్లో అంత ఎక్కువగా దైవిక జ్ఞానాన్ని కనబరుస్తాం. యెహోవా మార్గాలు మానవుల మార్గాలకన్నా మరెంతో ఉన్నతమైనవి. (యెష. 55:​8, 9) కాబట్టి యెహోవా కార్యవిధానాన్ని మనం అనుకరించినప్పుడు, మనలోని తేడాను ఇతరులు గమనిస్తారు.

6 యెహోవాలాగే ఉండడానికి ఒక మార్గం “జ్ఞానముతో కూడిన సాత్వికము” కలిగివుండడమని యాకోబు చెబుతున్నాడు. సాత్వికంలో మృదువుగా ఉండడం ఇమిడివున్నా, అదే సమయంలో ఒక క్రైస్తవుడు నైతిక దృఢత్వాన్ని కూడా కలిగివుండవచ్చు, ఇది సమతుల్యతతో ప్రవర్తించడానికి ఆయనకు సహాయంచేస్తుంది. దేవునికి అపారమైన శక్తివున్నా ఆయన సాత్వికుడు, ఆయనకు సన్నిహితమయ్యేందుకు మనం భయపడం. దేవుని కుమారుడు తన తండ్రి సాత్వికాన్ని ఎంత చక్కగా ప్రతిబింబించాడంటే, ఆయనిలా చెప్పగలిగాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”​—⁠మత్త. 11:​28, 29; ఫిలి. 2:​5-8.

7 అసాధారణ సాత్వికం చూపించిన వ్యక్తుల గురించి బైబిలు చెబుతోంది. వారిలో మోషే ఒకడు. ఆయనకు గొప్ప బాధ్యతవున్నా ఆయన “భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు” అని వర్ణించబడ్డాడు. (సంఖ్యా. 11:​29; 12:⁠3) తన చిత్తం నెరవేర్చేందుకు యెహోవా మోషేకు ఎంతటి శక్తినిచ్చాడో గుర్తుచేసుకోండి. తన సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా సాత్వికులను ఇష్టపూర్వకంగా ఉపయోగించుకున్నాడు.

8 కాబట్టి, “జ్ఞానముతో కూడిన సాత్వికము” కనబర్చడం అపరిపూర్ణ మానవులకు సాధ్యమే. మన విషయమేమిటి? ఈ లక్షణాన్ని చూపించడంలో మనమెలా ప్రగతి సాధించవచ్చు? సాత్వికము యెహోవా పరిశుద్ధాత్మ ఫలంలో భాగం. (గల. 5:​22) మనమాయన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించడమే కాక, సాత్వికాన్ని మరింత మెరుగ్గా చూపించేందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఆత్మఫలాన్ని ప్రదర్శించేందుకు మనఃపూర్వకంగా కృషిచేయవచ్చు. అలా కృషిచేయడానికి, “[దేవుడు] తన మార్గమును దీనులకు నేర్పును” అని కీర్తనకర్త ఇచ్చిన హామీలో మనకు బలమైన ప్రోత్సాహముంది.​—⁠కీర్త. 25:⁠9.

9 అయితే, ఈ రంగంలో ప్రగతి సాధించడానికి మనఃపూర్వక ప్రయత్నం అవసరం. మన నేపథ్యం కారణంగా, మనలో కొందరు సాత్వికులుగా ఉండేందుకు మొగ్గు చూపించకపోవచ్చు. అంతేకాక, మన చుట్టూవున్నవారు “ముల్లును ముల్లుతోనే తీయాలి” అంటూ మనం సాత్వికంగా ఉండనక్కర్లేదని ప్రోత్సహించవచ్చు. అయితే అది నిజంగా జ్ఞానయుక్తమైనదేనా? ఉదాహరణకు, మీ ఇంట్లో కొద్దిగా మంట రేగిందనుకోండి దానిని ఆర్పడానికి దానిలో నూనె వేస్తారా లేక నీళ్లు చల్లుతారా? అగ్నిలో నూనె వేస్తే అది మరింత ఎక్కువవుతుంది, కానీ నీళ్లు చల్లితే అది ఆరిపోతుంది. అదే విధంగా, బైబిలు మనకిలా ఉపదేశిస్తోంది: “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.” (సామె. 15:​1, 18) ఈసారి సంఘంలో గానీ, బయటగానీ సమస్యలు ఎదురైనప్పుడు, మృదువుగా స్పందించడం ద్వారా మనకు నిజమైన జ్ఞానముందని చూపించవచ్చు.​—⁠2 తిమో. 2:​23.

10 పైన పేర్కొన్నట్లుగా, లోకాత్మచేత ప్రభావితులైన చాలామంది సాత్వికంగా, సమాధానంగా, ప్రశాంతంగా ఉండరు. బదులుగా, మొరటుగా, పొగరుబోతుగా ప్రవర్తించేవారినే మనం ఎక్కువగా చూస్తాం. యాకోబుకు ఈ విషయం తెలుసు, అందుకే ఆయన సంఘంలోని వ్యక్తులు అలాంటి స్వభావంవల్ల చెడిపోకుండా ఉండడానికి హెచ్చరికలను ఇచ్చాడు. ఆయనిచ్చిన ఉపదేశం నుండి మనమింకా ఏమి నేర్చుకోవచ్చు?

అజ్ఞానుల లక్షణాలు

11 దైవిక జ్ఞానానికి పూర్తిగా విరుద్ధమైన లక్షణాల గురించి యాకోబు నిర్మొహమాటంగా రాశాడు. (యాకోబు 3:⁠14 చదవండి.) మత్సరము, వివాదము అనేవి శరీరసంబంధ లక్షణాలు, అవి ఆధ్యాత్మిక లక్షణాలు కాదు. శరీరసంబంధంగానే ఆలోచిస్తే ఏమి జరుగుతుందో పరిశీలించండి. యెరూషలేములో యేసు చంపబడి, సమాధిచేయబడిన స్థలంలో నిర్మించబడిందనే హోలీ సపల్‌కర్‌ చర్చీకి సంబంధించిన వివిధ భాగాలను ఆరు “క్రైస్తవ” గుంపులు నియంత్రిస్తున్నాయి. అవి నిరంతరం ఘర్షణపడుతూనే ఉన్నాయి. 2006లో, టైమ్‌ పత్రిక గతంలోని ఓ పరిస్థితిని ప్రస్తావిస్తూ, అక్కడి సన్యాసులు “పెద్దపెద్ద క్యాండిల్‌ హోల్డర్లతో ఒకరినొకరు కొట్టుకుంటూ . . . గంటల తరబడి పోట్లాడుకున్నారు” అని చెబుతోంది. వారిలో పరస్పర అపనమ్మకం ఎంతగా ఉందంటే ఆ చర్చీ తాళపుచెవిని ముస్లిమ్‌ మతస్థునికి అప్పగించారు.

12 అలాంటి తీవ్ర వివాదాలు నిజ క్రైస్తవ సంఘంలో కనిపించకూడదు. అయితే అపరిపూర్ణత కారణంగా ఆయా సమయాల్లో కొందరు తమ అభిప్రాయాల విషయంలో మూర్ఖపు పట్టుదలను కనబర్చారు. అది కొంతమేర జగడానికి, కలహానికి దారితీసింది. అపొస్తలుడైన పౌలు ఇలాంటి పరిస్థితిని కొరింథు సంఘంలో గమనించాడు, అందుకే ఆయనిలా రాశాడు: “మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?” (1 కొరిం. 3:⁠3) మొదటి శతాబ్దంలోని ఈ సంఘంలో కొంతకాలం ఈ విషాదకర పరిస్థితి ఉంది. కాబట్టి, నేడు సంఘంలో అలాంటి స్వభావం ప్రవేశించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి.

13 అలాంటి స్వభావం ఎలా వెల్లడవగలదు? అది చిన్నచిన్న విషయాలతో ఆరంభం కావచ్చు. ఉదాహరణకు, రాజ్యమందిరం నిర్మించేటప్పుడు, పనులు ఎలా చేయాలనే విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ఒక సహోదరుడు తన సలహా అంగీకరించబడనప్పుడు, ఇతరులు తీసుకున్న నిర్ణయాలను బాహాటంగా విమర్శిస్తూ కలహప్రియునిగా మారవచ్చు. ఆ ప్రణాళికకు సంబంధించి ఏ పనులైనా చేయడానికి ఆయన నిరాకరించవచ్చు. అలా ప్రవర్తించే వ్యక్తి, సంఘానికి సంబంధించిన పనిని సాధించడం సాధారణంగా ఓ ప్రత్యేక పద్ధతిని ఉపయోగించడం ద్వారా కాదుగానీ సంఘంలోని సమాధానకరమైన స్ఫూర్తిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మరచిపోతున్నాడు. వివాదాస్పద స్వభావాన్ని కాదుగానీ సాత్వికమైన స్వభావాన్నే యెహోవా ఆశీర్వదిస్తాడు.​—⁠1 తిమో. 6:​4, 5.

14 మరో ఉదాహరణ, ఒక పెద్ద కొన్ని సంవత్సరాలుగా సేవచేస్తున్నా ఆయనిప్పుడు లేఖనాధార అర్హతల్ని కోల్పోయినట్లు సంఘ పెద్దలు గమనించవచ్చు. గతంలో ఆ సహోదరునికి హెచ్చరిక ఇవ్వబడినా ఆయన మార్పు చేసుకోలేదు, ప్రాంతీయ పైవిచారణకర్త తాను సందర్శిస్తున్నప్పుడు ఆ విషయాన్ని గమనించి ఆ వ్యక్తిని పెద్దగా సేవచేయడం నుండి తొలగించాలనే పెద్దల సిఫారసుతో ఏకీభవిస్తాడు. ఇప్పుడు ఆ పెద్ద దానినెలా దృష్టించాలి? పెద్దల ఏకగ్రీవ నిర్ణయాన్ని, లేఖనాధార ఉపదేశాన్ని వినయంతో, సాత్వికంతో అంగీకరించడమే కాక, తాను తిరిగి పెద్దగా సేవచేసేలా లేఖనాధార అర్హతల్ని సంపాదించుకునేందుకు తీర్మానించుకుంటాడా? లేక తానొకప్పుడు కలిగివున్న ఆధిక్యతను కోల్పోయినందుకు ఆయన పగను, అసూయను పెంచుకుంటాడా? ఇతర పెద్దలు తాను అనర్హుడని చెబుతుండగా, తానర్హుడనని ఆ సహోదరుడు ఎందుకు పట్టుబడతాడు? ఈ పరిస్థితుల్లో వినయాన్ని, వివేచనను చూపించడమెంత జ్ఞానయుక్తమో కదా!

15 నిజమే, అలాంటి దృక్పథాన్ని కనబర్చగల ఇతర పరిస్థితులూ ఉండవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితిలోనైనా, అలాంటి లక్షణాలను విసర్జించేందుకు మనం కృషిచేయాలి. (యాకోబు 3:​15, 16 చదవండి.) అలాంటి దృక్పథాలు ‘భూసంబంధమైనవి’ అని శిష్యుడైన యాకోబు అంటున్నాడు, ఎందుకంటే అవి శరీరసంబంధమైనవే కాక, ఆధ్యాత్మికత లోపించినవై ఉంటాయి. అవి యుక్తాయుక్త జ్ఞానంలేని ప్రాణుల లక్షణాల్లాంటి శరీరసంబంధ అభీష్టాల నుండి పుట్టినవి కాబట్టి, అవి ‘ప్రకృతిసంబంధమైనవి.’ అలాంటి దృక్పథాలు “దయ్యముల” సంబంధమైనవి, ఎందుకంటే అవి దేవుని ఆత్మసంబంధ శత్రువుల గుణాలను ప్రతిబింబిస్తాయి. ఒక క్రైస్తవుడు అలాంటి లక్షణాలను కనబర్చడమెంత అనుచితమో కదా!

16 సంఘంలోని ప్రతీ సభ్యుడు ఆత్మపరిశీలన చేసుకొని, అలాంటి లక్షణాలను తొలగించుకునేందుకు కృషిచేయాలి. సంఘంలో బోధకులుగావున్న పైవిచారణకర్తలు తాముగా ప్రతికూల దృక్పథాలను విడిచిపెట్టాల్సిన అవసరతను గుర్తించాలి. అయితే మన అపరిపూర్ణత, ఈ లోక ప్రభావం కారణంగా అలా చేయడం అంత సులభం కాదు. దీనిని మనం బురదతో జారుడుగా ఉన్న గుట్టను ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోల్చవచ్చు. పట్టుకునేందుకు ఏదైనా ఆధారం లేకపోతే మనం జారిపడిపోవచ్చు. అయితే బైబిల్లోని ఉపదేశాన్ని గట్టిగా చేపట్టడంతోపాటు, దేవుని భూవ్యాప్త సంఘం అందిస్తున్న సహాయంతో మనం ముందుకు సాగిపోవచ్చు.​—⁠కీర్త. 73:​23, 24.

జ్ఞానవంతులు కనబర్చడానికి కృషిచేసే లక్షణాలు

17యాకోబు 3:⁠17 చదవండి. “పైనుండివచ్చు జ్ఞానము” కనబర్చడంవల్ల కలిగే కొన్ని లక్షణాలను పరిశీలించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు. పవిత్రంగా ఉండాలంటే, మనం మన క్రియల్లో, ఉద్దేశాల్లో స్వచ్ఛంగా, నిష్కళంకంగా ఉండాలి. చెడు విషయాలను మనం వెంటనే తిరస్కరించాలి. అలా తిరస్కరించడం యాంత్రికంగా జరగాలి. ఒకవేళ ఎవరి వేలైనా మీ కంటికి దగ్గరగా వచ్చిందనుకోండి. మీరు వెంటనే మీ తల పక్కకు తిప్పుతారు లేదా ఆ వేలిని అడ్డుకుంటారు. అది యాంత్రికంగా జరిగిపోతుంది; దాని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. చెడు చేసేందుకు శోధించబడినప్పుడు కూడా మన స్పందన అలాగే ఉండాలి. మన పవిత్రత, బైబిలు శిక్షిత మనస్సాక్షి వెంటనే స్పందించి చెడును తిరస్కరించేలా మనల్ని పురికొల్పాలి. (రోమా. 12:⁠9) ఈ విధంగా ప్రతిస్పందించిన యోసేపు, యేసు వంటివారి ఉదాహరణలను బైబిలు పేర్కొంటోంది.​—⁠ఆది. 39:​7-9; మత్త. 4:​8-10.

18 మనం సమాధానపరులుగా ఉండాలని కూడా పైనుండివచ్చు జ్ఞానం కోరుతుంది. సమాధానపరులుగా ఉండాలంటే మనం విపరీతమైన కోపాన్ని, ఆగ్రహాన్ని విడనాడాలి, సమాధానానికి భంగం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. “నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును” అని చెప్పినప్పుడు యాకోబు సమాధానానికి సంబంధించి మరిన్ని వివరాలిచ్చాడు. (యాకో. 3:​18) ‘సమాధానము చేయడం’ అనే మాటను గమనించండి. సంఘంలో మనం సమాధానాన్ని వృద్ధి చేసేవారిగా ఉన్నామా లేక సమాధానాన్ని పాడుచేసేవారిగా ఉన్నామా? ఊరకనే అభ్యంతరపడేవారిగా లేక వేరేవారికి అభ్యంతరం కలిగించేవారిగా ఉండడంవల్ల, మనకు తరచు ఇతరులతో కలహాలు లేదా అభిప్రాయభేదాలు ఉంటున్నాయా? మనం చెప్పింది ఇతరులు వినాలని పట్టుపడుతున్నామా లేక ఇతరులు చెడ్డవని సరిగానే గుర్తించిన వ్యక్తిత్వ లక్షణాలను మార్చుకునేందుకు వినయంగా కృషిచేస్తున్నామా? ఇతరుల తప్పులను వెంటనే క్షమించి, వాటిని మర్చిపోతూ ఇతరులతో ఎల్లప్పుడూ సమాధానపడేందుకు ప్రయత్నించేవారంగా మనం పేరుపొందామా? ఈ విషయంలో పైనుండివచ్చు జ్ఞానాన్ని కనబర్చడంలో ప్రగతి సాధించాల్సివుందేమో చూసుకునేందుకు నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవడం మనకు సహాయం చేస్తుంది.

19 పైనుండివచ్చు జ్ఞానాన్ని ప్రతిబింబించే లక్షణాల్లో యాకోబు సముచితత్వాన్ని లేదా మృదుత్వాన్ని కూడా చేర్చాడు. లేఖన సూత్రాలు ఇమిడివుండని అంశాల్లో మన వ్యక్తిగత ప్రమాణాలను అనుసరించాలని పట్టుపట్టడానికి త్వరపడే బదులు ఇతరుల అభిప్రాయాలను సమ్మతించడానికి మొగ్గుచూపేవారమని అందరికీ తెలుసా? మృదు స్వభావం గలవారమని, మనతో బెరుకు లేకుండా మాట్లాడవచ్చనే పేరు మనకుందా? మనం సముచితత్వాన్ని నేర్చుకున్నామనేందుకు ఇవే సూచనలు.

20 యాకోబు రాసిన దైవిక లక్షణాలను మరింతగా కనబర్చేందుకు సహోదర సహోదరీలు కృషిచేస్తుండగా సంఘంలో ఎంతటి ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయో కదా! (కీర్త. 133:​1-3) మనం ఒకరితో ఒకరం సాత్వికంగా, సమాధానకరంగా, సముచితంగా ప్రవర్తించినప్పుడు నిశ్చయంగా మెరుగైన సంబంధాలు నెలకొనడమే కాక, మనకు “పైనుండివచ్చు జ్ఞానము” ఉందనే విషయం రుజువౌతుంది. తర్వాత మనం ఇతరులను యెహోవా చూసినట్లే చూసేందుకు నేర్చుకోవడం ఈ అంశాల్లో మనకెలా సహాయం చేస్తుందో చూస్తాం.

[అధస్సూచి]

^ పేరా 6 యాకోబు మనసులో ప్రాథమికంగా సంఘ పెద్దలు లేదా “బోధకులు” ఉన్నారని సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు. (యాకో. 3:⁠1) ఈ పురుషులు నిజమైన జ్ఞానాన్ని కనబర్చడంలో మాదిరికరంగా ఉండాలి, అయితే ఆయనిచ్చిన ఉపదేశం నుండి అందరం ప్రయోజనం పొందవచ్చు.

మీరు వివరించగలరా?

ఒక క్రైస్తవుణ్ణి నిజంగా జ్ఞానవంతుడ్ని చేసేదేమిటి?

దైవిక జ్ఞానాన్ని చూపించడంలో మనమెలా ప్రగతి సాధించవచ్చు?

“పైనుండివచ్చు జ్ఞానము” ప్రదర్శించనివారిలో ఎలాంటి లక్షణాలను చూడవచ్చు?

ఏ లక్షణాలను మీరు మరింతగా వృద్ధి చేసుకోవాలని తీర్మానించుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. జ్ఞానవంతులుగా పరిగణించబడుతున్న చాలామంది గురించి ఏమి చెప్పవచ్చు?

3, 4. ఒక వ్యక్తి నిజంగా జ్ఞానవంతునిగా ఉండాలంటే ఏమి అవసరం?

5. నిజంగా జ్ఞానవంతుడైన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు?

6. ఒకరు దేవునిపోలి నడుచుకుంటున్నారని చెప్పేందుకు సాత్వికము ఎందుకు ఒక రుజువుగా ఉంది, ఈ లక్షణంలో ఏమి ఇమిడివుంది?

7. సాత్వికం విషయంలో మోషే మంచి మాదిరిగా ఉన్నాడని మనమెందుకు చెప్పవచ్చు?

8. అపరిపూర్ణ మానవులు “జ్ఞానముతో కూడిన సాత్వికము” ఎలా కనబర్చవచ్చు?

9, 10. దేవునిలాంటి సాత్వికాన్ని కనబర్చేందుకు మనమెలాంటి కృషిచేయాలి, ఎందుకు చేయాలి?

11. దైవిక జ్ఞానానికి విరుద్ధమైన లక్షణాలేమిటి?

12. జ్ఞానం లోపిస్తే ఏమి జరిగే అవకాశముంది?

13, 14. శరీరసంబంధ స్వభావం ఎలా వెల్లడవుతుందో చూపించే ఉదాహరణలు చెప్పండి.

15. యాకోబు 3:​15, 16లోని దైవప్రేరిత ఉపదేశం ఎంతో ప్రాముఖ్యమని మీరెందుకు అనుకుంటున్నారు?

16. మనమెలాంటి సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది, అలా చేయడంలో మనమెలా విజయం సాధించవచ్చు?

17. చెడు ఎదురైనప్పుడు జ్ఞానవంతులు సాధారణంగా ఎలా స్పందిస్తారు?

18. (ఎ) సమాధానపరులుగా ఉండడమంటే ఏమిటి? (బి) సమాధానాన్ని వృద్ధి చేసేవారిగా ఉండడమంటే అర్థమేమిటి?

19. ఒకరు సముచితమైన వ్యక్తి అని ఎలా అందరికీ తెలుస్తుంది?

20. ఇప్పుడు చర్చించిన దైవిక లక్షణాలను మనం కనబర్చినప్పుడు ఎలాంటి ఫలితం లభిస్తుంది?

[23వ పేజీలోని చిత్రం]

నేడు కలహం ఎలా ఆరంభమవగలదు?

[24వ పేజీలోని చిత్రం]

మీరు చెడును యాంత్రికంగా తిరస్కరిస్తారా?