కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహ జీవితంలో ఆనందాన్ని అనుభవించండి

వివాహ జీవితంలో ఆనందాన్ని అనుభవించండి

వివాహ జీవితంలో ఆనందాన్ని అనుభవించండి

“జ్ఞానమువలన ఇల్లు కట్టబడును, వివేచనవలన అది స్థిరపరచబడును.”​—⁠సామె. 24:⁠3.

జ్ఞానవంతుడైన మన పరలోకపు తండ్రికి, మనకేది మంచిదో తెలుసు. ఉదాహరణకు, తన సంకల్ప నెరవేర్పుకు ఏదెను తోటలో “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు” అని దేవుడు గుర్తించాడు. ఆ సంకల్పంలో, వివాహితులు పిల్లలను కని ‘భూమిని నింపాలి’ అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం.​—⁠ఆది. 1:​28; 2:​18.

2 ‘నరునికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును’ అని యెహోవా అనుకున్నాడు. దేవుడు ఆ తర్వాత మొదటి పురుషునికి గాఢనిద్ర కలిగించి, ఆయన పరిపూర్ణ శరీరంలోనుండి ఒక ప్రక్కటెముకను తీసుకొని, దానిని స్త్రీగా నిర్మించాడు. యెహోవా ఈ పరిపూర్ణ స్త్రీయైన హవ్వను ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయనిలా అన్నాడు: “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము. ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.” హవ్వ నిజంగా ఆదాముకు సాటియైన సహకారి. వీరు ఒక్కొక్కరు ప్రత్యేకమైన లక్షణాలను, గుణాలను కనబరుస్తారు, అయినా వారిద్దరూ పరిపూర్ణులు, దేవుని స్వరూపంలో చేయబడ్డారు. యెహోవా ఆ విధంగా మొదటి వివాహాన్ని ఏర్పాటుచేశాడు. పరస్పర తోడ్పాటును, మద్దతును అందించే ఈ దైవిక ఏర్పాటును ఆదాము, హవ్వలు నిస్సంకోచంగా అంగీకరించారు.​—⁠ఆది. 1:​27; 2:​21-23.

3 విచారకరంగా నేడు ప్రపంచంలో తిరుగుబాటు స్వభావం విస్తరిస్తోంది. దానివల్ల తలెత్తే సమస్యలు దేవునివల్ల కలిగినవి కావు. దేవుడు అనుగ్రహించిన వివాహమనే వరాన్ని చాలామంది హేళనచేస్తూ, అది నేటి సమాజానికి పనికిరాదన్నట్లుగా, విసుగుకు లేక వైరుధ్యాలకు పుట్టినిల్లు అన్నట్లుగా పరిగణిస్తున్నారు. చాలామంది వివాహితుల్లో విడాకులు సర్వసాధారణమైపోయాయి. పిల్లలపట్ల సహజమైన అనురాగం కొరవడింది, వైవాహిక ఘర్షణల్లో దంపతులు పిల్లలను పావులుగా వాడుకుంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు కనీసం శాంతి, ఐక్యతల కోసమైనా సమ్మతించేవారిగా ఉండేందుకు ఇష్టపడడం లేదు. (2 తిమో. 3:⁠3) అలాగైతే, ఈ అపాయకరమైన కాలాల్లో వివాహ జీవితంలో ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ఎలాంటి వివాహ విచ్ఛిన్నాన్నైనా సమర్థవంతంగా అడ్డుకోవడంలో, సమ్మతించేవారిగా ఉండడం ఏ పాత్ర పోషిస్తుంది? తమ వివాహ జీవితంలో ఆనందాన్ని కాపాడుకున్న దంపతుల ఆధునిక ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

యెహోవా నిర్దేశానికి లోబడడం

4 విధవరాండ్రు మళ్లీ వివాహం చేసుకోవాలనుకుంటే, వారు “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు దైవప్రేరిత నిర్దేశాన్నిచ్చాడు. (1 కొరిం. 7:​39) యూదామత నేపథ్యంగల క్రైస్తవులకు ఇది క్రొత్త తలంపేమీ కాదు. తమ చుట్టూవున్న అన్యజనాంగాలతో “వియ్యమందకూడదు” అని దేవుని ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు స్పష్టమైన నిర్దేశమిచ్చింది. ఈ దైవ నియమాన్ని నిర్లక్ష్యం చేయడంలోని ప్రమాదాన్ని నొక్కిచెప్పే మరింత సమాచారాన్ని యెహోవా ఇచ్చాడు. “నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు [ఇశ్రాయేలీయులు కానివారు] మళ్లించుదురు; అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.” (ద్వితీ. 7:​3, 4) వివాహ జతను ఎంచుకునే విషయంలో తన ఆధునిక సేవకులు ఎలా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు? నిస్సందేహంగా దేవుని సేవకుడు, సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్న తోటి ఆరాధకురాలిగా “ప్రభువునందు” ఉన్న వ్యక్తినే వివాహ జతగా ఎంచుకోవాలి. ఈ విషయంలో యెహోవా నిర్దేశానికి లోబడడం జ్ఞానయుక్తం.

5 పెళ్లి ప్రమాణాలు దేవుని దృష్టిలో పవిత్రమైనవి. మొదటి వివాహాన్ని ప్రస్తావిస్తూ దేవుని కుమారుడైన యేసు ఇలా అన్నాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్త. 19:⁠6) ప్రమాణాల గంభీరతను నొక్కిచెబుతూ యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాట తప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.” (సంఖ్యా. 30:⁠2) వివాహితులు ఎంతో ఆనందం అనుభవించవచ్చు, కానీ పెళ్లిరోజున పరస్పరం చేసుకున్న ప్రమాణాలు గంభీరమైనవి, వారికి బాధ్యతను తీసుకువస్తాయి.​—⁠ద్వితీ. 23:​21.

6 యెఫ్తా విషయమే తీసుకోండి, ఆయన సా.శ.పూ. 12వ శతాబ్దంలో ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా సేవచేశాడు. ఆయన యెహోవాకు ఈ విధంగా మొక్కుకున్నాడు: “నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల నేను అమ్మోనీయులయొద్దనుండి క్షేమముగా తిరిగి​వచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటిద్వారము​నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహనబలిగా దాని నర్పించెదను.” యెఫ్తా మిస్పాలోవున్న తన ఇంటికి తిరిగివస్తున్నప్పుడు తన ఒక్కగానొక్క కూతురు తనను కలుసుకోవడానికి రావడం చూసినప్పుడు, ఆయన తన మొక్కుబడిని రద్దు చేసుకోవడానికి ప్రయత్నించాడా? లేదు. బదులుగా ఆయనిలా అన్నాడు: “నేను యెహోవాకు మాటయిచ్చి యున్నాను గనుక వెనుకతీయలేను.” (న్యాయా. 11:​30, 31, 35) తనకు వారసులు ఉండరని తెలిసినా యెఫ్తా యెహోవాకు తాను చేసిన ప్రమాణం నిలబెట్టుకున్నాడు. యెఫ్తా చేసిన మొక్కుబడి పెళ్లి ప్రమాణాల వంటిది కాదు, అయితే ఆయన ఆ మొక్కుబడిని నిలబెట్టుకోవడం తాము చేసిన ప్రమాణాల విషయంలో క్రైస్తవ భర్తలకు, భార్యలకు చక్కని మాదిరిగావుంది.

వివాహ విజయానికి తోడ్పడేదేమిటి?

7 దంపతుల్లో చాలామంది తమ కోర్ట్‌షిప్‌ రోజుల్ని మధురంగా జ్ఞాపకం చేసుకుంటారు. కాబోయే భాగస్వామి గురించి తెలుసుకోవడం వారికెంత ఆనందాన్నిచ్చివుంటుందో కదా! కలిసి ఎంత ఎక్కువ సమయం గడిపారో అంత ఎక్కువగా ఒకరినొకరు తెలుసుకున్నారు. కోర్ట్‌షిప్‌ తర్వాత పెళ్లి జరిగినా లేక పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా, చివరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనప్పుడు సర్దుబాట్లు చేసుకోవడం ప్రాముఖ్యం. ఒక భర్త ఇలా అంగీకరిస్తున్నాడు: “మా పెళ్లైన కొత్తలో, మేమిక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల అవివాహితులం కాదని గ్రహించడమే మాకొక పెద్ద సమస్యగా అనిపించింది. కొంతకాలంపాటు మా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతనివ్వకుండా ఉండడం మాకు కష్టమైపోయింది.” వివాహమై ఇప్పటికి 30 సంవత్సరాలు గడచిన మరో భర్త, పెళ్లైన తొలినాళ్లలో సమతుల్యంగా ఉండేందుకు తాను “తామిద్దరి గురించి ఆలోచించాలి” అని గ్రహించాడు. ఏదైనా ఆహ్వానాన్ని అంగీకరించడానికి లేదా మాట ఇవ్వడానికి ముందు ఆయన తన భార్యను సంప్రదించి, వారిద్దరి అభీష్టం ప్రకారం నిర్ణయం తీసుకొనేవాడు. అలాంటి పరిస్థితిలో సమ్మతించేవారిగా ఉండడం సహాయకరంగా ఉంటుంది.​—⁠సామె. 13:​10.

8 కొన్నిసార్లు భిన్న సంస్కృతుల నేపథ్యాలవారు వివాహం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో స్వేచ్ఛగా సంభాషించుకోవడం మరింత అవసరం. సంభాషణా విధానాలు భిన్నంగా ఉంటాయి. బంధువులతో మీ భాగస్వామి మాట్లాడే విధానాన్ని గమనించడం మీ భాగస్వామిని మరింతగా అర్థం చేసుకునేందుకు సహాయం చేస్తుంది. కొన్నిసార్లు, ఏమి మాట్లాడారనేది కాదుగానీ ఎలా మాట్లాడారనేదే ఒక వ్యక్తి హృదయాలోచనను వెల్లడిస్తుంది. మాటల్లో వ్యక్తంచేయని మనోభావాల నుండి కూడా ఎంతో తెలుసుకోవచ్చు. (సామె. 16:​24; కొలొ. 4:⁠6) సంతోషానికి వివేచన ప్రాముఖ్యం.​—⁠సామెతలు 24:⁠3 చదవండి.

9 వ్యాసంగాలను, వినోదాన్ని ఎంచుకునే విషయానికి వచ్చినప్పుడు, ఒకరి అభిరుచికి అనుగుణంగా మరొకరు మారగలిగేలా ఉండడం ప్రాముఖ్యమని చాలామంది గ్రహించారు. వివాహానికి ముందు మీరు క్రీడల్లో లేదా ఇతర ఉల్లాస కార్యకలాపాల్లో సమయం గడిపి ఉండవచ్చు. ఇప్పుడు కొంత సర్దుబాటు చేసుకోవడం సముచితంగా ఉండదా? (1 తిమో. 4:⁠8) బంధువులతో గడిపే సమయం గురించి కూడా ఇదే ప్రశ్న వేసుకోవచ్చు. ఆధ్యాత్మిక, మరితర కార్యకలాపాల్లో దంపతులు కలిసి పాల్గొనేందుకు వారికి కొంత సమయం అవసరమనేది అర్థం చేసుకోదగినదే.​—⁠మత్త. 6:​33.

10 కొన్నిదేశాల్లో ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళుతుంది, కొన్ని సందర్భాల్లో పురుషుడు కూడా అలాగే చేస్తాడు. అయితే, తల్లిదండ్రులను గౌరవించాలనే దైవిక నిర్దేశానికి కాలపరిమితి లేదు. కాబట్టి ఒక జంట పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తమ తల్లిదండ్రులతో, అత్తామామలతో సమయం గడపాలనుకోవచ్చు. అయితే వారు తల్లిదండ్రులతో, అత్తా​మామలతో సమయం గడిపే విషయంలో సర్దుబాటు చేసుకోవడం సముచితం కాదా? (ఆదికాండము 2:​24 చదవండి.) గత 25 సంవత్సరాలుగా భర్తగావున్న ఒకాయన ఇలా అంటున్నాడు: “అటు తల్లిదండ్రుల, తోబుట్టువుల, అత్తింటి సభ్యుల అభిలాషలను, అవసరాలను, ఇటు భాగస్వామి అభిలాషలను, అవసరాలను తీర్చడంలో సమతూకం కలిగివుండడం కొన్నిసార్లు కష్టం. ఎలా చేయడం ఉత్తమమో నిర్ణయించుకోవడానికి ఆదికాండము 2:​24 సహాయకరంగా ఉన్నట్లు నేను కనుగొన్నాను. ఒక వ్యక్తి తన కుటుంబంలోని ఇతర సభ్యులపట్ల యథార్థంగా ఉండడం, వారి విషయంలో తన బాధ్యతలను నెరవేర్చడం అవసరమే అయినా, నా భార్యపట్ల యథార్థంగా ఉండడం మరింత ప్రాముఖ్యమని ఈ వచనం నాకు చూపించింది.” అదే విధంగా, సమ్మతించే క్రైస్తవ తల్లిదండ్రులు వివాహితులైన తమ పిల్లలకు ఇప్పుడు ఒక కుటుంబం ఏర్పడిందని, ఆ కుటుంబాన్ని నిర్దేశించే బాధ్యత ముఖ్యంగా భర్తకు ఉందని గ్రహించి ఆ ఏర్పాటుపట్ల తమ గౌరవాన్ని కనబరుస్తారు.

11 చక్కని క్రమంతో కుటుంబ అధ్యయనం చేయడం ప్రాముఖ్యం. అనేక క్రైస్తవ కుటుంబాల అనుభవం ఆ విషయాన్ని ధృవీకరిస్తోంది. అలాంటి అధ్యయనాన్ని క్రమంగా ఏర్పాటు చేసుకోవడంగానీ, కాలం గడుస్తుండగా దానిని అలాగే కొనసాగించడంగానీ అంత సులభం కాదు. ఒక కుటుంబ శిరస్సు ఇలా అంగీకరిస్తున్నాడు: “మేము గతంలోకి వెళ్లి ఏదైనా చక్కదిద్దగలిగితే అది, మా వివాహ ఆరంభం నుండి చక్కని క్రమంతో కుటుంబ అధ్యయనం చేయడానికి కట్టుబడి ఉండాలని నిర్ధారించుకోవడమే.” ఆయనింకా ఇలా అంటున్నాడు: “మా అధ్యయనంలో సమిష్టిగా గ్రహించిన ఆసక్తికరమైన బైబిలు సత్యాన్నిబట్టి మా ఆవిడ వ్యక్తపర్చే ఆనందాన్ని గమనించడం అద్భుతంగా ఉంటుంది.”

12 కలిసి ప్రార్థించడం కూడా సహాయకరంగా ఉంటుంది. (రోమా. 12:​12) భార్యాభర్తలు యెహోవా ఆరాధనలో ఐక్యమైనప్పుడు, దేవునితో వారికున్న సన్నిహిత సంబంధం వారి వివాహబంధాన్ని బలపరుస్తుంది. (యాకో. 4:⁠8) ఒక క్రైస్తవ భర్త ఇలా వివరిస్తున్నాడు: “చేసిన తప్పులకు తక్షణమే క్షమాపణ అడగడం, కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఆ తప్పులను ప్రస్తావించడం, బాధకలిగించిన చిన్న విషయంపట్ల కూడా నిజంగా విచారాన్ని వెలిబుచ్చడానికి ఒక మార్గం.”​—⁠ఎఫె. 6:​18.

వివాహంలో సమ్మతించేవారిగా ఉండండి

13 క్రైస్తవ దంపతులు దాంపత్య సంబంధాలను దిగజార్చే క్రియలను విసర్జించాలి, అలాంటి క్రియలు నేటి లైంగికోన్మాద ప్రపంచంలో సర్వసాధారణం. ఈ అంశంపై పౌలు ఇలా ఉపదేశించాడు: “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకేగాని భార్యకు తన దేహము పైని అధికారము లేదు; ఆలాగున భార్యకేగాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు.” ఆ పిమ్మట పౌలు ఈ స్పష్టమైన నిర్దేశమిచ్చాడు: “ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు, కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరి​నొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేక​పోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.” (1 కొరిం. 7:​3-5) ప్రార్థనను ప్రస్తావించడంలో పౌలు, ఒక క్రైస్తవుడు ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయాలేమిటో వివరిస్తున్నాడు. అయితే ఆయన, ప్రతీ వివాహిత క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు తన భాగస్వామి భౌతిక, భావావేశ అవసరాలకు స్పందించాలని కూడా స్పష్టం చేశాడు.

14 భార్యాభర్తలు అరమరికల్లేకుండా మాట్లాడుకోవాలి, అంతేకాక దాంపత్య సంబంధాల్లో కోమలత్వం లోపించడం సమస్యలకు దారితీయవచ్చని గ్రహించాలి. (ఫిలిప్పీయులు 2:​3, 4 చదవండి; మత్తయి 7:​12 పోల్చండి.) భార్యాభర్తల్లో ఒకరు సత్యంలో లేని కొన్ని కుటుంబాల్లో ఇలా జరుగుతున్నట్లు రుజువైంది. అభిప్రాయభేదాలున్నా, క్రైస్తవుడైన వ్యక్తి సాధారణంగా చక్కని ప్రవర్తన, దయ చూపించడం, సహకరించడం ద్వారా పరిస్థితిని మెరుగుపర్చవచ్చు. (1 పేతురు 3:​1-2 చదవండి.) సమ్మతించడంతోపాటు యెహోవాపట్ల, భాగస్వామిపట్ల ప్రేమ చూపించడం దాంపత్య జీవితానికి సహాయం చేస్తుంది.

15 ఇతర విషయాల్లో కూడా దయగల భర్త తన భార్యను గౌరవంగా చూసుకుంటాడు. ఉదాహరణకు, చిన్న విషయాల్లో కూడా ఆయన తన భార్య మనోభావాలను పరిగణలోకి తీసుకుంటాడు. నలభై ఏడు సంవత్సరాలుగా భర్తగావున్న ఒకాయన ఇలా అంగీకరిస్తున్నాడు: “ఈ విషయంలో నేనింకా నేర్చుకుంటూనే ఉన్నాను.” భర్తలపట్ల ‘ప్రగాఢ గౌరవాన్ని’ కలిగివుండాలని క్రైస్తవ భార్యలకు చెప్పబడింది. (ఎఫె. 5:⁠33, NW) భర్తల గురించి చెడుగా మాట్లాడడం, ఇతరుల ముందు వారి తప్పులను ఎత్తిచెప్పడం ఆయనపట్ల గౌరవం ఉన్నట్లు చూపించదు. సామెతలు 14:⁠1 మనకిలా గుర్తుచేస్తోంది: “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును.”

అపవాదికి లోబడకండి

16 “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.” (ఎఫె. 4:​26, 27) ఈ మాటలను అన్వయించుకుంటే, అవి వివాహ తగవులను పరిష్కరించుకోవడానికి లేదా రాకుండా చేసుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. “భర్తతో నేను విభేదించి దానిని పరిష్కరించుకోవడానికి చాలా గంటలు పట్టినా సరే దానిగురించి నా భర్తతో చర్చించకుండా ఉండడం నాకు గుర్తులేదు” అని ఒక సహోదరి గుర్తు చేసుకుంటోంది. తమ అభిప్రాయభేదాలను పరిష్కరించుకోకుండా రోజు గడిచి పోనివ్వద్దని ఆమె, ఆమె భర్త తమ వివాహ ఆరంభంలోనే నిర్ణయించుకున్నారు. “సమస్య ఏదైనాసరే క్షమించి, మర్చిపోయి ప్రతీరోజును తాజాగా ఆరంభించుకోవాలని మేము నిర్ణయించుకున్నామని” ఆమె చెబుతోంది. ఆ విధంగా వారు ‘అపవాదికి చోటివ్వలేదు.’

17 మీ భాగస్వామిని పెళ్లి చేసుకొని ఉండాల్సింది కాదని మీరు భావిస్తుంటే అప్పుడేమిటి? ఇతరులున్నంత ప్రేమగా మీ దాంపత్య జీవితం లేదని మీకిప్పుడు అనిపించవచ్చు. అయినప్పటికీ, వివాహబంధం విషయంలో సృష్టికర్త దృక్కోణాన్ని గుర్తుచేసుకోవడం మీకు సహాయం చేస్తుంది. దైవప్రేరణతో పౌలు క్రైస్తవులకు ఇలా ఉపదేశించాడు: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” (హెబ్రీ. 13:⁠4) అలాగే, “మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు” అనే మాటలనూ నిర్లక్ష్యం చేయకూడదు. (ప్రసం. 4:​12) భార్యాభర్తలిద్దరూ యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చే విషయంలో ప్రగాఢ శ్రద్ధను కలిగివున్నప్పుడు, వారిద్దరూ ఒకరికి ఒకరు కట్టుబడి ఉండడమే కాక, దేవునికి కూడా కట్టుబడి ఉంటారు. తమ వివాహాన్ని విజయవంతం చేసుకునేందుకు వారిద్దరూ కృషిచేయాలి, అలా చేయడం వివాహానికి మూలకర్తయైన యెహోవాకు ఘనతను తీసుకొస్తుందని గుర్తుంచుకోవాలి.​—⁠1 పేతు. 3:​11.

18 వివాహ జీవితంలో ఆనందాన్ని అనుభవించడం క్రైస్తవులకు నిశ్చయంగా సాధ్యమే. అలా అనుభవించేందుకు కృషి, క్రైస్తవ లక్షణాలను కనబర్చడం అవసరం, ఈ క్రైస్తవ లక్షణాల్లో ఒకటి సమ్మతించడం. నేడు, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లోని ఎంతోమంది దంపతులు వివాహంలో ఆనందాన్ని అనుభవించవచ్చని నిరూపించారు.

మీరెలా జవాబిస్తారు?

• వివాహ జీవితంలో ఆనందాన్ని కనుగొనడం ఎందుకు అవాస్తవికం కాదు?

• వివాహం విజయవంతమవడానికి ఏది సహాయం చేయగలదు?

• దంపతులు ఏ లక్షణాలను వృద్ధిచేసుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. మొదటి పురుషుని విషయంలో దేవుడు జ్ఞానాన్ని ఎలా ప్రదర్శించాడు?

2. మానవాళి ప్రయోజనార్థమై యెహోవా ఎలాంటి ఏర్పాటు చేశాడు?

3. వివాహమనే వరాన్ని చాలామంది ఎలా పరిగణిస్తున్నారు, ఫలితంగా ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి?

4. (ఎ) వివాహం విషయంలో పౌలు ఎలాంటి నిర్దేశమిచ్చాడు? (బి) విధేయులైన క్రైస్తవులు పౌలు నిర్దేశాన్ని ఎలా అనుసరిస్తారు?

5. పెళ్లి ప్రమాణాలను యెహోవా, వివాహిత క్రైస్తవులు ఎలా దృష్టిస్తారు?

6. యెఫ్తా మాదిరినుండి మనమేమి నేర్చుకోవచ్చు?

7. కొత్తగా పెళ్లైనవారు ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలి?

8, 9. (ఎ) చక్కని సంభాషణ ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఏ రంగాల్లో ఒకరి అభిరుచికి అనుగుణంగా మరొకరు మారగలిగేలా ఉండడం సహాయం చేస్తుంది, ఎందుకు?

10. సమ్మతించేవారిగా ఉండడం తల్లిదండ్రులకు, వివాహితులైన పిల్లలకు మధ్య చక్కని సంబంధాలకు ఎలా తోడ్పడుతుంది?

11, 12. దంపతులకు కుటుంబ అధ్యయనం, ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యం?

13. దాంపత్య జీవితం గురించి పౌలు ఏ సలహా ఇచ్చాడు?

14. దాంపత్య జీవితానికి లేఖన సూత్రాలు ఎలా అన్వయిస్తాయి?

15. సంతోషభరిత వివాహంలో గౌరవం ఏ పాత్ర పోషిస్తుంది?

16. దంపతులు ఎఫెసీయులు 4:​26, 27ను ఎలా అన్వయించుకోవచ్చు?

17. వివాహ భాగస్వామి తగినవ్యక్తి కాదని అనిపించినప్పుడు కూడా ఏది సహాయం చేయవచ్చు?

18. వివాహం విషయంలో దేనిగురించి మీరు నిశ్చయత కలిగి​వుండవచ్చు?

[9వ పేజీలోని చిత్రం]

ఏదైనా ఆహ్వానాన్ని అంగీకరించడానికి లేదా మాట ఇవ్వడానికి ముందు దంపతులు జ్ఞానయుక్తంగా పరస్పరం సంప్రదించుకుంటారు

[10వ పేజీలోని చిత్రం]

‘అపవాదికి చోటివ్వకుండా’ ఆ రోజే అభిప్రాయభేదాలను పరిష్కరించుకోవడానికి కృషిచేయండి