కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమ్మతించడంలో సమతుల్యంగా ఉండండి

సమ్మతించడంలో సమతుల్యంగా ఉండండి

సమ్మతించడంలో సమతుల్యంగా ఉండండి

‘శాంతులై [“సమ్మతించేవారై,” NW] ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయుము.’​—⁠తీతు 3:​1-2.

మన ప్రేమగల పరలోకపు తండ్రియైన యెహోవా ఎంతో జ్ఞానవంతుడు. ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి, మన జీవితాల్లో నిర్దేశం కోసం మనమాయనవైపు చూస్తాం. (కీర్త. 48:​14) “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది [‘సమ్మతించేది,’ NW] సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది” అని క్రీస్తు శిష్యుడైన యాకోబు మనకు చెబుతున్నాడు.​—⁠యాకో. 3:​17.

2 “మీ సహనమును [‘సమ్మతించే గుణాన్ని,’ NW] సకల జనులకు తెలియబడనియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. * (ఫిలి. 4:⁠5) క్రీస్తుయేసు క్రైస్తవ సంఘానికి ప్రభువు, శిరస్సు. (ఎఫె. 5:​23) కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం క్రీస్తు నిర్దేశాన్ని సమ్మతించడమే కాక, తోటి మానవులతో సముచితంగా ప్రవర్తిస్తూ, వారి అభిప్రాయాలను సమ్మతించేవారిగా ఉండడమెంత ప్రాముఖ్యమో కదా!

3 సమ్మతించడంలో సమతుల్యంగా ఉండడంవల్ల మనమెన్నో ప్రయోజనాలు పొందుతాం. ఉదాహరణకు: బ్రిటన్‌లో ఉగ్రవాదులు దాడి జరపడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానం నిజమేనని రుజువైన తర్వాత, విమాన ప్రయాణికుల్లో అనేకులు తామిదివరకు తీసుకెళ్లడానికి అనుమతించబడిన వస్తువులు ఇక మీదట తీసుకువెళ్ళకూడదని విధించబడిన నియమాలకు లోబడేందుకు సుముఖంగావున్నట్లు కనిపించారు. మనం వాహనం నడిపిస్తున్నప్పుడు, ఎవరికీ ప్రమాదం జరగకుండా, ట్రాఫిక్‌ సాఫీగా ముందుకు సాగేలా, రహదారుల కూడళ్లలో ఇతర డ్రైవర్లు ఇచ్చే సూచనలకు సమ్మతించవలసిన అవసరతను చూస్తాం.

4 మనలో చాలామందికి సమ్మతించడం సులభమేమీ కాదు. ఈ విషయంలో మనం సహాయం పొందడానికి, సమ్మతించడానికి సంబంధించిన మూడు అంశాలను అంటే మన ఉద్దేశం, అధికారంపట్ల మన దృక్పథం, మనం ఎంతమేరకు సమ్మతించాలి అనేవాటిని పరిశీలిద్దాం.

ఎందుకు సమ్మతించాలి?

5 క్రైస్తవపూర్వ కాలాలకు చెందిన ఒక ఉదాహరణ, సమ్మతించడానికిగల సరైన ఉద్దేశాన్ని నొక్కిచెబుతోంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, దాసులుగా మారిన హెబ్రీయులు తమ దాసత్వపు ఏడవ సంవత్సరంలో లేదా సునాద సంవత్సరంలో, అంటే ఏది ముందుగా వస్తే దానిలో, తమ దాసత్వం నుండి స్వతంత్రులౌతారు. అయితే ఒక దాసుడు దాసత్వంలోనే ఉండిపోయేందుకు నిర్ణయించుకోవచ్చు. (నిర్గమకాండము 21:​5, 6 చదవండి.) అలా ఉండిపోయేలా ఆ దాసుణ్ణి ఏది పురికొల్పవచ్చు? దయగల తన యజమానికి దాసునిగా ఉండిపోయేందుకు ప్రేమే ఆయనను పురికొల్పుతుంది.

6 అదే విధంగా, యెహోవాపట్ల మనకున్న ప్రేమే ఆయనకు మన జీవితాలను సమర్పించుకొని, మన సమర్పణకు తగ్గట్టు జీవించేలా మనల్ని పురికొల్పుతుంది. (రోమా. 14:​7, 8) “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. (1 యోహా. 5:⁠3) ఈ ప్రేమ స్వప్రయోజనాన్ని చూసుకోదు. (1 కొరిం. 13:​4, 5) మనం పొరుగువారితో వ్యవహరించేటప్పుడు వారిపట్ల మనకున్న ప్రేమ మనం సమ్మతించేవారిగా ఉండేందుకు, వారి విషయాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం స్వార్థపరులుగా ఉండే బదులు ఇతరుల విషయాలకు ప్రాధాన్యతనిస్తాం.​—⁠ఫిలి. 2:​2, 3.

7 మన మాటలుగానీ, చేతలుగానీ ఇతరులకు అభ్యంతరం కలిగించకూడదు. (ఎఫె. 4:​29) అవును, వివిధ నేపథ్యాల, సంస్కృతుల ప్రజలు యెహోవాను సేవించే విషయంలో ప్రగతి సాధించకుండా ఆటంకపరచగల దేనినీ చేయకుండా ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది. దీనిలో తరచూ మనం సమ్మతించేవారిగా ఉండడం ఇమిడివుంటుంది. ఉదాహరణకు, మిషనరీ సహోదరీలు తమకు అలవాటైన వస్త్ర​ధారణ, మేకప్‌ వంటి వాటినిబట్టి ఇతరులు తమను తప్పుగా అర్థం చేసుకునే లేదా అభ్యంతరపడే ప్రదేశాల్లో తమ పద్ధతిని మార్చుకోకుండా అలాగే ఉంటామని పట్టుబట్టరు.​—⁠1 కొరిం. 10:​31-33.

8 యెహోవాపట్ల మన ప్రేమ అహంకారాన్ని విసర్జించేందుకు మనకు సహాయం చేస్తుంది. తమలో ఎవరు గొప్ప అనే వివాదం శిష్యుల్లో తలెత్తినప్పుడు, యేసు వారిమధ్య ఒక చిన్నబిడ్డను నిలబెట్టి వారితో ఇలా అన్నాడు: “ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన​వానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు.” (లూకా 9:​48; మార్కు 9:​36) ‘అత్యల్పులముగా’ ఉండడం మనకు వ్యక్తిగతంగా ఎంతో కష్టమనిపించవచ్చు. వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత, అహంకార స్వభావం పేరుప్రతిష్ఠల కోసం ప్రాకులాడేలా మనల్ని పురికొల్పితే, వినయం సమ్మతించేవారిగా ఉండేందుకు అంటే ఇతరులను మనకంటే గొప్పవారిగా చూసేందుకు మనకు సహాయం చేస్తుంది.​—⁠రోమా. 12:​10.

9 సమ్మతించేవారిగా ఉండాలంటే మనం దైవ నియమిత అధికారాన్ని గుర్తించాలి. నిజ క్రైస్తవులందరూ శిరస్సత్వానికి సంబంధించిన ప్రాముఖ్యమైన సూత్రాన్ని గుర్తిస్తారు. అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని కొరింథీయులకు స్పష్టంగా ఇలా సూచించాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.”​—⁠1 కొరిం. 11:⁠3.

10 దేవుని అధికారాన్ని సమ్మతించేవారిగా ఉండడం, ప్రేమగల తండ్రిగా ఆయనపై మనకున్న నమ్మకాన్ని, ప్రగాఢ విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. జరిగేవన్నీ ఆయనకు తెలుసు, తదనుగుణంగా ఆయన మనకు ప్రతిఫలమిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం, ఇతరులు మనల్ని అవమానించినప్పుడు లేదా కోపంతో ఉగ్రులైనప్పుడు మనం సహించేవారిగా ఉండేందుకు తోడ్పడుతుంది. పౌలు ఇలా రాశాడు: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” ఈ సలహాను పౌలు ఈ ఆదేశంతో ముడిపెట్టాడు: “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి​—⁠పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.”​—⁠రోమా. 12:​18, 19.

11 క్రైస్తవ సంఘంలో కూడా మనం దైవ నియమిత అధికారానికి సమ్మతించేవారిగా ఉండాలి. ప్రకటన 1వ అధ్యాయం, క్రీస్తుయేసు సంఘానికి సంబంధించిన “నక్షత్రములను” తన కుడిచేతిలో పట్టుకుని ఉన్నాడని వర్ణిస్తోంది. (ప్రక. 1:16, 19) విస్తృతార్థంలో ఈ “నక్షత్రములు” సంఘాల్లోని పెద్దల లేదా పైవిచారణకర్తల సభలను సూచిస్తున్నాయి. అలాంటి నియమిత పైవిచారణకర్తలు క్రీస్తు నాయకత్వానికి లోబడుతూ, ఇతరులతో ఆయన వ్యవహరించిన దయాపూర్వక విధానాన్ని అనుకరిస్తారు. సంఘంలోని వారందరూ, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్నిచ్చేలా యేసు చేసిన ఏర్పాటుకు లోబడతారు. (మత్త. 24:​45-47) నేడు, మనమీ సమాచారాన్ని అధ్యయనం చేసి, అన్వయించుకోవడానికి సుముఖంగా ఉండడం మనం వ్యక్తిగతంగా క్రీస్తు శిరస్సత్వాన్ని సమ్మతిస్తున్నామని వెల్లడిస్తుంది, అలా సమ్మతించడం సమాధానానికి, ఐక్యతకు దోహదపడుతుంది.​—⁠రోమా. 14:​13, 19.

ఎంతమేరకు సమ్మతించాలి?

12 సమ్మతించేవారిగా ఉండడమంటే దానర్థం మన విశ్వాసం విషయంలో లేదా మన దైవిక సూత్రాల విషయంలో రాజీపడడమని కాదు. యేసు నామమునుబట్టి బోధించకూడదని మతనాయకులు ఆజ్ఞాపించినప్పుడు తొలి క్రైస్తవులు ఏమిచేశారు? పేతురు, ఇతర అపొస్తలులు ధైర్యంగా ఇలా అన్నారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.” (అపొ. 4:​18-20; 5:​28, 29) అదే విధంగా నేడు, ప్రభుత్వాలు మనం సువార్త ప్రకటించకూడదని మనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినప్పుడు, యుక్తిగా ఆ పరిస్థితితో వ్యవహరించడానికి మన పద్ధతుల్లో సర్దుబాటు చేసుకుంటామేగానీ, ప్రకటించడం మాత్రం మానుకోము. ఒకవేళ ఇంటింటి పరిచర్య నిషేధించ​బడితే, గృహస్థులను కలుసుకునేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ, దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడుతూనే ఉంటాం. అలాగే, “పై అధికారులు” మనం కూటాలు జరుపుకోవడాన్ని నిషేధిస్తే, చాటుగా మనం చిన్న గుంపులుగా కూడుకుంటాం.​—⁠రోమా. 13:⁠1; హెబ్రీ. 10:​24-25.

13 కొండమీది ప్రసంగంలో యేసు అధికారంలో ఉన్నవారితో సమ్మతించాల్సిన అవసరతను సూచిస్తూ ఇలా అన్నాడు: “ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము. [‘అధికారంలో ఉన్న,’ NW] ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతముచేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.” (మత్త. 5:​40, 41) * ఇతరులపట్ల శ్రద్ధ, వారికి సహాయం చేయాలనే కోరిక కూడా ఆ రెండో మైలు వెళ్లేందుకు అంటే అడిగినదానికన్నా ఎక్కువే చేసేందుకు మనల్ని ప్రేరేపిస్తాయి.​—⁠1 కొరిం. 13:⁠5; తీతు 3:​1, 2.

14 అయితే సమ్మతించాలనే మన అభిలాష, మనం మతభ్రష్టులతో రాజీపడేందుకు దారితీయకూడదు. సత్యం యొక్క స్వచ్ఛతను, సంఘ ఐక్యతను కాపాడేందుకు మనకు ఈ విషయంలో స్పష్టమైన, స్థిరమైన దృక్పథం ఉండాలి. “కపట సహోదరుల” గురించి పౌలు ఇలా రాశాడు: “సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.” (గల. 2:​4, 5) ఒకవేళ ఎప్పుడైనా మతభ్రష్టత్వం బయట​పడినా, విశ్వాసపాత్రులైన క్రైస్తవులు సత్యం పక్షాన స్థిరంగా నిలబడతారు.

పైవిచారణకర్తలు సమ్మతించేవారిగా ఉండాలి

15 పైవిచారణకర్తలుగా సేవచేసేందుకు నియమించబడేవారికి ఉండాల్సిన అర్హతల్లో ఒకటి సాత్వికులుగా లేదా సమ్మతించేవారిగా ఉండేందుకు ఇష్టపడడం. పౌలు ఇలా రాశాడు: “అధ్యక్షుడగువాడు . . . సాత్వికుడై” ఉండాలి. (1 తిమో. 3:​2-3) నియమిత పెద్దలు సంఘ విషయాలను విచారించేందుకు కూడుకున్నప్పుడు అలా ఉండడం ప్రత్యేకంగా ప్రాముఖ్యం. ప్రతీ పెద్ద ఏదోకటి తప్పనిసరిగా వ్యాఖ్యానించాలనే నియమం లేకపోయినా, ఒక నిర్ణయానికి వచ్చేముందు ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా, స్పష్టంగా తమ అభిప్రాయాలను వెల్లడిచేయవచ్చు. చర్చ జరుగుతున్నప్పుడు, అన్వయించే లేఖన సూత్రాలను ఇతరులు పేర్కొన్నప్పుడు ఒకరి అభిప్రాయం మారవచ్చు. ఇతరుల అభిప్రాయాలతో విభేదిస్తూ, సొంత అభిప్రాయాలకే అంటిపెట్టుకునే బదులు పరిణతిగల పెద్ద సమ్మతించే వ్యక్తిగా ఉంటాడు. చర్చకు ముందు విభిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, అయితే ప్రార్థనాపూర్వకంగా ఆలోచించడం నమ్రత చూపించే, సమ్మతించే పెద్దలమధ్య ఐక్యతకు తోడ్పడుతుంది.​—⁠1 కొరిం. 1:​10; ఎఫెసీయులు 4:​1-3 చదవండి.

16 ఒక క్రైస్తవ పెద్ద తన కార్యకలాపాలన్నింటిలో దైవ​పరిపాలనా క్రమాన్ని పాటించేందుకు కృషిచేయాలి. మందను కాసేటప్పుడు సహితం అలాంటి స్వభావాన్నే కనబర్చాలి, అది ఇతరులపట్ల శ్రద్ధచూపిస్తూ, వారితో మృదువుగా వ్యవహరించేందుకు ఆయనకు తోడ్పడుతుంది. “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి” అని పేతురు రాశాడు.​—⁠1 పేతు. 5:⁠2.

17 యౌవనులు అందించే విలువైన సహాయంపట్ల సంఘంలోని వృద్ధులు కృతజ్ఞతను కలిగివుంటారు, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. అలాగే యౌవనులు కూడా, యెహోవా సేవలో అనేక సంవత్సరాల అనుభవం గడించిన వృద్ధులను గౌరవిస్తారు. (1 తిమో. 5:​1, 2) క్రైస్తవ పెద్దలు, కొన్ని బాధ్యతలను అప్పగించేందుకు అర్హతగల పురుషుల కోసం వెదకి, దేవుని మందను శ్రద్ధగా చూసుకునేలా వారికి శిక్షణనిస్తారు. (2 తిమో. 2:​1, 2) ప్రతీ క్రైస్తవుడు పౌలు ఇచ్చిన ఈ ప్రేరేపిత సలహాను పాటించాలి: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన​వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.”​—⁠హెబ్రీ. 13:​17.

కుటుంబంలో సమ్మతించేవారిగా ఉండండి

18 కుటుంబంలో కూడా సమ్మతించేవారిగా ఉండాలి. (కొలొస్సయులకు 3:​18-21 చదవండి.) క్రైస్తవ కుటుంబంలోని వివిధ సభ్యుల నిర్దిష్టమైన పాత్రలను బైబిలు సూచిస్తోంది. భర్త తన భార్యకు శిరస్సు, అంతేగాక, పిల్లలకు నిర్దేశమివ్వవలసిన ప్రాథమిక బాధ్యత కూడా ఆయనకుంది. భార్య తన భర్త అధికారాన్ని గుర్తించాలి, పిల్లలు లోబడి​వుండేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి, అలా లోబడడం ప్రభువునుబట్టి మెచ్చుకోదగినది. కుటుంబ సభ్యులందరూ సరైన రీతిలో, సమ్మతించడంలో సమతుల్యంగా ఉండడం ద్వారా కుటుంబ ఐక్యతకు, ప్రశాంతతకు దోహదపడవచ్చు. ఈ అంశాన్ని వివరించేందుకు తోడ్పడే ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి.

19 సమూయేలు చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలులో ఏలీ ప్రధానయాజకుని సేవచేస్తున్నాడు. ఏలీ కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు “యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.” వారు ప్రత్యక్ష గుడారం దగ్గర సేవచేసే స్త్రీలతో వ్యభిచరించిన విషయంతోపాటు వారు చేసిన ఇతర చెడుపనుల గురించి ఏలీ విన్నాడు. ఆయనెలా స్పందించాడు? యెహోవాకు విరుద్ధంగా వారు పాపంచేస్తే వారికోసం ప్రార్థించేవారే ఉండరని ఏలీ అన్నాడు, గానీ ఆయన వారిని సరిదిద్ది, శిక్షించలేదు. ఫలితంగా, ఏలీ కుమారులు తమ చెడుతనంలోనే కొనసాగారు. చివరకు, వారికి మరణదండనే సరైనదని యెహోవా వారికి తీర్పుతీర్చాడు. వారి మరణవార్త విన్నప్పుడు, ఏలీ కూడా చనిపోయాడు. ఎంతటి విషాదకరమైన ఫలితమో కదా! కాబట్టి ఏలీ వారి దుష్టక్రియలకు అనుచితంగా సమ్మతించడం, అంటే వారలా కొనసాగడాన్ని అనుమతించడం సరైనది కాదు.​—⁠1 సమూ. 2:​12-17, 22-25, 34, 35; 4:​17, 18.

20 ఏలీ అనుచిత సమ్మతికి భిన్నంగా దేవుడు దూతలైన తన కుమారులతో వ్యవహరించిన తీరును పరిశీలించండి. యెహోవా, ఆయన దూతలు సమావేశమైన అసాధారణ దర్శనాన్ని ప్రవక్తయైన మీకాయా చూశాడు. దుష్టరాజైన ఆహాబు పతనమయ్యేలా మీలో ఎవరు అతణ్ణి ప్రేరేపించ​గలరని యెహోవా దూతలను అడిగాడు. ఆత్మకుమారులిచ్చిన సూచనలను యెహోవా విన్నాడు. అప్పుడు ఒక దూత తానలా ప్రేరేపించగలనని చెప్పాడు. ఎలా ప్రేరేపిస్తావు అని యెహోవా ఆ దూతను అడిగాడు. ఆ దూత ఇచ్చిన జవాబుతో తృప్తిపొంది ఆ పని చేయమని యెహోవా ఆ దూతను ఆజ్ఞాపించాడు. (1 రాజు. 22:​19-23) మానవుల విషయానికొస్తే, కుటుంబ సభ్యులు ఈ వృత్తాంతం నుండి సమ్మతించేవారిగా ఉండడం గురించి పాఠాలు నేర్చుకోలేరా? ఒక క్రైస్తవ భర్త, తండ్రి తన భార్యాపిల్లల ఆలోచనలను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే భార్యలు, పిల్లలు తమ అభిప్రాయాన్ని లేదా అభిలాషను వ్యక్తపర్చిన తర్వాత నిర్ణయం తీసుకునే లేఖనాధారిత అధికారమున్న భర్త నిర్దేశాన్ని తాము సమ్మతించవలసిన అవసరం ఉందని గ్రహించాలి.

21 సమ్మతించే విధంగా ఉండమని యెహోవా ప్రేమపూర్వకంగా, జ్ఞానవంతంగా ఇచ్చిన జ్ఞాపికలపట్ల లేదా శాసనాలపట్ల మనమెంత కృతజ్ఞులమో కదా! (కీర్త. 119:​99) సమ్మతించడంలో సమతుల్యంగా ఉండడం వివాహ జీవితంలో ఆనందాన్ని అనుభవించేందుకు ఎలా తోడ్పడుతుందో మన తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన గ్రీకు పదాన్ని, ఏదైనా ఒకే పదాన్ని ఉపయోగించి అనువదించడం కష్టం. ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “ఆ గ్రీకు పదం, వ్యక్తిగత హక్కుల కోసం పట్టుబట్టకుండా ఉండడాన్ని, ఇతరుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడాన్ని, వారిపట్ల మృదువుగా వ్యవహరించడాన్ని సూచిస్తుంది.” కాబట్టి దానికి, ధర్మశాస్త్రాన్ని పొల్లుపోకుండా పాటించాలని పట్టుబట్టకుండా ఉండడం లేదా తమ హక్కుల కోసం పిడివాదం చేయకుండా ఉండడమనే అర్థముంది.

^ పేరా 17 కావలికోట ఫిబ్రవరి 15, 2005 సంచికలో “సేవకు మీరు ‘బలవంతము చేయబడినప్పుడు’ ” అనే ఆర్టికల్‌ను చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• సమ్మతించేవారిగా ఉండడం ఎలాంటి సత్ఫలితాలను తీసుకురాగలదు?

• పైవిచారణకర్తలు సమ్మతించే స్వభావాన్ని ఎలా చూపించవచ్చు?

• కుటుంబ జీవితంలో సమ్మతించే స్వభావాన్ని చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. సమ్మతించేవారిగా ఉండడం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయి, అదెందుకు సరైనది?

3, 4. (ఎ) మనం సమ్మతించినప్పుడు కలిగే ప్రయోజనాలను ఉదాహరించండి. (బి) మనం ఏ అంశాలను పరిశీలిస్తాం?

5. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక దాసుడు తన యజమానితోనే ఉండిపోవాలని నిర్ణయించుకునేందుకు ఆయనను ఏది పురికొల్పవచ్చు?

6. మనం సమ్మతించేవారిగా ఉండడంలో ప్రేమ ఎలా ఇమిడివుంది?

7. సమ్మతించేవారిగా ఉండడం పరిచర్యలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

8. దేవునిపట్ల మనకున్న ప్రేమ మనం ‘అత్యల్పులముగా’ ఉండేందుకు ఎలా సహాయం చేయగలదు?

9. సమ్మతించేవారిగా ఉండాలంటే మనం దేనిని గుర్తించాలి?

10. యెహోవా అధికారాన్ని మనం సమ్మతించడం దేనిని ప్రదర్శిస్తుంది?

11. క్రీస్తు శిరస్సత్వాన్ని సమ్మతిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

12. సమ్మతించడానికి పరిమితులున్నాయని ఎందుకు చెప్పవచ్చు?

13. అధికారంలో ఉన్నవారితో సమ్మతించడం గురించి యేసు ఏమిచెప్పాడు?

14. మనమెందుకు మతభ్రష్టత్వాన్ని ఎన్నడూ సమ్మతించకూడదు?

15. క్రైస్తవ పైవిచారణకర్తలు కూడుకున్నప్పుడు వారు ఏ విధంగా సమ్మతించేవారిగా ఉండవచ్చు?

16. ఒక క్రైస్తవ పైవిచారణకర్త ఎలాంటి స్వభావాన్ని కనబర్చాలి?

17. సంఘంలో ఉన్నవారందరూ ఇతరులతో వ్యవహరించేటప్పుడు సమ్మతించే స్వభావాన్ని ఎలా చూపించవచ్చు?

18. కుటుంబంలో సమ్మతించే స్వభావం ఎందుకు సముచితం?

19, 20. (ఎ) సమ్మతించేవారిగా ఉండే విషయంలో ఏలీ ఉదాహరణకు, యెహోవా మాదిరికి ఎలాంటి భేదముందో వివరించండి. (బి) ఈ ఉదాహరణల నుండి తల్లిదండ్రులు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

21. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి వివరించబడుతుంది?

[4వ పేజీలోని చిత్రం]

ఇతరులతో క్రీస్తు వ్యవహరించిన దయాపూర్వక మాదిరిని పెద్దలు అనుకరిస్తారు

[6వ పేజీలోని చిత్రం]

సంఘ పెద్దలు కూడుకున్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించడం, సమ్మతించే స్వభావం చూపించడం ఐక్యతకు తోడ్పడుతుంది