అన్ని విషయాల్లో దేవుని నిర్దేశాన్ని అనుసరించండి
అన్ని విషయాల్లో దేవుని నిర్దేశాన్ని అనుసరించండి
“ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.” —కీర్త. 48:14.
మనం వ్యర్థమైనవాటిని లేదా హానికరమైనవాటిని విలువైనవని భావించే అవకాశం ఉంది. (సామె. 12:11) క్రైస్తవులు చేయకూడని దాన్ని మనం చేయాలని ప్రగాఢంగా కోరుకుంటే మన హృదయం దాన్ని చేసేలా ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు. (యిర్మీ. 17:5, 9) అందుకే, కీర్తనకర్త జ్ఞానవంతంగా యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును.” (కీర్త. 43:3) ఆయన తన పరిమిత జ్ఞానంమీద కాక యెహోవామీద నమ్మకముంచాడు, అంతకన్నా శ్రేష్టమైన నిర్దేశం ఆయనకు మరెక్కడా దొరకదు. కీర్తనకర్తలాగే మనం కూడా దేవుని నిర్దేశంపై ఆధారపడాలి.
2 యెహోవా నిర్దేశం అన్నింటికన్నా శ్రేష్టమైనదని మనం ఎందుకు నమ్మాలి? మనకు ఆ నిర్దేశం ఎప్పుడు అవసరం? దాని నుండి ప్రయోజనం పొందడానికి మనం ఎలాంటి వైఖరిని పెంపొందించుకోవాలి, యెహోవా నేడు మనల్ని ఎలా నిర్దేశిస్తున్నాడు? వంటి ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఈ ఆర్టికల్‌లో వివరించబడతాయి.
యెహోవా నిర్దేశాన్ని ఎందుకు నమ్మాలి?
3 యెహోవా మన పరలోక తండ్రి. (1 కొరిం. 8:6) ఆయనకు మనలో ప్రతి ఒక్కరి గురించి బాగా తెలుసు, అంతేకాక ఆయన మన హృదయాలను పరిశీలించగలడు. (1 సమూ. 16:7; సామె. 21:2) దావీదు రాజు దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు: “నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.” (కీర్త. 139:2, 4) యెహోవాకు మన గురించి బాగా తెలుసు కాబట్టి, మనకు ఏది మంచిదనేది ఆయనకు తెలుసో లేదో అని అనుమానపడనక్కరలేదు. అంతేకాక, యెహోవా అత్యంత జ్ఞానవంతుడు. ఆయన ప్రతీది చూడగలడు, ఒక విషయాన్ని మానవులకన్నా లోతుగా పరిశీలించి దాని ప్రారంభం నుండే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోగలడు. (యెష. 46:9-11; రోమా. 11:33) ఆయన ‘అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు.’—రోమా. 16:25-27.
4 అంతేకాక, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు ఎల్లప్పుడూ మంచే జరగాలని కోరుకుంటున్నాడు. (యోహా. 3:16; 1 యోహా. 4:8) ప్రేమగల దేవునిగా, ఆయన మనకు ఉదారంగా అన్నీ అనుగ్రహిస్తున్నాడు. “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును” అని శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకో. 1:17) యెహోవా నిర్దేశాన్ని అనుసరించేవారు ఆయన ఉదార స్వభావం నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు.
5 చివరగా, యెహోవా సర్వశక్తిమంతుడు. దాని గురించి కీర్తనకర్త ఇలా రాశాడు: “మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.” (కీర్త. 91:1, 2) మనం యెహోవా నిర్దేశాన్ని అనుసరించినప్పుడు మనల్ని ఎన్నడూ నిరాశపర్చని దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మనకు వ్యతిరేకత ఎదురైనా యెహోవా మనకు మద్దతునిస్తాడు. ఆయన మనల్ని నిరాశపరచడు. (కీర్త. 71:4, 5; సామెతలు 3:19-26 చదవండి.) నిజమే, మనకేది మంచిదో యెహోవాకు తెలుసు. అంతేకాక, మనకు మంచి జరగాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. మనకు ఏది మంచిదో అది ఇచ్చే శక్తి కూడా ఆయనకుంది. ఆయన నిర్దేశాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత మూర్ఖత్వమో కదా! అయితే, మనకు ఆ నిర్దేశం ఎప్పుడు అవసరం?
మనకు నిర్దేశం ఎప్పుడు అవసరం?
6 బాల్యం నుండి వృద్ధాప్యం వరకు, మన జీవితమంతటిలో దేవుని నిర్దేశం మనకు అవసరమే. కీర్తనకర్త ఇలా చెప్పాడు: “ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును.” (కీర్త. 48:14) కీర్తనకర్తలాగే జ్ఞానవంతులైన క్రైస్తవులు దేవుని నిర్దేశాన్ని ఎల్లప్పుడూ అనుసరిస్తారు.
7 నిజమే, ప్రత్యేకంగా కొన్నిసార్లు మనకు అత్యవసరంగా సహాయం అవసరమని అనిపించవచ్చు. కొన్నిసార్లు మనకు హింస, తీవ్ర అనారోగ్యం, అనుకోని విధంగా జీవనోపాధిని కోల్పోవడం వంటి తీవ్రమైన ‘ఇబ్బందులు’ ఎదురుకావచ్చు. (కీర్త. 69:16, 17) అలాంటప్పుడు, వాటిని సహించడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానయుక్త మైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన నిర్దేశాన్ని యెహోవా మనకు ఇస్తాడనే నమ్మకంతో ఆయనకు ప్రార్థిస్తే మనం ఊరట పొందుతాం. (కీర్తనలు 102:17 చదవండి.) అయితే, ఇతర సందర్భాల్లో కూడా మనకు ఆయన సహాయం అవసరమే. ఉదాహరణకు, మనం ఇతరులకు రాజ్యసువార్త ప్రకటిస్తున్నప్పుడు, చక్కని ఫలితాలు సాధించేందుకు మనకు యెహోవా నిర్దేశం అవసరం. మనం ఉల్లాస కార్యకలాపాలు, వస్త్రధారణ, కనబడేతీరు, సహవాసం, ఉద్యోగం, విద్య వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, యెహోవా నిర్దేశాలను అనుసరిస్తేనే జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తాం. నిజానికి, మనకు జీవితంలోని అన్ని రంగాల్లోనూ నిర్దేశం అవసరం.
దేవుని నిర్దేశాన్ని అనుసరించకపోవడంవల్ల వచ్చే ప్రమాదాలు
8 అయితే, మనం యెహోవా నిర్దేశాన్ని అనుసరించడానికి ఇష్టపడాలని గుర్తుంచుకోండి. మనం ఒకవేళ అనుసరించడానికి ఇష్టపడకపోతే అలా చేయమని ఆయన మనల్ని బలవంతపెట్టడు. యెహోవా నిర్దేశాన్ని అనుసరించకూడదని మానవుల్లో మొదటిగా హవ్వ నిర్ణయించుకుంది. అలాంటి తప్పు నిర్ణయం ఎంత ప్రమాదకరంగా ఉండగలదో ఆమె ఉదాహరణ తెలియజేస్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయం దేనిని సూచించిందో కూడా ఆలోచించండి. ‘మంచి చెడ్డలను ఎరిగి దేవునివలె’ ఉండాలని హవ్వ కోరుకుంది కాబట్టే ఆమె నిషేధించబడిన ఫలాన్ని తిన్నది. (ఆది. 3:5) అలా చేయడం ద్వారా, ఆమె యెహోవా నిర్దేశాలను అనుసరించే బదులు, మంచిచెడుల విషయంలో సొంత నిర్ణయం తీసుకొని దేవుని స్థానాన్ని ఆక్రమించాలని కోరుకుంటున్నట్లు చూపించింది. ఆ విధంగా, ఆమె యెహోవా సర్వాధిపత్యాన్ని తిరస్కరించింది. ఆమె తన ఇష్టానుసారంగా ప్రవర్తించాలని కోరుకుంది. ఆమె భర్తయైన ఆదాము కూడా ఆమెలాగే తిరుగుబాటు చేశాడు.—రోమా. 5:12.
9 నేడు మనం యెహోవా నిర్దేశాన్ని అనుసరించకపోతే, మనం కూడా హవ్వలాగే ఆయన సర్వాధిపత్యాన్ని తిరస్కరించినట్లు అవుతుంది. ఉదాహరణకు, అశ్లీల దృశ్యాలను చూడడాన్ని అలవాటు చేసుకున్న ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. ఆయన క్రైస్తవ సంఘంలో ఉన్నట్లయితే, ఆయనకు ఈ విషయంలో యెహోవా నిర్దేశాలు తెలిసేవుంటాయి. అపవిత్రమైనవాటిని చెడు కోరికతో తదేకంగా చూడడం అటుంచి, వాటి పేరైనా ఎత్తకూడదు. (ఎఫె. 5:3) యెహోవా నిర్దేశాలను తిరస్కరించే ఆ వ్యక్తి నిజానికి, యెహోవా సర్వాధిపత్యాన్ని తృణీకరించి, ఆయన శిరస్సత్వాన్ని తిరస్కరిస్తున్నాడు. (1 కొరిం. 11:3) అది చాలా బుద్ధిహీనమైన చర్యే అవుతుంది. ఎందుకంటే, యిర్మీయా అన్నట్లు “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.”—యిర్మీ. 10:23.
10 నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛను యెహోవాయే మనకు ఇచ్చాడు కాబట్టి, దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు ఆయన మనల్ని విమర్శించకూడదని భావించి కొందరు యిర్మీయా మాటలతో ఏకీభవించకపోవచ్చు. అయితే, స్వేచ్ఛాచిత్తం మనకు ఇవ్వబడిన ఒక బహుమానమే కాదు, అది ఒక బాధ్యత కూడా అని మనం మరిచిపోకూడదు. మనం చెప్పాలనుకునే మాటలకు, చేయాలనుకునే పనులకు మనం జవాబుదారులం. (రోమా. 14:10) యేసు ఇలా అన్నాడు: “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును.” ఆయన, “దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును” అని కూడా చెప్పాడు. (మత్త. 12:34; 15:19) కాబట్టి, మన మాటలూ చేతలూ మన హృదయ స్థితిని తెలియజేస్తాయి. అవి మన నిజ స్వరూపాన్ని వెల్లడిచేస్తాయి. అందుకే, జ్ఞానవంతుడైన ఒక క్రైస్తవుడు అన్ని విషయాల్లో యెహోవా నిర్దేశాన్ని అనుసరిస్తాడు. అలా అనుసరిస్తే, యెహోవా ఆయనను ‘యథార్థహృదయునిగా’ పరిగణించి, ఆయనకు “మేలు” చేస్తాడు.—కీర్త. 125:4.
11 ఇశ్రాయేలీయుల చరిత్రను గుర్తుచేసుకోండి. ఆ జనాంగం యెహోవా ఆజ్ఞలకు లోబడుతూ మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన వారిని కాపాడాడు. (యెహో. 24:15, 21, 31) అయితే, వారు తరచూ తమ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేశారు. యిర్మీయా దినాల్లో, యెహోవా వారి గురించి ఇలా చెప్పాడు: “వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.” (యిర్మీ. 7:24-26) ఎంత విచారకరం! మనం మొండితనంతో లేదా సొంత కోరికలు తీర్చుకోవాలనే ఆశతో యెహోవా నిర్దేశాన్ని ఎన్నడూ తిరస్కరించకుండా, సొంత ఆలోచననుబట్టి ప్రవర్తించకుండా ఉందాం. అలా ప్రవర్తిస్తే మనం ‘ముందుకు సాగక వెనుకబడతాం.’
దేవుని ఉపదేశాన్ని అనుసరించడానికి ఏమి అవసరం?
12 యెహోవాపట్ల మనకున్న ప్రేమ ఆయన నిర్దేశాన్ని అనుసరించాలని కోరుకునేలా చేస్తుంది. (1 యోహా. 5:3) అయితే, పౌలు “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము” అని చెప్పడం ద్వారా మనకు విశ్వాసం కూడా అవసరమని తెలియజేశాడు. (2 కొరిం. 5:6, 7) విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం? యెహోవా మనల్ని “నీతిమార్గములలో” నడిపిస్తున్నప్పటికీ ఆ మార్గాలవల్ల మనం ఈ లోకంలో ఐశ్వర్యంగానీ హోదాగానీ పొందలేం. (కీర్త. 23:3) అందుకే, మన విశ్వాస నేత్రాలను యెహోవాను సేవించడంవల్ల వచ్చే సాటిలేని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలమీద నిలపాలి. (2 కొరింథీయులకు 4:17, 18 చదవండి.) ప్రాథమిక సదుపాయాలతో సంతృప్తిచెందేందుకు కూడా విశ్వాసం మనకు సహాయం చేస్తుంది.—1 తిమో. 6:7.
13 సత్యారాధన చేయడానికి స్వయంత్యాగం అవసరమని యేసు చెప్పాడు. దాన్ని కనబరచడానికి కూడా విశ్వాసం అవసరం. (లూకా 9:23, 24) కొందరు నమ్మకస్థులైన ఆరాధకులు గొప్ప త్యాగాలు చేస్తూ, పేదరికాన్ని, అణచివేతను, వివక్షను, చివరకు తీవ్ర హింసను కూడా సహించారు. (2 కొరిం. 11:23-27; ప్రక. 3:8-10) ఆనందంతో వాటిని సహించేందుకు బలమైన విశ్వాసమే వారికి దోహదపడింది. (యాకో. 1:2, 3) యెహోవా నిర్దేశాన్ని అనుసరించడం ఎల్లప్పుడూ శ్రేష్టమని సంపూర్ణంగా నమ్మేందుకు బలమైన విశ్వాసం సహాయం చేస్తుంది. అది ఎల్లప్పుడూ మన శాశ్వత ప్రయోజనానికే దోహదపడుతుంది. నమ్మకంగా సహించేవారు, తాత్కాలిక శ్రమలవల్ల కలిగే బాధను కూడా మరచిపోయేంత మెండుగా ఆశీర్వదించబడతారని మనకు ఖచ్చితంగా తెలుసు.—హెబ్రీ. 11:6.
14 యెహోవా నిర్దేశాన్ని అనుసరించడంలో వినయం కూడా ఎందుకు అవసరమో గమనించండి. శారా దాసియైన హాగరు ఉదాహరణ ఆ విషయాన్ని రుజువుచేస్తుంది. శారాకు చాలాకాలంవరకు పిల్లలు పుట్టకపోవడంతో ఆమె హాగరును అబ్రాహాముకు ఇచ్చింది. హాగరు అబ్రాహామువల్ల గర్భవతి అయింది. అప్పుడు హాగరు గొడ్రాలుగా ఉన్న తన యజమానురాలితో అహంకారంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆ కారణంగా, శారా ‘ఆమెను శ్రమపెట్టడంతో’ హాగరు పారిపోయింది. అప్పుడు యెహోవా దూత హాగరును కలుసుకొని, “నీ యజమానురాలియొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుము” అని చెప్పాడు. (ఆది. 16:2, 6, 8, 9) హాగరు మరో విధమైన నిర్దేశాన్ని ఇస్తాడని అనుకొనివుండవచ్చు. దూత చెప్పినట్లు ప్రవర్తించాలంటే ఆమె తన అహంకారపూరిత ధోరణిని మార్చుకోవాలి. ఏదేమైనా, హాగరు వినయంగా దూత చెప్పినట్లే చేసింది, దానివల్ల ఆమె కుమారుడైన ఇష్మాయేలు తన తండ్రి కాపుదల కింద పుట్టాడు.
15 యెహోవా నిర్దేశాన్ని అనుసరించాలంటే మనం కూడా వినయస్థులుగా తయారవ్వాలి. కొందరు తాము ఇష్టపడే ఒక వినోదాన్ని యెహోవా అసహ్యించుకుంటాడనే అభిప్రాయాన్ని అంగీకరించాల్సిరావచ్చు. ఒక క్రైస్తవుడు ఎవరినైనా బాధపెట్టి ఉండవచ్చు, అలాంటప్పుడు ఆయన క్షమాపణ కోరాలి. లేక ఆయన ఒక తప్పు చేసివుండవచ్చు, దానిని ఆయన ఒప్పుకోవాలి. ఎవరైనా గంభీరమైన పాపం సామెతలు 29:23లో ఉన్న మాటలు ఊరటనిస్తాయి.
చేసి ఉంటే అప్పుడేమి చేయాలి? ఆ వ్యక్తి వినయంతో పెద్దల ముందు తన పాపాన్ని ఒప్పుకోవాలి. బహుశా ఒక వ్యక్తి సంఘం నుండి బహిష్కరించబడివుండవచ్చు. ఆయన సంఘంలోకి తిరిగి చేర్చుకోబడాలంటే, వినయంతో పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందాలి. పైన చెప్పబడిన పరిస్థితుల్లో, అలాంటి ఇతర పరిస్థితుల్లో “ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనతనొందును” అనియెహోవా మనకు ఎలా నిర్దేశాన్నిస్తున్నాడు?
16 మనం ప్రధానంగా దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు ద్వారా ఆయన నిర్దేశాన్ని పొందుతున్నాం. (2 తిమోతి 3:16, 17 చదవండి.) ఆ వాక్యం నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే, ఏదైనా క్లిష్టపరిస్థితి తలెత్తేవరకు వేచివుండకుండా, జ్ఞానయుక్తంగా ముందే లేఖనాల్లోని సహాయకరమైన మాటలను పరిశీలించాలి. దానికి మనం ప్రతిదినం బైబిలు చదవడాన్ని అలవాటుచేసుకోవాలి. (కీర్త. 1:1-3) అలా చదివితే మనం దేవుని ప్రేరేపిత వాక్యంతో సుపరిచితులమౌతాం. అప్పుడు, దేవుని తలంపులు మన తలంపులౌతాయి. అంతేకాక, ఊహించని సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు కూడా మనం సిద్ధంగా ఉంటాం.
17 అంతేకాక, లేఖనాల్లో మనం చదివినదాన్ని ధ్యానించి దాని విషయంలో ప్రార్థించడం ప్రాముఖ్యం. మనం బైబిలు లేఖనాలను ధ్యానించినప్పుడు వివిధ పరిస్థితుల్లో అవి ఎలా అన్వయిస్తాయో మనం పరిశీలిస్తాం. (కీర్త. 77:12) మనం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, మనకు కావాల్సిన నిర్దేశాన్ని కనుగొనడానికి సహాయం చేయమని కోరుతూ మనం యెహోవాకు ప్రార్థిస్తాం. మనం బైబిల్లో లేదా బైబిలు ప్రచురణల్లో చదివిన ప్రయోజనకరమైన లేఖన సూత్రాలను గుర్తుచేసుకోవడానికి యెహోవా ఆత్మ మనకు సహాయం చేస్తుంది.—కీర్తనలు 25:4, 5 చదవండి.
18 యెహోవా నిర్దేశాన్ని అనుసరించడానికి మన క్రైస్తవ సహోదరత్వం కూడా ఎంతో సహాయపడుతుంది. ఆ సహోదరత్వంలో, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతి ప్రాముఖ్యమైనది, ఆ దాసుని తరగతికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిపాలక సభ ముద్రిత ప్రచురణల ద్వారా, కూటాల్లో, సమావేశాల్లో అందజేయబడే సమాచారం ద్వారా ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రమంగా ఇస్తోంది. (మత్త. 24:45-47; అపొస్తలుల కార్యములు 15:6, 22-31ను పోల్చండి.) అంతేకాక, క్రైస్తవ సహోదరత్వంలో ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవారు, ముఖ్యంగా పెద్దలు వ్యక్తిగత సహాయం, లేఖనాధార ఉపదేశం ఇవ్వడానికి యోగ్యులు. (యెష. 32:1) క్రైస్తవ కుటుంబాల్లోని పిల్లలకు అదనంగా మరో విలువైన సహాయం అందుబాటులో ఉంది. వారికి నిర్దేశాన్నిచ్చే అధికారాన్ని దేవుడు విశ్వాసులైన వారి తల్లిదండ్రులకు అప్పగించాడు. వారు తమ తల్లిదండ్రుల నిర్దేశాన్ని అనుసరించాలని ఎల్లప్పుడూ ప్రోత్సహించబడుతున్నారు.—ఎఫె. 6:1-3.
19 నిజమే, యెహోవా మనకు అనేక విధాలుగా నిర్దేశాన్నిస్తున్నాడు, మనం దాని నుండి పూర్తి ప్రయోజనం పొందడం మంచిది. ఇశ్రాయేలు జనాంగం నమ్మకంగా ఉన్న సమయం గురించి మాట్లాడుతూ దావీదు ఇలా అన్నాడు: “మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి. వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయిరి.” (కీర్త. 22:3-5) మనం యెహోవా నిర్దేశాన్ని యథార్థంగా అనుసరిస్తే మనం కూడా ‘సిగ్గుపడం.’ మన నిరీక్షణ విషయంలో మనం నిరాశకు గురికాము. మనం మన సొంత జ్ఞానాన్ని నమ్ముకునే బదులు, ‘మన మార్గాన్ని యెహోవాకు అప్పగిస్తే’ ఇప్పుడు కూడా మెండుగా ఆశీర్వాదాలను అనుభవిస్తాం. (కీర్త. 37:5) మనం నమ్మకంగా అలాగే కొనసాగితే ఆ ఆశీర్వాదాలను శాశ్వతంగా అనుభవిస్తాం. దావీదు రాజు ఇలా రాశాడు: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు. . . . నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్త. 37:28, 29.
మీరు వివరించగలరా?
• మనం యెహోవా నిర్దేశాన్ని ఎందుకు నమ్ముతాం?
• మనం యెహోవా నిర్దేశాన్ని తిరస్కరించడం ఏమి సూచిస్తుంది?
• ఒక క్రైస్తవునికి వినయం అవసరమయ్యే కొన్ని పరిస్థితులు ఏమిటి?
• నేడు యెహోవా మనకు ఎలా నిర్దేశాన్నిస్తున్నాడు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. మనం సొంత జ్ఞానాన్ని కాక యెహోవా నిర్దేశాన్ని ఎందుకు అనుసరించాలి, ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి?
3-5. యెహోవా నిర్దేశాన్ని మనం పూర్తిగా నమ్మేందుకుగల కారణాలేమిటి?
6, 7. మనకు యెహోవా నిర్దేశం ఎప్పుడు అవసరం?
8. హవ్వ నిషేధించబడిన ఫలాన్ని తినడం ఏయే విషయాలను సూచించింది?
9. మనం యెహోవా నిర్దేశాన్ని తిరస్కరిస్తే ఏమి చేసినట్లు అవుతుంది, అది ఎందుకు చాలా బుద్ధిహీనమైన చర్య అవుతుంది?
10. మనం స్వేచ్ఛాచిత్తాన్ని బాధ్యతాయుతంగా ఎందుకు ఉపయోగించుకోవాలి?
11. ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
12, 13. (ఎ) యెహోవా నిర్దేశాన్ని అనుసరించేలా కోరుకునేందుకు మనకు ఏ లక్షణం దోహదపడుతుంది? (బి) విశ్వాసం ఎందుకు చాలా అవసరం?
14. హాగరు వినయాన్ని ఎందుకు కనబరచాల్సివచ్చింది?
15. యెహోవా నిర్దేశాన్ని అనుసరించడానికి మనకు నేడు వినయం అవసరమయ్యే కొన్ని పరిస్థితులను వివరించండి.
16, 17. దైవిక నిర్దేశాలున్న బైబిలు నుండి మనం ఎలా పూర్తిగా ప్రయోజనం పొందవచ్చు?
18. మనకు నిర్దేశాన్నిచ్చేందుకు యెహోవా క్రైస్తవ సహోదరత్వాన్ని ఏయే విధాలుగా ఉపయోగించుకుంటున్నాడు?
19. యెహోవా నిర్దేశాన్ని అనుసరిస్తూ ఉండడం ద్వారా మనం ఏ ఆశీర్వాదాలను అనుభవిస్తాం?
[8వ పేజీలోని చిత్రాలు]
మీరు మీ జీవితంలోని అన్ని రంగాల్లో యెహోవా నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?
[9వ పేజీలోని చిత్రం]
హవ్వ యెహోవా సర్వాధిపత్యాన్ని తిరస్కరించింది
[10వ పేజీలోని చిత్రం]
హాగరు దేవదూత ఇచ్చిన నిర్దేశాన్ని అనుసరించడానికి ఆమెకు ఏ లక్షణం అవసరమైంది?