కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ అంత్యదినాల్లో వివాహం, పిల్లల ఆలనాపాలన

ఈ అంత్యదినాల్లో వివాహం, పిల్లల ఆలనాపాలన

ఈ అంత్యదినాల్లో వివాహం, పిల్లల ఆలనాపాలన

“కాలము సంకుచితమై యున్నది.”​—⁠1 కొరిం. 7:​29.

“అంత్యకాలము”లో యుద్ధాలు, భూకంపాలు, కరవులు, తెగుళ్లు ఉంటాయని దేవుని వాక్యం ప్రవచించింది. (దాని. 8:​17, 19; లూకా 21:​10, 11) మానవ చరిత్రలోని ఈ నిర్ణయాత్మక కాలంలో ఎన్నో సామాజిక మార్పులు జరుగుతాయని కూడా బైబిలు హెచ్చరించింది. ఆ మార్పుల్లో భాగంగా ‘అపాయకరమైన’ ఈ “అంత్యదినములలో” కుటుంబ జీవితంలో కష్టాలు ఎదురౌతాయి. (2 తిమో. 3:​1-4) అలాంటి మార్పుల గురించి మనమెందుకు ఆందోళన చెందాలి? అన్ని ప్రాంతాల్లో ఆ మార్పులు ఎంత అధికంగా జరుగుతున్నాయంటే వివాహం, పిల్లల ఆలనాపాలన విషయంలో నేడు క్రైస్తవుల దృక్పథాన్నే అవి ప్రభావితం చేస్తున్నాయి. ఎలా ప్రభావితం చేస్తున్నాయి?

2 ఈ రోజుల్లో ఎంతోమంది చాలా సులభంగా విడాకులు తీసుకుంటున్నారు. అందుకే, అనేక దేశాల్లో విడాకుల రేటు వేగంగా పెరుగుతోంది. అయితే, వివాహం విషయంలో, విడాకుల విషయంలో యెహోవా దేవుని దృక్పథం మన చుట్టూ ఉన్న లోకం ఆమోదిస్తున్న​దానికి పూర్తి విరుద్ధంగా ఉందని మనం స్పష్టంగా గుర్తించాలి. అయితే, వాటి విషయంలో యెహోవా దృక్పథమేమిటి?

3 వివాహితులు తమ వివాహ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మొదటి స్త్రీపురుషులను వివాహం బంధంలో ఐక్యపరిచినప్పుడు “పురుషుడు . . . తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” అని చెప్పాడు. యేసుక్రీస్తు ఆ తర్వాత ఆ మాటలనే పేర్కొంటూ, “గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు” అని అన్నాడు. అంతేకాక, “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు” అని కూడా యేసు చెప్పాడు. (ఆది. 2:​24; మత్త. 19:​3-6, 9) కాబట్టి యెహోవా, యేసు దృష్టిలో వివాహం జీవితాంతం నిలిచి ఉండాల్సిన బంధం. అయితే భాగస్వామి మరణించినప్పుడు ఆ బంధం తెగిపోతుంది. (1 కొరిం. 7:​39) వివాహం ఒక పవిత్రమైన ఏర్పాటు కాబట్టి, విడాకులు తీసుకోవడాన్ని ఎంతో గంభీరమైన విషయంగా పరిగణించాలి. వాస్తవానికి, లేఖనవిరుద్ధంగా విడాకులు తీసుకోవడాన్ని యెహోవా అసహ్యించుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. *​—⁠మలాకీ 2:​13-16; 3:⁠6 చదవండి.

వివాహాన్ని ఒక బాధ్యతగా పరిగణించండి

4 మనం జీవిస్తున్న భక్తిహీన లోకం లైంగిక మైకంలో ఉంది. ప్రతీరోజు, అశ్లీల దృశ్యాలు ఎన్నో మనకు తారస​పడుతుంటాయి. మనమీద, ముఖ్యంగా సంఘంలోని మన యౌవనస్థులమీద అవి చూపించే ప్రభావాన్ని మనం కొట్టిపారేయలేం. క్రైస్తవ యౌవనస్థులు తమలో చెడు కోరికలు కలగకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా ఆ చెడు ప్రభావం వారిలో లైంగిక కోరికలను కలిగించవచ్చు. వారు ఆ ప్రభావాన్ని ఎలా నిరోధించగలరు? కొందరు చిన్న వయసులోనే వివాహం చేసుకొని దానిని నిరోధించేందుకు ప్రయత్నించారు. అలాచేస్తే లైంగిక దుర్నీతికి పాల్పడకుండా ఉండవచ్చని వారనుకున్నారు. అయితే, ఎంతోకాలం గడవకముందే, కొందరు తాము తీసుకున్న నిర్ణయాన్నిబట్టి విచారించారు. దానికి కారణమేమిటి? కొత్త మోజు తీరిన తర్వాత అనుదిన జీవితంలో తమ ఇష్టాయిష్టాలు ఎంతో వేరుగా ఉన్నాయని గుర్తిస్తారు. అలాంటి దంపతుల మధ్య సహజంగానే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి.

5 మీరు తోటి విశ్వాసినే వివాహం చేసుకున్నా, ఆయన లేక ఆమె మీరు ఆశించినదానికి పూర్తి భిన్నంగా ఉంటే వారితో కాపురం చేయడం కష్టమే. (1 కొరిం. 7:​28) అయితే, పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా, లేఖనవిరుద్ధంగా విడాకులు తీసుకోవడం, సంతోషం కరువైన వివాహ బంధంలో ఎదురయ్యే సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారంకాదని నిజక్రైస్తవులకు తెలుసు. కాబట్టి, వివాహ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో తమ కాపురాన్ని కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయాసపడేవారు, క్రైస్తవ సంఘ గౌరవాన్ని, ప్రేమపూర్వక సహాయాన్ని పొందడానికి అర్హులు. *

6 మీరు అవివాహిత యౌవనస్థులైతే, మీరు వివాహం చేసుకోవడాన్ని ఎలా దృష్టించాలి? మీరు వివాహం చేసుకోవడానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధమయ్యేంతవరకు వేచివుండి, ఆ తర్వాత వివాహం చేసుకోవడం గురించి ఆలోచిస్తే ఎంతో హృదయవేదనను తప్పించుకోవచ్చు. నిజమే, వివాహం ఫలానా వయసులో చేసుకోవాలని లేఖనాలు చెప్పడంలేదు. * అయితే, లైంగిక కోరికలు బలీయంగా ఉండే సమయం గడిచిపోయేంతవరకు వేచివుండాలని మాత్రం బైబిలు చెబుతోంది. (1 కొరిం. 7:​36) అప్పటివరకు ఎందుకు వేచి ఉండాలి? బలమైన లైంగిక కోరికలు మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీసి, భవిష్యత్తులో హృదయవేదన కలిగించే బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకునేలా చేయవచ్చు. బైబిల్లో వివాహం గురించి యెహోవా ఇచ్చిన జ్ఞానయుక్త మైన ఉపదేశం మీ మంచి కోసమేనని, మీ సంతోషం కోసమేనని గుర్తుంచుకోండి.​—⁠యెషయా 48:​17, 18 చదవండి.

పిల్లల ఆలనాపాలనను ఒక బాధ్యతగా పరిగణించండి

7 కొందరు దంపతులు మరీ చిన్న వయసులోనే తల్లిదండ్రులౌతారు. వారు సరిగ్గా ఒకరినొకరు తెలుసుకోక ముందే వారికి బిడ్డ పుట్టవచ్చు, ఆ పుట్టిన బిడ్డను 24 గంటలూ చూసుకోవాల్సి ఉంటుంది. సహజంగానే తల్లి అవధానమంతా బిడ్డమీదే ఉంటుంది కాబట్టి భర్త అసూయపడవచ్చు. అంతేకాక, నిద్రలేని రాత్రులు ఆ యువదంపతుల కాపురంలో ఒత్తిడి ఏర్పడడానికి కారణమై, వారి మధ్య ఉన్న సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. తమకు ఇప్పుడంతగా స్వేచ్ఛలేదని వారు త్వరలోనే గుర్తిస్తారు. ముందటిలా స్వేచ్ఛగా వారు ఇప్పుడు కొత్త ప్రాంతాలను సందర్శించలేరు, పనులు చేసుకోలేరు. పరిస్థితిలో వచ్చిన మార్పును వారు ఎలా దృష్టించాలి?

8 వివాహాన్ని ఒక బాధ్యతగా పరిగణించినట్లే, పిల్లల ఆలనాపాలనను దేవుడిచ్చిన బాధ్యతగా, ఆధిక్యతగా పరిగణించాలి. బిడ్డ పుట్టడంతో క్రైస్తవ దంపతులు తమ జీవితాల్లో ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాల్సివచ్చినా, వారు బాధ్యతాయుతంగా అలా చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. యెహోవా మానవులకు పిల్లల్ని కనే సామర్థ్యాన్నిచ్చాడు కాబట్టి, తల్లిదండ్రులు ఆ శిశువును ‘యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యంగా’ పరిగణించాలి. (కీర్త. 127:⁠3) క్రైస్తవ తల్లిదండ్రులు తమ బాధ్యతలను ‘ప్రభువునందు ఉన్న తల్లిదండ్రుల్లాగే’ నిర్వర్తించడానికి కృషిచేస్తారు.​—⁠ఎఫె. 6:⁠1.

9 పిల్లల్ని పెంచడానికి చాలా సంవత్సరాలపాటు ఎన్నో త్యాగాలు చేయాల్సివుంటుంది. తల్లిదండ్రులు ఎంతో సమయాన్ని, శక్తిని ధారపోయాల్సి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత, అనేక సంవత్సరాలవరకు తన భార్య కూటాల్లో అవధానం నిలపలేకపోవచ్చని, వ్యక్తిగత బైబిలు అధ్యయనం, ధ్యానం కోసం ఎక్కువ సమయం ఆమెకు దొరకక​పోవచ్చని ఒక క్రైస్తవ భర్త గ్రహించాలి. ఆ పరిస్థితి దేవునితో ఆమెకున్న సంబంధాన్ని బలహీనపర్చవచ్చు. పిల్లల ఆలనాపాలనను ఒక బాధ్యతగా పరిగణించాలంటే, బిడ్డను చూసుకోవడానికి భర్త తాను చేయగలిగినదంతా చేయాలి. తన భార్య కూటాల్లో వినలేకపోయిన కొన్ని అంశాలను తర్వాత ఇంట్లో చర్చించడం ద్వారా ఆమె ఆధ్యాత్మికంగా బలహీనపడకుండా చూడవచ్చు. తన భార్య రాజ్య ప్రకటనా పనిలో చక్కగా పాల్గొనడానికి వీలుగా కూడా ఆయన బిడ్డ ఆలనాపాలనలో పాలుపంచుకోవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 2:​3, 4 చదవండి.

10 పిల్లల ఆలనాపాలనను బాధ్యతగా పరిగణించడమంటే పిల్లలకు తిండి, బట్ట, ఇల్లు, ఆరోగ్య సంరక్షణ వంటివి సమకూర్చడం మాత్రమే కాదు. ప్రాముఖ్యంగా ఈ అపాయకరమైన అంత్యదినాల్లో, పిల్లలు తాము పాటించాల్సిన నైతిక సూత్రాలను చిన్నప్పటి నుండే నేర్చుకోవాలి. వారిని ‘యెహోవా శిక్షలో, బోధలో’ పెంచాలి. (ఎఫె. 6:⁠4) అలా పెంచాలంటే, తల్లిదండ్రులు పసివయసు నుండి అతిప్రాముఖ్యమైన యౌవన సంవత్సరాలవరకు యెహోవా ఆలోచనలను వారి మనసులో నాటాలి.​—⁠2 తిమో. 3:​14, 15.

11 “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించినప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలు శిష్యులయ్యేందుకు సహాయం చేయాలన్నది కూడా యేసు ఉద్దేశం కావచ్చు. (మత్త. 28:​19, 20) ఈ లోకం యౌవనస్థులమీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకొస్తోంది కాబట్టి అలా చేయడం అంత సులభం కాదు. అందుకే, పిల్లలు సమర్పిత క్రైస్తవులయ్యేలా పెంచడంలో విజయం సాధించిన తల్లిదండ్రులు సంఘంలోని వారందరి ప్రేమపూర్వక ప్రశంసకు పాత్రులు. బాధ్యతగల తల్లిదండ్రులుగా వారు తమ విశ్వాసయథార్థతల ద్వారా ఈ లోక ప్రభావాన్ని ‘జయించారు.’​—⁠1 యోహా. 5:⁠4.

మంచి ఉద్దేశంతో అవివాహితులుగా ఉండడం లేక పిల్లలు వద్దనుకోవడం

12 “కాలము సంకుచితమై యున్నది,” అంతేకాక, “ఈ లోకపు నటన గతించుచున్నది” కాబట్టి, అవివాహితులుగా ఉండడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పరిశీలించమని దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది. (1 కొరిం. 7:​29-31) అందుకే, కొందరు క్రైస్తవులు జీవితమంతా అవివాహి​తులుగా ఉండాలనుకుంటారు లేక కొంతకాలంపాటు వివాహం చేసుకోకుండా ఉండాలనుకుంటారు. అవివాహితులుగా ఉండడంవల్ల వచ్చే స్వేచ్ఛను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా ఉండడం మెచ్చుకోదగినదే. అనేకమంది ఎలాంటి ‘తొందర లేకుండా’ యెహోవాను సేవించాలని అవివాహితులుగా ఉండిపోతారు. (1 కొరింథీయులు 7:​32-35 చదవండి.) కొంతమంది అవివాహిత క్రైస్తవులు, పయినీర్లుగా లేదా బెతెల్‌ సభ్యులుగా సేవచేస్తారు. చాలామంది పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యేందుకు అర్హులవడం ద్వారా యెహోవా సంస్థలో మరింత ఎక్కువ సేవచేయడానికి కృషిచేస్తారు. వాస్తవానికి, అవివాహితులుగా ఉన్నప్పుడు కొంతకాలం పూర్తికాల పరిచారకులుగా సేవచేసి ఆ తర్వాత వివాహం చేసుకున్నవారు, ఆ తొలి సంవత్సరాల్లో తాము నేర్చుకున్న విలువైన పాఠాలు ఇప్పటికీ తమ కాపురంలో ఉపయోగపడుతున్నాయని భావిస్తారు.

13 కొన్ని దేశాల్లో, కుటుంబ జీవితంలో వచ్చిన మరో మార్పు ఏమిటంటే, అనేకమంది దంపతులు పిల్లలు వద్దనుకుంటున్నారు. కొందరు ఆర్థిక కారణాలనుబట్టి అలా వద్దనుకుంటే, మరికొందరు లాభసాటియైన ఉద్యోగం చేసేందుకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని అలా వద్దనుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవ దంపతులు కూడా పిల్లలు వద్దనుకుంటున్నారు. అయితే, వారు ఎలాంటి ఆటంకం లేకుండా యెహోవా సేవచేయాలనే అలా వద్దనుకుంటున్నారు. వారు సాధారణ వివాహ జీవితం గడపడంలేదనేమి కాదు. అయితే, దేవుని రాజ్యానికి ప్రథమస్థానం ఇచ్చేందుకు కొందరు వివాహంవల్ల వచ్చే ఆశీర్వాదాలను కూడా వదులుకోవడానికి ఇష్టపడుతున్నారు. (1 కొరిం. 7:​3-5) వారిలో కొందరు దంపతులు ప్రాంతీయ సేవలో, జిల్లా సేవలో, బెతెల్‌ సేవలో యెహోవాకు, తమ సహోదరులకు సేవచేస్తున్నారు. ఇతరులు పయినీర్లుగా లేదా మిషనరీలుగా సేవచేస్తున్నారు. యెహోవా వారు చేస్తున్న పనిని, తన నామంపట్ల వారు చూపిస్తున్న ప్రేమను మరువడు.​—⁠హెబ్రీ. 6:​10.

“శరీరసంబంధమైన శ్రమలు”

14 వివాహిత క్రైస్తవులకు “శరీరసంబంధమైన శ్రమలు” కలుగుతాయని అపొస్తలుడైన పౌలు వారికి చెప్పాడు. (1 కొరిం. 7:​28) దంపతులకు, వాళ్ల పిల్లలకు, వృద్ధులైన వారి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యల వంటి శ్రమలు ఎదురుకావచ్చు. పిల్లల ఆలనాపాలనకు సంబంధించిన కష్టాలు, మనోవేదనలు కూడా వారికి కలగవచ్చు. ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో పేర్కొనబడినట్లు, “అంత్యదినములలో” ‘అపాయకరమైన’ పరిస్థితులు ఎదురౌతాయని బైబిలు ప్రవచించింది. వాటిలో ఒకటేమిటంటే, పిల్లలు ‘తల్లిదండ్రులకు అవిధేయులుకావడం.’​—⁠2 తిమో. 3:​1-3.

15 క్రైస్తవ తల్లిదండ్రులకు పిల్లల్ని పెంచడం పెద్ద సవాలే. ప్రస్తుతమున్న ‘అపాయకరమైన’ పరిస్థితులవల్ల ఎదురౌతున్న ప్రతికూల పరిణామాలకు మనం అతీతులంకాదు. కాబట్టి, ‘ఈ ప్రపంచ ధర్మం’ లేక విధానం తమ పిల్లల మీద చూపించగల భయంకరమైన ప్రభావానికి వ్యతిరేకంగా క్రైస్తవ తల్లిదండ్రులు ఎడతెగక పోరాడాలి. (ఎఫె. 2:​2, 3) అయితే, వారు అన్ని సందర్భాల్లో ఆ పోరాటంలో విజయం సాధించరు! క్రైస్తవ కుటుంబంలోని ఒక అబ్బాయి లేక అమ్మాయి యెహోవాను సేవించడం మానేస్తే, వారిని దేవుని సత్యంలో పెంచడానికి కృషిచేసిన వారి తల్లిదండ్రులకు అది ఒక ‘శ్రమనే.’​—⁠సామె. 17:​25.

‘మహాశ్రమలు కలుగును’

16 వివాహ జీవితంలో, పిల్లల ఆలనాపాలనలో ఎన్నో ‘శ్రమలు’ ఎదురౌతాయి, అయితే వాటికన్నా మరింత తీవ్రమైన మరో శ్రమ రానుంది. యేసు తన ప్రత్యక్షత గురించిన, విధానాంతం గురించిన ప్రవచనంలో ఇలా అన్నాడు: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి [‘మహా,’ NW] శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్త. 24:​3, 21) ఒక గొప్ప సమూహం ఆ ‘మహాశ్రమలను’ తప్పించుకుంటుందని యేసు ఆ తర్వాత తెలియ​జేశాడు. అయితే, యెహోవా శాంతియుత సాక్షులకు వ్యతిరేకంగా సాతాను వ్యవస్థ చివరిసారిగా పూర్తిస్థాయిలో దాడిచేస్తుంది. నిస్సందేహంగా పెద్దవారు, పిల్లలు అనే భేదం లేకుండా మనందరికీ అది కష్ట కాలంగా ఉంటుంది.

17 అయితే, భవిష్యత్తు గురించి మనం అనవసరంగా భయపడకూడదు. యెహోవాకు నమ్మకంగా ఉండే తల్లిదండ్రులు, ఆ శ్రమ ఎదురైనప్పుడు తాము తమ పిల్లలతోపాటు రక్షించబడతామని ఆశించవచ్చు. (యెషయా 26:20, 21 చదవండి; జెఫ. 2:​2, 3; 1 కొరిం. 7:​14) అయితే ఇప్పుడు, మనం జీవిస్తున్న అపాయకరమైన కాలాల గురించిన మన అవగాహన, ఈ అంత్య​కాలంలో వివాహం, పిల్లల ఆలనాపాలన విషయంలో మన దృక్పథాన్ని ప్రభావితం చేయనిద్దాం. (2 పేతు. 3:​10-13) అలా చేస్తే, మనం అవివాహితులమైనా వివాహితులమైనా, మనకు పిల్లలు ఉన్నా లేకపోయినా, మన జీవితం యెహోవాకు, క్రైస్తవ సంఘానికి గౌరవాన్ని, ఘనతను తీసుకొస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 5 కావలికోట మే 1, 2002వ సంచికలో, 17-19 పేజీల్లోవున్న “విశ్వాసఘాతుక ప్రవర్తనను యెహోవా ద్వేషిస్తాడు” అనే అర్టికల్‌లోని 16-20 పేరాలు చూడండి.

^ పేరా 8 వివాహ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నవారు కావలికోట, సెప్టెంబరు 15, 2003 మరియు తేజరిల్లు!, ఏప్రిల్‌ 8, 2001 పత్రికల్లో ఉన్న వివాహానికి సంబంధించిన ఆర్టికల్స్‌ను చదవడం ద్వారా ప్రోత్సహించబడతారు.

^ పేరా 9 కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంలో “విజయవంతమయ్యే వివాహం కొరకు సిద్ధపడటం” అనే రెండవ అధ్యాయాన్ని చూడండి.

పునఃసమీక్ష

• యువక్రైస్తవులు వివాహం చేసుకోవడానికి ఎందుకు తొందరపడకూడదు?

• పిల్లల్ని పెంచడంలో ఏమి ఇమిడివుంది?

• చాలామంది క్రైస్తవులు అవివాహితులుగా ఎందుకు ఉండిపోతారు, ఒకవేళ వివాహితులైతే పిల్లలు ఎందుకు వద్దనుకుంటారు?

• క్రైస్తవ తల్లిదండ్రులు ఎలాంటి ‘శ్రమలను’ ఎదుర్కోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. (ఎ) ఈ ‘అపాయకరమైన’ కాలంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? (బి) మారుతున్న కుటుంబ విలువలనుబట్టి మనమెందుకు ఆందోళన చెందాలి?

2. ఈ లోకం వివాహాన్ని, విడాకులను ఎలా దృష్టిస్తోంది?

3. యెహోవా, యేసుక్రీస్తు వివాహాన్ని ఎలా దృష్టిస్తున్నారు?

4. కొందరు క్రైస్తవ యౌవనస్థులు తాము తొందరపడి వివాహం చేసుకున్నామని ఎందుకు విచారిస్తారు?

5. వివాహ ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు భార్యాభర్తలకు ఏమి సహాయం చేస్తుంది? (అధఃస్సూచి కూడా చూడండి.)

6. వివాహం చేసుకోవడాన్ని యువక్రైస్తవులు ఎలా దృష్టించాలి?

7. కొందరు యువదంపతుల పరిస్థితిలో ఎలాంటి మార్పు రావచ్చు, అది వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా దెబ్బతీయవచ్చు?

8. పిల్లల ఆలనాపాలనను ఎలా పరిగణించాలి, ఎందుకు?

9. (ఎ) పిల్లల్ని పెంచడానికి ఏమేమి చేయాల్సివుంటుంది? (బి) భార్య ఆధ్యాత్మికంగా బలంగా ఉండేలా సహాయం చేయడానికి భర్త ఏమి చేయవచ్చు?

10, 11. (ఎ) పిల్లల్ని ‘యెహోవా బోధలో’ ఎలా పెంచవచ్చు? (బి) అనేకమంది క్రైస్తవ తల్లిదండ్రులు ప్రశంసకు ఎందుకు పాత్రులు?

12. కొందరు క్రైస్తవులు ఎందుకు కొంతకాలంపాటు అవివాహితులుగా ఉండాలనుకుంటారు?

13. కొందరు క్రైస్తవ దంపతులు పిల్లలు ఎందుకు వద్దనుకుంటున్నారు?

14, 15. క్రైస్తవ తల్లిదండ్రులు ఎలాంటి ‘శరీరసంబంధమైన శ్రమలు’ ఎదుర్కోవచ్చు?

16. యేసు ఏ ‘శ్రమల’ గురించి ప్రవచించాడు?

17. (ఎ) (బి) మనం భవిష్యత్తు కోసం ధైర్యంగా ఎందుకు ఎదురు​చూడవచ్చు? (బి) వివాహం, పిల్లల ఆలనాపాలన విషయంలో మన దృక్పథాన్ని ఏది ప్రభావితం చేయాలి?

[17వ పేజీలోని చిత్రం]

యువక్రైస్తవులు వివాహం చేసుకోవడానికి కొంతకాలం వేచివుండడం ఎందుకు జ్ఞానయుక్తం?

[18వ పేజీలోని చిత్రం]

భర్త తన భార్య ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చక్కగా పాల్గొనేలా ఆమెకు ఎన్నో విధాలుగా సహాయం చేయవచ్చు

[19వ పేజీలోని చిత్రం]

కొందరు క్రైస్తవ దంపతులు పిల్లలు వద్దని ఎందుకు అనుకుంటారు?