కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ వారికి దూరంగావున్నా ఎవరూ వారిని మరచిపోలేదు

తమ వారికి దూరంగావున్నా ఎవరూ వారిని మరచిపోలేదు

తమ వారికి దూరంగావున్నా ఎవరూ వారిని మరచిపోలేదు

అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గల. 6:​10) నేటికీ మనమా ప్రేరేపిత నిర్దేశాన్ని పాటిస్తూ మన తోటివిశ్వాసులకు మేలుచేసే మార్గాల కోసం అన్వేషిస్తాం. క్రైస్తవ సంఘ ప్రేమపూర్వక శ్రద్ధ అవసరమయ్యే వారిలో, అది పొందేందుకు పాత్రులైన వారిలో వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న మన ప్రియమైన వృద్ధ సహోదరసహోదరీలు కూడా ఉన్నారు.

కొన్నిదేశాల్లో, పిల్లలు తమ ఇంట్లోవున్న వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం పరిపాటి. అయితే ఇతర దేశాల్లో చాలామంది వృద్ధులు సాధారణంగా వృద్ధాశ్రమాల్లో ఉంటారు. అలా వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వృద్ధ క్రైస్తవుల మాటేమిటి? వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు? కుటుంబ సభ్యుల సహకారం లేనట్లయితే వారేమి చేయవచ్చు? క్రైస్తవ సంఘం వారికెలా సహాయం చేయవచ్చు? వారిని చూడడానికి తరచూ వెళ్ళడంవల్ల మనం ఏయే విధాలుగా ప్రయోజనం పొందుతాం?

వృద్ధాశ్రమాల్లో ఎదురయ్యే సవాళ్లు

వృద్ధ క్రైస్తవులు వృద్ధాశ్రమంలో చేరినప్పుడు వారు తమకు అంతగా పరిచయంలేని సంఘం ఉన్న ప్రాంతంలో ఉండాల్సిరావచ్చు. అందువల్ల, స్థానిక సాక్షులు తరచూ వెళ్లి వారిని చూడాలనుకోకపోవచ్చు. అంతేకాక, వారు వృద్ధాశ్రమంలో విభిన్న మత నమ్మకాలుగల ప్రజల మధ్య ఉండాల్సిరావచ్చు. దానితో వృద్ధులైన మన తోటిసాక్షులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

ఉదాహరణకు, కొన్ని ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు అక్కడే మతసేవలు జరుపుకొనేలా ఏర్పాటు చేస్తాయి. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “స్పష్టంగా సంభాషించలేని కొంతమంది వృద్ధ సాక్షుల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండానే, వారిని చక్రాలకుర్చీలో చర్చి కార్యక్రమాలకు తీసుకువెళ్ళారు.” అంతేకాక, వృద్ధాశ్రమంలోవున్న వారి దినచర్యలో కొంత మార్పుకోసం అక్కడి సిబ్బంది జన్మదినాలు, క్రిస్మస్‌, లేదా ఈస్టర్‌ వంటివి ఆచరిస్తారు. అంతేకాక, అక్కడున్న కొంతమంది సాక్షుల మనస్సాక్షి అంగీకరించని ఆహారాన్ని వారికి తినడానికి ఇచ్చారు. (అపొ. 15:​28-29) మనం, మన వృద్ధ సహోదరసహోదరీలను తరచూ చూడడానికి వెళ్తే, అలాంటి సవాళ్లను అధిగమించేందుకు వారికి సహాయం చేయగలుగుతాం.

సంఘ మద్దతు

తొలి క్రైస్తవులు కుటుంబ మద్దతులేని వృద్ధుల విషయంలో తమకున్న బాధ్యతను విస్మరించలేదు. (1 తిమో. 5:⁠9, 10) అదేవిధంగా, నేడు పైవిచారణకర్తలు తమ ప్రాంతంలోని వృద్ధాశ్రమాల్లోవున్న వృద్ధులు నిర్లక్ష్యానికి గురికాకుండా చూస్తారు. * రాబర్ట్‌ అనే ఒక సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “వృద్ధులు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో చూడడానికి, వారితో కలిసి ప్రార్థించడానికి క్రైస్తవ పైవిచారణకర్తలు స్వయంగా వారి దగ్గరికి వెళ్తే వారికి ప్రయోజనకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారి అవసరాలు తీర్చడానికి సంఘం ఎన్నో విధాలుగా సహాయం చేయవచ్చు.” మనం వృద్ధులను చూడడానికి సమయం తీసుకున్నట్లయితే, అవసరంలోవున్న వారిపట్ల శ్రద్ధ కనబరచడం యెహోవా దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించామని చూపిస్తాం.​—⁠యాకో. 1:⁠27.

అవసరమైనప్పుడు, పెద్దలు స్థానిక వృద్ధాశ్రమాల్లోవున్న తమ సహోదరసహోదరీలకు కావాల్సిన సహాయం చేయడానికి ఇష్టపూర్వకంగా ఏర్పాట్లు చేస్తారు. వారికి కావాల్సిన ఒక సహాయం గురించి రాబర్ట్‌ ఇలా చెబుతున్నాడు: “వృద్ధ సహోదరసహోదరీలు లేసి తిరగగలిగితే, క్రైస్తవ కూటాలకు హాజరవ్వమని మనం వారిని ప్రోత్సహించాలి.” అయితే, రాజ్య మందిరానికి వెళ్ళలేని స్థితిలోవున్న వారి కోసం పెద్దలు వేరే ఏర్పాట్లు చేయవచ్చు. కీళ్లనొప్పులతో బాధ​పడుతున్న 80వ పడిలోవున్న జాక్లెన్‌ ఫోన్‌లో కూటాల్లోని కార్యక్రమాలను వింటుంది. ఆమె ఇలా అంటోంది: “కూటాలు జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా వినడం ద్వారా నేనెంతో ప్రయోజనం పొందుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను కూటాల్లోని కార్యక్రమాలను వినితీరాల్సిందే!”

వృద్ధ క్రైస్తవులు ఫోన్లో కూడా కూటాలను వినలేని స్థితిలో ఉంటే పెద్దలు కూటాల్లోని కార్యక్రమాలను రికార్డు చేయడానికి ఏర్పాట్లు చేయవచ్చు. రికార్డు చేసింది వారికివ్వడానికి వెళ్ళిన వ్యక్తి వారిని ప్రోత్సహించడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక పైవిచారణకర్త ఇలా చెబుతున్నాడు: “వారికి స్థానిక సంఘ సభ్యుల గురించిన విశేషాలు చెబితే తామిప్పటికీ ఆధ్యాత్మిక కుటుంబంలో భాగంగానే ఉన్నామని వారు భావిస్తారు.”

భావవ్యక్తీకరణను కొనసాగించండి

చాలామంది వృద్ధులు వృద్ధాశ్రమంలో చేరినప్పుడు ఒత్తిడికి, ఆందోళనకు గురౌతారన్న విషయం అర్థం చేసుకోదగినదే. అందువల్ల, కొందరు ఎవరితోనూ కలవకుండా దూరంగా ఉంటారు. అయితే, మన వృద్ధ సహోదరసహోదరీలు వృద్ధాశ్రమంలో చేరిన వెంటనే వారిని కలుసుకుని, వారికి మన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పడం ద్వారా వారు మనశ్శాంతిని, ఆనందాన్ని తిరిగి పొందేందుకు మనమెంతో తోడ్పడతాం.​—⁠సామె. 17:⁠22.

ఒకవేళ వృద్ధ సహోదరసహోదరీలు సరిగా ఆలోచించ​లేకపోతుంటే, వినికిడి శక్తి కోల్పోతుంటే, ఇతరత్రా సమస్యలవల్ల తమ భావాలను సరిగా వ్యక్తపరచలేకపోతుంటే వారిని కలుసుకోవడంవల్ల ప్రయోజనం లేదని కొందరు అను​కోవచ్చు. అయితే, వారితో సంభాషించడం ఎంత కష్టమైనప్పటికీ వారిని కలుస్తుండడానికి ప్రయత్నం చేస్తే, తోటి విశ్వాసులను ‘ఘనత విషయములో గొప్పగా ఎంచుతున్నామని’ చూపిస్తాం. (రోమా. 12:​10) వారి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటే చిన్ననాటి అనుభవాలతోపాటు గతంలో వారికి ఎదురైన అనుభవాలను చెప్పమనీ, బైబిలు సత్యాన్ని ఎలా తెలుసుకున్నారో చెప్పమనీ ప్రోత్సహించవచ్చు. వారు తమ భావాలను వ్యక్తంచేయడానికి సరియైన పదాల కోసం తడబడుతుంటే మనమేమి చేయవచ్చు? అలాంటి సందర్భాల్లో వారు చెప్పేది ఓపికతో వినండి, అవసరమైతే రెండు మూడు పదాలను అందించండి లేక వారి తలంపులను క్లుప్తంగా తిరిగిచెప్పండి. ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పమని వారిని ప్రోత్సహించండి. వారు తికమకపడడంవల్ల లేక మాటలు తడబడుతుండడంవల్ల వారు చెప్పేది అర్థంచేసుకోవడం మనకు కష్టమనిపిస్తే, వారు ఏ స్వరంతో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినడం ద్వారా వారేమి చెప్పాలనుకుంటున్నారో అర్థంచేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు.

వారితో మాట్లాడడం ఏమాత్రం వీలుకాకపోతే వేరే పద్ధతులను ఉపయోగించవచ్చు. అస్సలు మాట్లాడే స్థితిలో లేని 80 ఏళ్ల క్రైస్తవ సహోదరి అయిన మెడ్లెన్‌ను, లారెన్స్‌ అనే పయినీరు తరచూ కలుసుకుంటుంది. వారు పరస్పరం భావాలను ఎలా వ్యక్తం చేసుకుంటారో లారెన్స్‌ ఇలా చెబుతోంది: “మేము కలిసి ప్రార్థిస్తున్నప్పుడు నేను మెడ్లెన్‌ చెయ్యి పట్టుకుంటాను. ప్రార్థిస్తున్నప్పుడు ఆమె నా చెయ్యి నెమ్మదిగా నొక్కిపట్టుకొని, ఆ అమూల్యమైన క్షణాల కోసం కృతజ్ఞతలు తెలియజేస్తూ తన కనురెప్పలను ఆడిస్తుంది.” ఆప్యాయంగా మన వృద్ధ స్నేహితుల చెయ్యి పట్టుకుంటే లేదా ప్రేమగా వారిని హత్తుకుంటే వారికెంతో ఓదార్పు కలగవచ్చు.

మీరు వెళ్ళడం వారికెంతో మేలు చేస్తుంది

మీరు వృద్ధులను చూడడానికి తరచూ వెళ్తే, అక్కడ పనిచేసేవారు వారిని బాగా చూసుకోవచ్చు. దాదాపు 20 సంవత్సరాలుగా, వృద్ధాశ్రమాల్లో ఉన్న తోటి సాక్షులను చూడడానికి వెళ్తున్న డాన్యెల్లా ఇలా అంటోంది: “వృద్ధాశ్రమాల్లో పనిచేసేవారు, ఒక వ్యక్తిని చూడడానికి తరచూ ఎవరో ఒకరు రావడం గమనించినప్పుడు, వారు అతణ్ణి లేక ఆమెను బాగా చూసుకుంటారు.” పైన ప్రస్తావించబడిన రాబర్ట్‌ ఇలా చెబుతున్నాడు: “వృద్ధాశ్రమంలో పనిచేసేవారు, అక్కడున్న వారిని తరచూ చూడడానికి వచ్చేవారు చెప్పేది వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చూడడానికి వచ్చే వ్యక్తికి వారు అలాంటి గౌరవం ఇవ్వకపోవచ్చు.” నర్సులు తరచూ ఏమాత్రం మెప్పులేని కుటుంబ సభ్యులను కలుస్తుంటారు కాబట్టి సందర్శకులు కృతజ్ఞతను వ్యక్తంచేస్తే వారు సంతోషిస్తారు. అంతేకాక మనం వృద్ధాశ్రమంలో పనిచేసేవారితో మంచి సంబంధాన్ని పెంపొందించుకుంటే వారు తమ సంరక్షణలోవున్న వృద్ధ సాక్షుల విలువలను, నమ్మకాలను గౌరవించడానికి సుముఖత చూపించవచ్చు.

చిన్నచిన్న పనులు చేస్తామని ముందుకురావడం ద్వారా కూడా అక్కడ పనిచేసేవారితో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ సమర్థులైన పనివారి కొరత ఉంటుంది కాబట్టి వృద్ధులకు మంచి సంరక్షణ లభించకపోవచ్చు. రిబెక్కా అనే నర్సు ఇలా సలహా ఇస్తోంది: “భోజన సమయాల్లో మేము చాలా బిజీగా ఉంటాం. కాబట్టి ఆ సమయంలో వచ్చి, భోజనం తినిపించడానికి సహాయం చేస్తే బాగుంటుంది.” ఎలా సహాయం చేయవచ్చో చెప్పమని అక్కడ పనిచేసేవారిని అడగడానికి సంకోచించకండి.

మనం ఒకే వృద్ధాశ్రమానికి తరచూ వెళ్తే మన వృద్ధ సహోదరసహోదరీల అవసరాలేమిటో గ్రహించవచ్చు, అంతేకాక అక్కడ పనిచేసేవారి అనుమతితో ఆ అవసరాలు తీర్చడానికి మనం చొరవతీసుకోవచ్చు. ఉదాహరణకు, వారి ఆత్మీయుల ఫొటోలతో లేదా పిల్లలు వేసిన చిత్రాలతో వారు ఉంటున్న గదిని అలంకరించవచ్చు. వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అవసరమైన దుస్తులను లేదా వస్తువులను మనం వారికోసం తీసుకెళ్ళవచ్చు. ఆశ్రమంలో తోటవుంటే తాజా గాలి కోసం వారిని వ్యాహ్యాళికి తీసుకెళ్ళవచ్చు. పైన ప్రస్తావించబడిన లారెన్స్‌ ఇలా చెబుతోంది: “మెడ్లెన్‌ ప్రతీవారం నా రాక కోసం ఎదురుచూస్తుంటుంది. నాతో పాటు పిల్లలను తీసుకెళ్తే ఆమె వెంటనే చిరునవ్వు చిందిస్తుంది, ఆనందంతో ఆమె కళ్ళు మెరుస్తాయి!” వృద్ధాశ్రమంలో ఉన్నవారికి అలా సహాయం చేయడం వారికి ఎంతో మేలు చేస్తుంది.​—⁠సామె. 3:​27.

పరస్పరం ప్రయోజనం పొందుతారు

వృద్ధులను తరచూ కలుసుకోవడంవల్ల, “[మన] ప్రేమ యెంత యథార్థమైనదో” పరీక్షింపబడవచ్చు. (2 కొరిం. 8:⁠8) ఏ విధంగా? ఒక స్నేహితుడు క్రమంగా బలహీనమవ్వడాన్ని చూసినప్పుడు మనకు బాధ కలగవచ్చు. లారెన్స్‌ ఇలా ఒప్పుకుంటోంది: “మొదట్లో, మెడ్లెన్‌ బలహీన స్థితి నన్నెంతగా బాధపెట్టేదంటే, నేను ఆమెను చూసి వచ్చిన ప్రతిసారి ఏడ్చేదాన్ని. అయితే, పట్టుదలతో ప్రార్థించడంవల్ల మనకున్న భయాలు తొలగిపోతాయి. అంతేకాక, మనం కలుసుకునేవారిని మరింత ప్రోత్సహించగలుగుతామని కూడా నేను తెలుసుకున్నాను.” పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న ల్యారీ అనే సహోదరుణ్ణి రాబర్ట్‌ చాలా సంవత్సరాలుగా సందర్శిస్తున్నాడు. రాబర్ట్‌ ఇలా చెబుతున్నాడు: “ల్యారీ ఎంతగా వ్యాధిగ్రస్తుడయ్యాడంటే ఆయన చెప్పే ఒక్క మాట కూడా ఇప్పుడు నాకు అర్థంకావడం లేదు. అయితే, మేము కలసి ప్రార్థిస్తున్నప్పుడు మాత్రం ఆయనకు ఇప్పటికీ విశ్వాసం ఉందని గ్రహించగలుగుతున్నాను.”

మనం వృద్ధులైన తోటి విశ్వాసులను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, మనం వారికి సహాయం చేయడమేకాక మనం కూడా ప్రయోజనం పొందుతాం. ఇతర మతస్థుల మధ్య జీవిస్తూ కూడా యెహోవాకు సన్నిహితంగా ఉండాలన్న వారి కృతనిశ్చయం, మనం విశ్వాసం కలిగివుండాలని, ధైర్యం కనబరచాలని నేర్పుతుంది. వినికిడి శక్తి, కంటి చూపు మందగించినా ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవడానికి వారు చూపించే ఆసక్తి, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అనే విషయాన్ని నొక్కిచెబుతుంది. (మత్త. 4:⁠4) పిల్లల నవ్వు లేదా కలిసి భోజనం చేయడం వంటి చిన్నచిన్న విషయాల్లో వృద్ధులు ఆనందం పొందడంద్వారా మనం కూడా మనకున్న దానితో సంతృప్తిపడాలని వారు మనకు గుర్తుచేస్తున్నారు. ఆధ్యాత్మిక విలువలపట్ల వారికున్న ప్రేమ, మనం మన జీవితంలో సరైన వాటికి ప్రాధాన్యతనిచ్చేందుకు సహాయం చేస్తుంది.

వృద్ధులకు మనమందించే సహకారం నుండి సంఘమంతా ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఏ విధంగా? శారీరకంగా బలహీనంగా ఉన్నవారు సహోదర ప్రేమమీద అధికంగా ఆధారపడతారు కాబట్టి కనికరం చూపించడానికి వారు సంఘానికి అనేక అవకాశాలు ఇస్తారు. అందుకే, మనమందరం ఎంతకాలమైనా సరే, వృద్ధులను చూసుకోవడాన్ని, ఒకరికొకరం ఉపచారం చేయడంలో భాగంగా దృష్టించాలి. (1 పేతు. 4:​10, 11) ఈ పనిలో పెద్దలు ముందుగా చొరవ తీసుకుంటే, మన క్రైస్తవ పరిచర్యలోని ఈ అంశాన్ని విస్మరించకూడదని సంఘ సభ్యులందరూ గ్రహిస్తారు. (యెహె. 34:​15, 16) మనం ఇష్టపూర్వకంగా, ప్రేమతో సహకరించడం ద్వారా వృద్ధులైన మన తోటి క్రైస్తవులను మరచిపోలేదని వారికి హామీ ఇస్తాం!

[అధస్సూచి]

^ పేరా 8 సంఘంలోని ఒక సహోదరుడు లేక సహోదరి మరో ప్రాంతంలోని వృద్ధాశ్రమంలో చేరారని సంఘ కార్యదర్శి తెలుసుకున్న వెంటనే ఆయన ఆ ప్రాంతంలోని సంఘ పెద్దలకు దానిని తెలియజేయడం సహాయకరంగా, ప్రేమపూర్వకంగా ఉంటుంది.

[28వ పేజీలోని బ్లర్బ్‌]

“వృద్ధాశ్రమాల్లో పనిచేసేవారు, ఒక వ్యక్తిని చూడడానికి తరచూ ఎవరో ఒకరు రావడం గమనించినప్పుడు, వారు అతణ్ణి లేక ఆమెను బాగా చూసుకుంటారు”

[26వ పేజీలోని చిత్రం]

మన హృదయపూర్వక ప్రార్థనలు వృద్ధుడైన తోటి సాక్షి మనశ్శాంతిని తిరిగి పొందేందుకు తోడ్పడవచ్చు

[26వ పేజీలోని చిత్రం]

మనం వృద్ధులైన మన తోటి విశ్వాసులతో ఆప్యాయంగా మాట్లాడడం వారిని బలపరుస్తుంది