కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనస్థులారా, మీ సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకోండి

యౌవనస్థులారా, మీ సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకోండి

యౌవనస్థులారా, మీ సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకోండి

“నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”​—⁠ప్రసం. 12:​1, 2.

యెహోవా, క్రైస్తవ యౌవనస్థులను విలువైనవారిగా, మంచుబిందువుల్లా ఉత్తేజపరిచేవారిగా దృష్టిస్తున్నాడు. నిజమే, తన కుమారుని “యుద్ధసన్నాహదినమున” యువతీయువకులు క్రీస్తు సేవ చేయడానికి “ఇష్టపూర్వకముగా” ముందుకువస్తారు. (కీర్త. 110:⁠3) చాలామంది భక్తిహీనులుగా, స్వార్థపరులుగా, ధనాపేక్షగలవారిగా, అవిధేయులుగా ఉండే కాలంలో ఆ ప్రవచనం నెరవేరుతుంది. కానీ, తనను ఆరాధించే యౌవనస్థులు భిన్నంగా ఉంటారని యెహోవాకు తెలుసు. క్రైస్తవ యువతీయువకులైన మీ పట్ల ఆయనకు ఎంత నమ్మకముందో!

2 యౌవనస్థులు తనను సృష్టికర్తగా స్మరణకు తెచ్చుకుంటున్నప్పుడు దేవుడు ఎంత ఆనందిస్తాడో ఊహించండి. (ప్రసం. 12:​1, 2) యెహోవాను స్మరణకు తెచ్చుకోవడం అంటే కేవలం ఆయన గురించి ఆలోచించడం మాత్రమే కాదు. మనం దానికి తగిన చర్యలు తీసుకోవాలి, అంటే ఆయన ఇష్టపడే విధంగా ప్రవర్తించాలి, అనుదిన జీవితంలో ఆయన నియమాలు, సూత్రాలు మనల్ని నిర్దేశించనివ్వాలి. అంతేకాక, యెహోవా మన సంక్షేమాన్ని కోరుతున్నాడని తెలుసుకొని ఆయనమీద నమ్మకముంచాలి. (కీర్త. 37:⁠3; యెష. 48:​17, 18) మీ సృష్టికర్త విషయంలో మీకు అలాంటి నమ్మకమే ఉందా?

“నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము”

3 దేవునిమీద నమ్మకముంచినవారిలో చక్కని ఉదాహరణ యేసుక్రీస్తు. ఆయన సామెతలు 3:​5, 6లోని మాటలకు అనుగుణంగా జీవించాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” యేసు, బాప్తిస్మం తీసుకున్న కొద్ది రోజుల తర్వాత సాతాను ఆయన దగ్గరికి వచ్చి లోక అధికారాన్ని, మహిమను అంగీకరించేలా ఆయనను శోధించడానికి ప్రయత్నించాడు. (లూకా 4:​3-13) యేసు ఆ శోధనకు లొంగిపోలేదు. ‘యెహోవాయందు భయభక్తులు కలిగివుండడం ద్వారా’ అసలైన ‘ఐశ్వర్యము, ఘనత, జీవం’ లభిస్తాయని ఆయనకు తెలుసు.​—⁠సామె. 22:⁠4.

4 నేటి లోకంలో అత్యాశ, స్వార్థమనే లక్షణాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. మనం అలాంటి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, యేసు ఉదాహరణను అనుసరించడం జ్ఞానయుక్తం. జీవానికి నడిపించే ఇరుకు మార్గం నుండి యెహోవా సేవకులను తప్పించేందుకు సాతాను ఏమి చేయడానికైనా వెనకాడడని కూడా గుర్తుంచుకోండి. ప్రతీ ఒక్కరూ నాశనానికి దారితీసే విశాల మార్గంలో ఉండాలని అతడు కోరుకుంటున్నాడు. అతని చేతిలో మోసపోకండి! బదులుగా, మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని నిశ్చయించుకోండి. ఆయనను పూర్తిగా నమ్ముతూ ‘వాస్తవమైన జీవముమీద’ పట్టు సంపాదించండి, అలాంటి జీవితాన్ని అనుభవించే రోజు ఎంతో దూరంలో లేదు, అది ఖచ్చితంగా వస్తుంది.​—⁠1 తిమో. 6:​18.

యౌవనస్థులారా, జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి!

5 సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే యౌవనస్థులకు తమ సమవయస్కుల కన్నా విశేషజ్ఞానం ఉంటుంది. (కీర్తనలు 119:​99, 100 చదవండి.) వారికి దేవునికున్న దృక్పథమే ఉంటుంది కాబట్టి, ఈ లోకం త్వరలో నాశనమౌతుందని వారికి బాగా తెలుసు. మీరు జీవించిన ఈ కొద్దికాలంలోనే, భవిష్యత్తు విషయంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతుండడాన్ని మీరు గమనించేవుంటారు. మీరు ఇంకా పాఠశాలలో చదువుతుంటే కాలుష్యం, భూమి ఉష్ణోగ్రత పెరగడం, అడవుల నరికివేత వంటి సమస్యల గురించి మీరు ​వినేవుంటారు. అలాంటి పరిణామాల విషయంలో ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే అవి సాతాను లోక అంతాన్ని సూచిస్తున్నాయని యెహోవాసాక్షులే పూర్తిగా అర్థంచేసుకున్నారు.​—⁠ప్రక. 11:​18.

6 విచారకరంగా, దేవుని సేవకుల్లో కొందరు యౌవనస్థులు ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండక ఈ లోకం త్వరలో నాశనమౌతుందనే విషయాన్ని మరిచిపోయారు. (2 పేతు. 3:​3, 4) మరికొందరు, చెడు సహవాసం మూలంగా, అశ్లీల దృశ్యాలు చూడడం మూలంగా గంభీరమైన పాపం చేసేలా మోసగించబడ్డారు. (సామె. 13:​20) ఇప్పుడు అంతం సమీపిస్తుండగా దేవుని అనుగ్రహాన్ని కోల్పోవడం ఎంత విచారకరం! అలా కాకూడదంటే, సా.శ.పూ. 1473లో ఇశ్రాయేలీయులు మోయాబు మైదానంలో ఉన్నప్పుడు వారికి జరిగినదాని నుండి ఒక పాఠం నేర్చుకోండి. అప్పుడు వారు వాగ్దానదేశానికి అతిసమీపంలో ఉన్నారు. అక్కడ ఏమి జరిగింది?

వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తారనగా శోధనకు లొంగిపోయారు

7 ఆ కాలంలో, ఇశ్రాయేలీయులను వాగ్దానదేశంలోకి ప్రవేశించకుండా చేయాలని సాతాను కోరుకున్నాడు. ప్రవక్తయైన బిలాము వారిని శపించేలా చేయడంలో సాతాను విఫలమైన తర్వాత అతడు మరింత మోసకరమైన వ్యూహాన్ని ఉపయోగించాడు. యెహోవా ఆశీర్వాదాలను పొందడానికి వారిని అనర్హులుగా చేయాలనుకున్నాడు. వారిని ప్రలోభపెట్టడానికి మోసగత్తెలైన మోయాబు స్త్రీలను ఉపయోగించాడు, వారిని మోసగించడంలో అపవాది ఈసారి కొంత విజయం సాధించాడు. ఆ ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి బయల్పెయోరుకు మొక్కారు! వారు పొందబోయే అమూల్య స్వాస్థ్యమైన వాగ్దానదేశం అతి సమీపంలో ఉన్నా, దాదాపు 24,000 మంది ఇశ్రాయేలీయులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది ఎంతటి విషాదం!​—⁠సంఖ్యా. 25:​1-3, 9.

8 నేడు, మనం కూడా ఆ వాగ్దాన దేశంకన్నా శ్రేష్ఠమైన నూతన విధానానికి అతి దగ్గర్లో ఉన్నాం. ఎప్పటిలాగే, దేవుని ప్రజలను భ్రష్టుపట్టించడానికి సాతాను మళ్లీ లైంగిక దుర్నీతిని ఉపయోగిస్తున్నాడు. లోకంలో నైతిక విలువలు ఎంతగా దిగజారిపోయాయంటే జారత్వం మామూలు విషయంగా పరిగణించబడుతోంది, సలింగ సంయోగం కేవలం వ్యక్తిగత విషయంగా దృష్టించబడుతోంది. ఒక క్రైస్తవ సహోదరి ఇలా అంది: “సలింగ సంయోగాన్ని, వివాహేతర సంబంధాన్ని దేవుడు అసహ్యించుకుంటాడని మా పిల్లలు కేవలం ఇంట్లో, రాజ్యమందిరంలో మాత్రమే నేర్చుకుంటున్నారు.”

9 లైంగిక సంబంధం సంతానోత్పత్తి కోసం ఇవ్వబడిన పవిత్రమైన బహుమానమని తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనే యౌవనస్థులకు తెలుసు. అందుకే వారు లైంగిక సంబంధాలను యెహోవా ఆజ్ఞాపించినట్లే ఆనందించాలని అంటే వివాహ ఏర్పాటులోనే ఆనందించాలని గుర్తిస్తారు. (హెబ్రీ. 13:⁠4) అయితే, “ఈడు” వచ్చినప్పుడు, అంటే లైంగిక కోరికలు బలీయంగా ఉండడంవల్ల సరైన నిర్ణయం తీసుకోలేని సమయంలో, పవిత్రంగా ఉండడం కష్టమనిపించవచ్చు. (1 కొరిం. 7:​36) మీకు చెడు ఆలోచనలు వస్తుంటే మీరేమి చేయవచ్చు? మంచి విషయాలమీద దృష్టినిలిపేందుకు సహాయం చేయమని యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థించండి. యెహోవా అలాంటి ప్రార్థనలను ఎల్లప్పుడూ వింటాడు. (లూకా 11:​9-13 చదవండి.) మంచి విషయాల గురించి మాట్లాడుకోవడం కూడా మీ ఆలోచలను సరిచేసుకునేందుకు దోహదపడుతుంది.

మీ లక్ష్యాలను జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోండి

10 నేటి లోకంలోని అనేకమంది యౌవనస్థులకు “దేవోక్తి” లేదు, అంటే దేవుని నిర్దేశం లేదా భవిష్యత్తు విషయంలో ఖచ్చితమైన నిరీక్షణలేదు కాబట్టి వారు హద్దులు​మీరి, శారీరక కోరికలు తీర్చుకోవడానికే జీవిస్తున్నారు. (సామె. 29:​18) వారు, ‘మాంసము తినుచు ద్రాక్షారసం త్రాగుచు సంతోషించి ఉత్సహించిన’ యెషయా కాలంలోని దైవభక్తిలేని ఇశ్రాయేలీయుల్లాగే ఉన్నారు. (యెష. 22:​13) మీరు అలాంటివారిని చూసి ఈర్ష్యపడే బదులు, యెహోవా తన నమ్మకమైన సేవకులకు ఇచ్చిన అమూల్యమైన నిరీక్షణ గురించి ఎందుకు ఆలోచించకూడదు? మీరు దేవుణ్ణి సేవిస్తున్న యౌవనస్థులైతే, మీరు నూతనలోకం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారా? యెహోవా మీకిచ్చిన ‘శుభప్రదమైన నిరీక్షణ కోసం ఎదురుచూస్తూ స్వస్థబుద్ధితో బ్రతకడానికి’ మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారా? (తీతు 2:​12, 13) ఈ ప్రశ్నలకు మీరిచ్చే జవాబులు, మీ లక్ష్యాలను, మీ ప్రాధమ్యాలను ప్రభావితం చేస్తాయి.

11 యౌవనస్థులు తమ సర్వశక్తులను లోకసంబంధమైన లక్ష్యాల కోసం ధారపోయాలని లోకం కోరుకుంటోంది. నిజమే, మీరు ఇంకా స్కూల్లో చదువుతున్నట్లయితే, చక్కని ప్రాథమిక విద్య కోసం మీరు కష్టపడి చదువుకోవాలి. ఎందుకంటే, సరైన ఉద్యోగం సంపాదించుకోవడంతోపాటు, సంఘంలో ఉపయోగకరంగా, సమర్థులైన రాజ్య ప్రచారకులుగా ఉండాలన్నది కూడా మీ లక్ష్యమని గుర్తుంచుకోండి. దాని కోసం మీరు స్పష్టంగా మాట్లాడగలగాలి, హేతుబద్ధంగా ఆలోచించగలగాలి, ఇతరులతో ప్రశాంతంగా, గౌరవపూర్వకంగా తర్కించగలగాలి. ఏదేమైనా, బైబిలు అధ్యయనంచేసి దానిలోని సూత్రాలను జీవితంలో అన్వయించుకునేందుకు కృషిచేసేవారు, అన్నింటికన్నా శ్రేష్ఠమైన విద్యను పొందుతూ విజయవంతమైన, శాశ్వత భవిష్యత్తు కోసం చక్కని పునాదివేసుకుంటారు.​—⁠కీర్తనలు 1:​1-3 చదవండి. *

12 ఇశ్రాయేలులోని తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య నేర్పించడానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. వారు తమ పిల్లలకు జీవితంలోని అన్ని రంగాల్లో, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో శిక్షణనిచ్చేవారు. (ద్వితీ. 6:​6, 7) కాబట్టి, తమ తల్లిదండ్రులు, దైవభక్తిగల ఇతర పెద్దలు బోధించిన విషయాలను విన్న యువ ఇశ్రాయేలీయులు విజ్ఞానాన్నే కాక జ్ఞానాన్ని, వివేచనను, అవగాహనను, ఆలోచనా సామర్థ్యాన్ని కూడా సంపాదించుకున్నారు. అవి దైవిక విద్యవల్ల మాత్రమే లభించగల అసాధారణ లక్షణాలు. (సామె. 1:​2-4; 2:​1-5, 11-15) నేడు క్రైస్తవ కుటుంబాలు కూడా విద్యకు అంతే ప్రాముఖ్యతనివ్వాలి.

మిమ్మల్ని ప్రేమిస్తున్నవారు చెప్పేది వినండి

13 యౌవనస్థులకు అన్నిరకాల ప్రజలు సలహాలిస్తుంటారు, భవిష్యత్తులో ఏ కోర్సు తీసుకోవాలి అనే విషయంలో పాఠశాల కౌన్సిలర్లు కూడా సలహా ఇస్తుంటారు, వారు ఈ లోకంలో ఎలా విజయం సాధించాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సలహాలిస్తుంటారు. వారిచ్చే సలహాలను దేవుని వాక్యం ఆధారంగా, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ప్రచురించిన ప్రచురణల ఆధారంగా ప్రార్థనాపూర్వకంగా పరిశీలించండి. సాతాను ముఖ్యంగా యౌవనస్థులను, అనుభవంలేనివారిని లక్ష్యంగా చేసుకుంటాడని మీకు బైబిలు అధ్యయనం ద్వారా తెలుసు. ఉదాహరణకు, ఏదెను తోటలో అనుభవంలేని హవ్వ తనపట్ల ఏ మాత్రం ప్రేమ చూపించని సాతాను మాట విన్నది. తనపట్ల ఆనేక విధాలుగా ప్రేమ కనబరిచిన యెహోవా మాట ఆమె వినుంటే పరిస్థితి ఎంత భిన్నంగా ఉండేదో కదా!​—⁠ఆది. 3:​1-6.

14 మీ సృష్టికర్త మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మీ నుండి ఏదో ఆశిస్తూ ఆయన అలా ప్రేమించడం లేదు. మీరు ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు! ఒక ప్రేమగల తండ్రిలాగే ఆప్యాయతతో ఆయన మీకూ, తన ఆరాధకులందరికీ ఇలా చెబుతున్నాడు: “ఇదే త్రోవ దీనిలో నడువుడి.” (యెష. 30:​21) మీ తల్లిదండ్రులు యెహోవాను ఎంతో ప్రేమించే సత్యారాధకులైతే మీకు మరో ఆశీర్వాదం ఉన్నట్లే. వేటికి ప్రాధాన్యత​నివ్వాలి, ఏ లక్ష్యాలు పెట్టుకోవాలి అనే విషయంలో వారి సలహాలను గౌరపూర్వకంగా వినండి. (సామె. 1:​8, 9) మీరు జీవాన్ని పొందాలనే కదా వారు కోరుకుంటున్నది! అది ప్రపంచంలోని ధనంకన్నా, హోదాకన్నా ఎంతో విలువైనది.​—⁠మత్త. 16:​26.

15 సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనేవారు, యెహోవా తమను “ఏమాత్రము” విడువడనే నమ్మకంతో, ‘ఎన్నడూ’ ఎడబాయడనే నమ్మకంతో నిరాడంబరంగా జీవిస్తారు. (హెబ్రీయులు 13:5 చదవండి.) అలాంటి మంచి వైఖరి, ఈ లోక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి, లౌకికాత్మ మనల్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త​పడాలి. (ఎఫె. 2:⁠2) దీని విషయంలో, యిర్మీయా కార్యదర్శియైన బారూకు ఉదాహరణను పరిశీలించండి. సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనంకావడానికి ముందు నెలకొనివున్న కష్ట​భరితమైన కాలంలో ఆయన జీవించాడు.

16 బారూకు ధనం సంపాదించుకొని మంచి జీవితం గడపాలని కోరుకొనివుంటాడు. యెహోవా దానిని గమనించి, “గొప్పవాటి” కోసం ప్రయాసపడొద్దని దయతో ఆయనను హెచ్చరించాడు. బారూకు యెహోవా మాటను విని యెరూషలేము నాశనాన్ని తప్పించుకున్నాడు కాబట్టి ఆయన వినయంగా, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడని చెప్పవచ్చు. (యిర్మీ. 45:​2-5) అయితే, బారూకు సమకాలీనులు యెహోవాకు ప్రాధాన్యతనివ్వకుండా, వస్తుపరంగా “గొప్పవాటిని” సంపాదించుకున్నారు. కొంతకాలానికి కల్దీయులు (బబులోనీయులు) యెరూషలేమును నాశనం చేసినప్పుడు వారు వాటన్నింటిని కోల్పోయారు. అనేకమంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. (2 దిన. 36:​15-18) ధనంకన్నా, ఈ లోకంలోని హోదాకన్నా దేవునితో మంచి సంబంధమే ఎంతో ప్రాముఖ్యమైనదని గ్రహించేందుకు బారూకు అనుభవం మనకు సహాయం చేస్తుంది.

మాదిరికరంగా ఉన్నవారిని అనుసరించండి

17 బైబిలు మనకు మాదిరికరంగా ఉన్న అనేకమంది గురించి తెలియజేయడం ద్వారా జీవాన్నిచ్చే మార్గంలో నడిచేందుకు మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, యేసు జీవించినవారిలోకెల్లా ఎంతో నైపుణ్యంగల వ్యక్తే అయినా, ప్రజలకు నిరంతరం సహాయం చేసే “రాజ్యసువార్త” ప్రకటించడానికే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. (లూకా 4:​43) అపొస్తలుడైన పౌలు యెహోవాకు శాయశక్తులా సేవచేసేందుకు లాభసాటియైన వృత్తిని వదిలేసి సువార్త ప్రకటించడానికి తన సమయాన్ని, శక్తిని వినియోగించాడు. ‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడైన’ తిమోతి పౌలు ఉంచిన చక్కని మాదిరిని అనుసరించాడు. (1 తిమో. 1:⁠2) యేసు పౌలు తిమోతిలు తమ జీవితంలో తాము తీసుకున్న నిర్ణయాలనుబట్టి విచారించారా? విచారించలేదు! వాస్తవానికి, దేవుణ్ణి సేవించే ఆధిక్యతతో పోలిస్తే ప్రపంచం ఇవ్వజూపేవన్నీ “నష్టముగా” పరిగణిస్తున్నానని పౌలు చెప్పాడు.​—⁠ఫిలి. 3:​8-11.

18 నేడు అనేకమంది యువక్రైస్తవులు యేసు పౌలు తిమోతిల విశ్వాసాన్ని అనుకరిస్తున్నారు. ఉదాహరణకు, ఒకప్పుడు మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసిన ఒక యువసహోదరుడు ఇలా రాశాడు: “నేను బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవిస్తున్నందుకు నాకు త్వరత్వరగా పదోన్నతి లభించింది. నేను ఎంతో డబ్బు సంపాదిస్తున్నా, నేను గాలి కోసం ప్రయాసపడుతున్నట్లు నాకు అనిపించింది. నేను నా పైఅధికారుల దగ్గరికి వెళ్లి పూర్తికాల పరిచర్య చేపట్టాలనే నా కోరికను తెలియజేసినప్పుడు, నేను అక్కడే పనిచేస్తాననే ఆశతో వారు వెంటనే మరింత జీతం ఇవ్వజూపారు. కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకోకూడదని నిశ్చయించుకున్నాను. పూర్తికాల సేవ కోసం నేనెందుకు లాభసాటియైన ఉద్యోగాన్ని వదులుకుంటున్నానో చాలామంది అర్థంచేసుకోలేకపోయారు. దేవునికి నేను చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించాలని ఎంతో కోరుకున్నాను కాబట్టే నేనలా చేశాను. ఇప్పుడు నా జీవితంలో దేవుని సేవకే ప్రాధాన్యతనిస్తున్నాను కాబట్టి డబ్బు, హోదా వల్ల వచ్చే దానికన్నా అధిక సంతోషాన్ని, సంతృప్తిని నేను చవిచూస్తున్నాను.”

19 ప్రపంచవ్యాప్తంగా, వేలాదిమంది యౌవనస్థులు అలాంటి జ్ఞానయుక్త మైన నిర్ణయాలే తీసుకున్నారు. కాబట్టి, యౌవనస్థులారా, మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు యెహోవా దినాన్ని ఆశతో అపేక్షించండి. (2 పేతు. 3:​11, 12) ఈ లోకంలో వర్ధిల్లుతున్నవారిని చూసి ఈర్ష్యపడకండి. బదులుగా, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నవారు చెప్పేది వినండి. ‘పరలోకంలో ధనాన్ని’ సమకూర్చుకుంటే అది సురక్షితంగా ఉంటుంది, కేవలం దానివల్ల మాత్రమే మనం నిత్యప్రయోజనాలను పొందుతాం. (మత్త. 6:​19, 20; 1 యోహాను 2:15-17 చదవండి.) మీ సృష్టికర్తను తప్పక స్మరణకు తెచ్చుకోండి. మీరలా చేస్తుంటే, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

[అధస్సూచి]

^ పేరా 17 ఉన్నత విద్య, ఉద్యోగానికి సంబంధించి కావలికోట, అక్టోబరు 1, 2005, 26-31 పేజీలు చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

యెహోవామీద నమ్మకముందని మనమెలా చూపించవచ్చు?

అతి శ్రేష్ఠమైన విద్య ఏది?

బారూకు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

ఎవరు మనకు మాదిరికరంగా ఉన్నారు, ఎందుకు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా తనను ఆరాధిస్తున్న యౌవనస్థులపట్ల తనకున్న నమ్మకాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడు?

2. యెహోవాను స్మరణకు తెచ్చుకోవడానికి ఏమి చేయాలి?

3, 4. యేసు యెహోవామీద తనకున్న నమ్మకాన్ని ఎలా చూపించాడు, నేడు యెహోవామీద నమ్మకముంచడం ఎందుకు ప్రాముఖ్యం?

5. ఈ లోక భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?

6. కొందరు యౌవనస్థులు ఎలా మోసపోయారు?

7, 8. (ఎ) మోయాబు మైదానంలో సాతాను ఏ వ్యూహాన్ని ఉపయోగించాడు? (బి) నేడు సాతాను ఏ వ్యూహాన్ని ఉపయోగిస్తున్నాడు?

9. “ఈడు” వచ్చినప్పుడు ఏమి జరగవచ్చు, యౌవనస్థులు ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు?

10. ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలను మన దగ్గరికి రానివ్వకూడదు, మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవచ్చు?

11. ఇంకా స్కూల్లో చదువుతున్న యువక్రైస్తవులు ఎందుకు కష్టపడి చదువుకోవాలి?

12. క్రైస్తవ కుటుంబాలు ఎవరి ఉదాహరణను అనుసరించాలి?

13. కొంతమంది యౌవనస్థులకు ఎలాంటి సలహా లభిస్తుంటుంది, వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

14. మనం యెహోవా మాటను, సత్యారాధకులైన మన తల్లిదండ్రుల మాటలను ఎందుకు వినాలి?

15, 16. (ఎ) యెహోవామీద మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? (బి) బారూకు అనుభవం నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటాం?

17. యేసు పౌలు తిమోతిలు నేటి యెహోవా సేవకులకు మాదిరికరంగా ఉన్నారని ఎందుకు చెప్పవచ్చు?

18. ఒక యువసహోదరుడు తన జీవితంలో ఎలాంటి పెనుమార్పులు చేసుకున్నాడు, ఆయన అలా చేసినందుకు ఎందుకు విచారించడంలేదు?

19. ఎలాంటి జ్ఞానయుక్త మైన నిర్ణయాలు తీసుకోవాలని యౌవనస్థులు ప్రోత్సహించబడుతున్నారు?

[13వ పేజీలోని చిత్రం]

యెహోవా ఎంతో శ్రేష్ఠమైన విద్యను అందజేస్తున్నాడు

[15వ పేజీలోని చిత్రం]

బారూకు యెహోవా మాట విని యెరూషలేము నాశనాన్ని తప్పించుకున్నాడు. ఈ ఉదాహరణ నుండి మీరేమి నేర్చుకోవచ్చు?