కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వ్యర్థమైనవాటిని” తిరస్కరించండి

“వ్యర్థమైనవాటిని” తిరస్కరించండి

“వ్యర్థమైనవాటిని” తిరస్కరించండి

“వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.”​—⁠సామె. 12:​11.

క్రైస్తవులమైన మనందరికీ విలువైనదేదో ఒకటి ఉంటుంది. అది ఒక మోస్తరు ఆరోగ్యమైనా, బలమైనా, స్వభావసిద్ధమైన మానసిక సామర్థ్యాలైనా, ఆర్థిక వనరులైనా కావచ్చు. మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం వాటిని ఆయన సేవలో ఉపయోగిస్తూ, “నీ ఆస్తిలో భాగమును [‘విలువైనవాటిని,’ NW] ఇచ్చి యెహోవాను ఘనపరచుము” అని ఇవ్వబడిన దైవప్రేరిత ప్రోత్సాహానికి ప్రతిస్పందించడానికి ఇష్ట​పడతాం.​—⁠సామె. 3:⁠9.

2 అయితే, బైబిలు వ్యర్థమైనవాటి గురించి కూడా చెబుతూ, వాటి కోసం మన శక్తిసామర్థ్యాలను వ్యర్థం చేసుకో​వద్దని హెచ్చరిస్తోంది. దీని గురించి సామెతలు 12:​11 ఏమి చెబుతుందో చూడండి: “తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.” ఈ సామెత అక్షరార్థంగా ఒక వ్యక్తికి ఎలా అన్వయిస్తుందో అర్థం చేసుకోవడం కష్టమేమీకాదు. తన కుటుంబ పోషణ కోసం తన సమయాన్ని, శక్తిని ధారపోసే వ్యక్తి కొంతమేరకు ఆర్థిక భద్రతను అనుభవించే అవకాశం ఉంది. (1 తిమో. 5:⁠8) అయితే, ఆయన వ్యర్థమైనవాటిని సంపాదించుకోవడానికి తన శక్తిసామర్థ్యాలను వృథాచేస్తే ఆయన ‘బుద్ధిహీనతను’ ప్రదర్శిస్తాడు, అంటే తనకు సమతుల్యంతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సదుద్దేశం లేవని చూపిస్తాడు. సాధారణంగా, అలాంటి వ్యక్తి తన కుటుంబ అవసరాలను తీర్చలేకపోతాడు.

3 ఈ సామెతలో ఉన్న సూత్రాన్ని మన ఆరాధనలో అన్వయించుకుంటే ఏమి జరుగుతుంది? యెహోవాను శ్రద్ధగా, నమ్మకంగా సేవించే క్రైస్తవుడు నిజమైన భద్రతను అనుభవిస్తాడు. ఆయన ఇప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందవచ్చనే నమ్మకంతో ఉండడమేకాక భవిష్యత్తు విషయంలో కూడా ఖచ్చితమైన నిరీక్షణతో ఉంటాడు. (మత్త. 6:​33; 1 తిమో. 4:​10) అయితే, వ్యర్థమైనవాటి ద్వారా ఆటంక​పరచబడే క్రైస్తవుడు యెహోవాతో తన సంబంధాన్ని పాడుచేసుకోవడంతోపాటు నిత్యజీవం పొందే అవకాశాన్ని కూడా కోల్పోతాడు. మనకు ఆ పరిస్థితి రాకూడదంటే ఏమి చేయాలి? మన జీవితంలో ‘వ్యర్థమైనవి’ ఏవో గుర్తించి, వాటికి దూరంగా ఉండాలనే కృతనిశ్చయాన్ని ఏర్పరచు​కోవాలి.​—⁠తీతు 2:​11-13 చదవండి.

4 అయితే, ఏవి వ్యర్థమైనవి? సాధారణంగా, యెహోవాను పూర్ణాత్మతో సేవించకుండా మనల్ని ఆటంకపరిచేవేవైనా వ్యర్థమైనవేనని చెప్పవచ్చు. ఉదాహరణకు, అవి వివిధ రకాల వినోదాలు కావచ్చు. నిజమే, తగుమాత్రపు వినోదం ప్రయోజనకరమైనదే. అయితే, మన ఆరాధనకు సంబంధించిన కార్యకలాపాలను నిర్లక్ష్యం చేస్తూ అధిక సమయాన్ని “సరదాల” కోసం వెచ్చిస్తే అది వ్యర్థమైనదే అవుతుంది, అది యెహోవాతో మనకున్న సంబంధాన్ని దెబ్బతీస్తుంది. (ప్రసం. 2:​24; 4:⁠6) అలా జరగకూడదంటే, ఒక క్రైస్తవుడు సమతుల్యాన్ని పెంపొందించుకొని తన విలువైన సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నాడో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. (కొలొస్సయులకు 4:5 చదవండి.) అయితే, వినోదం కన్నా ప్రమాదకరమైన వ్యర్థమైన విషయాలు ఉన్నాయి. ఆ వ్యర్థమైనవాటిలో అబద్ధ దేవతలు కూడా ఉన్నారు.

వ్యర్థమైన దేవతలను తిరస్కరించండి

5 ఆసక్తికరంగా, ఆదిమ హెబ్రీ భాషలో “వ్యర్థమైన” అనే పదం ఎక్కువగా అబద్ధ దేవతలకు అన్వయించ​బడింది. ఉదాహరణకు, యెహోవా ఇశ్రాయేలీయులను ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు [‘వ్యర్థమైన,’ NW] విగ్రహములను చేసికొనకూడదు, చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.” (లేవీ. 26:⁠1) రాజైన దావీదు ఇలా రాశాడు: “యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు, సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే [‘వ్యర్థమైనవే,’ NW] యెహోవా ఆకాశ​వైశాల్యమును సృజించినవాడు.”​—⁠1 దిన. 16:​25, 26.

6 దావీదు చెప్పినట్లు యెహోవా గొప్పతనానికి సంబంధించిన రుజువులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. (కీర్త. 139:​14; 148:​1-10) ఇశ్రాయేలీయులు యెహోవాతో నిబంధనా సంబంధంలోకి రావడం వారికి లభించిన ఎంత గొప్ప ఆధిక్యతో కదా! వారు ఆయనను విడిచి చెక్కిన ప్రతిమకు, బొమ్మకు సాగిలపడడం ఎంతటి మూర్ఖత్వం! గడ్డు కాలంలో ఆ అబద్ధ దేవతలు తమ ఆరాధకులను రక్షించడం అటుంచి, తమను తాము కూడా రక్షించుకోలేకపోయాయి కాబట్టి అవి నిజంగా వ్యర్థమైనవని రుజువైంది.​—⁠న్యాయా. 10:​14, 15; యెష. 46:​5-7.

7 నేడు అనేక దేశాల్లో, ప్రజలు ఇప్పటికీ తాము చేసుకున్న విగ్రహాలకు సాగిలపడుతున్నారు లేదా వాటిని పూజిస్తున్నారు, ప్రాచీనకాలంలోలాగే అవి ఇప్పుడు కూడా వ్యర్థమైనవే. (1 యోహా. 5:​21) అయితే, బైబిలు విగ్రహాలనే​కాక ఇతర విషయాలను కూడా దేవతలుగా వర్ణిస్తోంది. ఉదాహరణకు, యేసు చెప్పిన ఈ మాటలను గమనించండి: “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.”​—⁠మత్త. 6:​24.

8 “సిరి” దేవత ఎలా కాగలదు? ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలులోని ఒక పొలంలో ఉన్న రాయి గురించి ఆలోచించండి. ఇంటిని లేదా గోడను నిర్మించడానికి ఆ రాయిని ఉపయోగించవచ్చు. అయితే, దానిని ‘బొమ్మగా’ లేక ఏదో రూపంలో చెక్కబడిన ‘రాతిగా’ నిలబెడితే అది యెహోవా ప్రజలకు అభ్యంతరకరంగా తయారౌతుంది. (లేవీ. 26:⁠1) అలాగే, డబ్బు మనకు ప్రయోజనకరమైనది. మనం బ్రతకడానికి అది అవసరమే. అంతేకాక దానిని మనం యెహోవా సేవలో కూడా చక్కగా ఉపయోగించవచ్చు. (ప్రసం. 7:​12; లూకా 16:⁠9) అయితే, మనం క్రైస్తవ సేవకన్నా ధన సంపాదనకు అధిక ప్రాధాన్యతనిస్తే, అదే మనకు దేవత అవుతుంది. (1 తిమోతి 6:​9, 10 చదవండి.) ధనసంపాదనే ఎంతో ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడే ఈ లోకంలో, మనం డబ్బు విషయంలో సమతుల్యమైన దృక్కోణం కలిగివుండేందుకు జాగ్రత్తపడాలి.​—⁠1 తిమో. 6:​17-19.

9 లౌకిక విద్య కూడా ప్రయోజనకరమైనదే అయినా, అది కూడా వ్యర్థమైనది కావచ్చు. మన పిల్లలు విద్యావంతులై జీవనోపాధిని సంపాదించుకోవాలని మనం కోరుకుంటాం. అంతకన్నా ప్రాముఖ్యంగా, విద్యావంతుడైన ఒక క్రైస్తవుడు బైబిలును ఇతరులకన్నా చక్కగా అవగాహనతో చదవగలుగుతాడు. సమస్యల గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. బైబిలు సత్యాలను స్పష్టంగా, ఒప్పింపజేసే విధంగా బోధించగలుగుతాడు. మంచి విద్యను అభ్యసించడానికి సమయం పడుతుంది, అయితే దానివల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

10 అయితే, కాలేజీలో లేదా విశ్వవిద్యాలయంలో అభ్యసించే ఉన్నత విద్య విషయమేమిటి? జీవితంలో విజయం సాధించడానికి అది ఎంతో ప్రాముఖ్యమని చాలామంది అనుకుంటారు. అయితే, ఆ విద్యను అభ్యసించేవారి మనసులు హానికరమైన లోకజ్ఞానంతో నిండిపోతాయి. అలాంటి విద్య, యెహోవా సేవలో చక్కగా ఉపయోగించగల అమూల్యమైన యౌవనకాలాన్ని హరించివేస్తుంది. (ప్రసం. 12:⁠1, 2) ఉన్నతవిద్యను అభ్యసించినవారు అధికంగా ఉన్న దేశాల్లో, మునుపటికన్నా ఎక్కువమంది దేవుణ్ణి నమ్మక​పోవడం ఆశ్చర్యం కలిగించదు. ఒక క్రైస్తవుడు భద్రత కోసం పురోభివృద్ధి సాధించిన ఈ లోక విద్యా విధానాలను ఆశ్రయించే బదులు యెహోవామీద నమ్మకముంచుతాడు.​—⁠సామె. 3:⁠5.

శారీరక కోరికలను దేవతగా చేసుకోకండి

11 అపొస్తలుడైన పౌలు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవతగా మారగల ఒక అంశం గురించి తెలియజేశాడు. ఒకప్పుడు తోటి ఆరాధకులుగా ఉన్న కొందరి గురించి తెలియజేస్తూ ఆయన ఇలా అన్నాడు: “అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరినిగూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. . . . భూసంబంధమైనవాటియందే మనస్సు నుంచుచున్నారు.” (ఫిలి. 3:​18, 19) ఒక వ్యక్తికి కడుపే దేవునిగా లేక దేవతగా ఎలా కాగలదు?

12 పౌలుకు పరిచయమున్న ఆ వ్యక్తులు, పౌలుతోపాటు యెహోవాను సేవించడంకన్నా శారీరక కోరికలు తీర్చు​కోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తోంది. కొందరు నిజంగానే తిండిబోతులుగా లేక తాగుబోతులుగా తయారయ్యేంత అతిగా తిని తాగి ఉంటారు. (సామె. 23:​20, 21; ద్వితీయోపదేశకాండము 21:18-21 పోల్చండి.) ఇతరులు మొదటి శతాబ్దంలో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని యెహోవా సేవ చేయకుండా ప్రక్కదారిపట్టారు. ప్రజలు మంచిదని భావించే జీవితాన్ని మనం కూడా గడపాలనే కోరికవల్ల పూర్ణాత్మతో యెహోవా సేవ చేయడంలో వెనుకంజ వేయకుండా జాగ్రత్తవహిద్దాం.​—⁠కొలొ. 3:​23, 24.

13 పౌలు అబద్ధ ఆరాధనకు సంబంధించిన మరో అంశాన్ని కూడా పేర్కొన్నాడు. ఆయన ఇలా రాశాడు: ‘కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, ధనాపేక్షను, విగ్రహరాధనయైన దురాశను చంపి వేయుడి.’ (కొలొ. 3:⁠5) మనది కానిదాన్ని పొందాలన్న బలీయమైన కోరికే దురాశ. అది వస్తువులు కావచ్చు. అనుచిత లైంగిక కోరికా కావచ్చు. (నిర్గ. 20:​17) అలాంటి కోరికలు కలిగివుండడం విగ్రహారాధన, అబద్ధ దేవతారాధన చేయడంతో సమానమనే ఆలోచన గంభీరమైనది కాదా? అలాంటి చెడు కోరికలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయాసపడడం ఎంత ప్రాముఖ్యమో యేసు కళ్లకు కట్టినట్లు వివరించాడు.​—⁠మార్కు 9:⁠47 చదవండి; 1 యోహా. 2:​16.

వ్యర్థమైన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి

14 వ్యర్థమైనవాటిలో మాటలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు: “ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును [‘వ్యర్థమైన మాటను,’ NW] తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.” (యిర్మీ. 14:​14) ఆ అబద్ధ ప్రవక్తలు యెహోవా నామమునుబట్టి ప్రకటిస్తున్నామని చెప్పుకున్నారు గానీ వారు సొంత సిద్ధాంతాలను, సొంత జ్ఞానాన్ని ప్రకటించారు. కాబట్టి, వారు ప్రకటించింది ‘వ్యర్థమైన మాటలే.’ అవి ప్రయోజనంలేనివి, అంతేకాక అవి సత్యారాధనకు కూడా పెద్ద ముప్పుగా పరిణమించాయి. అలాంటి వ్యర్థమైన మాటలను లక్ష్యపెట్టినవారు సా.శ.పూ. 607లో బబులోను సైనికుల చేతుల్లో అకాలమరణం పొందారు.

15 దానికి భిన్నంగా, మోషే ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: ‘మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులలో పెట్టుకోండి. ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.’ (ద్వితీ. 32:​46, 47) నిజమే, మోషే మాటలు దైవప్రేరేపితమైనవి. అందుకే, అవి విలువైనవి, అవి ఆ జనాంగ సంక్షేమానికి ఎంతో అవసరం. వాటిని లక్ష్యపెట్టినవారు దీర్ఘాయుష్షును, సమృద్ధిని అనుభవించారు. మనం ఎల్లప్పుడూ వ్యర్థమైన మాటలను తిరస్కరించి విలువైన సత్యవాక్కులను అనుసరిద్దాం.

16 మనం, నేడు కూడా వ్యర్థమైన మాటలను వింటున్నామా? వింటున్నాం. ఉదాహరణకు, పరిణామ సిద్ధాంతాన్నిబట్టి, ఇతర రంగాల్లో జరిగిన వైజ్ఞానిక ఆవిష్కరణలనుబట్టి ఇక దేవుణ్ణి నమ్మాల్సిన అవసరంలేదని, సహజ ప్రక్రియల ద్వారా సృష్టి జరిగిందని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతారు. అహంకారపూరితమైన అలాంటి వ్యాఖ్యానాలను మనం పట్టించుకోవాలా? అవసరం లేదు! మానవ జ్ఞానానికీ దేవుని జ్ఞానానికీ వ్యత్యాసం ఉంది. (1 కొరిం. 2:​6, 7) అయితే, మానవులు బోధించే విషయాలు దేవుడు తెలియజేసిన విషయాలతో విభేదిస్తుంటే, అన్ని సందర్భాల్లో మానవులు బోధించే విషయాలే తప్పై ఉంటాయని మనకు తెలుసు. (రోమీయులకు 3:4 చదవండి.) కొన్ని రంగాల్లో విజ్ఞానశాస్త్ర పురోభివృద్ధి జరిగినా, “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే” అని మానవ జ్ఞానం గురించి బైబిలు చెప్పిన విషయం ఎల్లప్పుడూ సరైనదే. దేవుని అపారమైన జ్ఞానంతో పోలిస్తే మానవ యోచనలు వ్యర్థమైనవే.​—⁠1 కొరిం. 3:​18-20.

17 క్రైస్తవమతసామ్రాజ్య నాయకుల్లో వ్యర్థమైన మాటలకు సంబంధించిన మరొక ఉదాహరణను చూడవచ్చు. వారు దేవుని నామమునుబట్టి మాట్లాడుతున్నామని చెప్పుకుంటారు గానీ చాలావరకు వారు లేఖనాల ఆధారంగా మాట్లాడరు. వాస్తవానికి, వారి మాటలు వ్యర్థమైనవే. మతభ్రష్టులు కూడా వ్యర్థమైన మాటలే మాట్లాడతారు, దేవుడు నియమించిన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” కన్నా తమకే ఎక్కువ జ్ఞానం ఉందని చెప్పుకుంటారు. (మత్త. 24:​45-47) అయితే, మతభ్రష్టులు తమ సొంత జ్ఞానాన్ని బోధిస్తారు, వారి మాటలు వ్యర్థమైనవి, అవి వినేవారికి అభ్యంతరం కలిగిస్తాయి. (లూకా 17:​1, 2) వారివల్ల ఎలా మోసపోకుండా ఉండవచ్చు?

వ్యర్థమైన మాటలను ఎలా తిరస్కరించాలి?

18 ఈ విషయంలో వృద్ధ అపొస్తలుడైన యోహాను చక్కని ఉపదేశాన్నిచ్చాడు. (1 యోహాను 4:⁠1 చదవండి.) యోహాను ఉపదేశాన్ని అనుసరిస్తూ, మనం ప్రకటనా పనిలో కలుసుకొనేవారిని తమకు బోధించబడుతున్న విషయాలు బైబిలు ప్రకారం ఉన్నాయోలేవో పరిశీలించమని మనమెప్పుడూ ప్రోత్సహిస్తాం. ఆ సూత్రాన్ని మనం కూడా అనుసరించడం మంచిది. సత్యం గురించి చేయబడే విమర్శలు లేదా సంఘంమీద, పెద్దలమీద, మన సహోదరులమీద చేయబడే అబద్ధారోపణలు మన చెవినబడితే వాటిని పరిశీలించకుండా గుడ్డిగా నమ్మేయం. అయితే, మనమిలా ఆలోచించాలి: “ఈ కల్పనా కథను వ్యాప్తి చేస్తున్న వ్యక్తి బైబిలు చెబుతున్న దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడా? ఈ కథలు లేదా ఆరోపణలు యెహోవా సంకల్పం నెరవేరడానికి దోహదపడతాయా? అవి సంఘంలో శాంతి నెల​కొనేందుకు తోడ్పడతాయా?” మనం వినే ఏ విషయమైనా సహోదరులను ప్రోత్సహించే బదులు నిరుత్సాహపరిస్తే అది వ్యర్థమైనదే.​—⁠2 కొరిం. 13:​10, 11.

19 వ్యర్థమైన మాటల విషయంలో పెద్దలు కూడా ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. సలహా ఇవ్వమని ఎవరైనా వారిని కోరితే వారు తమ పరిమితులను గుర్తుంచుకొని కేవలం వ్యక్తిగత అనుభవం ఆధారంగా సలహా ఇవ్వడానికి సాహసించరు. వారెప్పుడూ బైబిలు చెబుతున్న దానిని పేర్కొనాలి. “లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదు” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటల్లో ఒక చక్కని సూత్రం ఉంది. (1 కొరిం. 4:⁠6) పెద్దలు బైబిల్లోలేని విషయాలను బోధించరు. అంతేకాక, వారు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని ప్రచురణల్లో ఉన్న బైబిలు ఆధారిత ఉపదేశానికి విరుద్ధమైనదేదీ బోధించరు.

20 వ్యర్థమైనవాటివల్ల ఎంతో హాని జరుగుతుంది. అవి ‘దేవతలైనా,’ మాటలైనా లేక మరింకేవైనా కావచ్చు. అందుకే, వాటిని గుర్తించేందుకు మనం ఎల్లప్పుడూ యెహోవా సహాయం కోసం ప్రార్థిస్తూ, వాటిని తిరస్కరించేందుకు ఆయన నిర్దేశాన్ని కోరతాం. మనం అలా చేస్తే, కీర్తనకర్తతో కలిసి ఇలా చెబుతున్నట్లౌతుంది: “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.” (కీర్త. 119:​37) తర్వాతి ఆర్టికల్‌లో, యెహోవా నిర్దేశాన్ని అనుసరించడం ఎంత ప్రాముఖ్యమో మనం మరింతగా తెలుసుకుంటాం.

మీరు వివరించగలరా?

సాధారణంగా, ఏ ‘వ్యర్థమైనవాటిని’ మనం తిరస్కరించాలి?

సిరి మనకు దేవతలా కాకుండా ఎలా చూసుకోవచ్చు?

శారీరక కోరికలు ఏ విధంగా విగ్రహారాధనతో సమానంకాగలవు?

వ్యర్థమైన మాటలను మనం ఎలా తిరస్కరించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనకున్న విలువైనవాటిలో కొన్ని ఏమిటి, వాటిని చక్కగా ఎలా ఉపయోగించవచ్చు?

2. వ్యర్థమైనవాటి గురించి బైబిలు ఏ హెచ్చరిక ఇస్తోంది, అక్షరార్థంగా ఈ హెచ్చరిక ఒక వ్యక్తికి ఎలా అన్వయిస్తోంది?

3. వ్యర్థమైనవాటి గురించి బైబిల్లో ఉన్న హెచ్చరిక మన ఆరాధనకు ఎలా అన్వయిస్తుంది?

4. సాధారణంగా, ఏవి వ్యర్థమైనవని చెప్పవచ్చు?

5. ఆదిమ హెబ్రీ భాషలో “వ్యర్థమైన” అనే పదం ఎక్కువగా వేటికి అన్వయించబడింది?

6. అబద్ధ దేవతలు ఎందుకు వ్యర్థమైనవి?

7, 8. “సిరి” దేవత ఎలా కాగలదు?

9, 10. (ఎ) ఒక క్రైస్తవుడు విద్యను ఎలా దృష్టిస్తాడు? (బి) ఉన్నతవిద్యను అభ్యసించడం ద్వారా ఎదురయ్యే ఒక ప్రమాదం ఏమిటి?

11, 12. కొందరు ‘తమ కడుపును తమ దేవునిగా’ లేక దేవతగా చేసుకున్నారని పౌలు ఎందుకు అన్నాడు?

13. (ఎ) దురాశ అంటే ఏమిటి, పౌలు దానిని ఎలా వివరించాడు? (బి) మనం దురాశకు లోనుకాకుండా ఎలా ఉండవచ్చు?

14, 15. (ఎ) యిర్మీయా దినాల్లో అనేకమందిని ఏ ‘వ్యర్థమైన మాట’ అభ్యంతరపెట్టింది? (బి) మోషే మాటలు ఎందుకు విలువైనవి?

16. దేవుని వాక్యంతో విభేదించే శాస్త్రజ్ఞుల వ్యాఖ్యానాలను మనమెలా దృష్టిస్తాం?

17. క్రైస్తవమతసామ్రాజ్య నాయకులు, మతభ్రష్టులు చెప్పే మాటలను ఎలా దృష్టించాలి?

18. మొదటి యోహాను 4:​1లో ఉన్న ఉపదేశాన్ని మనం ఏయే విధాలుగా అన్వయించుకోవచ్చు?

19. పెద్దలు తమ మాటలు వ్యర్థమైనవిగా ఉండకుండా ఎలా జాగ్రత్తపడతారు?

20. వ్యర్థమైనవాటిని తిరస్కరించేందుకు మనం ఏయే విధాలుగా సహాయం పొందుతున్నాం?

[3వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయులు ‘భూమిని సేద్యపరచుకోమని,’ వ్యర్థమైనవాటిని అనుసరించవద్దని ప్రోత్సహించబడ్డారు

[5వ పేజీలోని చిత్రం]

వస్తుసంపదలు యెహోవా సేవలో వెనకంజ వేయడానికి ఎన్నడూ కారణం కాకుండా చూసుకోండి

[6వ పేజీలోని చిత్రం]

పెద్దల మాటలు మనకెంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి