కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుని భయంతో పరిశుద్ధంగా’ ఉండేందుకు కృషిచేయండి

‘దేవుని భయంతో పరిశుద్ధంగా’ ఉండేందుకు కృషిచేయండి

‘దేవుని భయంతో పరిశుద్ధంగా’ ఉండేందుకు కృషిచేయండి

యెహోవా దేవుడు అత్యంత పరిశుద్ధుడని వర్ణిస్తూ, బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు.” (యెష. 6:⁠3; ప్రక. 4:⁠8) హెబ్రీ, గ్రీకు భాషల్లో “పరిశుద్ధత” అనే పదానికి, స్వచ్ఛత లేదా స్వచ్ఛమైన ఆరాధన, నిష్కళంకంగా ఉండడం అనే అర్థాలున్నాయి. దేవుని పరిశుద్ధత అంటే పరిపూర్ణ నైతికత అని అర్థం. ఆయన దీనిని చాలా ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తాడు.

పరిశుద్ధ దేవుడైన యెహోవా తన ఆరాధకులు కూడా శారీరకంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుద్ధలుగా ఉండాలని ఆశించడా? యెహోవా తన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడని బైబిలు స్పష్టంగా చెబుతోంది. 1 పేతురు 1:⁠14-16లో ఇలా ఉంది: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి.” అపరిపూర్ణ మానవులు యెహోవాలాగే పరిశుద్ధంగా ఉండగలరా? యెహోవా ఉన్నంత పరిశుద్ధంగా కాకపోయినా వారు పరిశుద్ధంగా ఉండగలరు. ఆధ్యాత్మిక విషయాల్లో స్వచ్ఛంగా ఉంటూ ఆయనను ఆరాధిస్తే, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుంటే దేవుడు మనలను పరిశుద్ధులుగా పరిగణిస్తాడు.

నైతిక అపవిత్రతో నిండివున్న ప్రజలమధ్య మనమెలా పరిశుద్ధంగా ఉండవచ్చు? మనం ఎలాంటి అలవాట్లను విడిచిపెట్టాలి? మాట్లాడే, ప్రవర్తించే తీరులో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి రావచ్చు? ఈ విషయాల గురించి, సా.శ.పూ. 537లో బబులోను నుండి తిరిగివచ్చిన యూదులకు దేవుడు చెప్పిన విషయాల నుండి మనమేమి నేర్చుకోవచ్చో చూద్దాం.

‘పరిశుద్ధ మార్గం ఏర్పడును’

తన ప్రజలు బబులోను చెరనుండి తమ స్వస్థలానికి తిరిగివస్తారని యెహోవా ప్రవచించాడు. పునస్థాపన గురించిన ప్రవచనంలో ఈ హామీ ఇవ్వబడింది: “అక్కడ దారిగా​నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును.” (యెష. 35:⁠8ఎ) ఈ మాటలు, యెహోవా యూదుల కోసం మార్గం సిద్ధంచేస్తాననేకాదు, ప్రయాణమంతటిలో వారిని కాపాడతాననే హామీ కూడా వారికిచ్చాడని చూపిస్తున్నాయి.

నేడు భూమిపైనున్న తన సేవకులను అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను నుండి బయటకు తీసుకు​వచ్చేందుకు యెహోవా ‘పరిశుద్ధ మార్గాన్ని’ ఏర్పరిచాడు. ఆయన 1919లో అభిషిక్త క్రైస్తవులను అబద్ధమతంలోని ఆధ్యాత్మిక బంధకాల నుండి విముక్తులను చేశాడు. అప్పటినుండి వారు క్రమంగా తమ ఆరాధన నుండి అబద్ధ బోధలన్నిటిని తొలగించుకుంటూ వచ్చారు. యెహోవా ఆరాధకులముగా మనం నేడు స్వచ్ఛమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో జీవిస్తున్నాం. అక్కడ మనం ఆయనను ఆరాధిస్తూ, ఆయనతో, తోటి సహోదరులతో మంచి సంబంధాన్ని కలిగివుండవచ్చు.

అభిషిక్త క్రైస్తవుల ‘చిన్న మందకు’ చెందిన సభ్యులు, ‘వేరే గొర్రెలకు’ చెందిన ‘గొప్ప సమూహము’ పరిశుద్ధ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. తమతోపాటు ఆ మార్గంలో నడమని ఇతరులను కూడా ఆహ్వానిస్తున్నారు. (లూకా 12:​32; ప్రక. 7:⁠9; యోహా. 10:​16) ఆ “పరిశుద్ధ మార్గము,” “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా [తమ] శరీరములను ఆయనకు [దేవునికి] సమర్పించు[కోవాలని]” కోరుకునేవారందరి కోసం తెరచివుంటుంది.​—⁠రోమా. 12:⁠1.

ఆ మార్గంలో ‘అపవిత్రులకు’ ప్రవేశం లేదు

సా.శ.పూ. 537లో తిరిగివస్తున్న యూదులు ఒక ప్రాముఖ్యమైన విషయంలో విధేయత చూపించాల్సి వచ్చింది. ‘పరిశుద్ధ మార్గములో’ నడిచేందుకు అర్హులైనవారి గురించి నూతనలోక అనువాదములోని యెషయా 35:⁠8బి వచనం ఇలా చెబుతోంది: ‘అది అపవిత్రులు పోకూడని మార్గము. అది ఆ మార్గమున పోవువారికే ఏర్పరచబడును, మూఢులు దానిలో నడువరు.’ యూదులు స్వచ్ఛారాధనను తిరిగి ప్రారంభించడానికే యెరూషలేముకు వస్తున్నారు కాబట్టి స్వార్థపూరితమైన ఉద్దేశాలున్న​వారికి, పవిత్రమైనవాటిపట్ల గౌరవం లేనివారికి లేదా అపవిత్రమైన పనులను చేసేవారికి ఆ మార్గంలో ప్రవేశం ఉండదు. తిరిగివస్తున్న యూదులు యెహోవాయొక్క ఉన్నత నైతిక ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలి. నేడు దేవుని అనుగ్రహం పొందాలనుకునేవారు కూడా అలాగే చేయాలి. వారు ‘దేవుని భయముతో పరిశుద్ధంగా’ ఉండేందుకు కృషిచేయాలి. (2 కొరిం. 7:⁠1) మరి మనం ఎలాంటి అపవిత్రమైన అలవాట్లను విడిచిపెట్టాలి?

“శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (గల. 5:​19) జారత్వమనేది వివాహేతర లైంగిక కృత్యాలన్నిటినీ సూచిస్తుంది. కాముకత్వము లేదా దుష్కామ ప్రవర్తన అంటే “నీతిబాహ్యత; నికృష్టత, పశు​ప్రవృత్తి, కామోద్రేకం” అని అర్థం. జారత్వం, దుష్కామ ప్రవర్తన ఈ రెండూ యెహోవా పరిశుద్ధతకు విరుద్ధమైనవనేది స్పష్టం. కాబట్టి అలాంటి కృత్యాలకు పాల్పడేవారు క్రైస్తవ సంఘ సభ్యులుగా చేర్చుకోబడరు లేదా సంఘం నుండి బహిష్కరించబడతారు. ఘోరమైన అపవిత్రతా కార్యాలు చేసేవారి విషయంలో అంటే “నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించే” వారి విషయంలో కూడా అలాంటి చర్యే తీసుకోబడుతుంది.​—⁠ఎఫె. 4:⁠19.

“అపవిత్రత” అనే పదం అనేక రకాలైన పాపాలకు వర్తిస్తుంది. గ్రీకు భాషలోని ఆ పదం ప్రవర్తన, మాటలు, అపవిత్రమైన మతాచారాలు, నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో అశుద్ధమైన దేనికైనా వర్తిస్తుంది. అలాగే న్యాయపరమైన చర్య తీసుకోవాల్సినంత అపవిత్రతా స్థాయిలోలేని క్రియలకు కూడా వర్తిస్తుంది. * అలాంటి అపవిత్రమైన పనులు చేసేవారు పరిశుద్ధంగా ఉండడానికి కృషి చేస్తున్నారని చెప్పవచ్చా?

ఒక క్రైస్తవుడు రహస్యంగా అశ్లీల చిత్రాలను చూడడం మొదలుపెట్టాడనుకోండి. అతనికి మెల్లమెల్లగా అపవిత్రమైన ఆలోచనలు రావడం మొదలవుతాయి, వాటివల్ల యెహోవా దృష్టిలో పరిశుద్ధంగా ఉండాలనే అతని తీర్మానం నీరుగారుతుంది. అతని ప్రవర్తన ఘోరమైన అపవిత్రతగా పరిగణించబడే స్థాయికి చేరుకోకపోయినా అతను ‘పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగల’ విషయాలను ధ్యానించడం లేదనేది మాత్రం స్పష్టం. (ఫిలి. 4:⁠8) అశ్లీల చిత్రాలను చూడడం అపవిత్రతే, అది దేవునితో ఒకరికున్న సంబంధాన్ని ఖచ్చితంగా పాడుచేస్తుంది. కాబట్టి, ఎలాంటి అపవిత్రమైనవాటి గురించైనా మనం అసలు మాట్లాడనేకూడదు.​—⁠ఎఫె. 5:⁠3.

మరో ఉదాహరణ పరిశీలించండి. ఒక క్రైస్తవుడు అశ్లీల చిత్రాలను చూస్తూనో లేదా చూడకుండానో లైంగికానందం కోసం తనను తానే ఉద్రేకపరచుకుంటూ హస్తప్రయోగం చేసుకుంటున్నాడు అనుకోండి. “హస్తప్రయోగం” అనే మాట బైబిల్లో ఎక్కడా కనిపించకపోయినా, అది మానసికంగా, భావోద్రేకంగా కళంకపరిచే అలవాటు అనడంలో సందేహమేమైనా ఉందా? ఇలా తనను కళంకపరచుకుంటూ ఉంటే యెహోవా దేవునితో ఆ వ్యక్తికున్న సంబంధం తెగిపోదా, అతడు దేవుని దృష్టిలో అపవిత్రునిగా మారడా? “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా” చేసుకోమని, “భూమిమీదనున్న [మన] అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, చంపివేయుడి” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనందరం గంభీరంగా తీసుకుందాం.​—⁠2 కొరిం. 7:⁠1; కొలొ. 3:⁠5.

సాతాను పరిపాలిస్తున్న ఈ లోకం అపవిత్రమైన ప్రవర్తనను చూస్తూ ఊరుకోవడమే కాదు దాన్ని ప్రోత్సహిస్తుంది కూడా. అపవిత్రమైన పనులు చేయాలనే కోరికను అణచుకోవడం ఒక సవాలుగా ఉండవచ్చు. నిజ క్రైస్తవులు ‘అన్యజనుల్లా’ ‘తమ మనస్సుకు కలిగిన వ్యర్థతననుసరించి’ నడవకూడదు. (ఎఫె. 4:​17, 18) రహస్యంగానైనా లేదా బాహాటంగానైనా మనం అపవిత్రంగా ప్రవర్తించకుండా ఉంటేనే యెహోవా మనల్ని ‘పరిశుద్ధ మార్గంలో’ నడవనిస్తాడు.

ఆ మార్గంలో ‘సింహముండదు’

పరిశుద్ధ దేవుడైన యెహోవా అనుగ్రహాన్ని పొందాలంటే, కొందరు తమ ప్రవర్తనలో, మాటల్లో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. యెషయా 35:⁠9 ఇలా చెబుతోంది: ‘అక్కడ’ అంటే పరిశుద్ధ మార్గంలో ‘సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు.’ క్రూరంగా ప్రవర్తించే, మాట్లాడే ప్రజలు క్రూరమైన జంతువులతో పోల్చబడ్డారు. నీతియుక్తమైన దేవుని నూతన లోకంలో అలాంటివారికి ఖచ్చితంగా చోటుండదు. (యెష. 11:⁠6; 65:​25) కాబట్టి దేవుని అనుగ్రహం పొందాలనుకునేవారు అలాంటి లక్షణాలను విడిచిపెట్టి, పరిశుద్ధంగా ఉండేందుకు కృషి చేయడం చాలా ప్రాముఖ్యం.

“సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి” అని లేఖనాలు మనల్ని ఉపదేశిస్తున్నాయి. (ఎఫె. 4:​31) కొలొస్సయులు 3:⁠8 ఇలా చెబుతోంది: “కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.” ఈ రెండు లేఖనాలలో “దూషణ” అనే పదం గాయపర్చే, కించపర్చే మాటలను లేదా దేవదూషణను సూచించడానికి ఉపయోగించబడింది.

నొప్పించేలా, అసభ్యంగా మాట్లాడడం నేడు చాలా మామూలు విషయమైపోయింది. ఆఖరికి ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు కోపంగా, అసభ్యంగా లేదా కించపరుస్తూ తిట్టుకోవడమో, పిల్లలను తిట్టడమో చేస్తుంటారు. కానీ క్రైస్తవ కుటుంబాలలో అలాంటి దూషణకు అస్సలు చోటుండకూడదు.​—⁠1 కొరిం. 5:​11.

‘దేవుని భయముతో పరిశుద్ధంగా’ ఉండేందుకు కృషి చేయడం ఆశీర్వాదకరం!

పరిశుద్ధ దేవుడైన యెహోవాను ఆరాధించడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా! (యెహో. 24:​19) యెహోవా మనలను తీసుకొచ్చి ఉంచిన ఆధ్యాత్మిక పరదైసు నిజంగా ప్రశస్తమైనది. యెహోవా దృష్టిలో పరిశుద్ధులుగా జీవిస్తూ ఉండడమే శ్రేష్ఠమైన జీవితం.

దేవుడు వాగ్దానం చేసిన భూపరదైసు త్వరలోనే వాస్తవరూపం దాలుస్తుంది. (యెష. 35:⁠1, 2, 5-7) దానికోసం పరితపించేవారు, దేవుని మార్గంలో నడుస్తూ ఉండేవారికి దానిలో ఉండే ఆశీర్వాదం లభిస్తుంది. (యెష. 65:​17, 21) కాబట్టి మనందరం ఆధ్యాత్మిక విషయాల్లో స్వచ్ఛంగా ఉంటూ ఆయనను ఆరాధిద్దాం, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుందాం.

[అధస్సూచి]

^ పేరా 12 ‘అపవిత్రతకు,’ ‘అత్యాశతో జరిగించే అపవిత్రతకు’ మధ్య వ్యత్యాసాన్ని గురించిన చర్చ కోసం కావలికోట, జూలై 15, 2006 చూడండి.

[26వ పేజీలోని చిత్రం]

‘పరిశుద్ధ మార్గంగుండా’ వెళ్ళాలంటే యూదులు ఎలావుండాలి?

[27వ పేజీలోని చిత్రం]

అశ్లీల చిత్రాలను చూసేవారు యెహోవాతో తమకున్న సంబంధాన్ని పాడుచేసుకుంటారు

[28వ పేజీలోని చిత్రం]

‘సమస్తమైన అల్లరిని దూషణను మీరు విసర్జించండి’