కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం ద్వారా విడుదల సమీపించింది!

దేవుని రాజ్యం ద్వారా విడుదల సమీపించింది!

దేవుని రాజ్యం ద్వారా విడుదల సమీపించింది!

“నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”​—⁠మత్త. 6:​9, 10.

యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో ఒక మాదిరి ప్రార్థనను కూడా చెప్పాడు. ఆ ప్రార్థనలో ఆయన ప్రధాన బోధనాంశం క్లుప్తంగా వివరించబడింది. దేవునికి ఇలా ప్రార్థించాలని ఆయన తన అనుచరులతో చెప్పాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెర​వేరును గాక.” (మత్త. 6:​9-13) యేసు “దేవుని రాజ్య​సువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము” చేశాడు. (లూకా 8:⁠1) దేవుని “రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని క్రీస్తు తన అనుచరులను ప్రోత్సహించాడు. (మత్త. 6:​33) మీరు ఈ ఆర్టికల్‌ను అధ్యయనం చేస్తుండగా, మీ పరిచర్యలో ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, మీరు ఈ ప్రశ్నలకు ఎలా జవాబివ్వవచ్చో ఆలోచించండి: రాజ్య సందేశం ఎంత ప్రాముఖ్యమైనది? మానవజాతికి దేనినుండి విడుదల అవసరం? దేవుని రాజ్యం మనకెలా విడుదల తీసుకొస్తుంది?

2 “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసు ప్రవచించాడు. (మత్త. 24:​14) దేవుని రాజ్య సువార్త అత్యంత ప్రాముఖ్యమైనది. నిజానికది ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సందేశం. ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగావున్న యెహోవాసాక్షుల సంఘాల్లో దాదాపు 70 లక్షల మంది దేవుని సేవకులు రాజ్యం స్థాపించబడిందని అసాధారణ స్థాయిలో ఇతరులకు ప్రకటిస్తున్నారు. అది స్థాపించబడింద​నేది ఒక సువార్త ఎందుకంటే దేవుడు ఈ భూవ్యవహారాలన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకునేందుకే పర​లోకంలో ఆ రాజ్యాన్ని అంటే ప్రభుత్వాన్ని స్థాపించాడు. ఆ రాజ్య పరిపాలనలో, పరలోకంలో జరుగుతున్నట్లుగానే ఈ భూమిపై కూడా యెహోవా చిత్తం నెరవేరుతుంది.

3 దేవుని చిత్తం ఈ భూమిపై నెరవేరినప్పుడు మానవులు ఎలా ప్రయోజనం పొందుతారు? యెహోవా “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రక. 21:⁠4) సంక్రమించిన పాపం, అపరిపూర్ణతలవల్ల ప్రజలు అనారోగ్యం పాలవరు, చనిపోరు. దేవుడు జ్ఞాపకం ఉంచుకున్న మృతులకు నిరంతరం జీవించే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది” అని బైబిలు వాగ్దానం చేస్తోంది. (అపొ. 24:​14, 15) యుద్ధాలు, వ్యాధులు, ఆకలి ఇక ఉండవు. భూమి పరదైసుగా మారుతుంది. అప్పుడు క్రూరమైన జంతువులు కూడా మనకు, ఇతర జంతువులకు ఏ హానీ చేయవు.​—⁠కీర్త. 46:⁠9; 72:​16; యెష. 11:​6-9; 33:​24; లూకా 23:​43.

4 రాజ్య పరిపాలన ద్వారా అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు లభిస్తాయి కాబట్టే, పరదైసులోని జీవితాన్ని బైబిలు ప్రవచనం ఇలాంటి ఆహ్లాదకరమైన మాటలతో వర్ణిస్తోంది: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” మరి హాని తలపెట్టేవారికి ఏమౌతుంది? లేఖనాలు ఇలా ప్రవచిస్తున్నాయి: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు.” అయితే, “యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.”​—⁠కీర్త. 37:​9-11.

5 అదంతా జరగాలంటే ప్రస్తుత లోకవిధానంలో ఘర్షణపడే ప్రభుత్వాలు, మతాలు, వాణిజ్య వ్యవస్థలు తీసివేయబడాలి. సరిగ్గా ఆ పనినే పరలోక ప్రభుత్వం చేస్తుంది. దానియేలు ప్రవక్త దైవ ప్రేరణతో ఇలా ప్రవచించాడు: “[ఇప్పుడున్న] రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకములో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందిన​వారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దాని. 2:​44) పరలోకంలో కొత్తగా స్థాపించబడే దేవుని రాజ్యం భూమ్మీదున్న కొత్త మానవ సమాజాన్ని పరిపాలిస్తుంది. ఆ ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో’ “నీతి నివసించును.”​—⁠2 పేతు. 3:​13.

నేడు మానవులకు విడుదల మరింత అవసరం

6 సాతాను, ఆదాము హవ్వలు తామే తప్పొప్పులను నిర్ణయించుకోవాలనే కోరికతో దేవునికి వ్యతి​రేకంగా తిరుగుబాటు చేసినప్పుడు మానవజాతి పతనం మొదలయ్యింది. వారు పాపం చేసిన 1,600 సంవత్సరాల తర్వాత దేవుడు భూమిపైన జలప్రళయం తీసుకొచ్చాడు. ఆ సమయానికి ‘నరుల చెడుతనము భూమిమీద గొప్పగా, వారి హృదయ తలంపులలోని ఊహ అంతా కేవలం చెడుగా’ మారిపోయాయి. (ఆది. 6:⁠5) జల​ప్రళయం ముగిసి 1,300 సంవత్సరాల తర్వాత సొలొమోను కాలంనాటికి పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయంటే ఆయన ఇలా రాశాడు: “యింకను బ్రదుకుచున్నవారికంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని. ఇంకను పుట్టనివారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయుల​కంటెను వారే ధన్యులనుకొంటిని.” (ప్రసం. 4:​2, 3) సొలొమోను కాలం నుండి దాదాపు 3,000 సంవత్సరాలు లెక్కిస్తే మన కాలానికి చేరుకుంటాం. నేడు చెడుతనం ఇంకా పెచ్చరిల్లుతోంది.

7 ఇప్పటికి ఎంతోకాలంగా ఈ లోకంలో చెడు ఉన్నది. అందుకే ముందెన్నటికన్నా నేడు దేవుని రాజ్యం మానవులకు విడుదల తీసుకురావడం ఎంతో అవసరం. గత వంద సంవత్సరాల్లో లోక పరిస్థితులు ఘోరంగా ఉండడమే కాక, రానురాను అవి మరింత దిగజారిపోతున్నాయి. ఉదాహరణకు, వరల్డ్‌వాచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇలా నివేదిస్తోంది: “మొదటి శతాబ్దం నుండి 1899 వరకు జరిగిన యుద్ధాలన్నిటిలో మరణించిన వారికన్నా [20వ] శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లో మూడువంతులు ఎక్కువమంది మరణించారు.” ఇక 1914 నుండైతే దాదాపు 10 కోట్ల మంది యుద్ధాల్లో చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని ఒక సర్వసంగ్రహ నిఘంటువు అంచనా వేసింది. ఇప్పుడు కొన్ని దేశాల దగ్గర అణ్వాయుధాలు కూడా ఉన్నాయి కాబట్టి, ప్రపంచ జనాభాలో ఎక్కువమందిని ఒకే దెబ్బతో హతమార్చగల సామర్థ్యం మానవులకుంది. విజ్ఞానపరంగా, వైద్యపరంగా ఎంత అభివృద్ధి సాధించినా, ప్రతీ సంవత్సరం ఆకలి, రోగాలవల్ల కనీసం 50 లక్షలమంది పిల్లలు చనిపోతూనే ఉన్నారు.​—⁠బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 9వ అధ్యాయాన్ని చూడండి.

8 పెరుగుతున్న చెడును మానవులు ఆపలేక​పోతున్నారు. ఈ లోక రాజకీయ, వాణిజ్య, మతపరమైన సంస్థలు మానవుడు ఆశించే శాంతి, సుభిక్షిత, ఆరోగ్యం వంటి కనీస అవసరాలను ఏనాడూ తీర్చలేదు. ఇప్పుడు మానవులను పట్టిపీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించే బదులు, ఆ సంస్థలు మరిన్ని సమస్యల్ని సృష్టిస్తున్నాయి. వేల సంవత్సరాల మానవ పరిపాలన ఈ మాటలు నిజమని నిరూపిస్తోంది: ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరుల​వశములో లేదు. మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’ (యిర్మీ. 10:​23) అవును “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని” తెచ్చుకుంటున్నాడు. (ప్రసం. 8:⁠9) అంతేకాదు ‘సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది.’​—⁠రోమా. 8:​22.

9 బైబిలు మన కాలాల గురించి ప్రవచిస్తూ, “అంత్య​దినములలో అపాయకరమైన కాలములు వచ్చును” అని చెప్పింది. మానవ పరిపాలనలో అంత్యదినాల్లోని పరి​స్థితులు ఎలా ఉంటాయో వివరించిన తర్వాత, అదే ప్రవచనం, ‘దుర్జనులును వంచకులును అంతకంతకు చెడి​పోవుదురు’ అని కూడా చెబుతోంది. (2 తిమోతి 3:​1-5, 13 చదవండి.) “లోకమంతయు దుష్టుని యందున్నది” కాబట్టి, పరిస్థితులు ఇలాగే ఉంటాయని క్రైస్తవులకు తెలుసు. (1 యోహా. 5:​19) అయితే, సువార్తేమిటంటే, దేవుడు త్వరలోనే తనను ప్రేమించేవారిని విడిపిస్తాడు. వారు నానాటికీ దిగజారిపోతున్న ఈ లోకం నుండి విడిపించ​బడతారు.

ఎవరు మాత్రమే విడిపించగలరు?

10 మీరు సువార్త ప్రకటిస్తుండగా, యెహోవా మాత్రమే మనలను విడిపించగలడని వివరించండి. తన సేవకుల్ని ఎలాంటి చెడు పరిస్థితుల్లోనుండైనా విడిపించాలనే కోరిక, విడిపించే శక్తి ఆయనకే ఉన్నాయి. (అపొ. 4:​24, 31; ప్రక. 4:​10, 11) యెహోవా ఎల్లప్పుడూ తన ప్రజల్ని విడిపించి తన ఉద్దేశాల్ని నెరవేరుస్తాడని మనం నమ్మవచ్చు ఎందుకంటే ఆయనే ఇలా వాగ్దానం చేశాడు: “నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును.” ఆయన చెప్పినది ‘నిష్ఫలముగా [ఆయన] యొద్దకు మరలదు.’​—⁠యెష. 14:​24, 25; యెష. 55:​10, 11 చదవండి.

11 దుష్టులపై తాను తీర్పు తీర్చినప్పుడు తన సేవకుల్ని విడిపిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. ఘోరమైన పాపాలు చేసిన వారితో ధైర్యంగా మాట్లాడడానికి యిర్మీయా ప్రవక్తను పంపించినప్పుడు దేవుడు ఆయనతో ఇలా అన్నాడు: “వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను.” (యిర్మీ. 1:⁠8) అలాగే దుష్టులున్న సొదొమ గొమొఱ్ఱాలను యెహోవా నాశనం చేయబోయే ముందు లోతు, ఆయన కుటుంబాన్ని ఆ ప్రాంతాలనుండి సురక్షితంగా బయటకు తీసుకువెళ్లేందుకు ఇద్దరు దేవదూతలను పంపాడు. ఆ తర్వాత, ‘యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను గంధ​కమును అగ్నిని ఆకాశమునుండి కురిపించాడు.’​—⁠ఆది. 19:​15, 24, 25.

12 తన చిత్తాన్ని చేసేవారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా యెహోవా వారిని రక్షించగలడు. పూర్వం దుష్ట​లోకాన్ని జలప్రళయం ద్వారా నాశనం చేసినప్పుడు ఆయన “నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.” (2 పేతు. 2:⁠5) ప్రస్తుత దుష్టలోకాన్ని నాశనం చేసినప్పుడు కూడా యెహోవా నీతిమంతుల్ని రక్షిస్తాడు. అందుకే ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” (జెఫ. 2:⁠3) అలా లోకవ్యాప్తంగా వినాశనం జరిగినప్పుడు “యథార్థవంతులు దేశమందు నివసించుదురు . . . భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.”​—⁠సామె. 2:​21, 22.

13 కానీ ఇప్పటికే దేవుని సేవకులెందరో అనారోగ్యంవల్ల, హింసలవల్ల, ఇతర కారణాలవల్ల మరణించారు. (మత్త. 24:⁠9) మరి అలాంటి వారందరూ ఎలా విడిపించబడతారు? మనం ముందే చూసినట్లుగా, ‘నీతిమంతులకు పునరుత్థానము కలుగబోవుచున్నది.’ (అపొ. 24:​14, 15) యెహోవా తన సేవకుల్ని విడిపించడాన్ని ఏదీ అడ్డగించలేదని తెలుసుకోవడం నిజంగా ఎంత ఓదార్పుకరం!

నీతియుక్తమైన ప్రభుత్వం

14 యెహోవా స్థాపించే పరలోక రాజ్యం ఒక నీతియుక్త మైన ప్రభుత్వమని మీరు మీ పరిచర్యలో వివరించవచ్చు. అది నీతియుక్త మైనది ఎందుకంటే ఆ రాజ్య పరిపాలనలో న్యాయం, నీతి, ప్రేమవంటి దేవుని అద్భుత లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. (ద్వితీ. 32:⁠4; 1 యోహా. 4:​8) భూమిని పరిపాలించడానికి అవసరమైన అన్ని అర్హతలూవున్న యేసుక్రీస్తుకు దేవుడు ఆ రాజ్యాన్ని అప్పగించాడు. అంతేకాదు, 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులు ఈ భూమ్మీద నుండి పరలోక జీవానికి పునరుత్థానం చేయబడి ఈ భూమిని పరిపాలించడంలో క్రీస్తుకు తోటివారసులుగా ఉండాలని కూడా యెహోవా సంకల్పించాడు.​—⁠ప్రక. 14:​1-5.

15 యేసూ, 1,44,000 మందీ చేసే పరిపాలనకు, అపరిపూర్ణ మానవుల పరిపాలనకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఈ విధానపు పరిపాలకులు తరచూ క్రూరంగా ప్రవర్తిస్తూ తమ ప్రజల్ని యుద్ధాలు చేయడానికి ఉసిగొల్పారు, ఫలితంగా లక్షలాదిమంది తమ ప్రాణాలు కోల్పోయారు. మానవుల వల్ల “రక్షణ కలుగదు” కాబట్టే, లేఖనాలు మానవులను నమ్ముకోవద్దని మనల్ని ఉప​దేశిస్తున్నాయి. (కీర్త. 146:⁠3) అయితే, దానికి భిన్నంగా క్రీస్తు ప్రేమతో పరిపాలిస్తాడు. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక​గాను ఉన్నవి” అని యేసు చెప్పాడు.​—⁠మత్త. 11:​28-30.

అంత్యదినాలు త్వరలోనే ముగుస్తాయి!

16 ఈ లోకం 1914వ సంవత్సరం నుండి అంత్య​దినాల్లో అంటే “యుగసమాప్తి” కాలంలో ఉంది. (మత్త. 24:⁠3) త్వరలోనే యేసు పేర్కొన్న మహా “శ్రమ” సంభవిస్తుంది. (మత్తయి 24:​20, 21 చదవండి.) ఆ మహా​శ్రమలో సాతాను లోకమంతా సమూలంగా నాశనం అవుతుంది. అయితే ఆ మహాశ్రమ ఎలా ఆరంభమౌతుంది? అదెలా ముగుస్తుంది?

17 మహాశ్రమ హఠాత్తుగా ఆరంభమౌతుంది. అవును “లోకులు​—⁠నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా” యెహోవా “దినము” అకస్మాత్తుగా విరుచుకుపడుతుంది. (1 థెస్సలొనీకయులు 5:​2, 3 చదవండి.) దేశాలు లోకంలోని పెద్ద సమస్యల్లో కొన్నింటిని పరిష్కరించే స్థాయికి చేరుకున్నామని అనుకున్నప్పుడే ప్రవచించబడిన ఆ శ్రమ ఆరంభమౌతుంది. ప్రపంచ అబద్ధ సామ్రాజ్యమైన “మహా బబులోను” హఠాత్తుగా నాశనం చేయబడడంతో లోకమంతా ఆశ్చర్యపోతుంది. మహా బబులోనుపై తీర్పు తీర్చ​బడినప్పుడు రాజులు, ఇతరులు నివ్వెరపోతారు.​—⁠ప్రక. 17:​1-6, 18; 18:​9, 10, 15, 16, 19.

18 కీలకమైన గడియలో “సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును” కనబడతాయి, “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును.” అప్పుడు మనం ‘ధైర్యము తెచ్చుకొని తలలెత్తుకోవాలి’ ఎందుకంటే మన ‘విడుదల సమీపంగావుంది.’ (లూకా 21:​25-28; మత్త. 24:​29, 30) సాతాను లేదా గోగు తన సైన్యాన్ని దేవుని ప్రజల​పైకి నడిపిస్తాడు. కానీ తన నమ్మకమైన సేవకులపై దాడిచేసేవారి గురించి యెహోవా ఇలా అంటున్నాడు: ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు.’ (జెక. 2:⁠8) కాబట్టి నాశనం చేయాలనే ఉద్దేశంతో సాతాను వారిపై చేసే దాడి సఫలం కాదు. ఎందుకు? ఎందుకంటే సర్వాధిపతియైన యెహోవా సరైన సమయంలో స్పందించి తన సేవకుల్ని రక్షిస్తాడు.​—⁠యెహె. 38:​9, 18.

19 దేవుడు జనాంగాలపై తీర్పు తీర్చినప్పుడు వారు ‘ఆయన యెహోవా అని తెలుసుకుంటారు.’ (యెహె. 36:​23) ఆయన తన తీర్పులను అమలుచేసే సైన్యాన్ని అంటే క్రీస్తుయేసు ఆధ్వర్యంలో కోట్లాదిమంది దేవ​దూతల్ని భూమ్మీదున్న సాతాను విధానాన్ని నాశనం చేయడానికి పంపిస్తాడు. (ప్రక. 19:​11-19) ఒక సందర్భంలో ఒకే ఒక్క దేవదూత దేవుని శత్రువుల్లో “లక్ష యెనుబది యయిదు వేలమందిని” ఒకే రాత్రి హతమార్చ​గలిగాడనే విషయాన్ని గుర్తుచేసుకుంటే, హార్‌​మెగిద్దోనుతో మహాశ్రమలు ముగిసేలోపే పరలోక సైన్యం భూమ్మీదున్న సాతాను విధానాన్ని సులభంగా నామరూపాల్లేకుండా చేస్తుందనే నమ్మకంతో ఉండవచ్చు. (2 రాజు. 19:​35; ప్రక. 16:​14-16) సాతాను, అతని దయ్యాలు వెయ్యేళ్ళపాటు అగాధములో పడవేయబడతారు. చివరకు వారు నాశనం చేయబడతారు.​—⁠ప్రక. 20:​1-3.

20 అలా భూమిపై దుష్టత్వం లేకుండా తీసివేయబడుతుంది. నీతిమంతులైన మానవులే భూమిపై నిరంతరం జీవిస్తారు. యెహోవా అలా తానొక గొప్ప విమోచకునిగా నిరూపించుకుంటాడు. (కీర్త. 145:​20) రాజ్యం ద్వారా ఆయన తన సర్వాధిపత్యం సరైనదని నిరూపించుకుని, తన పరిశుద్ధ నామాన్ని నిష్కళంకం చేసుకుని, భూమి విషయంలో తన గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తాడు. మీరు సువార్తను ప్రకటిస్తూ, దేవుని రాజ్యం తెచ్చే విడుదల సమీపించింది అని గ్రహించేలా “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారికి సహాయం చేస్తూ మీ పరిచర్యలో గొప్ప ఆనందం పొందుదురు గాక.​—⁠అపొ. 13:​48.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యేసు రాజ్య ప్రాముఖ్యతను ఎలా నొక్కిచెప్పాడు?

• మానవులకు ముందెప్పటికన్నా ఇప్పుడు విడుదల ఎందుకంత అవసరం?

• మహాశ్రమ కాలంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయని మనకు తెలుసు?

• యెహోవా తానొక గొప్ప విమోచకుణ్ణని ఎలా నిరూపించుకుంటాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు ప్రధాన బోధనాంశం ఏమిటి?

2. రాజ్య సందేశం ఎంత ప్రాముఖ్యమైనది?

3, 4. ఈ భూమిపై దేవుని చిత్తం నెరవేరినప్పుడు ఏమి జరుగుతుంది?

5. ప్రస్తుత లోకవిధానానికి ఏమి జరుగుతుంది?

6. ఈ దుష్టలోకంలోని చెడుతనాన్ని బైబిలు ఎలా వర్ణిస్తోంది?

7. దేవుడు మానవుల్ని విడుదల చేయడం ముందెప్పటికన్నా ఇప్పుడు ఎందుకంత అవసరం?

8. వేల సంవత్సరాల మానవ పరిపాలన ఏమి నిరూపించింది?

9. ఈ ‘అంత్యదినాల్లో’ పరిస్థితులు ఎలా ఉంటాయని క్రైస్తవులకు తెలుసు?

10. ఎందుకు యెహోవా మాత్రమే మనల్ని విడిపించగలడు?

11, 12. దేవుడు తన సేవకులకు ఏమని వాగ్దానం చేశాడు?

13. యెహోవా సేవకుల్లో చనిపోయినవారు ఎలా విడిపించబడతారు?

14. దేవుని రాజ్యం నీతియుక్తమైన రాజ్యమని మనం ఎందుకు నమ్ముతాం?

15. దేవుని రాజ్య పరిపాలనకు, మానవ పరిపాలనకు మధ్య ఉన్న తేడాను వివరించండి.

16. అంత్యదినాలు ఎప్పుడు ముగుస్తాయి?

17. మహాశ్రమ ఆరంభాన్ని గురించి బైబిలు ఏమి చెబుతోంది?

18. సాతాను తన ప్రజలపై దాడిచేసినప్పుడు యెహోవా ఎలా స్పందిస్తాడు?

19. దేవుని తీర్పును అమలుచేసే సైన్యాలు సాతాను విధానాన్ని నాశనం చేస్తాయని మనం ఎందుకు నమ్మవచ్చు?

20. రాజ్యం ద్వారా యెహోవా ఏమి నెరవేరుస్తాడు?

[12, 13వ పేజీలోని చిత్రాలు]

మన కాలంలో ముందెన్నడూ జరగనంతగా లోకవ్యాప్త ప్రకటనాపని జరుగుతుందని దేవుని వాక్యం ప్రవచించింది

[15వ పేజీలోని చిత్రం]

యెహోవా నోవహును ఆయన కుటుంబాన్ని రక్షించినట్లే మనలనూ రక్షించగలడు

[16వ పేజీలోని చిత్రం]

యెహోవా, ప్రజల “కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు”