పరిపాలక సభ ఎలా వ్యవస్థీకరించబడింది?
పరిపాలక సభ ఎలా వ్యవస్థీకరించబడింది?
యెహోవాసాక్షుల పరిపాలక సభలో, దేవునికి సమర్పించుకున్న పురుషుల్లోని అభిషిక్తులు సేవచేస్తున్నారు. వారు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే, రాజ్య ప్రకటనా పనిని పర్యవేక్షిస్తూ దానిని కొనసాగించే బాధ్యతను కలిగివున్న నమ్మకమైన బుద్ధిమంతుడునైన దాసునికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.—మత్త. 24:14, 45-47.
ప్రతీవారం నిర్వహించబడే పరిపాలక సభ కూటాలు సాధారణంగా బుధవారాలు జరుగుతాయి. ఈ కూటాలు పరిపాలక సభలోని సహోదరులు ఐక్యంగా సేవచేసేందుకు దోహదపడతాయి. (కీర్త. 133:1) పరిపాలక సభలోని సభ్యులు వివిధ కమిటీల్లో కూడా పనిచేస్తారు. ప్రతీ కమిటీ, యెహోవాసాక్షుల రాజ్య ప్రచార పనికి సంబంధించిన కొన్ని పనులను పర్యవేక్షిస్తుంది. అవేమిటో క్రింద పేర్కొనబడ్డాయి.
◼ కో-ఆర్డినేటర్స్ కమిటీ: ఈ కమిటీలో పరిపాలక సభ సభ్యుడైన ఒక సమన్వయకర్త, పరిపాలక సభలోని ఇతర కమీటీల సమన్వయకర్తలు ఉంటారు. ఇది కమిటీలన్నీ చక్కగా, సాఫీగా నడిచేలా చూస్తుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, వ్యతిరేకత ఎదురైనప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు లేదా యెహోవాసాక్షులకు సంబంధించిన ఇతర అత్యవసర పనులు చేయాల్సివచ్చినప్పుడు ఈ కమిటీ తగిన చర్యలు తీసుకుంటుంది.
◼ పర్సోనెల్ కమిటీ: ఈ కమిటీలోని సహోదరులు, భూవ్యాప్తంగావున్న బెతెల్ సభ్యుల వ్యక్తిగత, ఆధ్యాత్మిక సంక్షేమం కోసం చేయబడే ఏర్పాట్లను, వారికి మద్దతునివ్వడానికి చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ కమీటీ బెతెల్ సేవ కోసం కొత్త సభ్యులను ఎన్నుకొని, వారిని ఆహ్వానించడం, వారి బెతెల్ సేవకు సంబంధించిన సందేహాలను తీర్చడం వంటి పనులు చేస్తుంది.
◼ పబ్లిషింగ్ కమిటీ: ఈ కమిటీ ప్రపంచవ్యాప్తంగా జరిగే బైబిలు సాహిత్యాల ప్రచురణ, ముద్రణ, రవాణా పనులను పర్యవేక్షిస్తుంది. ఇంకా అది యెహోవాసాక్షుల వివిధ కార్పొరేషన్‌లు ఉపయోగిస్తున్న సొంత ముద్రణాలయాలను, ఆస్తులను కూడా పర్యవేక్షిస్తుంది. అంతేకాక ప్రపంచవ్యాప్త పనికోసం ఇవ్వబడిన విరాళాలు సరైన విధంగా ఉపయోగించబడేలా చూస్తుంది.
◼ సర్వీస్ కమిటీ: ఈ కమిటీలో ఉన్నవారు ప్రకటనా పనిని, సంఘానికి, పయినీర్లకు, పెద్దలకు, ప్రయాణ పైవిచారణకర్తలకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తారు. ఈ కమిటీ మన రాజ్య పరిచర్యను తయారుచేయడాన్ని పర్యవేక్షించడంతోపాటు, గిలియడ్ పాఠశాలకు, పరిచర్య శిక్షణా పాఠశాలకు విద్యార్థులను ఆహ్వానించి, వారు పట్టభద్రులైన తర్వాత వారిని వివిధ ప్రాంతాలకు నియమిస్తుంది.
◼ టీచింగ్ కమిటీ: ఈ కమిటీ అసెంబ్లీలలో, జిల్లా సమావేశాల్లో, సంఘ కూటాల్లో ఏ సమాచారం అందించబడాలో నిర్ణయిస్తుంది. ఇది బెతెల్ కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తుంది. ఇంకా అది వివిధ పాఠశాలలను అంటే గిలియడ్ పాఠశాలను, పయినీరు సేవా పాఠశాలను పర్యవేక్షిస్తుంది. దానితోపాటు ఆడియో, వీడియోల తయారీ పనులను కూడా చూసుకుంటుంది.
◼ రైటింగ్ కమిటీ: ప్రచురణ కోసం ఆధ్యాత్మిక సమాచారాన్ని రాయడం, వాటిని తోటి సహోదరులకు, బయటి ప్రజలకు అందేలా చూడడం వంటి పనులను పర్యవేక్షించే బాధ్యత ఈ కమిటీది. ఇంకా ఇది బైబిలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతోపాటు, నాటక మూలప్రతుల, ప్రసంగాల సంక్షిప్త ప్రతుల వంటివాటి కోసం సమాచారాన్ని ఆమోదిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనువాద పనిని కూడా ఇది పర్యవేక్షిస్తుంది.
అపొస్తలుడైన పౌలు అభిషిక్తుల సంఘాన్ని ఒక మానవ శరీరంతో పోలుస్తూ, దేవుడు అప్పగించిన పనిని చేయడంలో అందరూ పోషించే ప్రాముఖ్యమైన పాత్రను, వారు ఒకరిపై మరొకరు ఆధారపడడాన్ని, వారు చూపే ప్రేమను, పరస్పర సహకారాన్ని గురించి నొక్కిచెప్పాడు. (రోమా. 12:4, 5; 1 కొరిం. 12:12-31) శిరస్సైన యేసుక్రీస్తు అభిషిక్త సంఘ సభ్యుల మధ్య మంచి సహకారం, సమన్వయం కోసం, వారి ఆధ్యాత్మిక పోషణ కోసం అవసరమైనవాటిని అందజేస్తున్నాడు. (ఎఫె. 4:15, 16; కొలొ. 2:18, 19) యెహోవా వారిని పరిశుద్ధాత్మద్వారా నిర్దేశిస్తుండగా పరిపాలక సభ సారథ్యం వహించడానికి అలా వివిధ కమిటీలుగా వ్యవస్థీకరించబడింది.