కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పౌలును ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులుగా ఎదగండి

పౌలును ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులుగా ఎదగండి

పౌలును ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులుగా ఎదగండి

“మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.”​—⁠2 తిమో. 4:⁠7.

ఆయన తెలివి, పట్టుదలగల వ్యక్తి. కానీ ఆయన ‘తన శరీరాశలను అనుసరించి ప్రవర్తించాడు.’ (ఎఫె. 2:⁠3) ఆ తర్వాత ఆయన తనను తాను ‘దూషకుడనని, హింసకుడనని, హానికరుడనని’ వర్ణించుకున్నాడు. (1 తిమో. 1:​12) ఆయనే తార్సువాడైన సౌలు.

2 అనతికాలంలో సౌలు, తన జీవితంలో చాలా మార్పులు చేసుకున్నాడు. ఆయన తన మునుపటి ప్రవర్తనను మార్చుకుని ‘స్వప్రయోజనం కొరకు కాక అనేకుల ప్రయోజనార్థం’ తీవ్రంగా శ్రమించాడు. (1 కొరిం. 10:​33) అంతకుముందు తన ద్వేషాగ్నికి గురైన క్రైస్తవ సహోదరుల విషయంలో మృదుస్వభావిగా మారి వారిని హృదయ​పూర్వకంగా ప్రేమించాడు. (1 థెస్సలొనీకయులు 2:​7, 8 చదవండి.) ‘నేను పరిచారకుడనైతిని’ అని అంటూనే, ‘శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను’ అని అన్నాడు.​—⁠ఎఫె. 3:​7, 8.

3 పౌలు అని కూడా పిలవబడిన ఆ సౌలు క్రైస్తవునిగా ఎంతో పరిణతి సాధించాడు. (అపొ. 13:⁠9) మనం క్రైస్తవులుగా ఎదిగేందుకు పౌలు రాసిన ఉత్తరాలను, ఆయన పరిచర్య విశేషాలను శ్రద్ధగా చదివి ఆదర్శవంతమైన ఆయన విశ్వాసాన్ని అనుకరించడం ఓ చక్కని మార్గం. (1 కొరింథీయులు 11:⁠1; హెబ్రీయులు 13:⁠7 చదవండి.) అలా చేయడం, మనం అధ్యయనానికి సమయం కేటాయించేలా, ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించేలా, మన గురించి మనం సరైన అభిప్రాయంతో ఉండేలా ఎలా ప్రోత్సహిస్తుందో చూద్దాం.

పౌలు అధ్యయన అలవాట్లు

4 ‘గమలియేలు దగ్గర పెరిగి పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠలో శిక్షణపొందిన’ పరిసయ్యుడైన పౌలుకు అప్పటికే కొంత లేఖన పరిజ్ఞానముంది. (అపొ. 22:​1-3; ఫిలి. 3:​4-6) బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆయన ధ్యానించడానికి అనువైన “అరేబియా దేశములోని” సిరియా ఎడారి ప్రాంతానికో లేదా అరేబియా ద్వీపకల్పంలోని ప్రశాంతమైన ప్రాంతానికో వెళ్ళివుంటాడు. (గల. 1:​17) యేసే మెస్సీయ అని నిరూపించే లేఖనాలను ధ్యానించడానికి, అలాగే తన ముందున్న పనికి సిద్ధపడడానికి పౌలు బహుశా అలా వెళ్ళివుంటాడు. (అపొస్తలుల కార్యములు 9:​15, 16, 20, 22 చదవండి.) ఆధ్యాత్మిక విషయాలను ధ్యానించడానికి పౌలు సమయం తీసుకున్నాడు.

5 వ్యక్తిగత అధ్యయనం ద్వారా పౌలు లేఖనాల నుండి పొందిన జ్ఞానంతో, పరిజ్ఞానంతో ఆయన సత్యాన్ని సమర్థవంతంగా ప్రకటించగలిగాడు. ఉదాహరణకు, పిసిదియలో ఉన్న అంతియొకయలోని సమాజమందిరంలో పౌలు, యేసే మెస్సీయ అని నిరూపించడానికి హెబ్రీ లేఖనాల నుండి ఐదు వచనాలను పేర్కొన్నాడు. అలాగే ఆయన పరిశుద్ధ లేఖనాలను చాలాసార్లు ప్రస్తావించాడు. ఆయన చేసిన బైబిలు సంబంధిత వాదనలు ఎంత బలంగా ఉన్నాయంటే, “అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును” ఇంకా ఎక్కువ తెలుసుకోడానికి “పౌలును బర్నబాను వెంబడిం[చారు].” (అపొ. 13:​14-44) కొన్ని సంవత్సరాల తర్వాత రోమాలోని యూదులు పౌలువున్న ఇంటికి వచ్చినప్పుడు, ఆయన “దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలో నుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ​ఒప్పిం[చాడు].”​—⁠అపొ. 28:​17, 22, 23.

6 శ్రమలు ఎదుర్కొన్నప్పుడు కూడా పౌలు లేఖనాలను పరిశోధిస్తూ, ప్రేరేపిత సందేశం నుండి బలం పుంజుకున్నాడు. (హెబ్రీ. 4:​12) పౌలు, తన మరణానికి ముందు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు, తిమోతిని “పుస్తకములను,” “చర్మపు కాగితములను” తీసుకురమ్మని అడిగాడు. (2 తిమో. 4:​13) ఇవి బహుశా హెబ్రీ లేఖన భాగాలై ఉండవచ్చు, పౌలు వాటిని లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగించాడు. పౌలు స్థిరంగా నిలబడాలంటే, ఆయన క్రమంగా బైబిలును అధ్యయనం చేస్తూ, లేఖనాల జ్ఞానాన్ని పొందడం ఆయనకు చాలా ప్రాముఖ్యం.

7 క్రమంగా బైబిలు అధ్యయనం చేయడంతోపాటు, నిర్దిష్ట లక్ష్యంతో ధ్యానించడం మనం క్రైస్తవులుగా ఎదిగేందుకు సహాయం చేస్తుంది. (హెబ్రీ. 5:​12-14) దేవుని వాక్యానికున్న విలువను గురించి కీర్తనకారుడు ఇలా అన్నాడు: “వేలకొలది వెండి బంగారు నాణెములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను.” (కీర్త. 119:​72, 98, 101) మీరు వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని క్రమంగా చేస్తున్నారా? రోజూ బైబిలు చదువుతూ, చదివిన విషయాలను ధ్యానిస్తూ దేవుని సేవలో మీకు లభించబోయే భవిష్యత్‌ నియామకాలకు సిద్ధపడుతున్నారా?

సౌలు ప్రజలను ప్రేమించడం నేర్చుకున్నాడు

8 క్రైస్తవునిగా మారకముందు సౌలు తన మతంపట్ల ఉత్సాహాన్ని కనబర్చాడు, కానీ యూదులు కానివారిపట్ల ఆయన ఏ మాత్రం శ్రద్ధ కనబర్చలేదు. (అపొ. 26:​4, 5) యూదులు కొందరు స్తెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన మౌనంగా చూస్తూ ఊరుకున్నాడు. స్తెఫను చంపబడడం చూసినప్పుడు సౌలు బహుశా ఆ శిక్ష తగినదే అని భావిస్తూ, క్రైస్తవులను హింసించడం కూడా సరైనదే అనుకొని ఉండవచ్చు. (అపొ. 6:​8-14; 7:⁠54-​8:⁠1) ప్రేరేపిత వృత్తాంతం ఇలా చెబుతోంది: “సౌలు . . . ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.” (అపొ. 8:⁠3) ఆయన “యితర పట్టణములకును వెళ్లి వారిని హింసిం[చాడు].”​—⁠అపొ. 26:​11.

9 ప్రభువైన యేసు సౌలుకు కనిపించే సమయానికి, అతను క్రీస్తు శిష్యులను వేధించడానికని దమస్కుకు వెళ్తున్నాడు. దేవుని కుమారుని ప్రచండ తేజస్సువల్ల సౌలుకు కంటిచూపు పోవడంతో ఆయన ఇతరుల సహాయం తీసుకున్నాడు. యెహోవా అననీయ ద్వారా సౌలుకు తిరిగి చూపు ప్రసాదించే సమయానికి ప్రజల విషయంలో సౌలు వైఖరి పూర్తిగా మారిపోయింది. (అపొ. 9:​1-30) క్రీస్తు అనుచరుడైన తర్వాత, ఆయన యేసులాగే సకల ప్రజలతో వ్యవహరించడానికి కృషి​చేశాడు. అంటే ఆయన తన హింసాప్రవృత్తిని మార్చుకుని “సమస్త మనుష్యులతో సమాధానముగా” ఉండాల్సివచ్చింది.​—⁠రోమీయులు 12:​17-21 చదవండి.

10 ఇతరులతో సమాధానముగా ఉండడంతోనే పౌలు సరిపెట్టుకోలేదు. ఆయన వారిని హృదయపూర్వకంగా ప్రేమించాలని కోరుకున్నాడు, క్రైస్తవ పరిచర్య ఆయనకు అలా చేసే అవకాశమిచ్చింది. తన మొదటి మిషనరీ యాత్రలో ఆయన ఆసియా మైనరులో సువార్త ప్రకటించాడు. తీవ్ర వ్యతిరేకత ఎదురైనా, పౌలు ఆయన సహవాసులు క్రైస్తవులయ్యేలా దీనులకు సహాయం చేయడానికే పాటుపడ్డారు. లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో వ్యతిరేకులు ముందొకసారి పౌలును చంపేందుకు ప్రయత్నించినా, వారు మళ్లీ ఆ పట్టణాలకే వెళ్లారు.​—⁠అపొ. 13:​1-3; 14:​1-7, 19-23.

11 ఆ తర్వాత పౌలు, ఆయన సహవాసులు మాసిదోనియ పట్టణమైన ఫిలిప్పీలో, దేవునితో మంచి సంబంధం కలిగివుండేందుకు ఇష్టపడిన ప్రజల కోసం అన్వేషించారు. లూదియ అనే యూదామత ప్రవిష్టురాలు సువార్తను చక్కగా విని క్రైస్తవురాలయ్యింది. పట్టణాధి​కారులు పౌలును, సీలను బెత్తములతో కొట్టించి, చెర​సాలలో వేయించారు. అయితే పౌలు, చెరసాల నాయకునికి ప్రకటించినప్పుడు అతను, అతని కుటుంబం యెహోవా ఆరాధకులై బాప్తిస్మం తీసుకున్నారు.​—⁠అపొ. 16:​11-34.

12 ఒకప్పుడు క్రూరునిగా ప్రవర్తించిన సౌలు తాను హింసించినవారి మతంలోకే ఎందుకు మారాడు? తొలుత కఠినంగా ప్రవర్తించినా, ఆ తర్వాత ఇతరులు దేవుని గురించిన, క్రీస్తు గురించిన సత్యం తెలుసుకునేలా సహాయం చేయడం కోసం తన ప్రాణాన్ని సహితం అర్పించడానికి సిద్ధపడిన దయగల, ప్రేమగల అపొస్తలునిగా మారేలా ఆయనను ఏవి పురికొల్పాయి? పౌలు ఇలా వివరిస్తున్నాడు: “తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు . . . తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహిం[చాడు].” (గల. 1:​15, 16) ఆయన తిమోతికి ఇలా రాశాడు: “నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన​పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.” (1 తిమో. 1:​16) యెహోవా పౌలును క్షమించాడు. దేవుడు చూపించిన కృప, కనికరమే ఆయన ఇతరులకు సువార్తను ప్రకటిస్తూ వారిని ప్రేమించేలా పురికొల్పాయి.

13 యెహోవా మన పాపాలను, తప్పులను కూడా క్షమిస్తాడు. (కీర్త. 103:​8-14) “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువ​గలడు?” అని కీర్తనకారుడు అడిగాడు. (కీర్త. 130:⁠3) దేవుని కనికరం లేకపోతే మనలో ఎవ్వరికీ పవిత్ర సేవచేసే సదవకాశం గానీ, నిత్యజీవం కోసం ఎదురుచూసే అవకాశం గానీ దొరికేది కాదు. దేవుడు మనందరిపట్ల తన అపారమైన కృపను చూపిస్తున్నాడు. కాబట్టి పౌలులాగే మనమూ ఇతరులకు సత్యాన్ని ప్రకటిస్తూ, బోధిస్తూ తోటి విశ్వాసులను బలపరచడం ద్వారా అందరిపట్ల ప్రేమను చూపించాలని కోరుకోవాలి.​—⁠అపొస్తలుల కార్యములు 14:​21-23 చదవండి.

14 సమర్థవంతమైన సువార్త ప్రచారకునిగా ఎదగాలని పౌలు కోరుకున్నాడు, ఆ విషయంలో యేసు మాదిరి ఆయనకు స్ఫూర్తినిచ్చింది. దేవుని కుమారుడు ప్రజలపట్ల అపార ప్రేమ చూపించిన విధానాల్లో ఒకటి ప్రకటనా పని. “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని” యేసు అన్నాడు. (మత్త. 9:​35-38) పౌలు కూడా ఎక్కువమంది పనివాళ్లు అవసరమని వేడుకొనివుండేవాడే, అయితే అంతకన్నా ముందు ఆ విన్నపానికి తగ్గట్టు తానే ప్రవర్తిస్తూ ఉత్సాహవంతుడైన పనివాడయ్యాడు. మరి మీ విషయమేమిటి? ప్రకటనా పనిలో మీ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోగలరా? రాజ్య ప్రకటనా పనిలో మీరింకా ఎక్కువ సమయం వెచ్చించగలరా, బహుశా పయినీరు సేవ చేయగలిగేలా మీ జీవితంలో సర్దుబాట్లు చేసుకోగలరా? ‘జీవవాక్యాన్ని చేత పట్టుకునేలా’ ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులపట్ల నిజమైన ప్రేమను చూపిద్దాం.​—⁠ఫిలి. 2:​16.

పౌలుకు తనపై ఎలాంటి అభిప్రాయముంది?

15 క్రైస్తవ పరిచర్య విషయంలో కూడా పౌలు మనకు చక్కని ఆదర్శంగా ఉన్నాడు. క్రైస్తవ సంఘంలో పౌలుకు ఎన్నో నియామకాలు లభించినా, ఆ ఆశీర్వాదాలను తనకై తాను సంపాదించుకోలేదని లేదా తన సామర్థ్యాన్నిబట్టి అవి తనకు లభించలేదని ఆయనకు తెలుసు. దేవుని కృపవల్లే తనకు ఆ ఆశీర్వాదాలు లభించాయని ఆయన గ్రహించాడు. ఇతర క్రైస్తవులు కూడా సమర్థులైన సువార్త ప్రచారకులనే విషయాన్ని పౌలు గుర్తించాడు. దేవుని ప్రజల్లో తన స్థానమేదైనా ఆయన వినయంగానే ఉన్నాడు.​—⁠1 కొరింథీయులు 15:​9-11 చదవండి.

16 సిరియాలోని పట్టణమైన అంతియొకయలో తలెత్తిన సమస్యను పౌలు ఎలా పరిష్కరించాడో పరిశీలించండి. సున్నతిని గురించిన వివాదంవల్ల ఆ క్రైస్తవ సంఘంలో విభేదాలు ఏర్పడ్డాయి. (అపొ. 14:​26-15:⁠2) సున్నతి​పొందని అన్యులకు ప్రకటించడంలో నాయకత్వం వహించేందుకు పౌలు నియమించబడ్డాడు కాబట్టి, వారితో తానే చక్కగా వ్యవహరించగలనని, సమస్యను పరిష్కరించే అర్హత తనకే బాగావుందని ఆయన అనుకొనివుండవచ్చు. (గలతీయులు 2:​8, 9 చదవండి.) కానీ తన ప్రయత్నాలవల్ల ఆ వివాదం పరిష్కారం అవలేదని గ్రహించినప్పుడు, ఆయన వినమ్రతతో ఆ వివాదం గురించి యెరూషలేములోని పరిపాలక సభను సంప్రదించాడు. పరిపాలక సభ ఆ వివాదాన్ని విని, ఓ నిర్ణయానికొచ్చి పౌలునే తమ సందేశకుల్లో ఒకనిగా నియమించినప్పుడు ఆయన దానికి పూర్తిగా సహకరించాడు. (అపొ. 15:​22-31) ఆ విధంగా పౌలు తోటి సేవకులను ‘ఘనపర్చడాన్ని గొప్పగా ఎంచుకున్నాడు.’​—⁠రోమా. 12:⁠10బి.

17 వినయస్థుడైన పౌలు సంఘాల్లోని సహోదర సహోదరీలకు దూరంగా ఉండే బదులు వారికి దగ్గరయ్యాడు. రోమీయులకు రాసిన పత్రిక చివర్లో ఆయన 20 కన్నా ఎక్కుమందికి పేరుపేరునా వందనాలు చెప్పాడు. వారిలో చాలామంది లేఖనాల్లో మరెక్కడా ప్రస్తావించబడలేదు, వారిలో కేవలం కొద్దిమందికే ప్రత్యేక బాధ్యతలున్నాయి. అయితే వారందరూ యెహోవాకు నమ్మకమైన సేవకులే, పౌలు వారిని ప్రగాఢంగా ప్రేమించాడు.​—⁠రోమా. 16:​1-16.

18 పౌలు వినయం, స్నేహశీలత సంఘాలను బలపర్చాయి. ఆయన ఎఫెసు నుండి తనను చూసేందుకు వచ్చిన పెద్దలను చివరిసారిగా కలిసినప్పుడు, వారితో “మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు [వారు] విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొనిరి.” ఆయన అహంకారిగా, దూరంగావుండే వ్యక్తైతే ఆయన వెళ్లిపోతున్నప్పుడు వారలా దుఃఖించివుండేవారు కాదు.​—⁠అపొ. 20:​37, 38.

19 క్రైస్తవులుగా ఎదగాలని కోరుకునే వారందరూ పౌలులాగే వినయస్థులుగా ఉండాలి. “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచు[కొనుడి]” అని ఆయన తోటి విశ్వాసులను వేడుకున్నాడు. (ఫిలి. 2:⁠3) మనమా ఉపదేశాన్ని ఎలా అనుసరించవచ్చు? అందుకు ఒక మార్గం ఏమిటంటే, మనం సంఘ పెద్దలతో పూర్తిగా సహకరిస్తూ, వారి నిర్దేశానికి లోబడుతూ, వారు తీసుకున్న న్యాయనిర్ణయాల్ని అంగీకరించాలి. (హెబ్రీయులు 13:​17 చదవండి.) మరో మార్గం ఏమిటంటే, విశ్వాసులైన మన సహోదర సహోదరీలందరినీ విలువైన​వారిగా ఎంచాలి. సంఘాల్లోని యెహోవా ప్రజలు తరచూ వివిధ దేశాల, సంస్కృతుల, జాతుల, తెగల నేపథ్యాలకు చెందినవారై ఉంటారు. కాబట్టి మనం కూడా పౌలులాగే వారందరితో నిష్పక్షపాతంగా, ఆప్యాయంగా వ్యవహరించవద్దా? (అపొ. 17:​26; రోమా. 12:​10ఎ) “క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి” అని మనం ప్రోత్సహించబడుతున్నాం.​—⁠రోమా. 15:⁠7.

జీవపు పరుగుపందెంలో “ఓపికతో పరుగెత్తుదము”

20 క్రైస్తవ జీవితాన్ని సుదీర్ఘ పరుగుపందెంతో పోల్చవచ్చు. పౌలు ఇలా రాశాడు: “నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.”​—⁠2 తిమో. 4:​7, 8.

21 మనం పౌలు మాదిరిని అనుసరిస్తే, నిత్యజీవపు పరుగు​పందెంలో విజయం సాధించగలుగుతాం. (హెబ్రీ. 12:⁠1) కాబట్టి వ్యక్తిగత అధ్యయనం క్రమంగా చేస్తూ, ప్రజలపట్ల ప్రేమను పెంపొందించుకుంటూ, వినయ స్వభావంతో ఉంటూ క్రైస్తవులముగా నిరంతరం ఎదుగుదాం.

మీరెలా జవాబిస్తారు?

• లేఖనాలను క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయడంవల్ల పౌలుకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి?

• నిజ క్రైస్తవులు ఎందుకు ప్రజలను ప్రగాఢంగా ప్రేమించాలి?

• ఇతరులతో నిష్పక్షపాతంగా వ్యవహరించేలా మీకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయి?

• మీ సంఘంలోని పెద్దలతో సహకరించేందుకు పౌలు మాదిరి మీకెలా సహాయం చేయగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. తార్సువాడైన సౌలు ఎలాంటి మార్పులు చేసుకున్నాడు, ఆయన ఏ ప్రాముఖ్యమైన పనిని చేపట్టాడు?

3. పౌలు ఉత్తరాలను, ఆయన పరిచర్య విశేషాలను శ్రద్ధగా చదవడం మనకెలా సహాయం చేయవచ్చు?

4, 5. వ్యక్తిగత అధ్యయనం పౌలుకు ఎలా ప్రయోజనం చేకూర్చింది?

6. శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు పౌలుకు ఏది సహాయం చేసింది?

7. క్రమంగా బైబిలు అధ్యయం చేయడంవల్ల మీకు లభించే ప్రయోజనాలు పేర్కొనండి.

8. యూదులు కానివారితో సౌలు ఎలా వ్యవహరించాడు?

9. ఎలాంటి అనుభవం ఎదురవడంతో సౌలు తాను ప్రజలతో వ్యవహరించే విధానాన్ని పునఃపరిశీలించుకున్నాడు?

10, 11. పౌలు తాను ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించానని ఎలా చూపించాడు?

12. తొలుత కఠినంగా ప్రవర్తించిన సౌలు ప్రేమగల యేసుక్రీస్తు అపొస్తలునిగా మారేలా ఏవి పురికొల్పాయి?

13. ఇతరులను ప్రేమించేలా ఏది మనల్ని పురికొల్పాలి, మనమెలా ఇతరులపట్ల ప్రేమను చూపించవచ్చు?

14. మనమెలా దేవుని సేవలో ఎక్కువ చేయగలం?

15. తోటి క్రైస్తవులతో పోలిస్తే తానెలాంటి వాడినని పౌలు భావించాడు?

16. సున్నతికి సంబంధించిన వివాదం విషయంలో పౌలు ఎలా వినమ్రతను కనబర్చాడు?

17, 18. (ఎ) సంఘ సభ్యులపట్ల పౌలు ఎలాంటి ఆప్యాయతను పెంచుకున్నాడు? (బి) పౌలు వెళ్లిపోతున్నప్పుడు ఎఫెసు పెద్దలు స్పందించిన తీరునుబట్టి ఆయనెలాంటి వ్యక్తి అని మనకు తెలుస్తోంది?

19. తోటి క్రైస్తవులతో వ్యవహరించేటప్పుడు మనమెలా “వినయమైన మనస్సు” చూపించవచ్చు?

20, 21. జీవపు పరుగుపందెంలో విజయం సాధించేందుకు మనకేది సహాయం చేస్తుంది?

[23వ పేజీలోని చిత్రం]

పౌలులాగే లేఖనాల నుండి బలం పుంజుకోండి

[24వ పేజీలోని చిత్రం]

ఇతరులకు సువార్త ప్రకటించడం ద్వారా ప్రేమను చూపించండి

[25వ పేజీలోని చిత్రం]

సహోదరులకు పౌలు ఎందుకు ఆప్తుడయ్యాడో మీకు తెలుసా?