కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

“మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.” ​—⁠లూకా 6:⁠31.

యేసుక్రీస్తు నిజంగానే మహా గొప్ప బోధకుడు. ఆయన శత్రువులైన మతనాయకులు ఆయనను బంధించడానికి బంట్రౌతులను పంపినప్పుడు వారు వట్టి చేతులతో తిరిగివచ్చి, “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు” అని చెప్పారు. (యోహా. 7:​32, 45, 46) యేసు ఇచ్చిన అద్భుతమైన ప్రసంగాల్లో కొండమీది ప్రసంగం ఒకటి. అది మత్తయి సువార్తలోని 5-7 అధ్యాయాల్లో నమోదు చేయబడింది. అదే ప్రసంగం లూకా 6:​20-49 వచనాల్లో కూడా కనిపిస్తుంది. *

2 నేడు తరచూ బంగారు సూత్రం అని పిలువబడే వాక్యమే బహుశా కొండమీది ప్రసంగంలోని అత్యంత పరిచిత వాక్యం అయ్యుండవచ్చు. ఆ సూత్రం మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తుంది. యేసు ఇలా చెప్పాడు: “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.” (లూకా 6:​31) ఆ మాటలన్న యేసు ప్రజలకెంతో మేలు చేశాడు. యేసు రోగులను బాగుచేసి, చనిపోయినవారిని పునరుత్థానం చేశాడు. అయితే, వారు ఆయన చెప్పిన సువార్తను అంగీకరించినప్పుడు, వారు మరి ఎక్కువగా ప్రయోజనం పొందారు. (లూకా 7:​20-22 చదవండి.) యెహోవాసాక్షులముగా మనం అలాంటి రాజ్య ప్రకటనా పనిని చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. (మత్త. 24:​14; 28:​19, 20) ఈ ఆర్టికల్‌లో, దీని తర్వాతి ఆర్టికల్‌లో మనం ఈ పని గురించి, మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలనే విషయం గురించి యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన విషయాలను పరిశీలిస్తాం.

సాత్వికులుగా ఉండండి

3 “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” అని యేసు చెప్పాడు. (మత్త. 5:⁠5) లేఖనాల్లో పేర్కొనబడిన సాత్వికం ఒక బలహీనత కాదు. అది మృదువైన స్వభావం, మనమా లక్షణాన్ని చూపించాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి మనం దాన్ని చూపిస్తాం. మనం తోటివారితో వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఈ సాత్వికాన్ని చూపిస్తాం. ఉదా​హరణకు, మనం ఎవరికీ “కీడుకు ప్రతి కీడు” చేయము.​—⁠రోమా. 12:​17-19.

4 సాత్వికులు “భూలోకమును స్వతంత్రించుకొందురు” కాబట్టి వారు ధన్యులు అంటే వారు సంతోషంగా ఉంటారు. ‘సాత్వికుడును దీనమనస్సు’ గలవాడైన యేసు ‘సమస్తమునకు వారసునిగా నియమించబడ్డాడు’ కాబట్టి భూమిని స్వాస్థ్యంగా పొందేవారిలో ఆయనే ప్రప్రథముడు. (మత్త. 11:​29; హెబ్రీ. 1:⁠2; కీర్త. 2:⁠8) పరలోక రాజ్యంలో ‘మనుష్యకుమారుడైన’ మెస్సీయతోపాటు సహపరిపాలకులు కూడా ఉంటారని ప్రవచించబడింది. (దాని. 7:⁠13, 14, 21, 22, 27) సాత్వికులైన ఆ 1,44,000 మంది అభిషిక్తులు “క్రీస్తుతోడి వారసులు[గా]” ఉంటారు, వారు కూడా యేసుతోపాటు భూమిని స్వాస్థ్యంగా పొందుతారు. (రోమా. 8:​16, 17; ప్రక. 14:⁠1) సాత్వికులైన ఇతరులు, ఆ రాజ్య పరిపాలనలో ఈ భూమిపై నిరంతరం జీవించే ఆశీర్వాదాన్ని పొందుతారు.​—⁠కీర్త. 37:​11.

5 మనం ఇతరులతో కఠినంగా ప్రవర్తిస్తే, మనం బహుశా వారి సహనాన్ని పరీక్షించి, వారిని దూరం చేసుకునే ప్రమాద​ముంది. అలా కాకుండా మనం క్రీస్తు చూపించినలాంటి సాత్వికాన్ని అలవర్చుకున్నప్పుడు సంఘ సభ్యులు మన సహచర్యాన్ని ఇష్టపడతారు, మనం వారిని ప్రోత్సహించే​వారిగా ఉంటాం. మనం ‘ఆత్మానుసారంగా నడుస్తూ, జీవిస్తూ’ ఉంటే ఆత్మఫలాల్లో ఒకటైన సాత్వికాన్ని దేవుని పరిశుద్ధాత్మ మనలో పెంపొందింపజేస్తుంది. (గలతీయులు 5:​22-25 చదవండి.) యెహోవా పరిశుద్ధాత్మచేత నడిపించబడే సాత్వికులుగా ఉండాలని కూడా మనం ఖచ్చితంగా కోరుకుంటాం.

కనికరము చూపించేవారు ఎంతో ధన్యులు

6 కొండమీది ప్రసంగంలో యేసు, “కనికరము​గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు” అని కూడా చెప్పాడు. (మత్త. 5:⁠7) “కనికరముగలవారు” దురవస్థలో ఉన్నవారిపై జాలిపడి వారిపట్ల శ్రద్ధచూపిస్తారు, అంతేకాదు వాత్సల్యంతో దయగా వ్యవహరిస్తారు. యేసుకు ‘జాలి వేసింది’ లేదా ‘దయ కలిగింది’ కనుకనే ఆయన ప్రజల బాధలను దూరం చేశాడు. (మత్త. 14:​14; 20:​34 ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి జాలి, శ్రద్ధ ఇతరులపట్ల కనికరం చూపించేలా మనల్ని పురికొల్పాలి.​—⁠యాకో. 2:​13.

7 యేసు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు వెళ్తున్నప్పుడు తనకెదురైన ఒక గుంపును చూసి, “వారు కాపరి​లేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరప[డ్డాడు].” కాబట్టి ఆయన “వారికి అనేక సంగతులను బోధిం[చాడు].” (మార్కు 6:​34) మనం కూడా యేసులాగే ఇతరులకు రాజ్య సందేశాన్ని గురించి, దేవుని గొప్ప కనికరాన్ని గురించి చెప్పినప్పుడు నిజంగా ఎంతో సంతోషిస్తాము.

8 కనికరముగలవారు “కనికరము పొందుదురు” కాబట్టి వారు సంతోషంగా ఉంటారు. మనం ఇతరులపట్ల కనికరం చూపిస్తే సాధారణంగా వారూ మనపట్ల కనికరం చూపిస్తారు. (లూకా 6:​38) అంతేకాదు, “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును” అని యేసు చెప్పాడు. (మత్త. 6:​14) తమ పాపాలు క్షమించబడడంలో, దేవుని ఆమోదం పొందడంలో ఉన్న సంతోషమేమిటో క్షమించేవారికే తెలుస్తుంది.

“సమాధానపరచువారు” ఎందుకు ధన్యులు?

9 సంతోషానికిగల మరో కారణం గురించి వివరిస్తూ యేసు, “సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు” అని చెప్పాడు. (మత్త. 5:⁠9) మనం సమాధానపరులుగా ఉన్నప్పుడు “మిత్రభేదము” కలిగేలా దూషణకరంగా మాట్లాడం లేదా అలాంటి వేటికైనా సరే దూరంగా ఉంటాం, ఇతరులు అలా మాట్లాడినా మనం వారిని సమర్థించం. (సామె. 16:​28) మనం సంఘ సభ్యులతో, బయటివారితో మాటల్లోనూ, చేతల్లోనూ సమాధాన​పరులుగా ఉంటాం. (హెబ్రీ. 12:​14) ప్రత్యేకంగా, యెహోవా దేవునితో సమాధానపడడానికి మనం శాయశక్తులా కృషిచేస్తాం.​—⁠1 పేతురు 3:​10-12 చదవండి.

10 “సమాధానపరచువారు” సంతోషంగా ఉంటారని యేసు చెప్పాడు, ఎందుకంటే ‘వారు దేవుని కుమారులన​బడతారు.’ అభిషిక్త క్రైస్తవులు యేసే మెస్సీయ అని నమ్ముతారు కాబట్టి, వారికి ‘దేవుని పిల్లలయ్యే అధికారము’ లభిస్తుంది. (యోహా. 1:​12; 1 పేతు. 2:​24) సమాధానపరులైన యేసు “వేరే గొఱ్ఱెలకు” లభించే ప్రయోజనాలేమిటి? తన పరలోక తోడి వారసులతో కలిసి యేసు వెయ్యేళ్లు పరిపాలించినప్పుడు ఆయన వారికి ‘నిత్యుడగు తండ్రిగా’ ఉంటాడు. (యోహా. 10:​14, 16; యెష. 9:⁠6; ప్రక. 20:⁠6) వెయ్యేండ్ల పరిపాలన ముగిసిన తర్వాత అలాంటి సమాధానపరులు పరిపూర్ణ భావంలో దేవుని పిల్లలౌతారు.​—⁠1 కొరిం. 15:​27, 28.

11 మనం ‘సమాధానకర్తయగు దేవుడైన’ యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుండాలంటే సమాధానంతోపాటు ఆయనకున్న ఇతర లక్షణాలనూ అలవర్చుకోవాలి. (ఫిలి. 4:⁠9) మనం “పైనుండివచ్చు జ్ఞానము” ప్రకారం నడుచు​కుంటే ఇతరులతో సమాధానకరంగా వ్యవహరిస్తాం. (యాకో. 3:​17) అవును మనం సంతోషకరమైన సమాధానపరులుగా ఉంటాం.

“మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి”

12 ప్రజలతో అత్యుత్తమ రీతిలో వ్యవహరించే ఒక మార్గమేమిటంటే, దేవుడు ప్రసరింపజేస్తున్న ఆధ్యాత్మిక వెలుగును వారు పొందేలా సహాయం చేయడమే. (కీర్త. 43:⁠3) యేసు తన శిష్యులతో, “మీరు లోకమునకు వెలుగైయున్నారు” అని చెప్పాడు. ప్రజలు వారి “సత్క్రియలను” చూసేలా వారు తమ వెలుగును ప్రకాశింపజేయాలని కూడా ఆయన ప్రోత్సహించాడు. వారలా వెలుగులా ప్రకాశించినప్పుడు ‘మనుష్యుల యెదట’ అంటే వారి ప్రయోజనార్థం ఆధ్యాత్మిక వెలుగు ప్రసరించబడుతుంది. (మత్తయి 5:​14-16 చదవండి.) నేడు మనం ఇతరులకు మేలు చేయడం ద్వారా, “సర్వలోకమందు” అంటే “సకల జనములకు” సువార్త ప్రకటించడం ద్వారా మన వెలుగును ప్రకాశింపజేస్తాం. (మత్త. 26:​13; మార్కు 13:​10) నిజంగా ఇది మనకు గొప్ప ఆశీర్వాదమే.

13 “కొండమీదనుండు పట్టణము మరుగైయుండ​నేరదు” అని యేసు చెప్పాడు. కొండమీద ఉండే ఏ పట్టణాన్నైనా చూడడం చాలా సులభం. అలాగే మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు మనం చేసే సత్క్రియలను, మనలోని మితానుభవం, పవిత్రత వంటి చక్కని గుణాలను వెంటనే గమనిస్తారు.​—⁠తీతు 2:​1-14.

14 దీపం వెలిగించి కుంచము కింద కాకుండా ఇంట్లో అందరికీ వెలుగిచ్చేలా దీపస్తంభంపై పెట్టడం గురించి యేసు మాట్లాడాడు. మొదటి శతాబ్దంలో ప్రమిదల్ని సాధారణంగా మట్టితో చేసేవారు. ప్రమిదలోని వత్తి నూనెను (సాధారణంగా ఒలీవ నూనె) పీల్చుకుని వెలిగేది. సాధారణంగా చెక్కస్తంభంపైనో లేక లోహస్తంభంపైనో ఉంచబడే ఆ దీపం ‘ఇంట్లో ఉండేవారందరికీ వెలుగిచ్చేది.’ ప్రజలు దీపాన్ని వెలిగించి దానిని “కుంచము” కింద పెట్టరు. అప్పట్లో కుంచము అంటే దాదాపు ఎనిమిది కిలోల ధాన్యాన్ని కొలిచే పాత్ర. తన శిష్యులు తమ ఆధ్యాత్మిక వెలుగును సూచనార్థకమైన కుంచము కింద పెట్టకూడదని యేసు చెప్పాడు. కాబట్టి మనం మన వెలుగును ప్రకాశింపజేయాలి. వ్యతిరేకతకు, హింసకు భయపడి లేఖన సత్యాన్ని మరుగుచేయకూడదు లేదా ఎవరికీ చెప్పకుండా ఉండకూడదు.

15 వెలుగునిచ్చే దీపం గురించి మాట్లాడిన తర్వాతే యేసు తన శిష్యులతో, “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచు​నట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని చెప్పాడు. మన “సత్క్రియల[ను]” చూసి కొందరు దేవుని సేవకులవడం ద్వారా ఆయనను ‘మహిమ​పరుస్తారు.’ “లోకమందు జ్యోతులవలె కనబడ[డానికి]” అదెంత చక్కని కారణం!​—⁠ఫిలి. 2:​16.

16 మనం “లోకమునకు వెలుగై” ఉండాలంటే రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో నిమగ్నమవ్వాలి. అయితే అది మాత్రమే సరిపోదు. “వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కన​బడుచున్నది. గనుక . . . వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫె. 5:​9, 10) మనం దైవిక గుణాలను కనబర్చడంలో మంచి మాదిరిగా ఉండాలి. “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను” అని అపొస్తలుడైన పేతురు ఇచ్చిన సలహాను మనం లక్ష్యపెట్టాలి. (1 పేతు. 2:​12) కానీ మన తోటి విశ్వాసికి మనకు మధ్య మనస్పర్థలు ఏర్పడితే మనమేమి చేయాలి?

“నీ సహోదరునితో సమాధానపడుము”

17 కొండమీది ప్రసంగంలో యేసు తన శిష్యులను, వారు తమ సహోదరులపట్ల పగపెట్టుకుని, వారిని అవమాన​పరిచే విషయంలో హెచ్చరించాడు. బదులుగా తాము నొప్పించిన సహోదరునితో వెంటనే సమాధానపడాలి అని ఆయన చెప్పాడు. (మత్తయి 5:​21-25 చదవండి.) యేసు ఇచ్చిన ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు బలిపీఠం దగ్గరకు అర్పణను తీసుకుని వచ్చారనుకోండి. అక్కడ మీకు మీ సహోదరునితో విరోధం ఉన్న విషయం గుర్తుకువచ్చింది. అప్పుడు మీరేమి చేయాలి? వెంటనే మీ అర్పణను బలిపీఠం దగ్గర వదిలేసి, ముందు వెళ్ళి మీ సహోదరునితో సమాధానపడాలి. ఆ తర్వాత మీరు తిరిగి​వచ్చి మీ అర్పణను అర్పించవచ్చు.

18 “అర్పణ” అంటే యెహోవా ఆలయంలో ఒక వ్యక్తి అర్పించే బలి. జంతు బలులు ఇవ్వాలని దేవుడు మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు, కాబట్టి బలులు అర్పించడం ఇశ్రాయేలీయులకు చాలా ప్రాముఖ్యం. కానీ ఒక వ్యక్తికి తన సహోదరునితో విరోధం ఉన్న విషయం గుర్తుకువస్తే అతను ఆ అర్పణను అర్పించడంకన్నా సమాధానపడడమే అత్యవసరం. “అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచి​పెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన​పడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము” అని యేసు చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రకారం బలి ఇవ్వడంకన్నా సహోదరునితో సమాధానపడడమే మరింత ప్రాముఖ్యం.

19 యేసు చెప్పిన మాటలు కేవలం కొన్ని అర్పణలకు, నిర్దిష్టమైన పాపాలు చేసినప్పుడు అర్పించే బలులకే వర్తించవు. కాబట్టి ఒక వ్యక్తికి తన సహోదరునితో విరోధం ఉందనే విషయం గుర్తుకువస్తే ఏ అర్పణనైనా సరే వెంటనే విడిచివెళ్లాలి. సజీవంగావున్న ఆ జంతువును యాజకుల ఆవరణలో దహనబలి అర్పించే “బలిపీఠము నెదుట” విడిచి​వెళ్లాలి. ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాతే తప్పు చేసిన వ్యక్తి వచ్చి తన అర్పణను అర్పించవచ్చు.

20 మనం సహోదరులతో మంచి సంబంధాలను కలిగి ఉండడాన్ని కూడా సత్యారాధనలో ఒక ముఖ్యమైన భాగంగానే దేవుడు దృష్టిస్తాడు. తమ సహోదరులతో సరిగ్గా వ్యవహరించనివారు అర్పించే బలులను యెహోవా వ్యర్థంగా పరిగణిస్తాడు. (మీకా 6:​6-8) అందుకే యేసు తన శిష్యులను ‘త్వరగా సమాధానపడమని’ ప్రోత్సహించాడు. (మత్త. 5:​25) అదే విషయాన్ని గురించి పౌలు మాట్లాడుతూ, “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అప​వాదికి చోటియ్యకుడి” అని చెప్పాడు. (ఎఫె. 4:​26, 27) మనకు కోపం రావడానికి సరైన కారణాలే ఉన్నా మనం వెంటనే సమాధానపడాలి. మనమలా చేయకపోతే అప​వాదికి చోటిచ్చినవారమవుతాము.​—⁠లూకా 17:​3, 4.

ఎల్లప్పుడూ ఇతరులతో గౌరవంగా వ్యవహరించండి

21 యేసు కొండమీది ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను మళ్లీ ఒకసారి పరిశీలించినప్పుడు మనం ఇతరులతో దయగా, గౌరవంగా వ్యవహరించగలుగుతాం. అపరిపూర్ణులమే అయినా యేసు ఇచ్చిన ఉపదేశాన్ని మనమందరం అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మన పరలోక తండ్రిలాగే మనం చేయగలిగినదానికన్నా ఎక్కువ చేయాలని కోరడు. మనం ప్రార్థన చేస్తూ నిజంగా కృషి చేస్తే యెహోవా దేవుని ఆశీర్వాదాలతో సాత్వికాన్ని, సమాధా​నాన్ని, కనికరాన్ని చూపించగలుగుతాం. యెహోవా మహిమను తేజోమయం చేసే ఆధ్యాత్మిక వెలుగును మనం ప్రకాశింపజేయగలం. అంతేకాదు, సమాధానపడడం అవ​సరమైనప్పుడు మన సహోదరులతో సమాధానపడేవారిగా కూడా ఉండగలం.

22 మన ఆరాధన యెహోవాకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనం మన పొరుగువారితో సరిగ్గా వ్యవహరించాలి. (మార్కు 12:​31) తర్వాతి ఆర్టికల్‌లో మనం యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం. అవి ఇతరులకు మేలు చేస్తూ ఉండేలా మనకు సహాయం చేస్తాయి. అయితే యేసు ఇచ్చిన అద్భుతమైన ప్రసంగంలో పైన ప్రస్తావించబడిన కొన్ని విషయాల గురించి ధ్యానించిన తర్వాత ‘ఇతరులతో నేనెలా వ్యవహరిస్తున్నాను?’ అని ప్రశ్నించుకోవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 3 మీరు ఈ ఆర్టికల్‌ను, దీని తర్వాతి ఆర్టికల్‌ను పరిశీలించే ముందు మీ వ్యక్తిగత అధ్యయనంలో ఈ లేఖన భాగాలను చదివితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మీరెలా జవాబిస్తారు?

• సాత్వికంగా ఉండడం అంటే అర్థమేమిటి?

• “కనికరముగలవారు” ఎందుకు సంతోషంగా ఉంటారు?

• మనం వెలుగును ఎలా ప్రకాశింపజేయగలం?

• మనం ఎందుకు ‘సహోదరులతో’ వెంటనే ‘సమాధానపడాలి’?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) కొండమీది ప్రసంగం అంటే ఏమిటి? (బి) మనం ఈ ఆర్టికల్‌లో, దీని తర్వాతి ఆర్టికల్‌లో ఏ విషయాల గురించి పరిశీలించ​బోతున్నాం?

3. సాత్వికం అంటే ఏమిటి?

4. సాత్వికులు ఎందుకు సంతోషంగా ఉంటారు?

5. క్రీస్తు చూపించినలాంటి సాత్వికాన్ని అలవర్చుకోవడం మన వ్యక్తిత్వాన్ని ఎలా మెరుగుపర్చగలదు?

6. ‘కనికరముగలవారిలో’ ఎలాంటి చక్కని లక్షణాలు ఉంటాయి?

7. యేసు కనికరంతో ఏమి చేశాడు?

8. కనికరముగలవారు ఎందుకు సంతోషంగా ఉంటారు?

9. మనం సమాధానపరులమైతే ఎలా ప్రవర్తిస్తాం?

10. “సమాధానపరచువారు” ఎందుకు సంతోషంగా ఉంటారు?

11. మనం “పైనుండివచ్చు జ్ఞానము” ప్రకారం నడుచుకుంటే ఇతరులతో ఎలా వ్యవహరిస్తాం?

12. (ఎ) ఆధ్యాత్మిక వెలుగు గురించి యేసు ఏమి చెప్పాడు? (బి) మనం ఎలా మన వెలుగును ప్రకాశింపజేయవచ్చు?

13. మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు మనలో ఏమి గమనిస్తారు?

14. (ఎ) మొదటి శతాబ్దంలో ప్రమిదలు ఎలా ఉండేవి? (బి) “కుంచము” కింద మన ఆధ్యాత్మిక వెలుగును దాచకుండా ఉండడం అంటే అర్థమేమిటి?

15. మన “సత్క్రియలు” కొందరిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

16. మనం “లోకమునకు వెలుగై” ఉండాలంటే ఏమి చేయాలి?

17-19. (ఎ) మత్తయి 5:​23, 24లో పేర్కొనబడిన “అర్పణ” అంటే ఏమిటి? (బి) సహోదరునితో సమాధానపడడం ఎంత ప్రాముఖ్యం, యేసు ఆ విషయాన్ని ఎలా వివరించాడు?

20. మనపై విరోధం ఉన్న సహోదరునితో వెంటనే ఎందుకు సమాధానపడాలి?

21, 22. (ఎ) మనం చర్చించినట్లుగా, యేసు ఇచ్చిన ఉపదేశాన్ని మనమెలా అన్వయించుకోవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

[4వ పేజీలోని చిత్రం]

మన వెలుగును ప్రకాశింపజేయడంలో భాగంగా రాజ్య సందేశాన్ని ప్రకటించడం ఎంతో ప్రాముఖ్యం

[5వ పేజీలోని చిత్రం]

దైవిక గుణాలను ప్రదర్శించడంలో క్రైస్తవులు మాదిరిగా ఉండాలి

[6వ పేజీలోని చిత్రం]

మీ సహోదరులతో సమాధానపడడానికి సాధ్యమైనంతగా కృషి చేయండి