కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేలుచేస్తూ ఉండండి

మేలుచేస్తూ ఉండండి

మేలుచేస్తూ ఉండండి

“మేలుచేయుడి.”​—⁠లూకా 6:​35.

ఇతరులకు మేలుచేయడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. ఎందుకంటే మనం ఇతరులపట్ల ప్రేమ చూపించినా వారు తిరిగి ప్రేమ చూపించకపోవచ్చు. ప్రజలకు ఆధ్యాత్మికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో మనం, ‘శ్రీమంతుడగు దేవుడు అప్పగించిన మహిమగల సువార్తను’ ప్రకటించడానికి ఎంత ప్రయత్నించినా, వారు దానిపట్ల ఉదాసీనంగా, కృతజ్ఞత లేనివారిగా ఉండవచ్చు. (1 తిమో. 1:​8-11) ఇతరులు “క్రీస్తు సిలువకు శత్రు​వులుగా” ఉండవచ్చు. (ఫిలి. 3:​18) మరైతే, క్రైస్తవులముగా మనం వారితో ఎలా వ్యవహరించాలి?

2 “మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి” అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. (లూకా 6:​35) యేసు ఇచ్చిన ఆ ఉపదేశాన్ని మనం కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇతరులకు మేలు చేయడం గురించి యేసు చెప్పిన మరికొన్ని విషయాలను పరిశీలించడం ద్వారా కూడా మనం ప్రయోజనం పొందుతాం.

“శత్రువులను ప్రేమించుడి”

3 ప్రఖ్యాతిగాంచిన కొండమీది ప్రసంగంలో యేసు తన శ్రోతలతో, వారు తమ శత్రువులను ప్రేమించాలని, తమను హింసించేవారి కోసం ప్రార్థించాలని చెప్పాడు. (మత్తయి 5:​43-45 చదవండి.) ఆ ప్రసంగం విన్న యూదులకు “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు​కొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింప​వలెను” అని దేవుడిచ్చిన ఆజ్ఞ తెలుసు. (లేవీ. 19:​18) మొదటి శతాబ్దంలోని యూదా మత నాయకులు, తమ “ప్రజలు,” తమ ‘పొరుగువారు’ అనే మాటలు కేవలం యూదులకు మాత్రమే వర్తిస్తాయని అనుకునేవారు. ఇశ్రా​యేలీయులు ఇతర జనాంగాల నుండి వేరుగా ఉండాలని మోషే ధర్మశాస్త్రం చెప్పిన మాట నిజమే. అయితే వారు, యూదేతరులందరూ తమ శత్రువులనే, వారిని ద్వేషించాలనే అభిప్రాయాన్ని ఏర్పరచు​కున్నారు.

4 దానికి భిన్నంగా యేసు, “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని చెప్పాడు. (మత్త. 5:​44) తన శిష్యులు తమ శత్రువుల​పట్ల ప్రేమతో వ్యవహరించాలని ఆయన చెప్పాడు. లూకా సువార్త ప్రకారం యేసు ఇలా అన్నాడు: “మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.” (లూకా 6:​27, 28) యేసు బోధన ప్రకారం నడుచుకున్న మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే మనం కూడా మనల్ని బాధించేవారితో దయాపూర్వకంగా వ్యవహరించడం ద్వారా ‘మనల్ని ద్వేషించేవారికి మేలుచేసిన వారమవుతాం.’ దయగా మాట్లాడడం ద్వారా మనల్ని ‘శపించేవారిని దీవిస్తాం.’ మనల్ని శారీరకంగా “హింసించే” లేదా ఇతర విధాలుగా ‘బాధించేవారి’ కోసం ‘ప్రార్థిస్తాం.’ మనల్ని హింసించేవారు మారి యెహోవా అనుగ్రహాన్ని పొందే పనులు చేయడానికి వారికి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతున్నాం కాబట్టి మన ప్రార్థనలు మనం వారిని ప్రేమిస్తున్నామని చూపిస్తాయి.

5 శత్రువులను మనం ఎందుకు ప్రేమించాలి? ‘పరలోకమందున్న మన తండ్రికి కుమారులై యుండునట్లు’ మనమలా చేయాలని యేసు చెప్పాడు. మనం ఆ ఉపదేశాన్ని లక్ష్యపెట్టినప్పుడు “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింప​జేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్న” యెహోవాను అనుకరిస్తాం కాబట్టి, ఆయన ‘కుమారలము’ అవుతాం. (మత్త. 5:​44, 45) లూకా సువార్త చెబుతున్నట్లుగా దేవుడు “కృతజ్ఞత లేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.”​—⁠లూకా 6:​35.

6 యేసు తన శిష్యులు తమ ‘శత్రువులను ప్రేమించడం’ ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెబుతూ, “మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా” అని అన్నాడు. (మత్త. 5:​46, 47) మనం కేవలం మనల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తే మనకు ఎలాంటి “ఫలము” ఉండదు అలాగే దేవుని అనుగ్రహమూ ఉండదు. యూదులు సాధారణంగా ఈసడించుకునే సుంకరులు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమించేవారు.​—⁠లూకా 5:​30; 7:​34.

7 యూదులు ఎవరినైనా కలుసుకున్నప్పుడు సాధారణంగా “సమాధానం” కలుగునుగాక అని పలకరించు​కునేవారు. (యోహా. 20:​19) అంటే వారు అవతలి వ్యక్తి ఆరోగ్యంగా, క్షేమంగా, వర్ధిల్లుతూ ఉండాలని కోరుకుంటు​న్నట్లు అర్థం. మన “సహోదరులు” అనుకున్న వారిని మాత్రమే అలా పలకరిస్తే దానిలో మనం “ఎక్కువ చేయుచున్నదేమి?” యేసు చెప్పినట్లుగా “అన్యజనులు” కూడా అలాగే చేస్తారు.

8 వారసత్వంగా వచ్చిన పాపం కారణంగా క్రీస్తు శిష్యులు నిష్కళంకంగా, పరిపూర్ణంగా ఉండలేకపోయారు. (రోమా. 5:​12) అయినా, యేసు తన ప్రసంగాన్ని ఈ మాటలతో ముగించాడు: “పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.” (మత్త. 5:​48, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తన శ్రోతలు తమ శత్రువులను కూడా ప్రేమించడం ద్వారా తమ ప్రేమను పరిపూర్ణం చేసుకుంటూ తమ “పరలోకపు తండ్రి” అయిన యెహోవాను అనుకరించాలని ఆయన ప్రోత్సహించాడు. మనం కూడా అలాగే చేయాలని ఆయన ఆశిస్తున్నాడు.

ఎందుకు ఇతరులను క్షమించాలి?

9 మనపట్ల పాపం చేసిన వ్యక్తిని దయతో క్షమించి​నప్పుడు మనం మేలు చేసినవారమౌతాం. నిజానికి యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలో, “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము” అనే మాటలున్నాయి. (మత్త. 6:​12) ఆ మాటలు అప్పులను క్షమించడం గురించి చెప్పినవి కాదు. యేసు ఆ సందర్భంలో “ఋణముల” గురించి మాట్లాడినప్పుడు నిజానికి ఆయన ‘పాపాల’ గురించి మాట్లాడాడని లూకా సువార్త చూపిస్తోంది. అక్కడ ఇలా ఉంది: “మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు మా పాపాలు క్షమించు.”​—⁠లూకా 11:⁠4, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

10 పశ్చాత్తాపపడే పాపులను ఉదారంగా క్షమించే దేవుణ్ణి మనం అనుకరించాలి. “ఒకని యెడల ఒకడు దయ​గలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫె. 4:​32) కీర్తనకర్త దావీదు ఇలా ఆలపించాడు: “యెహోవా దయా​దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. . . . మన పాపములను​బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. . . . పడ​మటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు. తండ్రి తన కుమారుల​యెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింప​బడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.”​—⁠కీర్త. 103:​8-14.

11 ప్రజలు తమపట్ల పాపం చేసినవారిని క్షమిస్తేనే, దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. (మార్కు 11:​25) యేసు ఈ విషయాన్నే నొక్కిచెబుతూ, “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అప​రాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు” అని అన్నాడు. (మత్త. 6:​14, 15) అవును ఇతరులను ఉదారంగా క్షమించేవారినే దేవుడు క్షమిస్తాడు. మేలుచేస్తూ ఉండడానికి ఒక మంచి మార్గం ఏమిటంటే, “ప్రభువు [యెహోవా] మిమ్మును క్షమించిన​లాగున మీరును క్షమించుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించడమే.​—⁠కొలొ. 3:​13.

“తీర్పు తీర్చకుడి”

12 యేసు కొండమీది ప్రసంగంలో ఇతరులకు మేలు​చేయడానికి సంబంధించిన మరో మార్గం గురించి చెప్పాడు. ఆయన తన శ్రోతలతో, ఇతరులపై తీర్పు తీర్చకుండా ఉండమని చెప్పి, ఆ విషయాన్ని నొక్కిచెప్పడానికి ఓ శక్తివంతమైన ఉపమానాన్ని ఉపయోగించాడు. (మత్తయి 7:​1-5 చదవండి.) “తీర్పు తీర్చకుడి” అన్న యేసు మాటల అర్థమేమిటో చూద్దాం.

13 మత్తయి సువార్తలో యేసు మాటలు ఇలా ఉన్నాయి: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.” (మత్త. 7:⁠1) అవే మాటలు లూకా సువార్తలో ఇలా ఉన్నాయి: “తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు.” (లూకా 6:​37, 38ఎ) మొదటి శతాబ్ద పరిసయ్యులు లేఖనాల్లో లేని ఆచారాల ఆధారంగా ఇతరులపై కఠినంగా తీర్పుతీర్చేవారు. యేసు ప్రసంగాన్ని విన్నవారిలో ఎవరైనా అలా చేస్తుంటే, వారు ‘తీర్పు తీర్చడం’ మానేయాలి. బదులుగా వారు ఇతరుల పొరబాట్లను ‘క్షమిస్తూ’ ఉండాలి. క్షమించే విషయంలో అపొస్తలుడైన పౌలు కూడా అదే సలహాను ఇచ్చాడు.​—⁠ఎఫెసీయులు 4:⁠32 చదవండి.

14 యేసు శిష్యులు ఇతరులను క్షమించడం ద్వారా ఇతరులు కూడా క్షమించే గుణాన్ని అలవర్చుకునేలా పురికొల్పుతారు. “మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును” అని యేసు చెప్పాడు. (మత్త. 7:⁠2) మనం ఇతరులతో ఎలా వ్యవహరిస్తే వారు కూడా మనతో అలాగే వ్యవహరిస్తారు.​—⁠గల. 6:⁠7.

15 అతిగా విమర్శించడం ఎంత తప్పో చూపించేందుకు యేసు, “నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు సహోదరుని చూచి​—⁠నీ కంటిలో నున్న నలుసును తీసి​వేయనిమ్మని చెప్పనేల?” అని అడిగాడని గుర్తుతెచ్చుకోండి. (మత్త. 7:​3, 4) అవతలివాళ్లని విమర్శించాలనుకునే వ్యక్తి తన సహోదరుని “కంటిలో” ఉన్న చిన్న నలుసును గమనిస్తాడు. నిజానికి అలా విమర్శించే వ్యక్తి తన సహోదరునికి గ్రహించే శక్తి గానీ, వివేచన గానీ లేదని అనుకుంటాడు. ఆయన చేసే తప్పు చిన్నదే అంటే నలుసు లాంటిదే అయినా విమర్శించేవాడు ఆ ‘నలుసును’ తీసివేస్తా​నంటాడు. ఆ వ్యక్తి వేషధారణతో తన సహోదరుడు స్పష్టంగా చూసేలా సహాయం చేస్తానంటాడు.

16 ముఖ్యంగా యూదా మతనాయకులు ఇతరులను అతిగా విమర్శించేవారు. ఉదా​హరణకు, క్రీస్తు బాగుచేసిన ఒక గుడ్డివాడు, యేసు దేవుని దగ్గర నుండి వచ్చాడని చెప్పినప్పుడు పరిసయ్యులు, “నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా” అని దుయ్యబట్టారు. (యోహా. 9:​30-34) ఆధ్యాత్మిక విషయాలను స్పష్టంగా చూసే విషయంలో, యెహోవా ప్రమాణాల ప్రకారం సరైన తీర్పు తీర్చే విషయంలో పరిసయ్యుల కంటిలోనే “దూలము” ఉండడమే కాక, వారు పూర్తిగా గుడ్డివారయ్యారు. అందుకే యేసు, “వేషధారీ, మొదట నీ కంటిలో​నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును” అని అన్నాడు. (మత్త. 7:⁠5; లూకా 6:​42) మనం ఇతరులకు మేలుచేయాలనే, వారితో సరిగా వ్యవహరించాలనే పట్టుదలతో ఉంటే, ఎప్పుడూ మన సహోదరుల నిర్ణయాల్లో తప్పులు పడుతూ వారిని విమర్శిస్తూవుండం. బదులుగా మనం అపరిపూర్ణులమని గుర్తిస్తాం కాబట్టి తోటి విశ్వాసులపై తీర్పు తీర్చడం గానీ, విమర్శించడం గానీ చేయం.

మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

17 దేవుడు తన సేవకుల ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం ద్వారా వారిపట్ల తండ్రిలా వ్యవహరిస్తాడని యేసు కొండమీది ప్రసంగంలో చెప్పాడు. (మత్తయి 7:​7-12 చదవండి.) “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అనే ప్రవర్తనా నియమాన్ని యేసు ఇవ్వడం ఆసక్తికరమైన విషయం. (మత్త. 7:​12) మనం ఇతరులతో అలా వ్యవ​హరిస్తేనే మనం యేసుక్రీస్తుకు నిజమైన అనుచరులముగా ఉంటాం.

18 ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో మనం వారితో అలాగే వ్యవహరించాలని చెప్పిన తర్వాత, యేసు ఇంకా ఇలా అన్నాడు: “ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.” యేసు చెప్పినట్లుగానే మనం ఇతరులతో వ్యవహరిస్తే మనం ఆదికాండము నుండి ద్వితియోపదేశకాండము వరకున్న ‘ధర్మశాస్త్రంలోని’ నియమాల అసలు ఉద్దేశాన్ని అర్థంచేసుకుని ప్రవర్తించే​వారిగా ఉంటాం. ఆ పుస్తకాల్లో, కీడును రూపుమాపే సంతానాన్ని తీసుకురావాలనే యెహోవా ఉద్దేశం వెల్లడిచేయబడడమే కాక, సా.శ.పూ. 1513లో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా ఉంది. (ఆది. 3:​15) ధర్మశాస్త్రంలో ఇతర విషయాలతోపాటు, ఇశ్రాయేలీయులు న్యాయంగా ఉండాలని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బీదలకు, దేశంలో ఉంటున్న పరదేశులకు మేలు చేయాలని కూడా స్పష్టం చేయబడింది.​—⁠లేవీ. 19:⁠9, 10, 15, 34.

19 యేసు “ప్రవక్తల” గురించి మాట్లాడినప్పుడు ఆయన హెబ్రీ లేఖనాల్లోని ప్రవక్తల పుస్తకాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాడు. క్రీస్తునందు నెరవేరిన మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలన్నీ హెబ్రీ లేఖనాల్లో ఉన్నాయి. దేవుని దృష్టిలో సరైనది చేసే, ఇతరులతో సరిగా వ్యవహరించే తన ప్రజల్ని యెహోవా ఆశీర్వదిస్తాడని కూడా ఆ లేఖనాలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు, యెషయా ప్రవచనంలో ఇశ్రాయేలీయులకు ఈ ఉపదేశం ఇవ్వబడింది: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠. . . న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి. . . . దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు.” (యెష. 56:​1, 2) అవును, తన ప్రజలందరూ మేలుచేస్తూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు.

ఇతరులకు ఎల్లప్పుడు మేలుచేస్తూ ఉండండి

20 యేసు ఎంతో అద్భుతంగా ఇచ్చిన కొండమీది ప్రసంగంలోని ముఖ్య విషయాల్లో కొన్నింటినే మనం ఇప్పుడు పరిశీలించాం. అయినా, యేసు ఆ సందర్భంలో చెప్పినదాన్ని విన్నప్పుడు ప్రజలు ఎలా స్పందించివుంటారో మనం సులభంగా చెప్పగలం. “యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్య​పడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను” అని బైబిలు చెబుతోంది.​—⁠మత్త. 7:​28, 29.

21 యేసుక్రీస్తు తిరుగులేని విధంగా, ప్రవచింపబడిన “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త” తానే అని నిరూపించుకున్నాడు. (యెష. 9:​6) పరలోక తండ్రి మనోభావాలు యేసుకు ఎంతగా తెలుసనేదానికి ఆయన ఇచ్చిన కొండమీది ప్రసంగమే అత్యుత్తమ రుజువు. మనం ఇప్పుడు చర్చించిన విషయాలేకాక ఆ ప్రసంగంలో నిజమైన సంతోషాన్ని పొందడం, అనైతికతకు దూరంగా ఉండడం, నీతిగా జీవించడం, శాంతిభద్రతలుండే సంతోషకరమైన భవిష్యత్తును పొందడం లాంటి అనేక విషయాలు కూడా ఉన్నాయి. మీరు మళ్లీ ఒకసారి శ్రద్ధగా, ప్రార్థనాపూర్వకంగా మత్తయి సువార్తలోని 5-7 అధ్యాయాలు ఎందుకు చదవకూడదు? ఆ అధ్యాయాల్లో యేసు ఇచ్చిన చక్కని ఉపదేశాన్ని ధ్యానించండి. కొండమీది ప్రసంగంలో క్రీస్తు చెప్పిన విషయాలను మీ జీవితంలో అన్వయించుకోండి. అప్పుడే మీరు యెహోవాను మరింతగా సంతోషపెడతారు, ఇతరులతో సరిగా వ్యవహరించగలుగుతారు, మేలుచేస్తూ ఉండగలుగుతారు.

మీరెలా జవాబిస్తారు?

• మనం మన శత్రువులతో ఎలా వ్యవహరించాలి?

• మనం ఇతరులను ఎందుకు క్షమించాలి?

• ఇతరులపై తీర్పు తీర్చడం గురించి యేసు ఏమి చెప్పాడు?

మత్తయి 7:⁠12 ప్రకారం మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఇతరులకు మేలు చేయడం తరచూ ఎందుకు కష్టంగా ఉంటుంది?

3. (ఎ) మత్తయి 5:​43-45లో యేసు చెప్పిన విషయాలను మీ స్వంత మాటల్లో క్లుప్తంగా చెప్పండి. (బి) మొదటి శతాబ్దపు యూదా మత నాయకులు యూదుల గురించి, యూదేతరుల గురించి ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు?

4. యేసు శిష్యులు తమ శత్రువులతో ఎలా వ్యవహరించాలి?

5, 6. మనం ఎందుకు మన శత్రువులను ప్రేమించాలి?

7. మనం మన “సహోదరులను” మాత్రమే పలకరించడం ఎందుకు ‘ఎక్కువ చేస్తున్నట్లు’ కాదు?

8. ‘మీరును పరిపూర్ణంగా ఉండాలి’ అని అన్నప్పుడు యేసు ఏమి చేయమని ప్రోత్సహిస్తున్నాడు?

9. “మా ఋణములు క్షమించుము” అనే మాటల అర్థమేమిటి?

10. క్షమించే విషయంలో మనం దేవుణ్ణి ఎలా అనుకరించవచ్చు?

11. దేవుడు ఎవరిని మాత్రమే క్షమిస్తాడు?

12. ఇతరులపై తీర్పు తీర్చే విషయంలో యేసు ఏమి చెప్పాడు?

13. యేసు ప్రసంగం విన్నవారు ఏమి చేయాలి?

14. యేసు శిష్యులు ఇతరులను క్షమించడం ద్వారా ఇతరులు కూడా ఏమి చేసేలా పురికొల్పుతారు?

15. అతిగా విమర్శించడం తప్పనే విషయాన్ని యేసు ఎలా చెప్పాడు?

16. పరిసయ్యుల కంటిలో “దూలము” ఉందని ఎందుకు చెప్పవచ్చు?

17. మత్తయి 7:⁠12 ప్రకారం మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలి?

18. ఇతరులు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో మనం వారితో అలాగే వ్యవహరించాలనే విషయం ‘ధర్మశాస్త్రంలో’ ఎలా చెప్పబడింది?

19. మనం మేలు చేయాలని “ప్రవక్తలు” ఎలా చెబుతున్నారు?

20, 21. యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగాన్ని విని ప్రజలు ఎలా స్పందించారు, మీరు దానిని ఎందుకు ధ్యానించాలి?

[10వ పేజీలోని బ్లర్బ్‌]

“తీర్పు తీర్చకుడి” అని యేసు ఎందుకు చెప్పాడో మీకు తెలుసా?

[8వ పేజీలోని చిత్రం]

మనల్ని హింసించేవారి కోసం ఎందుకు ప్రార్థించాలి?

[10వ పేజీలోని చిత్రం]

ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నారో మీరు వారితో అలాగే వ్యవహరిస్తున్నారా?