కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనంలో ఉన్నప్పుడే యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి

యౌవనంలో ఉన్నప్పుడే యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి

యౌవనంలో ఉన్నప్పుడే యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి

‘నీవు నేర్చుకొని రూఢియని తెలుసుకొనిన వాటియందు నిలుకడగా ఉండుము.’​—⁠2 తిమో. 3:​14.

యౌవనుల పవిత్ర సేవను యెహోవా ఎంత ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తాడంటే, ఆయన వారి గురించి ఏకంగా ఒక ప్రవచనం రాయబడేలా ప్రేరేపించాడు. కీర్తనకారుడు ఇలా పాడాడు: “యుద్ధసన్నాహ​దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీ యొద్దకు వచ్చెదరు.” (కీర్త. 110:⁠3) అవును, ఇష్టపూర్వకంగా తనను సేవించే యౌవనులను యెహోవా ప్రియమైనవారిగా పరిగణిస్తాడు.

2 క్రైస్తవ సంఘంలోని యౌవనులారా, మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నారా? సత్యదేవుణ్ణి సేవించే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడం చాలామంది యౌవనులకు కష్టంగా అనిపించవచ్చు. వాణిజ్యవేత్తలు, విద్యావేత్తలు, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా డబ్బు సంపాదించమని యౌవనులను ప్రోత్సహిస్తారు. యౌవనులు ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు, లోకం వారిని హేళనచేస్తుంది. కానీ వాస్తవమేమిటంటే, సత్యదేవుణ్ణి సేవిస్తూ జీవించడమే అత్యంత శ్రేష్ఠమైన జీవితం. (కీర్త. 27:⁠4) దేవుణ్ణి సేవించే విషయానికి సంబంధించిన ఈ మూడు ప్రశ్నలను పరిశీలించండి: మీరెందుకు దేవుణ్ణి సేవించాలి? ఇతరులు ఏమిచెప్పినా, ఏమిచేసినా దేవునికి సమర్పించుకున్న సేవకులుగా మీరెలా విజయం సాధించవచ్చు? పవిత్ర సేవకు సంబంధించిన ఎలాంటి అద్భుతమైన అవకాశాలు మీకు అందుబాటులో ఉన్నాయి?

యెహోవాను సేవించడమే సరైనది

3 సజీవుడైన సత్యదేవుణ్ణి మీరెందుకు సేవించాలి? దానికి​గల ముఖ్యకారణాన్ని ప్రకటన 4:​10, 11 ఇలా వివరిస్తోంది: “ప్రభువా, [యెహోవా] మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.” యెహోవా ఒక అద్భుతమైన సృష్టికర్త. ఈ భూమి ఎంత అందంగా ఉందో కదా! చెట్లు, పూలు, జంతువులు, సముద్రాలు, పర్వతాలు, జలపాతాలు వీటన్నిటినీ కూడా యెహోవాయే చేశాడు. “[దేవుడు] కలుగజేసినవాటితో భూమి నిండియున్నది” అని కీర్తన 104:​24 చెబుతోంది. ఈ భూమిని, దానిమీదున్న మంచి వాటన్నిటినీ అనుభవించేలా యెహోవా ప్రేమతో మనకు శరీరాన్ని, మనస్సును ఇచ్చినందుకు మనమెంత కృతజ్ఞులం! అద్భుతమైన సృష్టిపట్ల మనకున్న హృదయపూర్వక కృతజ్ఞతాభావం ఆయనను సేవించేలా మనల్ని పురికొల్పవద్దా?

4 యెహోవాను సేవించడానికిగల మరో కారణాన్ని మనం ఇశ్రాయేలీయుల నాయకుడైన యెహోషువ మాటల్లో చూడవచ్చు. తన జీవిత చరమాంకంలో యెహోషువ దేవుని ప్రజలతో ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను.” యెహోషువ ఎందుకలా చెప్పగలిగాడు?​—⁠యెహో. 23:​14.

5 ఐగుప్తులో పెరిగిన యెహోషువ, ఇశ్రాయేలీయులకు ఒక దేశాన్ని ఇస్తానని యెహోవా చేసిన వాగ్దానం గురించి తెలుసుకొని ఉండవచ్చు. (ఆది. 12:⁠7; 50:​24, 25; నిర్గ. 3:⁠8) మొండివాడైన ఫరో ఇశ్రాయేలీయులు వెళ్లిపోయేందుకు ఒప్పుకునేలా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఐగుప్తు మీదికి పది తెగుళ్లు రప్పించడం ద్వారా యెహోవా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం మొదలుపెట్టాడని కూడా యెహోషువ గమనించాడు. ఎర్రసముద్రం గుండా రక్షించబడినవారిలో యెహోషువ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన, ఫరో అతని సైన్యం ఆ సముద్రంలో మునిగిపోవడాన్ని ప్రత్యక్షంగా చూశాడు. సీనాయి ఎడారి ప్రాంతమైన ‘భయంకరమైన గొప్ప అరణ్యంలో’ ఇశ్రాయేలీయులు చేసిన సుదీర్ఘ ప్రయాణమంతటిలో వారికి కావలసినవి యెహోవా ఎలా సమకూర్చాడో యెహోషువ చూశాడు. ఒక్కరు కూడా ఆకలిదప్పులతో మరణించలేదు. (ద్వితీ. 8:​3-5, 14-16; యెహో. 24:​5-7) ఇశ్రాయేలీయులు, కనానీయుల బలమైన దేశాలను జయించి వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, తానేకాక ఇతర ఇశ్రాయేలీయులు కూడా ఆరాధించే దేవుడు తమకెలా మద్దతిచ్చాడో యెహోషువ గమనించాడు.​—⁠యెహో. 10:​14, 42.

6 యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చాడని యెహోషువకు తెలుసు. కాబట్టే ఆయనిలా అన్నాడు: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” (యెహో. 24:​15) మరి మీ విషయమేమిటి? సత్యదేవుడు ఇప్పటికే నెరవేర్చిన, నెరవేర్చబోనున్న వాగ్దానాల గురించి మీరు ఆలోచించినప్పుడు, యెహోషువలాగే మీరూ ఆయనను సేవించాలని కోరుకుంటారా?

7 యెహోవా సృష్టికార్యాలను తలపోస్తూ, ఆయన చేసిన అద్భుతమైన, పూర్తిగా నమ్మదగిన వాగ్దానాలను ధ్యానించడం, యెహోవాకు సమర్పించుకోవడానికి, ఆ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా చూపించడానికి మిమ్మల్ని పురికొల్పాలి. దేవుణ్ణి సేవించాలని కోరుకునేవారు బాప్తిస్మం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని మన మాదిరికర్తయైన యేసు స్పష్టం చేశాడు. మెస్సీయగా తన పనిని ప్రారంభించే ముందు ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వెళ్లాడు. యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? యేసే ఆ తర్వాత ఇలా చెప్పాడు: “నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.” (యోహా. 6:​38) తన తండ్రి చిత్తాన్ని చేసేందుకు తననుతాను సమర్పించుకున్నానని చూపించడానికే యేసు బాప్తిస్మం తీసుకున్నాడు.​—⁠మత్త. 3:​13-17.

8 తిమోతి విషయం కూడా పరిశీలించండి. యెహోవా తగిన సమయంలో ఈ యువ క్రైస్తవునికి ఎన్నో పనులను అప్పగించడంతోపాటు, అనేక సేవాధిక్యతలను కూడా అనుగ్రహించాడు. తిమోతి సత్యదేవుణ్ణి ఆరాధించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఎందుకంటే ఆయన ‘నేర్చుకొన్నవి రూఢియని తెలుసుకున్నాడని’ బైబిలు మనకు చెబుతోంది. (2 తిమో. 3:​14) మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి దాని బోధలు సత్యమైనవేనని రూఢిగా తెలుసుకుంటే, మీరు కూడా తిమోతిలాగే నిర్ణయించుకునే స్థితిలో ఉంటారు. కాబట్టి మీరిప్పుడు ఓ నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీ తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడకూడదు? వారు, వారితోపాటు సంఘపెద్దలు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ఏమిచేయాలో లేఖనానుసారంగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేయగలుగుతారు.​—⁠అపొస్తలుల కార్యములు 8:​12 చదవండి.

9 మీరు బాప్తిస్మం తీసుకుంటే, సత్యదేవుని ఆరాధనలో అది మీరు ఎక్కే తొలిమెట్టు అవుతుంది. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరొక సుదీర్ఘ పరుగుపందెంలో అడుగు​పెడతారు, తత్ఫలితంగా చివరకు మీకు నిత్యజీవమనే బహుమానం లభించడమే కాక, ఇప్పుడు దేవుని చిత్తం చేయడంలోని ఆనందమూ మీ సొంతమౌతుంది. (హెబ్రీ. 12:​1-3) అంతేకాదు, ఇప్పటికే ఆ పందెంలోవున్న మీ కుటుంబ సభ్యులకు, క్రైస్తవ సంఘంలోని మీ స్నేహితులకు కూడా మీరు ఆనందాన్ని తీసుకొచ్చినవారవుతారు. అన్నిటికన్నా మిన్నగా మీరు యెహోవా హృదయాన్ని సంతోషింపజేస్తారు. (సామెతలు 23:​15 చదవండి.) యెహోవాను ఆరాధించాలని మీరెందుకు నిర్ణయించుకున్నారో ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు. పైగా మీరొక తప్పు నిర్ణయం తీసుకున్నారని భావిస్తూ, వారు మిమ్మల్ని అడ్డగించనూవచ్చు. అయినా సరే మీరు ఈ సవాళ్లన్నిటినీ విజయ​వంతంగా ఎదుర్కోవచ్చు.

ఇతరులు ప్రశ్నించినా లేక వ్యతిరేకించినా మీరేమి చేయాలి?

10 యెహోవాను సేవించాలనే మీ నిర్ణయాన్నిబట్టి మీ తోటి విద్యార్థులు, పొరుగువారు, బంధువులు కలవర​పడవచ్చు. మీరు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని వారు మిమ్మల్ని అడగవచ్చు లేదా మీ నమ్మకాల గురించి ప్రశ్నించవచ్చు. వాటికి మీరెలా జవాబిస్తారు? మీరు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో వివరించే ముందు మీ ఆలోచనలను, భావాలను మీరు విశ్లేషించి చూసుకోవాలి. మీ నమ్మకాల గురించి అడగబడిన ప్రశ్నలకు జవాబిచ్చే విషయంలో యేసును మించిన ఆదర్శవంతులు మరెవ్వరూ లేరు.

11 యూదా మతనాయకులు పునరుత్థానం గురించి అడిగిన ప్రశ్నకు యేసు, వారంతవరకు పరిగణలోకి తీసుకోని ఒక లేఖనాన్ని గురించి వారికి చెప్పాడు. (నిర్గ. 3:⁠6; మత్త. 22:​23, 31-33) ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఒక శాస్త్రి అడిగినదానికి జవాబుగా యేసు తగిన బైబిలు వచనాలను పేర్కొన్నాడు. దానికి ఆ వ్యక్తి యేసుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. (లేవీ. 19:​18; ద్వితీ. 6:⁠5; మార్కు 12:​28-34) యేసు లేఖనాలను ఉపయోగించడం, ఆయన మాట తీరు “జనసమూహములో భేదము” పుట్టించింది, వ్యతిరేకులు ఆయనకు ఏ హానీ కలిగించలేకపోయారు. (యోహా. 7:​32-46) మీ విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలకు బైబిలు నుండే జవాబులు ఇవ్వండి, అలా ఇస్తున్నప్పుడు ‘సాత్వికముతో భయముతో [“ప్రగాఢ గౌరవముతో,” NW]’ మాట్లాడండి. (1 పేతు. 3:​15) ఏదైనా ప్రశ్నకు మీకు జవాబు తెలియకపోతే, ఆ విషయాన్ని ఒప్పుకొని, పరిశోధన చేసి ఆ ప్రశ్నకు జవాబిస్తానని చెప్పండి. తర్వాత, ఆ అంశంపై మీకు తెలిసిన భాషలో లభ్యమైతే వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లోగానీ, సీడీ-రామ్‌లోని వాచ్‌టవర్‌ లైబ్రరీలోగానీ పరిశోధన చేయండి. చక్కగా సిద్ధపడితే, ‘ఏలాగు ప్రత్యుత్తరమివ్వాలో మీకు తెలుస్తుంది.’​—⁠కొలొ. 4:⁠6.

12 దేవుణ్ణి సేవించాలనే మీ నిర్ణయం, నమ్మకాల విషయంలో ప్రజలు మిమ్మల్ని కేవలం ప్రశ్నలతోనే విడిచిపెట్టరు. దేవుని శత్రువైన అపవాదియగు సాతాను ఈ లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడని మనకు తెలుసు. (1 యోహాను 5:​19 చదవండి.) ప్రతీఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటారనో, ఆమోదిస్తారనో అనుకోవడం పొరపాటు. మీకు వ్యతిరేకత ఎదురుకావచ్చు. కొందరు మిమ్మల్ని పదేపదే ‘దూషించవచ్చు.’ (1 పేతు. 4:⁠4) అయితే మీరు ఒంటరివారు కాదని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు కూడా హింసను అనుభవించాడు. అపొస్తలుడైన పేతురు కూడా హింసను అనుభవించాడు, అందుకే ఆయనిలా రాశాడు: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. . . . క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.”​—⁠1 పేతు. 4:​12, 13.

13 క్రైస్తవునిగా హింసను లేదా వ్యతిరేకతను సహించడం ఆనందించదగ్గ విషయం. ఎందుకు? ఎందుకంటే లోకం మిమ్మల్ని అభిమానించడం, మీరు దేవుని ప్రమాణాలకు తగ్గట్టు కాదుగానీ సాతాను ప్రమాణాలకు తగ్గట్టు జీవిస్తున్నారని సూచిస్తుంది. యేసు ఇలా హెచ్చరించాడు: “మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వీరి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.” (లూకా 6:​26) మీరు యెహోవాను సేవించడం సాతానుకు, అతని లోకానికి గిట్టదని మీకు ఎదురయ్యే హింసనుబట్టి స్పష్టంగా తెలుసుకోవచ్చు. (మత్తయి 5:​11, 12 చదవండి.) “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల​పా[లవడం]” ఆనందించదగ్గ విషయం.​—⁠1 పేతు. 4:​14.

14 వ్యతిరేకత ఎదురైనా యెహోవాపట్ల మీరు నమ్మకంగా ఉంటే, దానివల్ల కనీసం నాలుగు సత్ఫలితాలు కలుగుతాయి. దేవుని గురించి ఆయన కుమారుని గురించి మీరు సాక్ష్యమిచ్చిన వారిగావుంటారు. మీరు చూపించే విశ్వాసం, సహనం మీ క్రైస్తవ సహోదర సహోదరీలను ప్రోత్సహిస్తాయి. మిమ్మల్ని గమనిస్తున్నవారిలో యెహోవా గురించి తెలియని కొందరు ఆయన గురించి తెలుసుకోవడానికి పురికొల్పబడవచ్చు. (ఫిలిప్పీయులు 1:​12-14 చదవండి.) పరీక్షలను సహించే శక్తిని యెహోవా ఎలా అనుగ్రహిస్తున్నాడో మీరు చవిచూస్తుండగా, ఆయనపట్ల మీ ప్రేమ మరింత అధికమౌతుంది.

“గొప్ప అవకాశం” మీ ముందుంది

15 అపొస్తలుడైన పౌలు ఎఫెసులో తాను చేసిన పరిచర్య గురించి ఇలా రాశాడు: “ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది.” (1 కొరిం. 16:​8, 9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అది ఆ పట్టణంలో విస్తృతంగా సువార్త ప్రకటించి, శిష్యులను చేయడానికి లభించిన గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పౌలు యెహోవాను గురించి తెలుసుకోవడానికి, ఆయనను ఆరాధించడానికి చాలామందికి సహాయం చేశాడు.

16 మహిమపర్చబడిన యేసుక్రీస్తు 1919లో అభిషిక్త శేషానికి అవకాశమనే ‘తలుపును’ తెరిచాడు. (ప్రక. 3:⁠8) వారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అంకితభావంతో, ముందెప్పుడూ లేనంతగా సువార్తను ప్రకటిస్తూ, బైబిలు సత్యాన్ని బోధించడం ఆరంభించారు. వారి పరిచర్యకు ఎలాంటి ఫలితం లభించింది? సువార్త ఇప్పుడు భూదిగంతముల వరకు ప్రకటించబడుతోంది, దాదాపు 70 లక్షలమందికి దేవుని నూతనలోకంలో నిత్యమూ జీవించే నిరీక్షణ ఉంది.

17 నేడు కూడా యెహోవా సేవకులకు ‘ఫలవంతమైన కార్యాలు చేసే గొప్ప అవకాశం’ ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నవారు, సువార్తను మరింత ఎక్కువగా ప్రకటిస్తున్న కొద్దీ ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. యెహోవాను సేవించే యౌవనులారా, ‘సువార్తను నమ్మేలా’ ఇతరులకు సహాయంచేసే సాటిలేని ఈ అవకాశాన్ని మీరెంత విలువైనదిగా పరిగణిస్తున్నారు? (మార్కు 1:​14, 15) క్రమ పయినీరుగా లేదా సహాయ పయినీరుగా సేవ చేయడం గురించి ఆలోచించారా? రాజ్యమందిర నిర్మాణం, బెతెల్‌ సేవ, మిషనరీ క్షేత్రంలాంటి ఇతర అవకాశాలూ మీకు అందుబాటులో ఉండేవుంటాయి. సాతాను లోకానికి సమయం దగ్గరపడింది కాబట్టి రాజ్య​సేవకు సంబంధించిన ఈ రంగాల్లో సేవచేయాల్సిన అవసరం రోజురోజుకూ మరింత ఎక్కువవుతోంది. ఇంకా సమయం ఉండగానే మీరు ఈ ‘గొప్ప అవకాశాన్ని’ ఉపయోగించుకుంటారా?

“యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి”

18 “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి” అని ప్రేరేపిత కీర్తనకారుడు ఇతరులను ప్రోత్సహించాడు. (కీర్త. 34:⁠8) ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు గొల్లపిల్లవానిగా ఉన్నప్పుడు, యెహోవా ఆయనను క్రూరమృగాల బారినుండి కాపాడాడు. గొల్యాతుతో పోరాడినప్పుడు దేవుడాయనకు మద్దతిచ్చాడు, ఇంకా అనేక ఇతర అపాయాల నుండి ఆయనను రక్షించాడు. (1 సమూ. 17:​32-51; కీర్త. 18, పైవిలాసము) దేవుని మహా కృపనుబట్టి దావీదు ఇలా రాసేందుకు పురికొల్పబడ్డాడు: “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.”​—⁠కీర్త. 40:⁠5.

19 యెహోవాపట్ల తనకున్న ప్రేమ అధికమవడమే కాక, తాను దేవుణ్ణి పూర్ణహృదయంతో, పూర్ణమనసుతో స్తుతించాలని కూడా దావీదు కోరుకున్నాడు. (కీర్తన 40:​8-10 చదవండి.) సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ, సత్య​దేవుని ఆరాధనలో తన జీవితాన్ని గడుపుతున్నందుకు దావీదు ఎన్నడూ విచారపడలేదు. భక్తిప్రదంగా జీవించడాన్ని ఆయన అత్యంత ప్రియమైనదిగా ఎంచాడు, ఆయన​కది ఎంతో ఆనందాన్నిచ్చింది. దావీదు తన వృద్ధాప్యంలో ఇలా అన్నాడు: ‘నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణా​స్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. దేవా తల నెరసి వృద్ధుడనైయుండువరకు నన్ను విడువకుము.’ (కీర్త. 71:​5, 18) శరీరం బలహీనమవుతున్నా, దావీదుకు యెహోవాపై ఉన్న నమ్మకం, ఆయనతో ఉన్న స్నేహం మాత్రం అంతకంతకూ బలపడుతూనే వచ్చాయి.

20 యెహోషువ, దావీదు, తిమోతిల జీవితాలు, యెహోవాను సేవిస్తూ జీవించడమే అత్యంత శ్రేష్ఠమైన జీవితమని బలంగా రుజువు చేస్తున్నాయి. ఈ లోకంలో ఉద్యోగ​పరంగా లభించే తాత్కాలిక వస్తుసంపద ‘మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో యెహోవాను సేవించడం’ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఏ మాత్రం సాటిరావు. (యెహో. 22:⁠5) మీరు ఇప్పటికీ ప్రార్థనలో యెహోవాకు సమర్పించు​కోనివారైతే, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించు​కోండి, ‘నేను యెహోవాసాక్షిని కాకుండా నాకు ఏది ఆటంకం కలిగిస్తోంది?’ ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకున్న యెహోవా ఆరాధకులైతే, జీవితంలో మీ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే దేవుని సేవను ఇంకా ఎక్కువగాచేస్తూ, క్రైస్తవునిగా ఎదుగుతూ ఉండండి. అపొస్తలుడైన పౌలు మాదిరిని అనుస​రిస్తూ మీరెలా క్రైస్తవులుగా ఎదగవచ్చో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

మీరెలా జవాబిస్తారు?

• మనం దేవుణ్ణి సేవించడానికిగల రెండు కారణాలను వివరించండి?

• దేవుణ్ణి సేవించాలనే నిర్ణయం తీసుకోవడానికి తిమోతికి ఏది సహాయం చేసింది?

• హింస అనుభవిస్తున్నా మీరెందుకు స్థిరంగా ఉండాలి?

• సేవచేసేందుకు ఎలాంటి అవకాశాలు మీకు అందుబాటులో ఉన్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా తన యౌవన సాక్షుల సేవను ఎలా పరిగణిస్తాడు?

2. యౌవనులకు నేడు తమ భవిష్యత్తు విషయంలో ప్రపంచం నుండి ఎలాంటి ఒత్తిడి ఉంది?

3. యెహోవా సృష్టి మనమేమి చేసేలా పురికొల్పుతుంది?

4, 5. యెహోవా చేసిన ఏ కార్యాలవల్ల యెహోషువ ఆయనకు సన్నిహితుడయ్యాడు?

6. దేవుణ్ణి సేవించాలనే కోరికను మీరెలా పెంపొందించుకోవచ్చు?

7. నీటి బాప్తిస్మం తీసుకోవడమెందుకు ప్రాముఖ్యం?

8. తిమోతి దేవుణ్ణి ఆరాధించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు, మీరేమి చేయవచ్చు?

9. మీరు బాప్తిస్మం తీసుకోవడం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

10, 11. (ఎ) దేవుణ్ణి సేవించాలనే మీ నిర్ణయాన్ని గురించి ప్రజలు ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? (బి) సత్యారాధనకు సంబంధించిన ప్రశ్నలకు యేసు జవాబిచ్చిన తీరునుండి మీరేమి నేర్చుకోవచ్చు?

12. హింస ఎదురైనప్పుడు మీరెందుకు నిరుత్సాహపడకూడదు?

13. హింసించబడుతున్నప్పుడు కూడా క్రైస్తవులు ఎందుకు ఆనందించ​వచ్చు?

14. హింసను ఎదుర్కొంటూ కూడా ఒకవ్యక్తి యెహోవాపట్ల నమ్మకంగా ఉంటే ఏ సత్ఫలితాలు కలుగుతాయి?

15. అపొస్తలుడైన పౌలుకు ఏ “గొప్ప అవకాశం” లభించింది?

16. అభిషిక్త శేషము 1919లో తమకు లభించిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంది?

17. ‘ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికున్న గొప్ప అవకాశాన్ని’ మీరెలా ఉపయోగించుకోవచ్చు?

18, 19. (ఎ) యెహోవాను సేవించాలనే బలమైన కోరిక కలిగివుండేందుకు దావీదుకు ఏది సహాయం చేసింది? (బి) దేవుణ్ణి సేవించే విషయంలో దావీదు ఎన్నడూ విచారించలేదని ఏది చూపిస్తోంది?

20. దేవుణ్ణి సేవిస్తూ జీవించడమే ఎందుకు అత్యంత శ్రేష్ఠమైన జీవితం?

[18వ పేజీలోని చిత్రం]

యెహోవాను సేవిస్తూ జీవించడమే అత్యంత శ్రేష్ఠమైన జీవితం

[19వ పేజీలోని చిత్రం]

మీ విశ్వాసాన్ని గురించిన ప్రశ్నలకు మీరు జవాబివ్వగలరా?