కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తెలివైన పరిష్కారం

తెలివైన పరిష్కారం

తెలివైన పరిష్కారం

మధ్య ఆఫ్రికాలో ఉన్న ముగ్గురు యౌవనస్థులు తమ ప్రాంతంలో జరుగుతున్న జిల్లా సమావేశానికి వెళ్లాలనుకున్నారు. అయితే వారక్కడికి ఎలా వెళ్లారు? వారక్కడికి వెళ్లాలంటే గతుకుల మట్టిరోడ్డుమీద 90 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, అక్కడికి చేరుకోవడానికి వారికి ఎలాంటి ప్రయాణసౌకర్యం లేదు. ఎవరినైనా అడిగి మూడు సైకిళ్లు సంపాదించుకోవాలని వారు అనుకున్నారు కానీ, వారికి సరైనవి దొరకలేదు.

స్థానిక సంఘంలో ఉన్న ఒక పెద్ద వారి దీనావస్థను గమనించి తన సైకిలు ఇవ్వడానికి ముందుకొచ్చాడు, ఆ సైకిలు పాతదే అయినా బాగా పనిచేస్తుంది. ఆ పెద్ద, తనతోపాటు మరికొందరు గతంలో ఒక సమావేశానికి ఎలా వెళ్లగలిగారో వివరించాడు. ఆ ముగ్గురూ ఒకే సైకిలు ఉపయోగించి సమావేశానికి వెళ్లే ఉపాయాన్ని ఆయన చెప్పాడు. అది సులువైన పరిష్కారమే అయినా, దానిని పాటించడం అంత సులువేమీ కాదు. ఒకే సైకిలును ఉపయోగించుకుంటూ ముగ్గురూ ఎలా వెళ్లగలరు?

ఎండ బారినపడకుండా ఉండేందుకు ఆ యువసహోదరులు ఉదయాన్నే కలుసుకొని తమ సామాన్లను సైకిలుమీద పెట్టుకున్నారు. మొదట, ఒక సహోదరుడు సైకిలుమీద బయలుదేరాడు, మిగతా ఇద్దరు వడివడిగా నడుచుకుంటూ ఆయన వెనకాలే బయలుదేరారు. సైకిలుమీద వెళ్తున్న వ్యక్తి అర కిలోమీటరు పైనే వెళ్లిన తర్వాత సామాన్లు ఉన్న ఆ సైకిలును ఆపి దానిని ఒక చెట్టుకు ఆనించాడు. ఎవరూ సైకిలును “దొంగిలించకుండా” ఉండేందుకు, దానిని మిగతా ఇద్దరికి కనిపించేలా పెట్టి, తాను నడవడం ప్రారంభించాడు.

మిగతా ఇద్దరు సైకిలు దగ్గరికి చేరుకున్న తర్వాత, ఒక సహోదరుడు దానిని తొక్కుకుంటూ వెళ్లాడు, ఇంకొక సహోదరుడు అర కిలోమీటరు పైన అంటే తన వంతు వచ్చేంతవరకూ నడుచుకుంటూ వెళ్లాడు. ఆ ముగ్గురూ చక్కని ఏర్పాట్లతో కృతనిశ్చయంతో తాము నడిచే దూరాన్ని 90 కిలోమీటర్ల నుండి దాదాపు 60 కిలోమీటర్లకు తగ్గించుకోగలిగారు. వారి కష్టానికి తగిన ఫలితం లభించింది. సమావేశంలో వారు తమ క్రైస్తవ సహోదరసహోదరీలను కలుసుకొని, ఆధ్యాత్మిక విందును ఆస్వాదించారు. (ద్వితీ. 31:​12) ఈ సంవత్సరం, మీ ప్రాంతంలో జరిగే జిల్లా సమావేశానికి హాజరవడానికి మీరు కూడా శాయశక్తులా కృషి చేస్తారా?