కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (రోమా. 11:​26) ఏదో ఒక కాలంలో యూదులందరూ క్రైస్తవులౌతారనే ఉద్దేశంతో ఆయనలా అన్నాడా?

లేదు, పౌలు ఆ ఉద్దేశంతో అలా అనలేదు. ఒక జనాంగంగా, అబ్రాహాము వంశస్థులు యేసును మెస్సీయగా తృణీకరించారు. యూదులు సామూహికంగా క్రైస్తవులుగా మారరని యేసు మరణించిన తర్వాతి సంవత్సరాల్లో స్పష్టమైంది. అయినప్పటికీ, “ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు” అని పౌలు చెప్పిన మాట సరైనదే. ఎలా?

యేసు తన కాలంలోని యూదా మత నాయకులతో ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” (మత్త. 21:​43) ఇశ్రాయేలు జనాంగం ఒక గుంపుగా యేసును తృణీకరించింది కాబట్టి, యెహోవా ఒక క్రొత్త జనాంగాన్ని, అంటే ఆధ్యాత్మిక జనాంగాన్ని ఏర్పరచుకుంటాడు. పౌలు ఈ జనాంగాన్ని “దేవుని ఇశ్రాయేలు” అని పిలిచాడు.​—⁠గల. 6:​16.

ఆ “దేవుని ఇశ్రాయేలు” ఆత్మాభిషిక్త క్రైస్తవులైన ​1,44,000 మందితో ఏర్పడిందని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని ఇతర వచనాలు రుజువు చేస్తున్నాయి. (రోమా. 8:​15-17; ప్రక. 7:⁠4) ఈ గుంపులో యూదేతరులు ఉంటారని ప్రకటన 5:⁠9, 10 వచనాలు ధ్రువీకరిస్తున్నాయి, అభిషిక్త క్రైస్తవులు ‘ప్రతి వంశములోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలోనుండి, ప్రతి ప్రజలోనుండి, ప్రతి జనములోనుండి,’ వస్తారని ఆ వచనాలు తెలియజేస్తున్నాయి. ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని సభ్యులు ‘ఒక రాజ్యముగాను యాజకులుగాను’ ఉండడానికి ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డారు, వారు రాజులుగా “భూలోకమందు ఏలుదురు.” యెహోవా ఇశ్రాయేలీయులను ఒక ప్రత్యేకమైన జనాంగంగా పరిగణించడం మానేసినప్పటికీ, వారిలో ఆయావ్యక్తులు ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అపొస్తలులతోపాటు, అనేకమంది ఇతర తొలి క్రైస్తవులు అలాగే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. అయితే, అలాంటి యూదులు ఇతర మానవుల్లాగే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడాలి.​—⁠1 తిమో. 2:​5, 6; హెబ్రీ. 2:⁠9; 1 పేతు. 1:​17-19.

మొదటి శతాబ్దంలోని అనేకమంది శారీరక యూదులు యేసుతోపాటు పరిపాలించే అవకాశాన్ని పోగొట్టుకున్నా, దేవుని సంకల్ప నెరవేర్పుకు ఏ ఆటంకం ఏర్పడలేదు. దేవుని సంకల్పం నెరవేరకుండా ఆపడం అసాధ్యం, ఎందుకంటే యెహోవా తన ప్రవక్త ద్వారా ఇలా తెలియజేశాడు: “ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైన​దాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము​చేయును.”​—⁠యెష. 55:​10, 11.

పరలోకంలో తన కుమారునితోపాటు పరిపాలించడానికి 1,44,000 మంది సహపాలకులను నియమించాలన్న దేవుని సంకల్పం కూడా తప్పక నెరవేరుతుంది. దేవుడు మొత్తం 1,44,000 మందినీ అభిషేకిస్తాడని బైబిలు స్పష్టం చేస్తోంది. వారందరూ అభిషేకించబడతారు!​—⁠ప్రక. 14:​1-5.

కాబట్టి, “ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు” అని పౌలు రాసినప్పుడు యూదులు సామూహికంగా క్రైస్తవులవుతారని ఆయన ప్రవచించలేదు. బదులుగా, తన కుమారుడైన యేసుక్రీస్తుతోపాటు పరలోకంలో 1,44,000 మంది ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు పరిపాలించాలన్న దేవుని సంకల్పం నేరవేరుతుందనేది ఆయన ఉద్దేశం. దేవుని నియమిత కాలంలో వారందరూ అంటే “ఇశ్రాయేలు జనులందరు” రక్షింపబడి, చివరకు మెస్సీయ రాజ్యంలో రాజులుగా పరిపాలించి, యాజకులుగా సేవచేస్తారు.​—⁠ఎఫె. 2:⁠8.

[28వ పేజీలోని చిత్రాలు]

అభిషిక్తులు ‘ప్రతి వంశములోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలోనుండి, ప్రతి ప్రజలోనుండి, ప్రతి జనములోనుండి,’ వస్తారు