కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన లక్షణాలు

మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన లక్షణాలు

మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన లక్షణాలు

“నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.” ​—⁠1 తిమో. 6:​11.

“సంపాదించుకొనుటకు ప్రయాసపడుము” అని అనువదించబడిన మూలభాషా పదానికి వెంటాడడం, తరమడం, అనుసరించడం, గురి వైపు పరుగెత్తడం అనే భావాలు కూడా ఉన్నాయి. ఈ పదాలు విన్నప్పుడు మీకు ఏమి గుర్తుకువస్తుంది? మోషే దినాల్లో ఐగుప్తు సైన్యాలు చివరకు ఎర్రసముద్రంలో నాశనమవడానికే ఇశ్రాయేలీయులను ‘తరమడం’ మీకు గుర్తుకురావచ్చు. (నిర్గ. 14:​23) లేదా ప్రాచీన ఇశ్రాయేలులో పొరపాటున హత్యచేసిన వ్యక్తికి ఎదురయ్యే ప్రమాదం మీకు గుర్తుకురావచ్చు. ఆయన ఆశ్రయపురాలుగా నియమించబడిన ఆరు పురాల్లో ఒకదానికి త్వరగా పారి​పోవాలి, అలా పారిపోకపోతే ‘ప్రతిహత్య చేయువాడు కోపముతో’ అతనిని “తరిమి” చంపవచ్చు.​—⁠ద్వితీ. 19:⁠6.

2 పైనున్న బైబిలు ఉదాహరణలకు భిన్నంగా, అపొస్తలుడైన పౌలుకు ఉన్న సానుకూల వైఖరిని గమనించండి: “క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.” (ఫిలి. 3:​14) పౌలుతోసహా 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులు పరలోక జీవితమనే ఆ బహుమానాన్ని పొందుతారని బైబిలు చెబుతోంది. వారు యేసుక్రీస్తుతోపాటు వెయ్యేండ్లు భూమిని పరిపాలిస్తారు. ఆ గురిని చేరుకునేందుకు ప్రయాసపడమని దేవుడు వారిని ప్రోత్సహిస్తున్నాడు. అది ఎంత అద్భుతమైన బహుమానమో! అయితే, నేడు చాలామంది నిజక్రైస్తవులకు వేరే నిరీక్షణ లేక వేరే గురి ఉంది. ఆదాముహవ్వలు కోల్పోయినదానిని అంటే పరదైసు భూమ్మీద పరిపూర్ణ ఆరోగ్యంతో నిత్యజీవాన్ని అనుభవించే నిరీక్షణను యెహోవా ప్రేమపూర్వకంగా వారి ముందుంచాడు.​—⁠ప్రక. 7:​4, 9; 21:​1-4.

3 పాపులైన మానవులు సరైనది చేసేందుకు ఎన్ని అపరిపూర్ణ ప్రయత్నాలు చేసినా నిత్యజీవాన్ని సంపాదించు​కోలేరు. (యెష. 64:⁠6) రక్షణ కోసం యెహోవా యేసుక్రీస్తు ద్వారా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటుమీద విశ్వాసముంచడం ద్వారానే వారు నిత్యజీవం పొందవచ్చు. దేవుడు కనబరచిన ఆ కృపపట్ల మన కృతజ్ఞతను చూపించడానికి మనమేమి చేయాలి? “నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము” అనే ఆజ్ఞకు మనం లోబడాలి. (1 తిమో. 6:​11) ఈ లక్షణాలను పరిశీలించడం, మనలో ప్రతీ ఒక్కరం వాటిని ‘మరింత ఎక్కువగా’ సంపాదించుకునేందుకు ప్రయాస​పడాలనే కృతనిశ్చయంతో ఉండేందుకు దోహదపడవచ్చు.​—⁠1 థెస్స. 4:⁠1, NW.

‘నీతిని సంపాదించుకొనుటకు ప్రయాసపడుము’

4 అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండు పత్రికల్లో, వారు సంపాదించుకోవడానికి ప్రయాసపడాల్సిన లక్షణాల గురించి చెప్పాడు. రెండు పత్రికల్లోనూ ఆయన “నీతిని” మొదట పేర్కొన్నాడు. (1 తిమో. 6:​11; 2 తిమో. 2:​22) అంతేకాక, నీతిని అనుసరించమని బైబిల్లోని ఇతర లేఖనాల్లో పదేపదే ప్రోత్సహించబడింది. (సామె. 15:⁠9; 21:​21; యెష. 51:⁠1) ‘సత్యదేవుని గురించిన ఆయన పంపిన యేసుక్రీస్తు’ గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా మనం నీతిని అనుసరించవచ్చు. (యోహా. 17:⁠3) అలా అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి దేవుని చిత్తం చేసేందుకు గత పాపాల విషయంలో పశ్చాత్తాపపడి “మారుమనస్సు” పొందేలా చర్య తీసుకోవచ్చు.​—⁠అపొ. 3:​20.

5 నీతిని అనుసరించడానికి నిజాయితీగా కృషిచేస్తున్న లక్షలాదిమంది, యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకొని దానికి సూచనగా నీటి బాప్తిస్మం తీసుకున్నారు. ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులైతే, మీరు బహుశా నీతిని అనుసరిస్తుండవచ్చు, మీరు నీతిని అనుసరించడానికి ఎల్లప్పుడూ కృషిచేస్తున్నారని చూపించే విధంగా మీ జీవిత విధానం ఉందో లేదో పరిశీలించుకున్నారా? అలా పరిశీలించుకోవాలంటే, మీరు నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు బైబిలు ప్రకారం ‘మేలు కీడులను’ లేదా మంచి చెడులను వివేచించాలి. (హెబ్రీయులు 5:⁠14 చదవండి.) ఉదాహరణకు, మీరు పెళ్లీడుకొచ్చిన అవివాహిత క్రైస్తవులైతే, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవునిగా లేదా క్రైస్తవురాలిగా ప్రగతిసాధించని వ్యక్తితో ప్రేమలో పడకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారా? మీరు నీతిని అనుసరిస్తున్నట్లయితే, అలాంటి కృతనిశ్చయంతోనే ఉన్నారు.​—⁠1 కొరిం. 7:​39.

6 నీతిని అనుసరించడానికీ ‘అధికముగా నీతిమంతులుగా’ లేదా స్వనీతిపరులుగా ఉండడానికీ మధ్య తేడా ఉంది. (ప్రసం. 7:​16) ఇతరులకన్నా తామే ఉత్తములం అన్నట్లు కనిపించేలా మనుష్యుల ఎదుట అలాంటి నీతిని ప్రదర్శించవద్దని యేసు హెచ్చరించాడు. (మత్త. 6:⁠1) మనం యథార్థంగా నీతిని అనుసరించాలంటే తప్పుడు ఆలోచనలను, దృక్పథాలను, ఉద్దేశాలను, కోరికలను సరిచేసుకోవడం ద్వారా హృదయాన్ని కాపాడుకోవాలి. మనం అలా కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటే మనం గంభీరమైన పాపాలు చేసే అవకాశం తక్కువ. (సామెతలు 4:⁠23 చదవండి; యాకోబు 1:14, 15 పోల్చండి.) అంతేకాక, యెహోవా మనల్ని ఆశీర్వదించి, ప్రాముఖ్యమైన ఇతర క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకోవడానికి మనకు సహాయం చేస్తాడు.

‘భక్తిని సంపాదించుకొనుటకు ప్రయాసపడుము’

7 భక్తి కలిగివుండడమంటే సంపూర్ణంగా సమర్పించుకోవడం, విశ్వసనీయంగా ఉండడం అని అర్థం. “దైవభక్తి” అని అనువదించబడిన గ్రీకు పదం, “దేవునిపట్ల మనకున్న పూజ్యభావాన్ని బలహీనపర్చడానికి దేనినీ అనుమతించకూడదనే మంచి దృక్పథాన్ని” సూచిస్తుందని ఒక బైబిలు నిఘంటువు వివరిస్తోంది. ఇశ్రాయేలీయులు అలాంటి దైవభక్తిని చూపించడంలో ఎన్నోసార్లు విఫలమయ్యారనే విషయం దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత కూడా వారు చేసిన అవిధేయ క్రియలనుబట్టి తెలుస్తుంది.

8 పరిపూర్ణ మానవుడైన ఆదాము పాపం చేసిన అనేక వేల సంవత్సరాల తర్వాత కూడా ‘మానవులెవరైనా పరిపూర్ణ దైవభక్తి కనబరచగలరా?’ అనే ప్రశ్నకు జవాబు దొరకలేదు. ఆ తర్వాతి శతాబ్దాల్లో, పాపులైన మానవులెవ్వరూ పరిపూర్ణ దైవభక్తిని కనబరచలేకపోయారు. అయితే, యెహోవా తన నియమిత సమయంలో ఈ ‘మర్మానికి’ జవాబు తెలియజేశాడు. యెహోవా, పరలోకంలో ఉన్న తన అద్వితీయ కుమారుడు పరిపూర్ణ మానవునిగా జన్మించేలా, ఆయన జీవాన్ని మరియ గర్భంలోకి మార్చాడు. యేసు అవమానకరంగా చంపబడుతున్నప్పుడే కాక తన భూజీవితమంతటిలోనూ సత్యదేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడమంటే ఏమిటో, సంపూర్ణ విశ్వసనీయత కనబరచడమంటే ఏమిటో చూపించాడు. ప్రేమగల తన పరలోక తండ్రిపట్ల ఆయనకు పూజ్యభావం ఉందని ఆయన ప్రార్థనలనుబట్టి తెలుస్తుంది. (మత్త. 11:​25; యోహా. 12:​27, 28) అందుకే, యేసు కనబరచిన ఆదర్శవంతమైన జీవిత విధానం గురించి వర్ణిస్తున్నప్పుడు “దైవభక్తి” అనే మాటను ఉపయోగించేలా యెహోవా పౌలును ప్రేరేపించాడు.​—⁠1 తిమోతి 3:​16 చదవండి.

9 మనం పాపులం కాబట్టి, మనం పరిపూర్ణ దైవభక్తిని కనబరచలేం. కానీ మనం దానిని పెంపొందించుకోవడానికి ప్రయాసపడవచ్చు. అలా ప్రయాసపడాలంటే మనం క్రీస్తు మాదిరిని సాధ్యమైనంత సంపూర్ణంగా అనుసరించాలి. (1 పేతు. 2:​21) ఆయనను అనుసరిస్తే మనం వేషధారుల్లా ప్రవర్తించం, ఆ వేషధారులు “పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించరు.” (2 తిమో. 3:⁠5) అలాగని నిజమైన దైవభక్తి పైకి కనిపించదని కాదు. నిజమైన దైవభక్తిలో పైకి కనిపించేవి కూడా ఉంటాయి. ఉదాహరణకు, మనం పెళ్లిబట్టలు లేక షాపింగ్‌కు వేసుకునే బట్టలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు, మనం కనిపించే తీరు ఎల్లప్పుడూ “దైవభక్తిగలవారమని” మనం చెప్పుకుంటున్నదానికి తగిని విధంగా ఉండేలా చూసుకోవాలి. (1 తిమో. 2:​9, 10) అవును, మనం దైవభక్తిని కనబరచాలంటే మన అనుదిన జీవితంలో దేవుని నీతియుక్త ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలి.

‘విశ్వాసమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము’

10రోమీయులు 10:​17 చదవండి. బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకొని దాన్ని కాపాడుకోవడానికి ఒక క్రైస్తవుడు దేవుని వాక్యంలోని అమూల్యమైన సత్యాలను ధ్యానిస్తూ ఉండాలి. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతి అనేక చక్కని ప్రచురణలను ప్రచురించింది. వాటిలో జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం), ‘వచ్చి నన్ను అనుసరించండి’ అనే పుస్తకాలు విశేషమైనవి. క్రీస్తు గురించి మనం బాగా తెలుసుకొని ఆయనను అనుకరించడానికి సహాయం చేసేలా ఈ పుస్తకాలు రూపొందించబడ్డాయి. (మత్త. 24:​45-47) దాసుని తరగతి కూటాలను, సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తోంది, వాటిలో అనేక కార్యక్రమాలు “క్రీస్తును గూర్చిన మాట”ను ప్రాముఖ్యంగా వివరిస్తాయి. మీరు దేవుడు ఇస్తున్నవాటిపట్ల ‘మరి ఎక్కువ శ్రద్ధ వహిస్తూ,’ దాసుని తరగతి చేస్తున్న ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించారా?​—⁠హెబ్రీ. 2:⁠1, పవిత్ర గ్రంథం వ్యాఖ్యానసహితం.

11 విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు ప్రార్థన కూడా సహాయం చేస్తుంది. యేసు అనుచరులు ఒకసారి ఆయనను ఇలా ప్రాధేయపడ్డారు: “మా విశ్వాసము వృద్ధిపొందించుము.” మనం కూడా దేవుణ్ణి వినయంగా అలా ప్రాధేయపడవచ్చు. (లూకా 17:⁠5) మన విశ్వాసాన్ని వృద్ధిచేసుకునేందుకు మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించాలి. ‘ఆత్మ ఫలంలో’ విశ్వాసం ఒక అంశం. (గల. 5:​22) అంతేకాక, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తే మన విశ్వాసం బలపడుతుంది. ఉదాహరణకు, మనం ప్రకటనా పనిలో ఎక్కువగా పాల్గొనడానికి కృషిచేయవచ్చు. అలా చేస్తే మనం ఎంతో సంతోషాన్ని పొందుతాం. మనం ‘దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట వెదకడం’ ద్వారా వచ్చే ఆశీర్వాదాల గురించి ఆలోచించేకొద్దీ మన విశ్వాసం బలపడుతుంది.​—⁠మత్త. 6:​33.

‘ప్రేమను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము’

12మొదటి తిమోతి 5:1, 2 చదవండి. క్రైస్తవులు ఒకరిపట్ల ఒకరు ఎలా ప్రేమ చూపించవచ్చనే విషయంలో పౌలు ఆచరించదగ్గ సలహా ఇచ్చాడు. యేసు, తాను మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా మనం ‘ఒకరినొకరం ప్రేమించుకోవాలి’ అనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. మనం దైవభక్తి కలిగివుండాలంటే, ఆ ఆజ్ఞకు లోబడాలి. (యోహా. 13:​34) అపొస్తలుడైన యోహాను సూటిగా ఇలా అడిగాడు: “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” (1 యోహా. 3:​17) మీరు ప్రేమను ఆచరణాత్మకమైన రీతిలో కనబరచిన సందర్భాలను గుర్తుచేసుకోగలరా?

13 మనం మన సహోదరుపలపట్ల ద్వేషాన్ని పెంచుకునే బదులు వారిని క్షమించడం ద్వారా కూడా ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడవచ్చు. (1 యోహాను 4:​20 చదవండి.) మనం దైవప్రేరణతో ఇవ్వబడిన ఈ ఉపదేశాన్ని అనుసరించాలని కోరుకుంటాం: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొ. 3:​13) ఈ సలహాను మీరు సంఘంలో ఎవరి విషయంలోనైనా పాటించాల్సి ఉందా? మీరు ఆ వ్యక్తిని క్షమిస్తారా?

‘ఓర్పును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము’

14 స్వల్పకాల లక్ష్యాన్ని సాధించడం ఒక ఎత్తయితే, కష్టమైన లక్ష్యాన్ని సాధించడం లేదా మనం అనుకున్నదానికన్నా ఎక్కువకాలం పట్టే లక్ష్యాన్ని సాధించడం మరొక ఎత్తు. నిత్యజీవం పొందడమనే లక్ష్యాన్ని సాధించడానికి ఓర్పు అవసరమన్నది సుస్పష్టం. ‘నీవు ఓర్పు విషయమైన నా వాక్యమును గైకొంటివి గనుక రాబోవు శోధనకాలములో నేనును నిన్ను కాపాడెదను’ అని ప్రభువైన యేసు ఫిలదెల్ఫియలో ఉన్న సంఘానికి చెప్పాడు. (ప్రక. 3:10) నిజానికి యేసు, ఓర్పు ఎంత అవసరమో బోధించాడు. మనం పరీక్షలను, శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు నిరుత్సాహపడకుండా ఉండేందుకు ఆ లక్షణం మనకు సహాయం చేస్తుంది. మొదటి శతాబ్దపు ఫిలదెల్ఫియలో ఉన్న సంఘంలోని సహోదరులు తమ విశ్వాసం పరీక్షించబడిన అనేక సందర్భాల్లో విశేషమైన ఓర్పును కనబరచివుండవచ్చు. అందుకే, వారు ఎదుర్కోబోయే కఠినమైన పరీక్షా సమయంలో కూడా తాను సహాయం చేస్తానని యేసు వారికి హామీ ఇచ్చాడు.​—⁠లూకా 16:​10.

15 తన అనుచరులను వారి అవిశ్వాసులైన బంధువులు, లోకంలోనివారు ద్వేషిస్తారని యేసుకు తెలుసు కాబట్టి, ఆయన కనీసం రెండు సందర్భాల్లో వారిని ఇలా ప్రోత్సహించాడు: “అంతమువరకును సహించినవాడు రక్షింపబడును.” (మత్త. 10:​22; 24:​13) ఆ సమయంలో సహించడానికి కావాల్సిన శక్తిని తన శిష్యులు ఎలా పొందవచ్చో కూడా యేసు చూపించాడు. ఆయన ఒకానొక ఉపమానంలో, ‘దేవుని వాక్యమును సంతోషముగా అంగీకరించినా’ విశ్వాస పరీక్షలు ఎదురైనప్పుడు విశ్వాసం నుండి తొలగిపోయే వారిని రాతినేలతో పోల్చాడు. అయితే, ఆయన తన నమ్మకమైన అనుచరులను మంచి నేలతో పోల్చాడు, వారు దేవుని వాక్యంలో చదివినదానిని ‘అవలంభించి ఓపికతో ఫలిస్తారు.’​—⁠లూకా 8:​13, 15.

16 మనం శ్రమలను సహించడానికి ఏమి చేయాలో గమనించారా? మనం దేవుని వాక్యంలో చదివినదానిని ‘అవలంభించి’ దానిని మన హృదయాల్లో, మనసుల్లో సజీవంగా ఉంచుకోవాలి. పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము అనేక భాషల్లో లభ్యమౌతోంది కాబట్టి, అలా చేయడం సులభమే. అది అసాధ్యమేమీ కాదు. ఆ అనువాదం ఖచ్చితమైనది, సులభంగా చదవగలిగే రీతిలో అనువదించబడింది. మనం ప్రతీరోజు దేవుని వాక్యంలోని ఒక భాగాన్ని ధ్యానిస్తే, మనం ‘ఓపికతో’ ఫలిస్తూ ఉండడానికి కావాల్సిన శక్తిని పొందగలుగుతాం.​—⁠కీర్త. 1:1, 2.

సమాధానాన్ని, “సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము”

17 నిందలపాలవడం ఎవరికీ ఇష్టముండదు. అన్యాయంగా విమర్శించబడినప్పుడు మానవులు సాధారణంగా దానిని కోపంతో తిరస్కరిస్తారు. కానీ, ‘సాత్వికాన్ని’ కనబరచడం ఎంత మేలో కదా! (సామెతలు 15:1 చదవండి.) అన్యాయంగా విమర్శించబడినప్పుడు మృదువుగా మాట్లాడడానికి ఎంతో మనోబలం అవసరం. ఈ విషయంలో యేసుక్రీస్తు పరిపూర్ణమైన మాదిరిని ఉంచాడు. “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” (1 పేతు. 2:​23) యేసు సాత్వికాన్ని కనబరచినంత చక్కగా మనం కనబరచలేకపోవచ్చు, అయితే మనం సాత్వికాన్ని కనబరచడంలో ప్రగతి సాధించడానికి కృషి చేయవచ్చు కదా?

18 యేసును అనుకరిస్తూ, మనం మన నమ్మకాల విషయంలో “సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉం[దాం].” (1 పేతు. 3:​15) నిజమే, మన అభిప్రాయాలు మనం పరిచర్యలో కలుసుకునే వ్యక్తులకు, తోటి విశ్వాసులకు భిన్నంగా ఉన్న సందర్భాల్లో మనం సాత్వికాన్ని కనబరిస్తే తీవ్రమైన వాగ్వివాదాలు తలెత్తవు. (2 తిమో. 2:​24-26) సాత్వికంవల్ల మన మధ్య సమాధానం నెలకొంటుంది. బహుశా అందుకే పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో, ఇతర లక్షణాలతోపాటు “సమాధానమును” కూడా సంపాదించుకోవడానికి ప్రయాసపడమని పేర్కొన్నాడు. (2 తిమో. 2:22; 1 తిమోతి 6:⁠11 పోల్చండి.) అవును, మనం “సమాధానమును” కూడా సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి.​—⁠కీర్త. 34:​14; హెబ్రీ. 12:​14.

19 మనం నీతి, దైవభక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, సమాధానం వంటి ఏడు క్రైస్తవ లక్షణాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని ప్రోత్సహించబడ్డాం. వాటి గురించి మనం ఇప్పటివరకు క్లుప్తంగా పరిశీలించాం. ఈ అమూల్యమైన లక్షణాలను మరింత ఎక్కువగా ప్రదర్శించడానికి ప్రతీ సంఘంలోనూ సహోదరసహోదరీలు ప్రయాస​పడుతుంటే ఎంత బాగుంటుందో కదా! అది యెహోవాను ఘనపరుస్తుంది. అంతేకాక, ఆయన మనల్ని తనకు మహిమ కలిగే విధంగా మలచగలుగుతాడు.

ధ్యానించాల్సిన విషయాలు

నీతిని, దైవభక్తిని ప్రయాసపడి సంపాదించుకోవడానికి ఏమి చేయాలి?

విశ్వాసాన్ని, ఓర్పును ప్రయాసపడి సంపాదించుకోవడానికి ఏది మనకు సహాయం చేస్తుంది?

మనం ఒకరితో ఒకరం ప్రేమగా ఎలా వ్యవహరించాలి?

మనం సాత్వికాన్ని, సమాధానాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు ప్రయాసపడాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. “సంపాదించుకొనుటకు ప్రయాసపడుము” అని అనువదించబడిన మూలభాషా పదానికున్న భావాన్ని సోదాహరణంగా వివరించండి.

2. (ఎ) దేవుడు ఏ బహుమానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడమని కొంతమంది క్రైస్తవులను ప్రోత్సహించాడు? (బి) నేడు యెహోవా చాలామంది క్రైస్తవుల ముందు ఏ నిరీక్షణ ఉంచాడు?

3. దేవుడు కనబరచిన కృపపట్ల మనం కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

4. “నీతిని” అనుసరించడం ప్రాముఖ్యమని మనం ఎందుకు నమ్మవచ్చు, అలా అనుసరించడానికి ఒక వ్యక్తి మొదటిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

5. మనం దేవుని దృష్టిలో నీతిమంతులమనే పేరు సంపాదించుకొని, దాన్ని కాపాడుకునేందుకు ఏమి చేయాలి?

6. మనం యథార్థంగా నీతిని అనుసరించాలంటే ఏమి చేయాలి?

7. “దైవభక్తి” అంటే ఏమిటి?

8. (ఎ) ఆదాము పాపం చేయడంవల్ల ఏ ప్రశ్న ఉత్పన్నమైంది? (బి) ఈ ‘మర్మానికి’ జవాబు ఎలా తెలియజేయబడింది?

9. మనం దైవభక్తిని పెంపొందించుకోవడానికి ఎలా ప్రయాసపడవచ్చు?

10. మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకునేందుకు మనమేమి చేయాలి?

11. విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడడంలో ప్రార్థన, విధేయత ఏ పాత్రలు పోషిస్తాయి?

12, 13. (ఎ) యేసు ఏ కొత్త ఆజ్ఞ ఇచ్చాడు? (బి) ప్రాముఖ్యంగా ఏయే విధాలుగా మనం క్రీస్తులాంటి ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి?

14. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15. యేసు సహనం గురించి ఏమి బోధించాడు?

16. ప్రేమపూర్వకంగా ఇవ్వబడిన ఏ ఉపకరణం శ్రమలను సహించేందుకు లక్షలాదిమందికి సహాయం చేసింది?

17. (ఎ) “సాత్వికము” కనబరచడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? (బి) యేసు తాను సాత్వికుడనని ఎలా చూపించాడు?

18. (ఎ) సాత్వికంవల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? (బి) మనం ఏ లక్షణాన్ని కూడా సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని ప్రోత్సహించబడ్డాం?

19. ఏడు క్రైస్తవ లక్షణాలను పరిశీలించిన తర్వాత మీరు ఏమి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు, ఎందుకు?

[12వ పేజీలోని చిత్రం]

మనుష్యులను మెప్పించేందుకు స్వనీతిని ప్రదర్శించవద్దని యేసు హెచ్చరించాడు

[13వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యంలోని సత్యాలను ధ్యానించడం ద్వారా మనం విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడవచ్చు

[15వ పేజీలోని చిత్రం]

మనం ప్రేమను, సాత్వికాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడవచ్చు