కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం వేటినుండి పారిపోవాలి?

మనం వేటినుండి పారిపోవాలి?

మనం వేటినుండి పారిపోవాలి?

“సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు?”​—⁠మత్త. 3:⁠7.

‘పారిపోవడం’ అనే మాట విన్నప్పుడు మీకు ఏమి గుర్తుకొస్తుంది? పోతీఫరు భార్య అందంగా ఉన్న యౌవనస్థుడైన యోసేపుతో అనైతిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన అక్కడినుండి పారిపోవడం కొందరికి గుర్తుకురావచ్చు. (ఆది. 39:​7-12) “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు . . . యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను” అని యేసు ఇచ్చిన హెచ్చరికకు లోబడి, సా.శ. 66వ సంవత్సరంలో యెరూషలేము నుండి పారిపోయిన క్రైస్తవులు మరికొందరికి గుర్తుకురావచ్చు.​—⁠లూకా 21:​20, 21.

2 పైనున్న ఉదాహరణల్లోని వ్యక్తులు అక్షరార్థంగా పారిపోయారు. నేడు, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజక్రైస్తవులు సూచనార్థకంగా పారిపోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ‘తప్పించుకోవడం’ లేక పారిపోవడం అనే మాటను బాప్తిస్మమిచ్చు యోహాను ఆ ఉద్దేశంతోనే ఉపయోగించాడు. పశ్చాత్తాపపడాల్సిన అవసరంలేదని భావించిన స్వనీతిపరులైన యూదా మతనాయకులు కూడా ఆయనను చూడడానికి వచ్చారు. పశ్చాత్తాపానికి సూచనగా బాప్తిస్మం పొందుతున్న సామాన్య ప్రజలను వారు హీనంగా చూసేవారు. వేషధారులైన ఆ నాయకుల నిజ స్వరూపాన్ని యోహాను ధైర్యంగా ఇలా బయటపెట్టాడు: “సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.”​—⁠మత్త. 3:​7, 8.

3 యోహాను అక్షరార్థంగా పారిపోవడం గురించి చెప్పడంలేదు. ఆయన రాబోయే తీర్పు గురించి, ఉగ్రత దినం గురించి హెచ్చరించాడు; మతనాయకులు ఆ దినాన్ని తప్పించుకోవాలంటే వారు మారుమనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలని ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత, యేసు వారిని నిర్భయంగా ఖండించాడు. ఆ మతనాయకులు ఆయనను చంపాలనుకోవడం వారి నిజమైన తండ్రి అపవాది అని నిరూపించింది. (యోహా. 8:​44) యోహాను అంతకుముందు ఇచ్చిన హెచ్చరికను బలపరుస్తూ యేసు వారిని “సర్పసంతానమా” అని పిలిచాడు. అంతేకాక, ఆయన వారిని ఇలా అడిగాడు: “నరకశిక్షను [‘గెహెన్నా తీర్పును,’ NW] మీరేలాగు తప్పించుకొందురు?” (మత్త. 23:​33) యేసు ఏ ఉద్దేశంతో ‘గెహెన్నా’ అనే పదాన్ని ఉపయోగించాడు?

4 యెరూషలేము గోడ వెలుపల చెత్తాచెదారంతోపాటు జంతు మృతకళేబరాలు కాల్చివేయబడే లోయ ప్రాంతమే గెహెన్నా. యేసు గెహెన్నా అనే పదాన్ని నిత్యనాశనానికి సూచనగా ఉపయోగించాడు. (27వ పేజీ చూడండి.) గెహెన్నా తీర్పును తప్పించుకోవడం గురించి ఆయన అడిగిన ప్రశ్న, ఒక వర్గంగా ఆ మతనాయకులు నిత్యనాశనానికి తగినవారని చూపిస్తోంది.​—⁠మత్త. 5:​22, 29.

5 ఆ యూదా నాయకులు యేసును, ఆయన అనుచరులను హింసించి మరింత పాపాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత, యోహాను, యేసు హెచ్చరించినట్లే దేవుని ఉగ్రత​దినం రానే వచ్చింది. ఆ సమయంలో దేవుని “ఉగ్రత” యెరూషలేము, యూదా ప్రాంతాలనే ప్రభావితం చేసింది కాబట్టి, అక్షరార్థంగా పారిపోవడం ద్వారా దానిని తప్పించుకునే అవకాశం ఉంది. ఆ ఉగ్రత సా.శ. 70లో రోమా సైన్యాలు యెరూషలేమును, దానిలోవున్న దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు వచ్చింది. యెరూషలేము అప్పటి​వరకు అనుభవించిన శ్రమలన్నింటికన్నా ఈ “శ్రమ” ఎంతో తీవ్రమైనది. చాలామంది చంపబడ్డారు లేక చెరగాకొనిపోబడ్డారు. అనేకమంది నామకార్థ క్రైస్తవులమీదికి, ఇతర మతస్థులమీదికి రాబోయే గొప్ప నాశనాన్ని అది సూచించింది.​—⁠మత్త. 24:​21.

తప్పించుకోవాల్సిన దేవుని ఉగ్రత

6 తొలి క్రైస్తవుల్లో కొందరు మతభ్రష్టులుగా మారి అనుచరులను సంపాదించుకున్నారు. (అపొ. 20:​29, 30) యేసు అపొస్తలులు బ్రతికివున్నంతకాలం అలాంటి మతభ్రష్టత్వానికి ‘అడ్డంకిగా’ వ్యవహరించారు. అయితే వారు మరణించిన తర్వాత క్రైస్తవత్వంలో అనేక అబద్ధ తెగలు పుట్టుకొచ్చాయి. నేడు క్రైస్తవమతసామ్రాజ్యంలో ఒక​దానితో మరొకదానికి పొందికలేని వందలాది తెగలున్నాయి. క్రైస్తవమతసామ్రాజ్యంలో మతనాయకుల వర్గం పుట్టుకు​రావడం గురించి బైబిలు ప్రవచించింది. ఒక గుంపుగా వారిని “ధర్మవిరుద్ధ పురుషుడు,” “నాశనపుత్రుడు” అని అది వర్ణించింది. అంతేకాక, “యేసు . . . వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనముచేయును” అని కూడా అది తెలియజేసింది.​—⁠2 థెస్స. 2:​3, 6-8, అధఃస్సూచి.

7 క్రైస్తవమతసామ్రాజ్య నాయకులు బైబిలుకు విరుద్ధంగా ఉన్న బోధలను, సెలవు దినాలను, ప్రవర్తనను ప్రోత్సహించి లక్షలాదిమందిని తప్పుదారిపట్టించడం ద్వారా ధర్మ​విరుద్ధంగా ప్రవర్తించారు. యేసు ఖండించిన మతనాయకుల్లాగే ‘నాశనపుత్రుని’లో భాగంగా ఉన్న నేటి మతనాయకులు పునరుత్థాన నిరీక్షణలేని నాశనాన్ని పొందుతారు. (2 థెస్స. 1:​6-9) అయితే, క్రైస్తవమతసామ్రాజ్య నాయకుల ద్వారా, ఇతర అబద్ధ మతనాయకుల ద్వారా మోసగించబడిన ప్రజలకు ఏమౌతుంది? ఈ ప్రశ్నకు జవాబు కోసం, అంతకుముందు జరిగిన సంఘటనలను అంటే సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడిన తర్వాత జరిగిన సంఘటనలను మనం పరిశీలిద్దాం.

“బబులోనులోనుండి పారిపోవుడి”

8 యిర్మీయా ప్రవక్త సా.శ.పూ. 607లో జరిగిన యెరూషలేము నాశనం గురించి ప్రవచించాడు. దేవుని ప్రజలు చెరగా కొనిపోబడతారు గానీ వారు “డెబ్బది సంవత్సరముల” తర్వాత తమ స్వదేశానికి తిరిగివస్తారని ఆయన చెప్పాడు. (యిర్మీ. 29:​4, 10) బబులోను అబద్ధారాధనకు దూరంగా ఉండాలనే ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని బబులోను చెరలోవున్న యూదులకు ఆయన ప్రకటించాడు. అలా వారు నియమిత సమయం వచ్చినప్పుడు యెరూషలేముకు తిరిగి వెళ్లి స్వచ్ఛారాధనను పునఃస్థాపించడానికి సంసిద్ధంగా ఉంటారు. సా.శ.పూ. 539లో మాదీయులు పారసీకులు బబులోనును జయించిన కొంతకాలానికే ఆ నియమిత సమయం వచ్చింది. యెరూషలేముకు తిరిగి వెళ్లి యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించమని పారసీక రాజైన రెండవ కోరెషు యూదులకు ఆజ్ఞ జారీచేశాడు.​—⁠ఎజ్రా 1:​1-4.

9 ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వేలాదిమంది యూదులు యెరూషలేముకు తిరిగివచ్చారు. (ఎజ్రా 2:​64-67) అలా రావడం ద్వారా యిర్మీయా తన ప్రవచనంలో ఆజ్ఞాపించినట్లే వారు అక్షరార్థంగా మరో ప్రాంతానికి పారిపోగలిగారు. (యిర్మీయా 51:​6, 45, 50 చదవండి.) పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొంతమంది యూదులు సుదీర్ఘ​ప్రయాణం చేసి యెరూషలేము యూదాలకు తిరిగిరాలేకపోయారు. బబులోనులో ఉండిపోయిన వృద్ధ ప్రవక్తయైన దానియేలు వంటివారు, బబులోనులోని అబద్ధారాధనకు దూరంగా ఉంటూ యెరూషలేములో జరుగుతున్న స్వచ్ఛారాధనకు పూర్ణహృదయంతో మద్దతునిస్తేనే దేవుని ఆశీర్వాదం పొందగలుగుతారు.

10 నేడు కోట్లాదిమంది ప్రాచీన బబులోనులో ప్రారంభమైన వివిధరకాల అబద్ధ మతాలను అవలంభిస్తున్నారు. (ఆది. 11:​6-9) ఆ మతాలన్నీ కలిపి ఒక గుంపుగా “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను” అని పిలువబడుతున్నాయి. (ప్రక. 17:⁠5) అబద్ధ మతాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ లోక రాజకీయ పాలకులకు మద్దతునిస్తున్నాయి. ఆ మతాలవల్లే చరిత్రలో యుద్ధాలు వంటి ‘ఏహ్యమైన’ క్రియలు జరిగాయి, ఆ యుద్ధాలవల్ల “భూమిమీద” కోట్లాదిమంది ‘వధింపబడ్డారు.’ (ప్రక. 18:​24) మతనాయకులు పిల్లలపై లైంగిక అత్యాచారం జరపడం, ఇతర లైంగిక దుష్కార్యాలు చేయడం, వాటిని చర్చి అధికారులు సమ్మతించడం వంటి ‘ఏహ్యమైన’ క్రియలు కూడా మతాలు చేశాయి. యెహోవా దేవుడు త్వరలో ఈ భూమ్మీద నుండి అబద్ధ మతాలను తుడిచివేస్తాడనడంలో ఆశ్చర్యమేమైనా ఉందా?​—⁠ప్రక. 18:⁠8.

11 ఈ విషయం తెలిసిన నిజక్రైస్తవులకు, మహాబబులోనులో ఉన్నవారిని హెచ్చరించాల్సిన బాధ్యతవుంది. వారు, “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి యేసు నియమించిన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించే బైబిళ్లను, బైబిలు సాహిత్యాలను పంచిపెట్టడం ద్వారా తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. (మత్త. 24:​45) బైబిలు సందేశంపట్ల ఎవరైనా ఆసక్తి చూపిస్తే బైబిలు అధ్యయనం ద్వారా వారికి సహాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. అలా ఆసక్తి చూపించినవారు, మరీ ఆలస్యంకాకముందే ‘బబులోనులోనుండి పారిపోవాల్సిన’ అవసరాన్ని గుర్తిస్తారని ఆశిద్దాం.​—⁠ప్రక. 18:⁠4.

విగ్రహారాధన నుండి పారిపోండి

12 మహాబబులోనులో చిత్రపటాలను, విగ్రహాలను ఆరాధించడం వంటి ఏహ్యమైన క్రియలు కూడా జరుగుతున్నాయి. దేవుడు వాటిని ‘హేయమైన, అసహ్యమైన విగ్రహాలు’ అని పిలుస్తున్నాడు. (ద్వితీ. 29:​17, NW) దేవుణ్ణి సంతోషపరచాలనుకునే వారందరూ ఆయన చెప్పిన ఈ మాటకు అనుగుణంగా విగ్రహారాధనకు దూరంగా ఉండాలి: “యెహోవాను నేనే; ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.”​—⁠యెష. 42:⁠8.

13 దేవుని వాక్యం, విగ్రహారాధనకు సంబంధించిన మోసపూరితమైన రూపాల గురించి కూడా వివరిస్తోంది. ఉదాహరణకు, అది లోభత్వాన్ని “విగ్రహారాధన” అని పిలుస్తోంది. (కొలొ. 3:⁠5) నిషేధించబడినదాన్ని అంటే పరుల సొమ్మును ఆశించడమే లోభత్వం. (నిర్గ. 20:​17, అధఃస్సూచి) అపవాదియైన సాతానుగా మారిన దేవదూత, మహోన్నతుని వంటివాణ్ణవ్వాలనే, ఆయనలా ఆరాధించబడాలనే అత్యాశను పెంచుకున్నాడు. (లూకా 4:​5-7) ఆ కారణంగా ఆయన యెహోవాపై తిరుగుబాటు చేసి, దేవుడు నిషేధించినదానిని ఆశించేలా హవ్వను మోసగించాడు. ఆదాము ప్రేమగల తన పరలోక తండ్రికి లోబడివుండడానికి ప్రాధాన్యతనిచ్చే బదులు స్వార్థపూరితంగా తన భార్య సహచర్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఒక విధంగా ఆయన కూడా విగ్రహారాధనకు పాల్పడ్డాడు. దానికి భిన్నంగా, దేవుని ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలనుకునే వారందరూ అలాంటి అన్ని రకాల లోభత్వానికి దూరంగా ఉంటూ యెహోవాను మాత్రమే ఆరాధించాలి.

“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”

14మొదటి కొరింథీయులు 6:⁠18 చదవండి. పోతీఫరు భార్య యోసేపును లోబరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఆమె నుండి అక్షరార్థంగా పారిపోయాడు. ఆయన అవివాహితులకు, వివాహితులకు ఎంత చక్కని ఉదాహరణో! లైంగిక దుర్నీతి విషయంలో దేవుని దృక్పథాన్ని తెలియజేసిన గత సంఘటనల ద్వారా యోసేపు మనస్సాక్షి మలచబడిందని స్పష్టమౌతుంది. “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అనే ఆజ్ఞకు మనం లోబడాలంటే వివాహ భాగస్వామిపట్ల కాక మరొకరిపట్ల లైంగిక కోరికలు ఉత్పన్నం చేసేవేవీ మనం చేయం. మనకు ఇలా ఆజ్ఞాపించబడింది: “మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహరాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.”​—⁠కొలొ. 3:​5, 6.

15 ‘దేవుని ఉగ్రత వస్తుందని’ గమనించండి. లోకంలో చాలామంది అనుచిత లైంగిక కోరికలను పెంచుకొని వాటికి లొంగిపోతారు. కాబట్టి, క్రైస్తవులమైన మనం అలాంటివాటికి దాసులం కాకుండా ఉండేందుకు దేవుని సహాయం కోసం, పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించాలి. అంతేకాక, బైబిలును అధ్యయనం చేయడం, క్రైస్తవ కూటాలకు హాజరుకావడం, ఇతరులకు సువార్త ప్రకటించడం ‘ఆత్మానుసారముగా నడుచుకోవడానికి’ దోహదపడతాయి. అలా మనం “శరీరేచ్ఛను నెరవేర్చం.”​—⁠గల. 5:​16.

16 ‘ఆత్మానుసారముగా నడుచుకోవాలంటే’ మనం అశ్లీల దృశ్యాలను చూడకూడదు. అలాగే, ప్రతీ క్రైస్తవుడు లైంగిక కోరికలు రేకెత్తించే వాటిని చదివే, చూసే, లేదా వినే విషయంలో జాగ్రత్త వహించాలి. అదే విధంగా, దేవుని ‘పరిశుద్ధులు’ అలాంటి విషయాల గురించి సరదాగా మాట్లాడుకోవడంలో గానీ చర్చించుకోవడంలో గానీ ఎలాంటి ఆనందాన్నైనా పొందడం తప్పు. (ఎఫె. 5:​3, 4) అలా ప్రవర్తించడం ద్వారా, మనం రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొని, నీతియుక్తమైన నూతన లోకంలో జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నట్లు మన పరలోక తండ్రికి చూపిస్తాం.

“ధనాపేక్ష” నుండి పారిపోండి

17 పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, దాసులుగా ఉన్న క్రైస్తవులు పాటించాల్సిన సూత్రాలను నొక్కిచెప్పాడు, వారిలో కొందరు తమ యజమానులు క్రైస్తవులు కాబట్టి, వారి నుండి వస్తుపరమైన ప్రయోజనాలు పొందాలని ఆశించి ఉండవచ్చు. ఇతరులు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం క్రైస్తవ సహోదరులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు. ‘దైవభక్తిని లాభసాధనంగా’ పరిగణించడం గురించి పౌలు హెచ్చరించాడు. ఆ సమస్యకు మూలకారణం “ధనాపేక్ష” కావచ్చు, అది గొప్ప బీద అనే తేడా లేకుండా అందరిమీద చెడు ప్రభావం చూపించవచ్చు.​—⁠1 తిమో. 6:1, 2, 5, 9, 10.

18 “ధనాపేక్ష” మూలంగా లేక ధనంతో సంపాదించుకోగల అనవసరమైనవాటిని ఆశించడం మూలంగా దేవునితో తమకున్న సంబంధాన్ని పాడుచేసుకున్నవారి గురించిన బైబిలు ఉదాహరణలు మీరు గుర్తుతెచ్చుకోగలరా? (యెహో. 7:11, 21; 2 రాజు. 5:​20, 25-27) పౌలు తిమోతినిలా ప్రోత్సహించాడు: “దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.” (1 తిమో. 6:​11) రాబోయే ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలనుకునే వారందరూ ఆ ఉపదేశాన్ని అనుసరించడం చాలా ప్రాముఖ్యం.

“యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము”

19సామెతలు 22:⁠15 చదవండి. యౌవనస్థులు తమ హృదయంలో ఉండే మూఢత్వంవల్ల సులభంగా తప్పుదారి​పడతారు. దాని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి బైబిలు ఆధారిత క్రమశిక్షణ సహాయం చేస్తుంది. యెహోవాసాక్షులు కాని తల్లిదండ్రులున్న ఎంతోమంది క్రైస్తవ యౌవనస్థులు బైబిల్లోని సూత్రాలను తెలుసుకుని, వాటిని అన్వయించుకోవడానికి కృషి చేస్తారు. ఇతరులు, ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన సహోదరసహోదరీలు ఇచ్చే జ్ఞానయుక్త మైన ఉపదేశం నుండి ప్రయోజనం పొందుతారు. బైబిలు ఆధారిత ఉపదేశాన్ని ఎవరిచ్చినప్పటికీ, దాన్ని పాటిస్తే ఇప్పుడూ భవిష్యత్తులోనూ సంతోషంగా ఉండవచ్చు.​—⁠హెబ్రీ. 12:​8-11.

20రెండవ తిమోతి 2:20-22 చదవండి. సరైన క్రమశిక్షణ పొందని ఎంతోమంది యౌవనస్థులు మూర్ఖంగా పోటీతత్వం, లోభత్వం, జారత్వం, ధనాపేక్ష, సుఖాన్వేషణ వంటి ఉరుల్లో చిక్కుకున్నారు. అవన్నీ “యౌవనేచ్ఛలు” అని చెప్పవచ్చు, వాటినుండి పారిపొమ్మని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. క్రైస్తవ యౌవనస్థులు వాటి నుండి పారిపోవాలంటే హానికరమైన ప్రభావాలు ఎక్కడి నుండి ఎదురైనా వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ‘పవిత్ర హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో’ కలిసి దైవిక లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయాసపడమని దేవుడిచ్చిన ఉపదేశం ఎంతో సహాయకరంగా ఉంటుంది.

21 మనం యౌవనస్థులమైనా వృద్ధులమైనా, మనల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించేవారు చెప్పేది వినడానికి మనం తిరస్కరిస్తే, ‘అన్యుల స్వరము వినకుండా పారిపోయే’ యేసు గొర్రెల్లాంటి అనుచరుల్లో ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నామని చూపిస్తాం. (యోహా. 10:⁠5) అయితే, మనం దేవుని ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలంటే హానికరమైన వాటి నుండి పారిపోవడం మాత్రమే సరిపోదు. దానితోపాటు మనం మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయాసపడాలి. ఆ లక్షణాల్లో ఏడింటిని తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాటిని మరింత పరిశోధించడానికి మనకు తగిన కారణమే ఉంది, ఎందుకంటే యేసు ఈ అద్భుతమైన వాగ్దానం చేశాడు: “నేను [నా గొర్రెలకు] నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.”​—⁠యోహా. 10:​28.

మీరెలా జవాబిస్తారు?

• యేసు మతనాయకులను ఏమని హెచ్చరించాడు?

• నేడు కోట్లాదిమంది ఏ ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు?

• మనం విగ్రహారాధనకు సంబంధించిన ఏ మోసపూరితమైన రూపాల నుండి పారిపోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. పారిపోవడం గురించి బైబిల్లో ఏ ఉదాహరణలు ఉన్నాయి?

2, 3. (ఎ) బాప్తిస్మమిచ్చు యోహాను అసలు ఏ ఉద్దేశంతో మతనాయకులను విమర్శించాడు? (బి) యోహాను ఇచ్చిన హెచ్చరికను యేసు ఎలా బలపర్చాడు?

4. యేసు ఏ ఉద్దేశంతో ‘గెహెన్నా’ గురించి ప్రస్తావించాడు?

5. యోహాను, యేసు హెచ్చరించినట్లే జరిగిందని చరిత్ర ఎలా నిరూపిస్తోంది?

6. తొలి క్రైస్తవ సంఘంలో ఏది తెరమీదకు వచ్చింది?

7. “ధర్మవిరుద్ధ పురుషుడు” అనే మాట క్రైస్తవమతసామ్రాజ్య నాయకులకు ఎందుకు సరిపోతుంది?

8, 9. (ఎ) బబులోను చెరలోవున్న యూదులకు యిర్మీయా ఏ ప్రవచన సందేశాన్ని ఇచ్చాడు? (బి) మాదీయులు పారసీకులు బబులోనును జయించిన తర్వాత, యూదులు ఏ విధంగా పారిపోగలిగారు?

10. “మహా బబులోను” ఎలాంటి ‘ఏహ్యమైన’ క్రియలు చేసింది?

11. మహాబబులోను నాశనంచేయబడేంతవరకు, నిజక్రైస్తవులు ఏ ​బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండాలి?

12. చిత్రపటాలను, విగ్రహాలను ఆరాధించడాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడు?

13. మనం విగ్రహారాధనకు సంబంధించిన ఎలాంటి మోసపూరితమైన రూపాలనుండి పారిపోవాలి?

14-16. (ఎ) నైతిక విషయాల్లో యోసేపు ఎందుకు చక్కని ఉదాహరణ? (బి) మనకు అనుచిత లైంగిక కోరికలు కలిగితే మనమేమి చేయాలి? (సి) జారత్వం నుండి పారిపోవడంలో మనమెలా విజయం సాధించవచ్చు?

17, 18. మనం “ధనాపేక్ష” నుండి ఎందుకు పారిపోవాలి?

19. యౌవనస్థులందరికీ ఏమి అవసరం?

20. చెడు కోరికల నుండి పారిపోవడానికి యౌవనస్థులు ఎలా సహాయం పొందవచ్చు?

21. యేసుక్రీస్తు గొర్రెల్లాంటి తన అనుచరుల విషయంలో ఏ అద్భుతమైన వాగ్దానం చేశాడు?

[8, 9వ పేజీలోని చిత్రాలు]

“పారిపోవడం” అనే మాట విన్నప్పుడు మీకు ఏమి గుర్తుకొస్తుంది?