కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మొదట మీకున్న ప్రేమను’ కాపాడుకోండి

‘మొదట మీకున్న ప్రేమను’ కాపాడుకోండి

‘మొదట మీకున్న ప్రేమను’ కాపాడుకోండి

‘మీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.’​—⁠ప్రక. 3:​11.

యెహోవా విధేయులైన మానజాతి కోసం వాగ్దానం చేసిన అద్భుతమైన భవిష్యత్తు గురించి మీరు మొదట తెలుసుకున్న సమయం మీకు గుర్తుందా? మీరు గతంలో వేరే మతానికి చెందినవారైతే, లేఖనాలను ఉపయోగించి దేవుని సంకల్పాల గురించి వివరించబడినప్పుడు లేక ఒకప్పుడు అర్థం చేసుకోవడానికి కష్టమనిపించిన బోధలు మీకు వివరించబడినప్పుడు ఎలా అనిపించింది? మీకు దేవుని గురించిన సత్యం బోధించబడలేదని మీరు గుర్తించివుండవచ్చు. అయితే, మీకు ఇప్పుడు సత్యం తెలిసినందుకు మీరు ఎంతగా ఆనందిస్తున్నారో కదా! మీరు క్రైస్తవ తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినట్లయితే, మీరు యెహోవా గురించి తెలుసుకుంటున్నది సత్యమనే నమ్మకం కుదిరి, దానికి అనుగుణంగా జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో మీరు గుర్తుచేసుకుంటుంటారా?​—⁠రోమా. 12:⁠2.

2 మీ ఆధ్యాత్మిక సహోదరుల్లో అనేకమంది తాము సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందించామనీ, యెహోవాకు దగ్గరైనట్లు భావించామనీ, తమను ఆకర్షించినందుకు ఆయనపట్ల కృతజ్ఞత కలిగిందనీ మీకు చెబుతారు. (యోహా. 6:​44) ఆ ఆనందంతో వారు క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. వారు ఎంతగా ఆనందించారంటే తమ భావాలను ప్రతీ ఒక్కరితో పంచుకోవాలనుకున్నారు. మీకూ అలాగే అనిపించిందా?

3 మొదటి శతాబ్దపు ఎఫెసులోని క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు యేసు ‘మొదట వారికున్న ప్రేమ’ గురించి పేర్కొన్నాడు. ఎఫెసీయులకు ఎన్నో మంచి గుణాలు ఉన్నా, ఒకప్పుడు వారు యెహోవాపట్ల కనబరిచిన ప్రేమ ఆ తర్వాత తగ్గింది. అందుకే యేసు వారితో ఇలా అన్నాడు: “నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.”​—⁠ప్రక. 2:​2-4.

4 యేసు ప్రకటన పుస్తకంలో ఎఫెసీయులకు, ఇతర సంఘాలకు ఇచ్చిన ఉపదేశం, 1914వ సంవత్సరం నుండి కొంతకాలంపాటు అభిషిక్త క్రైస్తవుల మధ్య నెలకొన్న పరిస్థితులనుబట్టి వారికి సరిగ్గా సరిపోతుంది. (ప్రక. 1:​10) అయినా, ఇప్పుడు కూడా కొందరు క్రైస్తవులు యెహోవా​పట్ల, క్రైస్తవ సత్యంపట్ల ‘మొదట తమకున్న ప్రేమను’ కోల్పోయే అవకాశముంది. దాన్ని మనసులో ఉంచుకొని, మీరు మీ అనుభవాలను గుర్తుచేసుకోవడం ద్వారా, వాటిని ధ్యానించడం ద్వారా దేవునిపట్ల, ఆయన సత్యంపట్ల మొదట మీకున్న ప్రేమను, ఉత్సాహాన్ని ఎలా కాపాడుకొని, ఉత్తేజపరచుకొని, బలపర్చుకోవచ్చో మనం పరిశీలిద్దాం.

సత్యం తెలుసుకున్నామనే నమ్మకం మీకెలా కలిగింది?

5 యెహోవాకు సమర్పించుకునే ప్రతీ ఒక్కరూ మొదట “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో” ‘పరీక్షించి తెలుసుకోవాలి.’ (రోమా. 12:​1, 2) అలా చేయడంలో భాగంగా, బైబిలు సత్యాన్ని తెలుసుకోవాలి. యెహోవాసాక్షులు సత్యం బోధిస్తారని ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణాన్నిబట్టి నమ్ముతారు. కొందరు, తాము బైబిల్లో దేవుని పేరును చదివినప్పుడు లేదా మరణించినవారికి ఏమౌతుందో అర్థం చేసుకున్నప్పుడు తమ వైఖరి మారిందని గుర్తుచేసుకుంటారు. (కీర్త. 83:​18; ప్రసం. 9:​5, 10) మరికొందరు యెహోవా ప్రజల మధ్య కనిపించే ప్రేమ తమను ఆకట్టుకొందని చెబుతారు. (యోహా. 13:​34, 35) ఇంకా కొందరు, లోకానికి వేరుగా ఉండడమంటే ఏమిటో తెలుసుకోవడం తమను ఆకట్టుకుందని చెబుతారు. నిజక్రైస్తవులు రాజకీయ వివాదాల్లో తలదూర్చకూడదనే లేదా ఏ దేశానికి సంబంధించిన యుద్ధంలోనైనా పాల్గొనకూడదనే ముగింపుకు వారు వచ్చారు.​—⁠యెష. 2:⁠4; యోహా. 6:​15; 17:​14-16.

6 అనేకమంది ఈ కారణాలనుబట్టి, మరితర కారణాలనుబట్టి మొదటిసారిగా దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించారు. మీరు సత్యంలోకి రావడానికి మిమ్మల్ని ఏది ప్రోత్సహించిందో గుర్తుచేసుకునేందుకు సమయం తీసుకోండి. మీకున్న పరిస్థితులు లక్షణాలే ఇతరులకు ఉండవు కాబట్టి, యెహోవాను ప్రేమించడానికి, ఆయన వాగ్దానాలను నమ్మడానికి మీకున్న ప్రాథమిక కారణాలే ఇతరులకు ఉండకపోవచ్చు. మీరు ఏ కారణాలనుబట్టి దేవుణ్ణి మొదటిసారిగా ప్రేమించడం ప్రారంభించారో ఆ కారణాలనుబట్టే మీరు ఇప్పటికీ ఆయనను ప్రేమిస్తూ ఉండవచ్చు. సత్యం మారలేదు. అందుకే, మీరు అప్పటి ఆలోచనలను, భావాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఒక విధంగా సత్యంపట్ల మీకున్న మొదటి ప్రేమను ఉత్తేజపరచుకోవచ్చు.​—⁠కీర్తనలు 119:​151, 152; 143:⁠5 చదవండి.

మొదట మీకున్న ప్రేమను బలపర్చుకోండి

7 మీరు యెహోవాకు సమర్పించుకున్నప్పటి నుండి మీ జీవితంలో ఎన్నో మార్పులు సంభవించివుండవచ్చు. సత్యంపట్ల మీకున్న మొదటి ప్రేమ ప్రాముఖ్యమే. కానీ సమయం గడిచేకొద్ది, మీ విశ్వాసాన్ని పరీక్షించిన కొత్త సవాళ్లను సహించడానికి మీకు ప్రగాఢమైన ప్రేమ అవసరమైంది. ఆ సమయంలో యెహోవా మిమ్మల్ని బలపర్చాడు. (1 కొరిం. 10:​13) కాబట్టి, సంవత్సరాలు గడుస్తుండగా మీకు ఎదురైన అనుభవాలు కూడా మీకు అమూల్యమైనవే. మొదట మీకున్న ప్రేమను పెంచుకోవడానికి అవి సహాయం చేశాయి. అంతేకాక, ఉత్తమము, అనుకూలము అయిన దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకోవడానికి కూడా అవి సహాయం చేస్తాయి.​—⁠యెహో. 23:​14; కీర్త. 34:⁠8.

8 దాన్ని ఉదహరించడానికి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాలనే తన సంకల్పాన్ని యెహోవా తెలియజేసినప్పుడు వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి. దేవుడు తన గురించి మోషేకు ఇలా చెప్పాడు: “నేను ఎలా కావాలంటే అలా అవుతాను.” (నిర్గ. 3:7, 8, 13, 14, NW) నిజానికి, యెహోవా తాను తన ప్రజలను విడిపించడానికి పరిస్థితికి తగినట్లు ఎలాంటి పాత్రనైనా పోషిస్తానని చెబుతున్నాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనల్లో, ఆయా పరిస్థితులనుబట్టి యెహోవా తన వ్యక్తిత్వంలోని వివిధ లక్షణాలను కనబరచడాన్ని ఇశ్రాయేలీయులు చూశారు. యెహోవా సర్వశక్తునిగా, న్యాయాధిపతిగా, నాయకునిగా, విమోచకునిగా, యుద్ధశూరునిగా, పోషకునిగా వివిధ పాత్రలు పోషించాడు.​—⁠నిర్గ. 12:​12; 13:​21; 14:​24-31; 16:⁠4; నెహె. 9:​9-15.

9 మీ పరిస్థితి ప్రాచీన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నంగా ఉంది. అయినా, దేవునికి మీపట్ల శ్రద్ధ ఉందనే నమ్మకం కలిగించే అనుభవాలు మీకూ ఎదురైవుండవచ్చు. అవి మీ విశ్వాసాన్ని బలపర్చివుండవచ్చు. యెహోవా మీ విషయంలో కూడా ఏదో ఒక విధంగా పోషకునిగా, ఓదార్చేవానిగా, బోధకునిగా ఒక పాత్రను పోషించివుండవచ్చు. (యెషయా 30:⁠20బి, 21 చదవండి.) లేక మీరు చేసిన ప్రార్థనకు స్పష్టమైన జవాబు లభించిందని మీరు గ్రహించివుండవచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోటి క్రైస్తవులు మీకు సహాయం చేసివుండవచ్చు. లేక మీ పరిస్థితికి సరిపోయే లేఖనాలను మీ వ్యక్తిగత అధ్యయనంలో మీరు గమనించివుండవచ్చు.

10 ఆ అనుభవాలను మీరు ఇతరులతో పంచుకుంటే, కొందరు వాటిని అంతగా పట్టించుకోకపోవచ్చు. నిజమే, ఆ సంఘటనలన్నీ అద్భుతాలేమీ కావు, కానీ అవి మీకు ఎంతో ప్రత్యేకమైనవి. అవును, మీ పరిస్థితికి తగిన పాత్రను యెహోవా పోషించాడు. మీరు సత్యంలో ఉన్న గత సంవత్సరాల గురించి ఆలోచించండి. మీ జీవితంలో యెహోవా వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించిన ఒకటికన్నా ఎక్కువ సందర్భాలను మీరు గుర్తు​చేసుకోగలరా? అలాగైతే, అలాంటి సంఘటనలను, వాటివల్ల మీలో కలిగిన భావాలను గుర్తుచేసుకుంటే మీ హృదయంలో యెహోవాపట్ల ఒకప్పుడున్న ప్రేమను మీరు తిరిగి ఉత్తేజపర్చుకోవచ్చు. ఆ అనుభవాలను అమూల్యమైనవిగా ఎంచండి. వాటి గురించి ధ్యానించండి. యెహోవాకు మీపట్ల వ్యక్తిగత శ్రద్ధ ఉందనడానికి అవి రుజువులు, ఆ నమ్మకాన్ని మీ నుండి ఎవరూ తీసివేయలేరు.

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

11 మీకు దేవునిపట్ల, సత్యంపట్ల ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేనట్లయితే, దాని అర్థం యెహోవా మారిపోయాడని కాదు. ఆయన ఎన్నడూ మారడు. (మలా. 3:⁠6; యాకో. 1:​17) ఆయన గతంలో మీపట్ల శ్రద్ధ కనబరిచాడు. ఇప్పుడూ అలాగే శ్రద్ధ కనబరుస్తున్నాడు. యెహోవాతో మీకున్న సంబంధాన్ని ఏదైనా దెబ్బతీసివుంటే, అది ఏమైవుండవచ్చు? మీరు మరింత ఒత్తిడి ఎదుర్కొంటున్న కారణంగా, జీవిత చింతలతో సతమతమౌతున్న కారణంగా అది దెబ్బతిందా? బహుశా గతంలో మీరు మరింత హృదయపూర్వకంగా ప్రార్థించివుండవచ్చు, మరింత శ్రద్ధగా అధ్యయనం చేసివుండవచ్చు, మరింత ఎక్కువగా ధ్యానించివుండవచ్చు. ఇప్పటికన్నా మరింత ఉత్సాహంగా పరిచర్యలో పాల్గొంటూ క్రమంగా సంఘ కూటాలకు హాజరయ్యేవారా?​—⁠2 కొరిం. 13:⁠5.

12 మీలో వచ్చిన అలాంటి మార్పులను మీరు గమనించక​పోవచ్చు. ఒకవేళ గమనిస్తే, ఆ మార్పులకు కారణమేమిటి? కుటుంబాన్ని తగిన విధంగా పోషించడం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లేక సహేతుకమైన అలాంటి ఇతర చింతలనుబట్టి యెహోవా దినం సమీపంగా ఉందనే విషయంలో మీరు అత్యవసర భావాన్ని కోల్పోయారా? యేసు తన అపొస్తలులకు ఇలా చెప్పాడు: ‘మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొనునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.’​—⁠లూకా 21:​34-36.

13 దైవప్రేరణతో రాసిన బైబిలు రచయిత అయిన యాకోబు, దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ నిజాయితీగా స్వయంపరిశీలన చేసుకోమని తన తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు. యాకోబు ఇలా రాశాడు: “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.”​—⁠యాకో. 1:​22-25.

14 ఒక వ్యక్తి తాను ఎలా కనిపిస్తున్నానో చూసుకునేందుకు అద్దాన్ని ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన టై వంకరగా ఉందని గమనిస్తే దానిని సరిచేసుకోవచ్చు. ఒకామె తన జుట్టు సరిగ్గాలేకపోతే దానిని సరిచేసుకోవచ్చు. అలాగే మన అసలు రూపాన్ని పరీక్షించుకునేందుకు లేఖనాలు మనకు సహాయం చేస్తాయి. మనం ఎలా నడుచుకోవాలనే విషయంలో బైబిలు చెబుతున్నదానితో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు మనం దానిని అద్దంలా ఉపయోగిస్తున్నట్లే. మనలో కనిపించిన లోపాల్ని చూసి కూడా సరిచేసుకోవడానికి మనమేమీ చేయకపోతే అద్దంలో చూసుకొని ఏం లాభం? మనం దేవుని “సంపూర్ణమైన నియమములో” చూస్తున్నదానికి అనుగుణంగా చర్యతీసుకొని, దాని ప్రకారం ‘ప్రవర్తించడం’ జ్ఞానయుక్తం. కాబట్టి, యెహోవా​పట్ల, సత్యంపట్ల మొదట తమకున్న ప్రేమ ఇప్పుడు లేదని గుర్తించిన వారెవరైనా ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ‘నేను జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాను, వాటికి నేనెలా ప్రతిస్పందిస్తున్నాను? గతంలో ఎలా ప్రతిస్పందించాను? నా ప్రతిస్పందనలో ఏదైనా మార్పు వచ్చిందా?’ అలా స్వయంపరిశీలన చేసుకున్నప్పుడు ఎలాంటి లోపాలైనా మీలో కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీరు మార్పులు చేసుకోవాల్సిన అవసరముంటే, ఆలస్యంచేయకుండా మార్పులు చేసుకోండి.​—⁠హెబ్రీ. 12:​12, 13.

15 మీరు అలా ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేందుకు సహేతుకమైన లక్ష్యాలను కూడా పెట్టుకోగలుగుతారు. అపొస్తలుడైన పౌలు, తోటి పనివాడైన తిమోతి తన పరిచర్యను మెరుగుపర్చుకునే విషయంలో ఆయనకు దైవప్రేరేపిత ఉపదేశాన్నిచ్చాడు. పౌలు ఆ యౌవనస్థుణ్ణి ఇలా ప్రోత్సహించాడు: “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.” మనం ఎలాంటి పురోభివృద్ధి సాధించవచ్చు అనేదాని గురించి దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ మనస్కరించాలి లేదా ధ్యానించాలి.​—⁠1 తిమో. 4:​15.

16 మిమ్మల్ని మీరు నిజాయితీగా పరీక్షించుకున్నప్పుడు మీలో కొన్ని బలహీనతలున్నాయని మీరు గుర్తించే అవకాశముంది. అలా గుర్తించినప్పుడు మీరు నిరుత్సాహపడవచ్చు, అయితే మీరలా నిరుత్సాహపడకుండా జాగ్రత్తపడండి. మీరు ఎక్కడ అభివృద్ధి సాధించాలో గుర్తించేందుకే కదా మీరు స్వయంపరిశీలన చేసుకునేది. ఒక క్రైస్తవుడు తన అపరిపూర్ణ​తల కారణంగా తాను ఎందుకూ పనికిరానని అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు. వాస్తవానికి, దేవుడు తనను సేవించడానికి మానవులు చేస్తున్న ప్రయత్నాలను విలువైనవిగా ఎంచడనే వాదన కూడా చేయబడింది. (యోబు 15:​15, 16; 22:⁠3) ఆ అబద్ధాన్ని యేసు బలంగా ఖండించాడు, ఎందుకంటే దేవుడు మనలో ప్రతీ ఒక్కరినీ విలువైనవారిగా పరిగణిస్తున్నాడు. (మత్తయి 10:​29-31 చదవండి.) అయితే, మీరు మీ అపరిపూర్ణతలను గుర్తించడం, యెహోవా సహాయంతో అభివృద్ధి సాధించాలని వినయపూర్వకంగా నిశ్చయించుకునేలా మిమ్మల్ని ప్రోత్సహించాలి. (2 కొరిం. 12:​7-10) మీరు అనారోగ్యంవల్ల లేక వృద్ధాప్యంవల్ల ఎక్కువ చేయలేకపోతుంటే, ఆచరణయోగ్యమైన లక్ష్యాలను పెట్టుకోండి, అంతేగానీ నిరుత్సాహపడకండి, మీ ప్రేమ తగ్గిపోకుండా చూసుకోండి.

కృతజ్ఞత కనబరచడానికిగల ఎన్నో కారణాలు

17 మొదట మీకున్న ప్రేమను బలపర్చుకుంటూ ఉండడం ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. దేవుని గురించి మీకున్న జ్ఞానాన్ని పెంచుకొని, ఆయన ప్రేమతో ఇస్తున్న నిర్దేశానికి మరింత కృతజ్ఞత కనబరచగలుగుతారు. (సామెతలు 2:​1-9; 3:5, 6 చదవండి.) “[యెహోవా న్యాయవిధులను] గైకొనుటవలన గొప్ప లాభము కలుగును” అని కీర్తనకర్త చెప్పాడు. “యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.” అంతేకాక, “యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు.”​—⁠కీర్త. 19:​7, 11; 119:⁠1.

18 యెహోవా మీ విషయంలో ఎన్నో మంచి కార్యాలు చేశాడు కాబట్టి మీరు ఆయనకు కృతజ్ఞత కనబరచాలని ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఈ లోకంలో జరుగుతున్నవాటికి కారణాలు మీకు తెలుసు. నేడు దేవుడు తన ప్రజల కోసం చేస్తున్న ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నింటి నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారు. అంతేకాక, యెహోవా మిమ్మల్ని తన ప్రపంచవ్యాప్త సంఘంవైపు ఆకర్షించి తన సాక్షుల్లో ఒకరిగా ఉండే ఆధిక్యత ఇచ్చినందుకు మీరు నిస్సందేహంగా కృతజ్ఞతతో ఉన్నారు. మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదాలను లెక్కించండి! మీరు వాటిని లెక్కిస్తూ వెళ్తే అవి బహుశా ఎన్నో ఉండవచ్చు. మీరు తరచూ అలా చేస్తే ఈ హెచ్చరికను ఖచ్చితంగా అన్వయించుకోగలుగుతారు: “నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.”​—⁠ప్రక. 3:​11.

19 సంవత్సరాలు గడుస్తుండగా మీ విశ్వాసం ఎలా బలపడిందో ధ్యానించడం మీరు కలిగివున్నదాన్ని గట్టిగా పట్టుకునేందుకు దోహదపడే ఒక అంశం మాత్రమే. ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన, క్రైస్తవ కూటాలకు హాజరౌతూ వాటిలో పాల్గొనడం, ప్రకటనా పనిలో ఉత్సాహంగా భాగం వహించడం వంటి ఎంతో అవసరమైన ఇతర విషయాల గురించి ఈ పత్రిక పదేపదే వివరించింది. మొదట మీకున్న ప్రేమను ఉత్తేజపర్చుకుంటూ, బలపర్చుకుంటూ ఉండేందుకు అవి మీకు దోహదపడగలవు.​—⁠ఎఫె. 5:​10; 1 పేతు. 3:​15; యూదా 20, 21.

మీరెలా జవాబిస్తారు?

• మీరు మొదటిసారి యెహోవాను ప్రేమించడానికిగల కారణాలు ఇప్పుడు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించవచ్చు?

• సంవత్సరాలు గడుస్తుండగా మీకు ఎదురైన అనుభవాల గురించి ఆలోచించడం ద్వారా మీకు ఎలాంటి నమ్మకం కలుగుతుంది?

• దేవునిపట్ల మీకున్న ప్రేమను మీరెందుకు పరీక్షించుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవా గురించి తెలుసుకుంటున్న విషయాలు సత్యమనే నమ్మకం కుదిరినప్పుడు మీకెలా అనిపించింది?

3. యేసు ఎఫెసు సంఘానికి ఒక సందేశం పంపించినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనివుంది?

4. ఎఫెసీయులకు యేసు ఇచ్చిన సందేశం నేడు మనకు ఎందుకు ప్రాముఖ్యం?

5, 6. (ఎ) ప్రతీ క్రైస్తవుడు దేనిని పరీక్షించి తెలుసుకోవాలి? (బి) యెహోవాసాక్షులు సత్యాన్ని బోధిస్తారని మీకు ఎలా నమ్మకం కుదిరింది? (సి) మొదట తనకున్న ప్రేమను ఉత్తేజపరచుకునేందుకు ఒక వ్యక్తికి ఏది సహాయం చేయగలదు?

7. సత్యంపట్ల మనకున్న మొదటి ప్రేమను ఎందుకు బలపర్చుకోవాలి, మనం దానిని ఎలా బలపర్చుకోవచ్చు?

8. యెహోవా తన గురించి మోషేకు ఏమని చెప్పాడు, ఇశ్రాయేలీయులు దేవుని గురించి మరింత ఎక్కువగా ఎలా తెలుసుకున్నారు?

9, 10. ఒక వ్యక్తి దేవుని గురించి తెలుసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు దోహదపడతాయి, అలాంటి అనుభవాలను గుర్తుచేసుకోవడం ఎందుకు మంచిది?

11, 12. ఒక క్రైస్తవునికి సత్యంపట్ల ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేనట్లయితే దానికి కారణమేమై ఉండవచ్చు, యేసు ఏ ఉపదేశాన్నిచ్చాడు?

13. యాకోబు దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాడు?

14, 15. (ఎ) మీ ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపర్చుకోవడానికి బైబిలు మీకు ఎలా సహాయం చేయగలదు? (బి) మీరు ఏ ప్రశ్నలను ధ్యానించవచ్చు?

16. లేఖనాలను ఉపయోగించి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నప్పుడు మీరు ఏ ప్రమాదాన్ని గుర్తుంచుకోవాలి?

17, 18. మొదట మీకున్న ప్రేమను బలపర్చుకోవడం ద్వారా మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

19. ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, దేవునితో మీకున్న సంబంధం గురించి ధ్యానించడంతోపాటు ఇంకా ఏమి చేయాలి?

[23వ పేజీలోని చిత్రం]

మీరు దేనినిబట్టి సత్యంవైపు ఆకర్షితులయ్యారు, మీరు నేర్చుకుంటున్నది సత్యమనే నమ్మకం కలిగించిన విషయమేమిటి?

[25వ పేజీలోని చిత్రం]

మీలో సరిచేసుకోవాల్సిన విషయాలేవైనా ఉన్నట్లు మీకు అనిపిస్తోందా?