యెహోవా అధికారాన్ని అంగీకరించండి
యెహోవా అధికారాన్ని అంగీకరించండి
“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహా. 5:3.
“అధికారం” అనే పదాన్ని నేడు చాలామంది ఇష్టపడరు. మరో వ్యక్తి చెప్పినట్లు చేయడం అనే తలంపే చాలామందికి రుచించదు. ఇతరుల అధికారానికి లోబడడానికి ఇష్టపడనివారు, “నేను ఏమి చేయాలో ఎవరూ నాకు చెప్పనవసరంలేదు” అన్నట్లు వ్యవహరిస్తారు. అయితే, వారు నిజంగా స్వతంత్రులేనా? కాదు! “ఈ లోక మర్యాదను అనుసరిస్తున్న” అసంఖ్యాకులైన ప్రజల ప్రమాణాలనే చాలామంది అవలంభిస్తున్నారు. (రోమా. 12:2) క్రైస్తవ అపొస్తలుడైన పేతురు మాటల్లో చెప్పాలంటే, వారు స్వతంత్రులుగా ఉండే బదులు, “భ్రష్టత్వమునకు దాసులై” ఉన్నారు. (2 పేతు. 2:19) వారు ‘వాయుమండల సంబంధమైన అధిపతి’ అయిన అపవాదియైన సాతానును ‘అనుసరిస్తూ ఈ ప్రపంచ ధర్మముచొప్పున నడుచుకొంటున్నారు.’—ఎఫె. 2:2.
2 ఒక రచయిత డంబంగా ఇలా చెప్పుకున్నాడు: “నాకు ఏది సరైనదో నిర్ణయించే అధికారాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను. ఆ అధికారాన్ని నా తల్లిదండ్రులకు గానీ, పాదిరికి గానీ, ప్రచారకునికి గానీ, గురువుకు గానీ, బైబిలుకు గానీ ఇవ్వను.” నిజమే, కొందరు అధికార దుర్వినియోగం చేస్తున్న కారణంగా వారు మన విధేయతకు అర్హులుకాకపోవచ్చు. అయితే, మనకు ఎలాంటి నిర్దేశం అవసరంలేదని చెప్పడం దానికి పరిష్కారమా? వార్తాపత్రికల్లోని ప్రముఖ శీర్షికలను కొద్దిసేపు చూస్తే ఆ ప్రశ్నకు సమాధానమేమిటో తెలిసిపోతుంది. మానవులకు నిర్దేశం ఎంతో అవసరమైన సమయంలో అనేకమంది దానిని అంగీకరించడానికి అంతగా ఇష్టపడకపోవడం విషాదకరం.
అధికారం విషయంలో మన దృక్పథం
3 మనం క్రైస్తవులం కాబట్టి, అధికారం విషయంలో మన దృక్కోణం లోకానికి భిన్నంగా ఉంటుంది. అంటే మనకు ఆజ్ఞాపించబడినట్లు గుడ్డిగా చేసుకుంటూ వెళ్తామని కాదు. బదులుగా, కొన్నిసార్లు అధికారంలోవున్నవారు ఆజ్ఞాపించినా వారు చెప్పినట్లు చేయడానికి మనం తిరస్కరించాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా అలాగే తిరస్కరించారు. అపొస్తలుల కార్యములు 5:27-29 చదవండి.
ఉదాహరణకు, మహాసభలో భాగమైన ప్రధానయాజకుడు, మరికొంతమంది అధికారులు ప్రకటించవద్దని అపొస్తలులను ఆజ్ఞాపించినప్పుడు వారు రాజీపడలేదు. వారు మానవ అధికారులకు లోబడాలని సరైన ప్రవర్తననేమీ విడనాడలేదు.—4 క్రైస్తవపూర్వ కాలాల్లోని అనేకమంది దేవుని సేవకులు కూడా అలాంటి దృఢనిశ్చయాన్నే కనబరచారు. ఉదాహరణకు, మోషే “దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు.” అలా ఒప్పుకోకపోవడంవల్ల ‘రాజాగ్రహాన్ని’ ఎదుర్కోవాల్సివచ్చినా ఆయనలా చేశాడు. (హెబ్రీ. 11:24, 25, 27) యోసేపు, తనమీద పగతీర్చుకొని, తనకు హానికలిగించే శక్తి పోతీఫరు భార్యకు ఉందని తెలిసినా అనైతిక సంబంధం పెట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఆయన లొంగిపోలేదు. (ఆది. 39:7-9) దానియేలు, “రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని . . . ఉద్దేశించాడు [‘నిశ్చయించుకున్నాడు,’ NW].” ఆ విషయంలో దానియేలు దృక్పథాన్ని అంగీకరించడం నపుంసకుల అధిపతికి కష్టమైనా దానియేలు అలా చేశాడు. (దాని. 1:8-14) ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా సరైనది చేయడానికి గతంలో దేవుని ప్రజలు స్థిరంగా వ్యవహరించారని అలాంటి ఉదాహరణలు చూపిస్తాయి. ఆ సేవకులు కేవలం మనుష్యుల మన్ననలు సంపాదించుకునేందుకు వారి ఒత్తిళ్లకు లొంగిపోలేదు. మనం కూడా లొంగిపోకూడదు.
5 మనం ధైర్యం కనబరచడాన్ని మొండితనమని అపార్థం చేసుకోకూడదు, అంతేకాక రాజకీయ వ్యవస్థను విభేదిస్తున్నామని చూపించడానికి తిరుగుబాటు చేసే కొందరిలా మనం తిరుగుబాటుచేయం. బదులుగా మనం మనుష్యుల అధికారంకన్నా యెహోవా అధికారానికే లోబడాలనే కృతనిశ్చయంతో ఉంటాం. మానవుని చట్టాలు దేవుని నియమాన్ని వ్యతిరేకించే సందర్భాల్లో మనం ఏమి చేయాలో నిర్ణయించుకోవడం కష్టమేమికాదు. మొదటి శతాబ్దపు అపొస్తలుల్లాగే మనం మనుష్యులకు కాదు, దేవునికే లోబడతాం.
6 దేవుని అధికారాన్ని అంగీకరించడానికి మనకు ఏది సహాయం చేసింది? మనం సామెతలు 3:5, 6లోని మాటలతో ఏకీభవిస్తాం: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” దేవుడు మన నుండి కోరుతున్నది చేయడంవల్ల చివరకు మనకు మేలే జరుగుతుందని మనం విశ్వసిస్తాం. (ద్వితీయోపదేశకాండము 10:12, 13 చదవండి.) నిజానికి, యెహోవా తన గురించి ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పుకున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు . . . నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” అంతేకాక ఆయన ఇలా చెప్పాడు: “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యెష. 48:17, 18) మనం ఆ మాటలను నమ్ముతాం. దేవుని ఆజ్ఞలకు లోబడడంవల్ల మనకు ఎల్లప్పుడూ మేలు జరుగుతుందనే దృఢనమ్మకం మనకు ఏర్పడింది.
7 యెహోవా తన వాక్యంలో ఒకానొక ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడో మనకు పూర్తిగా అర్థంకాకపోయినా మనం ఆయన అధికారాన్ని అంగీకరించి ఆయనకు లోబడతాం. మనం గుడ్డిగా అలా చేయం కానీ ఆయనమీదున్న నమ్మకంతో అలా చేస్తాం. అది, మనకు ఏది మంచిదో యెహోవాకు తెలుసనే సంపూర్ణ నమ్మకం మనకుందని చూపిస్తుంది. మనం విధేయత చూపించడం ద్వారా ప్రేమను కూడా కనబరుస్తాం, ఎందుకంటే అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.” (1 యోహా. 5:3) అయితే, విధేయత విషయంలో మనం మరో అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
మన జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవడం
8 మనం “మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగివుండాలని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 5:14) కాబట్టి, దేవుని నియమాలను యాంత్రికంగా పాటించడం మన లక్ష్యం కాదు. బదులుగా యెహోవా ప్రమాణాల ప్రకారం మనం ‘మేలు కీడులను వివేచించగలగాలని’ మనం కోరుకుంటాం. యెహోవా మార్గాలు ఎంత జ్ఞానయుక్త మైనవో మనం గ్రహించాలనుకుంటాం, అలా గ్రహించడం ద్వారా మనం కీర్తనకర్తలా ఇలా చెప్పగలుగుతాం: “నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.”—కీర్త. 40:8
9 కీర్తనకర్తలా దేవుని నియమాలకున్న విలువను మనం గ్రహించాలంటే బైబిల్లో మనం చదివినదానిని ధ్యానించాలి. ఉదాహరణకు, మనం యెహోవా ఇచ్చిన ఒకానొక ఆజ్ఞ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఇలా ఆలోచించవచ్చు: ‘ఈ ఆజ్ఞ లేక సూత్రం ఎందుకు జ్ఞానయుక్త మైనది? దీనికి లోబడడంవల్ల నాకు మేలు జరుగుతుందని నేనెందుకు నమ్మవచ్చు? ఈ విషయంలో దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్యంచేసినవారు ఎలాంటి చెడు పరిణామాలను ఎదుర్కొన్నారు?’ మన మనస్సాక్షిని యెహోవా మార్గాలకు అనుగుణంగా సరిదిద్దుకున్నప్పుడు మనం ఆయన చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, మనం ‘యెహోవా చిత్తమేమిటో గ్రహించి’ దానికి విధేయత చూపించగలుగుతాం. (ఎఫె. 5:17) అది అన్ని సందర్భాల్లో సులభమేమి కాదు.
దేవుని అధికారాన్ని బలహీనపర్చేందుకు సాతాను ప్రయత్నిస్తాడు
10 దేవుని అధికారాన్ని బలహీనపర్చేందుకు సాతాను ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నాడు. అతని స్వతంత్ర వైఖరి అనేక విధాలుగా కనిపిస్తుంది. ఉదాహరణకు, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థపట్ల ప్రజలకున్న నిర్లక్ష్యభావాన్నే తీసుకోండి. కొందరు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించేందుకు ఇష్టపడతారు, మరికొందరు తమ భాగస్వామిని వదిలించుకోవడానికి పన్నాగాలు పన్నుతారు. ఆ రెండు కోవలకు చెందినవారు ప్రఖ్యాత నటి వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవిస్తారు, ఆమె ఇలా చెప్పింది: “ఒకే భాగస్వామితో జీవించడం స్త్రీపురుషులిద్దరికీ అసాధ్యం.” అంతేకాక, “తన భాగస్వామికి నమ్మకంగావున్న లేదా నమ్మకంగా ఉండాలనుకుంటున్న వారెవరూ నాకు కనబడలేదు,” అని ఆమె చెప్పింది. విచ్ఛిన్నమైన తన వివాహం గురించి ఒక ప్రఖ్యాత నటుడు కూడా ఇలా చెప్పాడు: “ఒకే వ్యక్తితో మన శేషజీవితాన్ని గడపడం నిజంగా మన నైజమేనా అని నాకు సందేహం కలుగుతోంది.” మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘వివాహం విషయంలో నేను యెహోవా అధికారాన్ని అంగీకరిస్తున్నానా లేదా వివాహబంధం శాశ్వతమైనది కాదనే లోకవైఖరి నా ఆలోచనను ప్రభావితం చేసిందా?’
11 మీరు యెహోవా సంస్థలో ఉన్న యౌవనస్థులా? అలాగైతే, ప్రాముఖ్యంగా మీరు యెహోవా అధికారానికి లోబడడంవల్ల ఎలాంటి ప్రయోజనంలేదని మీరనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు. “యౌవనేచ్ఛలతో”పాటు తోటివారి నుండి ఎదురయ్యే ఒత్తిళ్లు, దేవుని నియమాలు భారమైనవని మీకు అనిపించేలా చేయవచ్చు. (2 తిమో. 2:22) అలా జరగకుండా జాగ్రత్తపడండి. దేవుని ప్రమాణాలు ఎందుకు జ్ఞానయుక్త మైనవో గ్రహించేందుకు కృషిచేయండి. ఉదాహరణకు, “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు మీకు ఉపదేశిస్తోంది. (1 కొరిం. 6:18) ఈ సందర్భంలో కూడా మీరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘ఆ ఆజ్ఞ ఎందుకు జ్ఞానయుక్త మైనది? ఈ విషయంలో విధేయత కనబరచడం ద్వారా నాకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?’ దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్యంచేయడంవల్ల చెడు పర్యావసానాలను ఎదుర్కొన్న కొందరు మీకు తెలిసుండవచ్చు. వారు ఇప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నారా? యెహోవా సంస్థలో ఉన్నప్పుడు వారు గడిపిన జీవితంకన్నా ఇప్పుడు మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారా? మిగతా దేవుని సేవకులకు తెలియని సంతోషానికిగల రహస్యం ఏదైనా వారు నిజంగా కనుగొన్నారా?—యెషయా 65:14 చదవండి.
యోహా. 8:44) నిజమే, యెహోవా అధికారాన్ని అంగీకరించడంవల్ల ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది.
12 కొంతకాలం క్రితం, షారన్ అనే క్రైస్తవురాలు చెప్పిన ఈ మాటలను గమనించండి: “యెహోవా నియమాలను నిర్లక్ష్యం చేయడంవల్ల నాకు ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి సోకింది. యెహోవా సేవలో సంతోషంగా గడిపిన అనేక సంవత్సరాలను నేను తరచూ గుర్తుచేసుకుంటాను.” యెహోవా నియమాలను ఉల్లంఘించడం మూర్ఖత్వమనీ, వాటిని తాను ఎంతో విలువైనవిగా పరిగణించివుంటే బాగుండేదనీ ఆమె గుర్తించింది. యెహోవా నియమాలు మన క్షేమం కోసమే. పై మాటలు రాసిన ఏడు వారాలకే షారన్ మరణించింది. విషాదకరమైన ఆమె అనుభవం చూపిస్తున్నట్లు, ఈ దుష్టలోకంలో భాగమయ్యేవారికి సాతాను ఎలాంటి మేలు చేయడు. ‘అబద్ధమునకు జనకునిగా’ లేక తండ్రిగా అతడు ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. అయితే, అతడు హవ్వతో చేసిన వాగ్దానం ఎలా నెరవేరలేదో అలాగే అతడు చేసే వాగ్దానాలేవీ నెరవేరవు. (స్వతంత్ర వైఖరి విషయంలో జాగ్రత్త వహించండి
13 యెహోవా అధికారాన్ని అంగీకరించడంలో భాగంగా, మనం స్వతంత్ర వైఖరి విషయంలో జాగ్రత్త వహించాలి. మనకు అహంకార స్వభావం ఉన్నట్లయితే, ఇతరుల నిర్దేశం అవసరంలేదని మనకు అనిపించవచ్చు. ఉదాహరణకు, దేవుని ప్రజల్లో నాయకత్వం వహిస్తున్నవారి ఉపదేశాన్ని మనం తిరస్కరించే అవకాశం ఉంది. దేవుడు, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే ఏర్పాటు చేశాడు. (మత్త. 24:45-47) నేడు యెహోవా తన ప్రజలను ఈ విధంగా సంరక్షిస్తున్నాడని మనం వినయపూర్వకంగా గుర్తించాలి. మనం నమ్మకమైన అపొస్తలుల్లా ఉండాలి. కొందరు శిష్యులు అభ్యంతరపడి యేసును అనుసరించడం మానేసినప్పుడు ఆయన తన అపొస్తలులను ఇలా అడిగాడు: “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” దానికి పేతురు, “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు” అని అన్నాడు.—యోహా. 6:66-68.
14 యెహోవా అధికారాన్ని అంగీకరించాలంటే మనం ఆయన వాక్యంలోని ఉపదేశానికి అనుగుణంగా ప్రవర్తించాలి. ఉదాహరణకు, ‘నిద్రపోక మెలకువగా ఉండమని’ నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. (1 థెస్స. 5:6) అనేకమంది ‘స్వార్థప్రియులుగా ధనాపేక్షులుగా’ ఉన్న ఈ అంత్యదినాల్లో అలాంటి ఉపదేశం ఎంతో సముచితమైనది. (2 తిమో. 3:1, 2) ప్రస్తుతం ఎక్కువగా ఉన్న అలాంటి వైఖరులనుబట్టి మనం ప్రభావితం చెందే అవకాశముందా? ఉంది. లౌకిక లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించడంవల్ల మనం ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకోవచ్చు, లేక ఐశ్వర్యాలను సంపాదించుకోవాలన్న దృక్పథాన్ని మనం పెంపొందించుకోవచ్చు. (లూకా 12:16-21) కాబట్టి, బైబిలు ఉపదేశాన్ని అంగీకరించి, సాతాను లోకంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న స్వార్థపూరిత జీవన విధానాన్ని పాటించకుండా ఉండడం ఎంత జ్ఞానయుక్తమో కదా!—1 యోహా. 2:16.
15 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని నియమిత పెద్దలు స్థానిక సంఘాల్లో అందిస్తారు. బైబిలు మనల్ని ఇలా ఉపదేశిస్తోంది: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” (హెబ్రీ. 13:17) సంఘ పెద్దలు తప్పులు చేయరని దానర్థమా? కానేకాదు! మానవులకన్నా మరింత స్పష్టంగా దేవుడు వారి అపరిపూర్ణతలను చూడగలడు. అయినా, మనం వారికి లోబడివుండాలని ఆయన ఆశిస్తున్నాడు. పెద్దలు అపరిపూర్ణులైనప్పుటికీ మనం వారికి సహకరించడం ద్వారా యెహోవా అధికారాన్ని అంగీకరిస్తున్నామని మనం చూపిస్తాం.
వినయానికున్న ప్రాముఖ్యత
16 యేసు సంఘానికి నిజమైన శిరస్సు అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. (కొలొ. 1:18) అందుకే మనం నియమిత పెద్దల నిర్దేశానికి వినయపూర్వకంగా లోబడుతూ, వారిని ‘మిక్కిలి ఘనమైనవారిగా’ పరిగణిస్తాం. (1 థెస్స. 5:12, 13) నిజమే, పెద్దలు సంఘానికి తమ సొంత అభిప్రాయాలను బోధించే బదులు దేవుని సందేశాన్ని బోధించేలా జాగ్రత్త వహించడం ద్వారా తాము కూడా లోబడుతున్నామని చూపించవచ్చు. వారు తమ సొంత అభిప్రాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో “లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపరు.”—1 కొరిం. 4:6.
17 సంఘంలోనివారందరూ తమ సొంత మహిమ కోసం ప్రయత్నించడంవల్ల ఎదురయ్యే ప్రమాదం విషయంలో జాగ్రత్త వహించాలి. (సామె. 25:27) అపొస్తలుడైన యోహాను కలుసుకున్న ఒక శిష్యుడు ఆ ఉరిలోనే చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. యోహాను ఇలా రాశాడు: “వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచు[న్నాడు] . . . అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.” (3 యోహా. 9, 10) నేడు మనం కూడా దానినుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. మనలో అధికార వ్యామోహం మచ్చుకైనా లేకుండా చూసుకోవడానికి మనకు సరైన కారణమే ఉంది. బైబిలు మనకు ఇలా ఉపదేశిస్తోంది: “అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.” దేవుని అధికారాన్ని అంగీకరించేవారు అహంకారమనే ఉరిలో పడకుండా జాగ్రత్త వహించాలి, లేకపోతే వారు అవమానపరచబడతారు.—సామె. 11:2; 16:18.
18 అవును, లోకపు స్వతంత్ర వైఖరిని తిరస్కరిస్తూ యెహోవా అధికారాన్ని అంగీకరించాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. అప్పుడప్పుడు, యెహోవాను సేవించే విషయంలో మీకున్న గొప్ప ఆధిక్యత గురించి కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించండి. మిమ్మల్ని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షించాడనడానికి మీరు దేవుని ప్రజల్లో ఒకరిగా ఉండడమే ఒక రుజువు. (యోహా. 6:44) దేవునితో మీకున్న సంబంధాన్ని ఎన్నడూ తేలిగ్గా తీసుకోకండి. మీరు స్వతంత్ర వైఖరిని తిరస్కరిస్తారనీ, యెహోవా అధికారాన్ని అంగీకరిస్తారనీ మీ జీవితంలోని అన్ని రంగాల్లో చూపించడానికి కృషిచేయండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
• యెహోవా అధికారాన్ని అంగీకరించాలంటే మనం ఏమి చేయాలి?
• మన జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవడానికీ యెహోవా అధికారాన్ని అంగీకరించడానికీ మధ్య ఎలాంటి సంబంధముంది?
• ఏయే రంగాల్లో దేవుని అధికారాన్ని బలహీనపర్చేందుకు సాతాను ప్రయత్నిస్తాడు?
• యెహోవా అధికారాన్ని అంగీకరించడానికి వినయం ఎందుకు ప్రాముఖ్యం?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) అధికారానికి లోబడడానికి నేడు చాలామంది ఎందుకు ఇష్టపడరు? (బి) ఇతరుల అధికారానికి లోబడడానికి ఇష్టపడమని చెప్పుకునేవారు నిజంగా స్వతంత్రులా? వివరించండి.
3. మానవ అధికారుల ఆజ్ఞలకు తాము గుడ్డిగా లోబడలేదని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా చూపించారు?
4. అత్యధికులు ఇష్టపడని దృక్పథాన్ని దేవుని ప్రజల్లో చాలామంది కనబరచారని హెబ్రీ లేఖనాల్లోని ఏ ఉదాహరణలు చూపిస్తాయి?
5. అధికారంపట్ల మన దృక్పథం లోకానికి ఎలా భిన్నంగా ఉంది?
6. యెహోవా ఆజ్ఞలకు లోబడడం ఎల్లప్పుడూ ఎందుకు మంచిది?
7. దేవుని వాక్యంలోవున్న ఒకానొక ఆజ్ఞ మనకు పూర్తిగా అర్థంకాకపోతే మనమేమి చేయాలి?
8. మన ‘జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవడానికీ’ యెహోవా అధికారాన్ని అంగీకరించడానికీ మధ్య ఎలాంటి సంబంధముంది?
9. యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా మన మనస్సాక్షిని ఎలా సరిదిద్దుకోవచ్చు, మనం అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
10. దేవుని అధికారాన్ని బలహీనపర్చేందుకు సాతాను ప్రయత్నిస్తున్న ఒక అంశమేమిటి?
11, 12. (ఎ) యెహోవా అధికారాన్ని అంగీకరించడం యౌవనస్థులకు ఎందుకు కష్టమనిపించవచ్చు? (బి) యెహోవా నియమాలను, సూత్రాలను నిర్లక్ష్యం చేయడం మూర్ఖత్వమని తెలియజేసే అనుభవాన్ని చెప్పండి.
13. మనం స్వతంత్ర వైఖరి విషయంలో జాగ్రత్త వహించాల్సిన ఒక అంశమేమిటి?
14, 15. బైబిలు ఉపదేశానికి మనం వినయపూర్వకంగా ఎందుకు లోబడాలి?
16. క్రైస్తవ సంఘానికి శిరస్సు అయిన యేసుపట్ల మనం ఎలా గౌరవాన్ని చూపించవచ్చు?
17. అధికార వ్యామోహం ఎందుకు ప్రమాదకరమైనది?
18. యెహోవా అధికారాన్ని అంగీకరించడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
[18వ పేజీలోని చిత్రం]
‘మనుష్యులకు కాదు దేవునికే మనం లోబడవలెను’
[20వ పేజీలోని చిత్రం]
దేవుని ప్రమాణాలను అనుసరించడం ఎల్లప్పుడూ జ్ఞానయుక్తం