కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు నరకాగ్ని గురించి మాట్లాడాడా?

యేసు నరకాగ్ని గురించి మాట్లాడాడా?

యేసు నరకాగ్ని గురించి మాట్లాడాడా?

నరకాగ్ని సిద్ధాంతాన్ని నమ్మే కొంతమంది మార్కు 9:48లోవున్న యేసు మాటలను పేర్కొంటారు. ఆ వచనంలో ఆయన చావని పురుగుల గురించి, ఆరని అగ్ని గురించి ప్రస్తావించాడు. ఆ మాటల గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరెలా వివరిస్తారు?

ఒక వ్యక్తి తాను ఉపయోగించే బైబిలు భాషాంతరాన్నిబట్టి 44, 46, 48 వచనాలను చూపించవచ్చు (తెలుగు బైబిల్లోని అధఃస్సూచిని చూడండి), ఎందుకంటే కొన్ని భాషాంతరాల్లో అవి ఒకే విధంగా ఉన్నాయి. * తెలుగు బైబిల్లో ఇలా ఉంది: “నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపారవేయుము; రెండు కన్నులు కలిగి నరకములో [‘గెహెన్నాలో,’ NW] పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున [‘గెహెన్నాలో,’ NW] వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.”​—⁠మార్కు 9:​47, 48.

అయితే, యేసు మాటలు, మరణానంతరం దుష్టులు నిరంతరం బాధించబడతారనే తలంపును సమర్థిస్తున్నాయని కొంతమంది అంటారు. ఉదాహరణకు, నావారా విశ్వవిద్యాలయపు సాగ్రాత్తా బీబ్లియా అనే స్పానిష్‌ బైబిల్లో ఈ వ్యాఖ్యానం ఉంది: “మన ప్రభువు నరకయాతనల గురించి ప్రస్తావించడానికి [ఈ మాటలను] ఉపయోగించాడు. ‘చావని పురుగు’ నరకశిక్షకు విధించబడినవారు అనుభవించే అంతులేని బాధను సూచిస్తుందని, ‘ఆరని అగ్ని’ వారు పొందే శారీరక బాధను సూచిస్తుందని ప్రజలు సాధారణంగా చెబుతుంటారు.”

అయితే, యేసు మాటలను యెషయా ప్రవచనంలోని చివరి వచనంతో పోల్చండి. * ఆయన యెషయా 66వ అధ్యాయంలోని వచనాన్ని ప్రస్తావిస్తున్నాడని స్పష్టమవ్వడం లేదా? ప్రవక్త అక్కడ “యెరూషలేము గోడ వెలుపటవున్న హిన్నోము లోయకు (గెహెన్నాకు)” వెళ్లడం గురించి మాట్లాడుతున్నాడని స్పష్టమౌతోంది. “ఆ లోయలో ఒకప్పుడు మానవులను బలి ఇచ్చేవారు (యిర్మీ. 7:​31), చివరకు అది ఆ పట్టణంలోని చెత్తాచెదారం వేసే స్థలంగా తయారైంది.” (ది జెరోమ్‌ బిబ్లికల్‌ కమెంట్రీ) స్పష్టంగా, యెషయా 66:⁠24లోని సూచనార్థక పోలిక, ప్రజలు యాతన​పెట్టబడడం గురించి తెలియజేయడంలేదు కానీ, అది కళేబరముల గురించి మాట్లాడుతోంది. ఆ వచనం, సజీవంగావున్న మానవులు చావరని చెప్పడం లేదు లేదా అమర్త్యమైన ఆత్మల సిద్ధాంతం గురించి చెప్పడంలేదు కానీ, పురుగులు చావవని చెబుతోంది. మరైతే యేసు మాటల భావమేమిటి?

ఎల్‌ ఇవాన్హెల్యో డి మార్కోస్‌ అనాలీసిస్‌ లింగ్విస్టీకో ఈ కోమెంటారియో ఎక్సెహీటీక్యో, అనే క్యాథలిక్‌ గ్రంథపు రెండవ సంపుటి, మార్కు 9:⁠48పై చేసిన వ్యాఖ్యానాన్ని గమనించండి: “ఆ వాక్యం యెషయా (66, 24) నుండి తీసుకో​బడింది. ప్రవక్త ఆ వచనంలో కళేబరాలు సాధారణంగా నాశనంచేయబడే రెండు విధానాల గురించి చెబుతున్నాడు: కుళ్లిపోవడం, కాల్చివేయబడడం . . . ఆ వచనంలో పురుగులు, అగ్ని ఒకేసారి ప్రస్తావించబడడం, నాశనం ఖచ్చితమన్న విషయాన్ని సూచిస్తుంది. . . . ఆ రెండు నాశన శక్తులు శాశ్వతమైనవిగా వర్ణించబడ్డాయి (‘ఆరదు, చావదు’): వాటిని తప్పించుకొనే అవకాశమే లేదు. ఈ సూచనార్థక వర్ణనలో, నాశనం కాకుండా ఉండేవి పురుగు, అగ్ని మాత్రమే గానీ మానవుడు కాదు. ఈ రెండూ వాటికి దొరికే దేనినైనా కబళించేస్తాయి. అందుకే, ఈ వచనం నిత్యయాతన గురించి చెప్పడంలేదు గానీ నిత్యనాశనం గురించి చెబుతోంది, ఎందుకంటే, వారు మళ్లీ ఎన్నడూ పునరుత్థానం చేయబడరు. అది చివరి మరణంతో సమానం. కాబట్టి, [అగ్ని] సమూల నాశనానికి చిహ్నంగా ఉంది.”

సత్యదేవుడు ఎంత ప్రేమగలవాడో ఎంత న్యాయవంతుడో తెలిసిన వారెవరైనా యేసు మాటలను ఆ విధంగా అర్థంచేసుకోవడం ఎంత సహేతుకమో గుర్తించగలగాలి. దుష్టులు నిత్య యాతన అనుభవిస్తారని ఆయన చెప్పడం లేదు. బదులుగా, వారు పునరుత్థాన నిరీక్షణ లేకుండా నిత్యనాశనాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని ఆయన చెబుతున్నాడు.

[అధస్సూచీలు]

^ పేరా 3 ఎంతో నమ్మదగిన బైబిలు రాతప్రతుల్లో 44, 46 వచనాలు కనిపించవు. ఈ రెండు వచనాలు బహుశా తర్వాత చేర్చబడి ఉండవచ్చని విద్వాంసులు అంగీకరిస్తున్నారు. ప్రొఫెసర్‌ ఆర్కాబోల్డ్‌ టి. రాబర్ట్‌సన్‌ ఇలా రాశాడు: “పురాతనమైన, శ్రేష్ఠమైన రాతప్రతుల్లో ఈ రెండు వచనాలు కనిపించవు. అవి వెస్ట్రన్‌, సిరియన్‌ (బైజాంటైన్‌) వర్గానికి చెందిన రాతప్రతుల్లో చేర్చబడ్డాయి. ఆ రాతప్రతుల్లో 48వ వచనంలోని మాటలే 44, 46 వచనాల్లో కనిపిస్తాయి. కాబట్టి, మేము ప్రామాణికంకాని ఆ వచనాల్లోని మాటలను [తొలగించాం.]”

^ పేరా 5 “వారు పోయి నామీద తిరుగుబాటుచేసినవారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.”​—⁠యెష. 66:⁠24.